ఇన్సూరెన్స్ సొమ్ము కోసం కట్టుకున్న భార్యను కడతేర్చాడు
posted on Dec 1, 2022 @ 11:37AM
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నారు కారల్ మార్క్స్. అయితే ఆయన అన్నది ఒక అర్ధంలో అయితే అనుబంధాలకే అర్ధం మారిపోయిన ఈ కలికాలంలో ఆర్థిక ప్రయోజనాల కోసమే మానవ సంబంధాలు ఏర్పరుచుకుంటున్నారా అన్నట్లుగా ఉంటోది కొందరి తీరు. రాజస్థాన్ లో కట్టకున్న భార్యను అత్యంత కిరాతకంగా కారుతో తొక్కించి హత్య చేశాడో మృగాడు. కారణమేమిటో తెలుస్తే ఇంత దారుణమా అనక మానరు ఎవరైనా.
రాజస్థాన్ లో మహేష్ చంద్ అనే వ్యక్తి తన భార్య షాలును కారుతో తొక్కించి దారుణంగా హతమార్చాడు. కేవలం భార్యపేరున ఉన్న రూ. కోటి 90 లక్షల బీమా సోమ్ము కోసమే అతడీ దారుణానికి పాల్పడ్డాడు. అక్టోబర్ 5వ తేదీన ఈ హత్య జరిగింది. తన కజిన్ తో కలిసి ఆలయానికి బైక్ పై వెళుతున్న షాలూను ఓ స్పోర్ట్స్ వెహికిల్ అతి వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో షాలూ అక్కడికకడే మరణించింది. ఆమె కజిన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. తొలుత అంతా ఇది యాక్సిడెంటే అనుకున్నారు. అయితే షాలూ తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో దర్యాప్తు చేసిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. భార్య పేరు మీద ఉన్న బీమా సొమ్ముల కోసం భర్తే ఈ యాక్సిడెంట్ చేశాడని తేలింది. భార్యను హత్య చేయడానికి మహేష్ చంద్ రౌడీ షీటర్ తో రూ.10లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. 2015లో మహేశ్-షాలు ల వివాహమవ్వగా.. ఒక కుమార్తె ఉంది. రెండేళ్లకు ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడటంతో షాలు తన పుట్టింట్లోనే ఉంటోంది. 2019లో భర్తపై గృహహింస కేసు కూడా పెట్టింది. ఇటీవల షాలు పేరుపై ఇన్సూరెన్స్ చేయించిన చందు.. తానో కోరిక కోరుకున్నానని, అది నెరవేరాలంటే 11 రోజులపాటు ప్రతి రోజూ బైక్‌పై హనుమంతుడి గుడికి వెళ్లాలని భార్యకు చెప్పాడు.
తన కోరిక నెరవేరిన వెంటనే ఇంటికి తీసుకొస్తానని భార్యకు చెప్పాడు. భర్త మాటలు నమ్మిన ఆమె ప్రతి రోజూ బైక్‌పై ఆంజనేయుడి గుడికి వెళ్లి రావడం మొదలుపెట్టింది. భర్తపై గుడ్డి నమ్మకమే ఆమె ప్రాణాలు హరించింది. ఈ కేసులో రౌడీ షీటర్ రాథోడ్ తో పాటు, ఎస్ యూవీ యజమాని, సోనులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మహేశ్, మరోకరి కోసం గాలిస్తున్నారు.