సిట్ డీలా.. ఈడీ దూకుడు
posted on Dec 1, 2022 @ 12:17PM
తెలంగాణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరం కంటే కూడా కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల మథ్య యుద్ధం జోరుగా సాగుతోంది. మద్యం కుంభకోణం, అవినీతి ఆరోపణలపై సీబీఐ, ఐటీ, ఈడీలు రాష్ట్రంలో దూకుడు పెంచితే.. వాటికి బ్రేక్ వేయడానికా అన్నట్లుగా ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ను ఏర్పాటు చేసింది. ఈడీ, సీబీఐని మించి ఆరంభంలో సిట్ దూకుడుగా ముందుకు సాగింది.
రాష్ట్రం దాటి వెళ్లి మళ్లీ కొనుగోలు బేరసారాల గుట్టుమట్టు ఛేదించేస్తున్నామన్నంత బిల్డప్ ఇచ్చింది. బీజేపీలో కీలక నేత బీఎల్ సంతోష్ కు నోటీసులు జారీ చేసింది. ఏదో బ్రహ్మాండం బద్దలైపోతోందా అన్న వాతావరణాన్ని క్రియేట్ చేసింది. సిట్ దూకుడు ముందు ఈడీ, సీబీఐల దూకుడు తేలిపోయిందా అన్న అభిప్రాయం ఏర్పడేలా చేసింది. అయితే రోజులు గడిచే కొద్దీ సిట్ ది ఆరంభ ఆర్భాటమేనని తేలిపోతే.. ఈడీ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఇప్పటి వరకూ ఎన్ని ఆరోపణలు వచ్చినా సీఎం కేసీఆర్ కుమార్తె జోలికి రాని ఈడీ తాజాగా అరోరా రిమాండ్ రిపోర్టులో వంద కోట్ల ముడుపులకు సంబంధించిన వ్యవహారంలో కవిత ప్రమేయం ఉందని పేర్కొంది.
అదే సమయంలో సిట్ ఎన్ని నోటీసులు జారీ చేసినా, లుక్ ఔట్ నోటీసులంటూ హడావుడి చేసినా తెలంగాణ బయట వ్యక్తులను ఒక్కరిని కూడా విచారణకు రప్పించలేకపోయింది. లుకౌట్ నోటీసులతోనూ సిట్ ఏమీ సాధించలేకపోయింది. అయితే సిట్ హడావుడిపై నిందితులుగా చెప్పబడుతున్న వారే కాదు.. సామాన్య జనం కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఇలాంటి ఆరోపణలతోనే గతంలో రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సంగతిని ప్రస్తావిస్తూ.. అప్పట్లో పెద్ద మొత్తంలో సొమ్ము లభ్యమైందనీ, ఇక్కడ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలంటూ చేబుతున్నా ఎక్కడా డబ్బు దొరకకపోవడమే ఈ స్టింగ్ ఆపరేషన్ అంటే కేసీఆర్ అండ్ కో చెబుతున్న కహానీలో చాలా లొసుగులున్నాయని పరిశీలకులు అంటున్నారు.
దీంతో కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థల మధ్య పోటీలో సిట్ వెనుకబడిపోయిందన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది. సిట్ ఇంత వరకూ తెలంగాణ బయట వ్యక్తుల్ని ఒక్కర్ని కూడా రప్పించి ప్రశ్నించలేకపోయింది. ఇద్దరిపై లుకౌట్ నోటీసులు జారీచేసినా… ప్రయోజనం లేకపోయింది. అరెస్టులు చేస్తామని హడావుడి చేస్తోంది కానీ.. వారు కోర్టులకు వెళ్లి సిట్ తీరుపై అనుమానాలు, సందేహాలు లేవనెత్తుతున్నారు. దీంతో సిట్ ముందరి కాళ్లకు బంధాలు పడుతున్నాయి. బీఎల్ సంతోష్‌కు ఇచ్చిన నోటీసులపై ఇప్పటికే స్టే ఉంది. తుషార్‌నూ అరెస్ట్ చేయవద్ది హైకోర్టు చెప్పింది. సీబీఐకి ఇవ్వాలని ఆయన వేసిన పిటిషన్ విచారణలో ఉంది.
మరో వైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ప్రణాళికాబద్దంగా మందుకెళ్తోంది. అమిత్ అరోరా ను అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించారు. ఫోన్లు మార్చిన వైనం… ఇతర వ్యవహారాలు చేర్చారు. ఆర్థిక లావాదేవీల అంశాన్నీ ప్రస్తావించారు. శరత్ రెడ్డి, కవిత, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిలే ప్రధానం అని చెబుతున్నారు. ఇప్పుడ వారికి అరెస్ట్ ముప్పు పొంచి ఉంది. ఇక సిట్ దర్యాప్తు చేస్తున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. ఇతర రాష్ట్రాలతో ముడిపడి ఉంది కాబట్టి తెలంగాణ పోలీసులకు అధికారం సరిపోదన్న కారణంతో… హైకోర్టు సీబీఐకి ఇస్తే.. మొదటికే మోసం తప్పదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.