పిల్లల స్కూలు బ్యాగుల్లో కండోమ్ లు, గర్భ నిరోధక మాత్రలు
posted on Dec 1, 2022 @ 10:37PM
సమాజం ఎటుపోతోంది. పిల్లల్లో పెడపోకడలు పెచ్చరిల్లుతున్నాయి. సాధారణంగా స్కూలుకు వెళ్లే పిల్లల బ్యాగులలో ఏం ఉంటాయి. పెన్నులు, పెన్సిళ్లు, చిరు తిండ్లు, ఇంకా చెప్పుకోవాలంటే పుస్తకాల పేజీల మధ్యలో నెమలీకలు. కర్నాటక రాజధాని బెంగళూరులో పిల్లల స్కూలు బ్యాగుల్లో గర్భ నిరోధక మాత్రలు, సిగరెట్లు దొరికాయి. అంతేనా వారి వాటర్ బాటిళ్లలో మద్యం ఉన్నట్లు కూడా గుర్తించారు.
ఇటీవల పాఠశాల విద్యార్థులు స్కూళ్లకు స్మార్ట్ ఫోన్ లు తీసుకువస్తున్నారన్న సమాచారంతో కర్నాటక ప్రైమరీ, సెకండరీ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (కేఏఎంఎస్) పిల్లల బ్యాగులను తనిఖీ చేయాలని ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు పాఠశాలల్లో విద్యార్థుల బ్యాగులు తనిఖీ చేసిన టీచర్ల షాక్ అయ్యారు. 8,9,10 తరగతులు చదివే పిల్లల బ్యాగుల్లో కండోమ్ లు, సిగరెట్లు, గర్భనిరోధక మాత్రలు, లైటర్లు, వైట్ నర్లు, అధిక మొత్తంలో నగదు కనిపించాయి.
కొందరు విద్యార్థుల వాటర్ బాటిళ్లలో మద్యం ఉన్నట్లు గుర్తించారు. ఒక విద్యార్థి బ్యాగ్ లో నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రలు (ఐ-పిల్) లభించాయి. దాంతో స్కూల్ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి, కౌన్సెలింగ్ ఇచ్చాయి. పిల్లల భవిష్యత్ కోసం సంపాదనలో పడి ప్రస్తుతం వాళ్లు ఏం చూస్తున్నారు,
ఏం చేస్తున్నారు పట్టించుకోకపోవడం వల్లే పిల్లలు పెడపోకడలకు పాల్పడుతున్నారని నిపుణులు అంటున్నారు. కాగా పిల్లల బ్యాగుల్లో కండోమ్ లు, గర్భ నిరోధక మాత్రలు ఉండటం కర్నాటకతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తమ పిల్లల బ్యాగుల్లో కండోమ్ లు దొరికాయని తెలిసి తల్లిదండ్రులు సైతం నివ్వెరపోయారు. ఇవేవీ తమకు తెలీదన్నారు.