టెస్టు మ్యాచే..టి20 కాదు.. పాక్ తో తొలి టెస్టులో ఇంగ్లాండ్ పరుగుల సునామీ
posted on Dec 1, 2022 @ 9:42PM
ఇంగ్లాండ్ వీర బాదుడు.. టెస్ట్ మ్యాచ్ లో టి20ని మించిన దూకుడుతో చెలరేగిపోయింది. ఇంగ్లాండ్ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒక టెస్టు మ్యాచ్ లో ఒకే రోజులో 506 పరుగులు చేసింది. అసలు జరుగుతున్నది టెస్ట్ మ్యాచా టి20 మ్యాచ్చా అన్న అనుమానం కలిగేలా ఆడింది. ఇంగ్లాండ్ పాకిస్థాన్ మధ్య టెస్ట్ సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ గురువారం ప్రారంభమైంది. అదీ పాకిస్థాన్ గడ్డపై. ఇంగ్లాండ్ పాకిస్థాన్ లో సిరిస్ ఆడి 17 ఏళ్లయ్యింది.
అంటే 17 ఏళ్ల విరామం తరువాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లాండ్ జట్లు తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లోనే సిరీస్ ఎలా ఉండబోతోందో రుచి చూపించేసింది. అసలు ఇటీవలి కాలంలో అంటే బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ జట్టు పగ్గాలు చేపట్టిన తరువాత ఆ జట్టు బ్యాటింగ్ దూకుడుకు అడ్డే లేదన్నట్లుగా చెలరేగిపోతోంది. టీ20ల్లోనే కాదు టెస్టుల్లో కూడా ఆ జట్టు బ్యాటర్లు బాదుడే మంత్రంగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఫార్మాట్ ఏదైనా సిక్సర్లు, ఫోర్లు బాదేస్తూ ప్రేక్షకులకు కావాల్సిన మజాను అందిస్తున్నారు.
ఇక రావల్పిండి వేదికగా గురువారం ప్రారంభమైన తొలి టెస్ట్ లో టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్ల నష్టానికి 506 పరుగులు చేసింది. ఓపెనర్లు బెన్ డకెట్(107; 110 బంతుల్లో 15 ఫోర్లు), జాక్ క్రాలే (122 ; 111బంతుల్లో 21 ఫోర్లు), వన్‌డౌన్ బ్యాటర్ ఓలీపోప్(108; 104 బంతుల్లో 14 ఫోర్లు), హ్యారీ బ్యూక్(101 నాటౌట్; 81 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకాలతో చెలరేగారు,
వీళ్ల వీర బాదుడుతో జరుగుతున్నది టెస్ట్ మ్యాచా లేక టి20 మ్యాచా అన్న అనుమానం కలిగింది. ఇంగ్లాండ్ బ్యాటర్ల ధాటికి పాక్ బౌలర్లు, ఫీల్డర్లు కూడా ప్రేక్షకుల్లా మారిపోయారు. ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యారు. సౌద్ షకీల్ వేసిన 68 ఓవర్‌లో హ్యారీ బ్రూక్ 6 బంతులను ఫోర్లుగా మలిచాడు. ఆట ఆఖర్లో కెప్టెన్ బెన్‌స్టోక్స్(34; నాటౌట్ 15 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్) విరుచుకుపడ్డాడు. ఇంగ్లీష్ బ్యాటర్లలో ఒక్క జో రూట్(23; 31 బంతుల్లో 3 ఫోర్లు) మినహా అందరూ రాణించారు.