దేశమంతా మిన్నంటిన కాంగ్రెస్ సంబరాలు
posted on May 13, 2023 @ 11:33AM
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ (113) కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ 118 స్థానాల్లో లీడ్ లో ఉండగా... బీజేపీ 75, జేడీఎస్ 24, ఇతరులు 7 సీట్లలో లీడ్ లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో దూసుకుపోతుండటం ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ ను నింపింది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద అప్పుడే సంబరాలు మొదలయ్యాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకుంటూ సంతోషాన్ని పంచుకుంటున్నారు. కర్ణాటక ఫలితాలు కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సూచించడంతో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో సంబరాలు అంబరాన్నంటాయి. గాంధీభవన్ వద్ద పార్టీ సీనియర్ నేతల సమక్షంలో వేడుకలు జరుపుకుంటున్నారు. తెలంగాణాలో వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు ఈ ఫలితాలు నిరాశపర్చాయి. తెలంగాణలో తమకు ప్రధానప్రతి పక్షం రాబోదని జోస్యం చెప్పే బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ విజయంతో రానున్న ఎన్నికల్లో తమ పార్టీపై పడనుందని అనుమానించే పరిస్థితి నెలకొంది. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ విజయంతో దేశమంతా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది.