టీఆర్ఎస్‌కి హైదరాబాద్ ఫీవర్!

 

 

 

విభజనవాదుల పప్పులు తెలంగాణలో మూడు నాలుగు జిల్లాల్లో మాత్రమే ఉడుకుతాయి. మిగతా జిల్లాల్లో తమకు అంత సీన్ లేకపోయినా వి.వాదులు ఏదో ఒక వివాదం సృష్టించి, హడావిడి చేసి ఇక్కడ కూడా విభజనవాదం ఉందని అంటూ వుంటారు. విభజన చాంపియన్లమని చెప్పుకునే టీఆర్ఎస్ నాయకులు చేసేది కూడా ఇదే. పదిమందిని వెంట తీసుకెళ్ళి హడావిడి చేసి, ఉద్రిక్త వాతావరణం సృష్టించి ఆ గొడవని తెలంగాణ ప్రజల అకౌంట్లో వేసేయడమే టీఆర్ఎస్ చేసే ఉద్యమం తీరుతెన్నులు. గోరంత విషయాన్ని కొండంత చేసి చూపడానికి విభజన మీడియా వుండనే వుంది. విభజనవాదులు హైదరాబాద్ సిర్ఫ్ హమారా అని గొంతు చించుకుని అరుస్తూ వుంటారు. కానీ, హైదరాబాద్‌లో విభజన వేడి అంతగా వుండదు. ఆ ఉన్న కాస్త వేడి కూడా టీఆర్ఎస్ లాంటి రాజకీయ పార్టీల సృష్టే.

 

 

ఎన్నికలలో విభజనవాదులకు హైదరాబాద్‌లో ఓట్లు పడవు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో విభజన చాంపియన్ అని చెప్పుకున్న టీఆర్ఎస్‌కి ఒక్క సీటు కూడా దక్కలేదు. ఆ తర్వాత జరిగిన కార్పొరేషన్ ఎన్నికలలో టీఆర్ఎస్ డిపాజిట్లు కూడా దక్కవని భయపడి పోటీయే చేయలేదు. మొన్నీమధ్య జరిగిన పంచాయితీ ఎన్నికలలో హైదరాబాద్ శివార్లలో టీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచింది చాలా తక్కువమంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో హైదరాబాద్‌లో గ్రిప్ పెంచుకోవాలన్న ఉద్దేశంతోనో, మరో ఉద్దేశంతోనే కేసీఆర్, కేటీఆర్ ద్వయం హైదరాబాద్ మెట్రో రైల్ మీద ఆరోపణలు చేశారు.




ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కనిపెట్టేశారు. సీఎంకి ఇందులో ఎన్నికోట్లో దక్కాయని పసిగట్టేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెట్రో రైల్ ప్రాజెక్ట్ మీద విచారణ జరుపుతామని, అవసరమైతే మెట్రో రైలు పిల్లర్లు కూలగొడతామని ప్రకటించారు. భలే తెలివిగా బెదిరిస్తున్నామని, ఇలాంటి వ్యాఖ్యలతో హైదరాబాద్‌లో తమ పట్టు పెరిగే అవకాశం వుందని తండ్రీకొడుకులు  భావిస్తున్నట్టున్నారు. అయితే టీఆర్ఎస్ అధినేతలు చేసిన ఈ వ్యాఖ్యలు టీఆర్ఎస్ శ్రేణుల్లో అయోమయాన్నిసృష్టించాయి. అసలే హైదరాబాద్‌లో అడుగంటిపోయి వున్న పార్టీ బలాన్ని మరింత తగ్గించేలా ఈ వ్యాఖ్యలు వున్నాయని భావిస్తున్నారు.




హైదరాబాద్‌లో ఎవరైనా, ఏ స్థానంలో అయినా గెలవాలంటే సీమాంధ్రులు, తెలంగాణ వారితోపాటు ముస్లింల మద్దతు ఉండితీరాలి. సీమాంధ్రులు, ముస్లింలు ఎలాగూ టీఆర్ఎస్‌కి ఓటు వేయరు. ఉన్న తెలంగాణలో కొద్దిశాతం మంది మాత్రమే టీఆర్ఎస్‌కి ఓటేస్తారు. ఇప్పుడు తండ్రీకొడుకులు చేసిన నియంతృత్వ ధోరణిలో చేసిన కామెంట్లు ఉన్న ఆ కొద్దిమందినీ టీఆర్ఎస్‌కి దూరం చేసే ప్రమాదాన్ని తెచ్చిపెట్టినట్టు భావిస్తున్నారు. కాంగ్రెస్ పొలిటికల్ గేమ్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్ర విభజన ఎన్నికల తర్వాతకి వాయిదా పడితే, హైదరాబాద్‌లో గల్లంతయిపోయే టీఆర్ఎస్ ఏ ముఖం పెట్టుకుని ‘హైదరాబాద్ సిర్ఫ్ హమారా’ నినాదాన్ని ఇస్తుందని కార్యకర్తలు భయపడుతున్నారు. మెట్రో రైలు పిల్లర్లు కూలగొట్టే సంగతేమోగానీ, తెలంగాణలో తమ పార్టీ పునాదులే క్రుంగిపోయే పరిస్థితి వచ్చిందని బాధపడుతున్నారు.