అడ్డంగా నరికి ఆయింట్‌మెంట్ రాయనుంది!
posted on Oct 29, 2013 @ 6:55PM
రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగు జాతిని అడ్డంగా నరికిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తాను చేసిన మానని గాయానికి ఆయింట్‌మెంట్ రాసే ప్రయత్నం చేస్తోంది. తన పేరు చెప్పినా, కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పినా, ప్రధాని మన్మోహన్ పేరు చెప్పినా సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్న తెలుగు ప్రజలు అసహ్యించుకుంటున్నారన్న విషయాన్ని అర్థం చేసుకున్న సోనియాగాంధీ ఇప్పుడు తెలుగు ప్రజల్ని.. ముఖ్యంగా సీమాంధ్ర ప్రజల్ని ప్రసన్నులని చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది.
చల్లని మాటలతో, చర్యలతో సీమాంధ్రలో తన మీద వున్న వ్యతిరేకతని పోగొట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం వరదల కారణంగా విలవిలలాడుతున్న సీమాంధ్ర ప్రాంతంలో ప్రధాని మన్మోహన్ సింగ్‌తో కలసి ఏరియల్ సర్వే చేయాలని సంకల్పించినట్టు తెలుస్తోంది. తద్వారా సీమాంధ్ర ప్రజలకు తనంటే వున్న ఆగ్రహాగ్నిని నాలుగు సానుభూతి కన్నీటి చుక్కలతో చల్లార్చాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
త్వరలో సోనియాగాంధీ, మన్మోహన్ సీమాంధ్రలోని వరద ప్రభావిత ప్రాంతాలలో ఏరియల్ సర్వే చేస్తారట. విమానంలోంచే ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో చూస్తారట. ఆ తర్వాత విశాఖలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీమాంధ్ర వరద బాధితుల కోసం ఒక భారీ ప్యాకేజీని ప్రకటిస్తారట. ఇంతకీ సోనియా, మన్మోహన్ ఎప్పుడు ఏపీకి వస్తారన్నది మాత్రం ఇంకా తెలియడం లేదు. సోనియాగాంధీ మొసలి కన్నీటికి సీమాంధ్రుల ఆగ్రహాగ్ని చల్లారుతుందా? ఆమె రాసే ప్యాకేజీ ఆయింట్‌మెంట్ తెలుగువారి గుండె గాయాన్ని మాన్పగలుగుతుందా?