విభజనుల గుండెల్లో రాయి

      రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్‌లో శాంతి భద్రతల మీద పడే ప్రభావం, మావోయిస్టుల ప్రాబల్యం, హైదరాబాద్ స్థాయి... ఇలాంటి అంశాలన్నింటినీ అధ్యయనంచేయడానికి కేంద్ర ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి విజయ్‌కుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ చకచకా రంగంలోకి దిగిపోయింది. వారం రోజుల వ్యవధిలోనే కేంద్రానికి నివేదిక అందించాల్సి వున్న కారణంగా ఈ టాస్క్‌ఫోర్స్ మెరుపు వేగంగా పనిచేస్తోంది.   ఇప్పటికే మాజీ డీజీపీలతో ఒక సమావేశాన్ని నిర్వహించేసింది. కేంద్రం ఈ టాస్క్‌ఫోర్స్ ఫోర్స్‌ ఏర్పాటు చేయడం విభజన వాదుల గుండెలో రాయిపడేలా చేసింది. తెలంగాణ ప్రక్రియను మరింత ఆలస్యం చేయడానికో, హైదరాబాద్ మీద సీమాంధ్రులకు కూడా శాశ్వత హక్కు కల్పించడానికో ఒక పథకం ప్రకారం కేంద్రం ఈ టాస్క్‌ఫోర్స్‌ని రంగంలో దింపిందన్న ఆందోళనను విభజనవాదులు వ్యక్తం చేస్తున్నారు. టాస్క్‌ఫోర్స్‌లో తెలంగాణ ప్రాంతానికి ప్రాతినిధ్యం లేకపోవడం, మాజీ డీజీపీల సమావేశానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన మాజీ అధికారి, టీఆర్ఎస్ సభ్యుడు పేర్వారం రాములుకు ఆహ్వానం అందకపోవడం విభజన వాదుల్లో అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే టీఆర్ఎస్ ఘాటుగా స్పందించింది.  తమ ప్రాంతానికీ భాగస్వామ్యం కల్పించాలని టీఆర్ఎస్ నాయకులు వినోద్ కుమార్, కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ని కేంద్రం పట్టించుకుంటుందో లేదో చూడాలి. టాస్క్‌ఫోర్స్ నిర్వహించిన తొలిరోజు సమావేశంలో హైదరాబాద్‌లో ఢిల్లీ తరహా పోలీసింగ్ వ్యవస్థ ఉండాలన్న అంశం మీద చర్చ జరగడం దేనికి సంకేతంగా భావించాలో అర్థంకాక విభజన వాదులు తలలు పట్టుకుంటున్నారు. అటూ ఇటూ చేసి ఈ టాస్క్‌ఫోర్స్ హైదరాబాద్‌ని తమకి కాకుండా చేస్తుందేమోనన్న ఆందోళన విభజన వాదుల్లో ఏర్పడింది.

చిరంజీవికి టైం బ్యాడ్!

      మాజీ మెగాస్టార్, కేంద్ర మంత్రి చిరంజీవికి బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్టుంది. ప్రతి విషయంలోనూ ఆయనకి చుక్కెదురే అవుతోంది. ప్రజారాజ్యం పార్టీ పెట్టి సంచలనం సృష్టించాలనుకుంటే ఆ పార్టీ తనకే జలక్ ఇచ్చింది. ఆ పార్టీతో కొంతకాలం వేగిన తర్వాత చక్కగా కాంగ్రెస్‌లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవి హోదాలో ప్రశాంతగా ఉండొచ్చని ఆయన భావించారు. కానీ అదేంటోగానీ, ఆయన కేంద్ర మంత్రి అయిన తర్వాత రాష్ట్రం ప్రశాంతంగా లేదు.. దాంతోపాటు ఆయనా ప్రశాంతంగా లేరు.   కరవమంటే కప్పకి కోపం.. విడవమంటే పాముకి కోపం అన్నట్టుగా హైదరాబాద్‌ని యు.టి. చేయాలన్న నేరానికి తెలంగాణ ప్రజలకి, పదవులకు రాజీనామా చేయని పాపానికి సీమాంధ్ర ప్రజలకి ఆయన దూరమైపోయారు. ఒకప్పుడు రాజాలా, తాను చెప్పిందే వేదంలా వెలిగిన ఆయన పాపం కాంగ్రెస్ అధిష్ఠానం చెప్పినట్టు వినాల్సిన పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు రాష్ట్రం మొత్తానికి సీఎం అయిపోవాలని కలలు కన్న ఆయన ప్రస్తుతం సీమాంధ్ర ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు. ఇందులో కూడా ఆయనకి పోటీ ఎక్కువగా వుంది. కాంగ్రెస్ పార్టీలో సీమాంధ్ర సీఎం రేసులో వున్నవారిలో అందరికంటే వెనుకబడి వున్న వ్యక్తి చిరంజీవే! ఈమధ్య కురిసిన వర్షాలు, వరదల బారిన పడి తీవ్రంగా నష్టపోయిన సీమాంధ్ర వాసులను పరామర్శించడం ద్వారా అక్కడి ప్రజల మనసులలో తాను కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందాలని చిరంజీవి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా  శ్రీకాకుళం జిల్లాలో శుభమా అని పరామర్శలు ప్రారంభించిన చిరంజీవికి  ఆదిలోనే అపశకునం ఎదురైంది. పడవ ఎక్కబోయిన చిరంజీవి నీళ్ళలో జారిపడిపోయారు. చిరంజీవి లాంటి స్టార్ ఇమేజ్ వున్న వ్యక్తికి ఇలాంటి అనుభవాలు చాలా ఇబ్బందికరంగా వుంటాయి. శ్రీకాకుళం జిల్లాలో వరద బాధితులను పరామర్శించడమే తప్ప చిరంజీవికి వరద బాధితులకు అధికారికంగా సాయం ప్రకటించే అవకాశం లేదు. నష్టపరిహారం అందేలా చేస్తాను, చూస్తాను అనే హామీలు మాత్రమే ఇస్తున్నారు. దాంతో వరద బాధితులు చిరంజీవి తమను పరామర్శించడం వల్ల తమకు ఒరిగేదేమీ లేదని అనుకుంటున్నారు. దీనికితోడు చిరంజీవి ఎక్కడకి వెళ్ళినా ఆయనకి సమైక్య సెగ తగులుతోంది. రాజాంలో విద్యార్థులు సమైక్య నినాదాలు చేస్తూ ఆయన మీద కంకర చిప్స్ విసిరారు. దరిద్రంలో అదృష్టమన్నట్టు ఆయనకి దెబ్బలేం తగల్లేదుగానీ, సెక్యూరిటీ సహకారంతో అక్కడి నుంచి బయటపడాల్సి వచ్చింది.  మరోవైపు చిరంజీవి కారణంగా ఆయన కొడుకు రామ్‌చరణ్ కెరీర్ కూడా ప్రభావితం అవుతోంది. ‘ఎవడు’ సినిమా రిలీజ్‌కి రెడీ అయి చాలాకాలమైనా విడుదలకు నోచుకోకుండా ఆగిపోయింది. అటు విభజన వాదులు, ఇటు సమైక్య వాదులు ఆ సినిమా మీద కత్తికట్టి వున్నారు. చిరంజీవి పరిస్థితి ఇలా అయిపోవడం ఆయన అభిమానులకు ఎంతో ఆవేదన కలిగిస్తోంది.

మనుషులు పోయినందుకు కాదు బాధ

  బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కి వరుసగా దెబ్బమీద దెబ్బలు తగులుతున్నాయి. రెండు నెలల క్రితం పవిత్ర పుణ్యక్షేత్రం బొద్ గయలో బాంబులు పేల్చిన ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు, మళ్ళీ మొన్న నరేంద్ర మోడీ పాట్నాలో జరిపిన సభకి ముందుగా బాంబులు పేల్చడం, దానిలో ఆరుగురు చనిపోవడం, అనేకమంది తీవ్రంగా గాయపడటంతో, నితీష్ కుమార్ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో తరచు విఫలం అవుతున్నారని విమర్శలు మొదలయ్యాయి.   ముఖ్యంగా తనకి బద్దశత్రువయిన మోడీ, తన బీహార్ రాష్ట్రం లో సభ పెట్టుకొంటునపుడు, ఉగ్రవాదులు ఏకంగా సభా ప్రాంగణంలోనే ప్రేలుళ్ళకు పాల్పడటంతో శాంతి భద్రతల విషయంలో ఆయన వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది. ఆయన సంస్కరణలు, అభివృద్ధి పట్ల చూపుతున్నంత శ్రద్ద, శాంతి భద్రతల విషయంలో చూపడం లేదని, రాష్ట్ర పోలీసు, నిఘా వ్యవస్థలపై ఆయనకు సరయిన పట్టు లేకపోవడంతో వలననే తరచు ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.   ఇక కొద్ది నెలల క్రితం బీహార్ లో శరన్ అనే ప్రాంతంలో చిన్నారులు స్కూలులో విషాహారం తిని మృతి చెందిన కేసు నేటికీ పరిష్కరింపబడలేదు. ఏదయినా ఇటువంటి సంఘటన జరిగిన వెంటనే, నితీష్ కుమార్ ముందు విచారణకు ఆదేశించడం, ఆ వెంటనే భాదిత కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించడం తప్ప, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మాత్రం ఆయన చూడలేకపోతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   అయితే ప్రతీ రాష్ట్రంలో ఇటువంటి వ్యవహారాలు తరచు జరుగుతూనే ఉన్నపటికీ, ఆయన అటు ఎన్డీయే కూటమితో కటీఫ్ చేసుకొని, ఇటు యూపీయే కూటమిలోని జేరకపోవడంతో ఆయనకి ఎవరి మద్దతు లేకపోగా అందరు ఆయనపై దాడి చేసేందుకు చేజేతులా అవకాశం కల్పించుకొన్నారు.   ఒకవేళ ఆయన పార్టీ జేడీ(యూ) నేటికీ ఎన్డీయే కూటమిలో ఉండి ఉంటే, స్వయంగా బీజేపీయే ఆయనని వెనకేసుకు వచ్చేదేమో. అదేవిధంగా ఎన్డీయే కూటమి నుండి తప్పుకొని చాల కాలం అయినప్పటికీ, ఆయన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలుపకపోగా ఇప్పుడు ఇంకా ఏర్పడని మూడో ఫ్రంటుతో జత కట్టాలని ఆలోచిస్తుండటంతో, సహజంగానే కాంగ్రెస్ కూడా ఆయన వైఫల్యాన్నిఎండగడుతోంది. మోడీ సభకి ఉగ్రవాదుల బెడద ఉంటుందని తాము ముందే హెచ్చరించినా కూడా, నితీష్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని, తత్ఫలితంగా అమాయకులయిన ప్రజల ప్రాణాలు పోయాయని కాంగ్రెస్ దుమ్మెతి పోస్తోంది.   అయితే ప్రజలు చనిపోయారనే బాధకంటే , ఎన్నికల సమయంలో బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటింపబడిన నరేంద్ర మోడీ సభలో ఇటువంటి సంఘటన జరగడం వలన కేంద్ర రాష్ట్రాలు రెండూ ఆయన సభకు తగిన భద్రత కల్పించడంలో వైఫల్యం చెందాయని, ఆయనకు తగిన రక్షణ కల్పించకుండా నిర్లక్ష్యం వహించి ఆయన ప్రాణాలకే ప్రమాదం తెస్తున్నాయని, రేపటి నుండి బీజేపీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, నితీష్ కుమార్ ప్రభుత్వాలపై అస్త్రాలు సందిస్తే దానికి వారిరువురి వద్ద జవాబు ఉండదు.   అది బీజేపీకి సానుభూతి ఓట్లను కురిపించవచ్చని గ్రహించిన కాంగ్రెస్, నితీష్ కుమార్ ప్రభుత్వాలు “మీది తప్పంటే మీదే తప్పని” ఒకరి మీద మరొకరు ఆరోపణలు చేసుకోవడం మొదలుపెట్టారు.

జగన్ విషయంలో కూడా కాంగ్రెస్ నేతలు విభేదమేనా

  సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తమ పార్టీకి జగన్ పార్టీకి మంచి లంకె ఉందని బల్లగుద్ది చెపుతుంటే, తెలంగాణా కాంగ్రెస్ నేతలు మాత్రం తమ మధ్య అటువంటిదేమి లేదని వాదిస్తున్నారు. అయితే తెలంగాణా విషయంలో వారు విభేదించారంటే అర్ధం ఉంది. కానీ ఈవిషయంలో కూడా వారు ఎందుకు విభేదించవలసివస్తోంది? అందరూ కాంగ్రెస్ తానులో ముక్కలే కదా?అని సందేహం కలుగుతుంది.   అయితే రాష్ట్ర విభజన జరిగిపోతున్నపుడు వేరే రాష్ట్రం (ఆంధ్ర ప్రదేశ్) వ్యవహారాల్లో తలదూర్చడం వలన తల బొప్పికట్టడమే కాక తమ టికెట్స్ కూడా ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. అయితే సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ అధిష్టానం తమని మోసం చేసిందని, అక్కడ జగన్, ఇక్కడ కేసీఆర్ మద్దతు కోసం అర్రులు చాస్తోందని చేస్తున్నఆరోపణల వలన, మున్ముందు తమతో కూడా పార్టీ అదే విధంగా వ్యవహరించవచ్చనే భయం లోలోన ఉంది. అయితే పరిస్థితులు ఇంకా అంతవరకు రాలేదు గనుక, పార్టీకి అటువంటి ఆవకాశం ఇవ్వకూడదనే ఆలోచనతోనే తామంతా సోనియాగాంధీ గీసిన గీత దాటకుండా పార్టీ వెంట నడుస్తామని గట్టిగా నొక్కి చెప్పేందుకే సీమాంద్రా నేతల ఆరోపణలను ఖండిస్తున్నారనుకోవచ్చును.   పైగా ప్రస్తుతం వారు మొదలుపెట్టిన జైత్రయాత్ర/ సోనియ,రాహుల్ గాంధీల భజన కార్యక్రమంలో సోనియాగాంధీని తెలంగాణాలో ఇంటింటి ఇలవేల్పని ప్రచారం చేస్తున్నపుడు, ఆమెపై తమ సహచర నేతలే ఈవిధంగా ఆరోపణలు చేస్తుంటే తమ భజనకి అర్ధం లేకుండా పోతుంది. అందుకే వారు గట్టిగా సోనియాగాంధీని, కాంగ్రెస్ పార్టీని వెనకేసుకు వస్తున్నారు. అయితే రేపు ఒకవేళ వాళ్లకి కూడా కాంగ్రెస్ అధిష్టానం హ్యాండ్ ఇచ్చి కేసీఆర్ కే ప్రాధాన్యం ఇచ్చి తెరాసకే ఎక్కువ టికెట్స్ కేటాయిస్తే బహుశః అప్పుడు వారు కూడా సీమాంధ్ర నేతలతో కోరస్ పాడే అవకాశం ఉంది.   కానీ ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే మొన్న జగన్ మోహన్ రెడ్డి సమైక్యసభలో “అమ్మా సోనియమ్మా!” అంటూ హృదయపూర్వకంగా సోనియాగాంధీని అమ్మా అని సంబోధిస్తూనే తిట్టిన తిట్టు తిట్టకుండా తిడితే కిమ్మనని తెలంగాణా కాంగ్రెస్ నేతలు, సాటి కాంగ్రెస్ నేతలు చేస్తున్నఆరోపణలను ఖండించడానికి మాత్రం చాలా పోటీలు పడుతున్నారు. అయినా అన్నలకి తెలిసిన ఇంటి గుట్లు తమ్ముళ్ళకి తెలియకుండా ఉంటుందని ఎవరూ అనుకోలేరు కదా!

సచిన్ చేతిలో కాంగ్రెస్ క్లీన్‌బౌల్డ్

      సచిన్ టెండూల్కర్ చేతిలో కాంగ్రెస్ పార్టీ క్లీన్‌బౌల్డ్ అయింది. క్రికెట్‌లో రికార్డులు సృష్టిస్తూ, వివాద రహితుడిగా, తన పనేదో తాను చేసుకువెళ్ళేవాడిగా పేరున్న సచిన్ టెండూల్కర్‌ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి నామినేట్ చేయడం ద్వారా రాజ్యసభకి ఎంపిక చేసింది. భారతీయ క్రికెట్ రంగానికి సచిన్ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకి రాజ్యసభ సభ్యత్వం వచ్చిందని అందరూ భావించారు. ఎవరూ దీనికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేయలేదు.   అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ ఒక ‘మాస్టర్’ ప్లాన్ వేసింది. రాజ్యసభకు ఎంపిక చేసింది కాబట్టి టెండూల్కర్ కాంగ్రెస్ పార్టీకి రుణపడి వుంటాడని, తాము కోరితే ఎన్నికలలో తమకు ప్రచారం చేస్తాడని కాంగ్రెస్ నాయకత్వం భావించింది. దాంతో మధ్యప్రదేశ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున సచిన్ టెండూల్కర్ ప్రచారం చేయబోతున్నాడంటూ ప్రచారం మొదలుపెట్టేసింది. కాంగ్రెస్ మొదలుపెట్టిన ప్రచారం ఊపందుకుని సచిన్ నిజంగానే కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయబోతున్నాడన్న నమ్మకం అన్ని పార్టీలకీ కలిగింది. ఈ విషయం తన దృష్టికి రావడంతో సచిన్ టెండూల్కర్ వెంటనే స్పందించాడు. తాను కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయబోవడం లేదని, తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కాదని ఫాస్ట్ బాల్ లాంటి స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు. ఆ స్టేట్‌మెంట్ బాల్ ధాటికి కాంగ్రెస్ పార్టీ క్లీన్‌బౌల్డ్ అయింది. తాను వేసిన ప్లాన్ ఇలా తిరగబడిందేంటా అని నాలుక్కరుచుకుంది. ఈ విషయంలో తమ చేతికి మట్టి అంటకుండా నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టింది. అధిష్ఠానం ఆదేశాలు అందుకున్న బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా వెంటనే రంగంలోకి దిగాడు. సచిన్ టెండూల్కర్ చేత ఎన్నికలలో ప్రచారం చేయించాలన్న ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఎంతమాత్రం లేదని, ఈ విషయంలో వినిపించిన వార్తలన్నీ నిరాధారమైనవని ప్రకటించాడు. సచిన్ టెండూల్కర్ గొప్ప క్రికెటర్ అనీ, ఆయన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలన్న ఉద్దేశం తమకి ఎంతమాత్రం లేదని చెప్పాడు. ఈ తెలివితేటలన్నీ సచిన్ చేతిలో క్లీన్‌బౌల్డ్ అవకముందు ప్రదర్శించి వుంటే బాగుండేదని ప్రతిపక్ష పార్టీలవారు అంటున్నారు.

గుడి కట్టి బొట్టుపెట్టేశారు!

      అడ్డగోలుగా, అడ్డదారిలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెప్పుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తహతహలాడారు. కరీంనగర్‌లో ‘కృతజ్ఞత సభ’ పెట్టాలని అన్ని ఏర్పాట్లూ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి, బయటి పార్టీల నుంచి విమర్శలు రావడం, సమయానికి వర్షాలు కురవడంతో వరుణ దేవుడి పేరు చెప్పి కృతజ్ఞత సభ వాయిదా వేశారు.   వరుణ దేవుణ్ణి తలుచుకున్నప్పడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఒక మహత్తరమైన ఐడియా వచ్చినట్టుంది. వెంటనే దాన్ని అమల్లో పెట్టేశారు. కృతజ్ఞత సభ నిర్వహించాలనుకున్న కరీంనగర్లోనే సోనియాకి గుడి కట్టేశారు. సోనియాగాంధీ చిత్రపటానికి బొట్టుపెట్టి, కొబ్బరి కాయలు కొట్టి, పూజలు చేసి, మంగళ హారతి ఇచ్చేశారు. ఆ రకంగా వాళ్ళలో పొంగి పొరలుతున్న కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. సోనియాగాంధీ దేవతకి ఇంత అర్జెంటుగా గుడి ఎలా కట్టారా అని ఆశ్చర్యపోతున్నారా.. తెలంగాణ కాంగ్రెస్ సోనియాకి కట్టింది రియల్ గుడి కాదు. రాత్రికి రాత్రే తయారు చేసిన ఫ్లెక్సీ గుడి. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ అధిష్ఠానం దగ్గర మార్కులు సంపాదించుకోవడానికే ఇలాంటి ‘భక్తి’ ప్రదర్శించారని మెడకాయ మీద తలకాయ వున్న ఎవరికైనా అర్థమయ్యే విషయమే.  సోనియాకి ఫ్లెక్సీ గుడి కట్టి, పూజలు తె.కాం. నాయకులు ఏదో ఘనకార్యం చేశామని అనుకుంటూ వుండవచ్చు. అయితే చాలామంది  కాంగ్రెస్ నాయకులే ఈ చర్యని తప్పుపడుతున్నారు. దీనిని మితిమీరిన వ్యక్తిపూజకు పరాకాష్టగా భావిస్తున్నారు. ఇలాంటి ధోరణులే సోనియాగాంధీని నియంతగా మార్చాయని అంటున్నారు. బతికున్న వ్యక్తులెవరికీ గుడులు కట్టరు.  ఆ విషయం తె.కాం. నాయకులకు తెలియదేమోనని బాధపడుతున్నారు.   బతికే వున్న ఒక మనిషి ఫొటోకి బొట్టు పెట్టి, కొబ్బరికాయలు కొట్టి, పూజలు చేసి, మంగళ హారతి ఇస్తే అర్థమేంటని ప్రశ్నిస్తున్నారు. సోనియాగాంధీ ఫొటోకి సమాధి కట్టడం నేరమయిన పక్షంలో, ఇలా గుడి కట్టి పూజలు చేయడం కూడా  అంతే నేరమని అంటున్నారు.  

జగన్ మదర్ సెంటిమెంట్!

      వైకాపా నాయకులు జగన్మోహనరెడ్డి ఏ దుర్ముహూర్తంలో సమైక్య శంఖారావ సభ ఏర్పాటు చేశాడోగానీ, వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా అన్ని పార్టీల వారి చేతా తిట్లు తింటున్నాడు. ఇటు సమైక్యవాదులు, అటు విభజనవాదులు, అటు కాంగ్రెస్ పార్టీ, అటు తెలుగుదేశం పార్టీ.. మధ్యలో టీఆర్ఎస్. అన్ని వైపుల నుంచీ జగన్ నిర్వహించిన సభ మీద, జగన్ మాట్లాడిన తీరు మీద విమర్శనాస్త్రాలు దూసుకొస్తున్నాయి.   జగన్‌తో లోపాయికారీ ఒప్పందం పెట్టుకున్న కాంగ్రెస్,  టీఆర్‌ఎస్ పార్టీలు కూడా అందరూ జగన్ని తిడుతున్నారు.. మనం కూడా తిట్టకపోతే బాగోదన్నట్టుగా వాళ్ళు కూడా ప్రెస్‌మీట్లు పెట్టి జగన్‌ని తిట్టిపోశారు. సరే బయటి పార్టీల వాళ్ళు తిట్టారంటే సర్దిచెప్పుకోవచ్చు. వైకాపా శ్రేణులు కూడా సభలో జగన్ మాట్లాడిన తీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో బాహాటంగా బయటపడలేక లోపల లోపలే కుమిలిపోతున్నారు. జగన్ ఎవరు మంచి చెప్పినా వినడు.. ఒకవేళ సాహసించి మంచి చెపితే ఆ చెప్పినవాళ్ళనే తరిమేస్తాడన్న వాస్తవం పార్టీలో ఎవరూ నోరెత్తకుండా చేస్తోంది. శంఖారావ సభలో మిగతా విషయాల సంగతి అలా వుంచితే, జగన్ సోనియాగాంధీని ‘అమ్మా’ అంటూ పిలిచిన తీరు మీద సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. సోనియా మీద విమర్శలు చేయదలుచుకున్నప్పుడు ఘాటుగా చేయాలే తప్ప, ‘అమ్మా’ అని ప్రేమగా, అభిమానంగా పిలిచి విమర్శలు చేయడమేంటని అంటున్నారు. జగన్ నోటి వెంట వచ్చిన ‘అమ్మా’ అనే పిలుపులో వినిపించిన మాధుర్యం, కారుణ్యం, సెంటిమెంట్ తమకు చెవుల్లో సీసం పోసిన అనుభూతిని కలిగించిందంటున్నారు. శంఖారావ సభలో సోనియాని విమర్శిస్తూ జగన్ మాట్లాడిన తీరు తల్లిమీద అలిగిన కొడుకు మాట్లాడుతున్నట్టే ఉంది తప్ప, కడుపు మండుతున్న తెలుగు ప్రజల తరఫున మాట్లాడుతున్నట్టు లేదని అంటున్నారు. ప్రసంగాలు చేయడంలో జగన్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటే మంచిదని అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణ ఏర్పాటు అసంభవం!

      తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అసాధ్యం, అసంభవమని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ఎందుకు అసాధ్యమో కూడా వివరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఇంకా ఏడు దశల్ని దాటాల్సివుంది. కానీ ఈ దశలన్నిటినీ దాటేంత సమయం కేంద్రంలో వున్న యు.పి.ఎ. ప్రభుత్వానికి లేదు.   మాంత్రికుడి ప్రాణం ఉండే చిలకని పట్టుకోవాలంటే సప్త సముద్రాలు దాటాలి. దానికి చాలా టైమ్ పడుతుంది. అలాగే భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలను భార్యాభర్తలుగా అభివర్ణిస్తూ ఏడుగులు వేయించారు. ‘ఆంధ్రప్రదేశ్’ రాష్ట్రాన్ని ఏర్పరచారు. ఇప్పుడు ఈ ఏడడుగుల బంధాన్ని తెంచాలంటే కూడా ఏడు కీలకమైన అడుగులు వేయాల్సి వుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఏడు కీలక దశల్ని తప్పనిసరిగా దాటాల్సి వుంటుంది. అవి... 1. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ బిల్లు డ్రాఫ్ట్ తయారు చేయాలి. దీనికోసం పరిపాలనకు సంబంధించిన అన్ని శాఖల నుంచి సమాచారాన్ని తెప్పించుకుని దానిని క్రోడీకరించుకోవాలి. అన్ని అంశాలనూ పరిశీలించిన తర్వాత బిల్ డ్రాఫ్ట్ రూపొందించాలి. దీనికి మొత్తం తక్కువలో తక్కువగా రెండు నెలల సమయం పడుతుంది. 2. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తయారు చేసిన బిల్ డ్రాఫ్టుని ప్రజలు, వివిధ వర్గాల నుంచి ఫీడ్‌బ్యాక్ కోసం ఒక నెల రోజుల పాటు ఆన్‌లైన్‌లో పెట్టాలి. ఆ తర్వాత వచ్చిన ఫీడ్ బ్యాక్‌ని పరిశీలించి డ్రాఫ్టులో మార్పులు, చేర్పులు ఏవైనా అవసరమైతే చేయాలి. ఆ తర్వాత దానిని కేంద్ర కేబినెట్‌కి పంపాలి. 3. కేంద్ర కేబినెట్ బిల్లు డ్రాఫ్ట్ మీద చర్చించాలి. ఆమోదించాలి. తర్వాత దానిని రాష్ట్రపతికి పంపాలి. 4. రాష్ట్రపతి డ్రాఫ్ట్ ని పరిశీలించిన తర్వాత ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర శాసనసభలో శాసనసభ్యుల అభిప్రాయం తెలుసుకోవడం కోసం రాష్ట్ర గవర్నర్‌కి పంపించాలి. 5. రాష్ట్ర శాసనసభలో డ్రాఫ్ట్ మీద చర్చ జరగాలి. శాసనసభ్యులు ఒక తీర్మానం చేసి కేంద్ర కేబినెట్‌కి పంపించాలి. 6. కేంద్ర కేబినెట్ డ్రాఫ్ట్ ని, అసెంబ్లీ తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపించాలి. 7. ఆ తర్వాత పార్లమెంట్‌లో చర్చ జరిగి బిల్లు ఆమోదం పొందాలి. ఈ ఏడు దశలు దాటేసరికి మొత్తం ఆరు నెలల సమయం పడుతుంది. అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు సమయం పడుతుంది. పార్లమెంట్ చివరి సమావేశాలైన శీతాకాల సమావేశాల్లో బిల్లు తప్పనిసరిగా ఆమోదం పొందితీరాలి. శీతాకాల సమావేశాలు డిసెంబర్‌లోనే మొదలవుతాయి. శీతాకాల సమావేశాల నాటికి ఈ ప్రొసీజరంతా పూర్తయ్యే అవకాశం లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే అవకాశం కూడా లేదు.

చిరు ధైర్యం వెనుక మతలబేంటి?

      అప్పుడెప్పుడో కాస్తంత ధైర్యం చేసి హైదరాబాద్‌ని శాశ్వత యు.టి. చేయాలన్న స్టేట్‌మెంట్ ఇచ్చిన కేంద్రమంత్రి చిరంజీవి ఈమధ్య కాలంలో మళ్ళీ అలాంటి ధైర్యాలేవీ చేయకుండా అధిష్ఠానం దృష్టిలో చిరు మంచి బాలుడు అనే ఇమేజ్ సంపాదించునేలా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ వ్యవహారశైలి ఆయన్ని సీమాంధ్ర ప్రాంతానికి మరింత దూరం చేసింది.   తాజాగా చిరు మరోసారి ధైర్యం చేసి సీమాంధ్రులకు అనుకూలంగా స్టేట్‌మెంట్ ఇచ్చారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను రాష్ట్ర విభజనను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నానని, రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి చివరి వరకు పోరాడతానని అన్నారు. తెలంగాణపై తీర్మానం, బిల్లు రెండూ అసెంబ్లీకి తప్పనిసరిగా పంపించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియలో కేంద్రం రాజ్యాంగ విరుద్ధంగా వెళ్తోందన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నానని చెప్పారు. రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలు, భయాలు, ఆందోళనలను పట్టించుకోకుండా కేంద్రం ముందు వెళ్తూ ఉండడాన్ని సహించలేనని చెప్పారు. చిరంజీవి ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్ సగటు సీమాంధ్రుడికి ఆనందం కలిగించవచ్చేమోగానీ, రాజకీయ పరిశీలకులను మాత్రం ఆలోచనలో పడేసింది.     చిరంజీవి ఏమిటీ.. ఇంత దూకుడుగా వ్యవహరించటమేమిటన్న సందేహాలు కలుగుతున్నాయి. సీమాంధ్ర ప్రాంతం ఆందోళనలతో అట్టుడుకుతున్నా చిరంజీవి తన పదవిని పట్టుకుని వేలాడుతున్నారన్న ఆగ్రహం అక్కడి ప్రజల్లో వుంది. తనకు, సీమాంధ్ర ప్రజలకు మధ్య ఏర్పడ్డ ఆ గ్యాప్‌ని పూడ్చుకోవాలన్న ఆలోచనలో ఎప్పటినుంచో చిరంజీవి వున్నారు. మరోవైపు విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రుల దృష్టిలో సీఎం కిరణ్ హీరోగా మారుతున్నారు. తాజాగా రాష్ట్రపతి, ప్రధానికి విభజనను వ్యతిరేకిస్తూ లేఖలు రాయటం ప్రజల్లో ఆయనకున్న ఇమేజ్‌ని మరింత పెంచింది. ఇవన్నీ ఇలా చూస్తూ ఊరుకుంటే భవిష్యత్తులో కిరణ్ సీమాంధ్ర ఛాంపియన్‌గా నిలబడిపోయే అవకాశం ఉందని ఊహించిన చిరంజీవి, కిరణ్‌కి పోటీగా తాను కూడా రంగంలో వున్నానని నిరూపించుకోవడం కోసమే సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా, ధైర్యంగా స్టేట్‌మెంట్ ఇచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు.

సభ ఎలా జరుగుతుందో ఏంటో?

      హైదరాబాద్‌లో శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైసీపీ నిర్వహించ తలపెట్టిన సమైక్య శంఖారావ సభ ఎలా జరుగుతుందో ఏంటోనన్న టెన్షన్ ఆ పార్టీ శ్రేణులను పట్టి పీడిస్తోంది. వరదల కారణంగా సీమాంధ్ర నుంచి వచ్చే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండే అవకాశం వుంది. దాంతోపాటు వైసీపీ నాయకత్వం కూడా అక్కడే వుండి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనండంటూ సీమాంధ్ర కార్యకర్తలకు ఆల్రెడీ పిలుపు ఇచ్చింది. పైపైకి పిలుపు ఇచ్చినా బస్సుల్లో, రైళ్ళలో కార్యకర్తల్ని హైదరాబాద్‌కి భారీగా తరలించే ఏర్పాట్లు చేసింది.   అయితే వైసీపీ సమైక్య శంఖారావ సభ విషయంలో గుర్రుగా వున్న తెలంగాణ వాదులు ఈ సభకు ఆటంకం కలిగించడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు వస్తున్న 50కి పైగా బస్సులను వరంగల్ జిల్లా వర్ధన్నపేట, జనగాం దగ్గర తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలకు, తెలంగాణ వాదులకు మద్య వాగ్వివాదం జరిగింది. అక్కడ బస్సుల్ని ఇంకా తెలంగాణ వాదులు వదల్లేదని తెలుస్తోంది. సభ సమయం మించిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళి ఉపయోగం ఏంటన్న ఆలోచనలో బస్సుల్లోని వారు వున్నారు. తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఇదేవిధంగా వైసీపీ బస్సులను తెలంగాణ ఉద్యమకారులు నిలిపివేసినట్టు  తెలుస్తోంది. ఇక రైళ్లలో బయల్దేరిన కార్యకర్తల పరిస్థితి కూడా ఇంచుమించుగా ఇలాగే వుంది. భారీ వర్షాల కారణంగా దాదాపు అన్ని రైళ్ళూ ఆలస్యంగా నడుస్తున్నాయి. దానివల్ల రైళ్ళలో వచ్చే కార్యకర్తలు సభకు సమయానికి చేరుకోలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒంగోలు నుంచి, చిత్తూరు నుంచి వైసీపీ ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్ళు హైదరాబాద్‌కి చేరుకున్నప్పటికీ, వైజాగ్‌లో ఏర్పాటు చేసిన రైలు భారీ వర్షం కారణంగా చివరి నిమిషంలో రద్దు కావడంతో ఉత్తరాంధ్ర నుంచి రావాల్సిన కార్యకర్తలు ఇక రాలేనట్టేనని అర్థమవుతోంది. ఒంగోలు, చిత్తూరు నుంచి వచ్చిన రైళ్ళలో కార్యకర్తల సంఖ్య చాలా తక్కువగా ఉండటం పార్టీ నాయకత్వానికి నిరాశను కలిగించినట్టు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సమైక్య శంఖారావ సభ ఎలా జరుగుతుందోనన్న టెన్షన్ వైసీపీ నాయకత్వంలో ఏర్పడింది.  

చూసి రమ్మంటే....

  మమ్మీ ఇలాగయితే నేనిక ఎన్నికల ప్రచారానికి వెళ్ళాను అంతే!   మళ్ళీ కొంపదీసి ఏమయినా నాన్సెన్స్ చేసావా ఏమిటి?   ఏమిటి మమ్మీ నువ్వు కూడా ఆ మోడీ అంకుల్లాగ నన్నే అంటావు?   ఏమన్నాడురా?   నేనేమో మా నానమ్మ,నాన్నగారు ఉగ్రవాదుల చేతిలో చనిపోయారు. నన్నుకూడా ఏదో ఒక రోజు అలాగే చంపేస్తారేమో అని జనాలని సెంటిమెంటుతో పడేయాలని ట్రై చేసాను.   ఒరేయ్! ప్రచారానికి వెళ్లిన వాడివి అవేమి మాటలు రా? ఎంచక్కా నీకిష్టమయిన అభివృద్ధి, యువత, రాజకీయ ప్రక్షాళన వంటి మంచి టాపిక్స్ మాట్లాడుకోకుండా, రేపోమాపో సింహాసనం మీద కూర్చోవలసిన వాడివి చచ్చిపోతానని చెపుతావేమిటిరా?అది కూడాఎన్నికల ప్రచార సభలో...అయినా నువ్వు పోతానంటే ఆ మోడీకేమిటట?   అదికాదు మమ్మీ..ఊరికే పోతానంటే ఎవరు నమ్ముతారు చెప్పు? అందుకే మొన్న ముజఫర్ నగర్ మతఘర్షణలలో చాలా మంది పోయారు. అలాగే నేనూ పోవచ్చునని చెప్పిన తరువాత, ఇక్కడ ఒక మంచి పంచ్ డైలాగొకటి పడితే గానీ మన మాటలకి మంచి ఎఫెక్ట్ రాదని, అక్కడి మత ఘర్షణలలో మిగిలిన ముస్లిం కుర్రాళ్ళని పాకిస్తాన్ ఐయస్ఐ వాళ్ళు తమతో చేతులు కలపమని అడిగారని చెప్పాను మమ్మీ.   అదేమిటిరా ఆ సంగతి నీకెవరు చెప్పారు?   నాకా మాత్రం తెలివితేటలు లేవనుకొన్నావా? మన ఇంటలిజన్స్ అంకుల్స్ నాకు చెప్పారని చెప్పాను. అంతే జనాలు బలే నమ్మేసారనుకో.   కొంపముంచావు పో! అయినా నీకు తెలీని విషయాలన్నీ ఎందుకు కెలికేవురా? ఆ మోడీకి తెలిస్తే నీ పని నా పని ఇక అయిపోయినట్లే!   తెలిసిపొయిందమ్మా!   ఈ మోడీ ఒకడు మన ప్రాణాలకి. ఇంతకీ ఏమంటున్నాడు రా?   నేను మత ఘర్షణలు గురించి మాట్లాడేసరికి మోడీ అంకుల్ బాగా భయపడిపోయినట్లే ఉన్నాడు మమ్మీ. అందుకే నా ప్రశ్నలకి జవాబు చెప్పలేక, అతితెలివి ప్రదర్శిస్తూ నన్నేఎదురు ప్రశ్నిస్తున్నాడు.   ఏమని?   అలా అడుగు చెపుతాను! అసలు ఇంటలిజన్స్ వాళ్ళు ఏ అధికారం లేని నాకు ఇటువంటి రహస్య సమాచారం ఎందుకు చెపుతున్నారని అడిగారమ్మా. నేనెవరో తెలియకుండానే ఆయన ఎలా మాట్లాడుతున్నాడో చూడు. పైగా మనదేశంలో పాకిస్తాన్ ఐయస్ఐ వాళ్ళు మన కళ్ళ ముందు తిరుగుతున్నారని మన ఇంటలిజన్స్ వాళ్ళే చెపుతుంటే మరి మన ప్రభుత్వం నిద్ర పోతోందా? పైగా ఏదో మీడియా వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నట్లు నేను ఆ విషయం రిపోర్ట్ చేయడమేమిటి? బుద్ధి లేకపోతేను..అని నన్నుతిట్టాడు మమ్మీ.   ఒరేయ్! నీ మాటలతో నా బీపీ పెరిగిపోతోంది. ఇంకా నువ్వేమి మాట్లాడావు? ఆయనేమని అడిగాడు తొందరగా చెప్పు. వెంటనే దిగ్గీ అంకుల్నో లేక షిండే అంకుల్నో వెళ్లి నీ మాటలని ఖండించమని చెప్పాలి.   అదేమిటి మమ్మీ..నేను మోడీని భలే పడేసానని మెచ్చుకొంటావనుకొంటే నువ్వు కూడా నా మాటలను ఖండించమని చెపుతానంటున్నావు...అలాగయితే నేనిక నిజంగానే ఏ ఎన్నికల ప్రచారానికి వెళ్ళను పో!   పోన్లే..పోన్లే...నేను చెప్పను గానీ, ముందేమీ జరిగిందో త్వరగా చెప్పు. టెన్షన్ తట్టుకోలేపోతున్నాను.   ఏమి లేదు మమ్మీ.. ఇంక నా ప్రశ్నలకు జవాబు చెప్పలేక ఓడిపోయానని నన్నుక్షమాపణలు కోరే బదులు నేను మన ఇంటలిజన్స్ అంకుల్స్ తో రహస్య సమాచారం షేర్ చేసుకొన్నానని ఒప్పుకొంటావా? లేదా? ఒప్పుకొంటే ఆ పాకిస్తాన్ ఐయస్ఐ వాళ్ళుమన దేశంలో తిరుగుతుంటే మన గవర్నమెంటు పట్టించుకోవడం లేదని ఒప్పుకొంటారా లేదా? అలాగయితే ఆ పాకిస్తాన్ ఐయస్ఐ వాళ్ళు ఎవరెవరు కుర్రాళ్ళని కలిసారో వాళ్ళ పేర్లు చెపుతావా లేదా? అంటూ ఒకటే అర్ధం పర్ధం లేని ప్రశ్నలు మమ్మీ. పైగా నేను చెప్పిన మాటలు నిజం కానట్లయితే, ముస్లిం కుర్రాళ్ళందరికీ పాకిస్తాన్ ఐయస్ఐ వాళ్ళతో సంభందాలు అంటగట్టినందుకు బేషరతుగా ముస్లిములందరికీ క్షమాపణలు చెప్పమని పెద్ద గొప్పగా డిమాండ్ ఒకటి..హా తెలివి తేటలు ఆయనకే స్వంతం అనుకొంటున్నారు పాపం..   అయ్యో దేవుడా... చూసి రమ్మంటే కాల్చి వచ్చావేమిట్రా బాబు...బాబోయ్! ఆ బీపీ మాత్రలందుకో..ఆ త్వరగా ..త్వరగా ....ఇదిగో సెక్రెటరీ వెళ్లి ఆ షిండే గారిని, దిగ్విజయ్ ని మన వాళ్ళందరినీ వెంటనే ఉన్నపళంగా రమ్మని చెప్పు. వెళ్ళు పరిగెత్తు.. వెంటనే మనోడి మాటలను ఖండించకపోతే కొంపలు మునిగేట్లు ఉన్నాయి... ఓరి దేవుడా...   ఛ్చీ..నువ్విప్పెడు అంతే మమ్మీ నీతో ఇక మాట్లాడను...కటీఫ్

జగన్ పట్టుదల వల్లే..

      సమైక్యవాదిగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలకు ఏదో ఒక ఆటంకం కలుగుతూనే వుంది. హైదరాబాద్‌లో సమైక్య శంఖారావ సభను పెట్టుకుందామనుకుంటే మొదట పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత కోర్టు పర్మిషన్ ఇచ్చినా సభ డేట్ ఈనెల 26కి మారింది. హైదరాబాద్‌లో సభ జరిపి తమ పార్టీ సత్తా చూపించాలని జగన్ కలలు కంటుంటే, ఆయన కలల మీద వరుణుడు వాన నీళ్లు చల్లాడు.   వర్షాలు, వరదలతో సీమాంధ్ర మొత్తం సమస్యలు ఎదుర్కొంటూ ఉండటంతో సభ నిర్వహణను వాయిదా వేయాలన్న ఆలోచనకి వైకాపా నాయకులు వచ్చారు. అటు సీమాంధ్రతోపాటు తెలంగాణలో ముఖ్యంగా సభ జరిగే హైదరాబాద్‌లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూ ఉండటంతో సభను వాయిదా వేసుకోవడమే కరెక్టన్న  అభిప్రాయానికి వైకాపా నాయకులు వచ్చారు. అటు సీమాంధ్ర నుంచి కూడా జనం వచ్చే పరిస్థితి లేదు. ఇటు తెలంగాణ నుంచి ఎంతమంది సమైక్యవాదులు సభకు వస్తారో చెప్పలేని పరిస్థితి. ఒక పార్టీ గొడుకు కింద జరుగుతున్న సభకి గొడుగులు వేసుకునో, వర్షంలో తడుస్తూనో వచ్చే ఆసక్తి ఎవరికి వుంటుంది? ఇలాంటి పరిస్థితుల్లో సభ జరిగితే జనం లేక సభాప్రాంగణం వెలవెలపోయే అవకాశం, తద్వారా వైకాపా పార్టీకి, సమైక్యవాదానికి అవమానకర పరిస్థతులు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందని భావించారు. అందుకే  ఒక దశలో సభ వాయిదా ఖాయమే అనుకున్నారు. అయితే పార్టీ అధినేత జగన్ మాత్రం సభ జరిగి తీరాలని పట్టుబట్టడంతో 26న హైదరాబాద్‌లో సమైక్య శంఖారావాన్ని నిర్వహించాలనే తీర్మానించారు. అయితే సభలో పాల్గొనేవారి సంఖ్య తక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి, వైకాపా ముందు జాగ్రత్త చర్యగా సీమాంధ్ర జిల్లాల నుంచి తమ కార్యకర్తలను సభకు రావొద్దని ప్రకటించింది. రేపు సభలో జనం పలుచగా వుంటే, ‘‘మేమే జనాన్ని రావొద్దని చెప్పాం’’ అనడానికి వీలుగా ఈ ముందు జాగ్రత్తలు తీసుకుంది.

మీ సభ ఏందిరో.. ఈ నరుకుడేందిరో!

      ఇటు తెలంగాణలో, అటు సీమాంధ్రలో బలం తగ్గిపోయి, రెంటికీ చెడ్డ రేవడిలా జగన్ పరిస్థితి తయారైంది. తెలంగాణని వదిలేసినా, సీమాంధ్రలో అయినా పరువు నిలుపుకోవడానికి జగన్ నానా తంటాలూ పడుతున్నాడు. దాంట్లో భాగంగానే హైదరాబాద్‌లో శనివారం సమైక్య శంఖారావం సభ నిర్వహించబోతున్నాడు.   సీమాంధ్ర వరదల్లో కొట్టుకుపోతున్నా, హైదరాబాద్ తడిసి ముద్దవుతున్నా సభని వాయిదా వేసుకోకుండా తాను అనుకున్న రోజునే జరపాలని డిసైడయ్యాడు. సభ ఫెయిలైతే సీమాంధ్రులకు అవమానంగా వుంటుందన్న ఆలోచన కూడా లేకుండా సభ నిర్వహించబోతున్నాడు.  శనివారం జరగబోతున్న  ఈ సభ చుట్టూ అటు తెలంగాణవాదుల నుంచి ఇటు సమైక్యవాదుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. ఇది చాలదన్నట్టు జగన్ మెప్పు పొందడం కోసం ఆయన పార్టీ కార్యకర్తలు చేస్తున్న కామెంట్లు అభ్యంతరకరంగా వున్నాయి. హైదరాబాద్‌లో వైఎస్సార్సీపీ జరపబోయే సమైక్య శంఖారావం సభకి ఎవరైనా అడ్డువస్తే నరికేస్తామని వైకాపా అధికార ప్రతినిధి రెహమాన్ హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి. ఇలాంటి హెచ్చరికలు ఎవరు చేసినా సమర్థనీయం కాదు. హైదరాబాద్‌లో సమైక్య సభ జరపడం అల్లర్లు సృష్టించడానికే అని విభజన వాదులు విమర్శిస్తున్న నేపథ్యంలో సభ ప్రశాంతంగా జరపడానికి కృషి చేయాలి. అలా కాకుండా నరికేస్తాం.. చంపేస్తాం లాంటి కామెంట్లు చేయడం సమంజసం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైకాపా అధికార ప్రతినిధి చేసిన కామెంట్‌ని జగన్ గానీ, పార్టీలో ఇతర నాయకులు గానీ ఇంతవరకూ ఖండించలేదు. అంటే అధికార ప్రతినిధి చెప్పిన నరుకుడు కార్యక్రమం అధికారికంగానే నిర్వహిస్తారా? వైకాపా వాళ్ళు నరికేస్తూ వెళ్తుంటే నరికేయండి బాబూ అని ఎవరూ తలలు అప్పగించరు. నరుకుతామంటూ జరిపే సభ సమైక్య సభ ఎందుకవుతుంది? రాష్ట్రాన్ని రెండుగా నరికే సభే అవుతుంది.

జగన్‌కీ కట్టేశారు..

      గతంలో నిరసన తెలపడం అంటే నాయకుల దిష్టిబొమ్మలని తగలబెట్టడం వరకూ వుండేది. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల సందర్భంగా అది బతికున్న నాయకులకు కూడా సమాధులు కట్టడం వరకూ వెళ్ళింది. మొన్నామధ్య సమైక్యాంధ్ర ఉద్యమకారులు సోనియాగాంధీ దిష్టిబొమ్మకి సమాధి కట్టారు. అది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి కూడా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. నాయకులకు సమాధి కడితే లేనిపోని గొడవలవుతాయి కాబట్టి ఇక ఈ సమాధుల సంప్రదాయం కొనసాగదనే అభిప్రాయాలు వినిపించాయి. అయితే సీమాంధ్రులు సమాధులు కట్టగా మేం మాత్రం కట్టలేమా అనుకున్నారేమో తెలంగాణ వాదులు కూడా సమాధి కట్టేశారు. అది కూడా వైకాపా నాయకుడు జగన్ ఫొటోకి! హైదరాబాద్‌లో సమైక్య శంఖారావం నిర్వహిస్తున్నందుకు నిరసనగా ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు యూనివర్సిటీ ఆవరణలోనే జగన్ ఫొటోకి సమాధి కట్టారు. ఆ సమాధి మీద వై.ఎస్.రాజశేఖరరెడ్డి చిత్రపటం పెట్టి కర్మకాండలు కూడా చేశారు.

కోటని తవ్వి ఎముకలు పట్టారు!

      ఉత్తరప్రదేశ్‌లోని రాంబకష్ సింగ్ కోటలో గత ఐదు రోజులుగా పురావస్తు శాఖ అధికారుల పరిస్థితి కోటని తవ్వి ఎముకల్ని పట్టినట్టయింది. కోట భూమిలో టన్నులకొద్దీ బంగారం ఉందని శోభన్ సర్కార్ అనే స్వామీజీ చెప్పిన మాటలు నమ్మి తవ్వకాలు మొదలుపెట్టిన పురావస్తు శాఖ అధికారులు శుక్రవారం తవ్వకాల్లో ఒక వంటగది, పొయ్యి, కొన్ని ఎముకలు బయటపడటంతో నోళ్ళు తెరిచారు. స్వామీజీ మాటలు నమ్మి కోటని తవ్విపోస్తున్నారేంటని హేతువాదులు విమర్శిస్తే, స్వామీజీ చెప్పారని కాదు.. అక్కడి భూమిలో నిధులున్నాయని తమ పరిశోధనల్లో బయటపడిందని అధికారులు మొదట్లో చెప్పారు. తాజాగా బుధవారం కొత్త స్టోరీ వినిపించారు. కోటలో తవ్వకాలు జరుపుతోంది నిధుల కోసం కాదట.. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటులో ఉపయోగించిన ఆయుధాల కోసమట. దేశంలోని ఏ  పురావస్తు పరిశోధనశాలలోనూ సిపాయిల తిరుగుబాటు కాలం నాటి ఆయుధాలు లేవట. ఆ లోటుని భర్తీ చేయడానికే ఈ తవ్వకాలు చేపట్టారట. వీళ్ళ తవ్వకాల్లో ఆయుధాలు దొరికితే  వాటిని ప్రదర్శనలో పెడతారట. వీళ్ళ మాటలు వింటుంటే జనం చెవిలో పూలు పెట్టడంలో పురావస్తు శాఖ అధికారులు శోభన్ సర్కార్ స్వామీజీని మించిపోయారని అనిపించడం లేదూ?!  అన్నట్టు ఇంత జరగడానికీ కారణమైన స్వామీజా శోభన్ సర్కార్‌తోపాటు ఆయన శిష్యుడి మీద కేసు నమోదైంది.

థాంక్యూ కేటీఆర్!

      తెరాస నాయకులు కేటీఆర్‌ గారికి సీమాంధ్ర ప్రజల మీద ప్రేమ పొంగి పొర్లుతోంది. అసలే వర్షాలు, వరదలతో ఉక్కిరిబిక్కిరైపోతున్న సీమాంధ్ర ప్రజలు ఘనత వహించిన కేటీఆర్ గారు తమ మీద కురిపిస్తున్న అపారమైన ప్రేమ ధాటికి మరింత ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. సీమాంధ్ర వాళ్ళని దొంగలు, దోపిడీదారులుగా, హైదరాబాద్ నుంచి తరిమికొట్టాల్సిన వాళ్ళుగా భావించే కేటీఆర్, సడన్‌గా సీమాంధ్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద తన సానుభూతిని వ్యక్తం చేశారు.     అదెలాగంటే, వై.ఎస్.జగన్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలనుకుంటున్న సమైక్య సభని తిట్టిపోయడానికి కేటీఆర్ ఓ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. జగన్‌ని నోరారా తిట్టిన అనంతరం ‘‘ఒకవైపు సీమాంధ్ర ప్రజలు వర్షాలతో, వరదలతో బాధలు పడుతుంటే,  ఆ విషయాన్ని పట్టించుకోకుండా హైదరాబాద్‌లో సమైక్య సభ ఎందుకు పెడుతున్నావ్?’’ అని లా పాయింట్ లాగారు. కేటీఆర్ ప్రశ్నని జగన్ పట్టించుకున్నారో లేదో గానీ, కరడుగట్టిన విభజనవాది నోటి వెంట తమ మీద సానుభూతి వాక్యాలు రావడం విని సీమాంధ్ర ప్రజలు పులకరించిపోతున్నారు. ఇది కలా నిజమా అని తమని తాము గిల్లుకుంటున్నారు. సీమాంధ్రుల బాధల్ని తలచుకుని బాధపడిపోతున్న కేటీఆర్‌కి మనసులోనే థ్యాంక్స్ చెబుతున్నారు. ఏపీఎన్జీవోలు సమ్మె చేసినప్పడు కూడా ఉద్యోగుల సమ్మె వల్ల సీమాంధ్ర ప్రజలు బాధలు పడుతున్నారని, అంచేత వెంటనే సమ్మె విరమించుకోవాలని టీఆర్ఎస్ నాయకులు టెన్షన్ పడిపోయారు. సీమాంధ్ర ప్రజల మీద టీఆర్‌ఎస్ నాయకులకు ఎంత ప్రేమ.. ఎంత ప్రేమ!!

మాయల మరాఠీ పాలిటిక్స్!

      మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ రైతుల ఉసురు పోసుకుంటోంది. కీలక సందర్భాల్లో ప్రాజెక్ట్ గేట్లు మూసేస్తూ తెలంగాణ రైతు కంట కన్నీరు వచ్చేలా చేస్తోంది. బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశాధినేత చంద్రబాబునాయుడు గతంలో భారీ ఉద్యమం నడిపారు. మహారాష్ట్ర సరిహద్దులకు వెళ్ళి ప్రాణాలకు తెగించి మరీ ఉద్యమించారు. చంద్రబాబు మీద ఆ కృతజ్ఞత తెలంగాణ రైతుల్లో వుంది.   త్వరలో మళ్ళీ తెలంగాణ రైతులకు బాబ్లీ ప్రాజెక్ట్ ద్వారా కష్టాలు రాబోతున్నాయి. ఈనెల 29న బాబ్లీ గేట్లను తానే స్వయంగా మూసివేస్తానని, తెలంగాణా రైతులు అడ్డుకున్నా ఆగేది లేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్ ప్రకటించారు. ఈ అజిత్ పవార్ ఎవరో కాదు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మరాఠా యోధుడు శరద్ పవార్‌కి స్వయానా సోదరుడి కొడుకు. ఒకపక్క ఎన్.సి.పి. నేత శరద్ పవర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, తెలంగాణ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వుంటారు. మరోపక్క ఆయన సోదరుడి కొడుకు, ఆయన పార్టీకే చెందిన అజిత్ పవార్ తెలంగాణ రైతుల కంట కన్నీరు తెప్పించడానికి సిద్ధమవుతూ ఉంటాడు. ఈ ద్వంద్వ వైఖరిని ఏమని పిలవాలి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటూ శరద్ పవార్ కపటప్రేమ చూపిస్తున్నారని అనుకోవాలా? మాయల మరాఠీ పాలిటిక్స్ ఇలాగే వుంటాయనుకుని ఊరుకోవాలా? ఈసారి బాబ్లీ కష్టాల నుంచి తెలంగాణ రైతులను ఘనత వహించిన విభజనవాదులు ఎలా కాపాడతారో వేచిచూడాలి.  

దరిద్రులం.. క్షమించు మహాత్మా!

      భారత జాతిపిత మహాత్మాగాంధీ బ్రిటీష్ వాళ్ళని ఇండియా నుంచి తరిమేశారు. బ్రిటీషోళ్ళు మహాత్ముడికి చెందిన వస్తువులని వేలంలో పెట్టి వ్యాపారం చేసుకుంటున్నారు. ఆ రకంగా మహాత్ముడి మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారు. భారత ప్రభుత్వం మాత్రం మహాత్ముడి వస్తువులను వేలంపాటల చెర నుంచి తప్పించలేనంత దరిద్రంలో కొట్టుమిట్టాడుతోంది.   గతంలో మహాత్ముడికి సంబంధించిన లేఖలు వేలానికి వచ్చాయి. ఎవరెవరో ఫారినోళ్ళు వాటిని వేలం పాటలో పాడుకుని వాటిని వ్యాపార వస్తువులుగా మార్చేశారు. భారత జాతి సంపదగా చెప్పుకోదగ్గ  ఆ లేఖలను ఇండియాకి తిరిగి తెప్పించడానికి ప్రభుత్వం గట్టిగా కృషి చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు మరోసారి గాంధీజీ ఉపయోగించిన వస్తువులు లండన్‌లో వేలానికి పెట్టారు. నవంబర్ 5న ఈ వేలం జరగనుంది. ఎరవాడ జైలులో వున్న సమయంలో గాంధీజీ నూలు వడకడానికి ఉపయోగించిన చరఖాతోపాటు, గాంధీజీ ఉపయోగించిన మొత్తం 60 వస్తువులు ఈసారి వేలానికి పెట్టారు. గాంధీజీ చరఖా దాదాపు 60 లక్షలకు అమ్ముడయ్యే అవకాశం వుందని వేలం నిర్వాహకులు భావిస్తున్నారు. ఈసారి వేలం వేసే వాటిలో గాంధీజికి సంబంధించిన ముఖ్యమైన నివేదికలు, పుస్తకాలు, ఫొటోలు కూడా ఉంటాయట. ఈసారి కూడా ప్రభుత్వం గాంధీజీకి సంబంధించిన ఈ వస్తువులను అవసరమైనంత డబ్బు ఖర్చుపెట్టి ఇండియాకి తెప్పిస్తుందన్న ఆశ కలగటం లేదు. తరతరాలుగా భారతీయులు అబ్బురంగా చూడాల్సిన గాంధీజీ జ్ఞాపక చిహ్నాలు ఇలా అంగడి వస్తువులుగా మారిపోవడం బాధాకరం. అందుకే... మహాత్ముడి జ్ఞాపకాల స్వాధీనం కోసం డబ్బు ఖర్చు పెట్టలేనంత దరిద్రంలో వున్న భారత ప్రభుత్వం తరఫున మహాత్ముడికి క్షమాపణలు!

దిగ్విజయ్ ఇంటికి గవర్నర్ వెళ్ళొచ్చా?

      రాష్ట్రంలోని పరిస్థితులను కేంద్ర ప్రభుత్వానికి వివరించడానికి ఢిల్లీకి వెళ్ళిన రాష్ట్ర గవర్నర్ నరసింహన్ బుధవారం నాడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, యుపీఎ అధ్యక్షురాలు సోనియాగాంధీతోపాటు పలువురు కేంద్రమంత్రుల్ని, కీలక అధికారులను కలిశారు. రాష్ట్రంలోని పరిస్థితులను పూస గుచ్చినట్టు వివరించారు. అంతవరకూ ఓకే. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్‌సింగ్‌ని ఆయన ఇంటికి వెళ్ళి మరీ నరసింహన్ కలవటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశమైంది.   దిగ్విజయ్‌సింగ్ ఇంటికి వెళ్ళిన సమయంలో గవర్నర్ చేతిలో అధికారిక అంశాలకు చెందిన ఫైల్ కూడా ఉందని తెలుస్తోంది. గవర్నర్ హోదాలో వున్న వ్యక్తి ఒక రాజకీయ నాయకుడిని ఇంటికి వెళ్ళి కలవటం, అది కూడా అధికార పర్యటనలో ఉన్నప్పడు కలవటం ఎంతవరకు సమంజసమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దిగ్విజయ్‌సింగ్‌ని నరసింహన్ కలవటం పలు ఊహాగానాలకు కూడా తావిచ్చేలా వుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో వున్న గవర్నర్ విమర్శలు తలెత్తే విధంగా వ్యవహరించడం కూడా మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలే విభజన సమస్య అత్యంత సున్నితంగా మారిన పరిస్థితుల్లో గవర్నర్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వుంటుంది. ఏ ప్రాంతం వారిలోనూ ఎలాంటి అపోహలు, అనుమానాలు కలగకుండా వ్యవహరించాల్సి వుంటుంది. అన్నీ తెలిసిన వారు కూడా అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తారు. ఇది కూడా అలాంటిదేనేమో!