అఖిలపక్ష సమావేశం ఇప్పుడెందుకు
posted on Oct 30, 2013 @ 9:27PM
హోం మంత్రి షిండే వచ్చేనెల 9న రాష్ట్ర విభజన విషయంలో అనుసరించవలసిన మార్గ దర్శకాల గురించి చర్చించేందుకు మళ్ళీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు ఈ రోజు ప్రకంటించారు. అయితే విభజన ప్రక్రియ దాదాపు పూర్తి చేసి చేతులు దులుపుకొంటున్న ఈ సమయంలో మళ్ళీ ఇప్పుడు అఖిల పక్ష సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చింది? అందరితో చర్చించి, ఆమోదం తీసుకొన్న తరువాతనే విభజన చేస్తున్నందున మరిక ఎవరిని సంప్రదించవలసిన అవసరం లేదని తెగేసి చెప్పిన కాంగ్రెస్ అధిష్టానం హటాత్తుగా చివరి నిమిషంలో అఖిల పక్షం ఎందుకు అంటోంది? అంటే మొట్ట మొదటగా అందరికీ గుర్తుకు వచ్చేది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రధానికి, రాష్ట్రపతికి వ్రాసిన లేఖలే.
రాష్ట్ర విభజన విషయంలో పూర్తిగా రాజ్యాంగబద్దంగా వ్యవహరించాల్సిందిగా కోరుతూ ఆయన వ్రాసిన లేఖను రాష్ట్రపతి వెంటనే హోం శాఖకు పంపి వివరణ కోరడం జరిగింది. అధిజరిగిన మూడు రోజులకే ఈ రోజు సోనియాగాంధీ తన అపాయింట్ మెంటులన్నిటినీ రద్దు చేసుకొని మరీ అత్యవసరంగా కోర్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. వెంటనే హోం మంత్రి షిండే రాష్ట్రపతిని కలిసి మాట్లాడారు.
ఈ నాలుగు వేర్వేరు సంఘటనలనుకలిపి చూస్తే, ముఖ్యమంత్రి లేఖతో స్పందించిన రాష్ట్రపతి హోంమంత్రికి మొట్టికాయలు వేసి ఉండవచ్చును. అదేవిధంగా రాజ్యంగబద్దంగా విభజన జరపడంలో ప్రధానికి, కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు వచ్చిన ఇబ్బందేమిటని ప్రశ్నించి ఉంటే, ఇంతకాలం అడ్డుగోలుగా కధ నడిపించిన తరువాత ఇప్పుడు వెనక్కి తగ్గితే పరువు పోతుంది గనుక మధ్యే మార్గంగా అఖిలపక్షం ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తీసుకొన్నామని ‘మమ’ అనిపించేసి మిగిలిన తంతు పూర్తి చేయాలనే ఆలోచన కావచ్చును.
దీనివల్ల సీమాంధ్ర ప్రజలలో, నేతలలో కాంగ్రెస్ పట్ల మరింత వ్యతిరేఖత పెరుగుతుందే తప్ప తగ్గదు. పైగా దీనివల్ల తెలంగాణా ప్రజలకి కాంగ్రెస్ నిబద్దత పట్ల కొత్త అనుమానాలు పుట్టుకొచ్చే ప్రమాదం కూడా ఉంది. అదే జరిగితే సీమాంధ్రతో పాటు తెలంగాణాలో కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయం.అప్పుడు కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక కూడా ఊడినట్లవుతుంది కాంగ్రెస్ పని.