రిటైర్మెంట్ బాటలో సోనియా?
posted on Oct 30, 2013 @ 3:30PM
2014 ఎన్నికల తర్వాత సోనియాగాంధీ రాజకీయాల నుంచి తప్పుకుని ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. జరుగుతున్న పరిణామాలు ఈ అంచనాకి బలాన్నిస్తున్నాయని అంటున్నారు. రాజీవ్‌గాంధీ మరణం తర్వాత చాలకాలం పాటు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా తెరవెనుకే వుండిపోయిన సోనియా, ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి భారతదేశ రాజకీయ రంగం మీద తనదైన ప్రభావాన్ని వేశారు.
మాతృదేశం ఇటలీ అయినా ఇండియాని తన కంటిచూపుతో శాసించే స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు ఆమె ముందు వున్న ఒకే ఒక బాధ్యత రాహుల్ గాంధీని ఈ దేశానికి ప్రధాన మంత్రిని చేయడం. రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు లేవని విమర్శకులు అంటున్నా. ఆమె తల్లిమనసు అందుకు అంగకరించడం లేదు. రాహుల్‌ని ప్రధాని చేయడం కోసం తన శయశక్తులా కృషి చేస్తున్నారు. 2014 ఎన్నికల తర్వాత రాహుల్ ప్రధాని అయ్యేదీ లేనిదీ క్లారిటీ వస్తుంది. రాహుల్ ఈసారి ప్రధాని అయితే సోనియా లక్ష్యం నెరవేరినట్టే!
2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీని, ప్రధాని పదవిని రాహుల్ చేతిలో పెట్టి సోనియా విశ్రాంతి తీసుకునే అవకాశం వుందని పరిశీలకులు అంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకపోయినా ఆమె రాజకీయాల్లో కొనసాగే అవకాశం లేదంటున్నారు. వయసు పైబడటం, అనారోగ్యం, పిల్లలు చేతికి అందిరావడం... వీటన్నిటి కారణంగా ఆమె రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు.
తాను ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న యు.పి.లోని రాయబరేలి నియోజకవర్గం నుంచి ఈసారి సోనియా పోటీ చేయబోరని భావిస్తున్నారు. అక్కడి నుంచి ప్రియాంక పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. రాజీవ్ నియోజకవర్గం అమేథీ రాహుల్‌కి అప్పగించినట్టే, తన నియోజకవర్గం రాయబరేలిని ప్రియాంకకి సోనియా అప్పగించే అవకాశం వుందంటున్నారు. రాయబరేలి ప్రజలకు ప్రియాంకని చేరువ చేసే పని కూడా మొదలైంది. ఇందులో భాగంగానే రాయబరేలికి సంబంధించిన అన్ని విషయాలలోనూ ప్రియాంక యాక్టివ్‌గా వుంటోంది. నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రియాంక తరచుగా పర్యటిస్తూ అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటోంది. అక్కడి ప్రజలతో మమేకమవుతోంది.