పొలిటికల్ మీడియేటర్ ‘పెద్దాయన’

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఫొటోకి దండపడి చాలాకాలమైంది. కాంగ్రెస్ పార్టీ డెడ్ బాడీ పొరపాటున అయినా లేచి కూర్చుంటుందేమోనన్న డౌట్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొన్నటి ఎన్నికలలో కాంక్రీటుతో సమాధి కట్టేశారు. ఇంతకాలం పెద్ద దిక్కుగా వున్న పార్టీ బాల్చీ తన్నేయడంతో కాంగ్రెస్ నాయకులు గత కొన్ని నెలలుగా శ్మశాన వైరాగ్యంలో, రాజకీయ వైధవ్యంలో వున్నారు. ఇప్పుడు మెల్లమెల్లగా తేరుకుంటూ, ఇప్పుడిక ఏ పార్టీని ఆశ్రయిస్తే బాగుంటుందా అన్న ఆలోచనలో పడ్డారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులలో నూటికి 99 శాతం మంది నాయకులకు తెలుగుదేశం పార్టీలోకి నో ఎంట్రీ. వాళ్ళు అరచి గీపెట్టినా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎంతమాత్రం పట్టించుకోదు. ఇక రాష్ట్రంలో వున్న మరో పార్టీ వైసీపీ. ఈ పార్టీలో చేరడం కంటే సన్యాసం తీసుకుని హిమాలయాలకు వెళ్ళిపోవడం మంచిదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వుంది. రేపో మాపో మునిగిపోయే చిల్లు పడవలాంటి వైసీపీలో చేరి బావుకునేదేమీ లేదన్న కనీస జ్ఞానం అందరిలోనూ వుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకులందరి దృష్టీ భారతీయ జనతాపార్టీ మీద పడింది. ఇది మీడియేటర్ల కాలం... ఏ పని జరగాలన్నా మీడియేటర్‌ని ఆశ్రయిస్తే ఈజీగా పనైపోతుంది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులందరూ బీజేపీలో చేరడానికి ఓ ‘పెద్దాయన’ని మీడియేటర్‌గా ఉపయోగించుకుంటున్నారు.   ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుడిగా రాష్ట్ర, జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పిన ఆ పెద్దాయన కేంద్ర మంత్రి పదవికి ఆశపడి రాష్ట్ర విభజనకు సహకరించారన్న పాపాన్ని మూటగట్టుకున్నారు. జరగాల్సిన విభజన ఘోరం జరిగిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పంచకు చేరారు. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులను బీజేపీలోకి చేర్పించే బృహత్కార్యంలో బిజీగా వున్నారు. తన వద్దకు వచ్చి బీజేపీలో చేరతానని బతిమాలుకున్న వారిని బీజేపీలో చేర్చడమే కాకుండా.. తన దగ్గరకు రానివారి దగ్గరకు కూడా వెళ్ళి బీజేపీలో చేరండని రిక్వెస్ట్ చేసే పనిలో కూడా ఆయన నిమగ్నమై వున్నారు. మొన్నీమధ్య గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రిని ఆయన విజయవంతంగా బీజేపీలో చేర్చారు. అలాగే విశాఖ జిల్లాకి చెందిన మాజీ ఎంపీగారిని కుటుంబ సమేతంగా బీజేపీలో చేర్చారు. మొన్నటి వరకూ జగన్ చేత ‘అన్నా’ అని ప్రేమగా పిలిపించుకుని, ఆ తర్వాత ఆయనకి దూరమైన కాంగ్రెస్ మాజీ ఎంపీ ప్రస్తుతం ఖాళీగా కూర్చున్నారు. ప్రస్తుతం ‘పెద్దాయన’ దృష్టి ఆయన మీద కూడా పడింది. ఆయన ఇంటికి వెళ్ళి మరీ బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. ఇప్పుడు సదరు పెద్దాయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో వున్న పెద్ద, చిన్న నాయకులను, చెత్తా చెదారాన్ని కూడా బీజేపీలోకి తరలించే పనిలో నిమగ్నమై వున్నారు.   సదరు పెద్దాయన బీజేపీలో చేరినప్పటి నుంచి చేయడానికి పెద్దగా పనేం లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ - బీజేపీ బంధం కూడా బలంగా వుండటంతో ఈయన ఏవైనా రాజకీయాలు చేసి ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టే ఛాన్స్ కూడా లేకుండా పోయింది. ఈ పెద్దాయన్ని పార్టీలో చేర్చుకున్నందుకు పార్టీకి ఏం ఒరిగిందన్న ఆలోచన బీజేపీ నాయకత్వానికి రాకముందే తానే ఏదో ఒక హడావిడి చేసి పార్టీ నాయకత్వం నుంచి మంచి మార్కులు పొందాలన్న ఉద్దేశంతోనే ఈ ఆయన ‘పొలిటికల్ మీడియేటర్’ అవతారం ఎత్తారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ ఐదేళ్ళ కాలంలో కాంగ్రెస్ పార్టీలోని నాయకులందర్నీ బీజేపీలోకి చేర్పించేస్తే వచ్చే ఎన్నికల సమాయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీకి ధీటుగా బీజేపీని తయారవుతుందన్న ఆశావాదం ఆయనలో కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులను హోల్‌సేల్‌గా బీజేపీలో చేర్చుకోవడం వల్ల బీజేపీకి మేలు జరిగే సంగతి అటుంచితే, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి వున్న పరువును కూడా బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకులు పాడుచేసే ప్రమాదం లేకపోలేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి పెద్దాయన ఏపీలో బీజేపీని బాగుచేస్తారో, పాడు చేస్తారో వేచి చూడాలి.

ఆంధ్రప్రదేశ్‌కి అతి త్వరలో ప్రత్యేక హోదా

  రాష్ట్ర విభజనలో దారుణంగా అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోలుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం ఎన్నోరకాలుగా సహకరించాల్సి వుంది. విభజన బిల్లులో వున్న అంశాలను సక్రమంగా అమలు చేయడంతోపాటు విభజన బిల్లు ఆమోదం సమయంలో హామీ ఇచ్చిన విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వాల్సి వుంది. ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా, పారిశ్రామికంగా కొంతయినా పుంజుకునే అవకాశం వుంది. అయితే ఈమధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదన్న దుష్ప్రచారం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తే మాకూ ఇవ్వాలన్న వెటకారం డిమాండ్లు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదేమోనన్న భయం రాష్ట్ర ప్రజల్లో కలిగింది. అయితే అవన్నీ అనవసరపు భయాలేనన్న క్లారిటీ వస్తోంది. రెండు వారాల్లోనే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అవకాశం వుందని ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి.   రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం సమయంలో భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో పట్టుబట్టింది. దానికి సంబంధించి లోక్‌సభ సాక్షిగా అప్పటి యుపిఎ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీని పొందింది. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చడానికి బీజేపీ కృతనిశ్చయంతో వున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ అంశం మీద ఆంధ్రప్రదేశ్ అధికారులతో, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావుతో సమావేశం నిర్వహించి రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాలను చర్చించినట్టు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించిన కొన్ని ఫైళ్ళు కేంద్ర ఆర్థిక, పారిశ్రామిక అధికారుల వద్దే వున్నాయని, అవి తిరిగి తన వద్దకు రాగానే ప్రత్యేక హోదా ప్రక్రియను ముమ్మరం చేస్తానని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి వుంటుందని ఆయన స్పష్టంగా చెప్పినట్టు సమాచారం.   మొత్తమ్మీద పదిహేను రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను ప్రకటించే అవకాశం వుందని ఆంధ్రప్రదేశ్ అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ పదిహేను రోజుల్లో ప్రత్యేక హోదాను ప్రకటించడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కి అదనపు ప్రయోజనం కూడా చేకూరే అవకాశం వుందంటున్నారు. ఈనెల 24 నుంచి 28వ తేదీ మధ్యలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జపాన్‌లో పర్యటించనున్నారు. ఆయన జపాన్ పర్యటనకు వెళ్ళే ముందే ఏపీకి ప్రత్యేక హోదాను ప్రకటించడం వల్ల చంద్రబాబు జపాన్ నుంచి భారీ పెట్టుబడులను తెచ్చే అవకాశాలు మరింత మెరుగుపడతాయని భావిస్తున్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు జపాన్ పర్యటనకు ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం వుందని అనుకుంటున్నారు.

కొండ నాలుక్కి మందేస్తే..

  కొండ నాలుక్కి మందేస్తే.. ఉన్న నాలుక కూడా ఊడిందన్నట్లుంది గోవాలో బీజేపీ పరిస్థితి ఇప్పుడు. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పర్రికర్ ను కేంద్రమంత్రి పదవి చేప్పట్టమని ప్రధాని మోడీ కోరడంతో, ఆయన తన పదవికి రాజీనామా చేయబోతున్నారు. ప్రస్తుతం ఆరోగ్యశాఖ మంత్రిగా చేస్తున్నలక్ష్మీకాంత్ పర్శేఖర్ లేదా స్పీకర్ గా వ్యవహరిస్తున్న రాజేంద అర్లేఖర్ లలో ఎవరినో ఒకరిని తన స్థానంలో ముఖ్యమంత్రిగా నియమించాలని పర్రికర్ చేసిన ప్రతిపాదనకు బీజేపీ అధిష్టానం కూడా సానుకూలంగానే స్పందించింది.   కానీ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న డిసౌజా ఆ పదవి తనకే ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు. మొత్తం 21మంది శాసనసభ్యులలో 10మంది తనకే మద్దతు ఇస్తున్నారు కనుక తనకే తప్పనిసరిగా ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని లేకుంటే తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నారు. పదిమందిలో తొమ్మిదిమంది ఆయనకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు కూడా. కనుక ముఖ్యమంత్రి పదవి విషయంలో ప్రతిష్టంభన నెలకొని ఉంది. ఈరోజు సాయంత్రం 4గంటలకి గోవాలో పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఆలోగా ఈ ప్రతిష్టంభన తొలగించేందుకు బీజేపీ అధిష్టానం గట్టిగా కృషి చేస్తోంది. అందుకోసం డిల్లీ నుండి కేంద్ర పరిశీలకుడిగా గోవా వచ్చిన రాజీవ్ రూడీ ప్రస్తుతం అసమ్మతి వర్గంతో చర్చలు జరుపుతున్నారు.   నాలుగు సార్లు శాసనసభ్యుడిగా గెలిచి, రాష్ట్రంలో అత్యధిక జనాభా గల కెతోలిక్ క్రీష్టియన్లను పార్టీ వైపు ఆకర్షించి బీజేపీకి అధికారం దక్కేలా చేసిన తనను కాదని వేరొకరికి ముఖ్యమంత్రి పదవి కట్టబెడితే తాను, తనకు మద్దతు ఇస్తున్న 10మంది శాసనసభ్యులు తిరుగుబాటు చేస్తామని డిసౌజా కుండబ్రద్దలు కొట్టినట్లుగా తెగేసి చెపుతున్నారు. మరి బీజేపీ ఈ ఒత్తిళ్లకు లొంగి ఆయనకే ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి రాష్ట్రంలో పార్టీని బ్రతికించుకొంటుoదా? లేక ఆయనను బ్రతిమాలుకోనో లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకొంటానని బెదిరించి తనకు నచ్చిన వ్యక్తికే ముఖ్యమంత్రి పదవి కట్టబెడుతుందో ఈ సాయంత్రంలోగా తేలిపోతుంది.   గోవాలో అధికారం కోల్పోవడానికి బీజేపీ ఇష్టపడదు కనుక డిసౌజాకే ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి పార్టీని కాపాడుకొనే ప్రయత్నం చేయవచ్చును. లేదా ఆయనకు ఏదో ఒకగట్టి హామీనిచ్చి ప్రస్తుతానికి శాంతింపజేయవచ్చును. పర్రికర్ కి కేంద్రమంత్రి పదవి ఇవ్వాలని భావిస్తే రాష్ట్రంలో బీజేపీ అధికారం కోల్పోయే పరిస్థితి దాపురించడం విడ్డూరంగానే ఉంది.

ప్చ్.. పాపం ఈటెల...

  తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఎంత పవర్ ఫుల్ నాయకుడో అందరికీ తెలిసిందే. ఆయన సీమాంధ్రుల మీద మాటల ఈటెలు విసిరారంటే ఆ ఈటెలు డైరెక్టుగా సీమాంధ్రుల గుండెల్లో దిగబడతాయి. ఆయన మాటల కారణంగానే ఈటెల టీఆర్ఎస్‌లో ముఖ్య నాయకుడిగా ఎదిగారు. తెలంగాణ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పదవిని కూడా చేపట్టారు. ఇంత పవర్‌ఫుల్ వ్యక్తి కాబట్టి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కి చాలా సన్నిహితుడు కాబట్టి తెలంగాణ ప్రభుత్వంలో ఆయన మాట వేదంలా చెల్లుతుందని ఎవరైనా అనుకుంటారు. బట్.. ఈటెలకి ప్రభుత్వంలో అంత సీన్ లేదని, ఆయన మాటకు గడ్డిపోచంత విలువ కూడా లేదని ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను విశ్వసనీయ వర్గాలు బయటకి లీక్ చేశాయి.   ఈటెల రాజేందర్ మంత్రి అయిన తర్వాత ఆయన బంధువులు కొంతమంది ఆయన దగ్గరకి వచ్చి ‘‘రాజేందరన్నా.. రాజేందరన్నా... మేం తెలంగాణలో ఫలానా చోట ఉద్యోగం చేస్తున్నాం. మమ్మల్ని ఆ ఫలానా చోట నుంచి ఈ ఫలానా చోటకి ట్రాన్స్‌ఫర్ చేయించవా... ప్లీజ్’’ అని రిక్వెస్ట్ చేసుకున్నారట. వారి రిక్వెస్టులకి కరిగిపోయిన ఈటెల ‘‘మీరు కోరినట్టే ట్రాన్స్‌ఫర్ చేయిస్తా పొండి’’ అని వాళ్ళకి హామీ ఇచ్చేశారట. సదరు బంధువులు ఇక తాము ట్రాన్స్‌ఫర్ అయిపోయినట్టే అనుకుంటూ సంతోషంగా వెళ్ళిపోయారట. అయితే ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఈటెలకి బుర్ర తిరిగిపోయేలా చేశాయట. మా బంధువులని కాస్త ట్రాన్స్‌ఫర్ చేసిపెట్టరూ అని ప్రభుత్వంలో ఎవరిని అడిగినా పని కాలేదట. సీఎం కేసీఆర్ చెబితేనే ట్రాన్స్‌ఫర్ చేస్తామని అధికారులు నిర్మొహమాటంగా చెప్పడంతో ఈటెల బిత్తరపోయారట. అయినప్పటికీ గుండె రాయి చేసుకుని కేసీఆర్‌కి కూడా ఈ విషయాన్ని విన్నవించుకుంటే, ఆయన చాలాకాలంగా ఏ విషయమూ తేల్చకుండా ఇష్యూని పక్కన పెట్టేశారట. ఈ ట్రాన్స్‌ఫర్లు జరక్కపోతే తన బంధువర్గంలో తన పరువు ఫినాయిల్‌, యాసిడ్‌తో కడిగినట్టుగా పోతుందని ఈటెల ఫీలైపోయారట.   సరే, నామాట ఎలాగూ చెల్లడం లేదు. నా ఫ్రెండ్, తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి చెబితే అయినా పని అవుతుందేమోననని ఈ విషయాన్ని జగదీశ్వర్ రెడ్డి చెవిలో వేశారట. తన సహచర మంత్రి ఈటెల ఆవేదనను విని గుండె చెరువైపోయిన జగదీశ్వర్‌రెడ్డి ఈటెలకి హెల్ప్ చేయాలని డిసైడ్ అయ్యారట. సీఎం కేసీఆర్ మూడ్ బాగున్నప్పుడే నీ బంధువుల ట్రాన్స్‌ఫర్ విషయం సీఎం దగ్గర ప్రస్తావించి పనయ్యేట్టు చూస్తానని జగదీశ్వర్‌రెడ్డి హామీ ఇవ్వడంతో ఈటెల హ్యాపీగా ఫీలయ్యారట. మంత్రి జగదీశ్వర్‌రెడ్డి తన మిత్ర ధర్మం ప్రకారం ఓ సందర్భంలో కేసీఆర్ మూడ్ బాగుందని అనుకుని ఈ ట్రాన్స్‌ఫర్ల వ్యవహారం ఆయన దగ్గర ప్రస్తావించారట. అంతే, కేసీఆర్ ఒక్కసారిగా అగ్గిమీద గుగ్గిలమైపోయి అక్కడే వున్న ఓ అరడజను మంది ఐఏఎస్ ఆఫీసర్ల ముందే జగదీశ్వర్‌రెడ్డిని ‘‘ఈటెల ట్రాన్స్‌ఫర్ల వ్యవహారం గురించి నా దగ్గర ప్రస్తావిస్తున్నావ్.. నువ్వేమైనా తురుంఖాన్‌వా‌? ఈటెల చెప్పడమేంటి.. నువ్వు నాకు చెప్పడమేంటి’’ అని చెడామడా క్లాస్ పీకేశారట. దాంతో జగదీశ్వర్‌రెడ్డి ముఖం చెల్లని చిల్లుకాణీ అంత అయిపోయిందట. మొగుడు తిట్టినందుకు బాధలేదు.. తోడికోడలు నవ్విందనే బాధ అన్నట్టుగా, కేసీఆర్ చెడామడా క్లాస్ పీకినందుకు బాధ లేదుగానీ, ఐఏఎస్ ఆఫీసర్ల ముందే క్లాస్ పీకారని జగదీశ్వర్‌రెడ్డి ఈటెలతో ఆవేదనగా చెప్పుకున్నారట. ఆ తర్వాత ఇద్దరూ తమ పరిస్థితి ఇలా అయిపోయిందేంటా అని జాయింటుగా బాధపడి, ఒకర్నొకరు ఓదార్చుకున్నారట.

టీఆర్ఎస్‌ పాలిట తుమ్మల తుమ్మముల్లు కానున్నారా?

    నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ఆయన ద్వితీయ కళత్రం లక్ష్మీపార్వతి చేతిలో పెట్టేసిన సందర్భంలో రాజకీయంగా పార్టీ కుప్పకూలే పరిస్థితి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీని కాపాడే ఉద్దేశంతో ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేయాల్సి వచ్చింది. ఆనాడు చంద్రబాబు చేసిన తిరుగుబాటు తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ పచ్చగా కళకళలాడుతూవుండటానికి ప్రధాన కారణమైంది.    ఆనాడు ఎన్టీఆర్‌ ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాంటి పరిస్థితిని ఎదుర్కొనబోతున్నారన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఆనాడు లక్ష్మీపార్వతి కారణంగా ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేస్తే, ఈనాడు తుమ్మల నాగేశ్వరరావు కారణంగా కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు తిరుగుబాటు చేసే అవకాశం వుందని అంటున్నారు.   గతంలో తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన ఖమ్మం జిల్లా నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు కేసీఆర్‌కి జిగిరీ దోస్త్. ఎంత దోస్త్ అంటే... ఒకర్నొకరు ఆప్యాయంగా ‘బావా.. బావా’ అని పిలుచుకునేంత దోస్త్. ఆ దోస్తీ కారణంగానే తుమ్మల తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టి టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. తుమ్మల పార్టీ మారడం వెనుక కేసీఆర్ ఇచ్చిన మంత్రి పదవి ఆఫర్ కూడా ప్రధాన కారణమనే అభిప్రాయాలు వున్నాయి. కేసీఆర్ అవసరమైతే తల నరుక్కుంటారు తప్ప తన సొంత మనుషులకు ఇచ్చిన మాట మాత్రం ఎంతమాత్రం తప్పరు. తుమ్మలకు మంత్రి పదవి ఇస్తానని మాట ఇచ్చిన కేసీఆర్ త్వరలో ఆయనకు హోంమంత్రి పదవి ఇవ్వబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్‌కి మొదటి నుంచీ సేవ చేసిన నాయిని నరసింహారెడ్డి ఇప్పుడు హోం మంత్రిగా వున్న విషయం తెలిసిందే. నాయినిన తప్పించి తుమ్మలను ఆ స్థానంలో హోం మంత్రి చేయాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది.   తన అనుంగు మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావుకు హోం మంత్రి పదవిని అప్పగించిన అనంతరం కేసీఆర్ తన ఆరోగ్యాన్ని బాగుచేసుకునే నిమిత్తం ఓ రెండు నెలలపాటు అమెరికా వెళ్ళనున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. కేసీఆర్ అమెరికా నుంచి తిరిగి వచ్చే వరకూ తెలంగాణ ప్రభుత్వ బాధ్యత మొత్తం హోం మంత్రి పదవిలో వుండే తుమ్మలతోపాటు కేసీఆర్ కుమారుడు కేటీఆర్‌కి అప్పగించే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ ఆలోచన ఇలా వుంటే, కేసీఆర్ మేనల్లుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఆలోచన మాత్రం మరోరకంగా వున్నట్టు తెలుస్తోంది. తుమ్మల నాగేశ్వరరావుకు తెలంగాణ హోం మంత్రి బాధ్యతలు అప్పగించిన వెంటనే పార్టీలో తిరుగుబాటు చేయడానికి హరీష్ రావు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. హరీష్ రావు తిరుగుబాటు చేసిన పక్షంలో ఆయనకు 25 నుంచి 30 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మద్దతుగా నిలుస్తారని తెలుస్తోంది. వారికి తోడుగా టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు కూడా తీసుకుని హరీష్ రావు తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.   హరీష్‌రావు ఈ తరహా ప్రయత్నాల్లో ఉన్నారని తెలిసి కూడా సీఎం కేసీఆర్ లైట్‌గా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. హరీష్ రావు కూడా పైకి తాను కేసీఆర్‌కి విధేయుడిగా వుంటానని చెబుతున్నప్పటికీ, తుమ్మలకు హోం మంత్రి పదవి ఇవ్వగానే తన యాక్షన్ ప్లాన్ అమలులో పెడతారని తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్‌ నాయకులలో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా వుంది. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో త్యాగాలు చేసిన నాయకులకు ప్రాధాన్యం ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ నుంచి వలస వచ్చిన వారికి, తన బంధుమిత్రులకే అన్ని విషయాలలోనూ కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారన్న బాధ వారిలో వుంది. దీనితోపాటు తెలంగాణలోని వివిధ వర్గాల వారు కూడా కేసీఆర్‌ని వ్యతిరేకిస్తూ వున్నారు. త్వరలో నాయిని పదవి ఊడిపోబోతోందని తెలిసిన రెడ్డి సామాజిక వర్గం వారు కూడా కొంత ఆగ్రహంగా వున్నారు. ఇలాంటి వ్యతిరేక శక్తులన్నిటికీ చేరువ అవుతున్న హరీష్ రావు ‘కీలక సమయం’లో వీరందరి సహకారం తీసుకోవడానికి వ్యూహ రచన చేసినట్టు సమాచారం.   తెలుగునాట గతంలో రెండు సందర్భాలలో అధికార మార్పిడి ‘కుదుపు’లు సంభవించాయి. ఒక కుదుపుకు కారణం నాదెండ్ల భాస్కరరావు అయితే, మరోసారి లక్ష్మీపార్వతి కారణం అయ్యారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆ కుదుపుకు తుమ్మల నాగేశ్వరరావు కారణం అవుతారనీ, టీఆర్ఎస్ ప్రభుత్వ బుడగ పాలిట తుమ్మల తుమ్మముల్లుగా మారతారనీ అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. ఈ అంశం మీద మరో రెండు మూడు నెలల్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం వుంది.

శివసేనకు రెండు, తెదేపాకు ఒక కేంద్ర మంత్రి పదవి

  ఈ ఆదివారంనాడు ప్రధాని మోడీ తన మంత్రి వర్గంలో మరో 10 నుండి 12మంది కొత్త మంత్రులను చేర్చుకోబోతున్నారు. ప్రస్తుతం ఆయన మంత్రివర్గంలో 22మంది క్యాబినెట్ హోదా గల మంత్రులు 22మంది సహాయమంత్రులతో కలిపి మొత్తం 44మంది ఉన్నారు. మంత్రివర్గ విస్తరణతో ఇప్పుడు ఆ సంఖ్య 54-56కు చేరవచ్చును. ఇటీవల మహారాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో ఎన్డీయే భాగస్వాములుగా బీజేపీ, శివసేనలు తెగతెంపులు చేసుకొని వేర్వేరుగా పోటీ చేసినప్పటికీ, ఎన్నికల తరువాత వారు మళ్ళీ కలిసి పనిచేసేందుకు సిద్దపడటంతో, మంత్రివర్గ విస్తరణలో శివసేనకు కూడా రెండు కేంద్రమంత్రి పదవులు ఇచ్చేందుకు మోడీ అంగీకరించినట్లు సమాచారం. అదే నిజమనుకొంటే, తనతో తెగతెంపులు చేసుకొన్న శివసేనకు రెండు మంత్రి పదవులు, మిత్రపక్షమయిన తెదేపాకు ఒకటే మంత్రి పదవి కేటాయించడం కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. తెదేపా నుండి సుజనాచౌదరికి కేంద్రమంత్రి పదవి ఇవ్వబోతున్నారు. బీజేపీ నుండి బండారు దత్తాత్రేయ, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, మనోహర్ పారిక్కర్ తదితరులు కేంద్రమంత్రి పదవులు దక్కనున్నాయి. పారిక్కర్ కు రక్షణశాఖ కేటాయిస్తునట్లు ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి. దానిని బీజేపీ వర్గాలు ఖండించనందున ఆయనకు రక్షణశాఖ ఖరారయినట్లే భావించవచ్చును.

కాంగ్రెస్, వై.కాంగ్రెస్ రాజధాని భూసేకరణ వ్యతిరేఖ కమిటీలు

  రాజధాని నిర్మాణం కోసం భూసేకరణకు ప్రభుత్వం ఇప్పటికే రెండు, మూడు కమిటీలు వేసింది. విజయవాడలో రాజధాని నిర్మాణాన్ని స్వాగతించిన కాంగ్రెస్, వైకాపాలు ఇప్పుడు ప్రభుత్వం రైతుల నుండి బలవంతంగా భూములు గుంజుకొంటోందని ఆరోపిస్తూ ప్రభుత్వంతో పోరాడేందుకు చెరో కమిటీ ఏర్పాటు చేసుకొన్నాయి. ఇంతవరకు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు మాత్రమే చూసిన ప్రజలకి ఇప్పుడు అధికార కమిటీ, ప్రతిపక్ష కమిటీలను కూడా చూసే భాగ్యం కలుగుతోంది. అధికార కమిటీ రైతులతో మాట్లాడి వారిని ఒప్పించి రాజధాని నిర్మాణం కోసం వారి భూములు తీసుకొనేందుకు కృషి చేస్తుంటే, ప్రతిపక్ష కమిటీలు అధికార పార్టీ ప్రయత్నాలను విఫలం చేయడానికి కృషి చేస్తాయి.   అధికార పార్టీ నేతలు రైతుల నుండి బలవంతంగా భూములు స్వాధీనం చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు కనుకనే తాము రైతుల తరపున నిలబడి ప్రభుత్వంతో పోరాడవలసి వస్తోందని చెప్పుకొంటున్నారు. ప్రభుత్వం తూళ్ళూరు మండలం కేంద్రంగా రాజధాని నిర్మాణం తలబెట్టినట్లు తెలియగానే ఆ మండలంలో ఇంతవరకు మూడు గ్రామ సభలు జరిగినట్లు సమాచారం. అందులో కొన్ని గ్రామాలు తప్ప చాలా గ్రామాలలో రైతులు ప్రభుత్వం తమ డిమాండ్లన్నిటికీ ఒప్పుకొన్నట్లయితే తాము సంతోషంగా తమ భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేస్తామని మీడియా ముఖంగా ప్రభుత్వానికి తెలియజేసారు. వారు మరో సంగతి కూడా చెప్పారు. ఈ వ్యవహారంపై గ్రామాలలో అప్పుడే రాజకీయాలు కూడా మొదలయ్యాయని తెలిపారు. బహుశః అది ప్రతిపక్షాలు చేస్తున్న ఈ ప్రయత్నాలను ఉద్దేశించి అన్నమాటలే అయ్యి ఉండవచ్చును.   ప్రభుత్వం రైతుల దగ్గర నుండి దౌర్జన్యంగా భూములు గుంజుకొనే ప్రయత్నం చేస్తే, దాని వలన తనకే కొత్త సమస్యలు, అప్రతిష్ట తప్పదని ప్రభుత్వానికి కూడా తెలుసు. అందుకే రైతులు భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తే, రాజధానిని వేరొక చోటికి తరలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందే ప్రకటించారు. అటువంటప్పుడు అధికార పార్టీ రైతులపై ఎందుకు దౌర్జన్యం చేస్తుందని ప్రతిపక్ష పార్టీలు కమిటీలు వేసుకొన్నాయంటే, సున్నితమయిన ఈ అంశం నుండి కూడా రాజకీయ మైలేజి పొందాలనే తాపత్రయమే తప్ప మరొకటి కాదని చెప్పవచ్చును. ప్రభుత్వం తమ షరతులు, డిమాండ్లకు అంగీకరిస్తే తాము భూములు అప్పగించేందుకు సిద్దంగా ఉన్నామని అనేక గ్రామాలలో రైతులు స్వయంగా చెపుతున్నప్పుడు, వైకాపా మాత్రం చాలా హడావుడిగా ఒక కమిటీ వేసేసుకోవడం విశేషం.   రైతులు తమ జీవనాధారమయిన భూములను ప్రభుత్వం బలవంతంగా గుంజుకొంటే నిశబ్దంగా ఉంటారని ఎవరూ అనుకోనవసరం లేదు. వారు తమకు అన్యాయం జరిగిందని నిరసన కార్యక్రమాలు మొదలుపెడితే కాంగ్రెస్, వైకాపాలు వెళ్లి వారికి అండగా నిలబడితే అందరూ హర్శిస్తారు. కానీ వారికి లేనిపోనివి చెప్పి భయాందోళనలకు గురిచేసి, ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ఉసిగొల్పాలనుకొంటే దానివలన చివరికి వారే నవ్వుల పాలయ్యే ప్రమాదం ఉంది. అయినా ప్రతీ అంశంపై రాజకీయ మైలేజి పొందాలని ప్రయత్నిస్తే ఏదో ఒకరోజు ప్రజల చేతిలో భంగపడక తప్పదని వారు గ్రహించాలి.వారు గ్రహించాల్సిన ముఖ్యమయిన విషయం మరొకటి కూడా ఉంది. ఈవిధంగా రాజధాని నిర్మాణానికి అడ్డంపడుతుండటం రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తూనే ఉన్నారనే సంగతి గుర్తుంచుకోవడం మంచిది. 

పెట్టుబడుల ఆకర్షణే బాబు ఎజెండా

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. ఆర్థిక శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అలాగే సీఐఐ సభ్యులతో భేటీ కానున్నారు. అనంతరం ప్రధానమంత్రి సహా పలువురు కేంద్రమంత్రులను బాబు కలిసే అవకాశముంది. అయితే ఈ ఢిల్లీ టూర్ మెయిన్ ఎజెండా పెట్టుబడుల ఆకర్షణేనని ప్రచారం జరుగుతోంది. ఏపీకి మరిన్ని పెట్టుబడులను తీసుకొచ్చే దిశగా బాబు ఢిల్లీ టూర్ ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.   ఏపీకి పెట్టుబడుల వెల్లువను తీసుకురావడానికి చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారు.  ఎక్కడ ఏ చిన్న అవకాశాన్ని ఆయన జారవిడుచుకోవడానికి సిద్ధంగా లేరు. ప్రతిచోట నుంచి ఇన్వెస్టర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారాయన.  ఏపీని సాధ్యమైనంత త్వరగా డెవలప్ చేసి తన శక్తి సామర్థ్యాలను చాటిచెప్పడానికి అనుక్షణం తపిస్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా ఆయన బాగా సఫలమయ్యారు కూడా. అయినా ఏ కోశాన ఆయన రిలాక్స్ మూడ్ లో కనిపించడం లేదు.     దేశం గర్వించేలా ఏపీని డెవలప్ చేయాలని కంకణం కట్టుకున్నారు.  బాబు కష్టపడుతున్న తీరుకు ప్రధాని మోడీ కూడా అబ్బురపడుతున్నారట. అందుకే బాబు ఏ సాయం కావాలని కోరినా... ఇవ్వడానికి ఓకే చెప్పేస్తున్నారు. అంతేకాదు ఇలాంటి సీఎం ఏపీకి ఉండడం నిజంగా ఎంతో అభినందనీయమని కేంద్రమంత్రులతో చెబుతున్నారట మోడీ.  

కేసీఆర్ మార్క్ బడ్జెట్

  ఈరోజు తెలంగాణా ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన రాష్ట్ర తొలి బడ్జెట్ తెరాస అధినేత కేసీఆర్ ముద్ర చాలా స్పష్టంగా కనబడుతోంది. ఆయన ఇచ్చిన ఎన్నికల హామీలను అన్నిటినీ అమలుచేసేందుకు బడ్జెట్ లో కేటాయింపులు చేసారు. ముఖ్యంగా విద్య, వైద్య, విద్యుత్ రంగాల అభివృద్ధికి తగిన విధంగా బడ్జెట్ లో కేటాయింపులు జరిపారు. అదేవిధంగా రోడ్ల నిర్మాణం, చెరువుల పునరుద్దరణ, సాంఘిక సంక్షేమానికి కూడా బడ్జెట్ లో చాలా ప్రాధాన్యం ఇచ్చినట్లు కనబడుతోంది. అయితే తెలంగాణా రాష్ట్ర సాధన కోసం దాదాపు 1200-2000 మంది వరకు యువకులు బలిదానాలు చేసుకొన్నట్లు చాలాసార్లు చెప్పిన తెరాస ఇప్పుడు కేవలం తను గుర్తించిన 459మంది అమర వీరులకు మాత్రమే బడ్జట్ లో రూ.100కోట్లు కేటాయించడం చాలా ఆక్షేపించవలసిన విషయం. మిగిలిన అమరవీరులు చేసిన త్యాగాలను గుర్తించకపోవడం వారిని అవమానించినట్లే. వారి త్యాగాల కారణంగానే ఈ రోజు తెరాస అధికారంలోకి వచ్చిందనే విషయం గ్రహించి ఉంటే, మిగిలిన అందరి కుటుంబాలను తప్పకుండా ఆదుకొనిఉండేది. అందుకోసం ఇందిరా పార్క్ లో రూ.15కోట్లతో నిర్మించతలపెట్టిన తెలంగాణా కళా భవన్ మానుకోవచ్చును లేదా న్యాయవాదులు, జర్నలిస్టులకి కలిపి కేటాయించిన 115కోట్ల ఖర్చు తగ్గించుకోవచ్చును.   ఇక తీవ్ర విద్యుత్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఈ సమయంలో విద్యుత్ ఉత్పాదనకి చాలా భారీగా కేటాయింపు చేస్తారని అందరూ భావించారు. కానీ విద్యుత్ రంగానికి కేవలం రూ.3241 కోట్లు, తెలంగాణా జెన్ కోలో ప్రభుత్వ పెట్టుబడిగా మరో 1000కోట్లు మాత్రమే కేటాయించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. కానీ రోడ్ల నిర్మాణానికి ఏకంగా రూ 10వేల కోట్లు కేటాయించారు. మండల కేంద్రాలను జిల్లా కేంద్రాలతో, జిల్లా కేంద్రాలను రాజధానితో కలుపుతూ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు.   అదేవిధంగా రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న సాగునీటి సమస్యను పరిష్కరించడానికి రూ 2వేల కోట్ల కేటాయించారు. తొలివిడతలో రాష్ట్రంలో తొమ్మిదివేల చెరువులను పూడికలు తీసి రిపేర్లు చేస్తున్నారు. వాటి పునరుద్దరణతో పొలాలకు నీటి సౌకర్యం ఏర్పడటమే కాక బోరు బావులలో మళ్ళీ నీటిమట్టాలు పెరుగుతాయి. అదేసమయంలో ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తికి, సరఫరాకు కూడా ప్రభుత్వం చేప్పటిన చర్యల కారణంగా రైతులు నీళ్ళ మోటర్లకు విద్యుత్ సరఫరా మెరుగయ్యే అవకాశం ఏర్పడుతుంది. ఈవిధంగా కేసీఆర్ సాగు నీరు, విద్యుత్ రెండు సమస్యలను ఒకేసారి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నందున బహుశః ఒకటి రెండు సం.లలో సమస్యలు ఒక కొలొక్కి రావచ్చును.   ఇక రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీ, యస్సీ,ఎస్టీ మరియు మైనార్టీ వర్గాలకు బడ్జెటులో తగు కేటాయింపులు చేసారు. బీసీల సంక్షేమానికి రూ.2022 కోట్లు, మైనార్టీల సంక్షేమానికి రూ.1030 కోట్లు, ఎస్సీల సబ్ ప్లాన్ కు రూ.7579 కోట్లు, ఎస్టీల సబ్ ప్లాన్ కు రూ.4559 కోట్లు కేటాయించారు. కళ్యాణ లక్ష్మి పధకం క్రింద ఎస్సీలకు రూ.150 కోట్లు, ఎస్టీలకు రూ.80కోట్లు కేటాయించారు. ఎస్సీల అభివృద్ధి కోసం 2014-19 వరకు రూ.50 వేల కోట్లు ఖర్చుచేయబోతున్నట్లు ప్రకటించారు. ఒకవిధంగా ఈ బడ్జెట్ తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కలలు కంటున్న ‘బంగారి తెలంగాణా’ సాధనకు వేసిన తొలి అడుగుగా చెప్పవచ్చును.

కిరణ్ బీజేపీలోకి వస్తారా?

కన్నా తర్వాత బీజేపీలోకి వచ్చే పేర్లలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కు మార్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కిరణ్ ఇప్పటికే బీజేపీ అగ్రనేతలతో సంప్రదింపులు కూడా జరిపారట. బీజేపీ హైకమాండ్ కూడా కిరణ్ పై ఎక్కువ ఆసక్తి చూపిస్తోందట.   రాష్ట్ర విభజనను  ఆపడానికి గట్టిగా ప్రయత్నించిన వ్యక్తిగా కిరణ్ కు కొంత సానుభూతి ఉంది. కాంగ్రెస్ హైకమాండ్ కు కిరణ్ ఎదురొడ్డిన తీరునుకు  అప్పట్లో జాతీయ మీడియా కూడా ప్రాముఖ్యత ఇచ్చింది. అయితే జై సమైక్యాంధ్ర పార్టీ అంటూ వేరుకుంపటి పెట్టుకొని ఆయన దెబ్బతిన్నారు. ఎన్నికలకు ముందు పార్టీ పెట్టడంతో తన కేబినెట్ సహచరులు మద్దతిస్తారని కిరణ్ ఆశించారు. కానీ ఆయన ఆశలన్నీ అడియాసలుగానే మిగిలిపోయాయి. కిరణ్ కు ఎన్నికలకు ముందే తన భవిష్యత్తేంటో అర్థమైపోతుంది. చివరకు ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ఇష్టపడలేదు. ఎలాగోలా ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేశారాయన. ఎన్నికల ఫలితాలు ఊహించినవే కాబట్టి పెద్దగా ఆశలు కూడా పెట్టుకోలేదు కిరణ్. ఇక ఫలితాల తర్వాత ఆయన మీడియాలో కనిపించడం కూడా అరుదైపోయింది. అసలు ఎన్నికల తర్వాత కిరణ్ ఎక్కడా బహిరంగంగా కనిపించలేదు.       మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన తాను ఇలా అనుకోని పరిస్థితుల్లో ఖాళీగా ఉండడం కిరణ్ కు నచ్చడం లేదట. అందుకే తన రాజకీయ భవిష్యత్తుపై ఆయన గట్టిగానే కసరత్తు చేశారని సమాచారం. తన సన్నిహితులతో సుదీర్ఘ మంతనాలు జరిపారని తెలిసింది. ఏ పార్టీ అయితే బెటరని గట్టిగానే వర్కవుట్ చేశాట. పార్టీల వారీగా లెక్కలు వేసుకన్నారట. టీడీపీలోకి వెళ్లలేరు. వైసీపీకి దగ్గర కాలేరు. అలా అని తిరిగి కాంగ్రెస్ లోనూ వెళ్లలేరు. ఎలాగూ ఆపార్టీకి ఏపీలో అంతసీనే లేదు. ఇక మిగిలిన ప్రధాన పార్టీ బీజేపీ ఒక్కటే. ప్రస్తుతం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ సూపర్ ఫామ్ లో ఉంది. మోడీ ఏది కావాలంటే అది జరుగుతోంది. దేశవ్యాప్తంగా మోడీ అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఈ అంశాలన్నింటినీ ఆయన బేరీజువేసుకొని బీజేపీ వైపే ఇంట్రెస్టు చూపిస్తున్నారని తెలుస్తోంది.       కిరణ్ రాకపై బీజేపీ నుంచి కూడా పాజిటివ్ సిగ్నల్  వస్తున్నాయి. బీజేపీ హైకమాండ్ కూడా ఏపీలో కిరణ్ వస్తే బలపడతామని గట్టిగా విశ్వసిస్తోందట. అమిత్ షా అయితే కిరణ్ బయోడేటా అంతా పరిశీలించి ఓకే కూడా చెప్పేశారట. అయితే ముహూర్తంపైనే తర్జనభర్జనలు జరుగుతున్నాయని చెబుతున్నారు. త్వరలోనే ఈ అంశాన్నింటిపైనా క్లారిటీ ఇచ్చేందుకు కిరణ్ సిద్ధంగా ఉన్నారట. మరి ఆయన ఏం చెబుతారన్నది వేచి చూడాల్సిందే.

అందుకే డిల్లీ అసెంబ్లీ రద్దుకు కేంద్రం ఆమోద ముద్ర?

  డిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీతో సహా ఏ పార్టీ ముందుకు రాకపోవడంతో డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ డిల్లీ అసెంబ్లీని రద్దు చేసేందుకు రాష్ట్రపతికి సిఫార్సు చేసారు. దానిని ఈరోజు సమావేశమయిన కేంద్రమంత్రి వర్గం ఆమోదించింది. కనుక కాంగ్రెస్, ఆమాద్మీ పార్టీలు కోరుకొంటున్న విధంగానే డిల్లీ అసెంబ్లీకి త్వరలో మళ్ళీ ఎన్నికలు జరగడం ఖాయమయిపోయింది. ఇదివరకు జాలు కట్టబెట్టిన అధికారాన్ని కుంటి సాకుతో వదులుకొన్న ఆమాద్మీ పార్టీ, ఈసారి ఎలాగయినా ఎన్నికలలో పూర్తి మెజార్టీతో గెలిచి పూర్తి కాలం అధికారం చెలాయించాలని ఉవ్విళ్ళూరుతోంది. అయితే ప్రస్తుతం దేశంలో మోడీ హవా చాలా జోరుగా వీస్తునందున్న డిల్లీ ఎన్నికలలో అవలీలగా గెలవడం తధ్యమని బీజేపీ నేతలు దృడంగా విశ్వసిస్తున్నారు. అటువంటప్పుడు మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి భంగ పడటం కంటే ఎన్నికలు నిర్వహించి పూర్తి మెజార్టీతో అధికారం చెప్పట్టడమే మంచిదనే ఆలోచనతోనే,  మైనార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా కాదనుకొని ఎన్నికలకి మొగ్గు చూపుతున్నారు. కానీ ఒక రాష్ట్రం తరువాత ఒక దానిని బీజీపికి ధారాదత్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఎన్నికలపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు.

ఆ సన్నాసుల సహకారమే కావాలిప్పుడు

  కృష్ణా బోర్డు చైర్మన్ పట్టుకొని కేసీఆర్ 'సన్నాసి' అనేసినట్లు వార్తలు వచ్చేయి. సన్యాసి కాని వాడిని పట్టుకొని సన్నాసి అనడం ఏమిటని చాలా మంది అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసారు. కానీ కేసీఆర్ ఒకసారి కమిట్ అయితే తన మాట తానే వినడు. కనుక ఇక ఆ విషయం గురించి ఎంత గొంతు చించుకొన్నా కంటశోష తప్ప మరొక ప్రయోజనం ఉండదు.   ఆనక ఆయన మేనల్లుడు హరీష్ రావు నిజంగా సన్యాసిణి అయిన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కలిసి ఆంధ్రాపై, సదరు సన్నాసిపై కూడా పిర్యాదులు చేయడానికి డిల్లీ బయలుదేరినప్పుడు, కేసీఆర్ మళ్ళీ ఆమెను కూడా సన్నాసి(ణి) అని అనేస్తారేమోనని జనాలు తెగ కంగారు పడ్డారు. కానీ ఆమె మంత్రి హరీష్ రావు పిర్యాదులకు సానుకూలంగా స్పందించడమే కాకుండా శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేసుకోమని అనుమతి కూడా ఇచ్చేయడంతో బ్రతిపోయారు. లేకుంటే కేసీఆర్ ఆ సన్యాసిణిని కూడా సన్నాసి అనేసేవారేమో! అయితే చంద్రబాబు నాయుడు తనకు దూరదృష్టి లేదంటేనే చాలా హర్ట్ అయిపోయిన కేసీఆర్, ఇలా ఎవరిని పడితే వాళ్ళని పట్టుకొని సన్నాసులు, దద్దమ్మలు అంటూ తిడుతుంటే వాళ్ళు మాత్రం హర్ట్ అవరా? హర్ట్ అయినా అవనట్లు సర్దిచెప్పుకొని వాళ్ళు ఆయనకి, తెలంగాణా ప్రభుత్వానికి సహకరిస్తారా?

అబ్బ...ఆయనే గుర్తొస్తున్నారు..

  ఈ మధ్యన ఏమిటో తరచూ ఆయనే అందరి కలల్లోకి వస్తున్నారుట! ఆయన అనగానే స్వర్గీయ యన్టీఆరో..లేక స్వర్గీయ రాజశేఖ రెడ్డో అనుకొనేరు...రాష్ట్ర విభజనని తీవ్రంగా వ్యతిరేఖిస్తూ పోరాడిన వ్యక్తి. అలాగని జగన్మోహన్ రెడ్డి అనుకొనేరు...స్మీ! చివరి దాక రాష్ట్ర విభజనని, ఆ నిర్ణయం తీసుకొన్న తన కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించిన వ్యక్తి...మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు తరచుగా అందరి కలల్లోకి వస్తున్నట్లు తెగ ప్రచారం అవుతోంది.   ఆనాడు రాష్ట్ర విభజన చేస్తే నీళ్ళ కోసం కరెంటు కోసం గొడవలొస్తాయని చిలక్కి చెప్పినట్లు చెప్పారు. కానీ ఆయన మాటేవరూ చెవికెక్కించుకోలేదు. రాష్ట్రాన్ని విభజిస్తే పార్టీ మట్టి కొట్టుకుపోతుందని అరిచి గ్గీ పెట్టారు, కానీ ఆయనే పార్టీకి ఎసరు పెట్టేలా ఉన్నారని సాటి కాంగ్రెస్ జీవులన్నీ అప్పుడు చెవులు కొరుకొన్నాయి. ఆయన వేరు కుంపటి పెట్టుకొని బయటకు వెళ్ళిపోయిన తరువాత ఆయనిక మళ్ళీ పార్టీలోకి తిరిగి రాడనీ రూడీ చేసుకొన్నాక, ఆ చెవులు కొరుకొన్న కాంగ్రెస్ జీవులన్నీ దైర్యంగా ఇంటి కప్పుపైకి ఎక్కి మరీ జనాల చెవులు చిల్లులు పడేలా ఆయనే పార్టీకి ఎసరు పెట్టారు అని తెగేసి ప్రకటించేశారు. కానీ జనాలు మాత్రం వాళ్ళ మాటలసలు నమ్మలేదు, కానీ జనాలే కాంగ్రెస్ పార్టీకి ఎసరు పెట్టేసారు. కాంగ్రెస్ పార్టీకే కాదు చెప్పులరిగిపోయేలా తిరిగినా పాపం ఆయన చెప్పుల పార్టీకి కూడా ఒక్కసీటు రాలేదు. పాపం అందరికీ శకునం చెప్పిన బల్లి కుడితిలో పడి చచ్చిందన్నట్లయింది ఆయన పరిస్థితి. రాష్ట్రానికి, తెలుగు జాతికి, కాంగ్రెస్ పార్టీకి ఎంచక్కగా జోస్యం చెప్పిన ఆయన కనబడకుండా పోయాడు.   కానీ జనాలు మాత్రం ఇప్పుడు ఆయన చెప్పిన జోస్యం గుర్తు తెచ్చుకొంటూ ఆకులు పట్టుకొంటున్నారు. అయితే జనాలెవరూ కూడా ఆయనలాగే జోస్యం చెప్పి, విభజనను వ్యతిరేఖిస్తూ పోరాడి చివరికి దేశాటన కూడా చేసి వచ్చిన మరో పెద్దమనిషి జగన్మోహన్ రెడ్డి గురించి ఈవిధంగా ఎప్పుడు అనుకోకపోవడం ఏమిటో..అస్సలు అర్ధం కావడం లేదు. ఒకానొకప్పుడు సమైక్య ఛాంపియన్ రేసులో ఇద్దరూ సరి సమానంగానే పరిగెత్తారు. ఇద్దరూ కూడా ఒక్కలాగే జోస్యం చెప్పారు. కానీ జనాలు ఆయనని తలచుకొని ఈయనగారిని మరిచిపోవడం ఏ మాత్రం భావ్యం కాదు. ఏమంటే ఆయన ముందే ప్రామిస్ చేసినట్లు రాజకీయ సన్యాసం తీసుకొన్నారు కనుక ఆయనొక గొప్ప త్యాగమూర్తని...ఈయనగారు సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో జనాలకి కుచ్చు టోపీ పెట్టిన వాడని...లక్షా తొంబై కారణాలు చెప్పవచ్చు గాక, కానీ అంతమాత్రాన్న క్రెడిట్ అంతా ఆయనకే ఇచ్చేయడం ఏ మాత్రం భావ్యం కాదు.   నిజానికి పెరటి మొక్క వైద్యానికి పనికి రాదనే సంగతి గ్రహించకుండా కిరణ్ కుమార్ రెడ్డి తన అధిష్టానానికి నచ్చచెప్పాలని చూడటం మొదటి తప్పు. ఒకపక్క అధిష్టానానికి వద్దు వద్దు అని చెపుతూనే చివరి నిమిషం వరకు ముఖ్యమంత్రి కుర్చీని అంటి పెట్టుకొని కూర్చొవడం మరో తప్పు. కూర్చొని మళ్ళీ అదే అధిష్టానానికి రాష్ట్ర విభజనకి ‘ఫుల్ కోపరేషన్’ ఇవ్వడం ఇంకో తప్పు. కోపరేషన్ చేస్తూనే చేయడం లేదని బుకాయించడం మరో తప్పు. సమయం కాని సమయంలో వేరు కుంపటి పెట్టుకోవడం మరో పెద్ద తప్పు. ఒక పక్క రాష్ట్రం విడిపోతుంటే సమైక్యాంధ్ర పార్టీ అని పేరు పెట్టుకోవడం ఇంకో తప్పు.   ఇన్ని తప్పులు చేసి, కేవలం స్వీయ తప్పిదాల కారణంగానే కనబడకుండాపోయిన ఆయనను జనాలు తలుచుకొంటున్నారే గానీ కంటికెదురుగా తిరుగుతున్న చెట్టంత మనిషిని పట్టించుకోక పోవడం చాలా దారుణం. ఇంతకీ ఆయనగారి గొప్పదనం ఏమిటి ఈయనగారు చేసిన నేరం ఏమిటి?ఈ జనాల తీరు చూస్తే కడుపు రగిలిపోతోంది...విశ్వసనీయతే లేదు వీళ్ళకి... 

విలేఖరిపై ఘరానా అల్లుడు గారి దౌర్జన్యం

  ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలో యువరాజు రాహుల్ గాంధీ గారి హవా నడిచేది. ఎక్కడ చూసినా ఆయన నామస్మరణే వినిపించేది. కానీ ఇప్పుడు ఆయన స్థానంలోకి బావగారు రాబర్ట్ వాద్రా వచ్చేసినట్లు కనబడుతోంది. అంటే ఆయనేదో కాంగ్రెస్ పార్టీ బాధ్యత చేపడతారని కాదు గానీ హర్యానా రాష్ట్రంలో ఆయనగారి భూభాగోతాల కారణంగా ఇప్పుడు నిత్యం ఆయన పేరు మీడియాలో కనబడుతోంది. ఇంతవరకు ఆయనకు అండగా నిలబడిన హర్యానా ముఖ్యమంత్రి భూపేంద్ర హుడా స్థానంలోకి ఇప్పుడు బీజేపీకి చెందిన మనోహర్ లాల్ కత్తార్ రావడంతో ఘరానా అల్లుడిగారు పేరు మరింత మారు మ్రోగిపోతోంది. ఎందుకంటే హర్యానాలో కొత్తగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అల్లుడిగారి భూ భాగోతాల మీద విచారణకు ఆదేశిస్తామని స్పష్టం చేసింది.   నిన్న ఘరానా అల్లుడుగారు డిల్లీలో ఒక స్టార్ హోటల్ కి వచ్చినప్పుడు అదే విషయంపై ఆయన స్పందన తెలుసుకోవడానికి వెళ్ళిన విలేఖరిని “నన్ను ఆ ప్రశ్న అడగడానికి నువ్వెవరు? అని గద్దించారు. అయినా ఆ విలేఖరి నక్షత్రకుడిలా వదలకుండా ఆయన వెంట పడటంతో అల్లుడుగారికి మా చెడ్డ చిరాకు వచ్చేసినట్లుంది. దానితో ఆయన కోపంగా అతని చేతిలో ఉన్న మైకును పక్కకు నెట్టేసి “ఆర్ యూ సీరియస్...ఆర్ యూ సీరియస్....ఆర్ యూ సీరియస్... ఆర్ యూ సీరియస్?” అంటూ నాలుగు సార్లు గట్టిగా అరిచేసరికి పాపం ఆ విలేఖరి బిక్క మొహం వేయక తప్పలేదు.   అయితే ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం కొసమెరుపు. ఎందువలన అంటే ఇది జరగగానే "అల్లుడుగారు అమ్మగారి కుటుంబంతో ఉన్న బంధుత్వం వలన రాజ్యాంగేతర శక్తిలా తయారవుతున్నారని, ఆయనపై సదరు విలేఖరి పిర్యాదు చేసినట్లయితే చర్యలు తీసుకొంటామని" కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని అల్లుడుగారి సంగతి ఆయన అత్తగారో లేదా శ్రీమతిగారో ఎవరో ఒకరు చూసుకొంటారని కాంగ్రెస్ పెద్దలు భావించారో ఏమో.. ఈ వ్యవహారంతో తమా పార్టీకి సంబంధం లేదని ప్రకటించి చేతులు దులుపుకొన్నట్లు సమాచారం. అందువల్ల ఘరానా అల్లుడు గారిని కాపాడుకోవడానికి అత్తగారో లేక ఆయన శ్రీమతిగారో  కొంగు బిగించకతప్పదేమో.

తెలంగాణా రైతన్నలను కాపాడుకొందాము

  యధా రాజా తధా ప్రజా అన్నారు పెద్దలు. అది తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన మంత్రులకి కూడా సరిగ్గా వర్తిస్తుందని చెప్పవచ్చును. విద్యుత్ కష్టాలకు గత ప్రభుత్వాలే కారణం కనుక రైతుల ఆత్మహత్యలకు కూడా గత ప్రభుత్వాలే కారణమవుతాయనే సిద్దాంతాన్ని ఆయన కనుగొన్న తరువాత దానిని ఆయన మంత్రులు కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నారు.   వారిలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఒకరు. కానీ ఆయన మరో అడుగు ముందుకు వేసి “తెరాస అధికారంలోకి వచ్చిన తరువాతనే రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నట్లు తెదేపా, కాంగ్రెస్ పార్టీలు మాట్లాడుతున్నాయి. కానీ వారి హయాం నుండే రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. వారి పరిపాలనలో మూడువేలమందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. కావాలంటే ఇదిగో సాక్ష్యం..” అని ఏవో కాగితాలు చూపించారు. అంతేకాదు రాష్ట్రం మొత్తంలో ఏ జిల్లాలో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకొన్నారో లిస్టులు తెప్పించుకొని వారి కుటుంబాలకి తమ ప్రభుత్వం సాయం చేద్దామని ఆలోచిస్తున్నట్లు చెప్పడం చూస్తే ఆయన రైతుల ఆత్మహత్యలకు, వారి కష్టాలకు ఆయన మానవత్వంతో స్పందిస్తున్నట్లు కనబడలేదు.   అసలు ప్రభుత్వంలో మంత్రులు, శాసనసభ్యులు, యంపీలు, యం.యల్సీలు అందరూ స్వయంగా రైతులను కలుస్తూ వారికి భరోసా కల్పించే విధంగా మాట్లాడి, వీలయినంత తక్షణ సహాయం అందించి వారు ఆత్మహత్యలు చేసుకోకుండా ఎందుకు అడ్డుకొనే ప్రయత్నాలు చేయడం లేదు? రైతన్నలు బ్రతికున్నప్పుడు పట్టించుకోకుండా చనిపోయిన రైతు కుటుంబాలకు సహాయం చేస్తామని చెప్పడం ద్వారా వారికి ఎటువంటి సందేశం అందిస్తున్నారు? అని తెలంగాణా మంత్రులు తమను తాము ప్రశ్నించుకోవాలి.   ఇక తెలంగాణాలో ప్రతిపక్షాలు కూడా సున్నితమయిన ఈ సమస్యపై రాస్తారోకోలు, ఆందోళనలు చేసి రాజకీయంగా మరింత బలం పెంచుకోవాలని చూస్తున్నాయే తప్ప అన్ని పార్టీలు కలిసి డిల్లీ వెళ్లి ఈ సమస్య పరిష్కారం కోసం కేంద్రంపై ఒత్తిడి తేకపోవడం చాలా శోచనీయం. ఈ సమస్య వలన అధికార పార్టీ ఇబ్బందిపడితే దానిపై తాము పైచేయి సాద్ధిదామనే తపనే కానీ తమ కళ్ళ ముందు ఆత్మహత్యలు చేసుకొంటున్న రైతన్నలను చూసి కంటతడి పెట్టలేకపోతున్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం కలిసి పోరాడిన రాజకీయ పార్టీలు, జేఏసీలు ఇప్పుడు తమ రైతన్నలను రక్షించుకోవడానికి ముందుకు రాకుండా ఏమి చేస్తున్నాయి?   కేవలం తెలంగాణా ప్రభుత్వం, అక్కడి ప్రతిపక్షాలే కాదు, ఆంధ్రా ప్రభుత్వం, అక్కడి ప్రతిపక్షాలు కూడా తెలంగాణా రైతన్నలను కాపాడుకోవడం కోసం స్వచ్చందంగా ముందుకు రావాలి. కరెంటు ఇవాళ్ళ కాకపోతే రేపు వస్తుంది. కానీ రైతన్నలు చనిపోతే మరిక ఎన్నడూ తిరిగిరారనే సంగతి అందరూ గుర్తుంచుకొని, తక్షణం వారి సంక్షేమం కోసం అందరూ ఏమి చేయగలరో అది చేసి అందరికీ అన్నం పెట్టె అభాగ్య అన్నదాతలను కాపాడుకోవాలి. కార్ల మీద, మోటార్ సైకిల్ల నెంబరు ప్లేట్ల మీద ‘ఐ లవ్ ఇండియా’ అని స్టిక్కర్లు అంటించుకొని తిరగడం కాదు. ఇటువంటి సమయంలో కష్టాలలో ఉన్న రైతన్నలను ఆదుకొని ఇండియా పట్ల తమ ప్రేమ నిజమయిందని నిరూపించుకోవాలి. ఇరుగు పొరుగు రాష్ట్రాలలో, విదేశాలలో స్థిరపడిన ప్రవాస ఆంధ్ర, తెలంగాణా ప్రజలందరూ కూడా తెలంగాణా రైతన్నకి సహాయం చేసేందుకు తక్షణమే ముందుకు రావాలి.

మాటలు కాదు చేతలు కూడా అవసరం

  తెలంగాణా ఉద్యమానికి, ఎన్నికలలో గెలవడానికి అద్భుతంగా పనిచేసిన తెలంగాణా సెంటిమెంటు, పరిపాలన సాగించడానికి మాత్రం అంతగా వర్కవుట్ అవడం లేదనిపిస్తోంది. ఇదివరకు కేసీఆర్ మాటల గారడీకి మెచ్చుకొని జనాలు చప్పట్లు కొట్టినా, ఇప్పుడు ఆయన కరెంటు ఈయలేక చేతులు పిసుకొంటూ కూర్చోవడంతో జనాలు కూడా ఇప్పుడు చప్పట్లు కొట్టడం మరిచిపోతున్నారు. కరెంటు కోసం మరో రెండు మూడేళ్ళు ఆగమని ఆయన చెపుతున్నా వినకుండా రైతన్నలు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. అయితే ఆ పాపం గత ప్రభుత్వాలదేనని ఆయన చేతులు కడిగేసుకొన్నారు.   ఇప్పుడు ఆయన ఏమి చెప్పినా జనాలు కూడా వినిపించుకొనే పరిస్థితి కనబడటం లేదు. అందుకే హైదరాబాద్ రోడ్లని సినీ హీరోయిన్ బుగ్గలా నున్నగా మెరిపిస్తామని, వైఫీ సౌకర్యం కల్పిస్తామని, గొలుసుకట్టు చెరువులు బాగు చేయించి నీళ్ళు ఇస్తామని ఏవేవో కొత్త కొత్త హామీలు గుప్పిస్తున్నారు. కానీ ‘సమస్యల గొంగళీ’ మాత్రం వేసిన చోటనే ఉంది.   ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణా ప్రభుత్వ ఆదాయం బాగానే ఉందనే టాక్ ఒకటుంది. ఆంధ్రా దగ్గర కరెంటు ఉంది. కానీ డబ్బు లేదు. కనుక తనదగ్గర ఉన్న డబ్బు పెట్టి ఆంధ్రా దగ్గర కరెంటు కొనుకొనే ఆలోచన చేస్తే ఇరువురి కష్టాలు తీరవచ్చును. కానీ అందుకు అహం అడ్డువస్తోంది. పోనీ కేంద్రాన్ని కరెంటు ఇమ్మని అడగవచ్చును కానీ కేంద్రంతో కూడా పడదాయే.   ఇప్పుడు కేసీఆర్ కొత్తగా మరో గొప్ప సత్యం కనుకొన్నారు. అదేమంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కంటే రాష్ట్ర విభజన తరువాతే తెలంగాణా రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఎక్కువయిపోయిందని! అయితే ఈ ఐదు నెలలలో తెలంగాణాకి కొత్తగా భారీ పరిశ్రమలేవీ రాలేదు. కొత్తగా లక్షల ఎకరాలలో ఎవరూ పంటలు వేయలేదు. మరి అటువంటప్పుడు అకస్మాత్తుగా విద్యుత్ వినియోగం ఎలా పెరిగిపోయిందో ఆయనే వివరించితే బాగుండేది. అయినా విద్యుత్ సరఫరాయే లేకపోతే ఇక వినియోగం ఎలా పెరుగుతుంది? అని ఆలోచిస్తే తగినంత విద్యుత్ సరఫరా లేకపోవడం వలననే కొరత ఏర్పడింది తప్ప వినియోగం పెరగడం వలన కాదని అర్ధమవుతోంది.   అటువంటప్పుడు బేషజానికి పోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తానంటున్న 300మెగావాట్స్ విద్యుత్ తీసుకొని వీలయితే అదనపు విద్యుత్ కూడా అడగవచ్చును. అదేవిధంగా విద్యుత్ సమస్యపై తనను నిలదీస్తున్న ప్రతిపక్షాలను, ముఖ్యంగా బీజేపీ నేతలను కూడా వెంటేసుకొని కేసీఆర్ డిల్లీ వెళ్లి మోడీపై ఒత్తిడి తెస్తే ఏమయినా ప్రయోజనం ఉండవచ్చును. కానీ మాటలతోనే ప్రజలను మురిపిద్దామని ప్రయత్నిస్తే కధ అడ్డం తిరిగే ప్రమాదం ఉంది.

సర్దార్‌కి సెల్యూట్... నెహ్రూ ఫ్యామిలీకి చెక్...

  భారత ప్రధాని నరేంద్రమోడీ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజలందరి భాగస్వామ్యంతో విజయాలు సాధిస్తున్నాయి. మొన్నీమధ్య ఆయన గాంధీజీ స్ఫూర్తితో చేపట్టిన ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి ప్రతిస్పందన లభిస్తోంది. ఆ కార్యక్రమం ఇక నిర్విరామంగా, నిరాటంకంగా కొనసాగుతుందన్న నమ్మకం బలంగా ఏర్పడింది. అలాగే ఇప్పుడు మోడీ చేపట్టిన మరో కార్యక్రమం దేశ ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. అది ముక్కలు చెక్కలుగా వున్న భారతదేశాన్ని ఒక్కటి చేసిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’గా నిర్వహించడం, ఈ సందర్భంగా ప్రజలతో కలసిపోయి సమైక్యతా పరుగు, సమైక్యతా ప్రతిజ్ఞ వంటి కార్యక్రమాలను నిర్వహించడం! ప్రధాని నరేంద్రమోడీ సర్దార్ పటేల్ జయంతిని ఇంత భారీగా, ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడం వెనుక దేశంకోసం జీవితాన్ని అంకితం చేసిన సర్దార్ పటేల్‌కి సరైన రీతిలో నివాళులు అర్పించడం మాత్రమే కాకుండా, ఇంతకాలం దేశం నెత్తిన గుదిబండలా కూర్చున్న నెహ్రూ కుటుంబానికి చెక్‌ పెట్టే ఉద్దేశం వుందని కూడా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.   దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశానికి ప్రధానమంత్రి హోదాలో నాయకత్వం వహించే అంశంలో పటేల్, నెహ్రూ మధ్య నెలకొన్నపోటీ, ఆ పోటీలో నెహ్రూ ‘తెలివిగా’ సాధించిన విజయం అందరికీ తెలిసిందే. దేశంలో ముక్కలు చెక్కలుగా వున్న సంస్థానాలను విలీనం చేసి అఖండ భారతదేశాన్ని నిర్మించడంలో హోంమంత్రి హోదాలో సర్దార్ పటేల్ చేసిన కృషి అనితరసాధ్యమైనది. నెహ్రూ కాకుండా పటేల్ దేశానికి మొదటి ప్రధానమంత్రి అయితే భారతదేశం ఇప్పుడు మరోలా వుండేదన్న అభిప్రాయాలు వినిపిస్తూ వుంటాయి. సాహసి, దార్శనీకుడు, నిస్వార్థపరుడు అయిన పటేల్ ప్రధానమంత్రి కాకపోవడం ఈ దేశ దురదృష్టాల్లో ఒకటన్న అభిప్రాయం కూడా వుంది. నెహ్రూ కూడా గొప్ప నాయకుడే... కానీ ఆయన వారసత్వం మాత్రం దేశాన్ని అధోగతిపాలు చేసింది. స్వాతంత్ర్యం సాధించిన తర్వాత అభివృద్ధిలోకి వెళ్ళాల్సిన దేశం తిరోగమన దిశగా పయనించడానికి నెహ్రూ కుటుంబం ప్రధాన కారణమన్న అభిప్రాయాలూ వున్నాయి. దేశ స్వాతంత్ర్య పోరాటంలో నెహ్రూకంటే మిన్నగా కృషి చేసిన సర్దార్ వల్లభాయ్‌ పటేల్‌కి ఆ తర్వాత నెహ్రూ కుటుంబ పాలనలో సరైన గుర్తింపు లభించలేదు. దానికి కారణం ప్రధాని పదవి విషయంలో నెహ్రూతో పటేల్ పోటీపడటమేననేది బహిరంగ రహస్యమే. ఈ రాజకీయ కారణంతోనే కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో వున్న ఇంతకాలం పటేల్‌కి సరైన రీతిలో నివాళులు అర్పించలేదు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఏ కార్యక్రమంలోనయినా దేశాన్ని సుదీర్ఘంగా పాలించిన నెహ్రూ కుటుంబం పేర్లు వినిపిస్తాయే తప్ప, దేశంకోసం సర్వస్వం అర్పించిన పటేల్ లాంటి నాయకుల పేర్లు ఏనాడూ వినిపించలేదు. ఆ పొరపాటును దిద్దే పనిని ఇప్పుడు మోడీ చేయడం అభినందనీయం.   ఇప్పుడు దేశం నెత్తిన కాంగ్రెస్ పార్టీ రూపంలో నెహ్రూ కుటుంబ గుదిబండ వుంది. దీనిని క్రమంగా తొలగించే పనిని మోడీ చేపట్టినట్టు కనిపిస్తోంది. మోడీ ఒక వైపు మహాత్మాగాంధీని, మరోవైపు సర్దార్ పటేల్‌ని స్ఫూర్తిగా తీసుకుంటూ వీరిద్దరూ దేశంకోసం సమంగా పోరాడిన నాయకులని అంటున్నారు. గాంధీజీ, పటేల్ ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా మరొకరు అసంపూర్ణంగా వుండేవారని మోడీ చెబుతున్నారు. అంతే తప్ప ఆయన ఏ సందర్భంలోనూ నెహ్రూ పేరును ప్రస్తావించిన దాఖలాలు లేవు. అక్టోబర్ 31వ తేదీన పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించారే తప్ప, నెహ్రూ కుటుంబానికి చెందిన ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమంలో మోడీ పాల్గొనలేదు. ఇది దేశానికి పట్టిన నెహ్రూ కుటుంబ జాడ్యాన్ని క్రమక్రమంగా తొలగించే బృహత్తర కార్యక్రమంలో మొదటి అడుగుగా భావించవచ్చన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేశారు. నెహ్రూ దగ్గర మొదలుపెట్టి.. ఇందిర.. రాజీవ్.. సోనియా... రాహుల్... ఇలా క్రమక్రమంగా నాసిరకంగా మారుతున్న నెహ్రూ కుటుంబ వారసత్వ చెర నుంచి దేశాన్ని కాపాడే ఉద్దేశంతో మోడీ వున్నారని పరిశీలకులు అంటున్నారు.

పెరిగిన రాష్ట్ర ఆదాయం, ఖర్చుపై నియంత్రణకు కృషి

  రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్ధికంగా బాగా దెబ్బతింది. ఈ పరిస్థితుల నుండి రాష్ట్రం ఇప్పుడప్పుడే కోలుకోలేదని చాలా మంది ఆందోళన చెందారు. కానీ అదృష్టవశాత్తు రాష్ట్రం త్వరగానే కోలుకొంటున్న సూచనలు కనబడుతున్నాయి. మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో సమావేశమయిన వివిదశాఖాల ఉన్నతాధికారులు, గత సంవత్సరంతో పోలిస్తే తమ తమ శాఖల ఆదాయం ఆశించిన దానికంటే బాగానే పెరిగిందని చెప్పారు.   గత సం.తో పోలిస్తే ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో ఎక్సైజ్ శాఖ ఆదాయంలో-85శాతం వృద్ధి కనబడగా, కమర్షియల్ టాక్స్-93శాతం, స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్-85శాతం, రెవిన్యూ- 115.6శాతం, రవాణా-78శాతం వృద్ధి సాధించినట్లు తెలిపారు. మొత్తం మీద ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో అన్ని శాఖల ఆదాయం కలిపి రూ.12, 881 కోట్లు వచ్చిందని, గత సం. ఇదే కాలానికి రూ.11,313కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ ఏడాదిలో ఇంతవరకు 17.6 శాతం వృద్ధి కనబడిందని వారు తెలిపారు.   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారినందరినీ అభినందిస్తూనే, రాష్ట్ర ఆర్దికపరిస్థితి పూర్తిగా కుదుటపడేవరకు అందరూ తమ తమ శాఖలకు బడ్జెట్ లో కేటాయించిన నిధులను చాలా పొదుపుగా వాడుకోవాలని, అదేవిధంగా బడ్జెట్ లోటు మరింత పెరగకుండా ఖర్చుల మీద పూర్తి నియంత్రణ సాధించాలని కోరారు. వృదాఖర్చులను అరికట్టి ఆర్ధిక పరిస్థితి మెరుగుపరిచేందుకు ఇదివరకు మహారాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన ‘ఎకనామిక్ ఇంటలిజెన్స్’ పద్దతిని మన రాష్ట్రంలో కూడా అమలు చేసేందుకు ప్రయత్నించమని ఆయన కోరారు. తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న ఎక్సయిజ్ పాలసీనే రాష్ట్రంలో అమలు చేయడానికి అనువుగా ఉంటుందా లేదా అనే విషయాన్ని కూడా పరిశీలించమని ఆయన ఎక్సయిజ్ అధికారులను కోరారు. రవాణాశాఖ తన ఆదాయాన్ని మరింత పెంచుకొనేందుకు మరింత కృషి చేయాలని ఆయన కోరారు.   గత డిశంబరు నెలలో కృష్ణ, ఉభయగోదావరి జిల్లాలలో కనుగొన్న అపారమయిన బొగ్గు నిక్షేపాలను వెలికితీసేందుకు ఆరు నెలలోగా ఒక కన్సల్టెన్సీ ఏజన్సీని నియమించాలని ఆయన కోరారు.   ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రాణాలికేతర వ్యయాన్ని కనీసం 20శాతం కంటే తక్కువలో ఉండేలా ఖర్చులను నియంత్రించుకోవాలని అన్ని శాఖల అధికారులను కోరారు. అన్ని శాఖల అధికారులు కూడా ఏ శాఖ ఆదాయం ఎక్కువగా ఉంటుందో దానికి అన్ని విధాల సహకరిస్తూ ఆ ఆదాయం మరింత పెరిగేందుకు తోడ్పడాలని ఆయన కోరారు. అన్ని శాఖల మధ్య మరింత సమన్వయం సాధించడం ద్వారా అన్ని శాఖలు తమ ఆదాయాన్ని మరింత పెంచుకోవచ్చని ఆయన సలహా ఇచ్చారు.

ఇక చిరంజీవి మారడం కష్టమే...

  మాజీ మెగాస్టార్ చిరంజీవి రాజకీయ విధానాలు తెలుగు ప్రజలకు విసుగు తెప్పించాయి. ఆయన్ని సినిమా తెరమీద చూస్తే ఆనందంతో బట్టలు చించుకునే అభిమానులు కూడా రాజకీయంగా చిరంజీవి పేరు చెబితేనే చిరాకుపడే పరిస్థితికి వచ్చారు. పార్టీ పెట్టడం దగ్గర్నుంచి, పార్టీ మూసేసి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు, రాష్ట్ర విభజన సందర్భంలో వ్యవహరించిన తీరు వరకు అనేక అంశాలు చిరంజీవి రాజకీయ అపరిపక్వతకు, స్వార్థపూరిత రాజకీయాలకు అద్దం పట్టాయి. తన రాజకీయ ప్రస్థానంలో చిరంజీవి తెలుగు ప్రజలకు విసుగు పుట్టించడంతోపాటు అనేక గుణపాఠాలు నేర్చుకునే అవకాశాలను కూడా పొందారు. అయితే ఆ అవకాశాల నుంచి చిరంజీవి గుణపాఠాలను నేర్చుకున్న దాఖాలు ఎంతమాత్రం కనిపించడం లేదు. చిరంజీవి అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలు ఎందుకూ పనికిరాని వ్యూహాలని, వాటివల్ల చిరంజీవికి కాంగ్రెస్ పార్టీలో పదవులు దక్కితే దక్కవచ్చేమోగానీ, ప్రజల నుంచి తిరస్కరణే ఎదురవుతుందన్న పెద్ద గుణపాఠాన్ని కూడా ఆయన నేర్చుకోలేదు. ప్రజల్లో ఎంతో ఛరిష్మా వున్న తాను కాలికి బలపం కట్టుకుని సీమాంధ్ర అంతా తిరిగినా ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాకపోవడం నుంచి ఆయన ఎలాంటి జ్ఞానోదయాన్నీ పొందలేదు. అందుకే ఆయన ఇప్పటికీ తన పంథాలోనే వెనక్కి దూసుకువెళ్తున్నారు.   ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వారానికో పదిరోజులకో ఒకసారి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నేనింకా బతికే వున్నానని చెప్పుకునే స్థితిలో వుంది. అలాంటి పార్టీని ఐదేళ్ళ తర్వాత వచ్చే ఎన్నికలలో గెలిపించే బాధ్యతని భుజాన వేసుకున్న చిరంజీవి ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ ఉనికిని చాటుకునేందుకు రాజకీయాలు, కామెంట్లు చేస్తున్నారు. విశాఖ తుఫాను బాధితులను ఆదుకునే విషయంలో చంద్రబాబు చేసిన కృషిని దేశమంతా ప్రశంసిస్తోంది. చీటికి మాటికి చంద్రబాబును విమర్శించే కార్యక్రమంలోనే మునిగివుండే జగన్ కూడా ఈ విషయంలో చంద్రబాబును ఎలా విమర్శించాలా అని రకరకాల సాకులు వెతుకుతూ విమర్శిస్తున్నారు. అయితే ఆ విమర్శలన్నీ బెడిసికొడుతూ వుండటంతో నాలుక కరుచుకుంటున్నారు. జగన్ పరిస్థితిని చూసి అయినా చిరంజీవికి జ్ఞానోదయం కలగలేదు. తుఫాను బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని, అదనీ, ఇదనీ ఏవేవో విమర్శలు చేస్తూ ప్రజల్లో ఆయన మీద వున్న కాస్తంత మర్యాదని కూడా పోగొట్టుకునేలా వ్యవహరిస్తున్నారు. హుదూద్ తుఫాను సంభవించగానే చంద్రబాబు నాయుడు విశాఖకు వెళ్ళి అక్కడ అనేక సహాయ కార్యక్రమాలు చేసి, ఎన్నోరోజులు అక్కడే మకాం వేశారు. అలాంటి పరిస్థితుల్లో చిరంజీవి ఏం చేశారు? సహాయ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత, తుఫాను వచ్చిపోయిన వారం రోజుల తర్వాత విశాఖకు వెళ్ళి గెస్ట్ ఆర్టిస్టులాగా డైలాగులు చెప్పి వచ్చారని ప్రజలు అంటున్నారు. తుఫాను సహాయం విషయంలో చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు చిరంజీవికి ఎంతమాత్రం లేదని ప్రజలు అంటున్నారు. తుఫాను బాధితులకు ఎంపీ లాడ్స్ నుంచి విరాళం ఇచ్చారే తప్ప తన సొంత జేబులోంచి పైసా కూడా విదల్చని చిరంజీవికి తుఫాను బాధితుల సహాయ కార్యక్రమాల విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని అంటున్నారు. రాజకీయంగా పాతాళంలోకి పడిపోయినా తన తీరు మార్చుకోని చిరంజీవి భవిష్యత్తులో అయినా మారడం కష్టమేనని అభిప్రాయపడుతున్నారు.