ముఖ్యమంత్రి కేసీఆర్ కి రేవంత్ రెడ్డి సలహా

  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడల గురించి, ఆయన అనుసరిస్తున్న ఘర్షణ వైఖరి గురించి ఇప్పటికే చాలా విమర్శలు మూటగట్టుకొన్నారు. కానీ ఆయన తన వైఖరిని మార్చుకొనే ప్రయత్నం చేసినట్లు కనబడలేదు. అందుకే ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాలలో ప్రతిపక్ష సభ్యులు ఒకరి తరువాత మరొకరు తరచూ ఆయన వైఖరిని తప్పుపడుతున్నారని చెప్పవచ్చును.   కేసీఆర్ ఆరోపిస్తున్నట్లు ఆంద్ర ప్రభుత్వం వలననో, లేక కేంద్రప్రభుత్వం వలననో కాక, కేవలం ఆయన అహంభావం వలననే తెలంగాణాకు ఎక్కువ నష్టం కలుగుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయనకి తెలంగాణా మీద, ప్రజల మీద అపరిమితమయిన అభిమానం ఉంటే ఉండవచ్చును. కానీ ఆయన  అభిమానం హద్దులు మీరితే అది దురాభిమానంగా మారుతుంటుంది. అప్పుడు అందరూ కూడా శత్రువులు మాదిరిగానే కనబడుతుంటారు.   తమిళప్రజలకు తమ తమిళబాష అంటే చాలా అభిమానం. అందుకే అక్కడ తమిళభాష వెలిగిపోతోంది. కానీ వారి ఆ అభిమానం దురాభిమానంగా మారడంతో వారికి ఇతర బాషల పట్ల, ముఖ్యంగా జాతీయ బాష అయిన హిందీ పట్ల తీవ్ర వ్యతిరేఖత కనబరుస్తుంటారు. కానీ దాని వలన హిందీ బాషకు వచ్చే నష్టం ఏమీ లేకపోయినా, వారు హిందీ రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు తరచూ అపహాస్యం చేయబడుతుంటారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తన రాష్ట్రం పట్ల ఇటువంటి దురభిమానమే పెంచుకొని, ఆంద్ర, కేంద్ర ప్రభుత్వాలతో కయ్యానికి కాలుదువ్వుతున్నట్లున్నారు. దానికి తోడు తెదేపా, తెరాసల మధ్య గల రాజకీయ వైరం, కేసీఆర్ కు ఆంద్ర పాలకుల పట్ల సహజంగా ఉన్న విద్వేషం వంటి అనేక కారణాలతో ఆయన అందరితో ఘర్షణ వైఖరి అవలంభిస్తున్నారు. కానీ ఆయన వైఖరి వలన తెలంగాణాకు మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతోందని చెప్పవచ్చును. ఇటు పొరుగు రాష్ట్రం నుండి కానీ కేంద్రం నుండి గానీ తెలంగాణాకు ఎటువంటి సహాయ, సహకారాలు పొందే అవకాశం లేకుండా ఆయనే స్వయంగా తలుపులు మూసుకొన్నట్లుంది.   ఈరోజు శాసనసభ ప్రాంగణంలో తెదేపా సభ్యుడు రేవంత్ రెడ్డి ఒక ఆసక్తికరమయిన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణా రాష్ట్ర పరిపాలన చేయడంలో ఘోరంగా విఫలమయిన కేసీఆర్, హరీష్ రావుకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తే ఆయన పరిస్థితులను చక్కబెట్టగలడని అభిప్రాయం వ్యక్తం చేసారు. హరీష్ రావు ఎంత తీవ్ర సమస్యలు ఎదురయినప్పటికీ ఎన్నడూ సంయమనం కోల్పోకుండా చిరునవ్వుతోనే పనులు చక్కబెట్టేస్తుంటారు. బహుశః అందుకే రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదన చేసి ఉండవచ్చును. కానీ పదేళ్ళపాటు ఎంతో సమర్ధంగా ఉద్యమాలు చేసి, తెలంగాణా సాధించిన కేసీఆర్, రాష్ట్ర అభివృద్ధికి అదే ఉద్యమస్పూర్తిని కొనసాగించడం తప్పు కాదు. కానీ ఉద్యమాన్ని నడిపినట్లు, ప్రభుత్వాన్ని కూడా అదే ఆవేశంతో నడపాలని ప్రయత్నిస్తున్నందునే ఇటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని చెప్పవచ్చును.   తమది మావోయిష్టుల ఎజెండాయే అని గొప్పగా చెప్పుకొంటున్న కేసీఆర్ ను అదే మావోయిష్టులు తప్పు పడుతుండటం గమనార్హం. బహుశః అన్ని వైపులా నుండి కురుస్తున్న ఈ విమర్శల కారణంగా తీవ్ర అభద్రతా భావానికి గురవుతున్నందునే ముఖ్యమంత్రి కేసీఆర్ ఘర్షణ వైఖరి అవలంభిస్తున్నారేమో కూడా. కారణాలు ఏవయినప్పటికీ ఆయన అనుసరిస్తున్న నిరంకుశ, ఘర్షణ వైఖరి వల్ల, ఇతరుల సహకారం ఎలాగు దొరకదు. పైగా ఆయనకు, ప్రభుత్వానికి, రాష్ట్రానికి, పొరుగు రాష్ట్రానికి కూడా ఊహించని కొత్త సమస్యలు పుట్టుకు రావడం తప్ప వేరే ప్రయోజనం ఉండబోదని చెప్పవచ్చును.

ఏపీ రాజధాని పేరు అమరావతి?

  ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఎక్కడ వస్తుందన్న విషయంలో ఇప్పుడు రాజధాని సరిహద్దులతో సహా పూర్తి క్లారిటీ వచ్చేసింది. భూ సమీకరణ అంశం కూడా చాలా సులభంగా పరిష్కారమైపోతోంది. కొత్త రాజధానిని తెలుగు ప్రజలందరూ గర్వంగా తలెత్తుకునే అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టుదలతో కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి ఆలోచనలు కొత్త రాజధాని నగరానికి ఏ పేరు పెడితే బాగుంటుందన్న అంశం చుట్టూ తిరుగుతున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని పేరును ‘అమరావతి’ అని పెడితే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమరావతి అశోకుడి కాలం నుంచీ ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం. అలాగే ప్రసిద్ధ శైవక్షేత్రం కూడా. అలాగే శాతవాహనుల కాలంలో తెలుగువారికి రాజధానిగా విలసిల్లిన ధరణి కోట కూడా అమరావతి దగ్గర్లోనే వుంది. ఉజ్వలమైన భవిష్యత్తు వున్న ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమోఘమైన చరిత్ర కూడా వున్న అమరావతి పేరు పెట్టడం సముచితమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో తెలుగుదేశం నాయకుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక వినతిపత్రాన్ని కూడా సమర్పించారు. అలాగే గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజధానికి అమరావతి అనే పేరు పెట్టాలని భావిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.   ప్రఖ్యాత బౌద్ధ క్షేత్రమైన అమరావతి పేరును ఆంధ్రప్రదేశ్ రాజధానికి పెట్టడం వల్ల రాజధానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు చాలా త్వరగా వచ్చే అవకాశం వుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బౌద్ధ ధర్మాన్ని ధ్వనించే పేరు రాజధానికి పెడితే రాజధాని అభివృద్ధికి నిధులు ఇస్తామని ప్రముఖ బౌద్ధ మత గురువు దలైలామా ‘ఆఫర్’ ఇచ్చారన్న వార్తలు కూడా వచ్చాయి. అలాగే బౌద్ధ ధర్మం ప్రబలంగా వున్న జపాన్ లాంటి దేశాలు ఆంధ్రప్రదేశ్ రాజధానికి బౌద్ధ ధర్మాన్ని ధ్వనించే పేరు పెట్టాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశాయని, అలాంటి పేరు పెడితే తాము భారీగా పెట్టుబడులు పెడతామని చెప్పాయన్న వార్తలు కూడా వచ్చాయి. ‘అమరావతి’ అనే పేరు రాజధానికి పెట్టడం వల్ల ఏపీ రాజధాని ప్రఖ్యాత బౌద్ధ క్షేత్రంగా మరింత అభివృద్ధి జరిగి ప్రపంచ వ్యాప్తంగా వున్న కోట్లాది బౌద్ధులను ఆకర్షించే అవకాశం కూడా వుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.   ఇదిలావుంటే, మరోవైపు ప్రత్తిపాటి పుల్లారావు లాంటి నాయకులు ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి తెలుగువారు గర్వించదగ్గ నటుడు, నాయకుడు నందమూరి తారక రామారావు పేరు కలసి వచ్చేలా ఎన్టీఆర్ నగర్ అని కానీ, తారకరామ నగర్ అని కానీ పెడితే బావుంటుందన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నా, నిర్ణయం తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఇంతవరకూ ఈ విషయంలో ఎలాంటి క్లూ ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని పేరు విషయంలో చంద్రబాబు నాయుడు అభిప్రాయం ఎలా వుంటుందో చూడాలన్న ఆసక్తి ఇప్పుడు రోజురోజుకూ పెరుగుతోంది.

జీవన్‌రెడ్డికి కేసీఆర్ గాలం వేశారా?

  టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ అరటిపండు తొక్క విసిరారంటే ఎలాంటి వారైనా జర్రుమని జారి పడాల్సిందే. అవసరమైన సందర్భంలో ఎలాంటి రాజకీయ ట్రిక్కు ప్రదర్శించడానికైనా కేసీఆర్‌కి కేసీఆర్‌రే సాటి. ఆ విషయం అనేక సందర్భాలలో రుజువైంది. ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీ సాక్షితో మరోసారి రాజకీయ ట్రిక్కు ప్రదర్శించారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీల్లో బలమైన నాయకులు వున్నారు. వారు కేసీఆర్ ప్రభుత్వ తీరును ఎండగట్టడంలో ఉద్ధండ పిండాల్లా వున్నారు. తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి ఎలాంటి వారో.. కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి అలాంటి వారు. గతంలో ఆయన కరీంగనగర్ పార్లమెంట్‌ ఉప ఎన్నికలలో కేసీఆర్‌ మీదే పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చిన నాయకుడు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫును అసెంబ్లీలో ప్రతినిధిగా వున్న ఏకైక ఎమ్మెల్యే. ఇప్పుడు కేసీఆర్ తన రాజకీయ చతురత జీవన్ రెడ్డి మీద ప్రయోగించారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దీనికి తాజాగా అసెంబ్లీలో జరిగిన ఒక సంఘటనను ఉదహరిస్తున్నారు.   మంగళవారం నాడు తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకులు అవలంబిస్తున్న క్లిష్టమైన విధానాల గురించి జీవన్ రెడ్డి మాట్లాడారు. ఈ విషయంలో ఆయన ప్రభుత్వం మీద అనేక ప్రశ్నలు సంధించారు. దీనిమీద స్పందించిన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, తన సహజ శైలిలో కాకుండా చాలా ఆచితూచి మాట్లాడారు. బ్యాంకుల వ్యవహారశైలి మీద జీవన్ రెడ్డి బాగా మాట్లాడారని, ఆయనతో తాను ఏకీభవిస్తున్నానని అన్నారు. అసలు కేసీఆర్ నుంచి ఇంత కూల్‌గా సమాధానం వస్తుందని ఊహించని సభ్యులు ఒకింత ఆశ్చర్యపోయారు. పైగా గతంలో తనతో పోటాపోటీగా నిలిచిన జీవన్ రెడ్డికి కేసీఆర్ అంత కూల్‌గా సమాధానం ఇవ్వడం కూడా సభ్యులను ఆశ్చర్యపరిచింది. ఈ ఆశ్చర్యం కొద్ద క్షణాల తర్వాత గాల్లో కలసిపోయేదే. కానీ, ఆ తర్వాత కేసీఆర్ కాంగ్రెస్ సభ్యులు కూర్చునే గ్యాలరీ వైపు వెళ్ళి, జీవన్ రెడ్డి పక్కనే కూర్చుని ఆయనతో కొద్దిసేపు ముచ్చటించడం ఆ ఆశ్చర్యాన్ని వేలరెట్లు చేసింది.   కేసీఆర్ జీవనరెడ్డి విషయంలో వ్యవహరించిన ఈ తీరు ఆయన్ని టీఆర్ఎస్‌లోకి లాక్కునే ‘ఆకర్ష’ పథకంలో భాగమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కరీంనగర్ జిల్లాలో బలమైన కాంగ్రెస్ నాయకుడు, అసెంబ్లీలో మంచి వాగ్ధాటి వున్న జీవన్‌‌రెడ్డిని తన పార్టీలోకి లాక్కుంటే అసెంబ్లీలో, బయట తనకు ఇబ్బందిగా నిలిచే ఒక బలమైన నాయకుడి బెడద తనకు ఉండదని కేసీఆర్ భావిస్తూ వుండొచ్చని పరిశీలకులు అంటున్నారు. మరి కేసీఆర్ వేసిన రాజకీయ పాచిక జీవన్ రెడ్డి మీద పారుతుందో లేదో వేచి చూడాలి.

ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రతిపక్షాల హితవు

  ఈరోజు జరిగిన శాసనసభ సమావేశాలలో మరో మూడేళ్ళలో రాష్ట్రంలో అద్భుతాలు జరగబోతున్నాయని కేసీఆర్ చెప్పుకోవడాన్ని ప్రతిపక్ష పార్టీలు ఎద్దేవా చేసాయి. కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ అసలు బడ్జెట్ కేటాయింపులకు చేతిలో నిధులే లేకుండా ముఖ్యమంత్రి ఏవో అద్భుతాలు జరుగుతాయని కలలు కంటున్నట్లున్నారని వ్యంగంగా విమర్శించారు. కేంద్రం అనుమతి, ఆర్.బీ.ఐ. అనుమతీ లేకుండా రాష్ట్రానికి ఏవిధంగా అప్పు దొరుకుతుందని ప్రశ్నించినపుడు, కేసీఆర్ కూడా అది కష్టమేనని అంగీకరించారు. కానీ బ్యాంకుల నుండి అదనంగా అప్పులు తెచ్చుకొనేందుకు కేంద్రాన్ని అనుమతి కోరామని చెప్పారు. అంటే కేంద్రం అనుమతిస్తే తప్ప బడ్జెట్ లో పేర్కొన్న పనులు ముందుకు సాగవని స్పష్టం అవుతోంది. కానీ కేంద్రంతో నిత్యం ఘర్షణ వైఖరి అవలంభిస్తూ, దాని సహాయం ఆశించడం కూడా అవివేకమే అవుతుంది. కనుక కేసీఆర్ తన వైఖరి మార్చుకొని అందరినీ కలుపుకొని వెళ్లేందుకు ముందుకు వస్తే తాము కూడా ప్రభుత్వానికి అండగా ఉంటామని జానారెడ్డి హితవు పలికారు. ఈసారి సమావేశాలలో మాట్లాడిన ప్రతిపక్ష సభ్యులు అందరూ కూడా, వివిధ అంశాలపై మాట్లాడుతూ, కేసీఆర్ తన వైఖరి మార్చుకోవాలని హితవు చెప్పడం గమనార్హం. మరి ఇప్పటికయినా ఆయన అందరితో సఖ్యతగా మెలగడం అలవరచుకొంటే, ప్రతిపక్షాలే కాదు ఇరుగు పొరుగు రాష్ట్రాలు, కేంద్రం నుండి కూడా తెలంగాణా రాష్ట్రానికి సహాయ సహకారాలు అందుతాయి. అప్పుడు ఈ సమస్యలన్నిటి నుండి రాష్ట్రం, ప్రభుత్వం రెండూ కూడా బయటపడగలవు.

చంద్రబాబు నామస్మరణలో తరిస్తున్న ఆ ఇద్దరూ

  ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడయినా తలుచుకోవడం మరిచిపోవచ్చేమో గానీ ఇద్దరు వ్యక్తులు మాత్రం ఆయన నిత్య నామస్మరణ చేస్తూ తరించిపోతున్నారు. వారిలో ఒకరు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కాగా, మరొకరు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. వారిరువురూ కూడా ఆయన నామ స్మరణ చేయనిదే రెండు ముక్కలు కూడా మాట్లాడరు. అది చంద్రబాబు అదృష్టమో ఏమో తెలియదు మరి. తెలంగాణా ప్రభుత్వం అన్నిటికీ చంద్రబాబునే నిందించడం అలవాటుగా మార్చుకొందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. సమస్యలు ఉంటే కూర్చొని చర్చించుకోవాలే గానీ ఈవిధంగా ఎవరినో ఒకరిని నిందించడం వలన సమస్యలు పరిష్కారం కావని ఆయన అన్నారు.   మరో రకంగా చెప్పాలంటే కేసీఆర్ తన సమస్యలన్నిటికీ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, దాని ముఖ్యమంత్రి చంద్రబాబుని ఒక ‘సర్వరోగ నివారిణి’లా వాడుతున్నట్లున్నారు.   అయితే సమస్య ఉందని తెలిసినప్పుడు దానికి పరిష్కారం కోసం వెతకాలి తప్ప చంద్రబాబును నిందిస్తూ కాలక్షేపం చేసినంత మాత్రాన్న అది పరిష్కారం కాబోదని తెదేపా నేత రేవంత్ రెడ్డి హితవు చెప్పారు. తెదేపా నేతలు ఈ మాటలు చెపుతున్నారు కనుక తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిని పట్టించుకోకపోవచ్చు. గానీ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఇదేవిధంగా మరి కొంత కాలం కొనసాగినట్లయితే అప్పుడు తెలంగాణా ప్రజలు కూడా ఇదే మాట అనే అవకాశం ఉంది.

చిదంబరమే కాంగ్రెస్ కొంపముంచాడుట!

  సార్వత్రిక ఎన్నికలు జరిగి ఆరు నెలలవుతున్నా ఇంకా కాంగ్రెస్ పార్టీ ఓటమికి కొత్త కొత్త కారణాలు ఏవో ఒకటి బయటపడుతూనే ఉండటం విశేషం. ఇంతవరకు యూపీయే అవినీతి, అసమర్ధ పాలన, కుంభకోణాలు, మోడీ ప్రవేశం, రాహుల్ గాంధీ అసమర్ధత, రాష్ట్ర స్థాయిలో అంతర్గత కుమ్ములాటలు వంటి కారణాలు మాత్రమే చెప్పుకొనే భాగ్యం కలిగింది. కానీ సీనియర్ కాంగ్రెస్ నేత హెచ్.ఆర్.భరద్వాజ మరో కొత్త కారణం బయటపెట్టారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఇంత దారుణంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం మాజీ ఆర్ధికమంత్రి చిదంబరమేనని తేల్చిచెప్పారు.   అందుకు ఆయన బలమయిన కారణాలు కూడా చెప్పారు. 2జి స్కాంపై విచారణ వద్దని ఆయన అడ్డుపడటం వలననే, అందులో కాంగ్రెస్ హస్తం ఉందనే భావన ప్రజలలో వ్యాపించిందని, దాని వలన పార్టీకి తీరని అప్రతిష్ట ఏర్పడి చివరికి అది ఎన్నికలలో ఓటమికి కారణమయిందని ఆయన కనిపెట్టి చెప్పారు. అందువల్ల ఈ స్కాంలో అంతా చిదంబర మహత్యమే తప్ప ఎక్కడా కూడా యూపీయే హ్యాండ్ కానీ కాంగ్రెస్ హ్యాండ్ గానీ లేదని, కానీ చిదంబరం చేసిన పనికి కాంగ్రెస్ బలయిపోయిందని ఆయన వాపోయారు. పనిలోపనిగా ఆయన ‘మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ నిజాయితీని ఎవరూ శంఖించలేరని’ ఒక కాండక్టు సర్టిఫికేట్ కూడా జారీ చేసారు.   అయితే తమిళనాడుకే చెందిన మాజీ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రులు దయానిధీ మారన్ మరియు ఏ. రాజ ఇద్దరూ కూడా 2జి స్కాం క్రింద నుండి పైవరకు అందరికీ తెలిసే జరిగిందని, ఇందులో దాచుకోవడానికి ఏమి లేదని కుండ బ్రద్దలు కొట్టినప్పుడు, ఒక్క చిదంబరానికే ఆ క్రెడిట్ అంతా కట్టబెట్టేయాలని భరద్వాజ్ అనుకోవడం చాలా సంకుచిత ఆలోచనగా చెప్పక తప్పదు. డా. మన్మోహన్ సింగ్ యొక్క మౌనం అర్ధాంగీకారంగా భావించినందునే ఈ స్కాం జరగడానికి ఆస్కారం ఏర్పడింది. కనుక ఆయనతో సహా అందరూ కూడా తిలా పాపం తలా పిడికెడు స్వీకరించక తప్పదు. ఏమయినప్పటికీ ఇప్పుడు భరద్వాజ్ చెప్పబట్టి ఈ స్కాంలో చిదంబరం రోల్ ఏమిటనేది ప్రజలకు కూడా తెలుసుకొనే భాగ్యం కలిగింది. అందువల్ల ఆయనకు కృతజ్ఞతలు చెప్పవలసిందే.

పుస్తకం రాస్తున్న జైపాల్ రెడ్డి

  తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం తెర వెనుక కృషిచేసిన అనేక మందిలో మాజీ కేంద్రమంత్రి ఎస్.జైపాల్ రెడ్డి కూడా ఒకరు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించినప్పటి నుండి పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందే వరకు కూడా కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో అనేక నాటకీయమయిన సంఘటనలు జరిగిన సంగతి ప్రజలందరూ స్వయంగా చూసారు. ముఖ్యంగా బద్ధ శత్రువులయిన కాంగ్రెస్, బీజేపీలు పార్లమెంటు సాక్షిగా ఆడిన రాజకీయ చదరంగం చూసిన ప్రజలు అసలు బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అని ఆఖరి నిమిషం వరకు ఉప్పిరి బిగపట్టి చూశారు.   కాంగ్రెస్, బీజేపీల మధ్య ఎటువంటి అవగాహన కుదిరింది? ముందు బెట్టు చేసిన బీజేపీ ఆఖరు నిమిషంలో మనసు మార్చుకొని బిల్లుకు ఎందుకు మద్దతు ఇచ్చింది? దాని వెనుక సూత్రదారులు, పాత్రదారులు ఎవరెవరున్నారు? ఆంద్ర యంపీలు, కేంద్రమంత్రుల అసలు రూపాలు ఏమిటి? వంటి అనేక ప్రశ్నలు విభజన తరువాత పూర్తిగా మరుగున పడిపోయాయి. ఇప్పుడు కేంద్రంలో, రెండు రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో పుస్తక ప్రియుడయిన జైపాల్ రెడ్డి మళ్ళీ పుస్తక పటనంతో కాలక్షేపం చేస్తున్నారు. ఆయన సన్నిహితుల కోరిక మేరకు జైపాల్ రెడ్డి విభజన బిల్లు ఆమోదం కోసం తెర వెనుక జరిగిన కధని ప్రజల కోసం అక్షరబద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అయితే కొన్ని కారణాల వలన ఆ పుస్తకాన్ని వచ్చే ఏడాది విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. అది విడుదల అయితే ఎన్ని సంచలన విషయాలు బయటపడుతాయో..ఎంతమంది భాగోతాలు బయటపడుతాయో..

కేసీఆర్‌కి షాకిస్తున్న మజ్లిస్

  తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌ పాతబస్తీలో బలంగా వున్న మజ్లిస్ పార్టీతో సీఎం కేసీఆర్ అనుబంధాన్ని పెంచుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు మజ్లిస్ నేతల ఇళ్ళకి వెళ్ళి మరీ స్నేహబంధాన్ని పెరిగేలా చేశారు. మజ్లిస్ నాయకులు గతంలో తెలంగాణ ఏర్పాటునే తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్‌తో చేతులు కలిపి ‘భాయీ భాయీ’ అన్నారు. కేసీఆర్ యుద్ధ ప్రాతిపదికన మజ్లిస్‌తో స్నేహం పెంచుకోవడానికి గల కారణం హైదరాబాద్‌ కార్పొరేషన్ ఎన్నికలలో మెజారిటీ సాధించడం కోసమే అని రాజకీయ పరిశీలకులు అంటూ వుంటారు. హైదరాబాద్‌లో స్థిరపడిపోయిన సీమాంధ్రులు పొరపాటున కూడా టీఆర్ఎస్‌కి ఓటు వేయరు. ఆ లోటును తీర్చుకోవాలంటే ముస్లింలను మంచి చేసుకోవాలన్నది కేసీఆర్ రాజకీయ వ్యూహమని, అందులో భాగంగానే మజ్లిస్‌తో ఫ్రెండ్ షిప్ అని పరిశీలకులు అంటారు. ఎవరు ఏమనుకున్నప్పటికీ గత ఐదు నెలలుగా టీఆర్ఎస్, మజ్లిస్ మధ్య స్నేహం మూడు పువ్వులు - ఆరు కాయలు అన్నట్టుగా వుంది. మజ్లిస్ నేతలు కేసీఆర్ని పల్లెత్తు మాట కూడా అనకుండా చుప్ చాప్‌గా వున్నారు. కేసీఆర్ కూడా ముస్లిం అనుకూల ధోరణిని ప్రదర్శిస్తూ రాబోయే హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో అనుకున్నది సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ దశలోనే కేసీఆర్‌కి మజ్లిస్ నాయకులు షాక్‌లు ఇవ్వడం ప్రారంభించారు.   అయితే కొద్ది రోజులుగా తెలంగాణ ప్రభుత్వ విధానాల మీద మజ్లిస్ నేతలు కామెంట్లు చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కరెంటు సమస్య మీద తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నలతో ముంచెత్తడంతో టీఆర్ఎస్ నాయకులు కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ప్రణాళికల గురించి, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం గురించి, ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ లైన్ల ఏర్పాటు గురించి అక్బరుద్దీన్ ఘాటుగా ప్రశ్నలు సంధించారు. విద్యుత్ కొనుగోలుకు, ప్రాజెక్టుల ఏర్పాటుకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని ఆయన స్పష్టంగా ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ నుంచి మాత్రమే కాకుండా తమ మిత్రపక్షంగా భావిస్తున్న మజ్లిస్ నుంచి కూడా ఈ ప్రశ్నలు రావడం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఊహించని పరిణామం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ కొన్నప్పుడు ఆ ముందు జాగ్రత్త తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకు లేకుండా పోయిందన్న అక్బరుద్దీన్ ప్రశ్నకు సమాధానం దొరకలేదు. దీంతోపాటు మంగళవారం నాడు కూడా కేసీఆర్ ప్రభుత్వం మీద మజ్లిస్ దాడి కొనసాగింది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వే మీద మజ్లిస్ నాయకుడు విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో ఉన్న ఒక్క మిత్రపక్షమూ ఇలా ఎదురుదాడి చేయడంతో కేసీఆర్ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయింది.

విద్యుత్ పై తెలంగాణా శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం

  విద్యుత్ సంక్షోభంపై తెలంగాణా రాష్ట్ర శాసనసభలో ఈరోజు జరిగిన చర్చ ఊహించిన దానికంటే చాలా వేడిగానే సాగింది. ఈ విద్యుత్ సంక్షోభానికి, రైతుల ఆత్మహత్యలకి గత ప్రభుత్వాలదే బాధ్యత అని, కేంద్రం కూడా తెలంగాణాపట్ల కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందనే కేసీఆర్ వాదన ప్రభుత్వాన్ని కాపాడకపోగా ప్రతిపక్ష పార్టీలయిన కాంగ్రెస్, తెదేపా, బీజేపీలను ఏకత్రాటిపైకి తీసుకువచ్చి వారు కలిసికట్టుగా ప్రభుత్వంపై ఎదురుదాడి చేసేందుకు మాత్రం బాగా ఉపయోగపడింది. అదేవిధంగా నానాటికీ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నప్పటికీ గత ఐదు నెలలుగా నిర్లిప్తంగా కూర్చొన్న ప్రభుత్వం, శాసనసభా సమావేశాలు మొదలవుతాయనగా హడావుడిగా డిల్లీ పర్యటనలు, విద్యుత్ ఒప్పందాలు చేసుకొని తమ ప్రయత్నలోపం ఏమీ లేదని వాదించడాన్ని కూడా ప్రతిపక్షాలు తప్పు పట్టాయి. శాసనసభ్యులను మభ్యపెట్టడానికి తప్ప వాటి వల్ల మరే ప్రయోజనమూ లేదని వాదించారు.   మూడేళ్ళ తరువాత నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తామని కేసీఆర్ సభలో చేసిన ప్రతిజ్ఞ వారి వాదనలను బలపరుస్తున్నట్లుగా ఉంది. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఈ సమస్య ఇంత త్వరలో తీరేది కాదని ఆయన చేసిన ప్రతిజ్ఞ స్వయంగా ద్రువీకరించినట్లయింది. కనీసం మూడేళ్ళ తరువాతయినా ఆ హామీ నెరవేర్చడం సాధ్యం కాదని నెరవేరిస్తే, కేసీఆర్ కు తాను స్వయంగా ఇదే సభలో పాలతో అభిషేకం చేస్తానని తెదేపా సభ్యుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి తమ పార్టీ సిద్దంగా ఉందని అన్నారు. కానీ తెదేపా వలననే ఈ సమస్య ఏర్పడిందని కేసీఆర్, హరీష్ రావు, ఈటెల ముగ్గురూ గట్టిగా వాదించడంతో ప్రభుత్వం వారి సహకారం అవసరం లేదని చెప్పకనే చెప్పినట్లయింది.   ఈరోజు సభలో జరిగిన వాదోపవాదాలు విన్నట్లయితే, తెరాస ప్రభుత్వం, ప్రతిపక్షాలు కూడా చాలా గట్టిగా కసరత్తు చేసిందని అర్ధమవుతోంది. ప్రభుత్వం చాలా నిరంకుశధోరణితో వ్యవహరించడాన్ని తప్పుపట్టాయి. తెదేపా, బీజేపీ సభ్యులు ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి, డా. లక్ష్మణ్ తదితరులు తెలంగాణా ప్రభుత్వానికి కేంద్రంతో మాట్లాడేందుకు నామోషీగా ఉంటే తామే స్వయంగా వెళ్లి మాట్లాడి, అవసరమయితే కేంద్రమంత్రులను రాష్ట్రానికి రప్పించి, పరిస్థితులు వివరించి సహాయం కోరుతామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహాయం అందించేందుకు సిద్దంగా ఉన్నప్పటికీ కేసీఆర్ సహాయం తీసుకోకుండా, కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించడాన్ని బీజేపీ సభ్యులు తప్పుపట్టారు.   కేంద్రంతో, పొరుగు రాష్ట్రంతో, ప్రతిపక్షాలతో సక్యంగా ఉంటూ, అందరి సహాయసహకారాలు తీసుకొంటూ సమస్యను అధిగమించేందుకు గట్టిగా కృషి చేయమని చెప్పిన తరువాతనే, కేసీఆర్ కొంత వెనక్కి తగ్గినట్లు కనబడ్డారు. పరిష్కారానికి అందరి సహకారం అవసరమని, తప్పకుండా తీసుకొంటామని, త్వరలోనే తాను స్వయంగా ప్రతిపక్షపార్టీలను డిల్లీకి తీసుకువెళతానని కెసిఆర్ ప్రకటించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా మాట్లాడి వారి సహకారం తీసుకొంటామని కేసీఆర్ తెలిపారు.   సుదీర్ఘ చర్చలు, వాదోపవాదాల తరువాత విద్యుత్ అంశంపై శాసనసభ ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. అందులో విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణా వాటా విద్యుత్ ఇప్పించడానికి కేంద్రమే బాధ్యత తీసుకోవాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన నిరంతరాయ విద్యుత్ పైలట్ ప్రాజెక్టును తెలంగాణా రాష్ట్రానికి కూడా కేటాయించాలని తీర్మానం చేసి ఆమోదించింది.

పోచారం బుక్కైపోయారా?

  అడ్డంగా వాగి బుక్కైపోవడం.. ఆ తర్వాత నాలుక కరుచుకోవడం కొందరు రాజకీయ నాయకులకు అలవాటే. ఏదో మామూలు అంశంపైన మాట్లాడితే ఓకే కానీ సీరియస్ ఇష్యూపైన నోటికొచ్చినట్టు మాట్లాడితే మాత్రం చిక్కుల్లో పడడం ఖాయం. తెలంగాణ మంత్రి పోచారం కూడా ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు చిక్కుల్లో పడిపోయారు.   అసెంబ్లీ నడుస్తున్న కీలక తరుణంలో పోచారం శ్రీనివాసరెడ్డి రైతు ఆత్మహత్యలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్యల వెనక చాలా కారణాలున్నాయంటూ వెటకారంగా మాట్లాడారు. ఇంత సీరియస్ ఇష్యూపైనా వెటకారం అవసరమా? అది కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవమున్నా పోచారం ఇలా మాట్లాడితే దానికి అర్థం ఏముంటుంది? అందుకే అసెంబ్లీలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. పోచారం శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి.   ప్రతిపక్షాల విమర్శలను పక్కనబెడితే ఇప్పుడు సొంత ప్రభుత్వంలోనే పోచారంపై చాలామంది నిప్పులు చెరుగుతున్నారట. సీఎం కేసీఆర్ అయితే పోచారం శ్రీనివాసరెడ్డికి గట్టిగానే క్లాస్ పీకారట. రైతు ఆత్మహత్యలపై ఏం చేయలేక చేతులెత్తేసిన తరుణంలో ఇలాంటి మాటలు అవసరమా? అని సీరియస్ అయ్యారని అధికారపార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మొత్తానికి పోచారం కామెంట్స్ కేసీఆర్ సర్కారును డిఫెన్స్ లో పడేశాయంటున్నారు విశ్లేషకులు.

లోక్ సత్తాలో ఏం జరుగుతోంది?

  అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుంది లోక్ సత్తా పరిస్థితి. ఎందుకనో అనుకున్న స్థాయిలో లోక్ సత్తా ఎదగలేకపోయింది. ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే కూడా ఆ పార్టీకి లేడు. చివరకు జేపీ కూడా దారుణమైన ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ఎన్నికల ముందు టీడీపీతో పొత్తు ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. జేపీ కొంత చొరవ చూపిస్తే ఈ పొత్తు పట్టాలెక్కేదని ఇప్పటికీ చాలామంది చెబుతుంటారు. జేపీ లాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు చట్టసభలో లేకపోవడం దారుణమన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికైనా లోక్ సత్తా విధానాలు మార్చుకోవాల్సిన అవసరమైతే ఖచ్చితంగా ఉంది.   అసలే గడ్డు పరిస్థితి అంటే దీనికి తోడు లోక్ సత్తా కుమ్ములాటలు కూడా పెరిగిపోయాయి. ఏకంగా జేపీనే పార్టీ నేతలు నిలదీసే పరిస్థితి వచ్చింది. మొన్న ఆ మధ్య జేపీని కొందరు బహిరంగంగానే తప్పుబట్టారు. దీంతో ఏం చేయాలో తెలియక ఆయన బిక్కమొహమేశారు. అప్పటికప్పుడు ఎలాగోలా కవర్ చేసుకున్నారు కానీ ఈ ఇష్యూతో ఆయనకు పార్టీపై పట్టు లేదన్న మాట మాత్రం స్పష్టమైపోయిందంటున్నారు పరిశీలకులు.   ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పొత్తులు అనివార్యం. ఏ పార్టీ కూడా సొంతంగా ఎదగలేదు. ఈ చిన్న లాజిక్ కూడా జేపీకి తెలియదా? పార్టీ నేతలకంటే అంత అనుభవం లేదు. వారు పొత్తులు వద్దంటారు. కానీ లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడిగా పార్టీకి ఏది మంచి నిర్ణయమో జేపీకి తెలియకపోతే ఎలా? ఇంకా పాతకాలపు పద్దతులనే ఫాలో అవుతామంటే లోక్ సత్తా ఎదిగేదెప్పుడు? మన దగ్గర ఏ ఆధారం లేనప్పుడు దొరికిన ఏదో ఒక వస్తువును పట్టుకొని పైకొచ్చే ప్రయత్నం చేయాలి. అంతేకానీ దానికి ముక్కు లేదు. మూతి లేదంటూ కూర్చుంటే ఎలా? చివరకు లోక్ సత్తా నేతలే జేపీని నిలదీస్తున్నారంటే ఆ పార్టీలో ఇంటర్నల్ ఏం జరుగుతోంది ఎవరైనా ఊహించుకోవచ్చు.   జేపీకి మంచి పేరుంది. ఇతర పార్టీల నేతలు కూడా ఆయన మంచి గౌరవమిస్తారు. అలాంటి నేత తమతో చట్టసభల్లో కూర్చొని ఉండాల్సిందని ఇప్పటికీ చింతించే ఎమ్మెల్యేలు చాలామంది. కానీ ఏం చేస్తాం? ఎన్నికల్లో ఏదో ఒక పెద్ద పార్టీతో కలిసి పోటీ చేయకపోతే ఎలా గెలుస్తారు? అందుకే ఇప్పటికైనా జేపీ అంతర్మథనం చేసుకోవాలి. పార్టీని బతికించుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే లోక్ సత్తా ఉనికికే ప్రమాదం పొంచి ఉందంటున్నారు విశ్లేషకులు.

ఆంద్ర, తెలంగాణా ముఖ్యమంత్రుల మధ్య ఎంత వ్యత్యాసమో?

  ఈరోజు జరుగుతున్న కొన్ని ఆసక్తికరమయిన పరిణామాలు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ల ఆలోచన తీరులో ఎంత వ్యత్యాసం ఉందో స్పష్టంగా అర్ధమవుతుంది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండి ఇంతవరకు కూడా కేసీఆర్ ఆంధ్రప్రభుత్వం, దాని ముఖ్యమంత్రి చంద్రబాబుపై కత్తులు నూరూతూనే ఉన్నారు తప్ప ఎన్నడూ కూర్చొని చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని భావించలేదు. అందుకు అనేక కారణాలు ఉండవచ్చును. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వాధినేతగా సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవలసి ఉంటుందనే సంగతిని విస్మరించి, ఆయన నిత్యం కయ్యానికే కాలుదువ్వుతున్నారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకొందామని చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు సూచించినప్పటికీ కోర్టుల్లోనే పరిష్కరించుకొందామనుకొంటున్నారు. అనుకోవడమే కాదు ఇప్పటికే అనేక సార్లు కోర్టులకెక్కారు కూడా. ఈసారి కృష్ణానదీ బోర్డుని ఆయన కోర్టుకు ఈడ్చారు. ఆ బోర్డు యాజమాన్యం కూడా ఆంధ్రప్రదేశ్ ఒత్తిళ్లకు లొంగి తమకు అన్యాయం చేసిందంటూ తెలంగాణా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ జస్టిస్ రమణ మరియు ముఖోపాధ్యాయ్ లతో కూడిన ధర్మాసనం ‘నాట్ బిఫోర్’ అనే చిన్న కామెంటుతో తన నిర్ణయాన్ని రిజర్వులో ఉంచడం విశేషం.   కేసీఆర్ ప్రభుత్వం నిత్యం కోర్టుగడపలు ఎక్కి దిగుతుంటే, చంద్రబాబు నాయుడు పొరుగునున్న కర్నాటక రాష్ట్రంలో తుంగభద్రా నది నుండి ఆంధ్రాకు రావలసిన నీళ్ళు తదితర అంశాలపై కర్నాటక ముఖ్యమంత్రితో చర్చించడానికి ఈరోజు బెంగళూరు వెళ్ళారు. వారిరువురూ కూడా చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని భావిస్తున్నందున కోర్టులు, కేసులు అవసరం ఉండవని ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. చంద్రబాబు తన రాష్ట్రానికి రావలసిన నీళ్ళ గురించి పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరకు స్వయంగా వెళ్ళడానికి కూడా నామోషీ పడలేదు. కానీ కేసీఆర్ కి అహం (ఇగో) అడ్డుపడుతుండటంతో చర్చలకు బదులు కోర్టులకి వెళుతున్నట్లున్నారు. గోటితో పోయేదానికి గొడ్డలి వాడటం అంటే ఇదేనేమో? ఆయన తీరు వల్ల వ్యక్తిగతంగా ఆయనకేమీ నష్టం కలగకపోవచ్చునేమో, కానీ తెలంగాణాకి మాత్రం నష్టం కలిగే ప్రమాదం ఉందని చెప్పవచ్చును.

కేసీఆర్ వైఎస్ ను ఫాలో అవుతున్నారా?

  వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ ను బలంగా ప్రయోగించారు. ఇతర పార్టీల్లోని నేతలను కాంగ్రెస్ లోకి లాగడానికి అన్నిరకాలుగా ట్రై చేశారు. నయానో.. భయానో ఎలాగైనా కాంగ్రెస్ లోకి చేర్చుకొని ప్రతిపక్ష పార్టీలను ఇరుకున పెట్టేందుకు గట్టిగా ప్రయత్నం చేశారు. ముఖ్యంగా టీడీపీ నేతలనైతే వైఎస్ ఘోరంగా టార్గెట్ చేశారు. వైఎస్ మాట వినని టీడీపీ నేతలు చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. ఇలాంటి పనులు మంచివి కావని కాంగ్రెస్ నేతలే ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా మొండిగా ముందుకెళ్లారు. ఏకంగా టీడీపీని చీల్చేందుకు కుట్ర చేశారు. కానీ చంద్రబాబు సమర్థత ముందు ఆ కుట్రలు పారలేదనుకోండి... అది వేరే విషయం కానీ ఇప్పుడు తెలంగాణ లో సీఎం కేసీఆర్ కూడా అదే ఆకర్ష్ సిద్ధాంతాన్ని గుడ్డిగా ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది.   తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి సరిపడా మెజార్టీ ఉంది. చంద్రబాబులో పెద్ద మెజార్టీ కాకపోయినా సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేదు. అయినా సీఎం కేసీఆర్ మాత్రం కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఇతర పార్టీలకు చెందిన నేతలు.. ముఖ్యంగా ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారు. నయానో భయానో టీఆర్ఎస్ లోకి లాగేందుకు ట్రై చేస్తున్నారు. కారు ఎక్కకపోతే నియోజకవర్గానికి నిధులిచ్చేది లేదని ఇతర పార్టీల ఎమ్మెల్యేలను భయపెడుతున్నారని చెప్పుకుంటున్నారు. దీంతో విధి లేని పరిస్థితుల్లో చాలామంది తమకు ఇష్టం లేకపోయినా టీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఇప్పటికి ఇలా చాలామంది ఎమ్మెల్యేలు గులాబీదళంలోకి వచ్చారు. అయినా సీఎం కేసీఆర్ వెనక్కు తగ్గడం లేదు. ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచుతున్నారట. ఎలాగైనా టీఆర్ఎస్ లోకి వచ్చేయాలని గట్టిగా చెబుతున్నారట. అధికారపార్టీ నుంచి ఈరేంజ్ లో బెదిరింపులు రావడం గతంలో ఎప్పుడూ వినలేదని టీడీపీ ఎమ్మెల్యేలు వాపోతున్నారు.   తలసాని, తీగల వంటి నేతలు టీడీపీకి రాజీనామా చేశారు. కానీ వారు మాత్రం తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. ఒకపార్టీకి రాజీనామా చేసి అదే పార్టీ తరపున ఎమ్మెల్యేగా కొనసాగడం దేనికి సంకేతం? మాటల తూటాలతో విరుచుకుపడే కేసీఆర్ దీనికి ఏం సమాధానం చెబుతారు? తెలంగాణలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి, క్రిష్ణయ్య లాంటి ఉద్దండులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇలాంటి టైమ్ లో టీడీపీకి మంచి భవిష్యత్తు ఉంది. అందుకే టీడీపీ మరింత ఎదగకుండా కావాలనే సీఎం కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రయోగిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు వల వేయడం మాని పాలనపై ఫోకస్ చేయాలని సూచిస్తున్నాయి.

అల్లుడి పనైపోయిందా?

  అత్త సొమ్ము అల్లుడికి దానమిచ్చినట్టు రాబర్ట్ వాద్రాకు అప్పనంగా భూములు కట్టబెట్టారని అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. అయ్యగారు సోనియా అల్లుడు కాబట్టి తెర వెనక ఇదంతా జరిగే ఉంటుందని జోరుగా ప్రచారం జరిగింది. ఈ కథ ఇలా ఉంచితే అప్పట్లో అంటే కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉండగా... హర్యానా, రాజస్థాన్ లో సారు మొత్తం 6 కంపెనీలు పెట్టారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారం కోల్పోగానే ఆ 6 కంపెనీల్లో 4 దివాళా తీశాయి. అదేంటి హస్తం పవర్ కోల్పోతే అల్లుడు దివాళా తీయడమేంటో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఆ 4 కంపెనీల్లో చాలా రోజులుగా ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేదట. పోనీ ఏమైనా చేద్దామంటే వాద్రా వల్ల కావడం లేదు. ఈ పరిస్థితుల్లో మారు మాట్లాడకుండా 4 కంపెనీలను మూసివేసి ఉద్యోగులను నట్టేట ముంచారు. ఇక ప్రస్తుతానికి ఉన్న కంపెనీలు రెండే. అవి ఉంటాయో ఊడుతాయో క్లారిటీ లేదు. దీనికి తోడు హర్యానా, రాజస్థాన్ లతో రెండు చోట్ల ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. దీంతో వాద్రాకు భయం పట్టుకుందట. అటు బీజేపీ నేతలు కూడా వాద్రాను షాడోలా వెంటాడుతున్నారట. అయ్యగారి అవినీతిని బట్టబయలు చేసేందుకు కంకణం కట్టుకున్నారట. ఇప్పటికే సారు గురించి రహస్యాలను వెలికి తీసే పనిలో ఉన్నారట కొంతమంది బీజేపీ లీడర్లు. పక్కా ఆధారాలు కూడా దొరికాయట. కేవలం టైమ్ కోసమే చూస్తున్నారట. ఒక్కసారి ముహూర్తం కుదిరితే చాలు వాద్రాకు కంటిమీద కునుకు కూడా కష్టమేనంటున్నారు పరిశీలకులు. అదే జరిగితే సోనియా ఫ్యామిలీ ఎలా స్పందిస్తో? అయినా ఆమె కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎలాగూ పవర్ లో లేరు. మా అల్లుడు వెరీగుడ్ అని చెప్పుకోవడానికి ఆమె ఎంత ప్రయత్నించినా వాద్రాను కాపాడుకోవడం కష్టమేనంటున్నారు పరిశీలకులు. ఈ దెబ్బతో చివరకు రాజస్థాన్, హర్యానాల్లోని కాంగ్రెస్ పెద్దలు కొంతమంది సోనియాగాంధీ ఫ్యామిలీతో డిస్టన్స్ మెయింటెయిన్ చేస్తున్నారట. ఎందుకంటే వాద్రా ఇష్యూ అటు తిరిగి ఇటు తిరిగి తమకు ఎక్కడ బ్యాడ్ టైమ్ తెస్తుందోనని వాళ్ల భయం. అంతే లే మరి ఎవరి భయం వారిది. పాలిటిక్స్ లో ఉండాలంటే ముందు క్లీన్ ఇమేజ్ కూడా ముఖ్యమే కదా..

రాజధానిపై విషప్రచారం నమ్మొద్దు...

  ఏదైనా విషయంలో అనుమానమొస్తే .. క్లారిటీ ఇవ్వడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా. ఎందుకంటే రాజధాని నిర్మాణానికి అవసరమైన భూముల విషయంలో కొంత గందరగోళం నెలకొంది. రైతుల భూములను లాక్కుంటున్నారంటూ కొన్ని పార్టీలు అపోహలు క్రియేట్ చేశాయి. భూములు ఇస్తే దానికి సరిపడా ప్రతిఫలం ఇస్తామని చంద్రబాబు సర్కారు కుండబద్దలు కొట్టినా వినకుండా కొందరు విషప్రచారం చేశారు. ఏదో జరిగిపోతుందంటూ బురదజల్లేప్రయత్నం చేశారు. కానీ వాటన్నంటిని చంద్రబాబు పటాపంచలు చేశారు. భూములను కోల్పోయే రైతులు ఏమాత్రం భయపడొద్దని భరోసా ఇచ్చారు. ఒక ముఖ్యమంత్రిగా అన్నదాతలకు ఏం చేయాలో అన్ని చేసి చూపిస్తానని మాట ఇచ్చారు.   రాజధానిపై చెప్పుడు మాటలు వినొద్దని చంద్రబాబు సూచించారు. రాజధాని ప్రాంతంలో భూములు కోల్పోయే రైతులకు ఏడాదిలోపు ధ్రువపత్రాలిస్తామని హామీ ఇచ్చారు. అందరికీ న్యాయం చేస్తానని స్పష్టం చేశారాయన. జీవితకాలంలో ఒక్కసారే ఇలాంటి మంచి ఛాన్సు వస్తుందని... మిస్ చేసుకోవద్దని కూడా అప్పీల్ చేశారు. రాజధాని ప్రాంత రైతులను అన్నివిధాలా పైకి తేవడమే తన సంకల్పమని స్పష్టం చేశారాయన. అంతేకాదు రాజధానికి భూములిచ్చే రైతులకు ఎక్కడో మూల భూమి ఇవ్వకుండా.. మంచి డిమాండ్ ఉన్న చోటే ఇచ్చేందుకు ప్లాన్ జరుగుతోందట.   నిజానికి రాజధాని ప్రాంత రైతులకు పెద్ద లాభమే కలగనుంది. భూమి కోల్పోయే రైతులకు కొంత భూమితో పాటు పరిహారం.. ఇలా ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారు. రాజధాని రాకతో భూముల విలువ పెరుగుతుంది. దానికి తోడు ప్రభుత్వం నుంచి తగిన సహకారం కూడా ఉంటుంది కాబట్టి భవిష్యత్తుకు ఢోకా ఉండదు.   రాజధాని అంటే అదేదో ఆషామాషీగా కాకుండా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు. ఛండీగఢ్, ఢిల్లీ నగరాలను ఆదర్శంగా తీసుకుంటున్నారు. అలాగే నయా రాయపూర్ నమూనాపై స్టడీ చేశారు. రాబోయే తరాలు గుర్తుంచునేలా కనివినీ ఎరుగని రీతిలో క్యాపిటల్ సిటీని కట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా మురికివాడలు లేని... అంతర్జాతీయ నగరాన్ని నిర్మించేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. స్మార్ట్ సిటీగా హైఫై రేంజ్ లో ఉండేలా వర్కవుట్ జరుగుతోంది. హైటెక్ సిటీతో వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందిన చంద్రబాబు... ఇప్పుడు ఏపీ రాజధానిని కూడా అదేరేంజ్‌లో కట్టబోతున్నారు. రాజధాని నిర్మాణంలో బాబుకు ఉన్న అనుభవం కూడా కీలకం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

శివసేన సెల్ఫ్ గోల్

  శివసేనకు మహారాష్ట్రలో బలమైన క్యాడర్ ఉంది. బీజేపీకి బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్న శివసేన కు హఠాత్తుగా ఏమైందో ఏమో... అన్నీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పుకుంటున్నారు జనాలు. లేకపోతే బాల్ థాకరే ఉన్నప్పుడు ఎంత అటాకింగ్ గా ఉండేది. స్కెచ్చ్ వేస్తే అనుకున్నది జరిగిపోయేది. అంత కరెక్టుగా ఉండేది బాల్ థాకరే ఉన్నప్పుడు. గతంలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ కు దీటైన పార్టీగా పేరు తెచ్చుకుంది. పాపం పెద్దాయన తర్వాత ఇప్పుడు పార్టీ కష్టాల సుడిగుండంలో చిక్కుకుంది. మోడీ పవనాలు దేశంలో వీస్తున్నాయని తెలిసి కూడా ఉద్ధవ్ థాకరే ఎన్నికలకు ముందే పప్పులో కాలేశారు. బీజేపీ జాతీయ నేతలే ఎంత నచ్చజెప్పినా వినకుండా స్థానాల విషయంలో అనవసరంగా తెగేదాకా లాగారు. ఒంటరిగా పోయి బొక్క బోల్తా పడ్డారు. చెప్పుకోదగ్గ స్థానాలు సాధించలేక చతికిలపడ్డారు. పోనీ అప్పుడైనా తప్పును సవరించుకునే అవకాశం చిక్కింది శివసేనకు. ఎంచక్కా బీజేపీకి మద్దతిచ్చి మహారాష్ట్రలో మంత్రివర్గంలో చేరే ఛాన్సొస్సింది. దాన్ని కూడా మిస్ చేసుకున్నారు. ఎందుకంటే దానికి బలమైన కారణాలు లేవు. రాజకీయాల్లో తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లంటే కుదరదన్న విషయం ఇంకా ఉద్ధవ్ కు తెలిసినట్టు లేదు. పోనీ ఇప్పుడు అద్వానీ లాంటి అగ్రనేతలు జోక్యం చేసుకుంటామంటున్నా పెద్దగా స్పందించడం లేదట. అటు మంత్రివర్గంలో చేరక... బీజేపీకి సపోర్టు ఇవ్వక ఏం చేయాలనుకుంటున్నారో శివసేన నేతలు. పోనీ కేంద్రమంత్రివర్గంలో చేరే బంపర్ ఆఫర్ ఇచ్చారు మోడీ. దాన్ని కూడా మిస్ చేసుకున్నారు. చివరకు చేసేది లేక బీజేపీ శివసేనకు కటీఫ్ చెప్పాలని నిర్ణయించుకుందని సమాచారం. అదే జరిగితే నష్టం శివసేనకే తప్ప బీజేపీకి కాదంటున్నారు విశ్లేషకులు. ఆకు వెళ్లి ముల్లు మీద పడ్డా.. ముల్లు వెళ్లి ఆకు మీద పడ్డా నష్టం ఆకుకే తప్ప ముల్లుకు కాదనే విషయం ఇంకా ఉద్ధవ్ థాకరేకు అర్థం కాకపోవడం ... శివసేన నేతలనే విస్మయానికి గురిచేస్తోందట. బీజేపీని దూరం చేసుకోవడమంటే ఖచ్చితంగా సెల్ఫ్ గోలేనంటున్నారు పరిశీలకులు.

సుజనా చౌదరి: విధేయతకు పట్టం

  రాజకీయాల్లో విధేయత, కష్టపడేతత్వం ఉన్న నేతలు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారే ఉన్నత స్థానానికి వెళ్లగలుగుతారు. లీడర్లు ఎంతమంది ఉన్నా వారికుండే గుర్తింపు వారికుంటుంది. అలాంటి వారిలో ఒకరు సుజనా చౌదరి. టీడీపీకి కష్టకాలంలో ఎంతో అండగా నిలిచిన వ్యక్తుల్లో సుజనా చౌదరి ఒకరు. పార్టీకి సంబంధించిన పలు వ్యవహారాల్లో కీ రోల్ పోషించారాయన. చంద్రబాబుకు వెన్నుదన్నుగా ఉంటూ మంచి వ్యూహకర్తగా పేరుపొందారు. టీడీపీ డెవలప్ మెంట్ కోసం అనుక్షణం తపించే ఈ స్వభావమే ఆయనను బాబుకు దగ్గర చూసింది. అందుకే టీడీపీ రాజ్యసభ కోసం ఎంతో పోటీ ఉన్నా... వారందరినీ కాదని మరీ సుజనాకు ఎంపీ సీటిచ్చి గౌరవించారు చంద్రబాబు. ఆ తర్వాత ఎన్నికల సమయంలోనూ సుజనా అమూల్యమైన సేవలందించారు. పార్టీ అభ్యర్థుల ఎంపికతో పాటు పలు వ్యవహారాలను చూశారు. ముఖ్యంగా టీడీపీ, బీజేపీ పొత్తు ఉండాల్సిందేనని మొదటి నుంచి పట్టుబట్టిన నేతల్లో ఈయన కూడా ఒకరు. స్టేట్ డెవలప్ మెంట్ జరగాలంటే కేంద్రం సహకారం కాబట్టి... బీజేపీతో అలయన్స్ ఉండాల్సిందేనని చంద్రబాబుకు ముందు నుంచి చెబుతూ వచ్చారు. అనుకున్నట్టే పొత్తు కుదిరింది... కేంద్రంలో మోడీ సర్కార్ వచ్చింది. టీడీపీ మిత్రపక్షం కాబట్టి కేంద్ర మంత్రివర్గంలో సుజనాకు మొదటి విస్తరణలోనే పదవిఖాయం అనుకున్నారంతా. కానీ సామాజిక సమీకరణల్లో ఆయన పేరు మిస్సయ్యింది. అయినా ఏం ఆందోళన అవసరం లేదని ... మలి విస్తరణలో చోటు కంపల్సరీ అని చంద్రబాబే స్వయంగా సుజనాకు అభయమిచ్చారట. అనుకున్నట్టే పునర్ వ్యవస్థీకరణలో బాబు ఆయన పేరును రికమెండ్ చేశారు. మోడీ ఓకే చెప్పేశారు. సుజనా కేంద్రమంత్రి అయ్యారు. విధేయత కలిసొచ్చింది. హార్డ్ వర్క్ ఫలితాన్నిచ్చింది. మొత్తానికి పార్టీకి ఆయన చేసిన సేవే.. ఆయన్ను కేంద్రమంత్రిని చేసిందంటున్నారు విశ్లేషకులు. సుజనాకు కేంద్రమంత్రి ఛాన్స్ ఇవ్వడం ఎంతో సముచితమంటూ... చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తెలంగాణా జేయేసీ తన ఉనికి కాపాడుకోగలదా?

  ఒకానొక సమయంలో తెలంగాణా ఉద్యమాలలో చాలా చురుకుగా పాల్గొని, కీలక పాత్ర పోషించిన తెలంగాణా జేయేసీ, రాష్ట్ర విభజన తరువాత తెలంగాణా పునర్నిర్మాణంలో చురుకుగా పాల్గొంటానని ప్రకటించింది. తెరాసతో కలిసి పనిచేసినప్పటికీ తెరాస ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తే గట్టిగా నిలదీస్తానని కూడా చెప్పింది. కానీ ఈ ఐదు నెలల కాలంలో తెరాస ప్రభుత్వం చాలా బలపడి, ప్రతిపక్షాలను, ఆంధ్ర, కేంద్రప్రభుత్వాలని కూడా చాలా ధీటుగా ఎదుర్కొంటూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తుండటంతో క్రమంగా టీ- జేయేసీ తన ఉనికిని కోల్పోసాగింది. నిజానికి టీ- జేయేసీని కేవలం తెలంగాణా సాధన కోసమే ఏర్పాటు చేసినప్పుడు, రాష్ట్రం ఏర్పడగానే పూర్తిగా రద్దు చేసి ఉండి ఉంటే చాలా గౌరవప్రదంగా ఉండేది. కానీ చేయలేదు. అటువంటప్పుడు నీళ్ళు, విద్యుత్ తదితర అంశాలపై తెలంగాణా ప్రభుత్వం పొరుగు రాష్ట్రంతో చేస్తున్న యుద్దాలు, రాష్ట్రాన్ని కుదిపివేస్తున్న విద్యుత్ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, విద్యార్ధుల ఫీజు రీ ఇంబర్సుమెంటు, కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్ వంటి అనేక సమస్యలపై మాట్లాడి ఉండాలి. కానీ నోరు మెదపకుండా మౌనం వహించింది. చివరికి తెలంగాణా ప్రభుత్వం కేవలం 453 మందిని మాత్రమే అమరవీరులుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించినపుడు, టీ- జేయేసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, తన వద్ద అమరవీరుల జాబితా ఉందని దానిని ప్రభుత్వానికి అందజేస్తానని అన్నారు. ఆయన ఆ జాబితాను ప్రభుత్వానికి అందజేసినట్లయితే, ప్రభుత్వం కేవలం తను గుర్తించి అమరవీరుల కుటుంబాలకు మాత్రమే పరిహారం మంజూరు చేస్తున్నప్పుడయినా మిగిలిన వారి కుటుంబాలకు కూడా తప్పనిసరిగా పరిహారం ఇచ్చితీరాలని టీ- జేయేసీ ప్రభుత్వాన్ని గట్టిగా అడగలేకపోయింది ఎందుకో. ఇక రాష్ట్ర పునర్ణిర్మాణంలో పాల్గోవడం సరేసరి.   బహుశః ఆవిధంగా చేసినట్లయితే సమాంతర ప్రభుత్వం నడుపుతున్నామనే విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందనే భయమో లేకపోతే కేంద్రప్రభుత్వంతోనే యుద్ధం చేయడానికి వెనకాడని కేసీఆర్ తో పెట్టుకొంటే తట్టుకోలేమనే భయమో లేకపోతే కొత్తగా ఏర్పడిన తెలంగాణా ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి చూడాలనే ఆలోచనతోనో తెలియదు కానీ టీ- జేయేసీ ఇంతవరకు మౌనం వహించి ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. అందువల్లే ప్రజలు కూడా దానిని పట్టించుకోవడం మానివేశారు.   ఈ పరిస్థితుల్లో మళ్ళీ చాలా రోజుల తరువాత ఈ రోజు టీ-జేయేసీ స్టీరింగ్ కమిటీ హైదరాబాద్ లో సమావేశమవుతోంది. ఈ సమావేశంలో పైన పేర్కొన్న అన్ని సమస్యలపై చర్చిస్తారని సమాచారం. అందువలన ఈ సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉందని భావించవచ్చును. ఒకవేళ ఇక నుండి తాము కూడా తెలంగాణా ప్రభుత్వాన్ని నిలదీయాలని టీ-జేయేసీ నిర్ణయించుకొంటే, ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమయిన పరిస్థితులు ఏర్పడతాయి. అదే టీ-జేయేసీ ప్రభుత్వానికి అండగా నిలబడి దానిని వెనకేసుకొని వస్తూ మాట్లాడే ప్రయత్నం చేసినట్లయితే, ఇప్పటికే క్రమంగా తన ఉనికిని కోల్పోపోతున్న టీ-జేయేసీ పూర్తిగా తన ఉనికిని పోగొట్టుకొంటుంది.   అందువలన ఈ సమావేశంలో టీ-జేయేసీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతోందనే దానిపైనే దాని భవితవ్యం ఆధారపడి ఉంటుందని భావించవచ్చును. అయితే కేసీఆర్ తో కత్తులు దూసి ఇబ్బందులు పడటంకంటే, మౌనం వహించడమే మేలని భావించినట్లయితే, తెలంగాణా ప్రభుత్వానికి శ్రేయోభిలాషిగా ఏవో కొన్ని సలహాలు ఇచ్చి చేతులు దులుపుకొన్నా ఆశ్చర్యం లేదు.

రామచంద్రయ్య తిక్క కుదిరింది!

  ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా వుందంటే, ఆ పార్టీ నాయకులు జనాల్లోకి వెళ్తే పట్టించుకునేవారే లేకుండా పోయారు. కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశం ప్రభుత్వం మీద ఏవైనా విమర్శలు చేసినా ప్రజలు వాటిని ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నారు. రాష్ట్రాన్ని దారుణంగా విభజించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి మాట్లాడే కనీస హక్కు కూడా లేదని ప్రజలు నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా వున్నప్పటికీ కాంగ్రెస్ నాయకులు జనంలోకి వెళ్ళి నోటికొచ్చినట్టు మాట్లాడి అవమానాల పాలు అవుతూనే వున్నారు. ప్రజలు ఛీ కొడుతున్నా ఎంతమాత్రం సిగ్గుపడకుండా జనంలోకి వెళ్తూ భంగపడుతూనే వున్నారు. ఇలా భంగపడే సీన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య విషయంలో జరిగింది.   ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చదిద్దడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. రాజధాని కోసం విజయవాడ సమీపంలోని 18 గ్రామాలలో భూ సమీకరణ కోసం మంచి ప్రతిపాదనలను కూడా స్థానిక ప్రజలు, రైతుల ముందు వుంచింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించకుండా చేయాలని, స్థానికులు ప్రభుత్వానికి ఎదురు తిరగాలని ఒకవైపు వైసీపీ నాయకులు, మరోవైపు కాంగ్రెస్ నాయకులు శాయశక్తులా కృషి చేస్తున్నారు. భూ సమీకరణ విషయంలో ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టి తమ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకునే కుట్రలు ఆ ప్రాంతంలో నిర్విరామంగా జరుగుతూ వున్నాయి. ఈ కుట్రలో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు గ్రామానికి శనివారం నాడు వెళ్ళారు. అక్కడ ఓ ప్రెస్ మీట్ పెట్టి భూ సమీకరణ ద్వారా తెలుగుదేశ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని, రైతులు ప్రభుత్వం మీద తిరగబడాలని, రాజధాని కోసం భూములు ఇవ్వకూడదని చెప్పడం మొదలుపెట్టారు. ఈయనగారి మాటలు విని స్థానిక రైతులకు ఆవేశం ముంచుకొచ్చింది. అందరూ ఒక్కసారిగా రామచంద్రయ్య మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకు ఎంతమాత్రం లేదని ఆయన ముఖం మీదే చెప్పేశారు. కొందరు రైతులైతే రామచంద్రయ్య మీదకి ఆగ్రహంగా వెళ్ళబోతే పోలీసులు జోక్యం చేసుకుని రామచంద్రయ్యని రక్షించారు.   ఈ సందర్భంగా తుళ్ళూరు ప్రాంత రైతులు మాట్లాడుతూ, రాజధాని నిర్మాణం విషయంలో ప్రభుత్వానికి సహకరించడానికి తాము సిద్ధంగా వున్నామని, భూములను అప్పగించే విషయంలో ప్రభుత్వంతో తాము చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వస్తామని చెప్పారు. దుర్మార్గంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు దుష్టబుద్ధితో ఇక్కడకి వచ్చి ఇక్కడి రైతుల మనసులలో విషాన్ని నింపే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇలాంటి పనులను తాము ఎంతమాత్రం సహించబోమని అన్నారు. అలాంటి ప్రయత్నం చేసినందుకే రామచంద్రయ్య మీద తాము తిరగబడ్డామని వారు చెప్పారు. దయచేసి ప్రతిపక్ష నాయకులు ఇప్పటికైనా ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలను నడపకుండా రాజధాని నిర్మాణం విషయంలో హుందాగా వ్యవహరిస్తే మంచిదని సూచించారు. ఏవండీ ఎమ్మల్సీ రామచంద్రయ్యగారూ... తుళ్ళూరు రైతుల ఆగ్రహాన్ని ప్రత్యక్షంగా చూశారుగా... తిక్క కుదిరింది కదూ!?