తెలంగాణలో పరిశ్రమల భవిష్యత్తు ప్రశ్నార్థకం

  ఎన్నెన్నో ఊహలతో, ఎన్నెన్నో ఆశలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు ఆ ఊహలు దూది పింజల్లా తేలిపోతున్నాయి. ఆ ఆశలు ఆవిరైపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పడి ఆర్నెల్లు కూడా గడవకముందే అన్ని రంగాల్లో అయోమయ పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వ్యాపార, పారిశ్రామికరంగాలలో అయితే ఈ పరిస్థితి మరింత తీవ్రంగా వుంది. ఈ రెండు రంగాలకూ తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు మీద ఉన్న అంచనాలు మెల్లగా పట్టు సడలుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా వెనుకబాటు దిశగా వెళ్తోన్న సంకేతాలు పొడచూపినప్పటికీ ఎవరూ ఈ అనుమానాన్ని బయటకి వ్యక్తం చేయలేదు. అయితే సాక్షాత్తూ తెలంగాణ ప్రభుత్వమే ఆర్థిక సంఘానికి రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడే ప్రమాదం వుందని చెప్పుకోవడంతో ఇప్పుడు అందరికీ ‘క్లారిటీ’ వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత అనేక వ్యాపార సంస్థలు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళిపోయాయని తెలంగాణ ప్రభుత్వమే ఆర్థిక సంఘం దగ్గర చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం సదరు వ్యాపార సంస్థల సంఖ్య వందల్లో వుంటాయని చెప్పినప్పటికీ, వాస్తవంగా చూస్తే ఆ సంఖ్య వేలకు చేరింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళిపోయిన వ్యాపార సంస్థల సంఖ్య మూడువేలను దాటుతోందని తెలంగాణ ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో మరికొన్ని వ్యాపార సంస్థలు తెలంగాణలోంచి జెండా పీకేసి ఆంధ్రప్రదేశ్‌లో పాతే అవకాశం వుందని కూడా అంటున్నాయి.   ఎల్ అండ్ టీ లాంటి అంతర్జాతీయ సంస్థ, జీఎమ్మార్ లాంటి జాతీయ స్థాయి సంస్థ కూడా తెలంగాణలో వ్యాపార కార్యక్రమాలు నిర్వహించడంలో అంత సంతృప్తిగా లేవని తెలుస్తోంది. ముఖ్యంగా మెట్రోరైలు వ్యవహారంలో కేసీఆర్ ప్రభుత్వం పెట్టిన మెలికలకు విసిగిపోయిన ఎల్ అండ్ టీ సంస్థ ఒక దశలో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటానని కూడా లేఖ రాసేసింది. అలాగే తెలంగాణలో అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు అనేక రహదారులను నిర్వహిస్తున్న జీఎంఆర్ సంస్థ రాష్ట్ర విభజన తర్వాత తమ రాబడులు తీవ్రంగా తగ్గిపోయాయని ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఈ ఆదాయం మరింత తగ్గే ప్రమాదం ఉందని భయపడుతున్నట్టు సమాచారం. దిగ్గజాల్లాంటి ఈ రెండు సంస్థలు రాష్ట్ర విభజన తర్వాత ఎదుర్కొంటున్న పరిస్థితులు తెలంగాణ రాష్ట్రానికి రావాలని అనుకునే ఇతర వ్యాపార సంస్థల మీద తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం వుందని పరిశీలకులు భావిస్తున్నారు.   ఇప్పటికే ఉన్న సమస్యలకు తోడు తెలంగాణ రాష్ట్రాన్ని కరెంటు సమస్య తీవ్రంగా వేధిస్తూ వుండటం కూడా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి ప్రశ్నార్థకంలో పడింది. ఇంకా వర్షాకాలం వుండగానే, విద్యుత్ ఉత్పత్తి బాగా జరుగుతూ వుండగానే తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడే ప్రకటించక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరి వేసవిలో కరెంటు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే పారిశ్రామిక వర్గాలు భయపడుతున్నాయి. ఇంకో మూడు నాలుగేళ్ళపాటు కరెంటు కష్టాలు ఇలాగే వుంటాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంగా ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో కరెంటు పుష్కలంగా లభించే ఆంధ్రప్రదేశ్‌కు వెళ్ళిపోవడం మంచిదన్న అభిప్రాయం పారిశ్రామికవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇలాంటి కరెంటు కష్టాలున్న తెలంగాణకు కొత్త పరిశ్రమలు రావడం అనేది ఎంతవరకు సాధ్యమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అటు వ్యాపారవర్గాల్లో, ఇటు పారిశ్రామిక వర్గాల్లో రోజు రోజుకూ పెరుగుతున్న భయాన్ని పోగొట్టాల్సిన అవసరం వుంది.

తెలంగాణపైకి దూసుకు రానున్న జగనన్న బాణం

  వైకాపా తెలంగాణా పునః ప్రవేశం ఖరారయిపోయింది. ఊహించినట్లే తెలంగాణపైకి జగనన్న బాణం షర్మిల త్వరలో రివ్వున దూసుకురాబోతోంది. ఈరోజు హైదరాబాదులో జరుగుతున్న పార్టీ తెలంగాణా నేతల విస్త్రుత స్థాయి సమావేశంలో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి యంపీ పొంగులేటిని తెలంగాణాలో పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. అయితే షర్మిలే పార్టీకి సారధ్యం వహిస్తారు. అంతే కాదు తెలంగాణాలో జగన్మోహన్ రెడ్డి ఓదార్చలేకపోయిన వారినందరినీ ఆయన తరపున ఆమె ఓదారుస్తారు. వైకాపా తరపున తెరాసపై ఆమే తొలి బాణం ఎక్కుపెట్టారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో తెరాస కనబడకుండా పోతుందని అన్నారు.   సమావేశంలో పాల్గొన్న పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ, “ప్రజల తరపున పోరాడేందుకు గుండె నిండా ఎంతో దైర్యం ఉండాలి. అప్పుడే వాడు నాయకుదనిపించు కొంటాడు. సినిమాలలో చివరి వరకు విలన్ చాలా బలంగా, గొప్పగా కనిపిస్తాడు. కానీ చివరికి హీరో చేతుల్లో చావు దెబ్బలు తింటాడు. అలాగే మన వై.యస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా రెండు రాష్ట్రాలలో ఇప్పుడు బలహీనంగా కనిపించవచ్చును. ప్రత్యర్ధ పార్టీలు చాలా బలంగా కనిపించవచ్చును. కానీ వచ్చే ఎన్నికలలో మనమే విజయం సాధిస్తామనే నమ్మకం నాకుంది. ఎందుకంటే ప్రజల తరపున మనం పోరాడుతున్నాము కనుక ప్రజలు ఎప్పుడూ మనతోనే ఉంటారు. ఆవిషయం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి మరణంతో రుజువయింది. ఆయన చనిపోయినప్పుడు ఆ వార్త విని తట్టుకోలేక చాలా మంది ప్రజలు ప్రాణాలు విడిచారు. తెలంగాణాలో కూడా చాలామంది ప్రజలు మరణించారు. కానీ దురదృష్టవశాత్తు వారినందరినీ నేను ఓదార్చలేకపోయాను. ఇప్పుడు ఆ బాధ్యతా షర్మిల తీసుకొంటుంది. ఆమె నా తరపున ఇంటింటికీ వెళ్లి అందరినీ ఓదార్చుతుంది."   “ప్రజల కోసం పోరాడేందుకు మనం ఉన్నామని గుర్తు చేయడానికి మన పార్టీ జెండా తెలంగాణా అంతటా రెపరెపలాడాలి. ప్రజలందరూ మన వెంటే ఉన్నారు. మనమందరం కలిసికట్టుగా పనిచేసినట్లయితే వచ్చే ఎన్నికలలో మనదే విజయం. తెలంగాణాలో చివరికి కేవలం కాంగ్రెస్, వై.యస్సార్ కాంగ్రెస్, బీజేపీలు మాత్రమే మిగిలి ఉంటాయి. మిగిలిన పార్టీలన్నీ కనబడకుండా పోతాయి,” అని జగన్మోహన్ రెడ్డి అన్నారు.

కేసీఆర్ పై నారా లోకేష్ విమర్శలు

  నారా లోకేష్ ప్రత్యక్ష రాజకీయాలలోకి రాకపోయినా ఇరు రాష్ట్రాలలో, దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను చాలా నిశితంగా గమనిస్తూ, అవసరమయినప్పుడు ప్రత్యర్ధ పార్టీల నేతలపై ట్వీటర్-అస్త్రాలను ఎక్కుబెడుతుంటారు. “తెలంగాణాలో కరెంటు కష్టాలకు చంద్రబాబే కారణమని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విమర్శలకు బదులిస్తూ, తెలంగాణాలో నీళ్ళు లేవు...కరెంటు లేదు..ఉద్యోగాలు లేవు...రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. అయినప్పటికీ ఆయన అన్నిటికీ చంద్రబాబు నాయుడునే నిందిస్తుంటారు. బహుశః అభివృద్ధిలో చంద్రబాబుతో పోటీపడలేకనే విమర్శలు చేస్తున్నారేమో?” అని ట్వీట్ చేసారు.   ఎన్నికల సమయంలో తమ పార్టీని గెలిపిస్తే తెలంగాణాను ‘బంగారు తెలంగాణా’గా మార్చేస్తామని హామీలు గుప్పించిన కేసీఆర్, ఇప్పుడు సర్వరోగ నివారిణి అన్నట్లు, ప్రతీదానికి గత ప్రభుత్వాలను నిందించడం అలవాటుగా మార్చుకొన్నారు. ఒకవేళ గత ప్రభుత్వాలు తప్పులు చేసి ఉండి ఉంటే, వాటిని సరిదిద్ది బంగారి తెలంగాణా సృష్టించేందుకు కృషి చేయాలి కానీ నిత్యం అదేపనిగా గత ప్రభుత్వాలు తప్పులు నెమరు వేసుకోవడం వలన రాష్ట్ర పరిస్థితుల్లో మార్పు కనబడదు.   నిజానికి ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణా రాష్ట్రం ఇప్పుడు చాలా విషయాలలో బలంగా ఉంది. అయినప్పటికీ ఈ నాలుగు నెలలలో ఆశించినంత గొప్ప మార్పులు కనబడలేదు. పైగా ప్రస్తుత కరెంటు కష్టాలు తీరాలంటే మరో మూడేళ్ళు పడుతుందని స్వయంగా కేసీఆరే చెపుతున్నారు. కరెంటు కొరత వేదిస్తున్నప్పుడు పరిశ్రమలు పెట్టుబడులను ఆకర్షించడం కూడా చాలా కష్టమవుతుంది. అంటే ముందుగా కరెంటు సమస్యలు తీరితే తప్ప అభివృద్ధిలో ఆంధ్రాతో పోటీ పడటం సాధ్యం కాదని స్పష్టమవుతోంది.   తెలంగాణాతో పోలిస్తే చాలా సమస్యలను ఎదుర్కొంటున్న ఆంద్రప్రదేశ్ మాత్రం భవిష్యత్ పై చాలా ఆశాజనకంగా ఉండటం అందరూ గమనిస్తూనే ఉన్నారు. అందుకు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీక్షాదక్షతల మీద ప్రజలకున్న నమ్మకమేనని చెప్పవచ్చును. వారి అంచనాలను నిజం చేస్తున్నట్లు, అధికారం చేప్పట్టిన మూడు నెలలలోనే రాష్ట్రాన్ని కరెంటు కోతల నుండి విముక్తి చేసారు. కానీ నేటికీ తెలంగాణా ను కరెంటు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్, చంద్రబాబు నాయుడుని నిందిస్తుండటంతో ఆయన కుమారుడు లోకేష్ ఘాటుగా జవాబిచ్చారు.

జయలలిత కేసు ఫార్మాట్ మనకి సూటవుతుందా?

  పిచ్చి పూర్తిగా తగ్గిపోయింది ఇక రోకలి తలకు చుట్టూ అన్నట్లుంది తమిళనాట జయలలిత అభిమానుల పరిస్థితి. ఈరోజు కర్ణాటక హైకోర్టు ఆమె బెయిలు పిటిషను విచారణకు చేప్పట్టబోతుండటంతో తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా ఆమె అభిమానులు, ఏ.ఐ.డి.యం.కె. పార్టీ కార్యకర్తలు, నేతలు వీరావేశంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరావేశంతో ఎందుకంటే, ఆమెకు బెయిలు దొరకాలని కొందరు తమ శరీరాలను సూదులు, బల్లేలు, కత్తులతో పొడుచుకొంటుంటే, మరికొందరు అగ్ని గుండాల మీద నడుస్తూ దేవుళ్ళకు మొక్కుకొంటున్నారు.   అటువంటి సాహాసాలు చేయలేనివారు విస్తరాకు కూడా లేకుండా గుళ్ళలో ఒట్టి నేల మీద భోజనాలు వడ్డించుకొని తింటూ జయలలితకు బెయిలు దొరకాలని దేవుళ్ళను వేడుకొంటున్నారు. మదురై జిల్లాలో ఏ.ఐ.డి.యం.కె. పార్టీ కార్యకర్తలు కొందరు గుండు కొట్టించుకొని కామాక్షమ్మ గుడిలో అంగ ప్రదక్షిణాలు చేస్తున్నారు.   పార్టీకి చెందిన మరి కొంతమంది సౌండ్ పార్టీలు ‘మహా సుదర్శన హోమాలు’, ‘రుద్ర యజ్ఞాలు’ నిర్వహిస్తుంటే, అంత శక్తి లేని చోట మోటా నేతలు స్వామీ కార్యం స్వకార్యం అన్నట్లుగా జయలలిత విడుదల కోసం ఆమె పేరిట గుళ్ళలో పోటాపోటీగా అర్చనలు, అభిషేకాలు చేయించేస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు, మానవ హారాలు, రాస్తా రోకోలు షరా మామూలుగానే సాగిపోతున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో ఈ రోజు అన్ని గుళ్ళు, రోడ్లు ఏ.ఐ.డి.యం.కె. పార్టీ కార్యకర్తలతో కిటకిటలాడిపోతున్నాయి. అయితే ఇవన్నీ నిజంగా ఆమె విడుదల కోరుతూ చేస్తున్నావా లేక ఆమె దృష్టిలో పడేందుకు, ఆమెను ప్రసన్నం చేసుకొనేందుకు ఆ పార్టీ నేతలే చేయిస్తున్నవా? అనే వెర్రి ప్రశ్న వేస్తున్నారు కొందరు అజ్ఞానులు, పామరులు.   ఏమయినప్పటికీ ఒకప్పుడు మనోళ్ళు ఎవరయినా జైల్లోకి వెళ్ళినప్పుడు, ఏదో జైలు గేటు వరకు వెళ్లి సాగనంపి రావడమే కానీ మనోళ్ళు ఎవరూ కూడా గట్టిగా ఈ మాత్రం హడావుడి చేయలేకపోయారు. బహుశః ఇటువంటి కేసులకీ ఇటువంటి రకరకాల కార్యక్రమాలు నిర్వహించవచ్చనే ఐడియా మనోళ్ళకి లేకపోవడం చేతనే ఆ పొరపాటు జరిగి ఉండవచ్చును. కనుక ఇప్పుడు తమిళనాడులో ఏ.ఐ.డి.యం.కె. పార్టీ కార్యకర్తలు, నేతలు నిర్వహిస్తున్న విభిన్నమయిన ఈ వ్రత విధి విధానాలన్నిటినీ మనం కూడా క్షుణ్ణంగా అవగాహన చేసుకొని, జాగ్రత్తగా గుర్తుంచుకొంటే రేపు మనోళ్ళు ఎవరయినా ఇటువంటి కేసుల్లో జైలుకి వెళితే అప్పుడు మనమూ తూచా తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ ఎంచక్కా చేసుకోవచ్చును.

ప్రతిపక్షాలను ఏకం చేసిన కేసీఆర్

  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆకర్ష పధకంతో ప్రతిపక్షాల నేతలను తెరాసలోకి ఆకర్షించి, రాష్ట్రంలో ప్రతిపక్షాలను బలహీనపరచాలని భావించారు. కానీ ఆయన విద్యుత్ సమస్యలపై చేసిన వ్యాఖ్యలతో ప్రతిపక్షాలకు యూద్రుదాది చేసేందుకు చేజేతులా మంచి అవకాశం ఇచ్చారు. అంతే కాదు ఇదివరకు మీడియాపై నోరు జారి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కేసీఆర్, “రాష్ట్రంలో ప్రస్తుత కరెంటు కష్టాలకు గత ప్రభుత్వాలే కారణమని, ప్రతిపక్ష నేతలు పరిస్థితులను అర్ధం చేసుకోకుండా ఏదేదో మాట్లాడుతున్నారని, కుక్కలు మొరిగితే మనం పట్టించుకొంటామా?” అని చేసిన వ్యాఖ్యలతో ఆయన మళ్ళీ మరో అటువంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు.   తెదేపా, కాంగ్రెస్ పార్టీల నేతలిరువురూ మూకుమ్మడిగా ఆయనపై ఎదురుదాడి ఆరంభించారు. కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణ, తెదేపా నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి ముగ్గురూ కూడా ఆయనపై వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఎన్నికల సమయంలో తెరాస అధికారంలోకి రాగానే రోజుకి 8గంటలు చొప్పున విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్, తన హామీని అమలు చేయలేక, గత ప్రభుత్వాలను విమర్శించడం చేతకానితనమేనని వారు విమర్శించారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించలేని కేసీఆర్, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే గత ప్రభుత్వాలను నిందిస్తున్నారని వారు ఆరోపించారు.   విద్యుత్ సమస్యల గురించి ప్రజల తరపున ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తే, వారిని మొరిగే కుక్కలతో పోల్చడం ఆయన అహంకారానికి నిదర్శనమని వారు విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలు, రైతులు, పరిశ్రమలు తీవ్ర విద్యుత్ సమస్యలతో నానా బాధలు పడుతుంటే, ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించకుండా, తన బాధ్యత గుర్తు చేస్తున్న ప్రతిపక్షాలను, గత ప్రభుత్వాలను నిందిస్తూ ప్రజలను మరో మూడేళ్ళు ఓపిక పట్టమని కేసీఆర్ చెప్పడం బాధ్యతారాహిత్యమేనని కాంగ్రెస్, తెదేపా నేతలు విమర్శించారు.   రాష్ట్రంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని తెలిసి ఉన్నప్పటికీ పొరుగు రాష్ట్రమయిన ఛత్తిస్ ఘర్ నుండి విద్యుత్ సరఫరా కోసం వేస్తున్న హై-ట్రాన్స్ మిషన్ లైన్ల నిర్మాణాన్ని తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చేక మధ్యలో ఎందుకు నిలిపివేసిందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.   కేసీఆర్ ప్రజలకు పిట్టకధలు చెపుతూ కాలక్షేపం చేస్తున్నారని అయితే ఇది ఎంతో కాలం సాగదని ప్రజల సహనం నశిస్తోందని ఎర్రబెల్లి అన్నారు. ఆంద్ర, తెలంగాణాలు రెండు రాష్ట్రాలుగా విడిపోయి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఆయన తన అసమర్ధతను కప్పిపుచ్చుకోవాడానికి ఇంకా తెలంగాణా సెంటిమెంటును అడ్డంపెట్టుకోవడాన్ని ఎర్రబెల్లి ఆక్షేపించారు. ఇకనయినా కేసీఆర్ తన మాట తీరు మార్చుకొని ప్రతిపక్షాలను గౌరవించడం నేర్చుకోవాలని, లేకుంటే ప్రజలే ఆయనకు గుణపాటం చెపుతారని కాంగ్రెస్, తెదేపా నేతలు హెచ్చరించారు.

రాబర్ట్ వాద్ర దెబ్బకి హర్యానాలో కాంగ్రెస్ ఫినిష్?

  ఈ నెల 15వ తేదీన మహారాష్ట్ర మరియు హర్యాన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ రెండు రాష్ట్రాలలో కూడా ఇంత వరకు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. కానీ మహారాష్ట్రలో మిత్రపక్షమయిన యన్.సి.పీ. మద్దతు ఉపసంహరించుకోవడంతో సరిగ్గా ఎన్నికల ముందు అధికారంలో నుండి దిగిపోవలసి వచ్చింది. అందువలన అక్కడ బీజేపీ, శివసేన పార్టీలతో బాటు మిత్ర పక్షమయిన యన్.సి.పీ.ను కూడా డ్డీ కొనవలసిరావడంతో తిరిగి అధికారం చేజిక్కించుకోవడం చాలా కష్టమేనని భావించవచ్చును.   ఇక నేటికీ హర్యానాలో ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా నేతృత్వంలో కాంగ్రెస్ పరిపాలన సాగుతున్నప్పటికీ, ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రయోగిస్తున్న అస్త్రాలకు కాంగ్రెస్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారయింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్ర మరియు డి.యల్.యఫ్. సంస్థల మధ్య హర్యానాలో జరిగిన భూ కుంభకోణంపై విచారణకు ఆదేశించినందుకు హర్యానా ప్రభుత్వం సీనియర్ ఐ.ఏ.యస్. అధికారి అశోక్ కిమ్కాను బదిలీ చేసింది. ఇది జరిగి దాదాపు ఏడాదిన్నర పైనే అయింది. అప్పట్లో అది చాలా సంచలనం సృష్టించింది. కానీ ఇప్పడు ఎన్నికల ముందు భూపేంద్ర సింగ్ హుడా ప్రభుత్వం ఆదరా బాదరాగా రాబర్ట్ వాద్ర మరియు డి.యల్.యఫ్. సంస్థకు మధ్య జరిగిన భూ ఒప్పందాలకు క్లియరెన్స్ మంజూరు చేయడాన్ని మోడీ తప్పు పడుతూ అది ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించడం క్రిందే వస్తుంది కనుక హుడా ప్రభుత్వంపై తగు చర్యలు తీసుకోవలసిందిగా ఎన్నికల కమీషన్ న్ను కోరారు. అంతే కాదు ఇదే అంశాన్ని ఆయన తన ప్రతీ సభలో ప్రధానంగా ప్రస్తావిస్తూ, సోనియాగాంధీ కుటుంబ అవినీతి గురించి ప్రజలకు వివరిస్తూ ఆకట్టుకొంటున్నారు. బహుశః ఈ అంశమే హర్యానాలో కాంగ్రెస్ కొంప మున్చావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

సరికొత్త పదవి: తెలంగాణ ఆస్థాన వాస్తు పండితుడు

  తెలంగాణ రాష్ట్రంలో ఒక సరికొత్త పదవి త్వరలో సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సరికొత్త పదవి పేరు ‘తెలంగాణ ఆస్థాన వాస్తు పండితుడు’. తెలంగాణ ముఖ్యంమంత్రి కేసీఆర్‌కి వాస్తుకు సంబంధించిన అమూల్యమైన సూచనలను సుద్దాల సుధాకర్ తేజ అనే వాస్తు పండితుడు ఇస్తూ వున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అధికార నివాసానికి సంబంధించిన వాస్తు సూచనలు ఈయనే ఇచ్చారు. ఈయన మీద, ఈయన చెప్పే వాస్తు సూత్రాల మీద కేసీఆర్‌కి మాంఛి గురి వున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఇప్పటికే నిర్మాణం పూర్తయిన భవంతులు, నిర్మాణంలో వున్న భవంతులు.... వీటన్నిటి వాస్తు బాగోగులు చూసే బాధ్యతను ప్రభుత్వం సుద్దాల సుధాకర్ తేజకు అప్పగించినట్టు సమాచారం. ఆయన కూడా ఎంతో శ్రద్ధగా వాస్తు పండితుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కోసం ఎంతో శ్రమిస్తున్న సుద్దాల సుధాకర్ తేజకు ‘తెలంగాణ ఆస్థాన వాస్తు పండితుడు’ అనే పోస్టు ఇచ్చేస్తే ఓ పని అయిపోతుందన్న ఆలోచన ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ వర్గాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ మిశ్రా కూడా సుద్దాల సుధాకర్ తేజను తెలంగాణ ఆస్థాన వాస్తు పండితుడిగా నియమించాలన్న ఆసక్తితో వున్నట్టు తెలుస్తోంది. సుధాకర్ తేజ అంటే సీఎం కేసీఆర్‌కి కూడా ఎంతో గురి వుంది కాబట్టి త్వరలో తెలంగాణ ఆస్థాన వాస్తు పండితుడి పోస్టు సృష్టించి, ఆ పోస్టులో సుద్దాల సుధాకర తేజను కూర్చోబెట్టే అవకాశం వుందని తెలుస్తోంది. ఇంతకీ ఈ సుద్దాల సుధాకర్ తేజ మరెవరో కాదు... పాటల రచయిత సుద్దాల అశోక్‌తేజకు స్వయానా తమ్ముడు. అలాగే ఈ సుద్దాల సుధాకర్ తేజకు వాస్తులో పాఠాలు చెప్పిన గురువుగారు మరెవరో కాదు.. రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రముఖ వాస్తు పండితుడు గౌరు తిరుపతి రెడ్డి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గురువుగారి దగ్గర శిష్యరికం చేయడం సుధాకర్ తేజకు పదవి రావడానికి అడ్డంకి కాకపోవచ్చేమో.

చంద్రబాబు పేషీలో పెంచల్‌రెడ్డి పేచీ...

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరకి తాజాగా ఒక ఫైల్ వచ్చింది. సీఎం పేషీలో డిప్యూటీ సెక్రటరీగా పోస్టుకు పెంచల్ రెడ్డి అనే పరిశ్రమల శాఖ అధికారిని నియమిస్తే బాగుంటుందనేది ఆ ఫైల్‌లో వున్న సారాంశం. చంద్రబాబు దగ్గరకి ఫైల్ రావాలంటే అది రకరకాల దశలు దాటుకుని రావాలి. అన్ని దశలు దాటుకుని వచ్చిన ఆ ఫైల్ మీద చంద్రబాబు ఓ సంతకం చేసేశారంటే పెంచల్ రెడ్డి అనే అధికారి ఎంచక్కా సీఎం పేషీలో డిప్యూటీ సెక్రటరీ పోస్టులో కూర్చునేవారు. అయితే ఇంతకీ ఎవరీ పెంచల్ రెడ్డి అని ఎంక్వయిరీ చేసిన చంద్రబాబు నాయుడికి మైండ్ బ్లాక్ అయ్యే లెవల్లో సమాధానం వచ్చింది. సదరు పెంచల్ రెడ్డి ఎవరో కాదు. వైసీపీ నాయకుడు బాలినేనీ శ్రీనివాసరెడ్డికి చాలా సన్నిహితుడు, బంధువు, అలాగే వైసీపీ నాయకుడు జగన్‌కి కూడా బంధువే. జగన్ పార్టీ సన్నిహితుడికి తన పేషీలో స్థానం ఇవ్వడం అంటే కొరివితో తల గోక్కున్నట్టేనని అర్థం చేసుకున్న చంద్రబాబు అర్జెంటుగా ఆ ఫైలును పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది. వైసీపీ నాయకులకు సన్నిహితుడు, బంధువు అయిన వ్యక్తిని తన పేషీలోకి తీసుకోవాలంటూ తనకు ప్రతిపాదన పంపిన వారి మీద చంద్రబాబును దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

చంద్రబాబు చకచక... ఎంపీల విలవిల...

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాటల ముఖ్యమంత్రి కాదు.. చేతల ముఖ్యమంత్రి. రాజకీయంగా చంద్రబాబును వ్యతిరేకించేవారు కూడా ఆయన పనితనాన్ని ఎంతమాత్రం విమర్శించరు. ఏదైనా అనుకుంటే దాన్ని సాధించడం కోసం నిర్విరామంగా శ్రమించే తత్వం చంద్రబాబుది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేస్తున్నారు. ఏ విషయంలో అయినా మెరుపు వేగంతో చకచకా దూసుకువెళ్తూ ప్రతి విషయంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. అయితే ఈ చంద్రబాబు చకచక రాష్ట్రం నుంచి ఎంపికైన తెలుగుదేశం ఎంపీలు విలవిలలాడేలా చేస్తోంది. చంద్రబాబు నాయుడు ప్రతి పనినీ తానే చేస్తూ వుండటం వల్ల ఎంపీలు చేయడానికి ఏమీ మిగలటం లేదు. కేంద్రంతోగానీ, కేంద్రమంత్రులతోగానీ సంప్రదింపులు జరిపే విషయం గానీ, వారు రాష్ట్రానికి వచ్చినప్పుడు గానీ చంద్రబాబు ఎంపీల ప్రమేయం లేకుండా ప్రతి విషయాన్నీ తానే డీల్ చేస్తున్నారు. ఎంపీలు చేయాల్సిన పనులు కూడా తానే చేసేస్తూ ఎంపీలను కేవలం ఉత్సవ విగ్రహాల మాదిరిగా కూర్చోబెడుతున్నారు. ఎంపీలు ఏదైనా పని చేయాలని అనుకుని అడుగు ముందుకు వేసేలోపు చంద్రబాబు నాయుడు అప్పటికే ఆ పని పూర్తి చేస్తున్నారు. దాంతో తెలుగుదేశం ఎంపీల పరిస్థితి అయోమయంగా తయారైంది. మాక్కూడా పనిచేసే అవకాశం ఇవ్వండి సార్ అని చంద్రబాబుతో చెప్పలేక, మింగలేక, కక్కలేక ఎంపీలు అల్లాడిపోతున్నారు. చంద్రబాబు తమను ఏ పనీ చేయనివ్వడం లేదని, తమకూ పనిచేసే అవకాశం ఇస్తే ఎంపీలుగా ఎన్నికైనందుకు సార్థకత వుంటుందని టీడీపీ ఎంపీలు సహచరుల దగ్గర వాపోతున్నారు. అందుకే ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ‘బొమ్మరిల్లు’ సినిమాలో తండ్రిలా అన్ని పనులూ తానే చేయడం కాకుండా, ఎంపీలకు కూడా పనిచేసే అవకాశం, వారి శక్తి సామర్థ్యాలను కూడా వినియోగించుకునే ఆలోచన చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

‘దేశం’ తూర్పున భాస్కరుడు ఉదయిస్తాడా?

  తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. ఇది మామూలే.. కానీ తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీలో గతంలో ఒకసారి అస్తమించి, మళ్ళీ ఇంకోసారి ఉదయించడానికి ఓ భాస్కరుడు నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. కీలక సమయంలో పార్టీకి జెల్లకొట్టి వెళ్ళిపోయిన ఆ పెద్దాయన, ఇప్పుడు మళ్ళీ పుట్టింటికి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతకీ ఎవరా పెద్దాయన? ఆ పెద్దాయన ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్. తెలుగుదేశం పార్టీకి ‘బొడ్డు’ కోసి పేరు పెట్టినప్పటి నుంచీ పార్టీలో వున్న నాయకుడు. తెలుగుదేశం పార్టీ పుణ్యమా అని తూర్పు గోదావరి జిల్లాలో తన హవా నడిపిన నాయకుడు. రాష్ట్ర స్థాయిలో ఎన్టీ రామారావు ఏ స్థాయిలో వెలిగారో తూర్పు గోదావరి జిల్లాలో క్యాబినెట్ ర్యాంక్ పదవితో రాష్ట్ర స్థాయిలో కూడా వెలుగు వెలిగిన నాయకుడు. అయినప్పటికీ కీలక సమయంలో పార్టీకి జెల్ల కొట్టి అవినీతి పునాదుల మీద కట్టిన ఓ పార్టీలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ పార్టీ తూర్పు తిరిగి దణ్ణం పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ వుండటంతో మళ్ళీ ఆ నాయకుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చే ప్రయత్నాలు ప్రారంభించాడు.   తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత పార్టీని, పార్టీ నాయకుడిని ఇష్టమొచ్చినట్టు విమర్శించిన సదరు నాయకుడు తాను తిట్టిన తిట్లన్నీ మర్చిపోయి మళ్ళీ తెలుగుదేశం గడప తొక్కాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే సదరు నాయకుడి పునరాగమన ప్రయత్నాలను స్థానిక తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీకి ద్రోహం చేసిన నాయకులలో మొదటి వరుసలో నిలిచే ఆ వ్యక్తిని తిరిగి తెలుగుదేశం పార్టీలోకి తీసుకోరాదని స్పష్టంగా చెబుతూ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయనగారు మాత్రం తన ప్రయత్నాలను మాత్రం మానుకోవడం లేదు. ‘‘నేను మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరాలి. దానికోసం ఎంత ఖర్చయినా పర్లేదు’’ అని బాహాటంగానే ప్రకటిస్తున్నారు. ఈ బృహత్ కార్యాన్ని సాధించడం కోసం తెలుగుదేశం పార్టీలో కాస్త లెక్కా డొక్కా తెలిసిన కీలక నాయకుడిని సదరు ‘తూర్పు భాస్కరుడు’ ఆశ్రయించినట్టు తెలుస్తోంది. మరి తెలుగుదేశం అధినేత స్థానిక కార్యకర్తల నిరసనలను పట్టించుకుంటారో లేదో చూడాలి.

కేసీఆర్ పై యుద్ధానికి చేతులు కలిపిన ఎర్రబెల్లి, రేవంత్

  ఆ మధ్య తెదేపా సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని రహస్యంగా కలిసినట్లు వార్తలు రావడంతో, ఇక నేడో రేపో ఆయన తెదేపాను వీడి తెరాసలో చేరబోతున్నారని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈరోజు ఆయన రేవంత్ రెడ్డితో కలిసి కేసీఆర్ పై విరుచుకుపడటంతో అందరూ ఆశ్చర్యపోక తప్పలేదు. తెలంగాణాలో ప్రస్తుత కరెంటు కష్టాలకు గత ప్రభుత్వాలే కారణమని తెరాస నేతలు చెప్పుకోవడం చూసి, వారిని ధీటుగా ఎదుర్కోమని చంద్రబాబు కోరడంతో, ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి తెలంగాణా మంత్రులపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.   "ఎన్నికల సమయంలో తమ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రోజుకి 8 గంటలు నాణ్యమయిన విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు మరో మూడేళ్ళు ఆగాలని చెప్పడాన్ని ఇంటికి నిప్పు అంటుకొంటే నుయ్యి త్రవ్వడం మొదలు పెట్టినట్లుందని" ఎర్రవెల్లి ఎద్దేవా చేసారు. రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కొరత ఉందని తెలిసినప్పటికీ కనీసం పక్క రాష్ట్రాల నుండి, కేంద్రం నుండి అదనపు విద్యుత్ ఎందుకు తెచ్చుకోలేకపోయారని ఆయన ప్రశ్నించారు.   రేవంత్ రెడ్డి కూడా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పై సరికొత్త ఆరోపణలతో తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయన మంత్రివర్గంలో మిగిలిన వారినందరినీ డమ్మీలుగా మార్చేవేసారని ఆక్షేపించారు. ఇంతవరకు మెట్రో రైలు విషయంలో కాస్త దూరమయిన ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి ఇద్దరూ మళ్ళీ ఒకే వేదికపై నుండి తెరాస ప్రభుత్వాన్ని, దాని అధినేత కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించడంతో వారిలో చీలిక తెచ్చి లబ్దిపొందుదామనే కేసీఆర్ ప్రయత్నం బెడిసి కొట్టినట్లయింది.   వారిరువురితో సహా తెలంగాణా-తెదేపా ముఖ్య నేతలందరూ త్వరలో తెలంగాణాలో బస్సు యాత్ర మొదలుపెట్టేందుకు సిద్దమవుతున్నట్లు తాజా సమాచారం. కేసీఆర్ ఆకర్షకు విరుగుడుగా ఈ బస్సు యాత్ర చేప్పట్టి తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసుకోవాలనేది దీని ముఖ్య ఉద్దేశ్యంగా తెలుస్తోంది. తెలంగాణాలో మిగిలిన తెదేపా నేతలు కూడా ఏకత్రాటిపైకి రాగలిగితే, పార్టీ మళ్ళీ పుంజుకోవడం పెద్ద కష్టమయిన పనేమీ కాదని చెప్పవచ్చును.

హరిబాబు ఇది మంచి పద్ధతేనా?

  తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షమయిన బీజేపీ కూడా అప్పుడప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మీడియా ద్వారా చురకలు వేస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంబంపాటి హరిబాబు ఇదివరకోసారి ఆయన “చంద్రబాబు నాయుడు హైదరాబాదులో కూర్చొని ఏమి చేస్తున్నారు? వెంటనే రాష్ట్రానికి తరలిరాకుండా అక్కడి నుండే పాలిస్తానంటే ఎలా?” అని నిలదీశారు.   ఆ తరువాత వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీ కూడా బలమయిన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుందని అన్నారు. మళ్ళీ నిన్న గుంటూరులో జరిగిన బీజేపీ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ రాజధాని కోసం లక్ష ఎకరాలు ఎందుకు సేకరిస్తున్నారని ప్రశ్నించారు. రాజధానిని వికేంద్రీకరించే అవకాశం ఉన్నప్పటికీ, విజయవాడ-గుంటూరు పరిధిలో ప్రభుత్వం లక్ష ఎకరాల భూమి సేకరించాలనే ఆలోచనను ఆయన తప్పు పట్టారు.   ఆయన విమర్శలు సహేతుకమయినవే కావచ్చును. కానీ అధికార పార్టీకి మిత్ర పక్షంగా, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా బీజేపీ కొనసాగుతున్నప్పుడు, ఇటువంటి విమర్శలు చేయడం ద్వారా తమ ప్రభుత్వాన్ని తామే విమర్శించుకొన్నట్లవుతుంది. అనేకమంది తెదేపా నేతలు, ఉప ముఖ్యమంత్రి కె.ఈ. కృష్ణమూర్తి వంటివారు కూడా ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసారు. కానీ తరువాత ప్రభుత్వనిర్ణయానికి అందరూ కట్టుబడి మౌనం వహించారులక్ష ఎకరాల భూసేకరణపై ప్రతిపక్షాల నుండి వస్తున్నవిమర్శలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, ఇప్పుడు నిర్మించబోయే రాజధాని ప్రస్తుత జనాభా, ఆ ప్రాంత అభివృద్ధిని మాత్రమే కాకుండా రాబోయే 100 సం.లకు సరిపోయే విధంగా రాజధానిని తీర్చిదిద్దేందుకే సేకరిస్తున్నామని చెప్పిన సమాధానం బహుశః హరిబాబు దృష్టికి రాలేదేమో?   ఏమయినప్పటికీ కంబంపాటి హరిబాబు ప్రభుత్వంపై ఈ విధంగా బహిరంగ విమర్శలు చేయడం కంటే నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడి తన అభిప్రాయం తెలియజేస్తే బాగుంటుంది కదా. మిత్రపక్షమయి ఉండి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం వలన రెండు పార్టీల మధ్య సంబంధాలు దెబ్బ తినడం మినహా ఒరిగేదేముంటుంది?

ఆయన దగ్గర చాలా నేర్చుకొన్నా: చిరంజీవి

  విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రముఖ హాస్యనటుడు స్వర్గీయ అల్లు రామలింగయ్య విగ్రహాన్ని మాజీ కేంద్ర మంత్రి మరియు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి నిన్నఆవిష్కరించారు. డాక్టర్‌ అల్లు రామలింగయ్య కళాపీఠం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ రచయితలు పరుచూరి సోదరులకు అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ స్వర్గీయ అల్లు రామలింగయ్య గొప్పదనం గురించి వివరించి, జీవితాన్ని బంగారు బాట పట్టించేందుకు అవసరమైన అనేక మార్గదర్శక నీతి సూక్తులను ఆయన దగ్గర నేర్చుకున్నానని చెప్పారు.   కానీ, ఆయన మెగాస్టారుగా సినీ రంగంలో ఆర్జించిన మంచిపేరు, ప్రఖ్యాతులు, ప్రజాభిమానం అన్నిటినీ కూడా ఆయన రాజకీయాలలోకి వచ్చిన తరువాత పోగొట్టుకొన్నారు. అందుకు ఆయన పరిస్తితులనో లేక వేరెవరినో నిందించడం కంటే తనను తానే నిందించుకోవలసి ఉంటుంది. సినీ పరిశ్రమలో ఆయన ఆ స్థాయికి చేరుకోవడానికి ఎంత కష్టపడ్డారో ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా సినిమాలలో ఆయన ఒక గొప్ప ఆదర్శమూర్తిగా, ప్రజల కోసం ఎంతటి త్యాగానికయినా సిద్దపడే వ్యక్తిగా తనను తాను ఆవిష్కరించుకోవడం చూసిన ప్రజలు, ఆయన నిజ జీవితంలో కూడా అంతే గొప్ప విలువలు కలిగి ఉంటారని భావించారు. కానీ ఆయన రాజకీయాలలోకి అడుగుపెట్టిన తరువాత, సినిమాలలో చూసిన చిరంజీవికి, నిజజీవితంలో చిరంజీవికి మధ్య చాలా వ్యత్యాసం ఉందని పదేపదే నిరూపిస్తూ వచ్చేరు.   సినిమాలలో అంచెలంచెలుగా సమున్నత స్థాయికి ఎదిగిన ఆయన, రాజకీయాలలో మాత్రం అడ్డుదారిలో పైకి ఎదగాలని ప్రయత్నించి భంగపడ్డారు. నిజం చెప్పాలంటే ఆయన అసలు వ్యక్తిత్వం ఏమిటో ఆయన రాజకీయాలలోకి వచ్చిన తరువాతే ప్రజలకు అర్ధమయింది. అంతకు ముందు సినీనటులు డా.రాజశేఖర్, జీవిత వంటివారు ఆయనపై ఎన్ని ఆరోపణలు చేసినా నమ్మని ప్రజలు, ఆయన రాజకీయాలలో అనుసరించిన ద్వంద వైఖరిని చూసిన తరువాత ఆ ఆరోపణలు నిజమని నమ్మక తప్పలేదు.   కర్నాటకకు చెందిన జైరామ్ రమేష్ కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎంపికయిన కారణంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడుతుంటే, ప్రజాసేవ చేసేందుకే రాజకీయాలలోకి వచ్చేనని పదేపదే చెప్పుకొనే చిరంజీవి తన రాజకీయ భవిష్యత్ అగమ్య గోచరంగా కనబడుతుండటంతో, రాజ్యసభ సభ్యుడిననే సంగతి కూడా మరిచిపోయినట్లు మళ్ళీ 150వ సినిమా తీయడానికి సిద్దమయిపోతున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్న చిరంజీవి ‘స్వర్గీయ అల్లు రామలింగయ్య దగ్గర జీవితాన్ని బంగారు బాట పట్టించేందుకు అవసరమైన అనేక మార్గదర్శక నీతి సూక్తులను నేర్చుకున్నానని’ చెప్పుకోవడం వింటే నిజమేనని ఎవరయినా ఒప్పుకోక తప్పదు మరి.

కలిసి ఉంటే కలదు సుఖము..గవర్నర్

  కలిసి ఉంటే కలదు సుఖము... అని పెద్దలే కాదు రెండు రాష్ట్రాలకు పెద్దన్న వంటి గవర్నర్ నరసింహన్ కూడా ఇద్దరు ముఖ్యమంత్రులకు మరోమారు నచ్చచెప్పే ప్రయత్నం చేసారు. బీజేపీ నేత బండారు దత్తాత్రేయ నిర్వహించిన 'అలాయ్ బలాయ్' కార్యక్రమానికి హాజరయిన గవర్నరుతో బాటు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ పార్టీలకతీతంగా రాజకీయ నాయకులందరినీ ఒక్క వేదిక మీదకు తీసుకువచ్చే ఈ కార్యక్రమాన్ని గత పదేళ్లుగా నిర్వహిస్తున్న బండారు దత్తాత్రేయను అభినందించారు. తెలుగు ప్రజలు అందరూ అన్నదమ్ములులా కలిసి మెలిసి జీవిస్తూ. ఒకరికొకరు సహకరించుకొంటేనే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు.   ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందిస్తూ, ‘రాష్ట్రాలు వేరయినా తెలుగుజాతి ఒకటేనని, రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని తను కోరుకొంటున్నానని, రెండు రాష్ట్రాలలో తెదేపా ఉన్నందున ఆ పార్టీ అధ్యక్షుడిగా రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని తను కోరుకొంటున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఆలింగనం చేసుకోవడం హైలైట్ గా నిలిచింది.

మోడీ విమానంలో డమ్మీ గ్రెనేడ్ నిజమే!

  ప్రధాని మోడీ అమెరికా ప్రయాణానికి సిద్దంగా ఉంచిన 'స్టాండ్-బై' ఎయిర్ ఇండియా విమానంలో నిర్వీర్యం చేయబడిన గ్రెనేడ్ దొరకడం కలకలం రేపింది. ప్రధాని మోడీ తమ అమెరికా పర్యటన ముగించుకొని వచ్చేసిన తరువాత ఆ విమానాన్ని యన్.యస్.జీ. కమెండోలు ‘యాంటీ-హైజాక్-ఆపరేషన్స్-శిక్షణ' నిమిత్తం తమ అధీనంలో తీసుకొన్నారు. ఆ తరువాత దానిని తిరిగి ఎయిర్ ఇండియాకు అప్పగించారు. కానీ అందులో తేఖాన్పూరు, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తయారుకాబడినట్లు ముద్ర ఉన్న ఒక ‘స్టన్-గ్రెనేడ్’ ఒకటి వదిలివేశారు. వారు దానిని అందులో పెట్టి పొరపాటున మరిచిపోయారా? లేక కోరుండే వదిలిపెట్టారా? అనే సంగతి ఇంకా తేలవలసి ఉంది.   ఆ నిర్వీర్యమయిన గ్రేనేడ్ విమానంలో ఉండగానే డిల్లీ, ముంబై, హైదరాబాదులలో ప్రయాణికులను ఎక్కించుకొని సౌదీ అరేబియాలోని జెడ్డా అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకొంది. అక్కడ జరిగిన తనికీలలో విమానంలో స్టన్-గ్రెనేడ్ ఉన్న సంగతి బయటపడింది. అయితే ఎయిర్ ఇండియా అధికారులు ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు అదే గ్రెనేడ్ కాదని కేవలం పనికిరాని ప్లాస్టిక్ వస్తువని నమ్మబలికే ప్రయత్నం చేసారు. కానీ అది ఒక నిర్వీర్యం చేయబడిన ‘స్టన్-గ్రెనేడ్’ అని యన్.యస్.జీ. కమెండోలు నిర్దారించడంతో, ముంబై, హైదరాబాదుల విమానాశ్రయాలలో ఎయిర్ ఇండియాకు చెందిన నలుగురు అధికారులు, ఇద్దరు సెక్యురిటీ అధికారులు సస్పెండ్ చేయబడ్డారు.   డిల్లీలో విమానం బయలుదేరినప్పటి నుండి జెడ్డా చేరేవరకు ప్రతీ విమానాశ్రయంలో కూడా సెక్యూరిటీ అధికారులు విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అందులో ఎటువంటి ప్రమాదకర వస్తువులు లేవని నిర్దారించుకొన్న తరువాతనే ప్రయాణానికి అనుమతిస్తుంటారు. అయితే బోయింగ్ 747వంటి భారీ విమానాన్ని కేవలం ఒకే ఒక్క సెక్యూరిటీ అధికారి మొక్కుబడిగా పరిశీలించి, క్లియరెన్స్ ఇస్తుండటం చేతనే ఈవిధంగా జరిగిఉండవచ్చని దర్యాప్తు చేస్తున్న అధికారులు అభిప్రాయపడుతున్నారు.   కేంద్ర విమానయాన శాఖామంత్రి అశోక్ గజపతి రాజుకు ఈ విషయం తెలిసిన వెంటనే దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు ఎయిర్ ఇండియా డిప్యూటీ చీఫ్ సయ్యద్ నసీర్ అలీ, విమానయాన భద్రతాధికారి బిబి.దాస్ లతో కూడిన ఒక కమిటీని వేసారు. ఏమయినప్పటికీ ఈ వ్యవహారం వలన మన భద్రతా వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో కళ్ళకు కట్టినట్లు చూపుతోంది.

ప్రధాని విమానంలో గ్రెనేడ్!

  ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు బయలుదేరుతున్నపుడు ఆయన కోసం ఎయిర్ ఇండియా వారి మరొక బోయింగ్-747 విమానం డిల్లీలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్టాండ్-బైగా సిద్దం చేసి ఉంచారు. ఒకవేళ మోడీ పయనించబోయే ప్రత్యేక విమానంలో ఏవయినా సాంకేతిక సమస్యలు తలెత్తినట్లయితే, ఆ స్టాండ్-బై విమానంలో అమెరికా బయలుదేరి ఉండేవారు. అందువల్ల ఆ విమానాన్ని భద్రతా దళాలు తమ అధీనంలోనికి తీసుకొని క్షుణ్ణంగా తనికీలు నిర్వహిస్తాయి. కానీ మోడీ అమెరికా యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకొని భారత్ తిరిగివచ్చేసిన తరువాత దానిని తిరిగి ఎయిర్ ఇండియా సంస్థకు అప్పగించేశారు.   ఆ తరువాత ఆ విమానంలో సాధారణ ప్రయాణికులను తీసుకొని డిల్లీ నుండి ముంబై- హైదరాబాద్ మీదుగా-సౌదీ అరేబియా దేశంలోని జెడ్డా అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం తెల్లవారుజామున దిగినప్పుడు, ఆ విమానపు బిజినెస్ క్లాసులో నిర్వీర్యం చేయబడిన ఒక గ్రెనేడ్ దొరకడం సంచలనం సృష్టించింది.   దానిని మోడీ ప్రయాణానికి ముందుగానే విమానంలో అమర్చబడి, ఆయన దానిని ఉపయోగించకపోవడంతో నిర్వీర్యం చేయబడిందా? లేక డిల్లీ, ముంబై, హైదరాబాదు మూడు విమానాశ్రయాలలో ఎక్కడయినా ఎవరయినా విమానాన్ని హైజాక్ చేసే ఉద్దేశ్యంతో లోపలకి తీసుకువచ్చేరా? తెచ్చి ఉండి ఉంటే ఎందుకు ఎప్పుడు నిర్వీర్యం చేసారు? అసలు ఆ బాంబుని ఎవరు, ఎప్పుడు, ఎందుకు తీసుకు వచ్చేరు? సాధారణ ప్రయాణికులను, విమానాన్నయినా బయలుదేరేముందు క్షుణ్ణంగా తనికీ చేసినపుడు అది ఏవిధంగా లోపాలకి వచ్చింది? అనే విషయం తెలుసుకొనేందుకు దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఏమయినప్పటికీ ఇది చాలా దిగ్బ్రాంతి కలిగించే విషయమని అంగీకరించక తప్పదు.

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీటింగ్ ఎందుకు?

  సాధారణంగా ఎవరైనా చేతులు కాలిన తర్వాతే ఆకులు పట్టుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే తయారైంది. నందమూరి వంశంలో తానే నంబర్‌వన్ అనే భ్రమలో ఇంతకాలం వున్న జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో బోలెడంత ప్రాధాన్యత ఆశించాడు. ఆ ప్రాధాన్యత లభించకపోవడంతో ఆ పార్టీకి దూరమయ్యాడు. ఇప్పుడు పార్టీ ఆయన్ని దూరంగా పెట్టింది. దానికితోడు వరస ఫ్లాపులు కూడా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ని కొల్లేరు చేశాయి. ఈ పరిణామాల వల్ల నందమూరి ఫ్యాన్స్ కూడా జూనియర్ ఎన్టీఆర్‌కి క్రమంగా దూరమవుతున్నారు. ఈ ప్రమాదాన్ని గ్రహించిన జూనియర్ ఎన్టీఆర్ తిరిగి ఎన్టీఆర్ అభిమానులకు చేరువయ్యేందుకు ముమ్మర ప్రయత్నాలు మొదలెట్టారు. ఇందులోభాగంగా వైజాగ్‌లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. ఈ సమావేశానికి నందమూరి ఫ్యామిలీ ఫాన్స్‌తో పాటు తెలుగుదేశం యూత్ కేడర్‌ని కూడా ఈ మీట్‌కు ఆయన ఆహ్వానించనున్నాడని సమాచారం. ఈ మీట్‌లో, ఫ్యాన్స్ అందరితో స్వయంగా మాట్లాడి వారిని ఉత్సాహపరిచే సన్నాహాల్లో ఎన్టీఆర్ ఉన్నాడని జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులు చెబుతున్నారు.

హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ డాటా సెంటరు?

  భారతదేశంలో కంప్యూటర్లు, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు, వాటి కోసం రకరకాల అప్లికేషన్ల (సాఫ్ట్ వేర్) వినియోగం చాలా పెరిగిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రజలు, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఇంతకాలం వరకు తమ విలువయిన డాటాను హార్డ్ డిస్కులలోనో లేకపోతే సీడీలు, పెన్ డ్రైవులలోనో భద్రం చేసుకొంటున్నారు. కానీ నానాటికి పెరిగిపోతున్న ఈ డాటాను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డాటా సెంటర్లలో భద్రపరిచి అవసరమయినప్పుడు ‘క్లౌడ్ కంప్యూటింగ్’ అనే సర్వీసుల ద్వారా తిరిగి పొందవచ్చును. ఇప్పటికే గూగుల్, బింగ్, ఎంఎస్‌ఎన్, ఆఫీస్ 365, ఎక్స్‌బాక్స్ లైవ్, స్కైప్, వన్‌డ్రైవ్, మైక్రోసాఫ్ట్ అజూర్ వంటివి ఈ సేవలు అందిస్తున్నాయి. వాటిలో కొన్ని ఉచితంగా, మరికొన్ని నామమాత్ర చార్జీలతో ఈ సేవలు అందిస్తున్నాయి. ఇటీవల భారత్ వచ్చిన మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సి.ఈ.ఓ.) సత్య నాదెళ్ళ డిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, దేశంలో క్లౌడ్ కంప్యూటర్ సర్వీసులు అందించేందుకు వచ్చే ఏడాది చివరిలోగా మూడు నగరాలలో మైక్రో సాఫ్ట్ డాటా సెంటర్లు నెలకొల్పుతామని ప్రకటించారు. దాదాపు 125కోట్ల జనాభా గల భారతదేశంలో క్లౌడ్ కంప్యూటర్ సర్వీసులకు చాలా భారీ మార్కెట్ ఉందని తను భావిస్తున్నట్లు తెలిపారు.   ఆ మూడు సెంటర్లను ఏ నగరాలలో ఏర్పాటు చేస్తారో ఇంకా ప్రకటించవలసి ఉంది. అయితే సత్య నాదెళ్ళ ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం అవడం గమనిస్తే, ఈ మూడింట్లో ఒకదానిని హైదరాబాదులోనే నెలకొల్పే ఆలోచనలో ఉన్నట్లు భావించవచ్చును. ఇప్పటికే హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ చాలా కాలంగా పనిచేస్తోంది. ఇప్పుడు ఈ డాటా సెంటరు కూడా వచ్చినట్లయితే ఐటీ ప్రపంచంలో హైదరాబాద్ పేరు మరింత మారుమ్రోగిపోవడం ఖాయం. అదేవిధంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగుతుంది. భారతదేశ భారీ జనాభాయే ఇప్పుడు ప్రపంచానికి ఒక గొప్ప అతిపెద్ద మార్కెట్టుగా ఊరిస్తుండటంతో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనే ఉద్దేశ్యంతో మైక్రోసాఫ్ట్ ఒక్కోడాటా సెంటరు కోసం సుమారు రూ. 5,000కోట్లు పెట్టుబడి ఈ డాటా సెంటర్లు నెలకొల్పేందుకు సిద్దమవుతోంది.   కోట్లాది భారతీయులకు వివిధ సేవలు అందిస్తున్న అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు సేకరించిన డాటాను నిక్షిప్తం చేసి తిరిగి వారికి అవసరమయినప్పుడు అందించే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసుల కోసం చాలా మంది సాఫ్ట్ వేర్ నిపుణులు, ఇంజనీర్లు అవసరం ఉంటారు. అంతేకాక ఈ డాటా సెంటర్లలో పనిచేసే ఉద్యోగులకు ఆహారం, రవాణా వంటి వివిధ సేవలవసరం ఉంటాయి కనుక దీనివలన పరోక్షంగా కూడా కొన్ని వేలమందికి ఉపాధి దొరుకుతుంది. కనుక ఇది ఎట్టి పరిస్థితుల్లో చేజారిపోకుండా తెలంగాణా ప్రభుత్వం చాలా జాగ్రత్తపడవలసి ఉంది.

జయలలితకు సంఘీభావం తెలపడం సమంజసమేనా?

  అక్రమాస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విదించడంతో తమిళనాట ఆమె పార్టీ కార్యకర్తలు వీరంగం ఆడి బస్సులను తగులబెట్టారు. దుఖాణాలను బలవంతంగా మూయించారు. ఆమెకు మద్దతుగా తమిళ సినీ పరిశ్రమ అంతా తరలివచ్చి చెన్నైలో ఈరోజు నిరాహారదీక్ష చేసారు. తెలంగాణాలో విజయశాంతి కూడా ఆమెకు మద్దతు ప్రకటించారు. బహుశః ఇంకా చాలా మంది ఆమెకు మద్దతు ప్రకటిస్తూ ఉండవచ్చు కూడా.   అయితే 18ఏళ్ళపాటు ఆమె కేసును క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ఆమె నేరం చేసిందని అభిప్రాయపడిన ప్రత్యేక కోర్టు ఆమెకు జైలు శిక్ష వేసింది. అటువంటప్పుడు ఆమెకు మద్దతు తెలుపుతున్న వారందరూ తమ చర్యలను ఏవిధంగా సమర్దించుకొంటారు? ఆమెను కోర్టు దోషిగా నిర్ధారించి జైలు శిక్ష వేసినందుకు నిరసనగా అధికార పార్టీకి చెందినవారే బస్సులను తగులబెట్టడం, బందులు నిర్వహించడాన్ని ఏవిధంగా సమర్దించుకొంటారు? కోర్టు దోషిగా తేల్చిన వ్యక్తి కోసం యావత్ సినీ పరిశ్రమ నిరాహార దీక్ష చేయడాన్ని ఏమనాలి?   వీరందరి ప్రతిచర్యలు గమనిస్తే ఆమెకు జైలు శిక్ష విదించి కోర్టే తప్పు చేసిందేమో? అని అనిపించేలా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రజలకు నచ్చిన వ్యక్తి దోషి అని తెలిసినా శిక్షించ కూడదన్నట్లుంది వారి ధోరణి. ఈ విధంగా ప్రజలు తాము అభిమానించే నేతలను దేశంలో కోర్టులు శిక్షించ కూడదని, వారు దేశంలో చట్టాలకు అతీతులుగా ఉంచాలనే ఆలోచన చాలా ప్రమాదకర ధోరణి. నిరాక్షరాస్యులు, లోకజ్ఞానం లేని వారు ఆవిధంగా ఆలోచిస్తే వారిని తప్పు పట్టలేము. కానీ అధికారంలో ఉన్నవారు, చదువుకొన్నవారు, అన్నీ తెలిసినవారు కూడా ఆమెకు సంఘీబావం పలకడం, ఆమె కోసం బస్సులు తగులబెడుతూ మరొక నేరానికి పాల్పడటం, ఆత్మహత్యలు చేసుకోవడం చాలా విచారకరం.   ఒకవేళ ఆమె తనకు ప్రత్యేకకోర్టులో అన్యాయం జరిగిందని భావిస్తే, హైకోర్టుకు లేకపోతే సుప్రీం కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేయవచ్చును. ఆమె తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని బయటకు వస్తే, ఆమెకు బ్రహ్మ రధం పట్టినా తప్పులేదు. కానీ కోర్టు దోషిగా నిర్దారించి జైలు శిక్ష విదిస్తే దానిని నిరసించడం, ఆమెకు సంఘీభావం ప్రకటించడం, ఆమె కోసం ఆత్మహత్యలు చేసుకోవడం, బస్సులు తగులబెట్టడం చాలా శోచనీయం.