జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు చురకలు

  వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పంట రుణాల మాఫీ అంశాన్ని రాజకీయ అస్త్రంగా చేసుకొని అధికార తెదేపాపైకి గురిపెడుతుంటే, తెదేపా కూడా సరిగ్గా అదే అంశంతో వైకాపాపై ఇరుకున బెట్టే ప్రయత్నం చేసింది. ఈ అంశాన్ని అందిపుచ్చుకొన్న వైకాపా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకొంది.   అయితే వారి కార్యక్రమానికి సరిగ్గా 24గంటల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.50,000లోపు రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. రూ.1.50లక్ష వరకు రుణాలను రెండు దశలలో మాఫీ చేయబోతున్నట్లు తేదీలతో సహా ప్రకటించడంతో, రుణాల మాఫీ వ్యవహారంపై ప్రభుత్వాన్ని గట్టిగా ప్రజలలో నిలదీద్దామనుకొన్న వైకాపా కంగుతింది.   ప్రభుత్వం రుణాల మాఫీ చేతున్నట్లు ప్రకటించిన తరువాత కూడా ఇంకా ధర్నాలు దేనికి చేస్తున్నట్లు అనే ప్రశ్నకు సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అలాగని ఇంతవరకు వచ్చిన తరువాత ఇప్పుడు ధర్నాలు చేయకుండా వెనక్కి తగ్గితే పార్టీ పరువుపోతుంది. తీరాచేసి ధర్నాలు చేసేక జనాలు రాకపోయినా పార్టీ పరువు పోతుంది. అందుకే ఈ ధర్నాల కార్యక్రమం తప్పనిసరిగా విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు అందరూ చెమటోడుస్తున్నారు.   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో రుణాలు మాఫీ చేయడమే తప్పు, సాధ్యం కాదన్నట్లు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ రుణాలు మాఫి చేయమని ధర్నాలు ఎందుకు చేస్తున్నట్లు? అతను సాధ్యం కాదని చెప్పిన దానిని ప్రభుత్వం సాధ్యమేనని చేసి చూపుతున్నప్పుడు ఇంకా ధర్నాలు ఎందుకు చేస్తున్నట్లు? అతనికి ప్రతీ అంశాన్ని తన రాజకీయ ప్రయోజనం కోసం రాజకీయం చేయడం అలవాటుగా మారింది. అందుకే ఈ పంట రుణాల అంశంపై కూడా రాజకీయాలు చేస్తున్నారు. అయితే దాని వలన ఆయనకి ఏమి ప్రయోజనం ఉంటుందో కూడా చెపితే బాగుంటుంది, అని జగన్ కి చురకలు వేసారు.

తితిదే బోర్డులో సభ్యత్వం కోసం నేతల పోటీలు

  ప్రజాసేవకే కాదు దేవుడి సేవకీ ఈ రోజుల్లో పోటీ పెరిగిపోయింది. స్వామి కార్యంతో బాటే స్వకార్యం కూడా నెరవేరుతుంది గాబట్టే దానికీ డిమాండ్ పెరిగిపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే, ఆగస్ట్ నెలలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన తరువాత ఇంతవరకు దానికి కొత్త బోర్డును నియమించలేదు. ఈ నెలాఖరులోగా ఆపని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఇంతవరకు తితిదే బోర్డులో చైర్మన్ తో కలిపి మొత్తం 15మంది సభ్యులు ఉండేవారు. కానీ ఇప్పుడు తెలంగాణాకు కూడా బోర్డులో సభ్యత్వం కల్పించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ సంఖ్యను 18కి పెంచేందుకు సిద్దమయ్యారు. అయితే మరో 18 సీట్లు పెంచినా కూడా సరిపోయేలా కనబడటం లేదు. కారణం తితిదే బోర్డులో సభ్యత్వం కోసం పోటీ పెరిగిపోవడమే.   ఏపీ మరియు తెలంగాణా రాష్ట్రాలకు చెందిన తెదేపా నేతలకు పోటీగా బీజేపీ నేతలు కూడా వస్తున్నారు. వారు కాకుండా తెలంగాణా ప్రభుత్వం తరపున బోర్డులో చోటు కల్పించాలని కొందరు తెరాస నేతలు కోరుతున్నట్లు సమాచారం. ఆంధ్రాకు మూడు, తెలంగాణాకు మూడు సీట్లు అనుకొన్నప్పటికీ, రెండు రాష్ట్రాలలో ఆ ఆరు సీట్లకీ చాలా మందే పోటీ పడుతున్నారు. వారు సరిపోరన్నట్లు బీజేపీ నేతలు కూడా తమకూ బోర్డులో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.   ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలకే కాక దక్షిణాదిన ఉన్న తమిళనాడు, కర్ణాటక మరియు కేరళ రాష్ట్రాల నుండి కూడా ఒక్కో సభ్యుడిని బోర్డులో తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అంటే ఆ మూడు రాష్ట్రాలకి మూడు సీట్లు పోయాయన్నమాట. తెలంగాణా తెదేపా నేతలు తమకు కనీసం మూడు సీట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు రెండు సీట్లు మాత్రమే కేటాయించాలని భావిస్తున్నారు. ఇప్పుడు బీజేపీ నేతలు కూడా బరిలోకి దిగడంతో తెలంగాణా తెదేపా నేతలు తమ సీట్లను బీజేపీ ఎక్కడ ఎగరేసుకు పోతుందో అని ఆందోళన చెందుతున్నారు. తెలంగాణా తెదేపా నేతలు సండ్ర వీరయ్య, జి. సాయన్నలతో సహా మరి కొంత మంది పోటీలో ఉన్నారు. ఇక ఆంధ్రాలో అయితే ఆ లిస్టు చేంతాడంత పొడవు ఉంది. గాలి ముద్దు కృష్ణం నాయుడు, సి.యం. రవిశంకర్, చదలవాడ, భాను ప్రకాష్ రెడ్డి, తదితరులు పోటీలో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుండి మరో ముగ్గురు పోటీలో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెలాఖరులోగా తితిదే బోర్డును ఏర్పాటు చేయవచ్చును. దానిలో ఎవరెవరికి అవకాశం దొరుకుతుందో వేచి చూడాలి.

ఏపీ ప్రభుత్వానికి గన్నవరం రైతులు షాక్

  రాజధాని నిర్మాణానికి భూసేకరణ కోసం తిప్పలుపడుతున్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి గన్నవరం మండలంలో రైతులు ఊహించని విదంగా పెద్ద షాక్ ఇచ్చారు. గన్నవరంలో ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చాలనే ఆలోచనతో కొద్ది రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం గన్నవరం మండలంలో 417 ఎకరాల భూసేకరణకు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఆ మండలంలో గల అన్ని గ్రామాల రైతులు తమకు కూడా తూళ్ళూరు రైతులకు ఇస్తున్నటువంటి ప్యాకేజీయే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కానీ ప్రభుత్వ రేట్ ప్రకారం ధర చెల్లించి భూములు స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అప్పుడు రైతులు కూడా భూసేకరణం చట్టంలో ఉన్న నియమనిబంధనలను తెలివిగా ఉపయోగించుకొని తమ భూములను ప్రభుత్వ ధర కంటే రెట్టింపు ధరతో రిజిస్ట్రేషన్లు చేయించుకొంటున్నారు. ప్రస్తుతం అక్కడ ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ. 60వేలు ఉన్నట్లయితే, రైతులు దానిని 1.20 లక్షలకి రిజిస్ట్రేషన్ చేయించుకొంటున్నారు.   భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయబడిన ధరను రైతులకు చెల్లించినపుడే వారి భూములు స్వాధీనం చేసుకోవడానికి వీలుంటుంది. అంతేకాక ఆ కారణంగా వారు కోల్పోయిన ఇల్లు, ఫలసాయం ఇచ్చే చెట్లు, ఉపాధి వంటివాటికీ రాష్ట్ర ప్రభుత్వమే మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అంత మొత్తం చెల్లించడం రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదు. కనుక అప్పుడు ప్రభుత్వం తప్పనిసరిగా తూళ్ళూరు మండలంలో రైతులకు ఇస్తున్న ప్యాకేజీనే ఇవ్వవలసిఉంటుంది. లేదా భూసేకరణ సంగతి ఇక మరిచిపోక తప్పదు.   ఈ విధంగా రైతులు ప్రభుత్వం అడుగు ముందుకు వేయలేని పరిస్థితి కల్పించారు. విమానాశ్రయాల అభివృద్ధికి కేంద్రం సహాయం చేస్తానని హామీ ఇచ్చింది కనుక భూసేకరణకు అవసరమయిన ఈ సొమ్మును కేంద్రాన్నే సమకూర్చమని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు స్థానిక యం.యల్యే. వల్లభనేని వంశీ తెలిపారు. అయితే ఏ సంస్థ నిర్మాణానికయినా, భూమిని ఏర్పాటు చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంటుంది కనుక కేంద్రం కూడా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేయకపోవచ్చును. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం గన్నవరం మండలంలో భూసేకరణ ఏవిధంగా చేస్తుందో వేచి చూడాలి.

ఏపీలో విద్యుత్ ఫుల్: చంద్రబాబుకే ఫుల్ క్రెడిట్

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన మూడు నెలలలోనే చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర విద్యుత్ సంక్షోభం అరికట్టిన తీరు గమనిస్తే ఆయన చాలా ముందు చూపుతో చాలా చురుకుగా చర్యలు చెప్పట్టినట్లు అర్ధమవుతోంది. అందుకే ఆయన స్పీడు మేము అందుకోలేకపోతున్నామని ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పడం అతిశయోక్తికాదనిపిస్తోంది.   చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించక ముందే డిల్లీ వెళ్లి రాష్ట్రానికి నిరంతరాయ విద్యుత్ సరఫరా పైలట్ ప్రాజెక్టుని సంపాదించుకొచ్చిన సంగతి అందరికీ తెలుసు. ఆ తరువాత కూడా అదే మెరుపు వేగంతో కేంద్రం నుండి అదనపు విద్యుత్, మహారాష్ట్రలో వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ నుండి రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గు సరఫరా వంటివి అన్నీ చక్కబెట్టేయడంతో రెండు మూడు నెలలలోనే రాష్ట్రం విద్యుత్ సంక్షోభం నుండి బయటపడగలిగింది. ఆయన కార్యదీక్ష చూసి కేంద్ర విద్యుత్ శాఖామంత్రి పీయూష్ గోయల్ సైతం మెచ్చుకోలేకుండా ఉండలేకపోయారు.   రాష్ట్రం విద్యుత్ సంక్షోభం నుండి బయటపడింది కదాని చంద్రబాబు నాయుడు చేతులు దులిపేసుకోకుండా, 2015-16సం.లలో అవసరమయిన విద్యుత్ కోసం ఇప్పటి నుండే అన్ని ఏర్పాట్లు పూర్తిచేయడం గమనిస్తే కామినేని మాటలు నిజమని అంగీకరించక తప్పదు.   వచ్చే ఏడాదిలో ముఖ్యంగా వేసవిలో విద్యుత్ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే వివిధ విద్యుత్ సంస్థలతో 2,000మెగావాట్స్ విద్యుత్ సరఫరా కోసం ఒప్పందాలు చేసుకొన్న ఏపీ ట్రాన్స్ కో సంస్థ, తమిళనాడు, ఓడిషా, కర్ణాటక రాష్ట్రాలలో గల 20 ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుండి అదనంగా ఇంకో 2,100 మెగావాట్స్ విద్యుత్ సరఫరా కోసం కూడా ఒప్పందాలు చేసుకొంది. కేవలం ధర్మల్ విద్యుత్ సంస్థల నుండే కాక హైడల్ మరియు సోలార్ (619 మెగావాట్స్) విద్యుత్ ఉత్ప్పత్తి కేంద్రాల నుండి కూడా విద్యుత్ పొందేవిధంగా ఒప్పందాలు చేసుకొన్నారు. తద్వారా విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకొన్నారు.   ఓడిషాలో గ్రిడ్ కో సంస్థ నుండి 300 మెగావాట్స్, కర్ణాటకలోని శాతవాహన మరియు జే.యస్. డబ్ల్యు. నుండి 780 మెగావాట్స్ విద్యుత్ సరఫరా కోసం ఒప్పందాలు చేసుకొన్నారు. తమిళనాడులోని మీనాక్షి సింహపురి, థర్మల్ టెక్ మరియు జైస్వాల్ పవర్ కంపెనీలతో, ఇతర రాష్ట్రాలలో స్టెరిలైట్, జేపీయాల్, టాటా పవర్, స్టెరిలైట్ ఎనర్జీ, సల్సర్ స్టీల్, వందన విద్యుత్, మరియు జి.యం.ఆర్.ఈ.టి.యల్. విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో ఒక యూనిట్ రూ. 3.50 నుండి రూ. 4.00 ధరతో విద్యుత్ సరఫరా చేసేలా ఒప్పందాలు జరిగాయి.   అదేవిధంగా కేంద్రప్రభుత్వ సహకారంతో అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాలలో ఏర్పాటు చేయబడిన సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలతో కూడా విద్యుత్ సరఫరా కోసం ఒప్పందాలు జరిగాయి. అయితే ఈ సోలార్ విద్యుత్ ధర చాలా అధికంగానే ఉంది. ఒక్కో యూనిట్ ధర రూ. 8.22 నుండి రూ. 17.91 వరకు ఉంటుంది. కానీ ఏపీ ట్రాన్స్ కో సంస్థ మాత్రం రూ. 3.70 మాత్రమే చెల్లిస్తుంది. మిగిలిన దానిని కేంద్రప్రభుత్వమే సదరు సంస్థకు నేరుగా చెల్లిస్తుంది. ఈ రాయితీ సోలార్ విద్యుత్ పధకంలో తొలుత అనంతపురం నుండి 40 మెగావాట్స్, చిత్తూరులో గల ఎక్మీ సోలార్ నుండి 40 మెగావాట్స్, అనంతపురం, చిత్తూరు మరియు కర్నూలులోగల ఎక్మీ క్లీన్న్ టెక్ నుండి 160 మెగావాట్స్, సింగపూర్ కి చెందిన సన్న్ ఎడిషన్ ఎనర్జీ హోల్డింగ్స్ నుండి 30 మెగావాట్స్, రెయిన్ సిమెంట్స్ నుండి 22 మెగావాట్స్ విద్యుత్ సరఫరా చేసేందుకు ఒప్పందాలు జరిగాయి.   ఇక ప్రస్తుతం కృష్ణపట్నంలో నిర్మాణంలో ఉన్న రెండవ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుండి త్వరలోనే రాష్ట్రానికి 800 మెగావాట్స్ విద్యుత్ కూడా అందుబాటులోకి వస్తుంది. ఈ ఒప్పందాలన్నిటి కారణంగా వచ్చే సం.లో రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు ఉండకపోవచ్చునని ఏపీ ట్రాన్స్ కో సంస్థ చైర్మన్ కే. విజయానంద్ తెలిపారు.   ఇవికాక తూర్పు గ్రిడ్ నుండి మరో 2,000 మెగావాట్స్ విద్యుత్ సరఫరాకు అవకాశం ఉంది. కానీ అక్కడి నుండి రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేసేందుకు ట్రాన్స్ మిషన్ లైన్లు వేయవలసి ఉంది. అందుకోసం కూడా ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే వాటి నిర్మాణం పూర్తయ్యేందుకు ఇంకా చాలా కాలం పడుతుంది కనుక వచ్చే ఏడాదిలో అక్కడి నుండి విద్యుత్ సరఫరా రాలేకపోవచ్చును. కానీ భవిష్యత్తులో అక్కడి నుండి 2,000 మెగావాట్స్ విద్యుత్ సరఫరాకు అవకాశం ఉందని స్పష్టమవుతోంది.   ఇరుగు పొరుగు రాష్ట్రాలతో విద్యుత్ సరఫరా కోసం ఒప్పందాలు చేసుకొంటూనే మరోవైపు రాష్ట్రంలో థర్మల్ మరియు సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు చంద్రబాబు నాయుడు గట్టిగా కృషి చేస్తున్నారు. వచ్చే ఏడాదికి బయట రాష్ట్రాల నుండి కొంత విద్యుత్ కొనుగోలు చేయవలసి వచ్చినా 2016-17నాటికి రాష్ట్రం విద్యుత్ ఉత్ప్పత్తిలో స్వయం సంవృద్ది సాధించి, ఇతర రాష్ట్రాలకు కూడా విద్యుత్ సరఫరా చేయగల స్థితికి చేరుకోగలదని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఓసీటీఎల్ కంపెనీ.. ఛలో ఏపీ..

  కామినేని గ్రూప్‌కి చెందిన ఓసీటీఎల్ (ఆయిల్ కంట్రీ ట్యూబులార్ లిమిటెడ్) మెల్లగా తెలంగాణ రాష్ట్రం నుంచి దుకాణం సర్దేసి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం ప్రాంతానికి వెళ్ళిపోయే ఆలోచనలో వుంది. ఈ సంస్థ డ్రిల్లింగ్ పైపుల తయారీలో వుంది. ప్రస్తుతం ఈ కర్మాగారం నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి దగ్గర వుంది. చమురు, సహజవాయు నిక్షేపాల వెలికితీతలో ఉపయోగించే ఐదు రకాల పరికరాలను ఈ సంస్థ తయారు చేస్తుంది. ప్రపంచ ప్రఖ్యాత ఆయిల్ సంస్థలతో ఈ కర్మాగారం అనుబంధాన్ని కలిగి వుంది. ఈ కర్మాగారంలో మొత్తం 700 మంది కార్మికులు పనిచేస్తున్నారు. తాము తమ కర్మాగారాన్ని తెలంగాణ రాష్ట్రంలో మూసేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలించక తప్పని పరిస్థితులు ఏర్పాడ్డాయని కామినేని గ్రూప్ డైరెక్టర్ కామినేని శశిధర్ చెప్పారు. ఈ కర్మాగారాన్ని తరలించాలని ఆలోచించడానికి దారితీసిన పరిస్థితులను ఆయన వెల్లడించారు.   ఈ సంస్థలో పనిచేస్తున్న కార్మికుల సంఘాలన్నీ ఇటీవల ఒక్కటయ్యాయి. అందరూ కలసి నిరంతరం మూకుమ్మడిగా సమ్మెకు దిగుతున్నారు. ఈ సమ్మెల కారణంగా సంస్థ నష్టాలబాటలో నడుస్తోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి సంస్థ యాజమాన్యం ఎన్ని రకాలుగా ప్రయత్నించినా వీలు కాలేదు. ఈ సమస్యను పరిష్కరించండి మహాప్రభో అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. దాంతో ఈ కర్మాగారాన్ని ఏపీకి తరలించాలని అనుకుంటున్నామని శశిధర్ తెలిపారు. ఓసీటీఎల్ కర్మాగారం తయారు చేసే ఉత్పత్తులను ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్టు నుంచే ఎగుమతి చేస్తారు. అలాంటప్పుడు ఎంచక్కా కృష్ణపట్నం దగ్గరే కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తే ట్రాన్స్‌పోర్టు ఖర్చులు తగ్గడంతోపాటు కార్మికుల సమస్యలు కూడా తీరిపోతాయన్న ఆలోచనలో కంపెనీ యాజమాన్యం వున్నట్టు తెలుస్తోంది. కృష్ణపట్నంతోపాటు విశాఖ, కాకినాడ పోర్టుల సమీపానికి కంపెనీలను తరలించే అవకాశాలున్నట్టు సమాచారం.   కామినేని గ్రూప్‌కి నార్కట్‌పల్లి దగ్గరే ఓసీటీఎల్ కంపెనీ మాత్రమే కాకుండా కామినేని స్టీల్ అండ్ పవర్, యునైటెడ్ సీమ్‌లెస్ ట్యూబులర్ అనే రెండు కంపెనీలు కూడా వున్నాయి. ఈ కంపెనీలను ఈ గ్రూపు 2,500 కోట్ల రూపాయల వ్యయంతో స్థాపించింది. కొద్ది మాసాల క్రితం ఈ కంపెనీలన్నిటినీ మరో మూడు వేల కోట్ల రూపాయల వ్యయంతో విస్తరించాలని కామినేని గ్రూపు భావించింది. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో విస్తరించడం మాట అటు ఉంచి, అన్ని కంపెనీలను ఆంధ్రప్రదేశ్‌కి తరలించాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కంపెనీలను ఆంధ్రప్రదేశ్‌కి తరలించడానికి రెండు వందల కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. కర్మాగారాల్లో ఇప్పుడున్న మెషినరీలో 75 శాతం తిరిగి ఉపయోగపడతాయి. అందువల్ల రెండు వందల కోట్లు పోతేపోయాయి.. ఏపీకి వెళ్ళిపోయి మనశ్శాంతిగా కంపెనీలను నడుపకోవాలని కామినేని గ్రూప్ ముఖ్యులు భావిస్తున్నట్టు సమాచారం.

మిస్టర్ జంప్ జగ్గారెడ్డి

  ఇంతకాలం పార్టీలు మారేవారిని ‘జంప్ జిలానీ’ అంటూ వస్తున్నాం. అయితే ఇక నుంచి ‘జంప్ జిలానీ’ అని కాకుండా ‘జంప్ జగ్గారెడ్డి’ అంటే బాగుంటుందేమో. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి చకచకా పార్టీలు మారేస్తున్నారు కాబట్టి. మొదట్లో జగ్గారెడ్డి బీజేపీలో వున్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరిన ఆయన మొన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీలోనే వున్నారు. టీఆర్ఎస్ ప్రభంజనం కారణంగా సంగారెడ్డిలో ఓడిపోయిన జగ్గారెడ్డి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరే ప్రయత్నాలు చేశారు. పవన్ కళ్యాణ్, జగ్గారెడ్డి ఒకరినొకరు పొగుడుకున్నారు. అయితే ఆ ప్లాన్ ఎందుకో వర్కవుట్ కాలేదు. చివరికి జగ్గారెడ్డి బీజేపీలో చేరారు. నేను మొదట్లో బీజేపీలోనే వుండేవాడిని, తిరిగి మాతృ పార్టీకి వచ్చానని సెంటిమెంటల్ డైలాగ్స్ చెప్పారు. బీజేపీ అభ్యర్థిగా మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ తలుపు తట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన జగ్గారెడ్డిని మళ్ళీ పార్టీలోకి తీసుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా హైకమాండ్ నుంచి అనుమతి కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే జగ్గారెడ్డి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ప్రయత్నాలు చేయడాన్ని సంగారెడ్డి కాంగ్రెస్ వర్గాలు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. అయినా పొన్నాల తలచుకుంటే ఇవన్నీ మబ్బుల్లా తొలగిపోతాయి. జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారు. ‘జంప్ జగ్గారెడ్డి’ అనే పేరును సార్థకం చేసుకుంటారు.

అనిల్ సిన్హా సీబీఐ ప్రతిష్టను పునరుద్ధరిస్తారా?

  సీబీఐ సంస్థకే మచ్చ తెచ్చిన దాని డైరెక్టర్ రంజిత్ సిన్హా పదవీ కాలం ముగియడంతో ఆయన నిన్న పదవీ విరమణ చేసారు. ప్రధాని నరేంద్ర మోడీ, లోక్ సభలో కాంగ్రెస్ నాయకుడు మల్లిఖార్జున్ ఖార్గే మరియు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హెచ్. యల్. దత్తులతో కూడిన అపాయింట్ మెంట్స్ కమిటీ నిన్న డిల్లీలో సమావేశమయ్యి, 1979 బీహార్ ఐ.పి.యస్ క్యాడర్ కు చెందిన అనిల్ కుమార్ సిన్హాను సీబీఐ డైరెక్టర్ గా నియమించింది. ఆయన ఈరోజు బాధ్యతలు స్వీకరిస్తారు.   ఆయన సీబీఐలో చేరక మునుపు బీహార్ రాష్ట్రంలో ఏ.డి.జి. (లా అండ్ ఆర్డర్) మరియు అదే హోదాలో విజిలన్స్ శాఖలలో పనిచేసారు. ఆయన సేవలకు గుర్తింపుగా 2000సం.లో విశిష్ట సేవా పతకం, 2006 సం.లో రాష్ట్రపతి చేతుల మీదుగా పొలీస్ పతకం అందుకొన్నారు. ఆ తరువాత కేంద్రంలో విజిలన్స్ శాఖలో అదనపు కార్యదర్శిగా సేవలందించారు. మే, 2013సం.లో ఆయన సీబీఐలో చేరి అనేక కీలకమయిన కేసులను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు సీబీఐ పగ్గాలు పూర్తిగా ఆయన చేతికే వచ్చాయి.   ఇదివరకు సీబీఐ డైరెక్టర్ గా పనిచేసిన రంజిత్ సిన్హా యూపీఏ ప్రభుత్వం చేతిలో పావుగా మారి అనేక కేసులను నీరుగార్చే ప్రయత్నం చేసినందుకు సుప్రీంకోర్టు చేత అనేక సార్లు మొట్టికాయలు తిన్నసంగతి అందరికీ తెలుసు. సాధారణంగా అటువంటి కీలక పదవులలో పనిచేసిన వారెవరయినా పదవీ విరమణ చేస్తున్నప్పుడు, తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించినందుకు తృప్తిగా ఉందని చెప్పుకోవడం అందరూ వింటారు. కానీ ఆయన మాత్రం తన బాధ్యతలను సమర్ధంగా నిర్వహించలేకపోయానని చెప్పుకోవలసి రావడమే, ఆయన పనితీరుకు అద్దం పడుతోంది.   ఇప్పుడు ఆయన స్థానంలో బాధ్యతలు చేప్పట్టబోతున్న అనిల్ కుమార్ సిన్హా కూడా బీహార్ రాష్ట్రానికి చెందిన వారే. కనుక సహజంగానే అందరూ ఆయన పనితీరు ఏవిధంగా ఉండబోతోందనే ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కనీసం ఆయనైనా రంజిత్ సిన్హా హయంలో మసకబారిన సీబీఐ ప్రతిష్టను పునరుద్దరించగలుగుతారో లేదో కాలమే చెపుతుంది.

ఏపీలో ఐటీ, ఎలక్ట్రానిక్ సంస్థల స్థాపనకు ప్రణాళికలు సిద్దం

  ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణంతో బాటు రాష్ట్రంలో విశాఖపట్నం, రాజమండ్రి, అనంతపురం, తిరుపతి మరియు నెల్లూరు నగరాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కూడా అవసరమయిన స్థలాలను, సిద్దంగా ఉన్న భావన సముదాయాలను అధికారులు గుర్తించడం పూర్తయింది. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ జిల్లాలలో సుమారు 60 లక్షల చదరపు అడుగులు వైశాల్యం గల భవనాలు సిద్దంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విశాఖలోనే మధురవాడ వద్ద ఏర్పాటు చేసిన వి.యస్.ఈ.జెడ్. ఇన్క్యుబేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఇన్క్యుబేషన్ టవర్లో సుమారు 50,000 చదరపు అడుగుల వైశాల్యం గల భవనాలు, కాకినాడలో 25 ఎకరాల స్థలం, సర్పవరం ఐ.టి. సెజ్ లో 7,000 చదరపు అడుగుల వైశాల్యం గల భవనాలు, విజయవాడలో ఏ.పి.ఐ.ఐ.సి.కి చెందిన పారిశ్రామికవాడలో 2.5 లక్షల చదరపు అడుగుల వైశాల్యం గల భవనాలు, అక్కడే యస్.టి.పి.ఐ. ఇన్క్యుబేషన్ సెంటర్లో 15,000, చదరపు అడుగులు, అదేవిధంగా తిరుపతిలో 15, 000 చదరపు అడుగుల వైశాల్యం గల భవనాలు సిద్దంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.   ఇవి ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్ మరియు సాఫ్ట్ వేర్ కంపెనీల స్థాపనకు చాలా అనువుగా ఉన్నందున, ఆ పరిశ్రమలు స్థాపించాలనుకొన్న వారికి వెంటనే అనుమతులు మంజూరు చేసి తక్షణమే ఆ భవనాలలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. అన్నిటి కంటే ముందుగా విశాఖ, విజయవాడ మరియు తిరుపతి పట్టణాలలో ఈ ఎలక్ట్రానిక్ పార్కుల స్థాపన జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.   ఐటీ పరిశ్రమల స్థాపనకు సిద్దంగా ఉన్న ఈ భవనాలే కాకుండా ఇంకా విశాఖలో ఐ.టి. జోన్ గా గుర్తింపబడిన మధురవాడ వద్ద 152 ఎకరాల స్థలము, దానికి చేరువలోనే గంభీరం అనే ప్రాంతంలో ఏ.పి.ఐ.ఐ.సి.కి చెందిన పారిశ్రామిక వాడలో మరో 50 ఎకరాలు సాఫ్ట్ వేర్ పార్కులు ఏర్పాటు చేయడానికి సిద్దంగా ఉన్నాయి.   అదేవిధంగా విశాఖ జిల్లాలో అచ్యుతాపురం వద్ద గల పూడి గ్రామం వద్ద మరో 20ఎకరాల స్థలం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కేంద్ర చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల సంస్థ ఆద్వర్యంలో టెక్నాలజీ ఫర్ సిస్టమ్స్ ప్రోగ్రాం అనే పధకంలో భాగంగా దేశ వ్యాప్తంగా 15 ప్రాంతాలలో ఐ.టి సంస్థలకు అవసరమయిన పరిశోధనశాలలు మరియు శిక్షణా సంస్థలు మొదలయినవి ఏర్పాటు చేయబడుతాయి. వాటిలో ఒకటి ఈ పూడి గ్రామం వద్ద ఏ.పి.ఐ.ఐ.సి. గుర్తించిన ఈ 20ఎకరాలలో రూ.120కోట్ల పెట్టుబడితో స్థాపించబడతాయి.   ఇందుకోసం కేంద్రం ఇప్పటికే నిధులు మంజూరు చేసిందని, త్వరలోనే అభివృద్ధి చేయబడిన ఆ భూములు అందుబాటులోకి రాగానే అక్కడ ఈ అత్యాధునిక యంత్ర పరికరాలతో కూడిన ఈ సంస్థలు ఏర్పాటు చేయబడతాయని వైజాగ్ యంపీ మరియు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే. హరిబాబు తెలిపారు. వీటితోబాటు విశాఖలో ఐ.టి.ఐ.ఆర్.తో మరియు విశాఖ, తిరుపతి మరియు అనంతపురం పట్టణాలలో ఐటి మరియు మెగా ఎలక్ట్రానిక్ పార్కులను ఏర్పాటు చేసేందుకు, కాకినాడలో మెగా ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్ పార్క్ ఏర్పాటుకు అవసరమయిన ప్రణాళికలు అధికారులు సిద్దం చేస్తున్నారు.

నేడు ఏపీ రాజధాని అభివృద్ధి మండలి కీలక సమావేశం

  రాజధాని నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు వి.జి.టి.యం. స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఏపీ రాజధాని అభివృద్ధి మండలి (సి.ఆర్.డి.ఏ.) ఉన్నతాధికారులు మరియు సభ్యులతో ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యే అవకాశం ఉంది. త్వరలో సింగపూర్ మరియు జపాన్ దేశాల నిపుణుల బృందాలు రాజధాని నిర్మాణం జరిగే ప్రాంతాల పరిశీలనకు వస్తునందున, ఈనెలాఖరులోగానే సి.ఆర్.డి.ఏ. నియమ నిబంధనలు, దాని బాధ్యతలు, అధికారాలు, భూసేకరణకు నియమ నిబంధనలు వంటి అన్ని అంశాలపై అధికారులు రూపొందించిన డ్రాఫ్ట్ బిల్లుపై చర్చిస్తారు. ముఖ్యమంత్రి ఆమోదం తెలిపినట్లయితే త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీచేస్తుంది. ఈ నెలాఖరులోగా ఎట్టి పరిస్థితులలో ఈ వ్యవహారాలన్నీ పూర్తిచేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

ఏపీ రాజధాని నిర్మాణానికి సింగపూర్, జపాన్ రెడీ

  ఇటీవల సింగపూర్ మరియు జపాన్ దేశాలు పర్యటించివచ్చిన ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం రాజధాని నిర్మాణం కోసం వారి సహాయం కోరారు. వీటిలో సింగపూర్ కు ఆయన రాజధాని మాస్టర్ ప్లాన్ తయారు చేసే బాధ్యతలు, సాంకేతికంగా అభివృద్ధి చెందిన జపాన్ దేశానికి రాజధాని నిర్మాణ బాధ్యతలు అప్పగించబోతున్నారు. అందుకు ఆ రెండు దేశాలు కూడా అంగీకరించాయి. ముందుగా సింగపూర్ మాస్టర్ ప్లాన్ రూపొందించి ఇస్తే దానిని అధ్యయనం చేసిన తరువాత నిర్మాణంలో ఏ మేరకు సాంకేతిక సహకారం అందించాలో జపాన్ నిర్ణయించుకొంటుంది. మాష్టర్ ప్లాన్ రూపకల్పన కోసం ముందుగా సింగపూర్ నుండి ఒక నిపుణుల బృందం త్వరలో రాజధాని కోసం ఎంపిక చేసిన ప్రాంతాలను సందర్శిస్తుంది. వారు జనవరి నెలాఖరులోగా మాష్టర్ ప్లాన్ రూపొందించాలని చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. మాష్టర్ ప్లాన్ చేతికి అందగానే దానిని అధ్యయనం చేసిన తరువాత జపాన్ బృందం కూడా ఏపీ రాజధాని కోసం ఎంపిక చేసిన ప్రాంతాలను సందర్శిస్తుంది. వారు సూచించిన మార్పులు చేర్పులతో మళ్ళీ సింగపూర్ నిపుణులు తుది ప్లాన్ సిద్దం చేసి జపాన్ బృందానికి అందజేస్తారు.   రాజధాని భూములను పరిశీలించదానికి వచ్చే జపాన్ బృందంతో బాటే, రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పరిశ్రమలు, మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు అవసరమయిన వివరాలను సేకరించేందుకు మరో బృందం కూడా వచ్చే అవకాశం ఉంది.   మార్చి నెలలో ఉగాది రోజున గానీ మే నెలలో యన్టీఆర్ జయంతి రోజున గానీ రాజధాని నిర్మాణానికి చంద్రబాబు నాయుడు భూమి పూజ చేసి శంఖు స్థాపన చేయాలని భావిస్తున్నారు. ఈలోగా భూసేకరణ, నిధుల సమీకరణ, కేంద్రం నుండి అవసరమయిన అనుమతులు మంజూరు చేయించుకోవడం వంటి కార్యక్రమాలు పూర్తి చేయాలని చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకొన్నట్లు సవ్యంగా జరిగితే వచ్చే ఏడాది డిశంబరులోగా రాజధాని నిర్మాణపనులు మొదలయ్యే అవకాశం ఉంది.   సింగపూర్ ఆధునిక నగరాలను డిజైన్ చేయడంలో అందెవేసిన చెయ్యని పేరు పొందితే, జపాన్ దేశం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు పరికరాలను ఉపయోగిస్తూ చాలా వేగంగా నగర నిర్మాణం చేయగల సత్తా ఉందని మంచి పేరు సంపాదించుకొంది. ఆ కారణంగానే వారిరువురి భాగస్వామ్యంతో ప్రపంచంలోకెల్లా అత్యాధునికమయిన రాజధాని నిర్మించాలని చంద్రబాబు ఉవ్విళ్ళూరుతున్నారు. ఒకవిధంగా ఇది తన కార్యదీక్షను నిరూపించుకోనేందుకే వచ్చిన ఒక గొప్ప అవకాశంగా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.

మునుగుతున్న పడవెక్కిన మమత బెనర్జీ

  నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత తనకు అత్యంత సన్నిహితుడయిన అమిత్ షాను బీజేపీ అధ్యక్షుడిగా నియమించిన తరువాత వారిరువురూ కలిసి పార్టీపై, ప్రభుత్వంపై పూర్తి పట్టు సాధించగలిగారు. వారిరువురూ కలిసి పార్టీని దేశంలో అన్ని రాష్ట్రాలకు విస్తరించి అధికారం దక్కించుకొనేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇటీవల మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలలో పార్టీని అధికారంలోకి తెచ్చిన వారిరువురూ ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నఝార్ఖండ్, జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రాలపై దృష్టి లగ్నం చేసారు. ఝార్ఖండ్ పై అమిత్ షా దృష్టి లగ్నం చేసి పనిచేస్తుంటే, మోడీ జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రాలలో తన మాటల మాయాజాలంతో అక్కడి ప్రజలను బాగానే ఆకట్టుకొంటున్నారు.   ఇంతవరకు అక్కడ మువన్నెల జాతీయ జెండా ఎగురవేసేందుకు కూడా రాజకీయ పార్టీలు భయపడే పరిస్థితి ఉండగా, ఇప్పుడు మోడీ ఎన్నికల ప్రచార సభలకు భారీగా ప్రజలు తరలి వస్తుండటం గమనిస్తే అక్కడ కూడా మోడీ మాయాజాలం ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. దశాబ్దాలుగా రెండు రాష్ట్రాలు అభివృద్ధికి నోచుకోకపోవడంతో అక్కడి ప్రజలు అభివృద్ధి మంత్రం పాటిస్తున్న బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఆ రెండు రాష్ట్రాలు తమ చేతికి వచ్చిన తరువాత వారిరువురూ వచ్చే సం. ఎన్నికలు జరుగనున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంపై పట్టు సాధించేందుకు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టేసారు.   కామ్రేడ్ల కంచుకోటను బ్రద్దలు కొట్టి అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ చేతిలో నుండి అధికారం చేజిక్కించుకోవాలని వారిరువురూ గట్టిగా సంకల్పం చెప్పుకొన్నారని అమిత్ షా నిన్న కోల్ కతాలో చేసిన ప్రసంగం వింటే స్పష్టమవుతుంది. ఝార్ఖండ్, జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రాల ఎన్నికలలో గెలిచినప్పటికీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గెలిస్తే తప్ప తమ విజయం పరిపూర్ణం కాబోదని, త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలలో వచ్చే ఏడాది సెప్టెంబరులో జరుగబోయే శాసనసభ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించినపుడే తమ విజయయాత్రకు పరిపూర్ణత వస్తుందని అమిత్ షా స్పష్టం చేసారు.   కేంద్రంలో అధికారంలో ఉన్నబీజేపీని ఎదురొడ్డి నిలవడం తృణమూల్ కాంగ్రెస్ వంటి ప్రాంతీయ పార్టీకి చాలా కష్టమేనని చెప్పవచ్చును. అందుకే ఆ పార్టీ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పంచన చేరుతోంది. అయితే ఆమె రాహుల్ గాంధీ నడిపిస్తున్న మునిగిపోయే టైటానిక్ షిప్పు వంటి కాంగ్రెస్ లోకి చేరడం వలన ఆమె కూడా మునిగే ప్రమాదం ఉంది. అందువల్ల తక్షణమే మరో మంచి షిప్పు ఏదయినా ఉంటే చూసుకోవడం మంచిదేమో. లేకుంటే తల్లీ, పిల్ల కాంగ్రెస్ రెండూ కూడా మునగడం ఖాయమని భావించవచ్చును.

ఆ క్రెడిట్ కోసం ఇంకా కీచులాటలే

  తెలంగాణా రాష్ట్రం, ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచిపోతున్నా దాని క్రెడిట్ కోసం ఇంకా కాంగ్రెస్, తెరాసాలు కీచులాడుకొంటూనే ఉన్నాయి. తెలంగాణా ఇచ్చిన సోనియాగాంధీ ప్రజలకు దేవత అని కాంగ్రెస్ టీ కాంగ్రెస్ యం.యల్యేలు వాదిస్తే, ఆమె కారణంగానే అనేక వందల మంది యువకులు బలిదానాలు చేసారని తెరాస నేతల వాదన. బీజేపీ కూడా తెరాస వాదనలతో ఏకీభవిస్తూ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణా తనంతట తానుగా ఇవ్వలేదని, ప్రజలు ఉద్యమాలు చేసి కాంగ్రెస్ మెడలు వంచిన తరువాతనే ఇచ్చిందని, ఆ ఉద్యమాలలో అనేకమంది యువకులు బలిదానాలు కూడా చేసుకొన్నారని వాదించింది. ఈ మూడు పార్టీల వాదనలు ఎలాగున్నప్పటికీ, అనేకమంది యువకుల బలిదానాలు చేసిన విషయాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం తమ ప్రాణాలనే తృణ ప్రాయంగా వారు బలిదానాలు చేసినప్పుడు తెలంగాణా తెచ్చిన ఖ్యాతి కోసం ఈ మూడు పార్టీలు ఎందుకు కొట్టుకొంటున్నట్లు? తెలంగాణా కోసం బలిదానాలు చేసిన ఆ యువకుల కుటుంబాలలో కొందరికే ప్రభుత్వం సహాయం చేయదాన్ని ప్రభుత్వం ఏవిధంగా సమర్ధించుకొంటుంది?

బతికున్నోళ్ళకి విగ్రహం పెడితే ఖేల్ ఖతమే?

  తూర్పు గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పవన్ కళ్యాణ్ విగ్రహాన్ని పెట్టాలని కొంతమంది అభిమానులు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. వీళ్ళు పెట్టబోయే విగ్రహం కూడా రెడీ అయిపోయింది. అయితే ఈ చర్యను చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బతికి వున్న వాళ్ళ విగ్రహం పెడితే, ఎవరి విగ్రహం అయితే పెట్టారో ఆ ప్రముఖుల ప్రభ తగ్గిపోయి, వాళ్ళ ఖేల్ ఖతమ్ అయిపోయే ప్రమాదం వుందని అంటున్నారు. దీనికి సంబంధించిన కొన్ని చారిత్రక ఆధారాలను కూడా చూపిస్తున్నారు.   తమిళ రాజకీయ ప్రముఖుడు కామరాజ్ నాడార్ హవా ఉద్ధృతంగా ఉన్న రోజుల్లో ఆయన అభిమానులకు కామరాజ్ బతికి వుండగానే ఆయన విగ్రహాలను పెట్టేస్తే ఓ పనైపోతుందని ముచ్చటపడ్డారు. కామరాజ్ నాడార్ కూడా దానికి సంతోషంగా అంగీకరించారు. తన మొదటి విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూని కామరాజ్ నాడార్ ఆహ్వానించారు. అయితే నెహ్రూ ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. ‘‘బతికి వున్న వాళ్ళకి విగ్రహాలు పెట్టడమేంటి.. దానికి నన్ను పిలవటమేంటి.. నేను రాను’’ అని స్పష్టంగా చెప్పేశారు. అయితే నెహ్రూ రాకపోతే ఏంటంట అనుకుని కామరాజ్ అభిమానులు తమిళనాడులో విగ్రహాలు ఏర్పాటు చేశారు. విగ్రహాలు ఏర్పాటు చేసిన కొన్నాళ్ళకే కామరాజ్ నాడార్ చనిపోయాడు. అప్పుడు ఆయనకు నిజంగా విగ్రహాలు పెట్టే అర్హత లభించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌కి కూడా బతికుండగానే గుడికట్టి విగ్రహం పెట్టారు. అంతే ఆ తర్వాత కొన్నాళ్ళకే ఆయన కూడా దేవుళ్ళలో కలసిపోయారు.   ఈ తమిళనాడు వాళ్ళే హీరోయిన్ల మీద ప్రేమతో ఖుష్బూ, రోజా, రంభ లాంటి హీరోయిన్లకు గుడులు కట్టి, ఆ గుళ్ళలో వాళ్ళ విగ్రహాలు పెట్టారు. అప్పటి వరకూ తారాపథంలో దూసుకుపోయిన ఈ హీరోయిన్లు గుళ్ళు కట్టి విగ్రహాలు పెట్టిన తర్వాత తారాపథం నుంచి ఢామ్మని కిందపడిపోయారు. ఆ తర్వాత మళ్ళీ నిలదొక్కుకోలేదు.   ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిణి మాయావతి మేడమ్‌కి కూడా తాను బతికి వుండగానే ఉత్తరప్రదేశ్ అంతటా తన విగ్రహాలు పెట్టించుకోవాలన్న కోరిక పుట్టింది. ఆ విషయాన్ని అసెంబ్లీలో బిల్లుగా తీసుకొచ్చింది. బిల్లు పాసైపోయింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రమంతటా మాయావతి విగ్రహాలు ఏర్పాటు చేయడానికి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు కూడా విడుదలయ్యాయి. కొన్నిచోట్ల ఆమె విగ్రహాలను ఆమే ఆవిష్కరించేసుకున్నారు. అయితే ఆ తర్వాత సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టడంతో విగ్రహాల కథ ముగిసింది. అయితే బతికుండగా విగ్రహాలు పెట్టించుకున్న దోషం మాత్రం మాయవతిని వదల్లేదు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో ఎదురులేదని అనుకున్న మాయావతి ఘోరంగా ఓడిపోయారు.   ఇక ఈ మధ్యకాలంలో తెలంగాణలో సోనియాగాంధీకి గుడి కట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతగా మాజీ మంత్రి శంకర్రావు సోనియాగాంధీకి గుడి కట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహానికి పూజలు చేశారు. తర్వాత జరిగిన ఎన్నికలలో సోనియాగాంధీ పార్టీ అటు కేంద్రంలో, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఓడిపోయింది. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కూడా అధికారాన్ని కోల్పోయింది. ఇంకా చరిత్రని తవ్వే ఓపిక లేదు.. లేకపోతే బతికుండగానే విగ్రహాలు పెట్టించుకుని మటాషైపోయిన ఎంతమంది ప్రముఖుల చరిత్ర బయటపడుతుందో.....   చరిత్ర ఇలా వుంటే, వర్తమానంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వంతు వచ్చింది. పవన్ కళ్యాణ్ విగ్రహాన్ని తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేయడానికి ఆయన అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ అత్యుత్సాహాన్ని మరికొంతమంది అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిక్షేపంగా బతికి వున్న పవన్ కళ్యాణ్ విగ్రహాన్ని పెట్టి ఆయన ప్రభ తగ్గిపోయేలా చేయడం న్యాయం కాదని అంటున్నారు. నిజమైన అభిమానులైతే ఇలా విగ్రహాలు పెట్టించడం లాంటి పిచ్చిపనులకు పూనుకోరని చెబుతున్నారు. సదరు అభిమానులు తక్షణం విగ్రహ ప్రతిష్ట పనులను మానుకోవాలని సూచిస్తున్నారు.

టాలీవుడ్ ‘మేముసైతం’ ఎవరికోసం?

  విశాఖని అల్లకల్లోలం చేసిన హుద్ హుద్ తుఫాను బాధితులను ఆదుకోవడానికి తెలుగు సినిమా పరిశ్రమ ‘మేముసైతం’ పేరుతో నిధుల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గత నెల రోజులుగా ఈ అంశం మీద టాలీవుడ్‌లో హడావిడి జరుగుతోంది. ఈనెల 30న సినిమా ప్రముఖుల క్రికెట్ మ్యాచ్‌లు, ఇతర ఆటలు, పాటలు, రకరకాల వినోద కార్యక్రమాలు, స్టార్స్‌తో కలసి భోజనాలు... ఇలా రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ నిర్వహించడం ద్వారా సేకరించిన మొత్తాన్ని హుద్ హుద్ తుఫాను బాధితుల సహాయార్థం వినియోగిస్తారు. ఈ ‘మేముసైతం’ కార్యక్రమం కోసం టాలీవుడ్ పడుతున్న శ్రమ చూస్తుంటే సినిమా రంగంలోని వారు సమాజం పట్ల ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. ఇంత మంచివాళ్ళయిన సినిమా వాళ్ళు మనకి ఉన్నందుకు ఆనందంతో హృదయం ఉప్పొంగిపోతోంది. అయితే ‘మేముసైతం’ పేరుతో టాలీవుడ్ చేస్తోన్న ఈ హడావిడి అంతా జనం కోసం కాదని.. తమ స్వలాభం కోసమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హుద్ హుద్ బాధితుల సంగతి అలా వుంచితే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కాకాపట్టడానికే టాలీవుడ్ ప్రముఖులు ‘మేముసైతం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘మేముసైతం’ వెనుక వున్న అసలు గుట్టుని విమర్శకులు ఇలా వివరిస్తున్నారు.   ఎన్నికల ముందు సినిమా పరిశ్రమ చంద్రబాబు నాయుడికి ఎలాంటి మద్దతు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో సినిమా పరిశ్రమ కోసం ఎంతో చేశారు. అయితే ఆయన అధికారం కోల్పోయిన తర్వాత సినిమా పరిశ్రమ ఆయన్ని లైట్‌గా తీసుకుంది. ఎన్నికల సందర్భంలో తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసే విషయంలో కూడా గతంలో చంద్రబాబు నుంచి అనేక ఉపకారాలు పొందినవాళ్ళు కూడా ముందుకు రాలేదు. ఎన్నికల సమయంలో సినిమావాళ్ళు చంద్రబాబుకి మద్దతుగా నిలిస్తే రేపు జగన్ అధికారంలోకి వస్తే ఇబ్బంది అవుతుందని ఎందరూ చంద్రబాబు ఛాయలకు కూడా పోలేదు. ఎన్నికల ఫలితాలు రాకముందే కొంతమంది సినీ ప్రముఖులు కేసీఆర్ని మర్యాదపూర్వకంగా కలిశారు తప్ప చంద్రబాబుని కలసి నైతిక మద్దతు ఇవ్వాలన్న ఆలోచన ఎవరికీ రాలేదు. చంద్రబాబు మనసులో ఆ బాధ వుంది. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. దాంతో నాలుకలు కరుచుకున్న టాలీవుడ్ ప్రముఖులు మళ్ళీ చంద్రబాబుకి దగ్గరయ్యే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా హుద్ హుద్ తుఫాను విధ్వంసం వారికి మంచి అవకాశంలా కనిపించింది. దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసమే ఈ ‘మేముసైతం’ కార్యక్రమాన్ని చేపట్టారని విమర్శకులు అంటున్నారు.   ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం ప్రగతి పథంలో దూసుకుపోతోంది. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా రంగంలో అద్భుతంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తోంది. దీనికితోడు ప్రఖ్యాత ఎరోస్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంటర్‌టైన్‌మెంట్ సిటీ నిర్మాణానికి ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలకు సంబంధించి తెలుగు సినిమా రంగంలో ప్రముఖులెవర్నీ సంప్రదించకుండా, సలహాలు కూడా అడక్కుండా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్ళారు. ఈ చర్య టాలీవుడ్ ప్రముఖులు ఒక్కసారిగా గతుక్కుమనేట్టు చేసింది. తమను చంద్రబాబు ఎంతమాత్రం పట్టించుకోవడం లేదని అర్థమైంది. సినిమా పరిశ్రమకు తెలంగాణ రాష్ట్రం ఎంత ముఖ్యమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అంతే ముఖ్యం. సినిమా ప్రముఖులు నిర్వహిస్తున్న సినిమా వ్యాపారాలు ఆంధ్రప్రదేశ్‌లో కూడా లాభాలు పొందాలంటే అక్కడి ముఖ్యమంత్రి సహకారం కూడా చాలా అవసరం. ఇప్పుడు ఎరోస్ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్న చంద్రబాబు ముందు ముందు థియేటర్లు, ఇతర అంశాలకు సంబంధించి కూడా టాలీవుడ్ ప్రముఖులను పక్కన పెట్టేస్తే, టాలీవుడ్‌లో వున్న మోనోపాలీకి గండి కొట్టేస్తే వాళ్ళ వ్యాపారాలు నేలమట్టమయ్యే ప్రమాదం వుంది. దీన్ని ఊహించే టాలీవుడ్ వ్యాపార రంగంలో పెద్దలుగా వున్న కొందరు ముందుండి ‘మేముసైతం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించి, బోలెడంత నిధులను సీఎం సహాయ నిధికి ఇవ్వడం ద్వారా చంద్రబాబుకు చేరువ అవ్వచ్చన్నది వారి ఆలోచనగా చెబుతున్నారు. అమ్మ టాలీవుడ్డూ...

మరో ప్రతిజ్ఞ చేసిన కేసీఆర్

  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడప్పుడు తలనరుక్కోవడం వంటి భీకర ప్రతిజ్ఞలు చేస్తుంటారు. కానీ అవసరమయితే మళ్ళీ వాటిని అంతే అలవోకగా తీసి గట్టున పెట్టగలరని దళితుడికి కేటాయించిన ముఖ్యమంత్రి సీటులో ఆయన కూర్చొని నిరూపించి చూపారు. తెలంగాణా సాధన కోసం అవసరమయితే తన తెరాసని కాంగ్రెస్ పార్టీలో కలిపేసేందుకు కూడా సిద్దమేనని ఒట్టువేసి, ఆనక పిల్లాజెల్లాను వెంటబెట్టుకొని డిల్లీ వెళ్లి సోనియా గాంధితో గ్రూప్ ఫోటో కూడా దిగి వచ్చి, కాంగ్రెస్ పార్టీకి ‘హస్తం’ (హ్యాండ్) ఇచ్చేసారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే నాలుగు స్తంభాలు పాతేసి ఊరూరా విద్యుత్ సరఫరా చేస్తామని అలవోకగా చెప్పారు. కానీ ఇప్పుడు ఓ మూడేళ్ళు ఓపిక పట్టమని అదే నోటితో జనాలకి చెపుతున్నారు.   జనాలు కాసేపు తమ సమస్యల నుండి కష్టాల నుండి బయటపడేందుకు సినిమాలకో, షికార్లకో వెళుతుంటారు. బహుశః అదే ఉద్దేశ్యంతోనేనేమో కేసీఆర్ కూడా జనాలకి తన కొత్త బంగారి లోకంలోకి తీసుకువెళ్ళి వారిని మరిపిస్తున్నట్లున్నారు. ఆ బంగారి లోకంలో ఓ హుస్సేన్ సాగర్...దాని చుట్టూ ఓ డజనో అరడజనొ పెట్రోనాస్ టవర్లు, ఓ ఇందిరా పార్క్....దాని పక్కనే ప్రపంచంలో కెల్లా ఎత్తయిన ఓ బిల్డింగ్, ఓ హైదరాబాద్...దానికి ఈకొస నుండి ఆకొస వరకు, హైవేలు, స్కైవేలు, ఎక్స్ ప్రెస్ హైవేలు ఉంటాయి.   ఏడాదిలో రాష్ట్రమంతా అద్దంలా మెరిసిపోయే వెడల్పాటి తారు రోడ్లు, రెండేళ్ళలో నీళ్ళతో కళకళలాడే చెరువులు, మూడేళ్ళలో (కంటి రెప్పపడేంత సేపు కూడా అంతరాయం లేకుండా) నిరంతర విద్యుత్ సరఫరా, నాలుగేళ్లలో రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ స్వచ్చమయిన త్రాగునీళ్ళు ఇలా చాలా స్వీట్ డ్రీమ్స్ చూపిస్తున్నారు. ఆశయం గొప్పదయితే లోటు బడ్జెట్టుదేముంది చెట్టును దులిపినా డబ్బులు రాలుతాయి...తితిదేవస్థానాన్ని పిండినా రాలుతాయి. అయితే ఈ కొత్త బంగారి లోకం గురించి ప్రతిపక్షాలు జోకులు వేస్తుంటే, జనాలు కూడా లైట్ గా తీసుకొనే ప్రమాదం ఉందనో మారేమో తెలిదు గానీ, ఒకవేళ ఈ డ్రీం ల్యాండ్ నిర్మించలేకపోతే, వచ్చే ఎన్నికలలో ఓట్లు అడగబోమని కేసీఆర్ మరో భీకర ప్రతిజ్ఞ చేసారు. అంటే దానర్ధం ఎన్నికలలో పోటీ చేయమని మాత్రం కాదు. పోటీ చేస్తారు కానీ ఓట్లు అడగరని భావించాల్సి ఉంటుంది.   అయితే ఇంతవరకు ఆయన ఇలాంటి ప్రతిజ్ఞలు చాలానే చేసారు. చాలానే గట్టున పెట్టారు కనుక దీని సంగతి ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకోవచ్చును. కనుక ఇప్పుడు అందరికీ వినబడేలా గట్టిగానే ప్రతిజ్ఞలు చేసుకోవచ్చును. (ఈ ప్రతిజ్ఞకు షరతులు వర్తిస్తాయి. ఇది కేవలం నీళ్ళ పదకానికి మాత్రమే వర్తిస్తుంది అని గమనించవలెను.)

సీఎం పేషీలో పేచీ.. అభీష్టసిద్ధికి ఆటంకం..

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వేగాన్ని అందుకోవడానికి ఆయన మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు కూడా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇది అభినందించదగ్గ పరిణామం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పేషీలో సీఎం వేగాన్ని అందుకునే సమర్థులైన వ్యక్తులు వుండాలి. అప్పుడే ముఖ్యమంత్రి కార్యాలయానికి, ముఖ్యమంత్రికి మధ్య సరైన సమస్వయం కుదురుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్, తనకు సన్నిహిత మిత్రుడైన ‘అభీష్ట’ అనే వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేషీలో ఓఎస్‌డీగా నియమించారు. విద్యావంతుడు, ఉత్సాహవంతుడు, అన్ని అంశాల మీద అవగాహనతోపాటు చురుకుదనం ఉన్న అభీష్ట ముఖ్యమంత్రి అభీష్టానికి తగ్గట్టుగా పనిచేయాలన్న దీక్ష, పట్టుదలతో బాధ్యతలు స్వీకరించారు. అయితే పాపం ఆయన అనుకున్నదొకటి.. సీఎం పేషీలో అయ్యిందొకటీ.   సహజంగానే ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులుగా అనుభవంతో తల పండిపోయిన ఐఏఎస్ అధికారులు వుంటారు. ఇంకాస్త సహజంగానే వాళ్ళలో డాబూ, దర్పం గట్రాలు పుష్కలంగా వుంటాయి. ఈ బ్యూరోక్రాట్ల ధాటికి ఒక్కోసారి మంత్రులు, ఎమ్మెల్యేలే బెంబేలెత్తిపోతూ వుంటారు. అలాంటి ముదురు అధికారులను డీల్ చేయడం అభీష్టకి ఇబ్బందిగా మారిందట. చంద్రబాబు స్థాయి వేగాన్ని అందుకోవడానికి అభీష్ట చకచకా పనిచేస్తుంటే, అందుకు సహకరించాల్సిన ఐఏఎస్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారట. అభీష్ట ఎక్స్‌ప్రెస్ స్పీడుకి అధికారుల ప్యాసింజర్ వేగానికి పొంతన కుదరటం లేదట. పైగా వాళ్ళందరూ పెద్దపెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు కావడంతో మేమేంటి.. మా లెవలేంటి.. ఇతనెవరో కొత్తగా వచ్చిన వ్యక్తికి సహకరించడమేంటన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. దాంతో వీరిమధ్య సమన్వయం కుదరక పనుల్లో చురుకుదనం మందగించిందట. అయితే తనపేషీ తన వేగానికి తగ్గట్టుగా పనిచేయకపోవడం గమనించిన సీఎం చంద్రబాబు ఓఎస్డీ హోదాలో వున్న అభీష్టకి క్లాసులు తీసుకుంటున్నారట.   అటు ఐఏఎస్ అధికారులు తనకు సహకరించరు.. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు ‘వాటీజ్ దిస్?’ అని సీరియస్ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం పేషీ ఓఎస్డీగా కొనసాగడం కంటే తనదారి తాను చూసుకుంటే మంచిదని భావించిన అభీష్ట ఓఎస్డీ పదవిని వదిలిపెట్టి అమెరికాకి వెళ్ళిపోవాలని అనుకున్నారట. ఆ విషయాన్ని తన మిత్రుడు లోకేష్ దగ్గర ప్రస్తావిస్తే, లోకేష్ అన్ని పరిస్థితులను ఎదుర్కొని నిలబడి గెలవాలంటూ అస్త్రసన్యాసం చేసిన అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసినట్టు ఉపదేశం చేసి ఆయన రాజీనామా చేయకుండా ఆపారట. ఏది ఏమైనా అభీష్ట లాంటి చురుకైన వ్యక్తులు ఉత్సాహంగా పనిచేస్తున్నప్పుడు అలాంటి వారికి సహకరించాల్సిన బాధ్యత సీఎం పేషీలో వున్న బ్యూరోక్రాట్లకు ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఏపీ సీఎం పేషీలో వున్న అధికారులు పేచీ పెట్టడం మానుకుంటే, మంచి పరిపాలన అందించాలన్న చంద్రబాబు అభీష్టం సిద్ధిస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

వైకాపా విమర్శలకు చంద్రబాబు చేతలతో జవాబు

    వైకాపా నేత శ్రీకాంత్ రెడ్డి రెండు రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం సింగపూర్, జపాన్ దేశాలలో చేస్తున్న పర్యటనల వలన రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనమూ ఉండదని, ఆయన తన పార్టీలో వ్యాపారవేత్తలయిన యంపీలు, మంత్రులకు లాభం చేకూర్చేందుకే వారిని వెంటబెట్టుకొని ప్రజాధనంతో విదేశీ యాత్రలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదేవిధంగా విదేశీయాత్రలు చేసేరని కానీ వాటి వలన రాష్ట్రానికి ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాలేదని విమర్శించారు. అందువలన ఆయన చేస్తున్న విదేశీ యాత్రలకు అయిన ఖర్చు, వాటి ఉద్దేశ్యం, ప్రయోజనం గురించి విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు.   గతంలో చంద్రబాబు నాయుడు సమైక్య ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అమెరికా తదితర దేశాలలో పర్యటించి మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ ఐటీ సంస్థలను హైదరాబాద్ రప్పించి రాష్టానికి అక్షయ పాత్ర వంటి హై టెక్ సిటీని నిర్మించిన సంగతి బహుశః శ్రీకాంత్ రెడ్డికి తెలుసో తెలియదో?   మళ్ళీ ఇప్పుడు సింగపూర్, జపాన్ దేశాల పర్యటనల వలన రాష్ట్రానికి దాదాపు రూ.60,000కోట్లు పెట్టుబడులు రావచ్చని అంచనా వేస్తున్నారు. ప్రముఖ వాహనాల తయారీ సంస్థ ‘ఇసుజు’ చిత్తూరులో శ్రీసిటీ వద్ద తమ పికప్ వాహనాల తయారీ సంస్థ ఏర్పాటుకు సంసిద్దత వ్యక్తం చేసింది. అదేవిధంగా ఆహారోత్పత్తులను నిలువచేసే కోల్డ్ స్టోరేజీలకు, ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలకు అవసరమయిన కూలింగ్ వ్యవస్థ (రిఫ్రిజిరేషన్) ఏర్పాటుకు సంసిద్దత వ్యక్తం చేసింది. అదేవిధంగా ఈరోజు సుముటిమో సంస్థతో సమావేశమయిన చంద్రబాబు బృందం నాలుగు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసింది. వాటిలో ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో 4000మెగావాట్స్ సామర్ధ్యం గల ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు, రాజధాని నిర్మాణంలో సహకారం, రాజధాని నిర్మాణం కోసం నిధుల సమీకరణ, రాజధానిని స్మార్ట్ సిటీ గా మలిచేందుకు అవసరమయిన సాంకేతిక పరిజ్ఞానం అందజేయడం, రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థల ఏర్పాటుకు నిధుల సమీకరణ వంటి కీలక ఒప్పందాలపై సంతకాలు చేసారు. మరి వీటన్నిటినీ చూసిన తరువాత కూడా వైకాపా అనుమానాలు వ్యక్తం చేసినట్లయితే, దానికి ప్రజలే తగిన గుణపాటం చెపుతారు.   వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో తనే గెలిచి ముఖ్యమంత్రి కాబోతున్నందున రాజధాని నిర్మాణం కోసం విదేశీ కన్సల్టెన్సీ కూడా ఖరారు చేసేసారని, డ్రాయింగులు కూడా సిద్దమయిపోయాయని వైకాపా నేతలు చెప్పుకోవడం ప్రజలకి తెలుసు. ఒకవేళ ఆయనే నిజంగా ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి అయినట్లయితే, అప్పుడు ఆయన తన లోటస్ పాండ్ లో కూర్చొనే రాజధాని కట్టించేసేవారా లేకపోతే ఆయన కూడా చంద్రబాబులా విదేశీయాత్రలు చేసిఉండేవారా? అని వైకాపా ప్రశ్నించుకొంటే ఇటువంటి కువిమర్శలు చేసేవారు కాదు. ఇవ్వన్నీ వైకాపా ఓర్వలేక చేస్తున్న విమర్శలే తప్ప వేరే కాదని చెప్పవచ్చును.

కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స బీజేపీలో చేరబోతున్నారా?

  ఆ మధ్య ఎప్పుడో మాజీ పి.సి.సి. అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయన ఆ వార్తలను ఖండించలేదు. కానీ ఆ తరువాత జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు హాజరవడంతో ఆయన పార్టీ మారకపోవచ్చని అందరు భావించారు. కానీ మళ్ళీ మరోమారు ఆయన బీజేపీలో చేరడంపై వార్తలు వస్తుండటం గమనిస్తే నిప్పు లేనిదే పొగ రాదు కదా! అనిపిస్తుంది.   ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని తపించిపోయిన బొత్స సత్యనారాయణ మొదటి నుండి రాష్ట్రం విడిపోయేవరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. పైగా రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ అధిష్టానం ఆయనను పి.సి.సి.అధ్యక్ష పదవి నుండి కూడా తొలగించి ఆయన స్థానంలో రఘువీర రెడ్డిని కూర్చోబెట్టడంతో అంతకాలం ఒక వెలుగు వెలిగిన ఆయనకు పార్టీకి కూడా పనికిరానివాడయిపోయారు. ఆ తరువాత జరిగిన ఎన్నికలలో విజయనగరం జిల్లా ప్రజలు ఆయనతో సహా ఆయన కుటుంబ సభ్యులందరినీ కూడా తిరస్కరించడంతో ఆయన రాజకీయ జీవితం ఆఖరు దశకు చేరినట్లయింది. కానీ ఆయన తన సుదీర్గ రాజకీయ ప్రయాణంలో ఇటువంటి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. కనుక ఆయన రాజకీయ ఖాతాను అంత తేలికగా మూసివేయలేమని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. వారి అంచనాలను నిజం చేస్తున్నట్లుగా ఇప్పుడు ఈ వార్తలు వినిపిస్తున్నాయి.   వచ్చే ఎన్నికల నాటికి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవాలని ఆరాటపడుతున్న బీజేపీ దృష్టి కాపు సామాజిక వర్గం మీద పడింది. అంతకు ముందు బీజేపీలో చేరిన కావూరి సాంబశివరావు రాష్ట్రంలో సీనియర్ కాంగ్రెస్ నేతలందరినీ బీజేపీలోకి రప్పించేందుకు తెరవెనుక గట్టిగా కృషిచేస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. బహుశః ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించడం వలననేమో కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత కన్నా లక్ష్మీనారాయణ చడీ చప్పుడు లేకుండా అకస్మాత్తుగా ఒకరోజు బీజేపీలో చేరిపోయారు. ప్రస్తుతం బొత్స సత్యనారాయణ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను, బీజేపీ అమలుచేస్తున్న ఈ ‘పంచవర్ష ప్రణాళిక’ను పరిగణనలోకి తీసుకొని చూసినట్లయితే, బొత్స సత్యనారాయణ బీజేపీలో చేరడం ఖాయంగానే కనిపిస్తోంది.   ఆయన ఆర్ధికంగా, రాజకీయంగా మంచి బలమున్న నాయకుడే కావచ్చును. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కావచ్చును. కానీ ముఖ్యమంత్రి కావాలనే పదవీ లాలసతో  కాంగ్రెస్ అధిష్టానాన్ని రాష్ట్ర విభజనకు ఆయనే ప్రోత్సహించారనే భావన ప్రజలలో బలంగా నాటుకొనిపోయుంది. కనుక ఒక్క విజయనగరం జిల్లాలోనే కాక రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలలో కూడా ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారనే సంగతి కూడా బీజేపీ పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. అయితే ఈ వ్యతిరేకత ఎల్లకాలం అలాగే ఉండిపోదు గనుక బీజేపీ ఆయనను పార్టీలో చేర్చుకొన్నా ఆశ్చర్యం లేదు.   అదే జరిగితే ముందుగా విజయనగరం జిల్లాకే చెందిన కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజుకు, తెదేపాకు కూడా చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కనుక ఆయన తీవ్రంగా వ్యతిరేకించవచ్చును. కనుక బీజేపీ ఈ విషయంలో చాలా ఆచితూచి నిర్ణయం తీసుకొనవలసి ఉంటుంది. ఇక మరో విషయం ఏమిటంటే ఆయన తీవ్రంగా వ్యతిరేకించే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా బీజేపీలో చేరాలనుకొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏవిధంగా చూసుకొన్న బొత్సతో పోలిస్తే ప్రజలలో కిరణ్ కుమార్ రెడ్డికే మంచి పేరుంది. కనుక ఒకవేళ ఆయన పార్టీలో చేరెందుకు ఆసక్తి చూపిస్తే బొత్సకు బీజేపీలో ప్రవేశం దొరుకుతుందా లేదా? అనే విషయం తెలుసుకొనేందుకు మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది. 

జమ్మూ కాశ్మీరులో బీజేపీ అధికారంలోకి వస్తుందా?

  జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో నిన్న జరిగిన మొదటి దశ ఎన్నికలలో 71.3శాతం పోలింగ్ నమోదు అయింది. అందుకు ప్రధాన కారణం ప్రధాని నరేంద్ర మోడీ ఆ రాష్ట్రంలో చేసిన ఎన్నికల ప్రచారమేనని ప్రత్యేకంగా చెప్పుకొనవసరం లేదు. మోడీ కారణంగానే ఓటింగ్ శాతం పెరిగిందని ఎందుకు చెప్పవచ్చునంటే గత ఎన్నికలలో ఆయన ప్రభావం లేనప్పుడు కేవలం 65 శాతమే నమోదు అయింది కనుక. మోడీ కారణంగానే పోలింగ్ శాతం పెరగడం నిజమనుకొంటే, ప్రజలు బీజేపీకే ఓటువేసి ఉండవచ్చును కనుక ఆ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయని భావించవచ్చును.   అయితే కేవలం మోడీ కారణంగానే పోలింగ్ శాతం పెరిగిందని చెప్పడం కూడా సరికాదు. ఎవరయినా పోలింగ్ కి అంతరాయం కలిగిస్తే వారిని ఉక్కుపాదంతో అణచివేసేందుకు ఎన్నికల కమీషన్ చాలా భారీ భద్రతా ఏర్పాట్లు చేసిందని కాశ్మీరీ వేర్పాటువాదులే స్వయంగా అంగీకరించడం గమనిస్తే, ఎన్నికల కమీషన్ చేసిన ప్రయత్నాలు కూడా పోలింగ్ పెరిగేందుకు దోహదపడ్డాయని భావించవచ్చును. మొదటి దశ ఎన్నికలలో మారు మూల గ్రామాల నుండి ప్రజలను పోలింగ్ బూతులకు తరలించేందుకు ఏకంగా 43 హెలికాఫ్టర్లను వాడటమే అందుకు మంచి నిదర్శనంగా చెప్పవచ్చును. కాశ్మీరీ వేర్పాటు వాదులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చినప్పటికీ, భారీగా ప్రజలు తరలివచ్చి ఓట్లు వేయడం మరో మంచి ఉదాహరణ. భద్రత దళాలు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినందునే ఎక్కడా ఎటువంటి ఆవంచనీయమయిన సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా మొదటి దశ ఎన్నికలు ముగిసాయి.   పోలింగ్ శాతం పెరగడానికి ఇంకా మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో నేటివరకు కూడా అశాంతి నెలకొని ఉంది. అందుకు రాష్ట్రాన్ని పాలించిన ఫరూక్ అబ్దుల్లా, అతని కొడుకు ఒమర్ అబ్దుల్లా, వారితో చేతులు కలిపిన కాంగ్రెస్ పార్టీలనే నిందించవలసి ఉంటుంది. వేర్పాటువాదులను ఉక్కుపాదంతో అణచి వేయవలసిన ప్రభుత్వాలు వారితో చర్చలు చేయడంతో వారు క్రమంగా బలపడ్డారు. వారికి పాకిస్తాన్ తీవ్రవాదులు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుండటంతో భూతల స్వర్గమని చెప్పుకోవలసిన జమ్మూ-కాశ్మీరు రాష్ట్రం ఒక భయానక శాశ్విత యుద్దభూమిగా మారిపోయింది. తత్ఫలితంగా ఆ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఆ పరిస్థితికి విసిగి వేసారి పోయిన ప్రజలకు బహుశః మోడీ ఒక ఆశాకిరణంగా కనిపించి ఉండవచ్చును. ఆయన చైనా, పాకిస్తాన్ దేశాలతో కటువుగా వ్యవహరిస్తున్న తీరు చూసిన తరువాతనే కాశ్మీరీ ప్రజలలో ఆయన పట్ల నమ్మకం కలిగి ఉండవచ్చును. అయితే కేవలం ఓటింగ్ శాతం పెరిగినంత మాత్రాన్న ప్రజలు బీజేపీకే ఓటేసి ఉంటారని అనుకోవడానికి కూడా లేదు. కానీ ఆ అవకాశాలున్నాయని భావించవచ్చును.   అయితే పెరిగిన ఈ ఓటింగ్ శాతం వలన ప్రస్తుతం అధికారంలో ఉన్న ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం పూర్తిగా తుడిచిపెట్టుకు పోవచ్చును. ఎందుకంటే ఇటీవల సెప్టెంబర్ నెలలో కాశ్మీరులో వరదలు వచ్చినప్పుడు ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అదే సమయంలో వారిని ఆదుకోవడానికి కేంద్రప్రభుత్వం పెద్ద ఎత్తున చేప్పటిన సహాయ పునరావాస చర్యలను ప్రజలు ప్రశంసిస్తున్నారు. అయినా వారు బీజేపీకి పట్టం కట్టే ఆలోచనలో లేకపోతే అప్పుడు ప్రత్యామ్నాయంగా ఉన్న పిడి.పి.కి పట్టం కట్టే అవకాశాలున్నాయి. కానీ ఒకవేళ జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలో బీజేపీ కనుక విజయం సాధించి అధికారంలోకి వస్తే ఇక మోడీకి తిరుగు ఉండదని చెప్పవచ్చును. అదేవిధంగా అక్కడ పరిస్థితులలో చాలా మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు పూర్తయ్యి ఫలితాలు వెలువడితే గానీ ఎవరు గెలుస్తారో ఊహించలేము కానీ ఇమార్ అబ్దుల్లా ప్రభుత్వం మాత్రం మటుమాయం అవడం తధ్యమని ఖచ్చితంగా చెప్పవచ్చును.