అరకు యాపిల్స్ వచ్చేస్తున్నాయోచ్
నెత్తి మీద పండు పడినప్పుడో లేక నీళ్ళ టబ్బులో తేలినప్పుడో శాస్త్రవేత్తలకి బల్బు వెలిగినట్లే, విశాఖ జిల్లా అరుకు సమీపంలో ఉండే లంబసింగి అనే మారు మూల గ్రామంలో బొబ్బిలి రాంబాబు కూడా యాపిల్ కాయ తినేసి పెరట్లో విత్తనాలను విసిరేసినప్పుడు అక్కడ యాపిల్ మొక్కలు పుట్టి ఏపుగా ఎదిగి కాయలు కూడా కాసేస్తున్నాయని ఆ నోటా ఈ నోటా పాకి చివరికి మన వ్యవసాయ పరిశోధన సంస్థ వాళ్ళ చెవుల్లో కూడా పడేసరికి “అయితే ఆంధ్రాలో కూడా మనం ఎంచక్కా యాపిల్ మొక్కలు వేసుకోవచ్చన్నమాట” అనే కొత్త సంగతి కనుగొన్నారు.
ఇంతవరకు సీమ్లా యాపిల్, కాశ్మీర్ యాపిల్, హిమాచల్ యాపిల్ అనుకోని చెప్పుకోవడమే కానీ అరుకు యాపిల్, పాడేరు యాపిల్ అనే మాట ఎవరూ వినలేదు కదా! అందుకే హైదరాబాద్ లో గల సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయోలజీకి చెందిన శాస్త్రవేత్తలు హిమాచల్ ప్రదేశ్ నుండి వంద యాపిల్ మోక్కలు పట్టుకువచ్చి లంబసింగిలో నాటి అక్కడ యాపిల్ తోటలు సాగుకు అనువుగా ఉన్నాయా లేదా? అనే విషయంపై ఏడాదిగా పరిశోధనలు చేస్తున్నారు. అవి కాక స్థానిక వ్యవసాయ పరిశోధనా కార్యాలయ ఆవరణలో వివిధ రకాలకు చెందిన యాపిల్ మొక్కలను నాటి పరిశోధన చేస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ డా.యన్. వేణుగోపాలరావు తెలిపారు.
సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉన్న కారణంగా అరుకు, పాడేరు, చింతపల్లి, పెదబయలు, జి.మాడుగుల, అనంతగిరి తదితర గిరిజన ప్రాంతాలలో వాతావరణం ఎప్పుడూ 15డిగ్రీల లోపే ఉంటుంది. కనుక అక్కడ చల్లటి వాతావరణానికి అనుకూలమయిన కాఫీ, మిరియాల తోటలు దాదాపు 1.5లక్షల ఎకరాలలో పండిస్తున్నారు. అక్కడ పండించిన కాఫీ దేశ విదేశాలకు ఎగుమతవుతోంది కూడా. అందుకే ఇప్పుడు ప్రయోగాత్మకంగా ఎకరం విస్తీర్ణంలో యాపిల్ మొక్కలు పెంచుతున్నారు. దాదాపు ఏడాది వయసున్న ఆ మొక్కలు మరో రెండేళ్ళ తరువాత కాయలు కాయడం మొదలుపెడతాయి.
ఒకవేళ ఈ ప్రాంతంలో కూడా యాపిల్ తోటల సాగుకు అనుకూలమని తేలినట్లయితే, యాపిల్ తోటల పెంపకానికి, వాటి మార్కెటింగ్ కు తాము గిరిజనులకు అన్ని విధాల సహకరిస్తామని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ ఆర్. లక్ష్మణుడు తెలిపారు.
ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు ఆలోచిస్తోంది. కానీ దాని బదులు ఈ ఏజన్సీ ప్రాంతాలలో స్ట్రా బెర్రీ, పసుపు, యాలకులు , సుగంధ ద్రవ్యాల మొక్కలు, వివిధ రకాల పూల తోటల సాగుకు అవసరమయిన ఆర్ధిక సహాయం, శాస్త్రీయ సహకారం, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని స్థానిక గిరిజనులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా బొబ్బిలి రాంబాబు మాత్రం పెరట్లో కాస్తున్న యాపిల్ కాయలు చూసి లొట్టలు వేస్తున్నాడు.