పొలిటికల్ మీడియేటర్ ‘పెద్దాయన’
posted on Nov 8, 2014 @ 3:58PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఫొటోకి దండపడి చాలాకాలమైంది. కాంగ్రెస్ పార్టీ డెడ్ బాడీ పొరపాటున అయినా లేచి కూర్చుంటుందేమోనన్న డౌట్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొన్నటి ఎన్నికలలో కాంక్రీటుతో సమాధి కట్టేశారు. ఇంతకాలం పెద్ద దిక్కుగా వున్న పార్టీ బాల్చీ తన్నేయడంతో కాంగ్రెస్ నాయకులు గత కొన్ని నెలలుగా శ్మశాన వైరాగ్యంలో, రాజకీయ వైధవ్యంలో వున్నారు. ఇప్పుడు మెల్లమెల్లగా తేరుకుంటూ, ఇప్పుడిక ఏ పార్టీని ఆశ్రయిస్తే బాగుంటుందా అన్న ఆలోచనలో పడ్డారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులలో నూటికి 99 శాతం మంది నాయకులకు తెలుగుదేశం పార్టీలోకి నో ఎంట్రీ. వాళ్ళు అరచి గీపెట్టినా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎంతమాత్రం పట్టించుకోదు. ఇక రాష్ట్రంలో వున్న మరో పార్టీ వైసీపీ. ఈ పార్టీలో చేరడం కంటే సన్యాసం తీసుకుని హిమాలయాలకు వెళ్ళిపోవడం మంచిదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వుంది. రేపో మాపో మునిగిపోయే చిల్లు పడవలాంటి వైసీపీలో చేరి బావుకునేదేమీ లేదన్న కనీస జ్ఞానం అందరిలోనూ వుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకులందరి దృష్టీ భారతీయ జనతాపార్టీ మీద పడింది. ఇది మీడియేటర్ల కాలం... ఏ పని జరగాలన్నా మీడియేటర్‌ని ఆశ్రయిస్తే ఈజీగా పనైపోతుంది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులందరూ బీజేపీలో చేరడానికి ఓ ‘పెద్దాయన’ని మీడియేటర్‌గా ఉపయోగించుకుంటున్నారు.
ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుడిగా రాష్ట్ర, జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పిన ఆ పెద్దాయన కేంద్ర మంత్రి పదవికి ఆశపడి రాష్ట్ర విభజనకు సహకరించారన్న పాపాన్ని మూటగట్టుకున్నారు. జరగాల్సిన విభజన ఘోరం జరిగిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పంచకు చేరారు. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులను బీజేపీలోకి చేర్పించే బృహత్కార్యంలో బిజీగా వున్నారు. తన వద్దకు వచ్చి బీజేపీలో చేరతానని బతిమాలుకున్న వారిని బీజేపీలో చేర్చడమే కాకుండా.. తన దగ్గరకు రానివారి దగ్గరకు కూడా వెళ్ళి బీజేపీలో చేరండని రిక్వెస్ట్ చేసే పనిలో కూడా ఆయన నిమగ్నమై వున్నారు. మొన్నీమధ్య గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రిని ఆయన విజయవంతంగా బీజేపీలో చేర్చారు. అలాగే విశాఖ జిల్లాకి చెందిన మాజీ ఎంపీగారిని కుటుంబ సమేతంగా బీజేపీలో చేర్చారు. మొన్నటి వరకూ జగన్ చేత ‘అన్నా’ అని ప్రేమగా పిలిపించుకుని, ఆ తర్వాత ఆయనకి దూరమైన కాంగ్రెస్ మాజీ ఎంపీ ప్రస్తుతం ఖాళీగా కూర్చున్నారు. ప్రస్తుతం ‘పెద్దాయన’ దృష్టి ఆయన మీద కూడా పడింది. ఆయన ఇంటికి వెళ్ళి మరీ బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. ఇప్పుడు సదరు పెద్దాయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో వున్న పెద్ద, చిన్న నాయకులను, చెత్తా చెదారాన్ని కూడా బీజేపీలోకి తరలించే పనిలో నిమగ్నమై వున్నారు.
సదరు పెద్దాయన బీజేపీలో చేరినప్పటి నుంచి చేయడానికి పెద్దగా పనేం లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ - బీజేపీ బంధం కూడా బలంగా వుండటంతో ఈయన ఏవైనా రాజకీయాలు చేసి ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టే ఛాన్స్ కూడా లేకుండా పోయింది. ఈ పెద్దాయన్ని పార్టీలో చేర్చుకున్నందుకు పార్టీకి ఏం ఒరిగిందన్న ఆలోచన బీజేపీ నాయకత్వానికి రాకముందే తానే ఏదో ఒక హడావిడి చేసి పార్టీ నాయకత్వం నుంచి మంచి మార్కులు పొందాలన్న ఉద్దేశంతోనే ఈ ఆయన ‘పొలిటికల్ మీడియేటర్’ అవతారం ఎత్తారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ ఐదేళ్ళ కాలంలో కాంగ్రెస్ పార్టీలోని నాయకులందర్నీ బీజేపీలోకి చేర్పించేస్తే వచ్చే ఎన్నికల సమాయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీకి ధీటుగా బీజేపీని తయారవుతుందన్న ఆశావాదం ఆయనలో కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులను హోల్‌సేల్‌గా బీజేపీలో చేర్చుకోవడం వల్ల బీజేపీకి మేలు జరిగే సంగతి అటుంచితే, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి వున్న పరువును కూడా బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకులు పాడుచేసే ప్రమాదం లేకపోలేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి పెద్దాయన ఏపీలో బీజేపీని బాగుచేస్తారో, పాడు చేస్తారో వేచి చూడాలి.