తెలంగాణా రైతన్నలను కాపాడుకొందాము
posted on Nov 1, 2014 @ 9:05PM
యధా రాజా తధా ప్రజా అన్నారు పెద్దలు. అది తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన మంత్రులకి కూడా సరిగ్గా వర్తిస్తుందని చెప్పవచ్చును. విద్యుత్ కష్టాలకు గత ప్రభుత్వాలే కారణం కనుక రైతుల ఆత్మహత్యలకు కూడా గత ప్రభుత్వాలే కారణమవుతాయనే సిద్దాంతాన్ని ఆయన కనుగొన్న తరువాత దానిని ఆయన మంత్రులు కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నారు.
వారిలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఒకరు. కానీ ఆయన మరో అడుగు ముందుకు వేసి “తెరాస అధికారంలోకి వచ్చిన తరువాతనే రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నట్లు తెదేపా, కాంగ్రెస్ పార్టీలు మాట్లాడుతున్నాయి. కానీ వారి హయాం నుండే రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. వారి పరిపాలనలో మూడువేలమందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. కావాలంటే ఇదిగో సాక్ష్యం..” అని ఏవో కాగితాలు చూపించారు. అంతేకాదు రాష్ట్రం మొత్తంలో ఏ జిల్లాలో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకొన్నారో లిస్టులు తెప్పించుకొని వారి కుటుంబాలకి తమ ప్రభుత్వం సాయం చేద్దామని ఆలోచిస్తున్నట్లు చెప్పడం చూస్తే ఆయన రైతుల ఆత్మహత్యలకు, వారి కష్టాలకు ఆయన మానవత్వంతో స్పందిస్తున్నట్లు కనబడలేదు.
అసలు ప్రభుత్వంలో మంత్రులు, శాసనసభ్యులు, యంపీలు, యం.యల్సీలు అందరూ స్వయంగా రైతులను కలుస్తూ వారికి భరోసా కల్పించే విధంగా మాట్లాడి, వీలయినంత తక్షణ సహాయం అందించి వారు ఆత్మహత్యలు చేసుకోకుండా ఎందుకు అడ్డుకొనే ప్రయత్నాలు చేయడం లేదు? రైతన్నలు బ్రతికున్నప్పుడు పట్టించుకోకుండా చనిపోయిన రైతు కుటుంబాలకు సహాయం చేస్తామని చెప్పడం ద్వారా వారికి ఎటువంటి సందేశం అందిస్తున్నారు? అని తెలంగాణా మంత్రులు తమను తాము ప్రశ్నించుకోవాలి.
ఇక తెలంగాణాలో ప్రతిపక్షాలు కూడా సున్నితమయిన ఈ సమస్యపై రాస్తారోకోలు, ఆందోళనలు చేసి రాజకీయంగా మరింత బలం పెంచుకోవాలని చూస్తున్నాయే తప్ప అన్ని పార్టీలు కలిసి డిల్లీ వెళ్లి ఈ సమస్య పరిష్కారం కోసం కేంద్రంపై ఒత్తిడి తేకపోవడం చాలా శోచనీయం. ఈ సమస్య వలన అధికార పార్టీ ఇబ్బందిపడితే దానిపై తాము పైచేయి సాద్ధిదామనే తపనే కానీ తమ కళ్ళ ముందు ఆత్మహత్యలు చేసుకొంటున్న రైతన్నలను చూసి కంటతడి పెట్టలేకపోతున్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం కలిసి పోరాడిన రాజకీయ పార్టీలు, జేఏసీలు ఇప్పుడు తమ రైతన్నలను రక్షించుకోవడానికి ముందుకు రాకుండా ఏమి చేస్తున్నాయి?
కేవలం తెలంగాణా ప్రభుత్వం, అక్కడి ప్రతిపక్షాలే కాదు, ఆంధ్రా ప్రభుత్వం, అక్కడి ప్రతిపక్షాలు కూడా తెలంగాణా రైతన్నలను కాపాడుకోవడం కోసం స్వచ్చందంగా ముందుకు రావాలి. కరెంటు ఇవాళ్ళ కాకపోతే రేపు వస్తుంది. కానీ రైతన్నలు చనిపోతే మరిక ఎన్నడూ తిరిగిరారనే సంగతి అందరూ గుర్తుంచుకొని, తక్షణం వారి సంక్షేమం కోసం అందరూ ఏమి చేయగలరో అది చేసి అందరికీ అన్నం పెట్టె అభాగ్య అన్నదాతలను కాపాడుకోవాలి. కార్ల మీద, మోటార్ సైకిల్ల నెంబరు ప్లేట్ల మీద ‘ఐ లవ్ ఇండియా’ అని స్టిక్కర్లు అంటించుకొని తిరగడం కాదు. ఇటువంటి సమయంలో కష్టాలలో ఉన్న రైతన్నలను ఆదుకొని ఇండియా పట్ల తమ ప్రేమ నిజమయిందని నిరూపించుకోవాలి. ఇరుగు పొరుగు రాష్ట్రాలలో, విదేశాలలో స్థిరపడిన ప్రవాస ఆంధ్ర, తెలంగాణా ప్రజలందరూ కూడా తెలంగాణా రైతన్నకి సహాయం చేసేందుకు తక్షణమే ముందుకు రావాలి.