విజయవాడకు ప్రభుత్వ శాఖల తరలింపు సాధ్యమేనా?

  ఈ దసరా పండుగలోగా విజయవాడకు రాష్ట్ర ప్రభుత్వ అన్ని ప్రధాన శాఖలను తరలించి ఇకపై అక్కడి నుండే పరిపాలనా వ్యవహారాలు చక్కబెట్టాలనుకొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన, కనీసం వచ్చేదసరా పండుగ నాటికయినా తీరుతుందో లేదో అనే అనుమానం కలుగుతోంది ప్రభుత్వోద్యోగుల తీరు చూస్తుంటే. ప్రభుత్వ శాఖల తరలింపు కోసం ఆర్ధిక శాఖ ప్రధాన కార్యదర్శి అజేయ్ కల్లాం, రవాణా శాఖా ప్రధాన కార్యదర్శి బీ. శ్యాం బాబు, మునిసిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి డి. సాంబశివరావులతో వేసిన త్రిసభ్య కమిటీ నిన్న హైదరాబాదులో ప్రభుత్వ శాఖల అధిపతులతో సమావేశమయినప్పుడు, ఉద్యోగులలో చాలా మంది తక్షణమే విజయవాడకు తరలి వెళ్లేందుకు సిద్దంగా లేరనే విషయం స్పష్టమయింది. ముందుగా ప్రజలతో నేరుగా సంబంధాలుండే మునిసిపల్, ఆరోగ్య, పౌర సరఫరా, విద్యా శాఖ వంటి కొన్ని ముఖ్యమయిన కార్యాలయాలు వెళ్ళినట్లయితే సరిపోతుందని, విజయవాడలో అన్ని ప్రభుత్వ శాఖలు నడిపేందుకు కార్యాలయాలు, ఉద్యోగులకు, అధికారులకు ఇళ్లు వంటివన్నీ అమరిన తరువాత అంచెలంచెలుగా తరలించినట్లయితే, ప్రభుత్వ కార్యకలాపాలు కూడా ఎటువంటి ఆటంకమూ లేకుండా సజావుగా సాగుతుంటాయని ఉద్యోగుల వాదన. వారి వాదన నిజమే కావచ్చు. కానీ వారి అయిష్టతకు కారణాలు మాత్రం వేరే ఉన్నాయి.   హైదరాబాదులో పనిచేస్తున్న ఉద్యోగులలో చాలామంది అక్కడే ఇళ్లు కొనుకొని స్థిరపడ్డారు. వారి పిల్లలు చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు అన్నీ కూడా అక్కడే జరుగుతున్నాయి. అందువలన వారు ఇప్పటికిప్పుడు విజయవాడకు తరలి వచ్చే పరిస్థితి లేదు. అలాగని నిరాకరించడానికి కూడా కుదరదు. కనుక తమకు మరికొంత సమయం ఇవ్వాలని కోరుకొంటున్నారు. కానీ అదెంతో ఎవరూ చెప్పలేరు కనుక ప్రభుత్వమే ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. కనుక వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు, కార్యాలయాల ఏర్పాటుకు ఎంత స్థలం అవసరం, తక్షణమే ఏయే శాఖల తరలింపు సాధ్యమవుతుంది? మిగిలినవి ఎన్ని దశలలో, ఎప్పటిలోగా పూర్తి తరలించవచ్చును? వంటి వివరాలతో వచ్చే అక్టోబరు 6న జరిగే సమావేశానికి హాజరుకమ్మని త్రిసభ్య కమిటీ అన్ని శాఖల అధిపతులకు ఆదేశించింది.   సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. విజయవాడలో అన్ని హంగులతో రాజధాని ఏర్పడే వరకు హైదరాబాదునే అంటిపెట్టుకొని ఉంటామని వాదిస్తే, పాలనాపరంగా చాలా సమస్యలు ఉత్పన్నం కావచ్చును. అలాగని రాత్రికి రాత్రి ఉద్యోగులను తట్టాబుట్టా సర్దుకొని విజయవాడ వచ్చేయమని ఆదేశించడం సబబు కాదు. కనుక దశాలవారిగానే ప్రభుత్వ శాఖలను తరలించడం అందరికీ మంచిదేమో?

ఆంద్ర, తెలంగాణా దోస్తీ కుదిరింది

  ఆంద్ర తెలంగాణా ప్రభుత్వాల మధ్య మొదటిలో కనబడిన ఘర్షణ వాతావరణం క్రమేపీ తగ్గుముఖం పడుతోందని చెప్పడానికి అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చును. అటువంటిదే మరో ఉదాహరణ రెండు రాష్ట్రాలు కలిసి ఒక సంయుక్త సంస్థను ఏర్పాటు చేసుకొని ఒడిష రాష్ట్రంలో నౌపార వద్దగల సర్పాల్‌ బొగ్గు గనులను అభివృద్ధి చేసుకొని, అందులో వచ్చే బొగ్గును సమానంగా వాటాలు పంచుకోవాలని అంగీకరించడం ఒకటని చెప్పుకోవచ్చును. ఇటీవల సుప్రీం కోర్టు 1993 నుండి వివిధ ప్రైవేటు సంస్థలకు కేటాయించిన బొగ్గు గనుల కేటాయింపులను రద్దు చేసింది. కానీ సమైక్య ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఈ బొగ్గు గనులను మాత్రం రద్దు చేయకపోవడంతో రెండు రాష్ట్రాలు కలిసి పనిచేసేందుకు సిద్దపడినట్లయితే, ఆ గనిలో లభ్యమయ్యే 280 మిలియన్‌ టన్నుల బొగ్గును దక్కించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెంటనే సానుకూలంగా స్పందించారు.   తీవ్ర విద్యుత్ కొరతతో ఇబ్బందులు పడుతున్న రెండు రాష్ట్రాలకు ఇది ఊహించని వరమని చెప్పవచ్చును. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సంస్థలు అనేకం ఉన్నప్పటికీ నిత్యం బొగ్గు కొరతతో సతమతమవుతున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఇదొక వరమని చెప్పవచ్చును. ఈ బొగ్గు గనులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పక్కనే ఉన్న ఓడిషా రాష్ట్రంలో ఉండటం వలన రవాణా ఖర్చు కూడా తగ్గుతుంది. అదేవిధంగా తెలంగాణకు అక్షయపాత్ర వంటి సింగరేణి బొగ్గు గనులున్నప్పటికీ ఇప్పుడు అదనంగా లభిస్తున్న ఈ బొగ్గును అవసరమయితే వాడుకోవచ్చును, లేదా తెలంగాణాలో కొత్తగా విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఏర్పాటు చేసుకొనేవరకు తన వాటాను కూడా ఆంధ్రాకే అమ్ముకొని సొమ్ము చేసుకోవచ్చును.   ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఇందుకోసం ఏపీ జెన్ కో మరియు ఏపీ మినరల్ డేవలప్మెంటు సంస్థలకు ఈ బాధ్యత అప్పగిస్తే, తెలంగాణా ప్రభుత్వం తెలంగాణా జెన్ కో సంస్థకు ఈ బాధ్యత అప్పగించింది. ఇప్పుడు రెండు రాష్ట్రాలకు చెందిన ఆ మూడు సంస్థలు కలిసి ఒక సంయుక్త సంస్థను ఏర్పాటు చేసుకొని నౌపారాలో బొగ్గును త్రవ్వి వెలికి తీసి చెరిసగం సమానంగా పంచుకొనేందుకు సిద్దమవుతున్నాయి. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇరువురూ కూడా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపడంతో, సంబంధిత అధికారులు సంయుక్త సంస్థ ఏర్పాటుకు అవసరమయిన విధివిధానాలు, దానికి అధికారుల నియామకాలు తదితర అంశాలపై కసరత్తు త్వరలోనే మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. ఇదే విధంగా మిగిలిన వ్యవహరాలలో కూడా రెండు ప్రభుత్వాలు ఇచ్చి పుచ్చుకొనే ధోరణి అవలంభిస్తే, రెండు రాష్ట్రాలు సమానంగా వేగంగా అభివృద్ధి సాధించగలవు.

జయమ్మ ఓదార్పు యాత్ర కబుర్లు

  అదేమిటో ఈ వెర్రిబాగుల జనాలు అక్కడెక్కడో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కేసుకి రాష్ట్రంలో మన రెడ్డిగారి కేసులకి ముడిపెట్టేసి, ‘అంతకు ఇంత అయితే ఇంతకు ఎంత?’ అని ఏవేవో కాకి లెక్కలు కట్టేస్తున్నారు. మరి అదేమీ వెర్రి ఆనందమో ఏమో? పైగా అన్నీ అచ్చం ఇక్కడిలాగే జరగడం వెనుక రాజకీయ కుట్ర ఏమయినా ఉందా? అనే అనుమానాలొకటి? వారి అనుమానాలను అంత వీజీగా కొట్టిపారేయడానికి లేదట. ఎందుకంటే జయలలిత అరెస్టు కావడంతో అక్కడ కూడా అనేకమంది ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకొంటున్నారుట. ఇంకెంతో మంది గుండెలు పెటేల్ పెటేల్మని కుండల్లా బ్రద్దలయినపోతున్నాయిట. ఇదంతా చూస్తున్నా మీకేమి గుర్తుకు రాకపోతే గజినీలాగా మెమొరీ లాసుందేమో చూపించుకొండని ఉంచిత సలహా ఒకటి.     అందువల్ల జయమ్మను ఇంకా మరికొన్నాళ్ళు ఇలాగే జైల్లో ఉంచినట్లయితే ఇంకా ఎన్ని వందల మంది ప్రాణాలు పోగొట్టుకొంటారో ఊహించడం కష్టం కనుక ఆ (మానవీయ) కోణంలో ఆలోచించయినా ఆమెకు బెయిలు మంజూరు చేయమని ఆమె తరపున వాదిస్తున్న జెట్మలానీగారు కోర్టు వారిని అడిగారో లేదో అని ఇక్కడి జనాలు ఒకటే ఇదయిపోతున్నారు. ఏమయినప్పటికీ ఇప్పుడు ఆ రాష్ట్రంలో కూడా జయమ్మ కారణంగానే జనాలు ప్రాణాల మీదకు తెచ్చుకొంటున్నారు కనుక ఇక తప్పనిసరిగా ఆమె కూడా వీలు వెంబడి ఓదార్పు యాత్రలు చేయక తప్పదని ఇక్కడి జనాలు అభిప్రాయపడుతున్నారు.     ఇంతవరకు ఆమె చేసింది చూసి మిగిలినవారు ఫాలో అయిపోవడమే తప్ప ఆమె ఏనాడు ఎవరినీ ఫాలో అయిన దాఖలాలు లేనప్పటికీ, ఓదార్పు యాత్రలు చేయడంలో మంచి అనుభవం ఉన్న మన రెడ్డిగారిని సంప్రదించడంలో తప్పేమీ లేదని జనాలు ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇప్పుడు వైకాపా జాతీయపార్టీ అయిపోతోంది కనుక ఒకటేమిటి ఏడ్చేవాళ్ళు ఉండాలే కానీ అవసరమయితే చుట్టుపక్కల మరో నాలుగయిదు రాష్ట్రాలలో కూడా ఓదార్పు యాత్రలు చేసుకోగోలదని బల్ల గుద్ది వాదిస్తున్నారు అభిమానులు.   కానీ ఒట్టి తమిళనాడుకే పరిమితమయిన జయమ్మ ప్రస్తుతం సెల్లులో తనను తాను ఓదార్చుకొంటూ, అందులో నుండి బయటపడ్డాక తన కోసం ప్రాణాలు పోగొట్టుకొంటున్న తమిళ తంభిల కుటుంబాలను ఓదార్చక తప్పేలా లేదు. కానీ నాలుగేళ్ళు జైలులో కూర్చొంటే, పదేళ్ళ దాక ఎన్నికలలో పోటీ చేసేందుకు వీలుండదు కనుక, ఎవరినో ఓదార్చడం కంటే తనను తానే ఓదార్చుకోవడమే మంచిదని ‘నిపుణులు’ అభిప్రాయపడుతున్నారు.   ముష్టి అరవై కోట్ల అక్రమాస్తుల కేసును పట్టుకొని ఇరవై ఏళ్ళు సాగదీయగలిగినప్పుడు, ఇప్పుడు జెట్మలానీ గారు తిమ్మిని బమ్మిని చేసేసి కోర్టు కళ్ళకు మరో నల్లగుడ్డ ముక్కను గట్టిగా కట్టేసి బెయిలు మీద విడిపించకుండా ఉంటారా? అని సానుకూల దృక్పధంతో ఆలోచిస్తున్న వారూ లేకపోలేదు. అటువంటి వారు ఒకవేళ ఆమె బెయిలుపై బయట పడగలిగినట్లయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు, బెయిలు దొరికినప్పుడే ఓదార్పు యాత్రలు చేసుకోవాలని సూచిస్తున్నారు.   అయితే ఎంతసేపు ఆమె కేసులు, ఆమె బెయిలు, ఆమె ఓదార్పు యాత్రల గురించి మాట్లాడటమే కానీ మనోళ్ళ గొప్పదనం గురించి చెప్పుకొనే మంచి బుద్ధులు, మంచి అలవాట్లు బొత్తిగా మనోళ్ళకి లేవని జనాలు చాలా బాధ పడుతున్నారు. అది చూసి నిక్షేపంగా బెయిలు మీద తిరుగుతున్నవాడిని పట్టుకొని ఆ మాటనడానికి మీకు నోరెలా వచ్చిందని కసురుకొనే వారు లేకపోలేదు.   అయినా జయమ్మ జైల్లోకి వెళ్ళింది కదాని మన రెడ్డిగారు, కనిమోలి, రాజావారు అందరూ అలాగే జైలుపాలయిపోతారనుకోవడం అవివేకం కాదా? ఎంత చెట్టుకు అంత గాలన్నట్లు ఎవరి కేసులు వారివి. ఎవరు ఎప్పుడు లోపలకి వెళతారో ఎప్పుడు ఎలా బయటకు వస్తారో ఎవరికీ తెలియదు. కానీ లోకులు కాకులు వంటి వారు. మడమ తిప్పని మంచి వాళ్లకే కష్టాలన్నీ. అలాగని జైలు శిక్ష పడగానే బెంబేలు ఎత్తిపోనవసరం లేదంటున్నారు నిపుణులు.   విలాసవంతమయిన తమ జీవితాలను ప్రజల కోసమే త్యాగం చేసేసి జైలుకు వెళుతున్నట్లు చెప్పుకొనే ఒక కొత్త వెసులుబాటు కనుగొనబడిందిప్పుడు. పంటి బిగువున తాము భరించిన జైలు కష్టాలన్నీ ప్రజల కోసమే పడుతున్నట్లు చెప్పుకోనే వెసులుబాటున్నపుడు జైలు శిక్ష కూడా రాజకీయ జీవితానికి పెట్టుబడి క్రిందే భావించడం అలవాటు చేసుకోగలిగితే ఇంక ఏ బాధ ఉండదు. అప్పుడు పోలీసు వ్యానులో ఎక్కుతున్నప్పుడు, జైల్లోకి వెళుతున్నప్పుడు, మధ్యమధ్య కోర్టు కేసులకి హాజరవుతున్నప్పుడు, బెయిలు మీద బయటకు వస్తున్నప్పుడు హుషారుగా అభిమానులు వెంటరాగా ఎంచక్కా ఊరేగింపులు కూడా నిర్వహించుకోవచ్చునని అనుభవజ్ఞుల సలహా.

ఇసుకమాఫియాపై సీబీఐ విచారణకు వైకాపా డిమాండ్

  రాష్ట్రంలో నానాటికి పెరిగిపోతున్న ఇసుక మాఫియాపై సీబీఐ విచారణకు ఆదేశించాలని వై.యస్సార్. కాంగ్రెస్ పార్టీ నేత జ్యోతుల నెహ్రు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వ ఉదాసీనత వల్ల అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు కూడా తీవ్ర నష్టం జరుగుతోందని, కనుక ప్రభుత్వం తక్షణమే ఇసుక మాఫియాపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.   రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం ఇసుక మాఫియానే కాక, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఎర్రచందనం దొంగల మాఫియా, గనుల మాఫియా వంటి రకరకాల మాఫియా గ్యాంగులు చెలరేగిపోతున్నాయి. అయితే జ్యోతుల నెహ్రూ కోరినట్లుగా వాటిపై సీబీఐ విచారణకు ఆదేశించినంత మాత్రాన్న ఆ మాఫియాలు వెనక్కు తగ్గుతాయని ఆశించలేము. వాటన్నిటి వెనుక రాజకీయ పార్టీ నేతలలున్నంత కాలం వారి ఆటలు కొనసాగుతూనే ఉంటాయి. గత రెండు దశాబ్దాలుగా శేషాచలం అడవులలో నుండి ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్నప్పటికీ, ఇంతవరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడి పేరు బయటపడకపోవడం గమనిస్తే పరిస్థితి అర్ధమవుతుంది. ఇటువంటి ప్రతీ అక్రమం వెనుకా ఏదో ఒక పార్టీకి చెందిన రాజకీయ నాయకులే ఉంటునప్పుడు వాటిపై సీబీఐ విచారణలు చేయాలని డిమాండ్ చేయడం ద్వారా దాని వెనుక ఉన్న సదరు నేతను ఇబ్బంది పెట్టడానికే తప్ప వేరే ఇతరత్రా ఏ ఉపయోగం ఉండబోదని చెప్పవచ్చును. దేశంలో ఉగ్రవాదులను, మావోయిస్టులను ప్రభుత్వం ఏవిధంగా ఉక్కు పాదంతో అణచివేస్తుందో ఈ మాఫియాలను కూడా అదే విధంగా అణచి వేయగలిగినప్పుడే ఈ మాఫియా ఆగడాలు తగ్గుముఖం పడతాయి.

యూపీయే డీలా...ఎన్డీయే టైట్: వినోద్ రాయ్

యూపీయే హయంలో 2జి, బొగ్గు కుంభకోణాలను బయటపెట్టిన మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ వ్రాసిన ‘జస్ట్ నాట్ యాన్ అకౌంట్’ అనే పుస్తకం కొద్ది రోజుల క్రితం మార్కెట్లోకి విడుదలయింది. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ “సంకీర్ణ రాజకీయాల కారణంగా యూపీయే ప్రభుత్వాన్ని కూటమిలో భాగస్వామ పార్టీలు తలోదిక్కుకు లాగుతుండటం వలన పాలనపై ప్రభుత్వానికి పూర్తి నియంత్రణ లేకుండా పోయిందని, దాని వలన అధికారులలో కూడా జవాబుదారీతనం లోపం కొట్టవచ్చినట్లు కనబడేదని అన్నారు. కానీ ఎన్డీయే ప్రభుత్వంపై మాత్రం ఆ పార్టీ నాయకత్వం పూర్తి నియంత్రణ సాధించిందని ఆయన అన్నారు. అదే విధంగా ఎన్డీయే ప్రభుత్వం అనేక నిరుపయోగామయిన వ్యవస్థలను రద్దు చేయడం వలన అధికారులకు స్వేచ్చగా నిర్ణయాలు తీసుకొనేందుకు వీలుపడుతోందని అంతే కాక దాని వలన వారిలో జవాబుదారీతనం పెరిగినట్లు స్పష్టంగా కనబడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే తానిప్పుడు ప్రభుత్వంలో ఎటువంటి బాధ్యతలు నిర్వహించడం లేదు కనుక మరింత లోతుగా విశ్లేషించలేనని ఆయన తెలిపారు. మోడీ ప్రభుత్వంపై వినోద్ రాయ్ ప్రశంశలు గమనిస్తే బహుశః ఆయన ఏదయినా పదవి ఆశిస్తున్నారేమో అనే అనుమానం కలగడం సహజం. అయితే అటువంటి నిజాయితీపరుడయిన మాజీ ఉన్నతాధికారి సేవలను మోడీ ప్రభుత్వం ఉపయోగించుకొంటే మంచిదే.

జగన్మోహన్ రెడ్డికీ జయలలిత పరిస్థితే ఎదురవుతుందా?

  అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు, ఆమె అనుచరులకు ప్రత్యేక న్యాయస్థానం విధించిన శిక్షలు చూస్తున్నవారికి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు కూడా మనసులో మెదలడం సహజం. జయలలితపై రూ.63 కోట్ల అక్రమాస్తుల కేసులు నమోదు అయితే జగన్ పై వేల కోట్ల అక్రమాస్తుల కేసులు నమోదు చేయబడ్డాయి. జయలలితపై కేవలం ఒక్క కేసు మాత్రమే ఉండగా, జగన్మోహన్ రెడ్డిపై ఏకంగా పదకొండు చార్జ్ షీట్లు నమోదు చేయబడి ఉన్నాయి. వాటిలో పదింటిని నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచిన సీబీఐ మాజీ జాయింట్ డైరక్టర్ లక్ష్మినారాయణ పూర్తి సాక్ష్యాధారాలతో చాలా పకడ్బందీగా నమోదు చేసారు. ఒకవేళ ఆ పది చార్జ్ షీట్లలో ఏ కొన్నిటిలో జగన్మోహన్ రెడ్డి, మిగిలిన నిందితులు దోషులుగా నిర్ధారించబడినా శిక్షలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించడం కూడా కష్టమే. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి బెయిలుపై బయట ఉన్నప్పటికీ, సీబీఐ కోర్టుకు తరచూ హాజరవుతూనే ఉన్నారు. ఇదివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చలువ వలననే ఆయన బయటున్నారనే వాదనలు వినబడుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆయన తీవ్రంగా వ్యతిరేఖించే తెదేపా మిత్రపక్షమయిన బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కనుక ఆయన కేసుల విషయంలో కలుగజేసుకోకపోవచ్చును. జయలలిత అక్రమాస్తుల కేసులను ఆమె లాయర్లు దాదాపు రెండు దశాబ్దాలు నెట్టుకు రాగలిగారు. కానీ చివరికి శిక్షపడకుండా మాత్రం ఆమెను కాపాడలేకపోయారు. అందువలన ఆయన తరపున వాదిస్తున్న లాయర్లు ఈ కేసులన్నిటినీ ఎంత సమర్ధంగా, ఎంత ఎక్కువ కాలం పొడిగించగలరనే దానిపైనే ఆయన భవిష్యత్ ఆధారపడిఉందని చెప్పవచ్చును. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తరపున వాదిస్తున్న లాయర్లు కూడా కనీసం వచ్చే ఎన్నికలవరకు కేసులను సాగదీయగలిగితే, అప్పటికి రాష్ట్రంలో కానీ, కేంద్రంలో గానీ రాజకీయ పరిస్థితులలో మార్పులు వస్తే ఆయనకు ఎంతో కొంత ఉపశమనం దొరకవచ్చును. కానీ ఈలోగానే ఆయన కేసులలో ఏ ఒక్కటి కొలిక్కి వచ్చినా ఆయనకు ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు తప్పక పోవచ్చును.   జయలలిత అక్రమాస్తుల కేసులు ఆమె రాజకీయ భవిష్యత్తును ఏవిధంగా ప్రభావితం చేసాయో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు కూడా ఆయన రాజకీయ భవిష్యత్ పై తీవ్ర ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అమ్మ, కోర్టు ఒక గజన్...

      కోర్టు: ఏంటమ్మా...అరవై కోట్లు నొక్కేసింది చాలక పైగా అన్యాయం..అన్యాయం అనడం నీకేమయినా న్యాయంగా ఉందా?   అమ్మ: బాగుంది మీవరస! అదంతా మా పూర్వీకులు ఇచ్చిన ఆస్తులే!   కోర్టు: 28కేజీలు బంగారం, 880కేజీల వెండి, 10, 000 చీరలు, 700 చెప్పుల జతలు ఇవి కూడా మీ పూర్వీకులు ఇచ్చినవేనా తల్లీ?   అమ్మ: అలాగని నేనేపుడన్నాను? అవన్నీ నేను సినిమాలలో చేసినప్పుడు వేసుకొన్నవే. అయినా సినిమావాళ్లకు చీరలు, నగలు, చెప్పులు ఉండకపోతే రాజకీయ నాయకులకి ఉంటాయా?   కోర్టు: తమరిప్పుడు రాజకీయ నాయకులే కాదమ్మా?   అమ్మ: అందుకే కదా అవేవీ ఇప్పుడు వేసుకోకుండా జాగ్రత్తగా బీరువాల్లో పెట్టుకొంటే మీరొచ్చి పట్టేసుకొని నన్ను ‘దోషి...దోషి...’ అనగలుగుతున్నారు?   కోర్టు: అదేమిటమ్మా? తమరికి తమిళనాడులోనే కాక హైదరాబాదులో ఇంకా దేశంలో చాలా చోట్ల స్థిరాస్తులున్నాయన్నమాట వాస్తవమా కాదా?   అమ్మ: ఉంటే...? ఆ గజన్ రెడ్డికి లేవా గాలి రెడ్డికి లేవా? వారినెవరయినా మీరు అడగగాలిగారా? ఆడదాన్ని అందునా అనారోగ్యంతో ఉన్నదానిని పట్టుకొని చేతికొచ్చిన తీర్పులు గీకేయడం ఏమీ బాలేదు స్మీ!   కోర్టు: చట్టం ముందు అందరూ సమానమే తల్లీ! ఆయనకీ ఒక పదకొండు చార్జ్ షీట్లు వెనకేసుకొని తిరుగుతున్నారు..మీకు తెలుసు కదా?   గజన్: వీళ్ళేమిటీ మధ్యలో నాగురించి మాట్లాడుతున్నారు...అసలు కేసు గురించి మాట్లాడకుండా?   కోర్టు: అమ్మా! మీరు ఇన్ని కోట్లు పోగేసుకొన్నారు కదా...ముఖ్యమంత్రిగా నెలకి రూపాయే జీతం తీసుకొంటూ ఇంత ఎలా సాధ్యమయింది తల్లీ?   అమ్మ: ఏమిటండి ఈ అసందర్భపు ప్రశ్నలు?   గజన్: అవును! అసందర్భపు ప్రశ్నలే.. లేకపోతే ఏమిటి? మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి అరవై కోట్లు మాత్రమే పోగేసారా? సిగ్గుపడాలి. పైగా అది కూడా తాత పెట్టాడు..ముత్తాత పెట్టాడు...సినిమాలలో సంపాదించుకొన్నానని చెప్పుకోవడం కూడాను..   కోర్టు: నువ్వు దోషివమ్మా!   అమ్మ: పదవిలో ఉన్నపుడు నాలుగు రాళ్ళు వెనకేసుకోవడం నేరం, దోషం ఎలావుతుందో నాకయితే అర్ధం కావడం లేదు.. ఇది చాలా అన్యాయం.. చాలా చాలా అన్యాయం..   గజన్: అవును... అన్యాయమే...నేను రాజకీయాలలోకి రాకుండానే వేలకోట్లు సంపాదించాను. పాపం ఆమె పదవిలో ఉండి కూడా సంపాదించుకోలేకపోయింది..అయినా ఆమెను దోషి దోషి అనడం అన్యాయమే..అయినా పదవిలో ఉన్నామా లేదా అనేది పాయింటు కాదు... ఎప్పుడు వచ్చేమన్నది కూడా కాదు పాయింటు. ఎలా..ఎంత సంపాదించామన్నదే పాయింటు. పట్టుమని ఐదేళ్ళలో వేలకోట్లు సంపాదించడంలో నా తెలివి తేటలను చూసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫ్లాటయిపోయాడు. నా కేసును హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాట్యాంశంగా పెట్టాలని కూడా రికమండ్ చేసారంటేనే నా గొప్పదనం ఏమిటో అర్ధమవుతుంది.   కోర్టు: అమ్మా! నీకు జైలు శిక్ష ఖరారు చేస్తున్నాము. నీ అరవైకోట్ల ఆస్తిని కూడా జప్తు చేస్తునాము.   అమ్మ: అన్యాయం...అన్యాయం.. నామీద అక్రమంగా కేసులు పెట్టినవారు నా ఉసురు తగిలి నాశనమయిపోతారు...సర్వ నాశనమయిపోతారు...ఆడదాని కష్టార్జితాన్ని దోచుకొన్నవారెవరూ బాగుపడలేదు...అయినా ఈ కోర్టు కాకపోతే పై కోర్టు ఉండనే ఉంది కదా?   గజన్: అబ్బా ఏమిటా శాపనార్ధాలు? వినలేకపోతున్నాను... అయినా ముష్టి అరవై కోట్లకే అంత వలవల ఏడవాలా? ఎన్ఫోర్స్ మెంటు అధికారులు నావి ఎన్ని వందల కోట్లు జప్తు చేసారో కూడా నాకు తెలియదు..అయినా చీమ కుట్టినట్లయినా లేదు నాకు...అయినా కేంద్రంతో నాలాగ డీల్ మాట్లాడేసుకొంటే పోలా? ఎందుకు ఆ ఏడుపులు రాగాలు? సేకట్రీ...ఆ టీవీ కట్టేయి...చూడలేక చస్తున్నాను.

మంత్రులకు చిన్నాయన క్లాసుల మీద క్లాసులు

  అసలు కంటే కొసరు ముద్దు అంటారు. ముఖ్యమంత్రి అసలు అయితే ఆయన పుత్రరత్నం కొసరు. అయితే కొసరుగా వుండాల్సిన ఆయన నిరంతరం కసురుకుంటూ వుంటే పరిస్థితి ఎలా వుంటుంది? రాష్ట్ర మంత్రులు అనుభవిస్తున్న మానసిక వేదనలా వుంటుంది. పెద్దాయన ముఖ్యమంత్రి రాష్ట్ర పాలన వ్యవహారాలు చూసుకుంటూ వుంటే, ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలతోపాటు పార్టీ వ్యవహారాలను కూడా చిన్నాయన చక్కబెట్టుకుంటూ వస్తున్నారు. మంత్రులను పెద్దాయన ప్రశ్నిస్తున్నారో లేదోగానీ, చిన్నాయన మాత్రం మంత్రుల పనితీరు మీద నిఘా నేత్రం పెట్టారు. వారు ఏ పని చేస్తున్నారు.. ఏయే అనుమతులు ఇస్తున్నారు.. ఇలాంటి వ్యవహారాలన్నిటి మీదా చిన్నాయన కన్ను వేసి వుంచినట్టు తెలుస్తుంది.   మంత్రులు పెద్దాయనతోపాటు చిన్నాయనకు కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రులు చేసే ప్రతి పనిమీదా చిన్నాయన రివ్యూ వుంటుంది. ఏదైనా తేడాలుంటే రూమ్‌లోకి పిలిచి క్లాసుల మీద క్లాసులు పీకుతున్నారని తెలుస్తోంది. నవ్వుతూ చిన్నాయన రూమ్‌లోకి వెళ్ళిన మంత్రులు రూమ్‌లోంచి బయటకి వచ్చేటప్పుడు ముఖాలు వేలాడేసుకుని, వాడిపోయిన తోటకూర కాడల్లాగా దిగాలుగా బయటకి వస్తున్నారట. ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు.. ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు అంటూ చిన్నాయన సంధించే ప్రశ్నలకి అప్పటికప్పుడు జవాబు దొరక్క మంత్రులు తెల్లముఖాలు వేసుకుని చూస్తున్నారట. పెద్దాయనే మాకు ఇంతింత క్లాసులు తీసుకోడు.. ఈ చిన్నాయన క్లాసులేంట్రా భగవంతుడా అని లోపల్లోపల కుమిలిపోతున్నారట.   చిన్నాయన క్లాసులు పీకే విషయంలో చాలా లిబరల్‌గా వ్యవహరిస్తున్నారట. రాజకీయాలకు పాతవారా.. కొత్తవారా.. చిన్నవారా.. పెద్దవారా.. జూనియర్ మంత్రులా.. సీనియర్ మంత్రులా... ఇలాంటి అడ్డుగోడలేవీ లేకుండా అందరికీ ఒకే స్థాయిలో భారీ క్లాసులు తీసుకుంటున్నారట. చిన్నాయన క్లాసులు వింటున్న వాళ్ళకి ఈయన పూర్వజన్మలో లెక్చరర్ అయి వుంటారా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయట. చిన్నాయన కేవలం క్లాసులు తీసుకోవడంతో ఆగకుండా, మంత్రుల పనితీరుకు మార్కులు వేస్తున్నారట, ప్రోగ్రెస్ కార్డులు ఇస్తున్నారట. ఇంత ఎదిగిన తర్వాత ఇప్పుడు ఎలిమెంట్రీ స్కూలు పిల్లల్లా క్లాసులు వినడం, మార్కులు, ప్రోగ్రెస్ కార్డులేంటి దేవుడా అని పలువురు మంత్రులు తమ సహచరుల దగ్గర వాపోతున్నారట.   గమనిక: ఇంతకీ ఆ ముఖ్యమంత్రి పెద్దాయన ఎవరు? ఆయన పుత్రరత్రం చిన్నాయన ఎవరు? వీరు ఏ రాష్ట్రానికి చెందినవారు? ఏ పార్టీకి చెందినవారు అనే విషయాలు పాఠకుల ఊహాశక్తికే వదిలిపెట్టడమైనది.

తెలంగాణాకు తిరుగు ప్రయాణం అయ్యేందుకు వైకాపా సన్నాహాలు?

  రాష్ట్ర విభజన జరగబోతోందని పసిగట్టగానే కొండా సునీతా రెడ్డి వంటి తెలంగాణా నేతలు ఎంతగా వారిస్తున్నా వినకుండా వై.యస్సార్. కాంగ్రెస్ పార్టీ రాత్రికి రాత్రే తెలంగాణాలో నుండి దూకి బయటపడి సమైక్యాంధ్ర పాటందుకొంది. కానీ ఆ తరువాత తన తొందరపాటుకు తాపీగా చింతించింది. దాని పని రెంటికీ చెడిన రేవడిగా మారింది. తెలంగాణాలో పార్టీ నేతలను గాలికొదిలి బయటపడటం వలన అక్కడ పార్టీ మూతపడింది. పోనీ సమైక్యరాగమాలపించి ఆంధ్రాలో ఓట్లు నొల్లుకొందామని ఆశపడితే ఆ ఆలోచనా బెడిసి కొట్టింది. విశ్వసనీయతకు పేటెంట్ హక్కులు తీసుకొన్నట్లు మాట్లాడే వైకాపాకు సరిగ్గా ఆ విశ్వసనీయత కోరవడం వలననే రెండు చోట్లా దెబ్బతింది.   చేతులు కాలేక ఇప్పుడు ఆకులు పట్టుకొన్నట్లు తెలంగాణాలో మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకొనేందుకు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. తెలంగాణాలో మిగిలిన కొద్దిపాటి నేతలతో ఆయన ఈరోజు హైదరాబాదులో సమావేశమయ్యి, తెలంగాణాలో మళ్ళీ గ్రామ స్థాయి నుండి పార్టీని ఏవిధంగా బలపరుచుకోవాలాని చర్చించారు. అందుకోసం వచ్చేనెల మొదటి వారంలో తెలంగాణాలో పార్టీ నేతలందరితో ఆయన సమావేశమవ్వాలని నిర్ణయించుకొన్నారు.   తెరాస, వైకాపాల మధ్య తెర వెనుక ఎటువంటి సంబంధాలున్నాయో తెలియదు కానీ ఇంతకాలం ఒకదాని ప్రసక్తి మరొకటి ఎత్తకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. అయితే అందుకు ప్రధాన కారణం వైకాపా తెలంగాణాను వదిలిపెట్టడమేనని చెప్పవచ్చును. తమకు రాజకీయంగా ఇబ్బంది కలిగించనప్పుడు విమర్శించుకోవడం వలన ఎటువంటి ప్రయోజనమూ ఉండదు కనుకనే అవి ఇంతకాలం ఒకదానికొకటి దూరంగా ఉన్నాయని చెప్పవచ్చును. కానీ ఇప్పుడు వైకాపా మళ్ళీ తెలంగాణాలో అడుగుపెట్టి పార్టీని బలోపేతం చేసుకొంటూ తమ ప్రభుత్వంపై విమర్శలు సంధించడం మొదలుపెట్టినట్లయితే, తెరాస కూడా నోరు విప్పక తప్పదు. అసలు తెలంగాణాలో తెరాస తప్ప వేరే ఏ రాజకీయ పార్టీ ఉండకూడదని గట్టిగా కోరుకొంటున్న తెరాసకు ఇప్పుడు వైకాపా కూడా మళ్ళీ వచ్చి చేరాలని చూస్తే తెరాస తప్పకుండా దాని ప్రయత్నాలను అడ్డుకొనే ప్రయత్నాలు చేయవచ్చును.   తెరాస అడ్డుకోకపోయినా తెలంగాణా ప్రజలే ఆ పార్టీని తిరస్కరించవచ్చును. ఎందువలన జగన్మోహన్ రెడ్డి సీమాంధ్రలో పార్టీని బలోపేతం చేసుకోనేందుకే సమైక్యాంధ్ర ఉద్యమాలు చేసినప్పటికీ అవి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేఖిస్తూ చేసినవిగానే తెలంగాణా ప్రజలు భావించడం సహజం. అందువలన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తెలంగాణా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకొనేందుకు బయలుదేరినట్లయితే, ఆయనకు తెలంగాణా ప్రజలు మేళతాళాలతో ఎదురేగి పూలమాలలతో ఆహ్వానిస్తారని భావించలేము. కనుక ఇది కూడా మరొక తప్పుడు నిర్ణయమే అవుతుంది. ఈ నిర్ణయం వలన తెలంగాణాలో పార్టీ బలపడటం మాటెలా ఉన్నా, తెరాస కూడా శత్రువుగా మారడం తధ్యం.

చంద్రబాబు చెరువులో అవకాశవాద కప్పలు

  ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్ తెప్పలుగ చెఱువు నిండిన కప్పలు పది వేలు చేరు కదరా సుమతీ !   ........అని సుమతీ శతకకారుడు ఏనాడో చెప్పాడు. ఆవిషయం మరోసారి రుజువయ్యే సంఘటనలు చంద్రబాబు ప్రభుత్వం అనే చెరువులో జరుగుతున్నాయి. ఎవరిదగ్గర అధికారం వుంటే వాళ్ళ దగ్గర బెల్లం చుట్టూ చీమల్లా చేరే కొంతమంది పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు చుట్టూ చేరారు. మండూకాలు, పీపీలికాల్లాంటి ఈ శక్తులు గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో వుండగా ఆయన చుట్టూ చేరి తమకు కావలసిన పనులు చేయించుకునేవారు. వైఎస్సార్ హయాం ముగిసిన తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రుల చుట్టూ చేరి పబ్బం గడుపుకున్నారు. ఆ సమయంలో చంద్రబాబు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయని బడా నాయకులైన మెగా కృష్ణులు, నవయుగ విశ్వేశ్వరులు ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రాగానే చుట్టూ చేరి బెకబెకమంటున్నారు.   ప్రస్తుతం చంద్రబాబు చుట్టూ వున్న కోటరీ పరిస్థితి ఎలా వుందంటే, పార్టీ అధికారంలో లేనప్పుడు జెండాలు మోసి, లాఠీ దెబ్బలు తిని, పార్టీకి ఆర్థికంగా, నైతికంగా అండగా నిలిచిన వారిని దూరం పెడుతున్నారు. ఒకప్పుడు చంద్రబాబును కనీసం పట్టించుకోకుండా పోజులు కొట్టిన పారిశ్రామిక పెద్దమనుషులను చంద్రబాబు దగ్గరకి చేరుస్తున్నారు. ఈ పారిశ్రామిక పెద్దలు ఒకప్పుడు వైఎస్సార్ పంచె పట్టుకుని తిరిగినవారే. సీబీఐ ద్వారా అభియోగాలు ఎదుర్కొంటున్నవారే. అలాంటి వారు చంద్రబాబును ఎప్పుడు కలవాలని అనుకుంటే నేరుగా కలుస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు, నాయకులు చంద్రబాబుని కలవాలంటే మాత్రం అదో పెద్ద బ్రహ్మప్రళయంలా అవుతోంది. బెల్లంచుట్టూ చీమల్లాంటి ఆ పారిశ్రామికవేత్తలకు మాత్రం చంద్రబాబు దగ్గరకు వెళ్ళాటంటే రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. నిజమైన పార్టీ సేవకులను మాత్రం టెంటు సీఎం కార్యాలయం బయట టెంట్ కింద పడిగాపులు పడేలా చేస్తున్నారు.   ఈ పరిస్థితిని చూసి పార్టీ కార్యకర్తలు బాధపడుతున్నారు. అవసరం వున్నంత వరకు ఓడ మల్లన్న అవసరం తీరిన తర్వాత బోడిమల్లన్న అనే ఈ తరహా వ్యక్తులను చంద్రబాబు దూరంగా వుంచాల్సిన అవసరం వుందని కార్యకర్తలు భావిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు పార్టీలో, ప్రభుత్వ కార్యక్రమాల్లో సముచిత స్థానం కల్పించాలని కోరుతున్నారు.

చెవుల్లో పూలు పెడుతున్న చెవిరెడ్డి

  వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తనదైన శైలిలో గట్టిగా మాట్లాడుతూ, తన మాటలని వినేవాళ్ళ చెవుల్లో పూలు పెట్టడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అర్హులైన పేదవారికే ప్రభుత్వ పథకాలను అందేలా చేయాలని కృషి చేస్తోంది. అనర్హులకు, ఆర్థికంగా ఉన్నత స్థాయిలో వున్న వారికి ప్రభుత్వ పథకాలు అమలు చేయడం ఎంతమాత్రం న్యాయం కాదు. దీన్ని ఎవరూ సమర్థించరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమంగా తెల్ల రేషన్ కార్డులు కలిగి వున్నవారిని గుర్తించి, అటువంటి వారికి పథకాలు వర్తింపజేయకుండా వుండాలని, బోగస్ తెల్ల రేషన్ కార్డులను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ కృషిలో భాగంగా దాదాపు 67 లక్షల బోగస్ రేషన్ కార్డులు బయటపడ్డాయి. వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటున్న అనేకమంది అనర్హుల గుట్టు రట్టయింది. వీరిలో వైసీపీ ఎమ్మెల్యే తండ్రి చెవిరెడ్డి భాస్కరరెడ్డి తండ్రి కూడా వున్నారు. కోటీశ్వరుడైన చెవిరెడ్డి భాస్కరరెడ్డి తండ్రికి తెల్ల రేషన్ కార్డు వుండటంతోపాటు ఆయన నెలనెలా వృద్ధాప్య పెన్షన్ కూడా తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి పరకాల ప్రభాకర్ బయటపెట్టారు. ఈ వివరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంతోమందిని నోటి మీద వేలు వేసుకునేలా చేశాయి. బోగస్ రేషన్ కార్డుల ఏరివేత మీద రాద్ధాంతం చేద్దామని అనుకున్న వైసీపీ గొంతులో చెవిరెడ్డి తండ్రి ఉదంతం వెలక్కాయలా మారింది.   ఇదిలా వుంటే మొగుణ్ణి కొట్టినమ్మ మొగసాలకి ఎక్కిందన్నట్టుగా ఇంత జరిగినా పశ్చాత్తాపపడకుండా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మీడియా ముందుకు వచ్చి తనదైన శైలిలో ఘాటుగా మాట్లాడారు. తన తండ్రికి వైట్ రేషన్ కార్డు వుండటం, నెలనెలా పెన్షన్ అందడం తెలుగుదేశం పార్టీ కుట్ర అని ఆరోపించారు. ఎక్కడైనా ఇరుక్కుపోయిన రాజకీయ నాయకుడు సాధారణంగా వాడే ‘‘బహిరంగ చర్చకు వస్తావా’’ అనే సవాల్‌ని పరకాలకు ప్రభాకర్‌కి విసిరారు. గత పది సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. రేషన్ కార్డులు, వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చే అధికారం తెలుగుదేశం పార్టీకి లేదు. అలాంటప్పుడు ఆయన తండ్రికి తెల్ల రేషన్ కార్డు, వృద్ధాప్య పెన్షన్ రావడం తెలుగుదేశం కుట్ర ఎలా అవుతుందో ఘనత వహించిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి గారే చెప్పాలి. సరే, కాసేపు తెలుగుదేశం పార్టీ కుట్ర చేసి చెవిరెడ్డి తండ్రికి తెల్ల రేషన్ కార్డు, వృద్ధాప్య పెన్షన్ ఇచ్చిందే అనుకుందాం. అలా ఇచ్చేస్తే చెవిరెడ్డి తండ్రి వాటిని ఎందుకు తీసుకున్నట్టు? నెలనెలా రేషన్, వృద్ధాప్య పెన్షన్ ఎందుకు తీసుకుంటున్నట్టు? చెవిరెడ్డి తన వాగ్ధాటితో జనం చెవుల్లో పూలు పెట్టేముందు ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవాలని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. పేదలకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందాలని చిత్తశుద్ధితో కృషి చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికి ఇకనైనా సహకరిస్తే బాగుంటుందని సూచిస్తున్నాయి.

ఉందిలే మంచి కాలం ముందు ముందునా..

  రాష్ట్ర విభజన తరువాత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చాలా దయనీయంగా మారిన సంగతి అందరికీ తెలుసు. ఆర్ధిక లోటు కారణంగా ప్రభుత్వానికి కాళ్ళు, చేతులు కట్టేసినట్లుంది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ఈ పరిస్థితులను కూడా ఒక సవాలుగా స్వీకరిస్తాను తప్ప వాటిని చూసి నిరాశపడబోనని చెప్పడమే కాదు ఆచరణలో పెట్టి మరీ చూపిస్తున్నారు.   ఇటువంటి పరిస్థితుల్లో కూడా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వచ్చే నెల మొదటి వారం నుండి రూ.10000కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేసేందుకు సిద్దపడుతున్నారు. విభజన బిల్లులో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి ఉన్నత విద్యా సంస్థలు, పరిశ్రమలు, నిధులు, ప్రత్యేకహోదా కోసం గట్టిగా కృషి చేస్తున్నారు.   ఆ కారణంగానే ఇటీవల కేంద్రం నుండి రెండు వేర్వేరు బృందాలు పశ్చిమ గోదావరి జిల్లాలో యన్.ఐ.టీ. (నేషనల్ ఇన్స్తిటిట్యూట్ అఫ్ టెక్నాలజీ), తూర్పు గోదావరిలో పెట్రోలియం విశ్వవిద్యాలయం స్థాపన కొరకు తగిన ప్రాంతాన్ని, భవనాలను ఎంపిక చేసేందుకు వచ్చేరు. ఇప్పటికిప్పుడు భవన నిర్మాణం సాధ్యం కాదు కనుక అంతవరకు ఆ రెండు జిల్లాలో ఉన్న కాలేజీలలోనే వచ్చే ఏడాది నుండి తరగతులు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.   ఇక రాష్ట్రంలోకి కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా గట్టిగానే కృషి చేస్తున్నారు. ఆయన కృషి ఫలితంగానే తెలంగాణకు తరలిపోతుందనుకొన్న హీరో మోటార్స్ సైకిల్స్ తయారీ సంస్థ చిత్తూరుకి వస్తోంది. అదేవిధంగా అమెరికాలో స్థిరపడిన ఆంద్ర పారిశ్రామిక వేత్తలకు చెందిన దాదాపు 16 చిన్న మరియు మధ్య తరగతి ఐ.టీ. కంపెనీలు, త్వరలో రాష్ట్రానికి రానున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషి ఫలించినట్లయితే, పరిశ్రమలకు భారీగా పన్ను రాయితీలు ఉంటాయి కనుక ఇంకా అనేక దేశ విదేశ సంస్థలు రాష్ట్రానికి తరలి రావచ్చును.   పరిశ్రమలు రావాలంటే ముందుగా అందుకు సరిపోయే విద్యుత్ సరఫరా కూడా ఉండాలి. అందుకే విశాఖలో 4,000 మెగా వాట్స్ సామర్ధ్యంతో యన్టీపీసీ ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ నిర్మాణానికి, కర్నూలు మరియు కడప జిల్లాలో 2500 మెగా వాట్స్ సామర్ధ్యం గల సోలార్ పవర్ ప్లాంట్ల స్థాపనకు కేంద్ర విద్యుత్ శాఖతో కొద్ది రోజుల క్రితమే ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసారు.   అదే విధంగా ఇంతవరకు ఎవరూ పట్టించుకోని పర్యాటక రంగానికి కూడా చంద్రబాబు నాయుడు చాలా ప్రాధాన్యం ఇచ్చి దాని ద్వారా కూడా రాష్ట్ర ఆదాయం పెంచుకోవాలని ఆలోచిస్తున్నారు. అందువల్ల ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, ఇవన్నీ అమలయితే రాష్ట్రాదాయం ఊహించనంతగా పెరిగే అవకాశం ఉంది.   రాజధాని, వైజాగ్ నుండి చెన్నై వరకు పారిశ్రామిక కారిడార్, వైజాగ్, విజయవాడ, తిరుపతిలలో మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణం కూడా ఒక కొలిక్కి వచ్చినట్లయితే ఇక ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రమే పూర్తిగా మారిపోతుంది. చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి, చక్కటి రాజధాని నిర్మించి చూపినట్లయితే మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పినట్లు మరో 20 ఏళ్ళపాటు తెదేపా అధికారం చెలాయించుకోవచ్చును.

ఇంతకీ కేసీఆర్ రాజయ్యను ఎందుకు మందలించినట్లో?

  ప్రముఖ కవి కాళోజి నారాయణ రావు పేరిట వరంగల్ పట్టణంలో ‘కాళోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్’ అనే ఆరోగ్య విశ్వవిద్యాలయం స్థాపించేందుకు తెలంగాణా ప్రభుత్వం సిద్దం అవుతోంది. తెలంగాణా ఉపముఖ్యమంత్రి డా.రాజయ్య ఇదే మాట ప్రజలకు చెప్పినందుకు అందరి ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ చివాట్లు పెట్టారు. కానీ ఇప్పుడు ఆయనే ఆ ప్రతిపాదనను ఆమోదించడమే కాకుండా దానికి కాళోజీ పేరును కూడా సూచించారు. ఈ హెల్త్ యూనివర్సిటీ అనేది రాత్రికి రాత్రి తీసుకొనే నిర్ణయం కాదని అందరికీ తెలుసు. డా.రాజయ్య చెప్పిన విధంగానే వరంగల్లో విశ్వవిద్యాలయం స్థాపనకు ప్రభుత్వం కసరత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆచరణ సాధ్యం కాని హామీలు ఈయవద్దని ఆయనను నలుగురిలో మందలించడం దేనికి? అంటే డా.రాజయ్య ఆ విషయాన్ని బహిర్గతం చేయడం వలన తనకు దక్కాల్సిన ఆ ఖ్యాతి ఆయనకు చెందుతుందనే అసూయతో ఆవిధంగా అవమానించారా? లేక దళిత మంత్రుల పట్ల ఆయనలో చులకన భావం ఉండటం వలననే ఆవిధంగా అవమానించారా? ఏమయినప్పటికీ వరంగల్లో ఆరోగ్య విశ్వవిద్యాలయం స్థాపింపబడాలనే తన చిరకాల వాంఛ తీరబోతున్నందుకు డా.రాజయ్య చాలా ఆనందం వ్యక్తం చేసారు.

ఆ క్రెడిట్ కూడా మాదే! పొన్నాల

  ఉట్టికెగురలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లున్నాయి తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాటలు. కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా ఇచ్చినప్పటికీ పార్టీని ఎన్నికలలో గెలిపించుకోలేక చతికిలబడిన అయన, మార్స్ ఉపగ్రహం విజయం తమ పార్టీకే చెందుతుందని నిన్న ప్రకటించేసుకొన్నారు. మార్స్ మిషన్ విజయవంతం అవడంతో నిన్న హైదరాబాదులో పార్టీ కార్యాలయం గాంధీ భవన్ వద్ద వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన “ఇంత గొప్ప విజయం సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలను నేను అభినందిస్తున్నాను. ఈ ఖ్యాతి మా యూపీఏ ప్రభుత్వానికి దానిని నడిపిన మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగుకే దక్కుతుంది. ఎందుకంటే ఆయన హయాంలోనే ఈ మార్స్ మిషన్ ఆరంభించబడింది. అది నేటికీ విజయవంతంగా పూర్తవడం మాకు చాలా సంతోషం కలిగిస్తోంది,” అని అన్నారు.   ఆయన మాటలను కాదనడానికి ఏమీ లేదు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రయోగంలో చివరి దశను స్వయంగా చూసేందుకు ఇస్రోకి వెళ్ళడం, అక్కడ శాస్త్రవేత్తలను అభినందించడం వారు ఆయనను అభినందించడం, ఈ క్యాతి యావత్ భారతదేశానికి చెందుతుందని మోడీ ప్రకటించడం చూసి, పొన్నాల అందులో తమ హస్తం కూడా ఉందని ప్రకటించుకొన్నారు.   అయితే ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే డా. మన్మోహన్ సింగు పేరుకి ప్రధానమంత్రి అయినప్పటికీ గత పదేళ్ళ యూపీఏ పాలనలో కాంగ్రెస్ నేతలు అందరూ సోనియా గాంధీ చుట్టూ ఉపగ్రహాలలాగా ప్రదక్షిణాలు చేసేవారు తప్ప ఏనాడూ ఆయనను పట్టించుకొన్న దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు పొన్నాల పొరపాటున సోనియాకు బదులు ఆ ఖ్యాతిని ఆయనకు ఆపాదించేసినట్లుంది. ఈ విషయమై ఎవరో ఒకరు సోనియమ్మ చెవిలో వేస్తే ఇప్పటికే ఊగిసలాడుతున్న ఆయన పీసీసీ కుర్చీలో నుండి క్రింద పడిపోయే ప్రమాదం ఉంది.

పాడేరులో అక్రమ బాక్సైట్ మైనింగ్ వెనుక వైకాపా?

  ఇంటి గుట్టు లంకకు చేటు అన్నారు పెద్దలు. అది రాజకీయ పార్టీలకు కూడా వర్తిస్తుంది. ప్రస్తుతం వై.యస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అరకు యంపీ కొత్తపల్లి గీత పాడేరు యం.యల్.ఏ. గిద్ది ఈశ్వరి మధ్య జరుగుతున్నా మాటల యుద్ధం వలన ఆ పార్టీ తెర వెనుక కధలు బయటపడుతున్నాయి.   ఈ మధ్యకాలంలో గీత వైకాపాకు దూరంగా ఉంటూ అధికార తెదేప, బీజేపీ సభ్యులతో కలిసి తిరుగుతున్నారు. ఒకానొక సమయంలో ఆమె పార్టీ వీడటం దాదాపు ఖాయం అనుకొన్నారు అందరూ కానీ ఆమె నేటికీ వైకాపాలోనే కొనసాగుతున్నారు. కానీ ఆ పార్టీపైనే ఆరోపణలు చేస్తుండటం విశేషం. పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిలపై ఈగ వాలినా ఊరుకొని పార్టీ నేతలు, తన రాజకీయ ప్రత్యర్ధులు కొందరు సామాజిక వెబ్ సైట్లలో తనపై అభ్యంతకర వ్యాఖ్యలు పెడుతున్నప్పటికీ పార్టీ నేతలెవరూ తనకు అండగా నిలబడలేదని, వైకాపాలో మహిళలకు గౌరవం, సముచిత స్థానం రెండూ లేవని ఆమె ఆరోపించారు.   తను షెడ్యూల్ కాస్ట్ కు చెందినా వ్యక్తిని కాదని పాడేరు యం.యల్.ఏ. గిద్ది ఈశ్వరి చేసిన ఆరోపణలపై స్పందిస్తూ, “అదే నిజమయితే ఆ రోజు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నాకు అరుకు లోక్ సభ నియోజక వర్గం నుండి పోటీ చేసేందుకు ఏవిధంగా బీ-ఫారం ఇచ్చారు? అంటే ఈశ్వరి నన్ను సవాలు చేస్తోందా లేక పార్టీ అధిష్టానాన్ని సవాలు చేస్తోందా?” అని ఆమె ఎదురు ప్రశ్నించారు.   ఈశ్వరి చేసిన మరో ఆరోపణలకు ఆమె ఇచ్చిన జవాబు పార్టీకి చాలా ఇబ్బందికర పరిస్థితి కల్పించింది. తను బాక్సైట్ మైనింగ్ చేసే అనార్క్ ప్రమోటర్స్ తో కుమ్మకు అయినట్లు ఈశ్వరి చేసిన ఆరోపణలను ఆమె త్రిప్పి కొడుతూ “పాడేరులో అక్రమంగా మైనింగ్ జరుగుతోంది. అక్కడ అక్రమంగా తవ్వుకుపోతున్న ఖనిజం అంతా అనార్క్ సంస్థకే చేరుతోంది. అంటే ఎవరు ఎవరితో మ్మక్కు అయ్యేరో అందరికీ అర్ధమవుతోంది,” అని ఆమె ఘాటుగా జవాబిచ్చారు.   వారిరువురి గొడవ వలన పాడేరులో జరుగుతున్న అక్రమ బాక్సైట్ మైనింగ్ వ్యవహారంలో వైకాపా నేతల హస్తం ఉందని అర్ధమవుతోంది. కానీ వారి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గిరిజనుల తరపున బాక్సైట్ మైనింగ్ కు వ్యతిరేఖంగా ప్రభుత్వంతో పోరాడుతానని హామీలు గుప్పిస్తుండటమే విశేషం.

షూస్ వేసుకుని బతుకమ్మ ఆడారు... దారుణం...

  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి బతుకమ్మ ఉత్సవాలు జరిగాయి. తెలంగాణ వ్యాప్తంగా మహిళలు భక్తి శ్రద్ధలతో బతుకమ్మ ఆడారు. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో కూడా అంగరంగ వైభవంగా బతుకమ్మ ఆడారు. అయితే ఇంటర్మీడియట్ బోర్డులో జరిగిన బతుకమ్మ ఉత్సవాలలో కొంతమంది తెలంగాణ నాయకులు బూట్లతోనే బతుకమ్మ ఆడటాన్ని తెలంగాణ ప్రజలు.. ముఖ్యంగా తెలంగాణ మహిళలు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు, ఇతర నాయకులు దేవీ ప్రసాద్, రవీందర్‌రెడ్డి, విఠల్ షూస్ వేసుకునే బతుకమ్మ ఆడారు. ఈ నాయకులలో ఒకరు కాకపోతే ఒకరైనా బతుకమ్మ దగ్గర షూస్ విప్పాలన్న కనీస మర్యాద లేకుండా అందరూ షూస్ వేసుకునే బతుకమ్మ ఆడటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ వున్న మహిళలు, ఇతర ఉద్యోగులు ఈ నాయకులు షూస్ వేసుకుని బతుకమ్మ ఆడటాన్ని గమనించినప్పటికీ ఆ విషయం వారికి చెబితే ‘ఫీలవుతారేమో’ అని మిన్నకుండిపోయారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా, గౌరవ మర్యాదలతో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకలలో ప్రభుత్వంలో భాగస్వామి అయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కూడా బూట్లు వేసుకుని బతకమ్మ ఆడటం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటన సదరు నాయకులకు బతుకమ్మ మీద వున్న గౌరవానికి అద్దం పడుతోందని అంటున్నారు. షూస్ వేసుకుని బతుకమ్మ ఆడిన నాయకులు తక్షణం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, చెప్పుల్లేకుండా బతుకమ్మ ముందుకు వచ్చి చెంపలు వేసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

రాజధాని భూసేకరణకు మంత్రులతో కమిటీ ఏర్పాటు...

  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం కోసం భూసేకరణకు ఆరుగురు మంత్రులతో కూడిన ఒక ఉప కమిటీ వేసారు. అందులో మంత్రులు యనమల రామకృష్ణుడు, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా మహేశ్వర రావు, పి.నారాయణ, పల్లె రఘునాధ రెడ్డి మరియు రావెల కిషోర్ బాబు సభ్యులుగా ఉన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలలో భూసేకరణ చేయవలసి ఉంటుంది కనుక శ్రీకాకుళానికి చెందిన మంత్రి అచ్చెన్నాయుడును ఈ కమిటీ నుండి తప్పించారు.   అయితే భూసేకరణలో అత్యంత కీలకమయిన రెవెన్యూ శాఖ మంత్రి కె.ఇ.కృష్ణమూర్తిని మాత్రం ఈ కమిటీలో చేర్చేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన మొదటి నుండి కూడా విజయవాడ వద్ద రాజధాని నిర్మించడాన్ని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. బహుశః అందువల్లే ఆయన ఈ కమిటీలో చేరెందుకు నిరాకరించిఉండవచ్చును. అయితే ఈ అంశంపై ఆయన ముఖ్యమంత్రి, ఇతర మంత్రులతో విభేదించినప్పటికీ ఈ కారణంగా ఆయన వారితో ఘర్షణ వైఖరి అవలంబించకపోవడం గమనిస్తే ఆయన కేవలం ఈ విధంగా తన నిరసనను తెలియజేసినట్లు భావించవచ్చు.   ఆయన రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కానీ అది సాధ్యపడదని గ్రహించిన తరువాత కర్నూలుకు, రాయలసీమ జిల్లాలకు వీలయినంత ఎక్కువ ప్రయోజనాలు చేకూరేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. బహుశః అందుకే విజయవాడ వద్ద రాజధాని ఏర్పాటు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించేటప్పుడు రాయలసీమ జిల్లాలకు ప్రత్యేకంగా అనేక వరాలు ప్రకటించారని భావించాల్సి ఉంటుంది. ఏమయినప్పటికీ ఈ భూ సేకరణ కమిటీలో కె.ఇ.కృష్ణమూర్తి లేకపోవడం ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని విమర్శించేందుకు అవకాశం కల్పించవచ్చును.

ఫాస్ట్ గానే ముందుకు సాగాలిట!

  తెలంగాణా ప్రభుత్వం జారీ చేసిన ‘ఫాస్ట్’ (ప్రస్తుత ఫీజు రీ ఇంబర్స్ మెంటు స్థానంలో కేవలం తెలంగాణా విద్యార్ధులకు మాత్రమే ఆర్ధిక సహాయం అందించే పధకం) జీ.ఒ. పై హైకోర్టు గట్టిగానే మొట్టికాయలు వేసింది. అటువంటి ప్రత్యేకవాద ఆలోచనలు దేశ సమగ్రతకు భంగం కలిగిస్తాయని, తెలంగాణా రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగమని గుర్తుంచుకొని రాజ్యాంగానికి లోబడి మాత్రమే ప్రభుత్వం చట్టాలు చేయవలసి ఉంటుందని కోర్టు చాలా ఖరాఖండిగానే చెప్పింది. అన్ని రాజకీయ పార్టీలు, మీడియా కూడా కోర్టు వెలిబుచ్చిన అభిప్రాయాన్ని బలంగా సమర్దించాయి. అది తెలంగాణా ప్రభుత్వానికి చెంపదెబ్బ వంటిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అందువలన ఇక తెలంగాణా ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గుతుందని అందరూ భావించారు.   కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశంపై న్యాయపోరాటానికే సిద్దపడుతున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అంశంపై వెనక్కి తగ్గకూడదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. హైకోర్టులో ప్రభుత్వ వాదనలను బలంగా సమర్ధించుకొనే విధంగా కౌంటర్ దాఖలు చేసేందుకు అవసరమయిన అన్ని వివరాలను సేకరించమని రాష్ట్ర న్యాయశాఖ అధికారులను కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులను కూడా ఈ విషయంలో న్యాయశాఖకు సహకరించవలసిందిగా ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈసారి హైకోర్టులో ఈ అంశంపై వాదనలు సాగినప్పుడు, అవి కోర్టును ఒప్పించే విధంగా బలంగా ఉండాలని, అందుకు అవసరమయిన అన్ని వివరాలను అన్ని శాఖల నుండి సేకరించామని న్యాయశాఖను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇదే నిజమయితే, ఇప్పటికే కోర్టులలో అనేక ఎదురుదెబ్బలు తిన్న తెలంగాణా ప్రభుత్వం మరోసారి అవమానకర పరిస్థితులు ఎదుర్కోక తప్పదని న్యాయనిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ ఈసారి కూడా హైకోర్టులో పరాభవం ఎదురయితే దానివలన తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట మరింత మసకబారే ప్రమాదం ఉందని న్యాయనిపుణులు భావిస్తున్నారు.

హైదరాబాద్ మెట్రోపై గెజిట్ నోటిఫికేషన్ ప్రభావం?

  హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై నిన్న కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ గెజిట్ తెలంగాణా ప్రభుత్వానికి చాలా మేలు చేస్తుందని కొందరు, చాలా ఇబ్బందికరంగా మారుతుందని మరి కొందరి వాదన. మేలు చేస్తుందనే వారిలో ఈ ప్రాజెక్టు మేనేజింగ్ డైరక్టర్ యాన్.వీ.యస్. రెడ్డి కూడా ఒకరు.   ఇంతకాలం ఈ ప్రాజక్టు ‘ట్రామ్ వె చట్టం’ క్రింద నిర్మిస్తునందున రైల్వే భద్రతా అధికారులు దీని భద్రత ప్రమాణాలను పర్యవేక్షించి, దృవీకరించేందుకు నిరాకరిస్తున్నారని, కానీ ఇప్పుడు ఈ గెజిట్ ద్వారా ఈ ప్రాజెక్టు కేంద్రం పరిధిలోకి వెళ్లిపోయింది కనుక వారు ఇక ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయరని ఆయన తెలిపారు. రైల్వే భద్రతాధికారులు కూడా ఆయనతో ఏకీభవిస్తున్నారు. ఇకపై ఈ ప్రాజెక్టు డిజైన్ (రూట్ మ్యాప్)లో మార్పులు చేయవలసి వస్తే, దానికి కేంద్రం అనుమతి అవసరం కనుక, ఇక ఎవరూ కూడా తెలంగాణా ప్రభుత్వాన్ని నిందించలేరని మరి కొందరి అభిప్రాయం. కానీ డిజైన్ మార్పుకి అనుమతుల మంజూరులో జాప్యం అనివార్యమవుతుందని వారు అంగీకరిస్తున్నారు.   ఇక నుండి ఈ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండబోదు కనుక డిజైన్ మార్చాలనే దాని ప్రయత్నాలు వమ్మయినట్లేనని మరికొందరి వాదన. ప్రాజెక్టు డిజైన్ మార్చకుండా యధాతధంగా ముందుకు సాగినట్లయితే, హైదరాబాద్ పాత బస్తీలో అనేక మశీదులు, దర్గాలు ఆశుర్ ఖానాలు, పురాతన భవంతులు కూల్చివేయవలసి ఉంటుంది. కానీ అది సాధ్యమయ్యే పని కాదు కనుక తప్పనిసరిగా కారిడార్-2లో మజ్లిస్ పార్టీ సూచిస్తున్న విధంగా డిజైన్లో మార్పులు చేయవలసి ఉంటుంది. మజ్లిస్ పార్టీని ఆగర్భ శత్రువుగా భావించే బీజేపీ దాని ప్రతిపాదనలకు తలొగ్గుతుందని ఎవరూ భావించరు.   ఒకవేళ తెలంగాణా ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అంగీకరించినా, ఈ తంతంగం అంతా పూర్తవడానికి చాలా సమయం పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నపుడే అనేక విషయాలలో నిర్ణయం తీసుకోవడానికి చాలా జాప్యం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసిన యల్.యండ్.టీ. సంస్థ, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో బాటు కేంద్రం కూడా దీనిపై నిర్ణయాలు తీసుకొంటూ, అనుమతులు మంజూరు చేయవలసి వస్తే ఏవిధంగా స్పందిస్తుందో ఊహించడం కష్టం కాదు. ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతున్న కొద్దీ నిర్మాణ వ్యయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుంటుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు తమకు లాభదాయకం కాదని, ప్రభుత్వం దీనిని చేపడితే తాము తప్పుకొనేందుకు సిద్దంగా ఉన్నామని లేఖ వ్రాసిన యల్.యండ్.టీ. సంస్థ ప్రాజెక్టు డిజైన్ మార్పుకు అంగీకరించక పోవచ్చును. ఒకవేళ అంగీకరించినా కేంద్రం అనుమతులు జాప్యం అయితే తట్టాబుట్టా సర్దుకోవచ్చును.   ఏమయినప్పటికీ ఈ నోటిఫికేషన్ పై ఆ సంస్థ ఇంతవరకు స్పందించలేదు. స్పందిస్తే ఈ మెట్రో ప్రయాణం ఏవిధంగా సాగబోతోందో అర్ధమవుతుంది.