చంద్రబాబుకి చెడ్డపేరు తెస్తున్న టెక్నికల్ టీమ్
టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో కానీ వాడుకోవడంలో గానీ సీఎం చంద్రబాబు తర్వాతే ఎవరైనా, డిజిటల్ ఇండియా నినాదం ఇప్పుడు వచ్చింది గానీ నైన్టీస్ లోనే ఐటీకి పెద్దపీట వేశారు చంద్రబాబు, పదేళ్ల క్రితమే హైటెక్ సీఎంగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు... పరిపాలనను కొత్త పుంతలు తొక్కించారు, టెక్నాలజీని ఏ అవసరానికి ఎలా వాడుకోవాలో, ప్రతి పనినీ కచ్చితత్వంతో, పారదర్శకంగా ఎలా చేయాలో ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ-గవర్నెన్స్ ను అమలుచేసి దేశంలో సంచనలం సృష్టించిన చంద్రబాబునాయుడు... ల్యాండ్ రికార్డ్స్ ను డిజిటలైజ్ చేయడంతోపాటు ఈసేవతో పౌరసేవలను మరింత సులువు చేశారు, డిజిటల్ ఇండియా కంటే ముందే ఏపీలో డిజిటల్ విప్లవం సృష్టించిన చంద్రబాబు... పరిపాలనను ఎన్నో కొత్త పుంతలు తొక్కించారు.
ఎంతో దూరదృష్టి కలిగిన నాయకుడైన చంద్రబాబు... మొదట్నుంచీ టెక్నాలజీకి పెద్దపీట వేశారు, డిజిటల్ విప్లవం అంటే తెలియని రోజుల్లోనే టెక్నాలజీని ఉపయోగించుకోవడంతో ప్రతిభ చూపారు, అందుకే ఆనాడు దేశంలోనే సత్తా ఉన్న నాయకుడిగా పేరు ప్రఖ్యాతలు గడించారు, ఇప్పుడు దాదాపు పదేళ్ల విరామం తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు... అదే రీతిలో మంచి విజన్ తో ముందుకెళ్తున్నారు. అయితే ఆనాడు మంచి టీమ్ తో సూపర్ సక్సెస్ సాధించిన చంద్రబాబు... ఈనాడు సరైన టీమ్ ను ఎంచుకోలేకపోతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు, దానికి రేషన్ షాపుల్లో ప్రవేశపెట్టిన ఈ-పాస్ విధానమే రుజువంటున్నారు విశ్లేషకులు, ఈపాస్ సిస్టం అద్భుతమైనదే... కానీ అమలులో మాత్రం ఫెయిల్ అయ్యిందంటున్నారు.
ఈపాస్ పథకం మంచిదే, అద్భుతమైనదే, ఐడియా కూడా గొప్పదే, కానీ అమలు తీరే సరిగా లేదు, రేషన్ షాపుల్లో అవినీతి అక్రమాలను అరికట్టడానికి ప్రవేశపెట్టిన ఈ-పాస్ విధానంలో లబ్దిదారుల వివరాలను, వేలిముద్రను సర్వర్ తో కనెక్ట్ చేశారు, దాంతో రేషన్ కోసం వచ్చే లబ్దిదారుడి వేలిముద్ర... సర్వర్ తో టాలీ అయితేనే డీలర్లు సరుకు ఇస్తారు, సర్వర్ పనిచేయకపోయినా, వేలిముద్ర టాలీ కాకపోయినా సరుకు ఇవ్వలేని పరిస్థితి, దాంతో లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, గంటల తరబడి క్యూలో నిలబడినా... సర్వర్ కనెక్ట్ కాకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు, ఒక్కోసారి రెండు మూడ్రోజులు సర్వర్ కనెక్ట్ కాకపోవడంతో తిరిగితిరిగి విసుగొచ్చి లబ్దిదారులు రేషన్ తీసుకోవడం మానేస్తున్నారు. దాంతో రేషన్ సరుకులు పెద్దఎత్తున మిగిలిపోతున్నాయి. ఒక్కోసారి 50శాతం స్టాక్ మిగిలిపోతుండగా, ప్రతి నెలా సుమారు 20శాతం సరుకు తిరిగి ప్రభుత్వానికి తిరిగి వెళ్తోందని డీలర్లు అంటున్నారు. అయితే దీన్ని ఆదాగా ప్రభుత్వానికి అధికారులు చూపుతున్నారని, కానీ నిజం కాదని... సర్వర్ తో జనం విసిగిపోయి సరుకు తీసుకోకపోవడంతోనే స్టాక్ మిగిలిపోతుందని, దాంతో జనం కూడా ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారని డీలర్లు చెబుతున్నారు.
ఈపాస్ విధానం అద్భుతమైనదే అయినా... సర్వర్లు సరిగా పనిచేయకపోవడం, మెయింటెనెన్స్ లేకపోవడం... టెక్నికల్ సపోర్ట్ సర్వీస్ లేకపోవడం... సమస్య వచ్చినప్పుడు పట్టించుకునేవాళ్లు లేకపోవడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని రేషన్ డీలర్లు అంటున్నారు, ఈపాస్ మిషన్లు, సర్వర్లు సరిగా పనిచేయడం లేదని ఎమ్మార్వోలకు చెప్పినా పట్టించుకోవడం లేదని, తామేం చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారని డీలర్లు చెబుతున్నారు, ఈపాస్ మిషన్లు, సర్వర్లు సరిగా పనిచేస్తే తమకు మంచిదేనని, పని సులువు అవుతుందని... కానీ అలాంటి పరిస్థితి లేకపోవడంతో ఆ ప్రభావం చివరికి ప్రభుత్వంపైనే పడుతోందని అంటున్నారు, సర్వర్ పనిచేయనప్పుడు కంప్లైంట్ చేసే విధానం గానీ, పరిష్కరించే టీమ్ గానీ లేదంటున్నారు. దాంతో ప్రజల సమయం కూడా వృథా అవుతోందని చెబుతున్నారు, రేషన్ సరుకులు కోసం జనం పడిగాపులు పడిపడీ... చివరికి విసిగిపోయి తీసుకోవడం మానేస్తున్నారని, అసలు సర్వర్ ఎప్పుడు కనెక్ట్ అవుతుందో... ఎప్పుడు పోతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఉందంటున్నారు.
పార్టీపరంగానూ ఐవీఆర్ఎస్ టెక్నాలజీని ఉపయోగించుకుని ఎన్నో సమస్యల నుంచి గట్టెక్కిన చంద్రబాబు... ఈపాస్ అమలులో మాత్రం ఫెయిల్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఈపాస్ తో అవినీతి అక్రమాలకు చెక్ పెట్టడం నిజమే అయినా... సర్వర్లు పనిచేయకపోవడంతో ఎందుకొచ్చిన ఈపాస్ అని జనం ఈసడించుకుంటున్నారు, పథకం ఉద్దేశం మంచిదే అయినా, అధికారులు దాన్ని సమర్ధంగా అమలు చేయలేకపోవడంతో ఆ ఎఫెక్ట్ చంద్రబాబుపైనా, టీడీపీ ప్రభుత్వంపైనా పడుతోందంటున్నారు. అయితే టెక్నాలజీని వినియోగించుకోవడంలో మొనగాడైన చంద్రబాబు... ఈపాస్ విషయంలో మాత్రం సరైన టీమ్ ను ఎంచుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, కనీసం ఇప్పుడైనా అప్రమత్తం కావాల్సిన అవసరముందని, లేదంటే చెడ్డపేరు వచ్చే అవకాశముందని అంటున్నారు.