బిహార్ లో ఆటవిక రాజ్య స్థాపనకి లాలూ బ్రేక్స్?

  బిహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ కి చెందిన ఆర్.జె.డి. పార్టీ నితీష్ కుమార్ కి చెందిన జెడీయూతో జత కట్టడంతో కలిసి మళ్ళీ చాలా ఏళ్ల తరువాత రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగింది. లాలూ రాజ్యం అంటే ఆటవిక రాజ్యమేనని మోడీ, అమిత్ షాలు ముందే హెచ్చరించారు. నితీష్ కుమార్ ప్రభుత్వం కొత్తగా ఎన్నికయిన ఎమ్మెల్యేలకి క్వార్టర్స్ లో ఫ్లాట్స్ కేటాయించక మునుపే ఆర్.జె.డి. పార్టీ ఎమ్మెల్యేలు రాజధాని పాట్నాలో తమకు నచ్చిన ప్రభుత్వ బంగ్లాలను ఆక్రమించేసుకొన్నారు. ఆర్జేడీ పార్టీకి చెందిన అరుణ్ కుమార్ యాదవ్ మరియు అనిల్ కుమార్ యాదవ్ అనే ఇద్దరు ఎమ్మెల్యేలు, వేరే ఎవరో ఉంటున్న భవనాన్ని ఆక్రమించేసుకొని, వాటిపై తమ నేమ్ ప్లేట్లు పెట్టేసుకొన్నారు. వారిని చూసి జెడీయూ ఎమ్మెల్యేఆర్.ఎన్. సింగ్ కూడా తనకు నచ్చిన బంగ్లాను ఆక్రమించేసుకొని తన బోర్డు తగిలించేసుకొన్నారు.   వారి అత్యుత్సాహం చూసి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా షాక్ తిన్నారు. తక్షణమే తన పార్టీ ఎమ్మెల్యేలందరినీ సమావేశపరిచి, “మనకి ఓటేసి గెలిపించిన ప్రజలు మన ప్రతీ కదలికని, మాటని నిశితంగా గమనిస్తున్నారు. కనుక ఎవరూ క్రమశిక్షణను ఉల్లంఘించడానికి వీలులేదు. ప్రభుత్వమే అందరికీ తగిన భవనాలను కేటాయిస్తుంది. అంతవరకు ఓపికగా వేచి ఉండండి,” అని గట్టిగా హెచ్చరించారు.

నేటి నుండి పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలు

  ఇవ్వాల్టి నుండి పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలవుతున్నాయి. వచ్చే నెల 28వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి. ఈ సమావేశాలలో సుమారు 30 బిల్లులు ఆమోదం పొందవలసి ఉంది. లోక్ సభలో ఎన్డీయే ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉంది కనుక అక్కడ బిల్లులు ఆమోదం పొందగలుగుతున్నాయి కానీ రాజ్యసభలో కాంగ్రెస్ మిత్రపక్షాలదే పైచెయ్యి అవడంతో అక్కడకి వచ్చేసరికి బిల్లులు తిరస్కరించబడుతున్నాయి. అయినా కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు గత పార్లమెంటు సమావేశాల నుండి సరికొత్త వ్యూహం అమలుచేస్తున్నాయి. సమావేశాలు మొదలవక మునుపు కొన్ని నెలల ముందు నుంచి ఏదో ఒక అంశంపై పోరాటం మొదలపెట్టడం, సమావేశాలు మొదలవగానే దానిపై సభలో చర్చ జరగాలనో లేక మంత్రులు రాజీనామా చేయాలనో పట్టుబడుతూ సభా కార్యక్రమాలను స్తంభింపజేస్తోంది.   లలిత్ మోడీ, వ్యాపం వ్యవహారాలలో తమ పార్టీ పార్లమెంటును స్తంభింపచేయబోతోందని గత వర్షాకాల సమావేశాలు మొదలయ్యే ముందు కాంగ్రెస్ ఎంపీ శశీ ధరూర్ నోరు జారారు. తమ వ్యూహాన్ని ముందే బయటపెట్టినందుకు సోనియా గాంధీ ఆయనకు క్లాసు పీకారు కూడా. ఈసారి కూడా కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు మళ్ళీ అటువంటి వ్యూహాన్నే అమలుచేయబోతున్నట్లు నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో స్పష్టమయింది.   మోడీ ప్రభుత్వం అధికారంలోకి వేచ్చేక దేశంలో మత అసహనం పెరిగిపోతోందని పనిగట్టుకొని విషప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు ఈ సమావేశాలలో అదే అంశంతో సభా కార్యక్రమాలను స్తంభింపజేసే అవకాశం ఉంది. గత రెండు మూడు నెలలుగా దేశంలో అనేక మంది ప్రముఖులు తమ అవార్డులను వెనక్కి తిరిగి ఇచ్చేయడాన్ని ఆధారంగా చేసుకొని మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ యుద్ధం ప్రకటించబోతోంది.   జి.ఎస్.టి., రియల్ ఎస్టేట్, ఎస్సి ఎస్టీ బిల్లు, అగ్రికల్చర్ బయో సెక్యురిటీ బిల్లు, న్యూక్లియర్ సేఫ్టీ బిల్లు, బాలనేరస్థుల శిక్షలను కటినతరం చేయడం, అలాగే కేంద్రప్రభుత్వం జారీ చేసిన కొన్ని ఆర్డినెన్స్ లకు పార్లమెంటు ఆమోదం పొందడం, ప్రభుత్వ శాఖలకు, రాష్ట్రాలకు వివిధ పద్దుల క్రింద అదనపు నిధులు మంజూరు చేయడానికి బడ్జెట్ సవరణల ప్రతిపాదనల ఆమోదం వంటి అతి ముఖ్యమయిన అంశాలపై ఈ సమావేశాలలో చర్చించవలసి ఉంది. కానీ బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించినందున మంచి ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు పార్లమెంటులో మోడీ ప్రభుత్వంపై యుద్ధం చేసేందుకే ఆసక్తి చూపుతున్నాయి.

నిర్భయ కేసులో బాల నేరస్థుడిపై నిఘా ఉంచమని కోరిన తల్లి తండ్రులు

  డిల్లీలో జరిగిన నిర్భయ కేసులో అరెస్ట్ అయిన మైనర్ జువైనల్ హోమ్ లో మూడేళ్ళ నిర్బంధం తరువాత వచ్చే నెల 15వ తేదీన విడుదల కాబోతున్నాడు. అతనిని అరెస్ట్ చేసినప్పుడు అతను మైనర్ కనుక అంత హేయమయిన నేరానికి పాల్పడినప్పటికీ, ఇంత తక్కువ శిక్షతో తప్పించుకోగలుగుతున్నాడు.   అతనిని బయటకు విడిచిపెట్టిన తరువాత అతను మళ్ళీ అటువంటి నేరాలకి పాల్పడకుండా అతనిపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని కోరుతూ నిర్భయ తల్లి తండ్రులు జాతీయ మానవ హక్కుల కమీషన్ లో ఒక పిటిషన్ వేశారు. అతను జువైనల్ హోమ్ నుండి విడుదల చేసిన తరువాత అతని వలన దేశ ప్రజలు ఎవరికీ ప్రమాదం జరగకుండా చూడవలసిన బాధ్యత కేంద్రప్రభుత్వంపైనే ఉందని కనుక అటువంటి ఏర్పాట్లు చేయమని కేంద్రాన్ని ఆదేశించవలసిందిగా వారు తమ పిటిషన్ లో కోరారు. కొన్ని దేశాలలో ప్రభుత్వాలు ఇటువంటి హేయమయిన నేరాలకు పాల్పడినవారి ఫోటోలను, వారి పూర్తి వివరాలను అన్ని రాష్ట్రాల పోలీసులకు పంపించి వారు ఎక్కడ ఉన్నప్పటికీ వారిపై నిరంత నిఘా ఏర్పాటు చేస్తుంటారని, ఈ నిర్బయ కేసులో దోషిగా శిక్ష అనుభవించిన వ్యక్తి కోసం భారత్ లో కూడా అటువంటి ఏర్పాటే చేయాలని వారు తమ పిటిషన్ లో కోరారు. వారు ఆ పిటిషన్ కాపీని, దానితో బాటు ఒక వినతి పత్రాన్ని కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాద్ సింగ్ కి సమర్పించి తగు చర్యలు చేపట్టవలసిందిగా అభ్యర్ధించారు.   జాతీయ మానవ హక్కుల కమీషన్ కూడా కేంద్రప్రభుత్వానికి, డిల్లీ ప్రభుత్వానికి ఇదే విషయమై నోటీసులు పంపించింది. మూడేళ్ళ నిర్బంధంలో ఆ బాల నేరస్తుడు మానసిక స్థితిలో ఏమయినా మార్పులు వచ్చేయా లేదా? అతని ప్రవర్తనలో సానుకూలమయిన మార్పు వచ్చిందా? లేక ఇంకా అతనిలో నేర ప్రవృతి పెరిగిందా?అతనిని విడుదల చేస్తే అతని వలన ప్రజలకు మళ్ళీ ఎటువంటి హానీ జరుగకుండా ప్రభుత్వం ఏమయినా జాగ్రత్తలు తీసుకొందా? తెలియజేయవలసిందిగా జాతీయ మానవ హక్కుల కమీషన్ కేంద్రాన్ని కోరింది.   జువైనల్ చట్టంలోని సెక్షన్ 17(3) ప్రకారం ఆ నేరస్తుడిని విడుదలకు ముందు, ఆ తరువాత ఏమయినా చర్యలు తీసుకొందా లేదా? తీసుకొంటే ఎటువంటి చర్యలు తీసుకొంది? అనే విషయాలను తమకు తెలియజేయవలసిందిగా జాతీయ మానవ హక్కుల కమీషన్ డిల్లీ ప్రభుత్వాన్ని కోరింది.   కొన్ని నెలల క్రితం మీడియాలో ఆ బాల నేరస్థుడి గురించి కొన్ని ఆసక్తి కరమయిన వ్యాఖ్యలు వచ్చేయి. అతను, డిల్లీలో ఉగ్రవాద చర్యలకు సహకరించిన మరొక బాలనేరస్తుడితో స్నేహం చేస్తూ, అతని వద్ద నుండి ఉగ్రవాదం గురించి తెలుసుకొంటున్నట్లు నిఘావర్గాలు కనుగొనడంతో, వారి సలహా మేరకు జువైనల్ హోమ్ అధికారులు అతనిని వేరే సెల్ లోకి మార్చినట్లు వార్తలు వచ్చేయి. అంటే అతను ఒక హేయమయిన నేరం చేసిన తరువాత జువైనల్ హోమ్ లో మూడేళ్ళ నిర్బంధంలో సంస్కరించబడలేదు పైగా ఉగ్రవాదం పట్ల ఆసక్తి పెంచుకొన్నట్లు అర్ధం అవుతోంది. అటువంటి నేర ప్రవృతి ఉన్న వ్యక్తిని స్వేచ్చగా విడిచిపెట్టినట్లయితే ఏమవుతుందో తేలికగానే ఊహించవచ్చును. కనుక నిర్భయ తల్లితండ్రుల అభ్యర్ధనను, వారు సూచిస్తున్న సలహాను పాటించడమే మంచిది.

బీజేపీకి గుణపాఠం నేర్పిన ఉప ఎన్నికలు

  బిహార్ తరువాత వరంగల్ ఉప ఎన్నికలలో బీజేపీ పరాజయం పొందడం ఆ పార్టీకి కొంచెం ఇబ్బందికరమయిన పరిస్థితినే సృష్టించిందనే చెప్పవచ్చును. అందుకు తెలంగాణా బీజేపీ నేతలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. తమ వద్ద ఈ ఉప ఎన్నికలలో పోటీ చేయడానికి బలమయిన అభ్యర్ధిలేడని తెలిసిఉన్నప్పుడు మిత్రపక్షమయిన తెదేపాకు ఆ అవకాశం విడిచిపెట్టి ఉండాల్సింది. ఎందుకంటే తెదేపాలో మంచి రాజకీయ అనుభవం, అంగ బలం, అర్ధ బలం పార్టీ క్యాడర్ సపోర్ట్ ఉన్న నేతలు చాలా మందే ఉన్నారు. తెదేపా సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఈ ఉప ఎన్నికలలో పోటీ చేయడానికి సంసిద్దత వ్యక్తం చేసారు. కానీ బీజేపీ నేతలు తమ వద్ద అంత బలమయిన అభ్యర్ధి లేకపోయినప్పటికీ, ఆ సీటు తీసుకొని డా. దేవయ్యను వెతికిపట్టుకు వచ్చి నిలబెట్టారు. తత్ఫలితంగా వారు తెరాసకు పని సులువు చేసిపెట్టినట్లయింది. అంతే కాదు చేజేతులా ఒక సువర్ణావకాశాన్ని జారవిడుచుకోవడమే కాకుండా మిత్రపక్షమయిన తేదేపాకు కూడా దక్కకుండా చేసారు.   కనుక ఇకనయినా తెలంగాణా బీజేపీ నేతలు తమ శక్తి సామర్ధ్యాలను సరిగ్గా అంచనా వేసుకోవడం నేర్చుకొంటే మంచిది. అలాగే వాపును చూసి బలుపు అనుకొని అతిశయం ప్రదర్శించడం కంటే, మిత్రపక్షమయిన తెదేపాను కూడా తమతో కలుపుకొనిపోగలిగితే ఇటువంటి పరాభవాలను తప్పించుకోవచ్చును. ఈ ఉప ఎన్నికలను ఒక గుణపాఠంగా భావించి, తెలంగాణా బీజేపీ నేతలు వారి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పినట్లుగా ఇప్పటి నుండే పార్టీని బలోపేతం చేసుకొంటూ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయడానికి తగిన అభ్యర్ధులను తయారు చేసుకోవడం మంచిది.

తెరాస గెలిచింది.. కానీ ఎందుకు చెమటోడ్చవలసి వచ్చింది?

  వరంగల్ ఉప ఎన్నికల ఫలితాలలో తెరాస అభ్యర్ధి పసునూరి దయాకర్ మొదటి రౌండ్ నుండి కూడా స్పష్టమయిన ఆధిక్యతను ప్రదర్శిస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటివరకు ప్రకటించిన ఓట్ల లెక్కింపు ఫలితాలలో ఆయనకు 3,15,154 ఓట్లు దక్కించుకొని 2,41,564 ఓట్ల ఆధిక్యత కనబరుస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు రౌండ్లు లెక్కింపు పూర్తయ్యి ఐదవ రౌండ్ కొనసాగుతోంది. చివరివరకు ఇదేవిధంగా సాగినట్లయితే బహుశః తెరాస అభ్యర్ధి పసునూరి దయాకర్ కనీసం 4-5లక్షల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించే అవకాశాలున్నాయి.   ఈ ఎన్నికలను తెరాస ప్రభుత్వ పరిపాలనకు రిఫరెండం అని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రకటించింది. కానీ అప్పుడు తెరాస ఆ సవాలును స్వీకరించలేదు. పంట రుణాల మాఫీచేయకపోవడం, రాష్ట్రంలో నానాటికీ పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలు తదితర అనేక సమస్యల పట్ల తెరాస ప్రభుత్వం చాలా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించింది కనుక ఆ కారణంగా తమ ప్రభుత్వం పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉండవచ్చని భయపడిన కారణంగానే కాంగ్రెస్ విసిరిన ఆ సవాలును అప్పుడు స్వీకరించలేదు. కానీ వరంగల్ లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలలో తన మంత్రులను, నేతలను దింపి చాలా పకడ్బందీగా ఓట్లను రాబట్టుకొని భారీ మెజార్టీతో విజయమా సాధించబోతోంది కనుక ఇప్పుడు ఆ సవాలును స్వీకరిస్తూ, తమ ప్రభుత్వ పరిపాలనను మెచ్చుకొని ప్రజలు ఇచ్చిన బహుమతి ఈ విజయం అని గొప్పలు చెప్పుకోవచ్చును. ప్రజలు తమ ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి మెచ్చుకొని ప్రజలు తమకు ఓట్లు వేసి గెలిపించారని తెరాస నేతలు చెప్పుకోవచ్చును. కానీ అవలీలగా గెలవవలసిన ఈ ఉప ఎన్నికల కోసం తామంతా ఇంతగా ఎందుకు చెమటోడ్చవలసి వచ్చిందనే విషయం గురించి తెరాస ప్రభుత్వం కొంచెం ఆలోచిస్తే మంచిది.

సొంత పార్టీలో ‘శత్రు’వుని నియంత్రించాలి

అధికారం అనేది ఏ పార్టీకైనా ఆనందాన్ని కలిగించే విషయమే. అధికారం చాలామంది మిత్రులను అందిస్తుంది. అయితే అప్పటి వరకూ మిత్రులుగా వున్నవారిని శత్రువులుగా చేస్తుంది. మిత్రులతో సఖ్యం, శత్రువులతో వైరం అనేది మామూలే. అయితే మిత్రపక్షంలోనే వుండి శత్రువుల్లా వుండేవారితోనే చాలా ప్రమాదం. కర్ణుడి చావుకు కారణమైన అనేక అంశాల్లో తన పక్కనే వుండి విమర్శిస్తూనే వున్న శల్యుడు కూడా ఒక కారణం. ఇప్పుడు దేశంలో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా అలాగే వుంది. మిగతా శత్రువుల సంగతి అలా వుంచితే, పార్టీలోనే వున్న పెద్ద శత్రువు ‘శత్రు’ఘ్న సిన్హా పార్టీకి చెవిలో జోరీగలా మారి చికాకు పెడుతున్నారు. స్వపక్షంలో వున్న ఈ శత్రువు బీజేపీ అగ్ర నాయకత్వానికి కొరుకుడు పడకుండా వుంది. సినిమాల్లో విలన్ వేషాలు వేయడంలో సిద్ధహస్తుడైన శత్రుఘ్నసిన్హా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పాలిట విలన్‌గా మారారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకముందు నుంచి పార్టీకి ఎంతో సేవ చేసిన చరిత్ర శత్రుఘ్న సిన్హాకి వుంది. మొదట్లో బీజేపీలో చేరిన అతి కొద్ది మంది సినిమా వాళ్ళలో సిన్హా కూడా ఒకరు. బీజేపీ పుణ్యమా అని కేంద్ర మంత్రి పదవి బాధ్యతలు కూడా నిర్వహించారు. అయితే అంతా బాగానే వుందిగానీ, ఇటీవలి కాలంలో సిన్హా పార్టీకి కొరుకుడు పడని విధంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ గురించి, పార్టీ విధానాల గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో సహజంగా వుండే క్రమశిక్షణా రాహిత్యాన్ని బీజేపీకి రుచి చూపిస్తున్నారు. మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తనకు మంత్రి పదవిగానీ, మరే ప్రాధాన్యం గానీ లభించడ లేదన్న ఆవేదనే ఆయన ధోరణికి కారణం అనేది బహిరంగ రహస్యం. సిన్హాని బుజ్జగించి దారికి తెచ్చుకోవలసిన బీజేపీ నాయకత్వం పట్టించుకోనట్టు వ్యవహరించడం వల్ల బీజేపీకి నష్టం జరుగుతోంది. ఇటీవల బీహార్ ఎన్నికల సమయంలో  బీజేపీ విజయానికి  సహకరించాల్సిన బీహారీ శత్రుఘ్న సిన్హా సహకరించలేదు సరికదా తన వ్యాఖ్యలతో పార్టీ ఓటమికి తనవంతు సహకారం అందించారు. తాజాగా రాహుల్ గాంధీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సొంత పార్టీలోనే వున్న ఈ ‘శత్రు’వును నియంత్రించకపోతే బీజేపీకి మరింత నష్టం జరగడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

లాలూ కౌగిలించుకుంటే అప్రదిష్ట అయితే మరి ఆయనతో కలిసి..

  నితీష్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి చాలా మంది అతిధులు వచ్చేరు. వారిలో డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఒకరు. అవినీతిని తీవ్రంగా వ్యతిరేకించే ఆయన అవినీతికి మారుపేరయిన లాలూ ప్రసాద్ యాదవ్ కి మర్యాద పూర్వకంగా షేక్ హ్యాండ్ ఇవ్వబోతే, లాలూ ప్రసాద్ యాదవ్ ఆయనని బలవంతంగా కౌగిలించుకున్నారు. అది చూసి అందరూ చాలా నవ్వుకొన్నారు. వారి కౌగిలింత ఫోటోని ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేసేసి, దాని మీద ఫేస్ బుక్, ట్వీటర్ వంటి సామాజిక మాధ్యమాలలో నెటిజన్లు తెగ జోకులు వేసేసుకొని నవ్వుకొంటున్నారు. ఇక అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి చెప్పనవసరం లేదు. ఆయన కనబడినపుడల్లా విలేఖరులు ఆ కౌగిలింత వ్యవహారం గురించే గుచ్చి అడుగుతూ ఆయనకి చాలా కోపం తెప్పిస్తున్నారు. “నేను ఏదో మర్యాదపూర్వకంగా ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వబోతుంటే ఆయనే నన్ను బలవంతంగా కౌగలించుకొన్నారు. అంత మాత్రాన్న నేను ఆయనను సమర్ధిస్తున్నట్లు కాదు,” అని అరవింద్ కేజ్రీవాల్ పాపం అందరికీ సంజాయిషీలు చెప్పుకోవలసి వస్తోంది.   లాలూ ప్రసాద్ యాదవ్ కి తన అవినీతి రికార్డు గురించి, ఆ కారణంగా తనపై జనాలకి తనపై ఉన్న అభిప్రాయం గురించి తెలియదనుకోలేము. అలాగే అరవింద్ కేజ్రీవాల్ కి జనాలలో ఉన్న మంచి పేరు, అవినీతిపై ఆయన చేస్తున్న పోరాటం గురించి కూడా ఆయనకి తెలిసే ఉంటుంది. తనతో కలిసి ఒకే వేదికపై నుండి ఎన్నికల ప్రచారం చేయడానికి అరవింద్ కేజ్రీవాల్ అయిష్టత చూపినందునే బహుశః లాలూ ప్రసాద్ యాదవ్ ఈవిధంగా ఆయనపై చాలా స్వీట్ గా ప్రతీకారం తీర్చుకొన్నట్లుంది.   లాలూ ప్రసాద్ యాదవ్ కౌగలించుకొంటేనే అరవింద్ కేజ్రీవాల్ ప్రతిష్టకి భంగం కలుగుతున్నప్పుడు, కేజ్రీవాల్ లాగే చాలా నీతివంతుడు, అవినీతిని సహించనివాడని మంచి పేరున్న నితీష్ కుమార్ మరి అదే లాలూ ప్రసాద్ యాదవ్ తో చేతులు కలిపి ఐదేళ్ళు పరిపాలన సాగిస్తే ఏమవుతుందో? పైగా లాలూ తన కొడుకులు ఇద్దరినీ నితీష్ కుమార్ కి చెరో పక్క కాపలాగా పెట్టారు ఎక్కడికీ తప్పించుకొని పారిపోకుండా! అని అందరూ ముసిముసి నవ్వులు నవ్వుకొంటున్నారు.

మా గవర్నర్ ని తక్షణమే మార్చండి ప్లీజ్!

  అస్సాం మరియు నాగాలాండ్ రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరిస్తున్న పద్మనాభ బాలకృష్ణ ఆచార్య చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. అస్సాంలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ, “హిందూస్తాన్ హిందువులదే. ఒకవేళ ముస్లింలకు ఇక్కడ ఉండటం ఇబ్బందికరంగా ఉన్నట్లయితే వారు పాకిస్తాన్ వెళ్లిపోవచ్చును,” అని అన్నారు.   దానిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో తన మాటలను మీడియా వక్రీకరించిందని, తను అలాగా అనలేదని వాదించారు. ఆ ప్రయత్నంలో ఆయన ఇచ్చిన వివరణ ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కంటే తీవ్రంగా ఉంది. “ఏదయినా ఒక దేశంలో ఒక మతానికి చెందినవారు వివక్ష ఎదుర్కొంటున్నట్లయితే వారు తమకు నచ్చిన దేశంలో శరణు పొందవచ్చును. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో అనేకమంది హిందువులకు భారత్ ఆశ్రయం కల్పించి ఆదుకొంది. ఆ రెండు దేశాలే కాదు ప్రపంచంలో ఎక్కడ హిందువులు వివక్షకు గురయినా వారిని భారత్ ఆదుకొంటుంది. ఒకవేళ భారత సంతతికి చెందిన క్రీష్టియన్ లేదా ముస్లిం మతస్తుడు పాకిస్తాన్ లో వివక్షకు గురయితే ఎక్కడికి వెళతాడు? భారత్ కే రావాలి. అలాగే భారత్ లో ముస్లింలు వివక్షకు గురయినట్లు భావిస్తే వారు తమకు నచ్చిన దేశానికి (పాకిస్తాన్) స్వేచ్చగా వెళ్లిపోవచ్చునని మాత్రమే చెప్పాను. భారత్ చాలా విశాల హృదయం గల దేశం. అందుకే మన దేశంలో ఆశ్రయం పొందిన టాటాలు, గోద్రెజ్, వాడియా తదితర పార్సీలు ఎంతో ఉన్నత స్థాయికి ఎదగగలిగారు, అని గవర్నర్ పి.బి.ఆచార్య అన్నారు.   ఆయన వ్యాఖ్యలపై చాలా తీవ్రంగా స్పందించిన అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ ఆయన ఒక రాష్ట్ర గవర్నర్ లాగ కాకుండా ఒక సామాన్య రాజకీయ నాయకుడిలాగ, ఒక ఆర్.ఎస్.ఎస్.ప్రచారక్ లాగ మాట్లాడుతున్నారని, కనుక అతను అత్యున్నతమయిన గవర్నర్ పదవిలో కొనసాగడానికి ఏమాత్రం అర్హుడు కాడని కనుక ఆయనను తక్షణమే ఆ పదవిలో నుండి తప్పించి రాష్ట్రానికి కొత్త గవర్నర్ నినియమించాలని కేంద్రానికి లేఖ వ్రాసారు.

వరంగల్: పార్టీల్లో ధీమా... భయం!

వరంగల్ పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక ముగిసింది. ఎన్నికల ముందు వరకు వివిధ పార్టీల నాయకుల మనసు ఒక రకంగా వుంటుంది. ఎన్నికల తర్వాత మరోలా మారిపోతుంది. ఎన్నికల ముందు పోటీలో వున్న అన్ని పార్టీల నాయకులు గెలుపు తమదేనన్న ధీమాను ప్రదర్శి్స్తూ వచ్చారు. గెలిచే అవకాశాలు ఎంతమాత్రం లేని వైసీపీ కూడా ఈ ఎన్నికలలో తమదే విజయం అన్నట్టుగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది. ఇప్పుడు ప్రజలు తీర్పు ఇచ్చేశారు... ఇక తీర్పు ప్రతి బయటకు రావడం మాత్రమే మిగిలి వుంది. ఈ మధ్య సమయంలో వివిధ పార్టీల నాయకులు ఎంత ధీమాగా వుంటున్నారో... అంత భయంగానూ వున్నారు. అధికార టీఆర్ఎస్ ఈ స్థానంలో విజయం తమదేనన్న ధీమాను మొదటి నుంచి కనబరుస్తూనే వుంది. మిగతా పార్టీలన్నీ రెండో స్థానం కోసమే పోటీ పడుతున్నాయని చెప్పుకుంటూ వచ్చింది. అయితే ప్రభుత్వం మీద సహజంగా వుండే వ్యతిరేకత, టీఆర్ఎస్‌లో వున్న సమస్యల కారణంగానే ఉప ఎన్నిక వచ్చిందన్న విషయం తమకు విజయం దక్కకుండా చేసే ప్రమాదం వుందా అని ఆ పార్టీ నాయకులు మథన పడుతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా విజయంపై ధీమాను ప్రదర్శి్స్తోంది. తెలంగాణ రావడానికి కారణం తమ పార్టీ చేసిన త్యాగాలే కారణమని ప్రజలు గ్రహించారని, అందుకే ఈ ఎన్నికలలో తమ పార్టీనే గెలిపిస్తారని కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మొదట అభ్యర్థిగా ప్రకటించిన రాజయ్య ఆ తర్వాత కోడలు, మనవళ్ళ మరణం కేసులో ఇరుక్కోవడం,  పార్టీ హడావిడిగా సర్వే సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించడం తమ కొంప ముంచే అవకాశం వుందా అని ఆ పార్టీ నాయకులు భయపడుతున్నారు. అలాగే బీజేపీ - టీడీపీ కూటమి కూడా ఈ ఎన్నిక ఫలితం విషయంలో ధీమాగా వుంది. మోడీ మంత్రం, ప్రభుత్వంపై వ్యతిరేకత, తమ స్నేహం ఈ ఎన్నికలలో తమను గెలిపిస్తాయని అనుకుంటున్నారు. అయితే బీహార్లో బీజేపీకి ఎదురైన పరాజయం, పార్టీలన్నీ పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి అధికార పార్టీకే ఎక్కువ ఓట్లు పడే ప్రమాదం వుందన్న అనుమానం ఈ కూటమికి భయాన్ని కలిగిస్తోంది. ఇక వైసీపీ, వామపక్షాలు, ఇతర అభ్యర్థులు ఏదో ఆటలో అరటిపండులా పోటీ చేసి గెలుపు మీద ధీమాను వ్యక్తం చేస్తున్నారు తప్ప వాళ్ళకు గెలిచే అవకాశం, గెలుపు మీద ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇంకొంచెం ఓపిక పడితే చాలు... క్లారిటీ పూర్తిగా వచ్చేస్తుంది.

చంద్రబాబుకి హరిరామ జోగయ్య సలహా

  మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య వ్రాసిన “60 వసంతాల రాజకీయ ప్రస్తానం” అనే తన జీవిత చరిత్ర పుస్తకాన్ని విడుదల చేసినప్పటి నుండి వార్తలకు ఎక్కారు. అప్పటి నుండి తరచూ ఏదో ఒక అంశం మీద మాట్లాడుతూ మీడియా దృష్టిని ఆకర్షిస్తూనే ఉన్నారు. ఈసారి ఆయన తెదేపా దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై తన అస్త్రాలు సంధించారు.   "ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పార్టీ అనుచరులకు మేలు చేసే ఉద్దేశ్యంతో కేవలం రెండు జిల్లాలనే అభివృద్ధి చేస్తున్నారు తప్ప రాష్ట్రంలో మిగిలిన జిల్లాలను అభివృద్ధి చేయడం లేదు. ఒకవేళ ఇదేవిధంగా ముందుకు సాగినట్లయితే వచ్చే ఎన్నికలలో తెదేపా మళ్ళీ అధికారంలోకి రావడం కష్టమే. కనుక రాష్ట్రంలో అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చేయాలి. అమరావతిని కేవలం పరిపాలనా కేంద్రంగా ఉంచి, రాష్ట్రంలో మిగిలిన అని జిల్లాలకు అభివృద్ధిని వికేంద్రీకరణ చేయాలి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఎయిమ్స్ ఆసుపత్రిని, పశ్చిమ గోదావరి ఏలూరులో హైకోర్టును ఏర్పాటు చేయాలి. అలాగే మిగిలిన ప్రభుత్వ సంస్థలను కూడా అన్ని జిల్లాలలో ఏర్పాటు చేయడం ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి. అలా కాకుండా కేవలం అమరావతినే అభివృద్ధి చేసుకొంటూపోతే వచ్చే ఎన్నికలలో తెదేపా దానికి మూల్యం చెల్లించక తప్పదు,” అని జోగయ్య హెచ్చరించారు.

కేంద్రప్రభుత్వం తెలంగాణాకు అన్యాయం చేస్తోందా?

  ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకం క్రింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుమారు 1.93 లక్షల ఇళ్ళు, తెలంగాణా రాష్ట్రానికి కేవలం 10, 000 ఇళ్ళు మాత్రమే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కేటాయించడంపై తెరాస నేతలు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రప్రభుత్వం తెలంగాణా రాష్ట్రం పట్ల మొదటి నుండి సవతి తల్లి ప్రేమ చూపుతోందని అందుకు ఇదే చక్కటి ఉదాహరణ అని వాదిస్తున్నారు. ప్రత్యక్షంగా కళ్ళకు కనబడుతున్నది కూడా అదే. కానీ కేంద్రప్రభుత్వాని నిందిస్తున్న తెరాస నేతలు, ఆ విధంగా జరగడానికి తమ ప్రభుత్వ తప్పిదం కూడా ఉందనే విషయం దాచిపెట్టి, కేంద్రప్రభుత్వంపై, బీజేపీపై విమర్శలు గుప్పిస్తుండటంతో బీజేపీ నేతలు కూడా ఆ రహస్యాన్ని బయటపెట్టక తప్పలేదు.   బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ “కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మిగిలిన అన్ని రాష్ట్రాలతో బాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా ఈ పధకం క్రింద ఎన్ని ఇళ్ళు అవసరం అవుతాయో వివరాలతో ప్రతిపాదనలను పంపమని కోరుతూ లేఖలు వ్రాసింది. ఆ లేఖలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే స్పందించి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కోరిన అన్ని వివరాలను చాలా రోజుల క్రిందటే సమర్పించింది. కానీ తెలంగాణా ప్రభుత్వం దీనిపై ఆఖరు నిమిషం వరకు స్పందించనే లేదు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన ప్రతిపాదనలపై చర్చించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అధికారులు నవంబర్ 18న సమావేశం అవుతారనగా, తెలంగాణా ప్రభుత్వం 17వ తేదీ సాయంత్రం హడావుడిగా ప్రతిపాదనలు పంపించింది. అయినా కూడా వాటిని అధికారులు తమ అజెండాలో చేర్చి తెలంగాణా ప్రభుత్వం కోరిన విధంగానే 10,000 ఇళ్ళను మంజూరు చేసారు. అటువంటప్పుడు తెలంగాణా రాష్ట్రానికి అన్యాయం జరిగిందని తెరాస నేతలు ఏవిధంగా వాదిస్తున్నారు? కేంద్రప్రభుత్వాన్ని ఎందుకు నిందిస్తున్నారు? అంటే తమ అసమర్ధతని, తప్పుని కప్పి పుచ్చుకోవడానికేనని అర్ధం అవుతోంది. ఇప్పటికయినా తెరాస ప్రభుత్వం మేల్కొని కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు అందిస్తున్న వివిధ పధకాలను, ప్రాజెక్టుల కోసం సకాలంలో ప్రతిపాదనలు పంపించి తెలంగాణా రాష్ట్రానికి మేలు చేస్తే బాగుంటుంది,” అని అన్నారు.   కిషన్ రెడ్డి చెప్పిన ప్రకారం చూస్తే, తెలంగాణా ప్రభుత్వమే తమకు 10, 000 ఇళ్ళు కేటాయించాలని కోరినట్లు అర్ధమవుతోంది. అది కూడా ఆఖరు నిమిషంలో ప్రతిపాదనలు పంపినట్లు అర్ధమవుతోంది. అయినప్పటికీ కేంద్రప్రభుత్వం దాని అభ్యర్ధన మేరకు అది కోరినన్ని ఇళ్ళు మంజూరు చేసిందని స్పష్టం అవుతోంది. కనుక ఇకనయినా అటువంటి తప్పిదాలు, నిర్లక్ష్యం జరగకుండా జాగ్రత్త పడితే మంచిది.

గోవధపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

  నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో మత అసహనం పెరిగిపోతోందని కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నాయి. మొదట దాని ప్రచారాన్ని బీజేపీ, మోడీ ప్రభుత్వం చాలా లైట్ గా తీసుకొన్నప్పటికీ, దాని తీవ్ర ప్రభావాన్ని గుర్తించి దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. బిహార్ ఎన్నికలలో బీజేపీ పరాజయానికి గల అనేక కారణాలలో, కాంగ్రెస్ మిత్రపక్షాలు చేసిన ఈ మత అసహన ప్రచారం కూడా ఒకటని చెప్పక తప్పదు.   నిజానికి ఈ విషయంలో బీజేపీ లేదా నరేంద్ర మోడీ చేస్తున్న పొరపాటు ఏమీ లేకపోయినప్పటికీ, ఆర్.ఎస్.ఎస్., విశ్వహిందూ పరిషత్, శివసేన వంటి కొన్ని సంస్థలు రాజకీయ పార్టీలు మాట్లాడుతున్న అసందర్భ మాటలవలననే, మోడీ ప్రభుత్వం ఈ సమస్యను ఎదుర్కోవలసి వస్తోంది. దానికి మూల్యం కూడా చెల్లించవలసి వస్తోంది. బిహార్ ఎన్నికలలో గోవధ, గొడ్డు మాంసం తినడం ప్రధాన అంశాలుగా మారిన సంగతి అందరికీ తెలుసు. కనుక బిహార్ లో ఓటమి తరువాత అయినా ఇటువంటి సున్నితమయిన విషయాలపై బీజేపీ దృష్టి సారించి నష్ట నివారణ చర్యలు చేపడుతుందని అందరూ భావించారు. కానీ తమ పార్టీకి, ప్రభుత్వానికి వేరే ఇతర వ్యక్తుల కారణంగా ఇంత నష్టం జరుగుతున్నప్పటికీ ఇంకా బీజేపీ మేల్కోకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.   అయితే ఇంతవరకు కేవలం బీజేపీతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్నవాళ్ళు మాత్రమే ఈ వివాదాస్పద అంశాల గురించి మాట్లాడేవారు. కానీ మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ బీజేపీ ఆలోచనలు, సిద్దాంతాలకి అనుగుణంగా మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది.   ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ “దేశంలో ఏ మతానికి చెందినవారయినా ఆవులను చంపకూడదు. అటువంటి వ్యక్తులు దేశానికి శత్రువులు. వారికి దేశంలో నివసించే హక్కు లేదు. మా ప్రభుత్వం గోవధ నిషేధానికి అన్ని చర్యలు చేపడుతోంది. గోవధ చేసేవారిని కఠినంగా శిక్షించాలి,” అని అన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యల వలన ఈ సమస్యను మళ్ళీ కెలికి సజీవంగా ఉంచే ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీ ఆలోచనలకి అనుగుణంగా మాట్లాడటం కూడా అనుమానంగానే ఉంది. ఆయన యాదృచ్చికంగా ఈవిధంగా మాట్లాడారా లేక బీజేపీలోకి వెళ్ళే ఆలోచనతో అన్నారా లేక ఇప్పటికే దెబ్బ తిన్న బీజేపీని ఇంకా దెబ్బ తీయాలనే ఉద్దేశ్యంతోనే అన్నారా? అనేది మున్ముంది తేలుతుంది.

వైట్‌హౌస్‌నే టార్గెట్ చేశారు...

పాముకు పాలుపోసి పెంచితే ఏమవుతుంది? పాలు పోసిన చేతినే కసితీరా కాటేస్తుంది. ఇప్పుడు అమెరికా పరిస్థితి అలాగే తయారైంది. తన ఆధిపత్యం కోసం గతంలో ఉగ్రవాద సంస్థలకు ఊతాన్ని ఇచ్చిన అమెరికా ఆ పాపానికి ఫలితాన్ని గతంలో ఉగ్రవాదుల దాడులు, ట్విన్ టవర్స్ కూల్చివేత ఉదంతాలతో అనుభవించింది. అప్పటి నుంచి ఉగ్రవాదుల అణచివేతే తన ధ్యేయమని అమెరికా ప్రకటిస్తున్న కొంత కార్యాచరణను చూపిస్తున్నప్పటికీ ప్రపంచం మనసులో అమెరికా గతంలో చేసిన పాపాలు ఇప్పటికీ కదలాడుతూనే వున్నాయి. అమెరికా చేసిన పాపాల్లో ఒకటి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు ఊతం ఇవ్వడం. అమెరికా పుణ్యమా అని ఆవిర్భవించి చాలా తక్కువకాలంలోనే బలమైన ఉగ్రవాద సంస్థగా మారిన ఐసిస్ చేస్తున్న దారుణాలకు అంతూ పొంతూ లేకుండా పోయింది. ప్రశాంతంగా వుండే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌ మీద ఇటీవల దాడులు చేసి 129 మందిని పొట్టన పెట్టుకుంది. ఆమధ్య రష్యన్ విమానాన్ని కూల్చివేసి వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను బలి తీసుకుంది. ఇప్పుడు ఈ ఉగ్రవాద సంస్థ అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌నే టార్గెట్ చేసింది. త్వరలో వైట్‌హౌస్ మీద ఆత్మాహుతి దాడి చేస్తామని, కారు బాంబుతో వైట్‌హౌస్‌ని పేల్చివేస్తామని ఐసీస్ సంస్థ ఆరు నిమిషాల నిడివి వున్న విడియోను విడుదల చేసింది. ఇది అమెరికా వెన్నులో చలి పుట్టిస్తోంది. ట్విన్ టవర్స్ దాడి తర్వాత అమెరికా ఉగ్రవాదుల పేరు చెబితేనే హడలిపోతోంది. గతంలో అమెరికా అత్యంత భద్రత కలిగిన దేశం అనే భ్రమలు వుండేవి.  ట్విన్ టవర్స్ దాడుల తర్వాత ఆ భ్రమలు తొలగిపోయాయి. అందుకే ఇప్పుడు వైట్‌హౌస్‌ని పేల్చేస్తామని ఐసీస్ ఉగ్రవాదులు చేసిన హెచ్చరికను అమెరికా ప్రజలుగానీ, ప్రభుత్వం గానీ తేలిగ్గా తీసుకోవడం లేదు. ఏ తరహాలో దాడి చేయబోతున్నారో కూడా ముందుగానే చెప్పడం ఐసీస్ ఉగ్రవాదుల తెగువకు నిదర్శనం. మరి అమెరికా ఈ సవాల్‌ని ఎలా ఎదుర్కొంటుందో... తనను తాను ఎలా రక్షించుకుంటుందో!

ఉలిక్కిపడ్డ టీఆర్ఎస్

తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రతిపక్షంలోని ఏ పార్టీకి భయపడని టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఒకే ఒక్క పార్టీని చూసి భయపడిపోతున్నారు. ఆ పార్టీ పేరు చెబితేనే ఉలిక్కిపడుతున్నారు. ఆ పార్టీ మరేదో కాదు... మావోయిస్టు పార్టీ. మా ప్రభుత్వం ఎజెండా మావోయిస్టుల ఎజెండానే అని టీఆర్ఎస్ అగ్ర నాయకులు ఎన్నిసార్లు ప్రకటించినప్పటికీ మావోయిస్టులు టీఆర్ఎస్ పార్టీని తమ శత్రువుగానే భావిస్తున్నారు. ఆమధ్య జరిగిన ఎన్‌కౌంటర్ కూడా మావోయిస్టుల ఆగ్రహాన్ని పెంచింది. ఇప్పుడు ఆరుగురు టీఆర్ఎస్ నేతలను కిడ్నాప్ చేసి తమ ఆగ్రహాన్ని మావోయిస్టులు బయటపెట్టారు. ఈ చర్య టీఆర్ఎస్ నాయకులలో వణుకు మొదలయ్యేలా చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్టుల ఉనికి పూర్తిగా మాయమైందని చెప్పవచ్చు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మావోయిస్టులు మెల్లగా బలం పుంజుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మావోయిస్టుల ప్రాబల్యం పెరుగుతుందని మేధావుల మాట నిజమైంది. తెలంగాణ క్రమంగా మావోయిస్టులు విజృంభించి ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టే అవకాశాలు వున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకూ తెలంగాణలో హాయిగా విహరిస్తున్న టీఆర్ఎస్ నాయకులకు ఇకముందు అలా కుదరకపోవచ్చన్న భయాందోళనలు కలుగుతున్నాయి. దశాబ్దాల క్రితం మావోయిస్టులు ఎంతగా రెచ్చిపోయారో మళ్ళీ అలాంటి పరిస్థితులు వచ్చే ప్రమాదం వుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు తమ భద్రత ఎలా అనే ఆలోచనలో పడిపోయినట్టు తెలుస్తోంది. బడా నాయకులకు భద్రత ఎలాగూ వుంటుంది. మరి ఛోటా నాయకుల పరిస్థితి ఏమిటి? నిన్న ఖమ్మం జిల్లాలో కిడ్నాపైన టీఆర్ఎస్ నాయకులు ఛోటా నాయకులే. అలాంటి ఛోటా నాయకులను కూడా కాపాడుకోవలసిన బాధ్యత ప్రభుత్వం మీద వుంది. వారిని కాపాడుకోలేకపోతే ఆ ప్రభావం ప్రభుత్వం మీద మాత్రమే కాదు.. టీఆర్ఎస్ పార్టీ మీద.. మొత్తం రాష్ట్రం మీద పడే ప్రమాదం వుందని విశ్లేషకులు అంటున్నారు.

హవ్వ... లండన్లో కంపెనీనా?

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, సోనియాగాంధీ ముద్దుల  తనయుడు రాహుల్ గాంధీ చేసిన తాజా నిర్వాకం ప్రస్తుతం దేశ రాజకీయాలలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ నిర్వాకం ఏమిటంటే, అదేనండీ... లండన్‌లో కంపెనీని పెట్టడం కోసం రాహుల్ గాంధీ తనను బ్రిటీష్ జాతీయుడిగా పేర్కొనడం. సుబ్రహ్మణ్య స్వామి వెల్లడి చేసిన ఈ వివరాలు రాహుల్ గాంధీ గొంతులో మాత్రమే కాదు... కాంగ్రెస్ పార్టీ గొంతులో కూడా వెలక్కాయలా మారాయి. ఇప్పుడా వెలక్కాయని మింగలేక కక్కలేక అల్లాడుతున్నారు. రాహుల్ గాంధీని  ఈ సమస్య నుంచి గట్టెక్కించడానికి కాంగ్రెస్ పార్టీ నానా తంటాలూ పడుతోంది. రాహుల్ గాంధీ కూడా తాను లండన్‌లో కంపెనీ పెట్టే సమయంలో తనను తాను ఇండియన్‌గానే పేర్కొన్నాను తప్ప బ్రిటీష్ జాతీయుడని కాదని వివరణ ఇచ్చుకున్నాడు. రాహుల్ గాంధీ తనను ఇండియన్ అని పేర్కొన్నాడా... బ్రిటీష్ జాతీయుడని పేర్కొన్నాడా అనే విషయాలను అలా వుంచితే... ఇప్పుడు రాజకీయ విమర్శకులు మరో తరహా విమర్శ కూడా చేస్తు్న్నారు. ఇండియాకి ప్రధానమంత్రి కావాలని కలలు కన్న వ్యక్తి తాను పెట్టే కంపెనీ మన దేశంలోనే పెట్టకుండా బ్రిటన్లో పెట్టడం ఏమిటి? మా దేశంలో పెట్టుబడులు పెట్టండి, పరిశ్రమలు పెట్టండి అని భారతదేశం ఎప్పటి నుంచో విదేశాలలోని సంపన్న వర్గాలను, పారిశ్రామికవర్గాలను కోరుతోంది. ఇప్పుడున్న మోడీ ప్రభుత్వం మాత్రమే కాదు.. కేంద్రంలో పదేళ్ళపాటు అధికారాన్ని వెలగబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే పంథాను అనుసరించింది. మరి ఆ కాంగ్రెస్ నాయకుడే బ్రిటన్లో  కంపెనీ పెట్టడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? రాహుల్ గాంధీ తాను పెట్టబోయే కంపెనీ లండన్లో కాకుండా ఇండియాలోనే పెడితే ఎంతమందికి ఉపాధి దక్కేది? దేశంలో ప్రభుత్వం నడిపే పార్టీ ప్రముఖుడే ఈ దేశంలో కంపెనీ పెట్టకుండా లండన్లో కంపెనీ పెట్టినప్పుడు, ఇతర దేశాల వాళ్ళు వచ్చి మన దేశంలో ఎందుకు కంపెనీలు పెడతారు? ఇది రాహుల్ గాంధీ దేశం పరువును తీసినట్టు కాదా.... అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలకు రాహుల్ గాంధీ ఏమని సమాధానం చెబుతారో!

చండీయాగం: ఈయన పిలవరు... ఆయన వెళ్ళరు...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమం చేస్తున్న సమయం నుంచీ ఒక నమ్మకం వుంది. తాను ఏవైనా సమస్యల్లో చిక్కుకుని వుంటే ఆయన వెంటనే చండీయాగానికి ఏర్పాట్లు చేసేస్తారు. అదేంటోగానీ ఆయన చండీయాగం చేసిన తర్వాత సమస్యలన్నీ ఆటోమేటిగ్గా తొలగిపోయి మరింత ఉత్సాహంతో ఉద్యమం చేసేవారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రస్తుతం ఆయన్ని అనేక సమస్యలు చుట్టిముట్టి వున్నాయి. ఆ సమస్యలను అధిగమించాలంటే చండీయాగం చేయడమే మార్గమని భావించారని, అందుకే తన ఫామ్ హౌస్‌లో చండీయాగం జరిపించడానికి సన్నాహాలు చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. కేసీఆర్ తాను నిర్వహించబోతున్న చండీయాగానికి దేశంలోని పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, ప్రధాని నరేంద్రమోడీని కూడా చండీయాగానికి రావల్సిందిగా ఆహ్వానించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో కేసీఆర్ చంద్రబాబును చండీయాగానికి పిలుస్తారా... ఈయన పిలిస్తే ఆయన వస్తారా అనే సందేహాలు కలుగుతున్నాయి. అమరావతి శంకుస్థాపనకు చంద్రబాబు కేసీఆర్ని పిలిస్తే ఈయన హాజరయ్యారు కదా... మరి ఈయన పిలిస్తే ఆయన హాజరయ్యే అవకాశం వుంది కదా అని కొన్ని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. అయితే  అమరావతి శంకుస్థాపనను, కేసీఆర్ చేయబోయే చండీయాగాన్ని ఒకేలా చూడటం కరెక్టు కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తాను నిర్వహించే చండీయాగానికి కేసీఆర్ చంద్రబాబును పిలిచే అవకాశం లేదని... ఒకవేళ ఈయన పిలిచినా చంద్రబాబు వచ్చే అవకాశం లేదనీ పరిశీలకులు అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈయన పిలవరు.. ఆయన రారు అని స్పష్టంగా అంటున్నారు. ఎందుకంటే, అమరావతి శంకుస్థాపన ఒక ప్రభుత్వ కార్యక్రమం. ఒక రాష్ట్ర ప్రభుత్వాధినేత మరో రాష్ట్ర ప్రభుత్వాధినేతకు అందించిన ఆహ్వానం అది. అయితే చండీయాగం అనేది పూర్తిగా కేసీఆర్ వ్యక్తిగత కార్యక్రమం ఈ కార్యక్రమానికి ఈయన ఆయన్ని పిలవటం గానీ, ఆయన రావడం కానీ జరిగే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు.

స్వామికి రాహుల్ గాంధీ దొరికిపోయినట్టేనా?

సుబ్రహ్మణ్య స్వామి భారతీయ జనతా పార్టీ నాయకుడు. అయితే ఆయనను ఓ పార్టీకి చెందిన నాయకుడిగా ఎవరూ భావించరు. రాజకీయ నాయకులు ఎవరికీ తెలియకుండా చేసే పొరపాట్లను బయట పెట్టడంలో ఆయన సిద్ధహస్తుడు. లా చదువుకున్న వ్యక్తి  కావడం వల్ల ఏ విషయంలోనైనా మెలిక మీద మెలిక వేసి అవతలి వ్యక్తులను గందరగోళానికి గురిచేయడంలో ఆయన శైలే వేరు. ఆయన ఏ విషయంలో అయినా న్యాయస్థానం మెట్లు ఎక్కారంటే ముద్దాయి స్థానంలో వున్నవారికి ముచ్చెమటలు పట్టాల్సిందే. దానికి ఒక ఉదాహరణ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఆయన ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించిన సందర్భమే. సాధారణంగా రాజకీయ నాయకులు ఆషామాషీ ఆరోపణలు చేస్తూ వుంటారు. అయితే సుబ్రహ్మణ్య స్వామి మాత్రం లీగల్‌గా ఆధారాలతోనే ఆరోపణలు చేస్తూ వుంటారు. అందుకే రాజకీయ నాయకులు చాలామంది సుబ్రహ్మణ్య స్వామి దృష్టి తమ మీద పడకూడదని కోరుకుంటూ వుంటారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అలా కోరుకోలేదేమో... సుబ్రహ్మణ్య స్వామి దృష్టి ఆయన మీద పడింది... రాహుల్ గాంధీ బ్రిటన్లో కంపెనీ పెట్టడం కోసం తనను తాను బ్రిటన్ పౌరుడిగా పేర్కొన్నారంటూ సుబ్రహ్మణ్య స్వామి పేల్చిన బాంబు కాంగ్రెస్ వర్గాల్లో కల్లోలం సృష్టించింది. సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఆరోపణల ప్రకారం రాహుల్ గాంధీ బ్రిటన్లో ఒక కంపెనీ పెట్టారు. ఆ కంపెనీకి తాను అందించిన డిక్లరేషన్లో తనను తాను బ్రిటీష్ జాతీయుడిగా పేర్కొన్నారు. అలా పేర్కొనడం భారత రాజ్యాంగాన్ని, నైతిక నియమావళిని ఉల్లంఘించడమే. అందువల్ల రాహుల్ గాంధీని పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలి. ఇలా ఆరోపిస్తూ సుబ్రహ్మణ్య స్వామి లోక్‌సభ స్పీకర్‌కి వినతి పత్రం ఇచ్చారు. ఇది కాంగ్రెస్ వర్గాలకు వణుకు పుట్టించింది. సుబ్రహ్మణ్య స్వామి ఇలాంటి అర్థం లేని ఆరోపణలు చేస్తూ వుంటారంటూ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీని కాపాడుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాహుల్ గాంధీ కూడా స్వయంగా తాను బ్రిటన్లో కంపెనీ పెట్టానని, దానికి సంబంధించిన డిక్లరేషన్లో తనను తాను భారతీయుడిగానే పేర్కొన్నానని సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.  సుబ్రహ్మణ్య స్వామి మాత్రం ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేట్టు లేరు. ఈ అంశం మీద పార్లమెంట్ ఎథిక్స్ కమిటీతో విచారణ జరిపించాల్సిందని డిమాండ్ చేస్తున్నారు. విచారణ జరిపించాలన్న సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్‌ని కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తూ వుండటం చూస్తుంటే రాహుల్ గాంధీ నిజంగానే తనను తాను బ్రిటన్ పౌరుడిగా పేర్కొన్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. మరి ఈ గండం నుంచి రాహుల్ గాంధీ ఎలా బయట పడతారో చూడాలి.

ఫ్రస్ట్రేషన్లో వైసీపీ నాయకులు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టాల కడలిలో ఓటి పడవలో ప్రయాణం చేస్తోంది. ఏపీలో అధికారంలోకి వచ్చేస్తామని కలలు కన్న వైసీపీ నాయకులు ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుని అంతా భ్రాంతియేనా అని పాటలు పాడుకునే పరిస్థితి ఏర్పడింది. వైసీపీలో త్వరలో భారీ మార్పులు జరగబోతున్నాయిని, చాలామంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి అధికార తెలుగుదేశం తీర్థం పుచ్చుకునే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అధికారానికి దూరంగా వుండటం కావచ్చు... పార్టీ నాయకుడు జగన్ వ్యవహార శైలి కావచ్చు... ఇలా ఎన్నో కారణాల వల్ల వైసీపీ ఎమ్మెల్యేలు ఎంతో అసంతృప్తిలో వున్నారని పరిశీలకులు అంటున్నారు. ఆ అసంతృప్తి ఫ్రఫ్ట్రేషన్ రూపంలోకి మారి, ఆ తర్వాత ఆగ్రహంగా మారి చివరికి అభాసు పాలయ్యేలా చేస్తోందని విశ్లేషిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలిచినవారుగానీ, ఇతర వైసీపీ నాయకులు కానీ గత ఎన్నికల ముందు ఈ ఎన్నికలలో తమదే విజయం అనుకుని కలలు కన్నారు. అయితే ఆ తర్వాత పరిస్థితి తలకిందులు అయింది. ప్రతిపక్షంలో కూర్చుని అధికార పార్టీ మీద విమర్శలు చేసే విషయంలో జగన్ ఆదేశానుసారం పనిచేయడం తప్ప స్వతంత్రం కూడా లేకుండా పోయింది. దానికితోడు ఇప్పటికే అందరూ బోలెడంత ఖర్చులు పెట్టేశారు. అధికారంలో వుంటే కాంట్రాక్టుల ద్వారానో మరో మార్గంలోనో పెట్టుబడి తిరిగి రాబట్టుకునే అవకాశం వుండేది. ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది. అధికార  పార్టీతో మంచిగా వుండి కావలసిన పనులు చేయించుకునే ఛాన్స్ కూడా పార్టీ నాయకుడు ఇవ్వడం లేదు. దాంతో వైసీపీ ఎమ్మెల్యేలలో ఫ్రఫ్ట్రేషన్ పెరిగిపోతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే కొడాలి నాని, రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, గుర్నాథరెడ్డి, భూమా నాగిరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పేర్ని నాని సందర్భం దొరికితే చాలు ఆవేశంతో రగిలిపోతున్నారు. వీధి పోరాటానికి కూడా సిద్ధమన్నట్టుగా వ్యవహరిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. వైసీపీ నాయకులు ఎదుర్కొంటున్న ఫ్రఫ్ట్రేషన్ నుంచి బయట పడాలంటే యోగా, మెడిటేషన్ లాంటివి చేయడం లేదా అధికార పార్టీలోకి జంప్ చేయడం... ఈ రెండే మార్గాలేమో!

గంగిరెడ్డి దొరికాడు.. ఇక దొరకాల్సింది....

కరడుగట్టిన ఎర్రచందనం స్మగ్లర్, చంద్రబాబు మీద జరిగిన అలిపిరి దాడి కుట్రలో భాగస్వామిగా వున్న గంగిరెడ్డి ఎట్టకేలకు దొరికాడు. వందల కోట్ల ఆస్తులు వున్నా, ఏపీలో ప్రముఖ రాజకీయ నాయకుడి అండ వున్నా, విదేశాలకు పారిపోయినా చివరికి గంగిరెడ్డి దొరకక తప్పలేదు. మారిషస్‌లో హాయిగా రెస్టు తీసుకుంటున్న గంగిరెడ్డి ఎట్టకేలకు పట్టుబడి ఏపీ పోలీసుల చేతికి చిక్కాడు. మీడియా ముందు హాజరుపరిచిన సమయంలో గంగిరెడ్డి అమాయకంగా మాట్లాడిన మాటలు విన్నవాళ్ళెవరైనా పాపం ఇంత అమాయకుడా అనుకుంటారు. అయితే గంగిరెడ్డి స్మగ్లింగ్ లీలల గురించి, అతని నేర చరిత్ర గురించి చెప్పాలంటే ఒక పెద్ద గ్రంథమే రాయాల్సి వుంటుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే గంగిరెడ్డి దొరికాడు కదా అని సంబరపడిపోవాల్సిందేమీ లేదని పరిశీలకులు అంటున్నారు. గంగిరెడ్డి పోలీసులకు దొరకడం ఇదేమీ మొదటిసారి కాదు.. గతంలో దొరికినా ఎంచక్కా బెయిల్ తీసుకుని విదేశాలకు చెక్కేశాడు. ఇప్పుడు మళ్ళీ దొరికిన గంగిరెడ్డి మరోసారి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి గంగిరెడ్డి బెయిల్ పుచ్చుకున్నాడంటే అతగాడిని మళ్ళీ పట్టుకోవడం హరిహర బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాదని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే గంగిరెడ్డిని పట్టుకోవడానికి ప్రభుత్వానికి ఖర్చు తడిసి మోపెడైందని సమాచారం. మళ్ళీ గంగిరెడ్డి ఇంకోసారి తప్పించుకుంటే పోలీసులు చేతులు ఎత్తేయడం తప్ప ఇక చేయగలిగిందేమీ లేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అందుకే, ఈసారి అయినా గంగిరెడ్డి తప్పించుకోకుండా పోలీసులు పకడ్బందీగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. గంగిరెడ్డిని పట్టుకుని శిక్షిస్తే మాత్రమే సరిపోదని, గంగిరెడ్డిని ముందు వుంచి నడిపిస్తున్న ఆ ‘అజ్ఞాత రాజకీయ శక్తి’ని కూడా చట్టం ముందు దోషిగా నిలబెట్టాల్సిన అవసరం వుందని ప్రజలు అంటున్నారు. ఇప్పుడు గంగిరెడ్డి దొరికిపోయాడు. ఇక దొరకాల్సిన ఆ రాజకీయ శక్తి కూడా దొరికిపోతే ఎర్రచందనం స్మగ్లింగ్‌కి భారీస్థాయిలో అడ్డుకట్ట పడే అవకాశం వుందని అంటున్నారు..