ఇద్దరు చంద్రులు దగ్గరయితే కాంగ్రెస్ కి అభ్యంతరం ఎందుకు?

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ చూపడం, అందుకు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా సానుకూలంగా స్పందించడం ఇదే మొదటిసారి అని భావించవచ్చును. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, వైకాపాలు అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి హాజరు కాలేదు. కానీ ఇంతవరకు రాష్ట్రంతో యుద్ధం చేస్తున్న కేసీఆర్ హాజరయ్యారు. హాజరయినందుకు ఆయనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సముచితంగా గౌరవించింది. అందుకు ఆయన కూడా మరింత హుందాగా స్పందించారు. అది చూసి రెండు రాష్ట్రాల ప్రజలు చాలా సంతోషించారు. కానీ బద్ధ శతృవులయిన వారిద్దరి కలయిక చూసి కాంగ్రెస్ నేతలు కంగారు పడుతున్నట్లున్నారు. అందుకే అదేదో పెద్ద కుట్ర అన్నట్లుగా షబ్బీర్ అలీ మాట్లాడారు. వారిద్దరినీ కలిపింది ఎవరో తనకి తెలుసని సమయం వచ్చినప్పుడు వారి పేరు బయటపెడతానని అన్నారు. నిజానికి అదేదో ఇప్పుడే బయటపడితే అటువంటి మంచిపని చేసినందుకు రెండు రాష్ట్రాల ప్రజలు ఆ వ్యక్తిని అభినందించేవారు.   ఇంతవరకు కత్తులు దూసుకొంటున్న వారిద్దరినీ కలపడానికి చాలా మంది ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ ఎవరయితేనేమి వారి మధ్య రాజీ కుదిర్చగలిగారు. దాని వలన రెండు రాష్ట్రాలకు మేలు జరుగుతుందే తప్ప కీడు జరుగదు. మరి అటువంటప్పుడు వారి మధ్య సయోధ్య కుదర్చడం అంటే ఏదో పెద్ద కుట్ర జరిగినట్లు షబ్బీర్ అలీ చెప్పడం హాస్యాస్పదం. వారిరువురు సఖ్యతగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సఖ్యత ఏర్పడుతుంది. దాని వలన గోటితో పోయే సమస్యల కోసం ఇదివరకులాగా గొడ్డలి వాడకుండా గోటితో తొలగించేందుకు అవకాశం ఏర్పడుతుంది. దాని వలన రెండు రాష్ట్రాల మధ్య, ప్రభుత్వాల మధ్య, ప్రజల మధ్య మళ్ళీ సత్సంబంధాలు పెరుగుతాయి. ఇంతవరకు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకోవడంపైనే దృష్టి పెట్టిన ఇరువురు మంత్రులు ఇక నిశ్చింతగా తమతమ రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేయవచ్చును. ప్రజలు కూడా అదే కోరుకొంటున్నారు. కనుక వారిద్దరికీ మధ్య రాజీ కుదిర్చిన వ్యక్తి పేరు తెలిసి ఉండి ఉంటే షబ్బీర్ అలీ వెంటనే బయటపెట్టగలిగితే అందరూ తెలుసుకొని సంతోషిస్తారు.

నారాయణ పెత్తనం... గల్లా, శ్రవణ్ కి చేదు అనుభవం

  రాజధాని భూసమీకరణ నుంచి అమరావతి శంకుస్థాపన ఏర్పాట్ల వరకూ అన్నిటిలో తలదూర్చి అంతా తానై వ్యవహరించిన మంత్రి నారాయణ... మిగతా మంత్రులకు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలకు చుక్కలు చూపించినట్లు తెలిసింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో పెత్తనం చెలాయించిన నారాయణ... మిగతా నేతలకు కనీసం గుర్తింపు లేకుండా చేశారని వాపోతున్నారు, నారాయణ ఓవరాక్షన్ ని తట్టుకోలేక కొందరు సైడైపోగా, మరికొందరు మాత్రం ఆయన తీరుపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. అయితే మంత్రి నారాయణ బాధితుల్లో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే కూడా ఉన్నారని చెప్పుకుంటున్నారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ నియోజకవర్గాల పరిధిలో అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జరగగా, కనీసం వీరిద్దరికీ సరైన ప్రాధాన్యతే దక్కలేదు, ప్రోటోకాల్ ప్రకారం చూసినా, సంప్రదాయం మేరకైనా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేకి వేదికపై చోటు ఇవ్వాల్సి ఉండగా... వీళ్లిద్దరినీ పట్టించుకున్నవాళ్లే లేరు, గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఆటలో అరటిపండులా మారగా, స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైంది. ఆనవాయితీ ప్రకారం కనీసం శంకుస్థాపన చేస్తున్న సమయంలోనైనా స్థానిక ఎంపీ గల్లా జయదేవ్, స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ కి అవకాశం కల్పించాల్సి ఉందని, కానీ మంత్రి నారాయణ పెత్తనంతో వీళ్లిద్దరూ సైడైపోవాల్సి వచ్చిందని చెప్పుకుంటున్నారు. అంతేకాదు అమరావతి శంకుస్థాపన శిలాఫలకంపై స్థానిక గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ పేర్లు లేకపోవడం విమర్శలు చెలరేగుతున్నాయి, దీనిపై గల్లా జయదేవ్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తంచేశారు, స్థానిక ప్రజాప్రతినిధులను ఇలా అవమానించడం సరికాదని వ్యాఖ్యానించారు అయితే నారాయణ వ్యవహార శైలిపై పలువురు టీడీపీ నేతలు మండిపడుతున్నారు, ప్రతి దాంట్లోనూ నారాయణ తలదూర్చుతూ... సీనియర్లను సైతం అవమానించేలా ప్రవర్తిస్తున్నారని వాపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా గుర్తించి నారాయణ ఆగడాలకు అడ్డుకట్టవేయాలని కోరుతున్నారు.

‘లెటర్ అంట్ స్పిరిట్‘ అంటూ ‘హోదా‘పై మోడీ క్లారిటీ

  ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వలేమంటూ పార్లమెంట్ సాక్షిగా కేంద్రం ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చినా... మోడీపై నమ్మకంతో ఇన్నాళ్లూ ఆగారు, హోదా ఇవ్వడానికి ఏపీకి ఎలాంటి అర్హతలు లేవంటూ కేంద్ర మంత్రులు పలుమార్లు చెప్పినా... ప్రధాని మోడీ నిర్ణయం తీసుకుంటే ఆగుతుందా అంటూ సరిపెట్టుకున్నారు, అయితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న చరిత్రాత్మక ఘట్టం అమరావతి శంకుస్థాపనకు వచ్చిన మోడీ కచ్చితంగా హోదాపై ప్రకటన చేస్తారని, ఏపీకి వరాలు జల్లు కురిపిస్తారని ఆశించారు, కానీ ప్రజల నమ్మకం వమ్మయింది, ముసుగులో గుద్దులాట లేకుండా నరేంద్రమోడీ కూడా క్లారిటీ ఇచ్చేశారు...ప్రత్యేక హోదా విషయాన్ని తన ప్రసంగంలో నేరుగా ప్రస్తావించకుండానే... లెటర్ అంట్ స్పిరిట్ అంటూ స్టేటస్ పై తేల్చిచెప్పేశారు. ప్రత్యేక హోదానే కాదు కనీసం ప్యాకేజీపై కూడా నోరు మెదపని మోడీ... ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తామని, విభజన చట్టంలోని హామీలన్నింటినీ నెరవేర్చుతామని ఒకటికి రెండుసార్లు చెప్పారు, అయితే లెటర్ అంట్ స్పిరిట్ ప్రకారం పునర్విభజన చట్టంలో ఉన్న ప్రతి అక్షరాన్ని దాని అసలైన స్ఫూర్తితో అమలుచేస్తామన్నారు. అంటే మోడీ మాటల ప్రకారం విభజన చట్టంలో ఏమైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు, ఈ లెక్కన విభజన చట్టంలో లేని ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదు, అందుకే మోడీ తెలివిగా రాష్ట్ర విభజన చట్టంలోని హామీలన్నింటినీ నెరవేర్చి...రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తామంటూ మాట్లాడారు. పునర్విభజన చట్టంలోని ప్రతి అక్షరాన్ని అసలైన స్ఫూర్తి(లెటర్ అండ్ స్పిరిట్)తో అమలు చేస్తామంటూ మోడీ క్లారిటీ ఇచ్చేయడంతో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా రానట్లేనని విశ్లేషకులు అంటున్నారు, స్టేటస్ ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టే... ప్రధాని ప్రత్యేక హోదా అంశాన్నే ప్రస్తావించలేదని గుర్తుచేస్తున్నారు.

గుప్పెడు మట్టి... చెంబుడు నీళ్లు... ఏపీకి మిగిలిందిదే

  జరుగుతున్నది చరిత్రాత్మక ఘట్టం, వస్తున్నది దేశ ప్రధాని, అందుకే ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, అమరావతి వేదికగా నరేంద్రమోడీ... కచ్చితంగా వరాలు ప్రకటిస్తారని, రాష్ట్ర విభజనతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న నవ్యాంధ్రప్రదేశ్ కి ప్రాణవాయువు లాంటి ప్రత్యేక హోదా ప్రకటించి ఆదుకుంటారని భావించారు, కానీ ప్రజలు ఆశించినట్లుగా ఇవేమీ జరగలేదు... కేవలం పార్లమెంట్ ప్రాంగణం నుంచి మట్టి, యమునా నది నుంచి జలాలను మాత్రమే తీసుకొచ్చిన మోడీ... తన ప్రసంగంతో ఆంధ్రులను ఉసూరుమనిపించారు. ఇటు ముఖ్యమంత్రి గానీ, అటు ప్రధానమంత్రి గానీ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న ఒక్క మాట చెప్పకుండానే అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని, తమ ప్రసంగాలను పూర్తి చేసేశారు. పార్లమెంట్ ప్రాంగణం నుంచి గుప్పెడు మట్టిని, యమునా నది నుంచి చెంబుడు నీటిని తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. తన ప్రసంగంలో ఎక్కడా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తామని, విభజన చట్టంలోని హామీలన్నింటినీ నెరవేర్చుతామని చెప్పిన మోడీ, స్పెషల్ స్టేటస్, వరాలపై మాత్రం నోరు మెదపలేదు. పునర్విభజన చట్టంలో ఉన్న ప్రతి అక్షరాన్ని దాని అసలైన స్ఫూర్తితో అమలుచేస్తామన్నారు గానీ.. అసలు విషయం గురించి మాత్రం మరిచిపోయారు. దాంతో ప్రధాని నరేంద్రమోడీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం నీరుగారిపోయారు. అస్తవ్యస్తంగా రాష్ట్రాన్ని విభజించారని... రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని నాలుగు మంచి మాటలు చెప్పారే గానీ, నవ్యాంధ్రప్రదేశ్ కి ప్రాణవాయువులాంటి ప్రత్యేక హోదా గురించి ఒక్క మాటంటే ఒక్క మాట కూడా చెప్పలేదు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలన్నింటినీ నెరవేర్చి...ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తామని ప్రధాని మోడీ క్లారిటీ ఇచ్చేయడంతో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనట్లేనని తేలిపోయింది.

బాబు, మోడీ స్పీచ్ లతో ఇబ్బందిపడ్డ కేసీఆర్

  అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు, తెలుగు మాట్లాడేవారంతా కలిసి పనిచేసుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయన్న చంద్రబాబు... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అందుకు సానుకూలంగా ఉన్నారని అన్నారు, సమస్యలు ఎప్పుడూ ఉండేవేనని... కానీ సామరస్యంగా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తే తెలుగు రాష్ట్రాలు దూసుకెళ్తాయని బాబు అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్... అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని... ముందు ముందు ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తామని, పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళ్తామని ఆకాంక్షించారు. అయితే ప్రతి సందర్భంలోనూ రాష్ట్ర విభజన గురించి మాట్లాడే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు... అమరావతి శంకుస్థాపనలో సైతం ప్రస్తావించారు, అది కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందే రాష్ట్ర విభజన అస్తవ్యస్తంగా జరిగిందని మాట్లాడారు, రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటోందని, వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు, దాంతో వేదికపైనున్న కేసీఆర్ ఇబ్బందిపడినట్లు కనిపించారు, అయితే కేసీఆర్ ఎంతో హుందాగా మాట్లాడారని, చంద్రబాబు కూడా అలాగే మాట్లాడి ఉంటే బాగుండేదని, ఇలాంటి సందర్భంలో అదీ కేసీఆర్ ను ప్రత్యేక ఆహ్వానించాక కూడా రాష్ట్ర విభజన గురించి మాట్లాడటం సరికాదనే అభిప్రాయం అక్కడున్నవారిలో వ్యక్తమైంది ప్రధాని మోడీ కూడా అదే అంశంపై ఎక్కువగా మాట్లాడటంతో ఆ సమయంలో కేసీఆర్ ముభావంగా కనిపించారు, వాజ్ పేయి ప్రధానిగా ఉండగా మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేశారని, కానీ ఎలాంటి విద్వేషాలు లేకుండా చేశారని అన్నారు, యూపీఏ ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్ విభజనను అస్తవ్యస్తంగా చేసిందని, ప్రజల మధ్య విద్వేషాలు పెంచేలా ప్రవర్తించిందని మోడీ అన్నారు. పైగా రాజకీయ లబ్ధి కోసం ఇష్టమొచ్చి రాష్ట్ర విభజన చేయడంతో రెండు రాష్ట్రాల్లోనూ అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. అయితే చారిత్రాత్మక ఘట్టం జరుగుతున్న సమయంలోనూ రాష్ట్ర విభజన గురించి ప్రస్తావించడం, అస్తవ్యస్తంగా జరిగిందంటూ పాత గాయాన్ని రేపే ప్రయత్నం చేయడం అంత బాగోలేదని అక్కడున్నవారిలోనూ వ్యక్తమైంది.

మోడీ కంటే కేసీఆర్ కే జేజేలు పలికిన జనం

  అమరావతి శంకుస్థాపనకు వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఆంధ్రప్రదేశ్ లో అడుగడుగునా ఘనస్వాగతం లభించింది, అతిరథ మహారథులు ఎంతోమంది హాజరైనా... కేసీఆర్ కి మాత్రం స్పెషల్ ట్రీట్ మెంట్ లభిచింది, కేసీఆర్ అమరావతిలో అడుగుపెట్టిన మొదలుకుని...తిరుగుప్రయాణం అయ్యేవరకూ అన్నిచోట్లా ఏపీ మంత్రులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు, కేసీఆర్ కూడా అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపించారు అంతేకాదు అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జరుగుతున్నంతసేపూ కేసీఆరే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు, రాష్ట్ర విభజన నేపథ్యంలో కేసీఆర్ కి ఉన్న క్రేజ్ అలాంటిది మరి, అందుకే కేసీఆర్ మాట్లాడుతున్నంతసేపు ప్రజలు తమ కేరింతలతో హర్షధ్వానాలు చేశారు, కేసీఆర్ మాట్లాడతారని చెప్పినప్పటి నుంచి ప్రసంగం ముగిసేవరకూ కేసీఆర్ మాటలకు జనం అద్భుతంగా స్పందించారు, చాలా క్లుప్తంగా నీట్ గా క్లారిటీగా మాట్లాడిన కేసీఆర్... అందర్నీ ఆకట్టుకున్నారు. అమరావతి నిర్మాణానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని కేసీఆర్ ప్రకటించినపుడు ప్రజలు అద్భుతంగా స్పందించారు. అంతేకాదు ప్రధాని మోడీ అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసే సమయంలోనూ చంద్రబాబుతోపాటు కేసీఆర్ కూడా పాల్గొన్నారు, శిలాఫలకం ప్రారంభోత్సవంలో కూడా కేసీఆర్‌ను చంద్రబాబు తన పక్కనే నిలబెట్టుకున్నారు. అంతేకాదు చంద్రబాబు, కేసీఆర్ కలిసిన ప్రతి సందర్భంలోనూ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది, ఇక సభావేదికపై కేసీఆర్‌కు చంద్రబాబు పుష్పగుచ్చం ఇస్తున్న సమయంలో జనం పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు. ప్రజల స్పందనను గమనించిన కేసీఆర్ కూడా జనం వైపు ఉత్సాహంగా చేయి ఊపారు. ఓవరాల్ గా చూస్తే ప్రధాని మోడీ కంటే తెలంగాణ సీఎం కేసీఆర్ కే జనం బ్రహ్మరథం పట్టారు, కేసీఆర్ మాట్లాడుతున్నంతసేపూ కేరింతలు కొట్టారు, అంతేకాదు చంద్రబాబు, కేసీఆర్ కలిసిన ప్రతి సందర్భంలోనూ ఊహించని స్పందన వచ్చింది.

అమరావతిలో ఆత్మీయ స్నేహితుడ్ని కలుసుకున్న కేసీఆర్

  అమరావతి శంకుస్థాపనకు హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఏపీ ప్రభుత్వం నుంచే కాకుండా తెలుగుదేశం నేతల నుంచి కూడా అపూర్వ స్వాగతం లభించింది. టీడీపీలో ఉండగా కలిసి పనిచేసిన నేతలంతా కేసీఆర్ ను కలిసి తమ సంతోషాన్ని పంచుకున్నారు, ఎన్నాళ్లకు కలిశామంటూ పాత రోజులను గుర్తుచేసుకున్నారు. ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలుసుకోవడంపై ఎంతో ఉద్వేగానికి గురయ్యారు, ఇద్దరూ ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని ఆలింగనం చేసుకున్న కోడెల, కేసీఆర్ లు... ఎన్నిరోజులకు కలిశామంటూ గత స్వ్మతులను నెమరవేసుకున్నారు. తామిద్దరం ఆత్మీయ స్నేహితులమంటూ అక్కడున్నవారందరికీ పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా కోడెల నియోజకవర్గం సత్తెనపల్లిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై కేసీఆర్ అడిగితెలుసుకున్నారు, ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులంతా సత్తెనపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి చర్చించుకుంటున్నారని కేసీఆర్‌ ప్రశంసించారు. అయితే శంకుస్థాపన హడావిడి కారణంగా ఎక్కువసేపు మాట్లాడుకునే అవకాశం లేకపోవడంతో... హైదరాబాద్‌లో కలిసేందుకు సమయం ఇవ్వాలని కోడెలను కేసీఆర్‌ కోరారు.

అమరావతికి కేసీఆర్ ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు

  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికెళ్లి...అమరావతి శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించడం ఒక సంచలనమైతే, ఆంధ్రప్రదేశ్ ఆహ్వానాన్ని మన్నించి కేసీఆర్ అమరావతికి రానుండటం మరో సంచలనంగా మారింది. దాంతో అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఎంతోమంది అతిథులు వస్తున్నా అందరి ఫోకస్ మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రిపైనే ఉంది, రాష్ట్ర విభజనకు కారకుడు కావడమే కాకుండా ఆంధ్రులను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన కేసీఆర్... అమరావతి వేదికగా ఏం మాట్లాడబోతున్నారనే ఆసక్తి నెలకొంది. అయితే అమరావతి శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... ఏపీపై వరాలు జల్లు కురిపించే అవకాశముందని అంటున్నారు, ధనిక రాష్ట్రంగా, మిగులు రాష్ట్రంగా తెలంగాణ... ఆంధ్రప్రదేశ్ కి ఆర్ధిక అండదండలు అందిస్తుందో లేదో కచ్చితంగా చెప్పలేం కానీ, ఇరురాష్ట్రాల మధ్య ఇంకా కొనసాగుతున్న సమస్యల పరిష్కారానికి కేసీఆర్ ముందుకురావొచ్చని, వాటినే అమరావతి వేదికగా ఆయన ప్రకటించే అవకాశముందని అంటున్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రత్యేక అతిథిగా ట్రీట్ చేయాలని అధికారులకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది, మర్యాదల విషయంలో కేసీఆర్ కి ఎలాంటి లోటుపాట్లు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించినట్లు చెబుతున్నారు. అధికారులకే కాకుండా మంత్రులకు, ముఖ్యనేతలకు కూడా చంద్రబాబు ఈ విధమైన ఆదేశాలు ఇచ్చారని, కేసీఆర్ మనకు ప్రత్యేక అతిథి అని, గౌరవంగా చూసుకోవాలని చెప్పారట, ఇరురాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఏర్పడటంలో కేసీఆర్ అమరావతి పర్యటన ఎంతో కీలక కానుందని భావిస్తున్న చంద్రబాబు... స్పెషల్ ట్రీట్ మెంట్ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది.

అమరావతి వేదికగా కేసీఆర్ కొత్త అధ్యాయం

  సుమారు పద్నాలుగేళ్ల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టబోతున్నారు, విజయదశమి రోజున అంటే గురువారం విజయవంతంగా అమరావతిలో కాలు మోపనున్నారు, రాష్ట్ర విభజనకు ముఖ్య కారకుడైన కేసీఆర్... ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి వస్తుండటం, ఆశీస్సులు అందించబోతుండటం చాలా ప్రత్యేకమైనదిగానే చెప్పుకోవాలి. పద్నాలుగేళ్ల ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న కేసీఆర్.... నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు హాజరుకానుండటం విశేషంగానే చెప్పుకోవాలి. తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్ లో ఉండగా రెండుసార్లు ఏపీకి వచ్చే అవకాశం వచ్చినా చివరి నిమిషంలో అది మిస్సైంది, రాష్ట్ర విభజన, ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని ఆంధ్రా ప్రజలకు వివరించేందుకు 2010లో ఒకసారి విజయవాడ వచ్చేందుకు సిద్ధమైనా లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయ్యింది. అలాగే లగడపాటి రాజగోపాల్, టీజీ వెంకటేశ్ కూడా ఏపీలో పర్యటించాలని కేసీఆర్ ను ఆహ్వానించినా అది కూడా సాధ్యపడలేదు, చివరికి రాష్ట్ర విభజన జరిగాక... ఏపీ కొత్త రాజధాని అమరావతికి ఆశీస్సులు అందించడానికి రాబోతుండటం చిత్రమే మరి. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి హాజరుకాబోతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... మరో రెండు నెలల గ్యాప్ లో మరోసారి ఏపీకి రానున్నట్లు తెలుస్తోంది, తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే తిరుమల శ్రీవారికి, బెజవాడ కనకదుర్గకు పలు మొక్కులు మొక్కుకున్న కేసీఆర్... వాటిని తీర్చుకునేందుకు ఆయన ముఖ్యమంత్రి కాగానే నిర్ణయం తీసుకున్నారు, కానీ ఇరురాష్ట్రాల మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో అది కార్యరూపం దాల్చలేదు, అయితే అమరావతి రూపంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా ఇంటికి వచ్చి ఆహ్వానించడంతో వాతావరణం మారిపోయింది, ఇద్దరు చంద్రుల మధ్య కొత్త స్నేహం చిగురించడంతో పనిలో పనిగా తన మొక్కులను కూడా తీర్చేసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారట, సరిగ్గా మరో రెండు నెలల్లోనే తిరుమల శ్రీవారిని, బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని కానుకలు సమర్పించుకోనున్నట్లు తెలిసింది.

అమితాబ్ బచ్చన్ కుటుంబానికి పెన్షన్..హవ్వ!

  ప్రభుత్వాలు ప్రజాధనానికి ధర్మకర్తలుగా వ్యవహరించాలి కానీ మన దేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాధనం తమకు ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తూ "అత్త సొమ్ముని అల్లుడు దానం చేసినట్లుగా" ప్రజల కష్టార్జితాన్ని తమకు నచ్చినవారికి ఉదారంగా పంచిపెడుతుంటాయి. అదేదో నిరుపేదల సంక్షేమానికి ఖర్చు చేసినా లేదా నిరుపేద విద్యార్ధులు, పేద క్రీడాకారులు, కళాకారులకు ఆర్ధిక సహాయం చేసినా ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ అధికారంలో ఉన్నవాళ్ళు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయడమే కాకుండా ఏదో రూపంగా కోటీశ్వరులకే కోట్లాదిరూపాయలు ముట్టజెప్పుతుంటే సామాన్య ప్రజలు కడుపు మండిపోతుంది.   తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాని తెలంగాణా రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకొని అందుకోసం ఆమెకు అప్పనంగా రెండు కోట్ల రూపాయలు ముట్టజెప్పారు. అందుకు ప్రజల్లు, ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నా ఆయన వాటిని ఖాతరు చేయలేదు. రెండు కోట్లు పుచ్చుకొన్న సానియా మీర్జా తెలంగాణా రాష్ట్రం కోసం ఏమి చేసారో తెలియదు. ఆమె నోట కనీసం 'తెలంగాణా' అనే పదం కూడా ఎవరు ఏనాడూ వినలేదు. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెకు రెండు కోట్లు ఎందుకు సమర్పించుకొన్నారో...ఆమె ఎందుకు పుచ్చుకొన్నారో వారికే తెలియాలి.   కోటీశ్వరురాలయిన సానియా మీర్జా రాష్ట్ర ప్రభుత్వం వద్ద నుండి రెండు కోట్లు అప్పనంగా పుచ్చుకొనేబదులు తనే ప్రభుత్వానికి రెండు కోట్లు విరాళం ఇచ్చి రాష్ట్రంలో నిరుపేద క్రీడాకారుల సంక్షేమం కోసం ఖర్చుచేయమని అడిగి ఉండాల్సింది. తనే స్వచ్చందంగా ముందుకు వచ్చి ఉచితంగా తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తానని, రాష్ట్రాభివృద్ధికి తను కూడా కృషి చేస్తానని చెప్పి ఉండి ఉంటే ప్రజల దృష్టిలో ఆమె 'రియల్ లైఫ్ హీరోయిన్' అయ్యుండేవారు కానీ ఆమె ఆవిధంగా చేయలేదు. అందుకు ఆమెను ఎవరూ తప్పు పట్టలేరు కూడా. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు రెండు కోట్లు ముట్టజెప్పడాన్ని చాలా మంది తప్పు పట్టారు.   మళ్ళీ ఇటువంటి ఉదంతమే మరొకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతోందిపుడు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం క్రీడా, కళా రంగాలలో విశేషకృషి చేసిన వారిని గౌరవించేందుకు "యష్ భారతి సమ్మాన్" అనే పెన్షన్ పధకం ప్రారంభించింది. ముందే చెప్పుకొన్నట్లుగా ఆ పధకం ద్వారా రాష్ట్రంలో నిరుపేద కళాకారులకు, క్రీడాకారులకు సహాయం అందించి ఉండి ఉంటే అందరూ హర్షించేవారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆ పెన్షన్ పధకానికి ఎవరిని ఎంపిక చేసిందంటే ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన భార్య జయ బచ్చన్, వారి కుమారుడు అభిషేక్ బచ్చన్ లని! ఇక నుండి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారి ముగ్గురుకీ ఒక్కొకరికీ నెలకి రూ.50, 000 పెన్షన్ జీవితాంతం చెల్లిస్తుందని ప్రకటించింది. అటువంటి గొప్ప నటులు రాష్ట్రానికి చెందిన వారయి ఉండటం ప్రజలందరికీ ఎంతో గర్వకారణమని, అందుకే వారి ముగ్గురికి ఈ పెన్షన్ పధకానికి ఎంపిక చేసినట్లుగా రాష్ట్ర సాంస్క్రతిక శాఖ ప్రకటించింది.   అమితాబచ్చన్ కుటుంబ సభ్యులను గౌరవించడాన్ని ఎవరూ తప్పు కూడా పట్టలేరు. కానీ మళ్ళీ అవే ప్రశ్నలు వేసుకోవలసి వస్తుంది. వారి కుటుంబ సభ్యులందరూ సినిమాల ద్వారా, వివిధ కమర్షియల్ ప్రకటనల ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. వారే రాష్ట్రంలో కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని పోషించగల ఆర్ధిక స్తోమత ఉన్నవారు. అటువంటివారికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నెలకి రూ. 50, 000 పెన్షన్ ఇవ్వడానికి సిద్దం పడుతోంది. వారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారయి ఉండవచ్చును కానీ వారు తమ రాష్ట్రం కోసం ఏమి చేశారు? అని ప్రశ్నించుకొంటే ఏమీ లేదనే చెప్పవచ్చును. మరి వారికి అంత డబ్బు ఎందుకు ముట్టజెపుతున్నట్లు? అంటే మళ్ళీ ముందు చెప్పుకొన్న మాటలే- 'అత్తసొమ్ము అల్లుడు దానం చేయడం' గుర్తు చేసుకోక తప్పదు.   నిజానికి దేశంలో చాలా రాష్ట్రాల కంటే ఉత్తరప్రదేశ్ రాష్ర్టం ఆర్ధికంగా, పారిశ్రామికంగా చాలా వెనుకబడి ఉంది. అమితాబ్ బచ్చన్ కుటుంబ సభ్యులు తలుచుకొంటే తమ పలుకుబడిని, పరపతిని ఉపయోగించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి చాలా సహాయపడవచ్చును. కానీ వారు అటువంటి ఆలోచనలు ఎన్నడూ చేయలేదు. అందుకు వారిని కూడా తప్పు పట్టలేము. ఎందుకంటే అడగందే అమ్మయినా అన్నం పెట్టదంటారు. కానీ వారు అడగకపోయినా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారికి నెలకి రూ. 50,000 చొప్పున పెన్షన్ మంజూరు చేయడమే చాలా విడ్డూరం.   ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన క్రీడాకారుడు ఒకతను ఒలింపిక్స్ లో బాక్సింగులో మెడల్ సాధించాడు. ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందకపోవడం, వేరే పని ఏదీ చేతకాక పోవడంతో ప్రస్తుతం అతను తన కుటుంబాన్ని పోషించుకోవడానికి రోడ్ల మీద చెత్తకుండీలలో పారేసిన వ్యర్ధాలను ఏరుకొంటున్నాడు. వారి కుటుంబం ఒక్క పూట తిండికి కూడా నోచుకోని తీవ్ర దారిద్యం అనుభవిస్తోంది. అయినప్పటికీ అతనికి బాక్సింగ్ పై ఉన్న మమకారంతో తన ఇద్దరు పిల్లలకీ బాక్సింగ్ నేర్పిస్తున్నారు. మన దేశంలో అటువంటి నిరుపేద క్రీడాకారులు, కళాకారులు, నిస్సహాయులు, వృద్ధులు, అనాధలు కోట్లాది మంది ఉన్నారు. ప్రభుత్వాలు అటువంటివారికి ఆర్ధిక సహాయం చేస్తే అందరూ హర్షించేవారు. డబ్బు అవసరం లేనివారికి ప్రభుత్వాలు ఈవిధంగా ఉదారంగా డబ్బు మూటలు ముట్టజెప్పుతూ, నిజంగా అవసరం ఉన్నవారిని పట్టించుకోకపోవడం చాలా శోచనీయం.

ఆదినారాయణరెడ్డి టీడీపీ ఎంట్రీ షురూ.. మరి రామసుబ్బారెడ్డి పరిస్థితి?

  కడప ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టీడీపీలోకి మారుతున్నారు అన్న వార్తలు ఎప్పటినుండో వినిపిస్తున్నాయి. అయితే ఆదినారాయణరెడ్డి టీడీపీ ఎంట్రీకి మధ్యలో ఉన్న రామసుబ్బారెడ్డి అనే అడ్డుపుల్ల ఇప్పుడు తొలగిపోయినట్టు తెలుస్తోంది. రామసుబ్బారెడ్డి.. ఆదినారాయణ రెడ్డి కుటుంబాల మధ్య ఉన్న వైరం అందరికీ తెలిసిందే. అందుకే ఆదినారాయణ రెడ్డి టీడీపీలోకి చేరుతానన్న వార్త వచ్చిన వెంటనే రామసుబ్బారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి ఆదినారాయణను పార్టీలోకి రానివ్వద్దని.. అతని వల్ల పార్టీ కార్యకర్తలు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.. అలాంటి వారు పార్టీకి అవసరంలేదని.. ఒకవేళ ఆదినారాయణ రెడ్డిని కనుక పార్టీలోకి తీసుకుంటే తాను పార్టీని వీడతానని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. దీంతో చంద్రబాబు ఆదినారాయణ టీడీపీ ఎంట్రీ విషయంలో కొంచం వెనక్కి తగ్గారు. అయితే ఆదినారాయణ రెడ్డి చేరిక విషయంలో.. కడప జిల్లాలో టిడిపిని బలోపేతం చేసే చర్యల్లో భాగంగానే ఆదినారాయణరెడ్డిని చేర్చుకుందామని.. ఒకవేళ ఆదినారాయణ రెడ్డి చేరిన తమకు ఎలాంటి లోటు రానివ్వకుండా చూసుకుంటామని..  చంద్రబాబు రామసుబ్బారెడ్డికి హామీ అయితే ఇచ్చారు కాని పార్టీలోకి తీసుకోను అని మాత్రం చెప్పలేదు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు రామసుబ్బారెడ్డి చేసిన విజ్ఞప్తిని భేఖాతరు చేస్తూ ఆదినారాయణ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఆదినారాయణతో పాటు అతని అనుచరులు.. పెద్ద ఎత్తున కార్యకర్తలు టీడీపీలోకి చేరడానికి ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ఈనెల 27 లేదా 30వ తేదీ టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన తెలుగుదేశం తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నిర్ణయంతో రామసుబ్బారెడ్డి తుదుపరి స్టెప్ ఏంటా అని అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి చేర్చుకోవద్దని ఒకటికి రెండుసార్లు చంద్రబాబుకి విజ్ఞప్తి చేశారు అయినా కాని చంద్రబాబు ఆదినారాయణ రెడ్డిని తీసుకోవడంతో రామసుబ్బారెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. తాను చెప్పినట్టు పార్టీనుండి వీడిపోతారా? అన్నది ప్రశ్న. ఈ నేపథ్యంలో మరి చంద్రబాబు రామసుబ్బారెడ్డిని ఎలా కన్విన్స్ చేస్తారో చూడాలి.

ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు కూడా శంఖుస్థాపనకి డుమ్మా?

  ఆంద్రప్రదేశ్ ప్రజల అభీష్టానికి విరుద్దంగా రాష్ట్ర విభజన చేసినందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం నుండి పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. ఎన్నికలకు ముందే అనేకమంది వేరే పార్టీలలోకి వెళ్ళిపోగా, మిగిలినవారిలో కొందరు ఎన్నికల తరువాత వెళ్ళిపోయారు. ఇంకా మిగిలిన వారిలో చాలా మంది ప్రజలకు మొహాలు చూపించి చాలా కాలం అయ్యింది. ప్రత్యేక హోదా అంశాన్ని భుజానికెత్తుకొని కాంగ్రెస్ ఎన్ని పోరాటాలు చేసినా ప్రజలు వారిని పట్టించుకోవడం మానేశారు. ఈ విషయం ఎవరో చెప్పలేదు. ఆ పార్టీని వీడుతున్నవారే స్వయంగా చెపుతున్నారు.   ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రాజధాని శంఖుస్థాపన కార్యక్రమానికి వెళ్లకూడదని నిర్ణయించుకొంది. తమను సరిగ్గా ఆహ్వానించనందునే ఈ కార్యక్రమానికి వెళ్లకూడదని నిర్ణయించుకొన్నామని మాజీ మంత్రి శైలజానాథ్ మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు తన ఇంట్లో కార్యక్రమంలాగ నిర్వహిస్తున్నారని విమర్శించారు. అయితే తాము రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని తెలిపారు. తాము ప్రధాని నరేంద్ర మోడీని అపాయింట్మెంట్ కోరినప్పటికీ ఆయన తమను పట్టించుకాలేదని ఆవేదన వ్యక్తం చేసారు.   ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ప్రజల దృష్టిలో  చాలా  చులకనయ్యారు. ఇప్పుడు ఈ రాష్ట్ర కార్యక్రమానికి ఏవో కుంటిసాకులు చెప్పి వెళ్ళకుండా తప్పించుకొన్నట్లయితే వారిపట్ల ప్రజలలో మరింత ఏహ్యత పెరుగవచ్చును. వారు రాష్ట్రానికి సంబందించిన ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేసినట్లయితే, వారికి ఈ రాష్ట్రం పట్ల అభిమానం కంటే తమ పార్టీ ప్రయోజనాలే మిన్న అనే దురాభిప్రాయం  ప్రజలలో కల్పించినట్లువుతుంది. ఈ కార్యక్రమానికి తను పిలిచినా రానని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గురించి ప్రజలు ఏమనుకొంటున్నారో   తెలుసుకొనే ప్రయత్నం చేసి ఉంటే కాంగ్రెస్ నేతలు ఇటువంటి నిర్ణయం తీసుకొనేవారు కాదు. ఒకవేళ తెలంగాణా కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయి, ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకాకపోతే అప్పుడు ప్రజలు వారి గురించి ఏమనుకొంటారో తేలికగానే ఊహించుకోవచ్చును. కనుక రాష్ట్ర కాంగ్రెస్ నేతలు దీనిపై బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవడం మంచిది.

జగన్ అందుకే ప్రధాని అపాయింట్మెంట్ కోరారుట!

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోరడాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తప్పు పట్టారు. ఈ చారిత్రిక కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి, ప్రధానిని కూడా తప్పుదోవ పట్టించేందుకే అపాయింట్మెంట్ కోరుతున్నారని పుల్లారావు అభిప్రాయపడ్డారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొని ఉన్న చక్కటి బలమయిన సంబంధాలును జగన్మోహన్ రెడ్డి చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తద్వారా రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం సహకారం లేకుండా చేద్దామని జగన్ ప్రయత్నిస్తున్నారని పుల్లారావు ఆరోపించారు. జగన్ తన స్వార్ధ రాజకీయాల కోసం రాష్ట్రాభివృద్ధిని అడ్డుకొనేందుకు కూడా సిద్దపడటం చాలా శోచనీయమని పుల్లారావు అన్నారు. అయితే అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న జగన్ మాటలను ప్రధానే కాదు ఎవరూ నమ్మరని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చిచ్చుపెట్టాలని జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఎన్నటికీ సఫలం కావని అన్నారు.

రామోజీని ఆహ్వానిస్తే జగన్మోహన్ రెడ్డిని కూడా ఆహ్వానిస్తారా?

    వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తను ఎంతో తీవ్రంగా వ్యతిరేకించే ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావును కొన్ని రోజుల క్రితం స్వయంగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి కలిసి వచ్చేరు. అయితే అందుకు కారణం ఏమిటో ఇంతవరకు వారిరువురూ బయటపెట్టలేదు. అదేవిధంగా వారి సమావేశం గురించి తెదేపా నేతలు కూడా ఏమీ మాట్లాడలేదు. అసలు వారిరువురూ కలిసి మాట్లాడుకొన్న సంగతి తమకి తెలియదన్నట్లే వ్యవహరించారు. కానీ వారి సమావేశం గురించి అనేక కోణాలలో విశ్లేషించిన మీడియా రామోజీరావు క్రమంగా తెదేపా దూరం అవుతున్నందునే ఆయనతో తన శత్రుత్వాన్ని పక్కనబెట్టి జగన్ స్వయంగా వెళ్లి రామోజీరావుతో చేతులు కలిపేందుకు సిద్దపడ్డారని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎవరి అభిప్రాయలు ఎలా ఉన్నప్పటికీ తెదేపాకు రామోజీరావుకి మధ్య దూరం పెరిగిందని ప్రజలు నమ్మేలా చేసింది ఆ సంఘటన. అంతే కాదు రామోజీతో జగన్ సమావేశం అవడం ద్వారా తెదేపా నేతల్లో ఆయన పట్ల అనుమాన బీజాలు నాటగలిగారని చెప్పవచ్చును.   తమ సమావేశం గురించి రామోజీరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఏమయినా సంజాయిషీలు ఇచ్చుకొన్నారో లేదో తెలియదు కానీ ఆ తరువాత ఆయన, తెదేపా, వైకాపా నేతలు అందరూ అసలు ఆ సమావేశం జరగనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ నేపధ్యంలో అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్లి ఆయనని ఆహ్వానిస్తారా లేక తన మంత్రులను పంపించి ఆహ్వానిస్తారా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ చంద్రబాబు నాయుడు జగన్ మోహన్ రెడ్డిలాగా దుందుడుకుగా వ్యవహరించే వ్యక్తీ కాదు...తొందరపడి నోరు జారే వ్యక్తి అసలే కాదు. అసలు ఏమీ జరగనట్లుగా వ్యవహరిస్తూ  ఆయనే స్వయంగా సోమవారం రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి రామోజీరావును శంఖుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించడంతో అందరి అనుమానాలు తీరిపోయాయి. వైకాపా నేతలు బహుశః మళ్ళీ ఇప్పుడు ఇదే పాయింటు లేవనెత్తి ఈనాడు మీడియా అధినేతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్లి ఆహ్వానించినపుడు సాక్షి మీడియా అధినేత అయిన జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఎందుకు ఆహ్వానించరు? అని ప్రశ్నించవచ్చును. బహుశః తెదేపా వద్ద అందుకు సమాధానం సిద్దంగానే ఉండి ఉందవచ్చును.

పవన్ అందుకే ఊగిసలాటలో ఉన్నాడా?

  ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వెళ్లాలనే ఉంది కానీ అంటూ దీర్ఘాలు తీస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్... తీరుపై టీడీపీ నేతలు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. పవన్ కు వచ్చే ఉద్దేశం లేదని, అందుకే షూటింగ్ పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు, రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో జరుగుతున్న అతిముఖ్య ఘట్టమైన రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం కంటే షూటింగ్ ముఖ్యమైనదా అంటూ ప్రశ్నిస్తున్నారు, ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు సైతం ప్రశ్నించినప్పుడు పవన్ దాటవేత సమాధానం చెప్పారని, వెళ్లాలనే ఉంది... కానీ చూద్దామంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం వెనుక ఏదో మతలబు ఉందని చెప్పుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీకి మిత్రపక్షంగా వ్యవహరించి... ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు అధికారంలోకి కీలక పాత్ర పోషించిన పవన్ కల్యాణ్.... రాజధాని భూసమీకరణ, భూసేకరణ విషయంలో ప్రభుత్వంతో తీవ్రంగా విభేదించారు, టీడీపీ ఎంపీలపై ఫైరవడమే కాకుండా... భూసేకరణ నోటిఫికేషన్ కు వ్యతరేకంగా రాజధాని గ్రామాల్లో పర్యటించారు, ఈ సందర్భంగా కొన్నిసార్లు టీడీపీ నేతలు, పవన్ కల్యాణ్ పరస్పరం విమర్శలు చేసుకున్నారు. మంత్రులు సైతం పవన్ తీరుపై మండిపడ్డారు, రైతుల నుంచి భూములు తీసుకోకుండా రాజధాని ఎలా కట్టాలో పవన్ చెప్పాలంటూ మంత్రులు వెటకారమాడటంతో పవన్ కూడా తీవ్రంగా స్పందించారు, అయితే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించవద్దంటూ టీడీపీ నేతలను చంద్రబాబు మందలించడంతో ఆ వివాదం తాత్కాలికంగా తెరపడింది. ఈ నేపథ్యంలో టీడీపీకి పవన్ కు దూరం పెరిగిందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే భూసేకరణ నోటిఫికేషన్ ను తీవ్రంగా వ్యతిరేకించి, రాజధాని గ్రామాల్లో పర్యటించిన పవన్ కల్యాణ్... అదే కారణంతో అమరావతి శంకుస్థాపనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడని, అందుకే వెళ్లాలనే ఉంది కానీ...షూటింగ్ సమయాన్ని బట్టి చూస్తానంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు.

ఏపీకి మోడీ వరాలు ఇచ్చే అవకాశం లేదా?

  ఏపీ కొత్త రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు... ఆంధ్రప్రదేశ్ కి ఎలాంటి ప్రత్యేక వరాలు ప్రకటించే అవకాశం లేనట్లే కనిపిస్తున్నాయి. కొత్త రాజధాని నిర్మాణంపై సునిశిత విమర్శలు చేసిన వెంకయ్య... ప్రధాని మోడీ ఏపీకి ఎలాంటి వరాలిస్తారో తనకు తెలియదన్నారు, అసలు ప్రధాని వరాలు ప్రకటిస్తారో లేదో... చెప్పలేమంటూనే అనవసరంగా మాట్లాడి ఆశలు కల్పించడం తనకు ఇష్టం లేదన్నారు. ఇప్పటికే ప్రత్యేక హోదా విషయంలో వివాదం నడుస్తుండటంతో వెంకయ్యనాయుడు ఆచితూచి మాట్లాడారు. అయినా ఆర్దిక వసతులు, మనకున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక తయారు చేసుకోవడమే మంచిదన్నారు. లక్షల కోట్లు అంటూ ఆశలు పెంచి... ఆ తర్వాత నెరవేర్చకపోతే నిరుత్సాహం వస్తుందని వ్యాఖ్యానించారు. ముందుగా పరిపాలన రాజధాని ఏర్పాటు చేసుకోవాలన్న వెంకయ్యనాయుడు... ఈమధ్య కాలంలో కొత్తగా నిర్మించిన నయా రాయపూర్, అహ్మదాబాద్, డెహ్రాడూన్ లకు కేంద్రం వేల కోట్ల రూపాయలు ఇవ్వలేదని, కేవలం సహకారం మాత్రమే అందించిందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు, రాష్ట్ర ప్రభుత్వ ఆశలకు భిన్నంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేసేలా ఉన్నాయని, ఆయన వ్యాఖ్యలను చూస్తుంటే అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఏపీకి మోడీకి ఎలాంటి ప్రత్యేక వరాలు ప్రకటించే అవకాశం లేదంటున్నారు.

మళ్ళీ రెచ్చిపోయిన శివసైనికులు

  మొన్న ముంబైలలో పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి కసౌర్ పుస్తకావిష్కారణ కార్యక్రమంలో పాల్గోనందుకు భారత మాజీ దౌత్యవేత్త సుదీంద్ర కులకర్ణి మొహంపై నల్లరంగు పోసి రసాబాస చేసిన శివసైనికులు ఈసారి తమ ప్రతాపం భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బి.సి.సి.ఐ.) అధ్యక్షుడు శశాంక్ మనోహర్ పై ప్రదర్శించారు.   ఇవ్వాళ్ళ ఆయన ముంబైలోని బి.సి.సి.ఐ. ప్రధాన కార్యాలయంలో పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు అధికారులతో భారత్-పాక్ దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించడం గురించి చర్చిస్తున్నప్పుడు శివసైనికులు లోపలకి చొచ్చుకువచ్చి పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు అధికారులతో చర్చలుజరపడానికి వీలులేదంటూ నానా రభస చేసారు. భారత్ సైనికులను పొట్టనబెట్టుకొంటూ, భారత్ పై ఉగ్రవాదులతో దాడులు చేయిస్తున్న పాకిస్తాన్ తో ఎటువంటి క్రికెట్ మ్యాచ్ లు ఆడరాదని వారు డిమాండ్ చేసారు. పాక్ వైఖరికి నిరసనగా భారత ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వంతో చర్చలు నిలిపివేసిన తరువాత కూడా పాకిస్తాన్ తో క్రికెట్ ఆడాలని ఎలాగ అనుకొంటున్నారు? అని వారు శశాంక్ మనోహర్ ని ప్రశ్నించారు. కనుక తక్షణమే క్రికెట్ కంట్రోల్ బోర్డు అధికారులతో చర్చలు నిలిపివేయాలని వారు డిమాండ్ చేసారు. ఒకవేళ భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లు నిర్వహించాలని ప్రయత్నిస్తే తాము ఖచ్చితంగా వాటిని అడ్డుకొంటామని హెచ్చరించారు.   శివసైనికుల వాదన సహేతుకమయినదే కావచ్చును. కానీ భారత ప్రభుత్వం అనుమతి లేనిదే బి.సి.సి.ఐ. పాకిస్తాన్ బోర్డు అధికారులతో చర్చించే సాహసం, పొరపాటు చేయదు. కనుక బి.సి.సి.ఐ. అధ్యక్షుడు శశాంక్ మనోహర్ కేంద్రప్రభుత్వం అనుమతితోనే పాకిస్తాన్ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు భావించవలసి ఉంటుంది. కనుక శివసేన పార్టీ ఆయనను ప్రశ్నించడం కంటే మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సబబుగా ఉంటుంది. పైగా నేటికీ మహారాష్ట్రలో శివసేన, బీజేపీలు మిత్రపక్షాలుగా ఉన్నాయి. గనుక ఈ విషయంపై మోడీ ప్రభుత్వ వైఖరి ఏమిటని నిలదీయవచ్చును. ఒకవేళ వారికి మోడీ ప్రభుత్వం నుండి సంతృప్తికరమయిన జవాబు రానట్లయితే అప్పుడు ప్రజాస్వామ్యబద్దంగా, చట్టబద్దంగా శివసేన తగిన నిర్ణయం తీసుకోవచ్చును. కానీ ఆవిధంగా చేయకుండా ఈవిధంగా అందరిపై దౌర్జన్యం చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తూ ముంబైలో సమాంతర ప్రభుత్వాన్ని నడపాలనుకొంటే ఏదో ఒకరోజు భంగపాటు తప్పదు.

అమరావతికి ఆర్భాటాలు వద్దంటున్న వెంకయ్య

  నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తుంటే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి, అంతర్జాతీయస్థాయి నగరాన్ని నిర్మించాలనుకోవడం మంచిదే అయినా, ప్రజల అవసరాలకు తగ్గట్టుగా రాజధాని ఉండాలని వెంకయ్య సూచించారు. కేవలం ఆకాశ హర్మ్యాలు, భారీ భవంతలు కట్టడమే కేపిటల్ కాదని, ఏదైనా సరే అవసరాలకు మించి కట్టడం సరికాదని వెంకయ్య అభిప్రాయపడ్డారు. కొత్త రాజధానిని అవసరాలకు మంచి కడితే కచ్చితంగా చైనా అనుభవం ఎదురవుతుందని, అక్కడ నగరాలకు నగరాలు ఖాళీగా ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆకర్షనీయమైన నగరం బార్సిలోనాలో భారీ భవంతులు, ఆకాశ హర్మ్యాలు లేవని... అక్కడ కొత్త కట్టడాలను కట్టకుండానే, ఉన్నవాటిని అందంగా తీర్చిదిద్దారని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. అందుకే ప్రపంచంలోని అనుభవాలు దృష్టిలో పెట్టుకుని నవ్యాంధ్ర రాజధాని అమరావతిని నిర్మించాలని వెంకయ్య సూచించారు. ఇక అమరావతి శంకుస్థాపనకు హాజరుకానున్న ప్రధాని మోడీ... ఏపీకి ఎలాంటి వరాలిస్తారో తనకు తెలియదన్నారు, అసలు ప్రధాని వరాలు ప్రకటిస్తారో లేదో...ముందే చెప్పలేమన్న ఆయన... అనవసరంగా మాట్లాడి ఆశలు కల్పించడం తనకు ఇష్టం లేదన్నారు. అయినా ఆర్దిక వసతులు, మనకున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక తయారు చేసుకోవడమే మంచిదన్నారు. లక్షల కోట్లు అంటూ ఆశలు పెంచి... ఆ తర్వాత నెరవేర్చకపోతే నిరుత్సాహం వస్తుందని అన్నారు. ముందుగా పరిపాలన రాజధాని ఏర్పాటు చేసుకోవాలన్న వెంకయ్యనాయుడు... ఈమధ్య కాలంలో కొత్తగా నిర్మించిన నయా రాయపూర్, అహ్మదాబాద్, డెహ్రాడూన్ లకు కేంద్రం వేల కోట్ల రూపాయలు ఇవ్వలేదని, కేవలం సహకారం మాత్రమే అందించిందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.

అమరావతికి గ్లామర్ డోస్ పెంచుతున్నారు

  అమరావతి శంకుస్థాపనకు ముహూర్తం దగ్గరపడటంతో సినీ హంగులు అద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది, ఇప్పటికే కార్యక్రమ వ్యాఖ్యాతగా సాయికుమార్ ను ఎంపిక చేయగా, సభావేదికను సినిమా సెట్టింగ్ మాదిరిగా భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం వివిధ దేశాలు, రాష్ట్రాల్లో ప్రాచీన కళారూపాలు, సాంస్కృతిక వైభవం గురించి పరిశోధన చేసిన సేథీకి ఈ బాధ్యతలు అప్పగించారు, ఇప్పటికే ప్రధాన వేదిక అన్ని హంగులూ అద్దిన సేథీ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ.. అమరావతి ప్రాచీనత ఉట్టిపడేలా ప్రాంగణాన్ని సిద్ధంచేస్తోంది. కళాత్మకతతో పాటు అందరినీ ఆకర్షించేలా సినిమా సెట్టింగ్‌లను తలపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి సినీ గ్లామర్ అద్దేందుకు సాధ్యమైనంత వరకు వారిని నేరుగా కార్యక్రమంలో భాగస్వాములయ్యేలా చేస్తున్నారు. తారల తళుకుబెళుకులు, పాటలు, సంగీత కార్యక్రమాలు, నవ్వులు పండించే స్కిట్లు, సాంస్కృతిక కార్యక్రమాలతో సభికులను కట్టి పడేసే ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా ప్రముఖ నటుడు సాయికుమార్, ప్రముఖ గాయని సునీత యాంకరింగ్ చేయనుండగా, శివమణి డ్రమ్స్ ప్రోగ్రాం, భవిరి రవి స్కిట్స్ కార్యక్రమాన్ని సైతం ఏర్పాటు చేశారు. ప్రధాని రావడానికి ముందు ఈ కార్యక్రమాలన్నీ ఉండేలా ప్లాన్ చేస్తున్న అధికారులు... మోడీ వచ్చాక ఆయన ముందే... కూచిభొట్ల ఆనంద్ నేతృత్వంలో కూచిపూడి నృత్యరూపకం ప్రదర్శించనున్నారు. అయితే అమరావతి శంకుస్థాపన వేదికలను సిద్ధంచేయాలని ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళిని సంప్రదించగా ఆయన తిరస్కరించినట్లు తెలిసింది, బాహుబలి మాదిరిగా అదిరిపోయే విధంగా సెట్టింగ్ వేయాలని అధికారులు కోరితే స్పందించలేదని, ఆ తర్వాత బోయపాటి శ్రీనును అప్రోచ్ కాగా, ఆయన కూడా ముందుకురాలేదని చెబుతున్నారు.