ఉప ఎన్నికలకి పార్టీలో అభ్యర్ధి లేకపోతే సార్వత్రిక ఎన్నికలకి ఎలా?
posted on Nov 3, 2015 @ 1:35PM
వచ్చే ఎన్నికల నాటికి రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు గట్టిగా కృషి చేయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర నేతలను కోరారు. అందుకు వారు ఏవిధంగా ముందుకు వెళ్ళాలో నిర్దిష్టమయిన సూచనలు, సలహాలు కూడా ఇచ్చారు. ఆయన సలహాలను ఆంధ్రా నేతలు ఎంతో కొంత పాటిస్తూ రాష్ట్రంలో తమ ఉనికి చాటుకొంటున్నారు. ఇంతవరకు ఆంధ్రాతో పోల్చి చూస్తే తెలంగాణాలోనే బీజేపీ ఎంతో కొంత బలంగా, చురుకుగా ఉన్నట్లు కనిపించేంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారు అయినట్లుంది.
వరంగల్ ఉప ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్ధినే నిలబెట్టాలని పంతం పట్టి మరీ తెదేపా నుంచి ఆ సీటు తీసుకొన్న తెలంగాణా బీజేపీ నేతలు, పార్టీలో అందుకు తగిన బలమయిన అభ్యర్ధి లేకపోవడంతో అమెరికాలో వైద్యుడుగా స్థిరపడిన డా. పగడిపాటి దేవయ్య పేరును ఖరారు చేసారు. ఈ ఉప ఎన్నికలు అకస్మాత్తుగా జరుగుతున్నవి కావు. ఇవి జరుగుతాయని ఆరు నెలల క్రితమే బీజేపీ నేతలకి తెలుసు. ఈ ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించాలనే తపన రాష్ట్ర బీజేపీ నేతలకు ఉండి ఉంటే వారు అప్పటి నుంచే తమ పార్టీ నుంచే ఒక బలమయిన అభ్యర్ధిని సిద్దం చేసుకొని ఉండాలి. కానీ ఇంతవరకు ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చొన్నారు.
అధికార తెరాస, కాంగ్రెస్, అభ్యర్ధులను మరియు వామ పక్షాలు బలపరుస్తున్న స్వతంత్ర అభ్యర్ధి గాలి వినోద్ కుమార్ ని డ్డీ కొని ఎదురు నిలవగల అభ్యర్ధి తమ వద్ద లేడని తెలిసి ఉన్నప్పటికీ, తెదేపా నుంచి బలవంతంగా వరంగల్ సీటును గుంజుకొని మరో పెద్ద పొరపాటు చేసారు. ఎటువంటి రాజకీయ అనుభవం లేని దేవయ్యకు కట్టబెట్టడం ఇంకా పొరపాటు. తద్వారా రాష్ట్ర బీజేపీ నేతలే తమ విజయావకాశాలను ప్రత్యర్ధ పార్టీలకు స్వయంగా అప్పగించినట్లయింది. తమ వద్ద బలమయిన అబ్యర్ది లేడని తెలిసి ఉన్నప్పుడు, ఈ ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్ధి తప్పకుండా గెలిచి తీరాలని రాష్ట్ర బీజేపీ నేతలు భావించి ఉండి ఉంటే ఆ సీటును మంచి రాజకీయ అనుభవం ఉన్న తెదేపాకు చెందిన రావుల చంద్రశేఖర్ రెడ్డి వదిలిపెట్టి ఉండాల్సింది. ఆయన వరంగల్ ఉప ఎన్నికలలో పోటీ చేసి తప్పకుండా విజయం సాధించగలనని ధీమా వ్యక్తం చేసారు. కానీ బీజేపీ పట్టుబట్టి ఆ సీటు తీసుకొని దానిని డా. దేవయ్యకు ఇచ్చి ప్రత్యర్ధ పార్టీలకు ఎన్నికలకు ముందే సగం విజయం సమకూర్చిపెట్టింది. తెదేపా-బీజేపీలలో ఎవరు పోటీ చేయాలని చర్చ జరుగుతున్నప్పుడు, వాటి తరపున పోటీ చేయబోయే ఎన్డీయే అభ్యర్ధి నుండి కూడా గట్టిపోటీ ఉంటుందని కాంగ్రెస్, తెరాసలు భావించాయి. బీజేపీ నేతల ఒత్తిడి కారణంగా ఆ సీటును తెదేపా వదులుకొన్నప్పుడే ప్రత్యర్ధ పార్టీల అభ్యర్ధులు సగం విజయం సాధించినట్లు సంబరపడ్డారు. ఎటువంటి రాజకీయ అనుభవం, ప్రజలతో, స్థానిక నేతలతో పరిచయాలు లేని దేవయ్యను ఎంపిక చేయడంతో వారి విజయావకాశాలను నూటికి నూరు శాతం బీజేపీయే స్వయంగా ఖరారు చేసినట్లయింది.
దీనిని బట్టి అర్ధమవుతున్న విషయం ఏమిటంటే నేటికీ తెలంగాణా బీజేపీలో బలమయిన నేతలు లేరని...ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హెచ్చరించినప్పటికీ రాష్ట్ర బీజేపీ నేతలెవరూ పార్టీని పటిష్టం చేసుకోవడం లేదని...వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి ఇప్పటి నుంచే బలమయిన అభ్యర్ధులను తయారు చేసుకోవడంలేదని! ఉప ఎన్నికలకే పార్టీలో బలమయిన అభ్యర్ధి లేనప్పుడు ఇక రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీ ఏవిధంగా ఎదగగలరు? సార్వత్రిక ఎన్నికలలో వందల మంది అభ్యర్ధులను ఎక్కడి నుంచి తీసుకు వస్తారు? అనే సందేహాలు కలగడం సహజం. దేశమంతటా బీజేపీని విస్తరించాలని అమిత్ షా కలలు కంటూ అందుకోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. కానీ తెలుగు రాష్ట్రాలలో బీజేపీ నేతలలో ఆ ఉత్సాహం, చొరవ, పట్టుదల, కార్యదీక్ష కనబడటం లేదు. అందుకు వరంగల్ ఉప ఎన్నికలకు బయట నుంచి అభ్యర్ధిని తెచ్చుకోవలసిన దుస్థితిలో ఉండటమే ఒక చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చును.