అనిశ్చితంగా సాగుతున్న కొండా సురేఖ రాజకీయ జీవితం

  కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్ పార్టీని వీడినప్పటి నుంచి వారి రాజకీయ జీవితం నిలకడగా సాగడం లేదు. ఒక్కోసారి చాలా అనిశ్చితంగా, ఆందోళనకరంగా ఉంటోంది. స్వర్గీయ వైయస్సార్ మీద అభిమానంతో వారు కాంగ్రెస్ పార్టీని వీడి జగన్మోహన్ రెడ్డి పంచన చేరారు. కానీ జగన్ వారికి హ్యాండ్ ఇచ్చేరు. రాష్ట్ర విభజన అనివార్యమని గుర్తించిన జగన్ రెండు రాష్ట్రాలకు మద్దతు ఈయకుండా, విభజన తరువాత జరుగబోయే సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిచి తన ముఖ్యమంత్రి కలను సాకారం చేసుకోవాలనే తాపత్రయంతో సమైక్యాంధ్ర స్టాండ్ తీసుకొన్నారు. ఆ కారణంగా ఆయననే నమ్ముకొన్న కొండా సురేఖ వంటి అనేకమంది తెలంగాణా నేతలు, కార్యకర్తలు రోడ్డున పడ్డారు.   వైకాపా సమైక్యాంధ్ర ఉద్యమాలు చేయడం వెనుక అసలు ఉద్దేశ్యం అందరికీ తెలిసి ఉన్నప్పటికీ, దాని ఉద్యమాలతో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినట్లుగానే తెలంగాణా ప్రజలు భావించారు. అటువంటి పార్టీలో పనిచేసినందుకు కొండా సురేఖ దంపతులపై కూడా తెలంగాణా ద్రోహులు అనే ముద్ర పడింది. జగన్ తీసుకొన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వారు వైకాపాకు రాజీనామాలు చేసినప్పటికీ, వారిపై పడిన ఆ ముద్రను నేటికీ తొలగించుకోలేకపోతున్నారు.   వారు వైకాపా నుంచి బయటపడిన తరువాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలనుకొన్నారు కానీ తెరాసలోకి వెళ్లి పొరపాటు చేసారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపరుతున్నారు. ఒకవేళ వారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకే వెళ్లి ఉండి ఉంటే, ఇదివరకులాగే పూర్తి స్వేచ్చా స్వాతంత్ర్యాలు అనుభవిస్తూ తమ రాజకీయ జీవితం పునరుద్దరించుకోగలిగేవారు. బహుశః వరంగల్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం కొండా సురేఖకే దక్కేదేమో? తెరాసలోకి వెళ్ళడం వలన వరంగల్ జిల్లా రాజకీయాలలో చక్రం తిప్పడం సంగతి ఏమో గానీ కొండా సురేఖ తన ఉనికినే కోల్పోయారు.   ఇటువంటి సమయంలో కేసీఆర్ ఆమెకు పోటీగా తెదేపా నుంచి గుండు సుధారాణిని తీసుకువచ్చేరు. వారి మధ్య చిరకాలంగా జిల్లాలో రాజకీయ విభేదాలు ఉన్నాయి. అయితే ఇంతవరకు వారిరువురూ వేర్వేరు పార్టీలలో ఉన్నందున వారి రాజకీయ విరోధం వలన వారికేమీ పెద్దగా ఇబ్బంది కలుగలేదు. కానీ ఇప్పుడు వారిరువురూ ఒకే పార్టీలో పనిచేయవలసి రావడంతో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. అందుకే సుధారాణి చేరికను కొండా సురేఖ దంపతులు తీవ్రంగా వ్యతిరేకించారు కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ వారి అభ్యంతరాలను పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందారు. కాంగ్రెస్ నుంచి వైకాపాలోకి దాని లోంచి అధికారంలో ఉన్న తెరాసలోకి మారినా కొండా సురేఖ దంపతుల రాజకీయ జీవితం నిలకడగా లేదు..ఏమాత్రం సంతృప్తికరంగా కూడా లేదు. కనుక ఏదో ఒక రోజున వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ గూటికే చేరుకొంటారేమో?

హరీష్ రావుతో సన్నిహితంగా ఉన్నందుకేనట!

  వరంగల్ ఉప ఎన్నికలు తెరాసలో హరీష్ రావు ఏకాకి అయ్యారనే విషయం బయటపెట్టాయి. ఆయన అనుచరుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ వరంగల్ ఉప ఎన్నికలలో పోటీ చేయాలనుకొన్నారు. హరీష్ రావు సూచన మేరకే ఆయన గత ఆరు నెలలుగా తరచూ వరంగల్ పర్యటిస్తూ, అక్కడి నేతలు, కార్యకర్తలతో పరిచయాలు పెంచుకొన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం ఆయన పేరును పరిశీలనలోకి కూడా తీసుకోలేదు. అతను జిల్లాకు చెందిన వ్యక్తి కాదని పక్కన పెట్టేసారు. కానీ అసలు కారణం ఆయన హరీష్ రావు అనుచరుడు కావడమేనని తెరాస నేతలే అనుకొంటున్నారుట. అంటే హరీష్ రావుతో సన్నిహితంగా మెలిగినవారు ఆయనతో బాటు పార్టీలో ఒంటరి అయిపోతారని చెప్పకనే చెప్పినట్లయింది.   కేసీఆర్ తన కుమారుడు కె. తారక రామారావుని తన వారసుడిగా ముందుకు తీసుకురావాలనుకొంటే అదేమీ అసహజమయిన విషయం కాదు. హరీష్ రావుని కూడా ఒకానొకప్పుడు ముఖ్యమంత్రి పదవి ఆశించడం, పార్టీలో కేసీఆర్ తరువాత స్థానం ఆశించడం రహస్యమేమీ కాదు. కనుక హరీష్ రావు నుండి తన కొడుకు కె. తారక రామారావుకి ఎన్నడూ సవాలు ఎదురవకూడదనే ఉద్దేశ్యంతోనే, ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావును పార్టీలో ఏకాకిగా చేస్తున్నట్లుంది. ఎర్రోళ్ల శ్రీనివాస్ కి వరంగల్ ఉప ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలని హరీష్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ ని గట్టిగా అడిగారో లేదో తెలియదు కానీ శ్రీనివాస్ అభ్యర్దిత్వాన్ని నిర్ద్వందంగా తిరస్కరించడం ద్వారా అతనిని బలపరుస్తున్న హరీష్ రావుని తిరస్కరించినట్లయింది.   అసెంబ్లీ సమావేశాలు జరుగుతునప్పుడు, ఎన్నికల సమయంలో హరీష్ రావును బాగానే వాడుకొనే కేసీఆర్, ఆయన అనుచరుడికి టికెట్ ఈయవలసివచ్చినపుడు ఈవిధంగా తిరస్కరించడం విస్మయం కలిగిస్తోంది. హరీష్ రావు ఇంతవరకు ఎప్పుడూ కూడా పార్టీ అధిష్టానంపై తన అసంతృప్తి వ్యక్తం చేయలేదు. కానీ ఇదేవిధంగా ఆయనతో పార్టీ వ్యవహరిస్తున్నట్లయితే ఏదో ఒకరోజు తన దారి తను చూసుకోవచ్చును.

వరంగల్ ఎన్నికలకి కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎస్.రాజయ్య?

  వచ్చే నెల 21వ తేదీన జరుగబోయే వరంగల్ లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మొదట అక్కడి నుండి పెద్దపల్లి మాజీ ఎమ్.పి వివేక్ ను పోటీ చేయమని కాంగ్రెస్ ఒత్తిడి చేసినప్పటికీ ఆయన అంగీకరించకపోవడంతో రాజయ్యను కానీ సర్వే సత్యనారాయణను గానీ నిలబెట్టాలని భావించింది. వారిలో సర్వే సత్యనారాయణ వరంగల్ నుండి పోటీ చేయడానికి చాలా ఆసక్తి చూపినప్పటికీ స్థానికుడయిన రాజయ్య అయితేనే తెరాస, ఎన్డీయే అభ్యర్ధులను డ్డీకొని విజయం సాధించగలరని కాంగ్రెస్ అధిష్టానం భావించడంతో రాజయ్యపేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.   తెరాస తన అభ్యర్ధిగా వసునూరి దయాకర్ పేరును ఖరారు చేసింది. ఈ ఎన్నికలలో బీజేపీ అభ్యర్ధికి మద్దతు ఇవ్వాలని తెదేపా నిశ్చయించుకొంది. కనుక బీజేపీ, వైకాపాలు ఇంకా తమ అభ్యర్ధుల పేర్లు ప్రకటించవలసి ఉంది. అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు నవంబర్ 4తో ముగుస్తుంది. కనుక ఆలోగా అన్ని పార్టీలు తమ అభ్యర్ధుల పేర్లను ప్రకటించి నామినేషన్లు వేయవలసి ఉంటుంది.

ఏపీకి రూ. 2.27 లక్షల కోట్లు ప్యాకేజి?

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని దాదాపు స్పష్టమయింది. దానికి బదులుగా రాష్ట్రానికి భారీ ఆర్ధిక ప్యాకేజిని ఇచ్చేందుకు అవసరమయిన రోడ్ మ్యాప్ సిద్దం చేయమని ప్రధాని నరేంద్ర మోడి రెండు నెలల క్రితం నీతి ఆయోగ్ అధికారులను ఆదేశించారు. తక్షణమే రంగంలోకి దిగిన వారు రాష్ట్ర ఉన్నతాధికారులతో సంప్రదిస్తూ రాష్ట్రంలో నిర్మాణ, అభివృద్ధి కార్యక్రమాలకు ఎంతెంత మొత్తాలు ఇవ్వాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు.   రాష్ట్రంలో చేప్పట్టాల్సిన వేర్వేరు అభివృద్ధి పనుల కోసం రూ.2,25,484 కోట్లు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్ తయారుచేస్తున్న నీతి ఆయోగ్ అధికారులకు ఒక నివేదిక పంపించింది. మళ్ళీ దానికి అదనంగా మరో రూ.1,892 కోట్లు వేరే పధకాల కోసం మంజూరు చేయాలని కోరుతూ మరో నివేదిక సమర్పించింది. అంతా కలిపి మొత్తం రూ.2,27,766 కోట్లయింది. ఈ మొత్తాన్ని మిగిలిన మూడున్నరేళ్ళ కాలంలో సర్దుబాటు చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. నీతి ఆయోగ్ అధికారులు తమ ప్రతిపాదనలను సిద్దం చేసి త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడికి పంపిస్తారు. వచ్చే నెల 5వ తేదీన బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగుస్తాయి. కనుక ఆ తరువాత ఎప్పుడయినా ప్రధాని మోడీ దానిపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని భావించవచ్చును.

సుధారాణి బాటలో మరో రాజ్యసభ ఎంపీ?

  టీడీపీకి రాజ్యసభ పదవులు అచ్చిరావడం లేదు, ఎంతోమంది అసంతృప్తుల్ని బుజ్జగించి ఏరికోరి రాజ్యసభకు పంపిస్తే... పదవీకాలం ముగిసేముందు హ్యాండిస్తున్నారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ దగ్గర్నుంచి ప్రస్తుత అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వరకూ ఇదే రిపీట్ అవుతోంది, ఇప్పటివరకూ కనీసం 15మంది రాజ్యసభ సభ్యులు టీడీపీ గడప దాటినట్లు అంచనా, నాడు రేణుకాచౌదరి దగ్గర్నుంచి నేడు గుండు సుధారాణి వరకూ అందరికీ అదే బాట, వీళ్లలో పార్టీ మారిన వారు కొందరైతే... పార్టీకి దూరంగా ఉంటున్నవాళ్లు మరికొందరు, టీడీపీ రాజ్యసభకు పంపినవాళ్లలో కొందరు మొత్తం రాజకీయాల్నే వదిలేసినవాళ్లున్నారు. టీడీపీ రాజ్యసభకు పంపిస్తే వాళ్లు పార్టీలో ఉండరన్న సెంటిమెంట్ ప్రతీసారీ రిపీట్ అవుతోంది, రేణుకాచౌదరి, సి.రామచంద్రయ్య, మోహన్ బాబు, జయప్రద, మైసూరారెడ్డి, వంగా గీత, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, యలమంచిలి శివాజీ, రామచంద్రారెడ్డి, రుమాండ్ల రామచంద్రయ్య... ఇలా ఓ పదిహేను మంది రాజ్యసభ పదవీకాలం ముగిసే ముందు పార్టీకి దూరమైనవాళ్లే. అంతేకాదు ఇప్పటివరకూ టీడీపీ నుంచి రాజ్యసభకు వెళ్లినవారితో లాభం కంటే పార్టీకి నష్టమే ఎక్కువ జరిగిందని చెప్పాలి, సి.రామచంద్రయ్యను రెండుసార్లు రాజ్యసభకు పంపిస్తే... మూడోసారి అవకాశం ఇవ్వలేదంటూ తెలుగుదేశానికి గుడ్ బై చెప్పేశారు, ఇప్పుడు అదేరీతిలో కార్పొరేటర్ స్థాయి లీడర్ సుధారాణిని రాజ్యసభకు పంపిస్తే... పార్టీకి హ్యాండివ్వబోతోంది. గుండు సుధారాణి బాటలోనే మరో టీడీపీ రాజ్యసభ ఎంపీ పార్టీ మారతారనే టాక్ వినిపిస్తోంది, 2014 సాధారణ ఎన్నికల్లో రాయలసీమ బాధ్యతలను చూసిన ఆ నాయకుడ్ని ఇప్పుడు చంద్రబాబు పక్కనబెట్టారని, దాంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని చెప్పుకుంటున్నారు. 2014 ఎన్నికల వరకూ బాబు కోటరీలో కీలక వ్యక్తిగా ఉన్న ఆ నాయకుడు... ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిశాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి, టీడీపీ విజయం కోసం తాను తీవ్రంగా కష్టపడితే... తీరా అధికారంలోకి వచ్చాక పక్కనబెడతారా అంటూ రగిలిపోతున్న ఆ సీమ నాయకుడు... వైసీపీలో చేరతారనే టాక్ కూడా వినిపిస్తోంది.

లాలూ ప్రసాద్ తో ఎందుకు చేతులు కలిపానంటే...

  బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన బద్ధ శత్రువయిన లాలూ ప్రసాద్ యాదవ్ తో చేతులు కలిపారు. పశువుల దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ జైలుకి వెళ్లి వచ్చిన సంగతి ఆయనకి తెలుసు. ఆ కారణంగా ప్రజలలో లాలూ ప్రసాద్ పట్ల వ్యతిరేకత ఉందని కూడా తెలుసు. అయినా లాలూ ప్రసాద్ తో ఆయన చేతులు కలపడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. అదే విషయం ఆయనను మీడియా ప్రశ్నిస్తే అందుకు ఆయన చెప్పిన జవాబు ఇంకా ఆశ్చర్యం కలిగిస్తోంది.   “ఈ ఎన్నికలు బీజేపీతో సహా అన్ని పార్టీలకు చాలా కీలకమయినవే. కనుక అన్ని పార్టీలు ఏదో ఒకవిధంగా ఈ ఎన్నికలలో గెలిచేందుకు ప్రయత్నిస్తాయి. ఒకవేళ ఈ ఎన్నికలలో పొరపాటున బీజేపీ విజయం సాధించినట్లయితే ఇక ఆ పార్టీ మత మౌడ్యాన్ని, అహంకారాన్ని తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇక దేశంలో తనకు ఎదురులేదనుకొని ఇంకా పేట్రేగిపోతుంది. కనుక మతతత్వ బీజేపీని అడ్డుకోవలసిన బాధ్యత నామీద ఉందని నేను నమ్ముతున్నాను. అందుకే ఒంటరిగా పోటీ చేయడం కంటే మా భావజాలానికి దగ్గరగా ఉండే లాలూ ప్రసాద్ యాదవ్ తో చేతులు కలపడం మంచిదని భావించాను,” అని నితీష్ కుమార్ జవాబిచ్చారు.   ఈ ఎన్నికలలో బీజేపీని అడ్డుకోవడం చాలా అత్యవసరమని చెపుతున్న నితీష్ కుమార్ సుమారు పదేళ్ళపాటు అదే బీజేపీతో ఎన్డీయే కూటమిలో ఉన్నారు. ఏదో ఒకనాడు ప్రధానమంత్రి అవుదామని కలలుగన్నారు. కానీ బీజేపీ నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించడంతో నితీష్ కుమార్ ఎన్డీయేలో నుండి బయటపడి వామపక్షాలతో కలిసి థర్డ్ ఫ్రంట్ కట్టారు. కానీ ఆ ప్రయోగం కూడా ఘోరంగా విఫలం కావడంతో రాజకీయాలలో ఒంటరి అయిపోయారు. సరిగ్గా ఇటువంటి సమయంలో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతుండటంతో మోడీని ఒంటరిగా ఎదుర్కోవడం చాలా కష్టమని భావించి అయిష్టంగానే కాంగ్రెస్ పార్టీతో, అవినీతిపరుడయిన లాలూ ప్రసాద్ యాదవ్ చేతులు కలిపారు. దానికి నితీష్ కుమార్ దేశం, రక్షణ, బాధ్యత, కర్తవ్యం అంటూ చాలా మంచి కలరింగ్ ఇచ్చారు.

అమరావతి తరలివచ్చేందుకు షరతులు లేవు, కానీ...డిమాండ్స్ ఉన్నాయి

  హైదరాబాద్ లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఏడాదిన్నర సమయం ఇచ్చినా ఇంకా విజయవాడ తరలివచ్చేందుకు ఇష్టపడటం లేదు. అందుకు వారు తమ సమస్యలను ఏకరువు పెడుతున్నారు. అనేక మెలికలు పెడుతున్నారు. ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్స్ పెడుతున్నారు. కానీ విజయవాడ తరలివచ్చెందుకు మాత్రం సముఖంగా లేరు. వారి గొంతెమ్మ కోరికలు విని ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   ఈరోజు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ, మరి కొందరు ఉద్యోగ సంఘ నేతలు విజయవాడలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు నాయుడుని కలిసి ఆయన ముందు తమ డిమాండ్ల చిట్టా ఉంచేరు. తమకు హైదరాబాద్, విజయవాడ రెండు చోట్లా కూడా హెచ్.ఆర్.ఏ. చెల్లించాలని, అమరావతిలో ఇళ్ళు కట్టు కొనేందుకు తమకు ఇళ్ళ స్థలాలు కేటాయించాలని, ఉద్యోగుల పీఆర్సీ, లోన్‌, అడ్వాన్సుల జీవోలను వెంటనే విడుదల చేయాలని వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు.   అందుకు ముఖ్యమంత్రి బదులిస్తూ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోకపోయినా ఉద్యోగులు కోరినవన్నీ ఇచ్చేనని ఇంకా కొత్తగా డిమాండ్స్ పెట్టవద్దని చెప్పారు. ముఖ్యమంత్రి విజయవాడలో, ఉద్యోగులు హైదరాబాద్ లో పనిచేస్తుండటం వలన చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని కనుక ఉద్యోగులు అందరూ వచ్చే జూన్ నెలలోగా విజయవాడ తరలిరావలసిందేనని స్పష్టం చేసారు. ఉద్యోగులు కూడా కొన్ని త్యాగాలకు సిద్దపడాలని ముఖ్యమంత్రి కోరారు. ఉద్యోగులు తమకు శాశ్విత వసతి కల్పించాలన్న కోరికను కూడా ముఖ్యమంత్రి తిరస్కరించారు. వారికి తాత్కాలిక వసతి సౌకర్యాలు కల్పించగలనని హామీ ఇచ్చేరు. పీఆర్సీ, లోన్‌, అడ్వాన్సుల జీవోలపై ఉద్యోగుల అభ్యర్ధనకు సానుకూలంగా స్పందించారు.   అనంతరం సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ తాము విజయవాడ తరలివచ్చేందుకు ప్రభుత్వానికి ఎటువంటి షరతులు పెట్టడం లేదని, తమవి గొంతెమ్మ కోరికలు కావని అన్నారు. అమరావతిలో పనిచేసేందుకు కార్యాలయాలు చూపిస్తే జూన్ నాటికల్లా అందరం తరలివస్తామని చెప్పారు.   ముఖ్యమంత్రిని ముందు అన్ని డిమాండ్స్ పెట్టి, మళ్ళీ తాము ప్రభుత్వానికి షరతులు విధించలేదని ఉద్యోగుల సంఘాల నేతలు చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. రాజధాని కోసం రైతులు తమ జీవనోపాధి అయిన పంట భూములను త్యాగం చేయడం చూసిన తరువాత కూడా ఉద్యోగులు చిన్నపాటి త్యాగానికి కూడా సిద్దపడకపోవడం చాలా విచారకరం. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏవిధంగా ఉందో అందరికంటే వారికే బాగా తెలుస్తుంది. అయినప్పటికీ రెండు హెచ్.ఆర్.ఏ.లు కావాలని కోరడం చూసి రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకొంటున్నారు.   రాష్ట్ర విభజన సమయంలో విభజనను వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు చేసిన ఉద్యమాన్ని చూసి వారి పట్ల ప్రజలకు చాలా గౌరవభావం ఏర్పడింది. కానీ వారు ఆ గౌరవం ఇప్పుడు చేజేతులా పోగొట్టుకొంటున్నారు. ఇప్పటికే 16 నెలలుగా వారు హైదరాబాద్ లో ఉంటూ పని చేస్తున్నారు. వాళ్ళు విజయవాడకి తరలిరావడానికి ఇంకా ఎన్ని నెలలు లేదా ఏళ్ళ సమయం కోరుకొంటున్నారో అసలు విజయవాడకు తరలి రావాలనుకొంటున్నారో లేదో స్పష్టంగా చెపితే ప్రభుత్వం తదనుగుణంగా ఏర్పాట్లు చేసుకొంటుంది కదా?

డామేజ్ అవుతున్న బాబు ఇమేజ్

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమర్ధుడైన నాయకుడనడంలో ఎలాంటి సందేహం లేదు, ఆయనకున్న దూరదృష్టి, విజన్, క్లారిటీ ఆంధ్రప్రదేశ్ లో మరే నాయకుడికీ లేవంటే ఆశ్చర్యపోవనసరం లేదు, గతంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసి... ఇప్పుడు నవ్యాంధ్ర పగ్గాలు చేపట్టిన చంద్రబాబు... రాష్ట్రాభివద్ధి కోసం రాత్రీపగలనకా కష్టపడుతున్నారు, అయితే ఇంతటి సత్తా, విజన్ ఉన్న చంద్రబాబు... తన కింద పనిచేసే టీమ్ లో సరైన వాళ్లను ఎంచుకోలేకపోతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మంత్రులు... చంద్రబాబు అంచనాలకు అనుగుణంగా పనిచేయడం లేదనే విమర్శలు ఎప్పట్నుంచో ఉన్నాయి, ఇటీవల జరిగిన అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలోనూ మంత్రుల పనితీరుపై బాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని మంత్రులు సీరియస్ గా తీసుకోలేదని, చాలామంది అంటీముట్టనట్టుగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారట. మంత్రులనే కాదు చంద్రబాబు ఎంచుకుంటున్న అధికారుల పనితీరు కూడా అలాగే ఉంటుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి, రేషన్ షాపుల్లో అవినీతి అక్రమాలను అరికట్టడానికి ప్రవేశపెట్టిన ఈపాస్ విధానం మంచిదే అయినా, దాన్ని సమర్ధవంతంగా అమలు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు, గంటలతరబడి వేచివున్నా సర్వర్ పనిచేయడం లేదంటూ రేషన్ ఇవ్వకపోవడంతో పేద ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అధికారులు ఈపాస్ విధానమైతే ప్రవేశపెట్టారు గానీ... అది సమర్ధవంతంగా పనిచేయడానికి అవసరమైన సర్వర్లును మాత్రం ఏర్పాటు చేయలేదని, దాంతో ఆ విధానంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగి, చివరికి దాని ప్రభావం చంద్రబాబుపైనా, టీడీపీ ప్రభుత్వంపైనా పడుతోందని అంటున్నారు. ఈ పరిస్థితికి చంద్రబాబు సరైన టీమ్ ను ఎంపిక చేసుకోకపోవడమే కారణమని, కనీసం ఇప్పటికైనా సమర్ధులైనవారిని ఎంచుకోవాలని, లేదంటే పార్టీకి, ప్రభుత్వానికి నష్టం జరిగే అవకాశముందంటున్నారు.

జగన్మోహన్ రెడ్డి తాజా సర్వే ఏం చెబుతోంది?

  2014 సాధారణ ఎన్నికలకి ముందు సర్వేలను నమ్మి కాబోయే ముఖ్యమంత్రిని తానేనని ఊహాల పల్లకిలో ఊరేగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎలక్షన్స్ రిజల్ట్స్ కోలుకోలేని దెబ్బకొట్టాయి, జగన్ చేయించుకున్న అన్ని సర్వేల్లోనూ వైసీపీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి రానుందని తేలగా, తీరా ఫలితాలు వెలువడ్డాక బొక్కాబోర్లాపడాల్సి వచ్చింది, సర్వేలను గుడ్డిగా నమ్మి 2014 ఎన్నికల్లో దెబ్బతిన్న జగన్ మోహన్ రెడ్డి... మళ్లీ అదే సర్వేలను బేస్ చేసుకుని మరోసారి కీలక నిర్ణయం తీసుకోనున్నారనే టాక్ వినిపిస్తోంది. 2014 ఎన్నికల ముందు జగన్ చేయించుకున్న సర్వేలన్నీ వైసీపీకి అనుకూలంగానే ఉన్నాయని, అయితే చివరి నిమిషంలో పవన్ కల్యాణ్ రాకతో అది తారుమారైందని వైసీపీ నేతలంటున్నారు, అంతేగానీ జగన్ సర్వేల్లో ఎలాంటి తప్పిదం లేదని, ప్రజాభిప్రాయాన్ని కచ్చితంగా అంచనా వేశామని, అయితే టీడీపీతో పవన్ జతకట్టడంతో కొంచెం అటూఇటుగా ఫలితాలు తారుమారు అయ్యాయని అంటున్నారు, అది కూడా రెండు మూడు జిల్లాలోనే అది ఎక్కువగా కనిపించిందని, అయినప్పటికీ అధికారంలోకి వచ్చిన టీడీపీకి, ప్రతిపక్ష వైసీపీకి మధ్య కేవలం 5లక్షల ఓట్లు మాత్రమే తేడా అని గుర్తించాలంటున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది, టీడీపీ ప్రభుత్వ విధానాలపై జనం ఆగ్రహంతో ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు, జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న తాజా సర్వేలోనూ ఇదే తేలిందని, అందుకే రాజీనామా అస్త్రాన్ని మరోసారి బయటికి తీయాలని అనుకుంటున్నాడని చెబుతున్నారు, చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడానికి, ప్రత్యేక హోదా వంకతో ఉపఎన్నికలకు వెళ్లాలని జగన్ ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. 2014 ఎన్నికలకు ముందు వైఎస్ సెంటిమెంట్ తో ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉపఎన్నికల్లో ఘనవిజయం సాధించిన జగన్... మళ్లీ అలాంటి నిర్ణయం తీసుకుని బైపోల్స్ కి వెళ్లారో లేదో చూడాలి.

రాజీనామా చేస్తే... జగన్ వెంట వచ్చేదెంత మంది?

  ప్రత్యేక హోదా కోసం దీక్ష చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి... చంద్రబాబును ఇరుకున పెట్టడానికి చివరిగా రాజీనామా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తారనే టాక్ కొద్దిరోజులుగా మీడియాలో హల్ చల్ చేస్తోంది, ప్రత్యేక హోదా సాధన కోసం తనతోపాటు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయించి జగన్ ఉపఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నాడని అంటున్నారు, అయితే జగన్ రాజీనామా అస్త్రాన్ని ప్రయోగిస్తే అది వైసీపీకి మైలేజ్ అవుతుందా? లేక మైనస్ అవుతుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకవేళ జగన్ రాజీనామా నిర్ణయం తీసుకుంటే ఎంతమంది ఆయన వెంట నడుస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, దాదాపు 20మందికి పైగా ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడానికి రంగంసిద్ధంగా ఉన్నారనే వార్తల నేపథ్యంలో రాజీనామా నిర్ణయం బెడిసికొట్టే అవకాశాలున్నాయని అంటున్నారు, పోనీ ఓ 20మంది మంది ఎమ్మెల్యేలు పోయినా, మిగిలే 47మంది అయినా రాజీనామాలు చేయడానికి ముందుకొస్తారో లేదోననే డౌట్ జగన్ ను వెంటాడుతోందంటున్నారు, ఒకవేళ 47మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎంపీలు రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్తే ఎంతమంది గెలుస్తారనేది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. పైగా డబ్బు తీయడనే పేరున్న జగన్ ను వైసీపీ ఎమ్మెల్యేలు నమ్మే పరిస్థితుల్లో లేరంటున్నారు. అయితే మనీ, మీడియా మేనేజ్ మెంట్ బాగా తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం పది ఎమ్మెల్యేల సీట్లనైనా కచ్చితంగా ఎగరేసుకునిపోతారని, పైగా అధికార పార్టీ ఎత్తుల ముందు ప్రతిపక్షం ఆటలు సాగవని అంటున్నారు, అంతేకాదు అధికారంలో ఉన్న టీడీపీ...అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని వైసీపీని కోలుకోలేని దెబ్బతీసే అవకాశముందంటున్నారు. అదే కనుక జరిగితే వైసీపీ 67 నుంచి 30 సీట్లకు పడిపోయే ఛాన్సుందంటున్నారు. ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంటే మాత్రం... జగన్ పాచిక పారే అవకాశముందని, ఉపఎన్నికల్లో బంపర్ మెజార్టీలు సాధిస్తే టీడీపీ ప్రభుత్వం ఇరకాటంలో పడొచ్చని విశ్లేషకులు అంటున్నారు.

వ్యాపారానుకూల దేశాలలో మెరుగుపడిన భారత్ ర్యాంకింగ్

  భారతదేశంలో వ్యాపారానికి అత్యంత అనుకూలంగా ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుజరాత్ తరువాత రెండవ స్థానంలో ఉందని కొన్ని రోజుల క్రితం ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. ఈసారి ప్రపంచ దేశాలలో వ్యాపారానుకూల వాతావరణం (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) ఉన్న189 దేశాల జాబితాను ప్రపంచ బ్యాంక్ నిన్న ప్రకటించింది. ఆ జాబితాలో భారత్ కి 130వ స్థానం దక్కింది. గత ఏడాది ఇదే సమయానికి భారత్ 142వ స్థానంలో ఉండగా, ఏడాది సమయంలోనే 12 స్థానాలు మెరుగుపడి 130వ స్థానానికి భారత్ చేరుకోవడం విశేషం.   ఈ క్రెడిట్ ప్రధాని నరేంద్ర మోడి, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీధే నని ప్రత్యకంగా చెప్పనవసరం లేదు. మోడీ ప్రధానిగా భాద్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వ వ్యవస్థలలో అనేక సంస్కరణలు చెప్పట్టారు. అభివృద్ధి నిరోధకాలుగా ఉన్న అనేక అవరోధాలను గుర్తించి తొలగిస్తున్నారు. అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్నారు. తత్ఫలితంగా పాలనలో పారదర్శకత, వేగం పెరిగాయి. గత ఏడాదిన్నర కాలంలో మోడీ చేసిన విదేశీ పర్యటనలలో భారత్ పట్ల ప్రపంచ దేశాలకున్న నిశ్చిత దురాభిప్రాయలను పటాపంచలు చేసి, భారత్ ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ అని అక్కడ వ్యాపారావకాశాలు చాలా విస్తృతంగా ఉన్నాయనే విషయం ప్రపంచాదేశాలకి చాటి చెప్పారు. తత్ఫలితంగా భారత్ పట్ల ప్రపంచ దేశాల అభిప్రాయాలు కూడా మారడం మొదలయ్యాయి.   భారత్‌ లో ప్రస్తుతం సంస్కరణలు చాలా వేగంగా జరుగుతున్నాయని, ఒకవేళ ఇదే ఊపు కొనసాగిస్తే వచ్చే ఏడాదినాటికి భారత్ ర్యాంక్ ఇంకా మెరుగుపడే అవకాశం ఉందని గ్లోబల్‌ ఇండికేటర్స్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ లోపెజ్‌ క్లారోస్‌ అన్నారు. భారత్ లేకుండా ఇంటర్నెట్ తో ప్రపంచ దేశాలను అనుసంధానం చేయడం సాధ్యం కాదని, భారత్ లో విస్తృతంగా వ్యాపారావకాశాలు ఉన్నాయని ఫేస్ బుక్ సి.ఈ.ఓ. మార్క్ జూకర్ బెర్గ్ చెప్పడమే అందుకు చక్కటి ఉదాహరణ.   గమ్మతయిన విషయం ఏమిటంటే ఒక ప్రపంచ ప్రసిద్ధి పొందిన గొప్ప ఆర్ధికవేత్త డా.మన్మోహన్ సింగ్ దేశానికి ప్రధానిగా ఉన్నప్పుడు భారత్ 142స్థానంలో ఉంటే, బస్టాండులో టీ అమ్ముకొనే వ్యక్తి నరేంద్ర మోడీ అధికారంలోకి రాగానే ఏడాది కాలంలోనే ఒకేసారి 12స్థానాలు ఎగ్రబ్రాకి 130కి చేరుకొంది.   ప్రపంచ బ్యాంక్ ‘డూయింగ్‌ బిజినెస్‌ 2016’ పేరిట నిన్న విడుదల చేసిన జాబితాలో సింగపూర్‌ నెంబర్:1 స్థానంలో నిలవగా ఆ తరువాత స్థానాల్లో వరుసగా న్యూజిలాండ్‌, డెన్మార్క్‌, దక్షిణ కొరియా, హాంకాంగ్‌, బ్రిటన్‌, అమెరికా దేశాలు నిలిచాయి. ఈ జాబితాలో చైనాకు 84వ స్థానం, పాకిస్థాన్‌కు 138వ స్థానం దక్కింది. గతేడాదితో పోలిస్తే పాకిస్థాన్‌ ర్యాంకు 10 స్థానాలు దిగజారగా భారత్ 12 స్థానాలు ఎగ్రబ్రాకి 130కి చేరుకొంది.   ప్రధాని నరేంద్ర మోడి ప్రభుత్వంపై పట్టు కోల్పోయారని, డా.మన్మోహన్ సింగ్ వద్ద ఆర్ధిక పాఠాలు నేర్చుకొన్నారని ఎగతాళి చేసేవారికి చెంపదెబ్బ వంటిదని చెప్పవచ్చును.

కేసీఆర్ పై అమరావతి ఎఫెక్ట్?

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నభూతో నభవిష్యత్ అన్నట్లుగా అత్యంత వైభవంగా నిర్వహించిన అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి హాజరయిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఆ ప్రభావం బాగా పడినట్లుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడిని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూసి చాలా భయపడుతున్నట్లున్నారని, అందుకే డిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసినా పోలవరం ప్రసక్తి తేలేదని అన్నారు.   పొంగులేటి వాదన ఎలా ఉన్నప్పటికీ, అమరావతి శంఖుస్థాపనకి తెదేపా ప్రభుత్వం చేసిన ఆర్భాటం కేసీఆర్ పై ప్రభావం చూపించిందని చెప్పవచ్చును. ఆయన డిసెంబర్ 23 నుంచి 27 వరకు ఆయుత మహా చండీయాగం చేయబోతున్నారు. ఇంతకు ముందు కూడా కేసీఆర్ చండీయాగం చేసినప్పటికీ ఈసారి మాత్రం నభూతో నభవిష్యత్ అన్నట్లుగా చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. మెదక్ జిల్లాలో ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ సమీపంలో గల 22 ఎకరాలలో స్థలంలో త్రిదిండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఈ యాగం చేయబోతున్నారు. దేశం నలుమూలల నుండి వేద పండితులను, పీఠాధిపతులను, అన్ని రాష్ట్రాల గవర్నర్లను, ముఖ్యమంత్రులను ఈ యాగానికి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. ఈ యాగానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, ప్రధాని నరేంద్ర మోడిని, కేంద్ర మంత్రులను కూడా కేసీఆర్ ఆహ్వానిస్తున్నారు. ఐదు రోజులపాటు సాగే ఈ యాగం కోసం తెలంగాణా ప్రభుత్వం చాలా భారీ ఏర్పాట్లు చేస్తోంది.   తెలంగాణా రాష్ట్రం సుఖశాంతులతో వర్ధిల్లాలని కేసీఆర్ ఈ యాగం చేస్తున్నట్లు తెరాస నేతలు చెపుతున్నారు. ప్రభుత్వాధినేతలు ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. కానీ అందుకోసం ప్రజాధనం ఖర్చు చేసి ఆర్భాటంగా యజ్ఞాలు, యాగాలు చేయాలనుకొంటే ఎవరో ఒకరు ప్రశ్నించక తప్పదు..విమర్శించక మానరు. ఇంతకు ముందు ఇరువురు ముఖ్యమంత్రులు పోటాపోటీగా గోదావరి పుష్కరాలకు అనవసరమయిన ప్రచారం చేసి, వాటి నిర్వహణ కోసం వందల కోట్ల ప్రజాధనం మంచి నీళ్ళలా ఖర్చు చేసినప్పుడు ప్రజల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. బహుశః కేసీఆర్ మళ్ళీ విమర్శలు ఎదుర్కోక తప్పదేమో?

జనసేన పార్టీని రాజకీయ పార్టీగా గుర్తించిన ఎన్నికల సంఘం

  ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ 2014, మార్చి 14న స్థాపించిన జనసేన పార్టీని తెలంగాణా ఎన్నికల సంఘం రాజకీయపార్టీగా రిజిస్టర్ చేసినట్లు బుదవారం ప్రకటించింది. కనుక ఇకపై తెలంగాణాలో జరిగే ఏ ఎన్నికలలోనయినా జనసేన పార్టీ తన అభ్యర్ధులను నిలబెట్టవచ్చును. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత పవన్ కళ్యాణ్ మళ్ళీ తన సినిమాలతో బిజీ అయిపోయారు. వీలయితే జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో తన పార్టీ తరపున అభ్యర్ధులను నిలబెడతానని అప్పుడే ప్రజలకు మాట ఇచ్చేరు. ఇప్పుడు జనసేనకు తెలంగాణా ఎన్నికల సంఘం గుర్తింపు కూడా వచ్చింది కనుక జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో పవన్ కళ్యాణ్ తన పార్టీ తరపున అభ్యర్ధులను నిలబెడతారా లేకపోతే మళ్ళీ ఎన్డీయే అభ్యర్ధులకే మద్దతు ప్రకటిస్తారా అనేది తెలుసుకోవాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే. ఒకవేళ పవన్ కళ్యాణ్ కి వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యక్ష రాజకీయాలలో వచ్చే ఉద్దేశ్యం ఉన్నట్లయితే, ఇప్పటి నుండే జనసేన పార్టీని గ్రామస్థాయి నుండి నిర్మించుకోవడం మంచిదని అభిమానులు భావిస్తున్నారు.

వరంగల్ లో ఫలిస్తున్న గులాబీ వ్యూహం

  వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో టీడీపీ-బీజేపీ కూటమిని దెబ్బతీయాలని టీఆర్‌ఎస్ పన్నిన వ్యూహం ఫలించినట్లే కనిపిస్తోంది. గులాబీ పార్టీ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర లేపడంతో ఆయా పార్టీల్లోని పలువురు ముఖ్యనేతలు, చోటామోటా లీడర్స్ అంతా కారెక్కనున్నారనే టాక్ వినిపిస్తోంది, దీన్లో భాగంగా వరంగల్ జిల్లాకి చెందిన టీడీపీ రాజ్యసభ ఎంపీ గుండు సుధారాణి రేపోమాపో టీఆర్ఎస్ లో చేరడం ఖాయమని చెబుతుండగా, మరికొందరు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి టీఆర్ఎస్ పాలనపైనా, పథకాలపైనా ప్రశంసల వర్షం కురిపించిన గుండు సుధారాణి... తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పే దిశగా అడుగులు వేయగా, ఇదే కోవలో మరికొందరికి గాలమేయాలని గులాబీ నేతలు పావులు కదుపుతున్నారు. అందుకే కాస్త పేరున్న నాయకులకే కాకుండా ద్వితీయ శ్రేణి నేతలకు కూడా టీఆర్‌ఎస్ గాలం వేస్తోంది. పైగా మొన్నటివరకూ ఆపరేషన్ ఆకర్ష్ బాధ్యతలను ఒక్క హరీష్ రావు మాత్రమే చూడగా, వరంగల్ బైపోల్ నేపథ్యంలో మంత్రులంతా అదే పనిలో నిమగ్నమయ్యారని అంటున్నారు, ప్రధాన పార్టీల్లోని పేరున్న నాయకులను చేర్చుకోవడం ద్వారా ప్రతిపక్షాల మనోధైర్యాన్ని దెబ్బతీయాలని భావిస్తున్నారు. అలాగే త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ లీడర్ దానం నాగేందర్ కోసం కొంతకాలంగా ప్రయత్నిస్తున్న గులాబీ పార్టీ... మరోసారి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ముఖ్యనేతలు ఇప్పటికే ఎన్నోసార్లు చర్చలు జరిపినా, డీల్ ముందుకు కదలకపోవడంతో ఈసారి ఎలాగైనా టాస్క్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారట.

విజయసాయిరెడ్డి vs బొత్స సత్యనారాయణ

  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణకి మధ్య కోల్డ్ వార్ జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది, ఈ ఇద్దరూ పార్టీలో నెంబర్ టు పోజీషన్ కోసం తీవ్రంగా పోటీపడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి, అదినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర తన మాటే నెగ్గాలంటే తన మాటే నెగ్గాలంటూ పంతాలకు సైతం పోతున్నారని చెప్పుకుంటున్నారు. అయితే వీళ్లిద్దరిలో ఎవరినీ నొప్పించకుండా జగన్ వ్యవహరిస్తున్నారని, కానీ నెంబర్ 2 ఎవరనేది మాత్రం చెప్పలేని పరిస్థితి నెలకొందంటున్నారు. వైఎస్ కుటుంబానికి, ముఖ్యంగా జగన్ కు సన్నిహితుడైన విజయసాయిరెడ్డి ప్రస్తుతం వైసీపీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, వైఎస్ ఫ్యామిలీతో విడదీయలేని అనుబంధమున్న విజయసాయి... జగన్ జైల్లో ఉన్నప్పుడు అన్నీతానై వ్యవహరించారు. పైగా జగన్ కు అత్యంత నమ్మకస్తుడైన సాయిరెడ్డికి తెలియకుండా పార్టీలో ఏ నిర్ణయమూ జరగదనే టాక్ ఉంది. అంతేకాదు జగన్ ఆర్ధిక సామ్రాజ్యాన్ని నిర్మించడంలోనూ కీలక పాత్రధారి, అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయికే అధినేత ప్రాధాన్యత ఇస్తారని, అత్యంత నమ్మకస్తుడైన ఆయనను రాజ్యసభకు కూడా పంపే ఆలోచనలో ఉన్నారని పార్టీ నేతలు అంటుంటారు. పైగా విజయసాయికి తెలిసినంతగా జగన్ మనసు మరెవరికీ తెలియదంటారు వైసీపీ వర్గాలు. అయితే ఇటీవల పార్టీలో చేరిన బొత్స సత్యనారాయణ కూడా జగన్ కు తల్లో నాలుకలా మారారని, పార్టీ నిర్ణయాల్లో బొత్సకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు. పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న బొత్స... మరో పవర్ ఫ్యాక్టర్ గా మారేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని, పైగా పార్టీలో జగన్ తర్వాత తానే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారనే టాక్ ఉంది. వైఎస్ కి అత్యంత నమ్మకస్తుడిగా ఉండటమే కాకుండా పదేళ్లు మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన తనను జగన్... నెంబర్ 2గా గుర్తిస్తారనే ఆశతో బొత్స ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలాగుంటే పార్టీలో నెంబర్ టు పోజీషన్ ఆశిస్తున్న విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణలు అంతర్గతంగా మాటల తూటాలు కూడా పేల్చుకుంటున్నట్లు తెలిసింది, నిన్నగాక మొన్నొచ్చిన నువ్వు నెంబర్ టు ఏంటని ఒకరు అంటుంటే, ఎప్పుడొచ్చామన్నది కాదు ఎవరికీ ఇంపార్టెన్స్ ఇస్తున్నారన్నే ముఖ్యమని మరొకరు కౌంటర్ ఇస్తున్నారట. అయితే ఎవరి మాటా వినని సీతయ్య లాంటి జగన్... అసలు వీళ్లిద్దరి మాటకు విలువ ఇవ్వడం కూడా డౌటేనంటున్నారు జగన్ గురించి తెలిసిన లీడర్లు.

అమరావతిలో పర్యావరణ విధ్వంసం?

  నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో కోటి చెట్లను నరికేయనున్నారనే సమాచారం ఇప్పుడు సంచలనం రేపుతోంది, ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి లేకుండా ముందుకెళ్తున్న ఏపీ ప్రభుత్వం... పర్యావరణ విధ్వంసానికి దిగుతోందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు, రాజధాని కోసం ఇప్పటికే రైతుల నుంచి 33వేల ఎకరాలు సమీకరించిన ఆంధ్రప్రదేశ్... మరో 50వేల ఎకరాల అటవీ భూమిని డీ నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరడంపై పర్యావరణవేత్తలు అభ్యంతరం తెలుపుతున్నారు. పర్యావరణాన్ని దెబ్బతీసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తాము ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించామని పర్యావరణవేత్తలు అంటున్నారు, అందుకే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి గ్రీన్ ట్రిబ్యునల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని గుర్తుచేస్తున్నారు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూముల్లోనే పర్యావరణ విధ్వంసం జరుగుతుంటే, ఇప్పుడు అటవీ భూములను కూడా తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే అటవీ భూములను తీసుకోవాలంటే నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయని, కానీ వాటిని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు, తీసుకున్న అటవీ భూమికి రెండింతలు మరో చోట భూములు ఇవ్వడమే కాకుండా, ప్రతి చెట్టుకు బదులు మూడేసి మొక్కలు నాటి పెంచాల్సి ఉంటుందని, కానీ ఇవేమీ అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదని, ఈ లెక్కన అమరావతిలో ప్రకృతి విపత్తు తప్పదంటున్నారు పర్యావరణవేత్తలు.

కేసీఆర్ మెడకు చుట్టుకుంటున్న కాంట్రాక్ట్ కేసు?

  2006లో కేసీఆర్ కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈఎస్ఐ ఆస్పత్రుల భవన నిర్మాణ కాంట్రాక్టును... నేషనల్ బిల్డింగ్ నిర్మాణ సంస్థకు కాకుండా ఏపీ ఫిషరీష్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు ఇచ్చిన కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించిన సీబీఐ... మరికొందరు ముఖ్యనేతలను, అధికారులను ప్రశ్నించేందుకు రెడీ అవుతోంది. సీఎం క్యాంప్ ఆఫీస్ కి వెళ్లి కేసీఆర్ ను ప్రశ్నించిన సీబీఐ... అప్పటి పీఎస్, ప్రస్తుతం బీజేపీ లీడరైన దిలీప్ కుమార్ ను కూడా ప్రశ్నించింది. అలాగే ఢిల్లీ తెలంగాణ భవన్ లో అధికార ప్రతినిధిగా ఉన్న సాహ్నిని కూడా సీబీఐ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది, ఎన్బీసీసీకి ఇవ్వాల్సిన కాంట్రాక్టును ఏపీ ఫిషరీష్ కి ఇవ్వడంలో అప్పుడు కేంద్ర కార్యదర్శిగా సాహ్ని కీలక పాత్ర పోషించారని అంటున్నారు. నేషనల్ బిల్డింగ్ నిర్మాణ సంస్థకు ఇచ్చిన ఈఎస్ఐ ఆస్పత్రుల భవన నిర్మాణ కాంట్రాక్టును ఏపీ మత్స్యశాఖకు ఇవ్వాలని కేసీఆర్‌ కోరుకుంటున్నారని, ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలంటూ ఆయన ప్రైవేట్ కార్యదర్శి దిలీప్‌కుమార్‌... ఆనాడు ఈఎస్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌ రావు ఇంద్రసింగ్‌కు లేఖ రాయగా, అందుకు ఇంద్రసింగ్‌ పలు అభ్యంతరాలు తెలుపుతూ కేఎం సాహ్నికి నివేదించారు. అయితే రావు ఇంద్రసింగ్‌ అభ్యంతరాలను తోసిపుచ్చి మరీ కేఎం సాహ్ని ప్రత్యేక ఫైల్‌ను తయారు చేశారని, దానిని కేసీఆర్‌ అనుమతి కోసం పంపగా ఆయన సంతకం చేశారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అయితే కేసీఆర్ ఆదేశాల మేరకే ఎన్‌బీసీసీ తప్పించి ఏపీ మత్స్య శాఖకు కాంట్రాక్టు అప్పగించాలంటూ సాహ్ని ఫైల్‌ను తయారు చేశారని అంటున్నారు. ఈ కేసు విషయంలో దిలీప్‌కుమార్‌ను సీబీఐ ప్రశ్నించగా...కాంట్రాక్ట్‌ను ఎందుకు బదిలీ చేయాలనుకున్నారో కేసీఆర్‌నే అడిగి తెలుసుకోవాలని చెప్పారట, ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ను సీబీఐ కలవగా.... సాహ్ని ఫైల్‌ పంపితేనే సంతకం చేశానని, అంతేతప్ప కాంట్రాక్ట్‌ బదిలీతో తనకేమీ సంబంధం లేదని చెప్పారట, దాంతో ప్రస్తుతం ఢిల్లీ తెలంగాణ భవన్ లో అధికార ప్రతినిధిగా ఉన్న సాహ్నిని త్వరలో సీబీఐ ప్రశ్నించనుంది, అయితే 2006లో కేంద్ర కార్యదర్శిగా సాహ్నికి ఇప్పుడు ఢిల్లీ తెలంగాణలో కేసీఆర్ పదవి ఇవ్వడం చూస్తుంటే పలు సందేహాలు కలుగకమానదు.

చంద్రబాబుపై బీబీసీ సంచలన కథనం

  ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై జాతీయ అంతర్జాతీయ మీడియా సంచలన కథనాలు ప్రచురిస్తున్నాయి, అమరావతి భూకంప జోన్లో ఉందంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా కీలక కథనాన్ని ఇవ్వగా ఇప్పుడు ఇంటర్నేషనల్ వెబ్ సైట్ బీబీసీ... ఆందోళన కలిగించే స్టోరీ ఇచ్చింది, అమరావతి పేరుతో చంద్రబాబు... పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నారని, ఇది ప్రకృతి విపత్తు లాంటిదేనని అభిప్రాయపడింది. రాజధాని కోసం ఇప్పటికే రైతుల నుంచి 33వేల ఎకరాలు సమీకరించిన ప్రభుత్వం... మరో 50వేల ఎకరాల అటవీ భూమిని డీ నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరడంపై బీబీసీ పలు అనుమానాలు వ్యక్తంచేసింది. చంద్రబాబు చర్యలు పర్యావరణాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, రాజధాని ప్రాంతంలో దాదాపు కోటి చెట్లను నరికివేయనున్నారని బీబీసీ తెలిపింది. అంతేకాదు ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండానే రాజధాని నిర్మాణంపై ముందుకెళ్లడాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా తప్పుబట్టిందన్న విషయాన్ని గుర్తుచేసింది. సింగపూర్ కంటే పది రెట్లు పెద్దదైన నగరాన్ని నిర్మిస్తామని చంద్రబాబు చెప్పడాన్ని మరీ అత్యాశగా అభిప్రాయపడ్డ బీబీసీ... పోలీసులను ప్రయోగించి రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడాన్ని తప్పుబట్టింది, అంతేకాదు రాజధాని గ్రామాల్లో రైతులు ఎవరూ గుమిగూడకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించిందని రాసుకొచ్చింది. రాజధాని నిర్మాణానికి ఎవరూ వ్యతిరేకం కాకపోయినా... చంద్రబాబు అనుసరిస్తున్న పద్ధతులపై మాత్రం వ్యతిరేకత వస్తోందని బీబీసీ తెలిపింది.

పాట్నా ఎక్స్ ప్రెస్ లో రఘువీరా రెడ్డి హడావుడి

  “ఆర్నెల్లు గరిడిసాము నేర్చుకొని ఏమి సాధించేవురా కొడుకా? అంటే మూలనున్న ముసలమ్మను ఒక దెబ్బతో కైలాసానికి పంపించానమ్మా” అన్నాడుట వెనుకటికెవడో. అలాగే ఉంది ఈ ఫోటో చూస్తుంటే. ఇంతకీ ఏమిటా ఆ ఫోటో ఏమిటా కధా కమామిషు అంటే... ఈ కధకి బీహార్ ఫ్లాష్ బ్యాక్ ఉంది అలాగని పూర్తిగా బీహార్ లో సాగదు. దానికి ఆంధ్రా బ్యాక్ డ్రాప్ కూడా ఉంది కానీ బీహార్ లో ఈ కధకి క్లైమక్స్ ఉంటుంది.   అదెలాగంటే బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్ర మోడీ ఆ రాష్ట్రానికి 1.65 లక్షల కోట్లు నిధులు మంజూరు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. బీహార్ ప్రజలు అడక్కుండానే అంత డబ్బు ముట్టజెప్పడానికి ఆయన సిద్దపడుతున్నారు. కానీ గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో సహా ఇచ్చిన అనేక హామీలను వగైరాలు ఇవ్వడం లేదు. మొన్న అమరావతి వచ్చినప్పుడు ప్రత్యేక హోదా, ప్యాకేజీల ఊసు ఎత్తకుండా వెళ్లి పోయారు.   ఇంతకు ముందు ఆంధ్రాలో ఎన్నికలలో గెలవడానికి హామీలు ఇచ్చినట్లే ఇప్పుడు బీహార్ ప్రజలకు కూడా మోడీ ఒట్టొట్టి హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఎన్నికలలో తన పార్టీని గెలిపించుకోవాలని ప్రయతిస్తున్నారని పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి భావిస్తున్నారు. అందుకే బీహార్ వెళ్లి అక్కడి ప్రజలకు మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఏవిధంగా మోసపుచ్చారో వివరించాలనుకొన్నారు. కానీ మళ్ళీ జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకొని తీరా చేసి అంత దూరంవెళ్ళినా బీహారీ ప్రజలకు అర్ధమయ్యేలాగా ఈ విషయం వివరించగలమా లేదా? వివరించినా వాళ్ళు తమ మాటలను పట్టించుకొంటారా లేదా? అనే అనుమానం వచ్చింది. అందుకే సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా బీహార్ వెళ్ళే పాట్నా ఎక్స్ ప్రెస్ రైలు సికింద్రాబాద్ స్టేషన్ లో ఆగినప్పుడు ఆ రైల్లో ప్రయాణిస్తున్న బీహారీ వాళ్ళను పట్టుకొని ఇదిగో..ఇలాగ...క్లాసు పీకుతున్నారు. పాపం ఆ ముసలమ్మ మొహం చూస్తే వాళ్ళు ఏమిచెపుతున్నారో..తనకే ఎందుకు చెపుతున్నారో..అన్నట్లుంది.