లాలూ తిరకాసులు షురూ...

బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్‌తో ఫ్రెండ్షిప్ చేయడం ద్వారా నితీష్ కుమార్ ఆ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ కొట్టేశారు. మొన్నటి జనరల్ ఎలక్షన్లలో కాంగ్రెస్, జేడీయు, ఆర్జేడీ ఎవరికి వాళ్ళే పోటీ చేసి మోడీ చేతిలో చావుదెబ్బ తిన్నారు. ఈ మూడు పార్టీలు బద్ధ శత్రువులు అయినప్పటికీ శత్రువుకి శత్రువు మిత్రుడన్నట్టుగా వీళ్ళందరికీ మోడీ కామన్ శత్రువు కావడం వల్ల ఈ మూడు శక్తులూ కలసి మొన్నటి బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీని ఓడించి మోడీకి జలక్ ఇచ్చాయి. బీహార్లో ఆటలో అరటిపండు లాంటి కాంగ్రెస్ పార్టీని అలా వుంచితే, నువ్వా నేనా అనుకునేట్టుగా వుండే లాలూ ప్రసాద్ యాదవ్ - నితీష్ కుమార్ ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ కుదరటమే ఒక వింత. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ మా మహాకూటమి గెలిస్తే నితీషే ముఖ్యమంత్రి అని ప్రకటించడం మరోవింత. ఎన్నికల ఫలితాలు వెలువడి ఈ కూటమి విజయం సాధించాక కూడా నితీషే ముఖ్యమంత్రి అని లాలూ ఫ్యామిలీ మొత్తం ఎలుగెత్తి చాడటం మరో వింత. అసలు లాలూ ఇంత మంచి వాడు ఎందుకు అయిపోయాడబ్బా  అని సందేహాలు చాలామందికి కలుగుతున్నాయి. ఏదయితేనేం నితీష్‌కి లాలూ లాంటి మంచి ఫ్రెండ్ దొరికాడు అని చాలామంది అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు లాలూ బీహార్లో తన మార్కు రాజకీయాలు, తిరకాసులు పెట్టడం ప్రారంభించేశాడు. ఈనెల 20వ తేదీన బీహార్లో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతోంది. ఆ ప్రభుత్వంతో తన కుమార్తె మీసా భారతికి ఉప ముఖ్యమంత్రి పదవి, తన ఇద్దరు పుత్ర రత్నాలకు మంత్రి పదవులు ఇవ్వాల్సిందేనని లాలూ పట్టుబట్టినట్టు తెలుస్తోంది. మీసా భారతికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం అంటే తన కొరివితో తాను తల గోక్కోవడమేనని తెలిసిన నితీష్ కుమార్ ఆ విషయంలో నీళ్ళు నములుతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఫ్యామిలీ మొత్తానికీ మంత్రి పదవులు ఇవ్వాలనడం కూడా కొంత ఇబ్బందిని కలిగిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే లాలూ మాత్రం తన డిమాండ్లను నెరవేర్చాల్సిందేనని పట్టుదలతో వున్నాడట. తప్పదు మరి.. లాలూగారి తిరకాసులను నితీష్ భరించాల్సిందే.

బీజేపీలో బీహార్ గడబిడ

విజయానికి బోలెడంతమంది తండ్రులు... అపజయం మాత్రం ఎవరూలేని అనాథ... ఈ జీవిత సత్యం బీహార్ ఎన్నికల తర్వాత బీజేపీలో కూడా మరోసారి రుజువవుతోంది. 2014  సాధారణ ఎన్నికలలో బీజేపీ సాధించిన విజయం మోడీ కారణంగానే లభించిందన్న అభిప్రాయాలు దేశమంతటా వున్నాయి. అయితే బీజేపీలో వున్న కొంతమంది నాయకులకు మాత్రం ఆ విషయాన్ని ఒప్పుకోవడానికి అహం అడ్డువచ్చింది. అందరి కృషి వల్లనే అప్పుడు విజయం సాధించామని గొణుక్కున్నారు. బీజేపీలో మోడీయిజం పెరిగిపోయిన తర్వాత పక్కన కూర్చోవాల్సి వచ్చిన కొంతమంది నాయకులకు బీహార్ ఎన్నికలలో బీజేపీ పరాజయం తర్వాత మంచి అవకాశం లభించింది. ఇప్పుడు వారందరూ తెరమీదకి వచ్చి మోడీని టార్గెట్ చేస్తున్నారు. ప్రస్తుతం పార్టీలో నిరాదరణకు గురయినట్టు భావిస్తున్న కురువృద్ధుడు అద్వానీని అండగా తీసుకుని మోడీ మీద వాగ్బాణాలు విసురుతున్నారు. మోడీ పరిపాలన తీరు కారణంగానే బీహార్ పరాజయం మూటగట్టుకోవాల్సి వచ్చిందని దెప్పిపొడుస్తున్నారు. ఇదిలా వుంటే, మరో వర్గం మోడీని కాపాడటానికి ప్రయత్నాలు చేస్తోంది. బీహార్ ఎన్నికలలో బీజేపీ ఓడిపోవడానికి మోడీ ఎంతమాత్రం కారణం కాదని నొక్కి వక్కాణిస్తున్నారు. ఈ పరాజయాన్ని ఏ ఒక్కరి అకౌంట్లో వేయడం మంచిది కాదని అంటున్నారు. బీహార్ ఎన్నికల ఫలితాలు మోడీ ప్రభుత్వ తీరుకు రెఫరెండం ఎంతమాత్రం కాదని మొత్తుకుంటున్నారు. ఇలా బీజేపీలోని మోడీ వ్యతిరేక వర్గం, అనుకూల వర్గం మధ్య ముసుగులో గుద్దులాటలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఇది బీజేపీలో గడబిడకు కారణమైంది. బీహార్ ఓటమి అవమానాన్ని దిగమింగుకునే వరకూ బీజేపీలో ఈ గడబిడ తగ్గకపోవచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

కర్నాటకలో నిప్పు పెట్టిన టిప్పు

కర్నాటకలో టిప్పు సుల్తాన్ నిప్పు రగిల్చాడు. ఎప్పుడో మైసూరు సంస్థానాన్ని పరిపాలించిన టిప్పు సుల్తాన్ అప్పట్లో హిందువులను హింసించాడని కొంతమంది అంటారు. కొంతమంది అయితే టిప్పు సుల్తాన్ హిందువుల విషయంలో ఎలాంటి హింసకూ పాల్పడలేదని చెబుతూ వుంటారు. టిప్పు సుల్తాన్ హిందువు కాకపోవడం వల్లే ఆయన్ని విమర్శిస్తూ వుంటారన్న కామెంట్లూ వున్నాయి. ఏది ఏమైనప్పటికీ టిప్పు సుల్తాన్ హిస్టరీ ఒక మిస్టరీ. ఆ మిస్టరీ తేనె తుట్టెను కదిలించడం కంటే ఊరక వుండటం మేలన్ అభిప్రాయాలు కూడా వున్నాయి. ఈ నేపథ్యంలో టిప్పు కారణంగా కర్నాటకలో నిప్పు రగిలింది. అది కూడా మామూలు నిప్పు కాదు రాజకీయ నాయకులు రగిల్చిన నిప్పు. కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అర్జెంటుగా టిప్పు సుల్తాన్ మీద ప్రేమ పుట్టుకొచ్చింది. వెంటనే టిప్పు సుల్తాన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించాలని సంకల్పించాడు. టిప్పు సుల్తాన్‌ను కీర్తించడం ద్వారా ముస్లింలకు దగ్గర కావాలనేది ఆయన ఆంతర్యమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. సరే, సిద్ధరామయ్య రాజకీయం కోసం ఏదో ఒక కార్యక్రమాన్ని చేపట్టాడు. మన బీజేపీ నాయకులు పోనీలే అని ఊరుకోవచ్చు కదా... టిప్పు సుల్తాన్ పుట్టిన  రోజు వేడుకలు జరపరాదంటూ వ్యతిరేకించడం ప్రారంభించారు. పుట్టినరోజైన మంగళవారం నాడు కర్నాటకలో నానా హడావిడి చేశారు.. ఫలితంగా జరిగిన గొడవల్లో ఇద్దరు మరణించారు. వారిలో ఒకరు బీజేపీ నాయకుడు మరొకరు సాధారణ పౌరుడు. ఇప్పుడు ఈ గొడవతో కర్నాటక అట్టుడుకుతోంది. చివరికి టిప్పు సుల్తాన్ గారు కర్నాటక రాష్ట్రాన్ని ఏం చేస్తారో చూడాలి.

ఓట్లు పోయెనండీ నారాయణా!

  గ్రేటర్ హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఓట్లను తొలగించారని, తద్వారా రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలలో విజయం సాధించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ఈ విషయంలో ప్రతిపక్షాలన్నీ ఒక్కటై అధికార పార్టీ మీద పోరాటం చేస్తున్నాయి. వారి పోరాటం ఫలించి కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించి ఈ అంశం మీద కూలంకషంగా విచారణ చేస్తోంది. ప్రతిపక్షాల ఆరోపణలకు తోడు ఓటర్లకు ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా ఓట్లు తొలగించారని, ఓట్లు తొలగించాల్సిన అవసరం లేనివారి ఓట్లు కూడా తొలగించారనేదానికి కొన్ని ఆధారాలు లభిస్తున్న నేపథ్యంలో ఈ అంశం తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఈ తలనొప్పి చాలదన్నట్టు ప్రభుత్వానికి మరో సమస్య కూడా వచ్చిపడింది. సీపీఐ నాయకుడు నారాయణ, ఆయన భార్య ఓట్లను తొలగించారు. ఈ ఒక్క అంశం చాలు వామపక్షాలు మరింత చెలరేగిపోవడానికి. హైదరాబాద్‌లోని హైదర్‌గూడా ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో  సీపీఐ నాయకుడు డాక్టర్ నారాయణ, ఆయన భార్య వసుమతిదేవి ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తున్నారు. ఈమధ్యే ఓ ఫైన్ మార్నింగ్ వాళ్ళిద్దరి ఓట్లను తొలగించినట్టు వారికి సమాచారం అందింది. దాంతో నారాయణ అగ్గిమీద గుగ్గిలం అయిపోయారు. ప్రభుత్వం సీమాంధ్రుల ఓట్లను ఉద్దేశపూర్వకంగానే తొలగిస్తోందని అనడానికి ఇంతకంటే బలమైన నిదర్శనం ఇంకేమి కావాలని ఆయన ప్రశ్నించారు. అయితే ప్రభుత్వం నుంచి ఆయనకు ఎలాంటి ప్రతిస్పందన లభించలేదు. కానీ, ఈ విషయాన్ని నారాయణ అంత ఈజీగా వదిలిపెడతారని రాజకీయ పరిశీలకులు భావించడం లేదు. వామపక్ష పార్టీలన్నిటి సహకారంతో ఈ అంశాన్ని మరింత రచ్చచేసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం వుందని అంటున్నారు.

మీ సర్వేలు సల్లంగుండ!

బీహార్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సర్వేలు చేసే సంస్థలు, సర్వేలు జరిపించే మీడియా సంస్థలు బోర్లా పడ్డాయి. ఆ సంస్థ ఈ సంస్థ అనే తేడా లేకుండా అన్ని సర్వేలూ దిక్కుమాలిన సర్వేలని తేలిపోయాయి. పకడ్బందీగా, శాస్త్రీయంగా సర్వేలు చేస్తామని బోలెడంత బిల్డప్పులు ఇచ్చి సర్వే ఫలితాలను వెల్లడించిన సంస్థలన్నీ ఎన్నికల ఫలితాలు వెల్లడి అయిన తర్వాత నోళ్ళు తెరిచాయి. ఇప్పుడు ప్రతి సంస్థా తమ సర్వే విఫలం కావడానికి ఫలానా కారణం ఫలానా కారణం అంటూ వివరణలు ఇచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. బీహార్లో తుది విడత పోలింగ్ పూర్తి కాగానే దాదాపు ఓ పది సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంటూ ఎన్నికల సర్వేలను వెల్లడించాయి. ఈ సంస్థల్లో ఎక్కువ సంస్థలు మహా కూటమికి బొటాబొటి మెజారిటీ వచ్చే అవకాశం వుందని చెప్పాయి. మరికొన్ని సంస్థలు హంగ్ తప్పదన్నట్టుగా చెప్పాయి. ఈ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో బీజేపీకి వంద సీట్లకు పైగా వచ్చే అవకాశం వుందని చెప్పుకొచ్చాయి. ఆ మర్నాడు ఎన్డీటీవీ సంస్థ బీజేపీ ఈ ఎన్నికలలో ఇరగదీసేస్తుందని ఓ సర్వే విడుదల చేసింది. చివరికి ఏమైంది... ఏ సర్వే కూడా నిజం కాలేదు. బీజేపీ కుప్పకూలింది. మహా కూటమి ఊహించని మెజారిటీ సాధించింది. భారత ఎన్నికల చరిత్రలో మొట్టమొదటిసారి సర్వేలు ఘోరంగా విఫలమైన సందర్భం ఆవిష్కృతమైంది. ఎందుకూ పనికిరాని సర్వేలు చేసిన సంస్థలు ఇప్పుడు లెంపలు వేసుకోవడం మొదలుపెట్టాయి. మేం ఇలాంటి దిక్కుమాలిన సర్వే ఎందుకు వెల్లడించామంటే అంటూ ఏవేవో కుంటి సాకులు చెప్పడం ప్రారంభించాయి. ఇప్పుడు సర్వేల సంస్థల పాట్లను చూసి రాజకీయ నాయకులు నవ్వుకుంటున్నారు.  

పాపం... టీఆర్ఎస్ నాయకులు!

ప్రస్తుతం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలు టీఆర్ఎస్ నాయకులతో ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా’ అంటున్నారు. వరంగల్ పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక త్వరలో జరగనుంది. అధికార టీఆర్ఎస్ ఈ స్థానాన్ని మళ్ళీ గెలుచుకోవాలని కృషిచేస్తూ వుండగా, ఈ స్థానంలో గెలవటం ద్వారా టీఆర్ఎస్‌కి చెక్ పెట్టాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఈ లక్షంతో అధికార ప్రతిపక్షాలు ఎన్నికల బరిలో దిగి హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి.  ప్రతిపక్ష పార్టీల నాయకులు మాత్రం నియోజకవర్గంలో స్వేచ్ఛగా తిరుగుతూ ప్రశాంతంగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ అధికార పార్టీ నాయకులు మాత్రం ప్రచారం కోసం నియోజకవర్గంలో భయపడుతూనే తిరుగుతున్నారు. ప్రజల నుంచి టీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులకు ఎదురవుతున్న వ్యతిరేకతే దీనికి కారణం. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మొన్నామధ్య వరంగల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ఒక రైతు ఆయన మీదకి చెప్పు విసిరి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. టీఆర్‌ఎస్ నాయకుల మీద ప్రజలు తిరగబడటం అంతకుముందు అనేక సందర్భాలలో జరిగింది. కడియం శ్రీహరి మీద చెప్పు విసరడం మాత్రం పరాకాష్ట. ఆ తర్వాత నియోజకవర్గంలో పలు సందర్భాలలో టీఆర్ఎస్ నాయకులను ప్రజలు నిలదీస్తున్నారు. పదిహేడు నెలల పదవీ కాలంలో ఏం చేశారని ఆవేశపూరిగా ప్రజలు ప్రశ్నిస్తూ వుండటంతో టీఆర్ఎస్ నాయకులు నోట మాట లేకుండా వుండిపోతున్నారు. నాయకులను ఇలా నిలదీసే సంప్రదాయాన్ని టీఆర్ఎస్ నాయకులే పెంచి పోషించారని, ఇప్పుడు వారే ఈ సంప్రదాయం బారిన పడ్డారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

ఫ్లై ఓవర్లు ఎలుక తోకలా? టూమచ్!

కొంతకాలం తన ఫామ్ హౌస్‌లో విశ్రాంతి తీసుకుని మళ్ళీ హైదరాబాద్‌కి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో వివాదాస్పద వ్యాఖ్యతో రాజకీయ వర్గాలను కదిలించారు. ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సమైక్య పాలనలో హైదరాబాద్ నాశనం అయిపోయిందన్నట్టుగా మాట్లాడారు. హైదరాబాద్‌ని బాగు చేసుకోవాల్సిన అవసరం వుందన్నట్టుగా చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో వున్న ఫ్లై ఓవర్లను ఎలుక తోకలుగా అభివర్ణించారు. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలను తెలంగాణలోని రాజకీయ వర్గాలు తప్పు పడుతున్నాయి. కేసీఆర్ ఈ తరహా మాటలను మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఫ్లై ఓవర్లు ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా వున్నాయనే అభిప్రాయాలున్నాయి. ఫ్లై ఓవర్లు కొన్ని తెలుగుదేశం హయాంలో, మరికొన్ని కాంగ్రెస్ పార్టీ హయాంలో రూపొందాయి. ఇప్పుడు కేసీఆర్ ఫ్లై ఓవర్లను ఎలుక తోకలతో పోల్చడం పట్ల ఈ రెండు పార్టీల నాయకులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సమావేశంలో వున్న జనం చప్పట్లు కొట్టాలన్నట్టుగా, నవ్వుకోవాలన్నట్టుగా  ముఖ్యమంత్రి హోదాలో వున్న వ్యక్తం మాట్లాడ్డం భావ్యంగా లేదని అంటున్నారు. కేసీఆర్ హైదరాబాద్‌లో ఇప్పటి వరకూ జరిగిన అభివృద్ధిని, ఆ అభివృద్ధిని చేసిన పార్టీలను కించపరిచేలా మాట్లాడ్డం టూమచ్‌గా వుందని అంటున్నారు.

బాబు ఒకందుకు మానుకొంటే...జగన్ మరొకందుకు బయలుదేరుతున్నారు

  చంద్రబాబు నాయుడు ఒక కారణంతో వరంగల్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళకూడదనుకొంటుంటే, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మరో కారణంతో వరంగల్ ప్రచారానికి బయలుదేరుతుండటం విశేషం. రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రస్తుతం సానుకూల వాతావరణం ఏర్పడినందున దానిని చేజేతులా చెడగొట్టుకోకూడదనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు వరంగల్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్ళడం లేదని సమాచారం. కానీ తెలంగాణా తెదేపా నేతలు మాత్రం యధాప్రకారం తమ పార్టీ బలపరుచుతున్న బీజేపీ అభ్యర్ధి విజయానికి కృషి చేస్తారు.   జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోనే ఉంటున్నప్పటికీ ఎన్నడూ తెలంగాణా జిల్లాలలో అడుగుపెట్లేదు. కానీ ఇప్పుడు తమ పార్టీ అభ్యర్ధి నల్లా సూర్యప్రకాష్ కి మద్దతుగా నాలుగు రోజుల పాటు వరంగల్ ఉప ఎన్నికలలో ప్రచారం చేయడానికి బయలుదేరుతున్నారు. తమ పార్టీ అభ్యర్ధి ఈ ఎన్నికలలో గెలిచే అవకాశం బొత్తిగా లేదని తెలిసి కూడా వైకాపా ఎందుకు నిలబెడుతోందంటే బహుశః ప్రతిపక్ష ఓట్లను చీల్చి, తెరాసకు లబ్ది చేకూర్చడానికేనని ప్రత్యర్ధ పార్టీలు భావిస్తున్నాయి.   జగన్ కంటే ముందు వైకాపా ఫైర్ బ్రాండ్ లీడర్ రోజ కూడా వరంగల్ ఉప ఎన్నికలలో ప్రచారానికి బయలుదేరుతున్నారు. ప్రస్తుతం జగన్ అమ్ముల పొదిలో రెస్ట్ తీసుకొంటున్న జగనన్న బాణం షర్మిల, వారి తల్లి విజయమ్మ కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే తమ పార్టీకే ఓటేయమని ప్రజలను అడిగేందుకు వైకాపా వద్ద ఒక్క బలమయిన కారణం కూడా లేదు. కనుక చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోక తప్పదు. ప్రజలకు స్వర్గీయ వై.యస్సార్ సెంటిమెంటు గుర్తు చేయాలంటే వారిద్దరికంటే మరెవరూ సరిపోరు. కనుక వారు కూడా ప్రచారంలో పాల్గొనవచ్చును. ఇంతా చేసి అది తెరాస విజయం సాధించేలా చేయడానికే తప్ప వైకాపా విజయం కోసం కాదంటే వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది.

బీహార్ రియాక్షన్ ఏపీ బీజేపీ మీద ఎలా వుంటుందో!

పాపం బీజేపీ... చూస్తూ వుండగానే ఎలా అయిపోయింది. మొన్నటి వరకూ దేశవ్యాప్తంగా రాజాలాగా వెలిగిన మోడీ ప్రభ ఒక్క బీహార్ ఎన్నికలతో ఎంత తగ్గిపోయిందని జనం అనుకుంటున్నారు. ఏ రంగంలో అయినా ఎవరి హవా అయినా ఎల్లకాలం నడవదనేదానికి ‘మోడీ హవా’నే ఒక పెద్ద ఉదాహరణ అంటున్నారు. తాజాగా బీజేపీ రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే బీహార్ ఎన్నికలకు ముందు... బీహార్ ఎన్నికలకు తర్వాత అనే రెండు విభాగాలు చేయవచ్చని రాజకీయ  పరిశీలకులు అంటున్నారు. బీహార్ ఎన్నికల ముందు కాలర్ ఎగరేసుకుని తిరిగిన బీజేపీ నాయకులకు ఇప్పుడు ఆ అవకాశం లేకపోవచ్చని విశ్లేషిస్తున్నారు. తాము అన్నీ మంచి పనులే చేస్తున్నామని, దేశంలో తమ పార్టీకి బోలెడంత ఆదరణ వుందని, తాము ఆడింది ఆటగా, పాడింది పాటగా నడుస్తుందని అనుకునే ధోరణి లేదని పరిశీలకులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీ డల్లయింది. మరి ఏపీలో పరిస్థితి ఎలా వుండే అవకాశం వుంది.. బీజేపీ రియాక్షన్ ఏపీ మీద ఎలా వుండబోతోందో! ఏపీలో అధికారంలో వున్న తెలుగుదేశం పార్టీకి బీజేపీ మిత్రపక్షం. అధికారంలో కూడా  భాగస్వామి. అయితే ఏపీలో బీజేపీని అధికారంలో వున్న ప్రతిపక్షం అనవచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అధికారంలో భాగస్వామిగా వున్నప్పటికీ బీజేపీ నాయకులు అధికార పార్టీ మీదే వివాదాస్పద కామెంట్లు చేస్తూ వచ్చారు. ఆర్థికంగా అష్టకష్టాల్లో వున్న ఏపీని గట్టెక్కించాలంటే కేంద్రంతో స్నేహంగా వుండాలని చంద్రబాబు మౌనం వహిస్తున్నారు. అయితే బీజేపీ నాయకులు ఆ మౌనాన్ని అసమర్థతగా భావించే స్థితికి వచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ హవా విపరీతంగా నడుస్తోందన్న ధీమానే ఈ ధోరణికి కారణమని అంటున్నారు. అయితే ఇప్పుడు బీహార్‌ ఫలితాలు ఏపీ బీజేపీలో కూడా మార్పు తెచ్చే అవకాశం వుందని అంటున్నారు. గతంలో మాదిరిగా దూకుడుగా వ్యవహరిస్తే టీడీపీతో స్నేహం తెగిపోయే ప్రమాదం వుందనే భయం ఇప్పుడు ఆ పార్టీలో పెరిగే అవకాశం వుందని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ఏపీలో అధికారంలోకి వచ్చేయాలన్న ఏపీ బీజేపీ కల కూడా చెదిరిపోయే అవకాశం వుందంటున్నారు. బీహార్లో బీజేపీ కుల రాజకీయం ఫెయిల్ కావడంతో ఏపీలో ఇప్పుడిప్పుడే మొదలు పెట్టిన కుల రాజకీయాలను పునస్సమీక్షించుకునే అవకాశం వుందని అభిప్రాయ పడుతున్నారు. పాపం బీజేపీ... ఒక్క ఎన్నికల దెబ్బకి ఎంతగా మారిపోవలసి వస్తోందో!

యువనేత అనుకున్నదొకటి.. అయ్యిందొకటి

అనుకున్నది ఒక్కటి.. అయ్యింది ఒక్కటి... బోల్తా పడ్డావులే బుల్ బుల్ పిట్టా అని ఒక యువనేతను చూసి రాజకీయ వర్గాలు కామెడీగా పాటలు పాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కేసుల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న సదరు యువనేత ఏ నిమిషాన అయినా మళ్ళీ జైలు ఊచలు లెక్కబెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మళ్ళీ జైలు జీవితం రాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నంతవరకూ ఆ పార్టీ కాళ్ళావేళ్ళా పడి నెట్టుకొచ్చిన ఆ నేత ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని మంచి చేసుకునే ప్రయత్నంలో పడ్డాడు. ఇప్పటికే నానా రకాలుగా బీజేపీని కాకా పట్టే ప్రయత్నాలు చేస్తున్న ఆయనకు ఈమధ్య జరిగిన బీహార్ ఎన్నికలు మరో మంచి అవకాశంలా కనిపించాయి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం భారీ స్టెప్పు, ఇంకా భారీ లింకప్పు చేశాడు.. కానీ బీహార్ ఎన్నికలలో బీజేపీ తుస్సుమనడంతో ఆయనగారి శ్రమ మొత్తం బూడిదలో పోసిన పన్నీరైపోయింది. మొన్నటి బీహార్ ఎన్నికలలో హైదరాబాద్‌లో హవా నడిపే ఒక పార్టీకి ఎంతమాత్రం పోటీ చేసే ఆలోచన లేదు. ఆమధ్య జరిగిన మహారాష్ట్ర ఎన్నికలలో పోటీ చేసి రెండు సీట్లు గెలిచిన ఆ పార్టీ బీహార్‌లో కూడా పోటీ చేసే ఆలోచన చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ పార్టీ అలాంటి స్టెప్పే తీసుకోలేదు. కానీ ఆ పార్టీ బీహార్లో పోటీ చేసేలా మన యువనేత శాయశక్తులా కృషి చేసి ఒప్పించాడు. నిప్పు - ఉప్పులా వుండే బీజేపీని, ఆ పార్టీ మధ్య బీహార్ వరకు అంతర్గత సయోధ్య కుదిర్చాడు. యువనేత కృషి ఫలితంగా సదరు హైదరాబాద్ పార్టీ కూడా చివరి నిమిషంలో బీహార్ ఎన్నికల బరిలోకి దిగింది. ఈ పార్టీ బీహార్లో ఎన్నికల బరిలోకి దిగితే ఓట్లు చీలి బీజేపీకి మేలు జరుగుతుందని ఆ పార్టీ నాయకత్వానికి చెప్పి ఒప్పించాడు. బీహార్లో పోటీ చేస్తే మీ పార్టీ మరో స్టేట్లో అడుగు పెట్టినట్టు వుంటుందని, బీజేపీ నుంచి లోపాయకారీ మద్దతు కూడా లభిస్తుందని చెప్పి ఈ హైదరాబాద్ పార్టీని ఒప్పించాడు. సదరు పార్టీ బీహార్ ఎన్నికలలో పోటీ చేయడానికి అయ్యే ఖర్చు మొత్తం తానే భరించాడని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇలా బీహార్ ఎన్నికలలో బీజేపీకి బోలెడంత ఉపయోగపడ్డానని కలరింగ్ ఇచ్చుకోవడానికి సదరు యువనేత చాలా ట్రై చేశాడు. బీహార్లో బీజేపీ గెలిస్తే ఆయనకు ఏమేరకు ప్రతిఫలం అందేదోగానీ, ఇప్పుడు బీజేపీ దారుణంగా ఓడిపోవడంతో పరిస్థితి తారుమారయ్యింది. కొన్ని స్థానాల్లో బీజేపీ ఓడిపోవడానికి ఎంఐఎం కూడా కారణమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. దాంతో యువనేత అనవసరంగా ఆ పార్టీని బీహార్ ఎన్నికలలో దింపినట్టు అయింది. అది సహజంగానే బీజేపీకి ఆగ్రహం తెప్పించే విషయంగా మారింది. తాను అనుకున్నది ఒకటి అయితే అయ్యింది మరొకటి కావడంతో తల పట్టుకోవడం యువనేత వంతు అయింది.

వరంగల్ ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు వెళ్లకపోవచ్చును

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరంగల్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లకపోవచ్చునని తెలుస్తోంది. అమరావతి శంఖుస్థాపన కార్యక్రమం సందర్భంగా ఇప్పుడిపుడే మళ్ళీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సయోధ్య ఏర్పడుతోంది. ఆ కారణంగా రెండు ప్రభుత్వాల మధ్యన ఘర్షణ తగ్గి కొంత సామరస్య వాతావరణం కనిపిస్తోంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు వరంగల్ ఉప ఎన్నికలలో ప్రచారం చేయాలంటే తప్పనిసరిగా కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించవలసి వస్తుంది. ఆ కారణంగా పరిస్థితులు మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం ఉంది కనుకనే చంద్రబాబు నాయుడు ఈ ఉప ఎన్నికలు ఎన్నికలలో ప్రచారానికి దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.   ఆయన మొదటి నుంచి కూడా “తెలంగాణాలో తెదేపా-తెరాసలు వాటి పని అవి చేసుకుపోనిద్దాము. ప్రభుత్వాలు ఒకదానికొకటి సహకరించుకొందాము,” ని చెప్పుతున్నారు. ఆ ప్రతిపాదన వినడానికి బాగానే ఉన్నా తెదేపా చేసే పోరాటాలతో ఇబ్బందిపడేది తెరాస ప్రభుత్వమే కనుక తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ప్రతిపాదనను పట్టించుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు తెరాస ప్రభుత్వంతో దాని ముఖ్యమంత్రి కేసీఆర్ తో సయోధ్యగా కొనసాగాలనే భావిస్తుండటంతో వరంగల్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లకపోవచ్చునని తెలుస్తోంది.

మోడీ ఇప్పుడు బిహార్ కి ఆ ప్యాకేజి ఇస్తారా...లేదా?

  బిహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్ర మోడి ఎవరూ అడగకపోయినా ఆ రాష్ట్రానికి ఏకంగా రూ.1.65లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజి ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయినా బిహార్ ఎన్నికలలో బీజేపీ ఘోరపరాజయం పొందింది. మరి మోడీ ఇప్పటికీ తన మాటకు కట్టుబడి ఆ రాష్ట్రానికి ఇస్తానని హామీ ఇచ్చిన రూ.1.65లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజి ఇస్తారా? లేక తన పార్టీని అంత అవమానకరంగా తిరస్కరించినందుకు ఆ హామీని చెత్తబుట్టలో పడేస్తారా? వేచి చూడాల్సిందే.   ఒకవేళ ఆ హామీని నిలబెట్టుకోలేకపోతే ఇక ముందు జరుగబోయే ఎన్నికలలో మోడీ హామీలను ప్రజలు విశ్వసించక పోవచ్చును. దాని వలన బీజేపీకి చాలా నష్టం జరుగుతుంది. కేంద్రం తమ ప్రభుత్వానికి ఇదివరకులాగే సహకరిస్తుందని భావిస్తున్నట్లు బిహార్ ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యతలు చేపట్టబోతున్న నితీష్ కుమార్ అన్నారు.   బీజేపీకి మిత్రపక్షంగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా ఉన్నపటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన సమయంలో పార్లమెంటులో ఆ తరువాత మళ్ళీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజి, రైల్వే జోన్ ఏర్పాటు వంటి హామీలను ఇంతవరకు అమలుచేయలేదు. అటువంటప్పుడు బిహార్ లో బీజేపీని చావుదెబ్బ తీసిన నితీష్ కుమార్-లాలూ ప్రసాద్ యాదవ్ లకు ఆర్ధిక ప్యాకేజీని అందించి, వారిరురు ప్రజలలో మరింత మంచిపేరు సంపాదించుకొని, బిహార్ లో మరింత బలపడే అవకాశం మోడీ ప్రభుత్వం కల్పిస్తుందా లేదా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. బిహార్ రాష్ట్రానికి ఆర్ధిక ప్యాకేజి ఇచ్చినా ఇవ్వకపోయినా బీజేపీకే నష్టం కలిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. దానికి ఇచ్చినా ఇవ్వకపోయినా ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తక్షాణమే ఆర్ధిక ప్యాకేజి ప్రకటించాలని రాష్ట్ర ప్రజలు, అధికార, ప్రతిపక్ష పార్టీలు అన్నీ కోరుకొంటున్నాయి.

బీహార్లో బీజేపీ కుల రాజకీయం ఫెయిల్.. మరి ఏపీలో?

బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నప్పటికీ ఆ పార్టీ మతతత్వ పార్టీ అనే విమర్శలు దేశవ్యాప్తంగా వినిపిస్తూనే వుంటాయి. ఆ విమర్శల తీవ్రత చూస్తుంటే బీజేపీ మీద వున్న మతతత్వ పార్టీ ముద్ర ఎప్పటికీ చెరిగిపోదేమో అనిపిస్తూ వుంటుంది. ఇంతకాలం ‘మతతత్వ’ ముద్ర వున్న బీజేపీ మీద ఇప్పుడు కులతత్వ ముద్ర కూడా పడిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీహార్లో విజయం సాధించడం కోసం బీజేపీ కులాన్ని పావులా వాడుకుంది. జితన్ రామ్ మాంఝీ, ఇలాంటి ‘క్యాస్ట్ కార్డు’ వున్న మరికొందరు నాయకులను చేరదీయడం ద్వారా కులపరమైన లబ్ధిని ఈ ఎన్నికలలో పొందాలని బీజేపీ ప్లాను వేసింది. అయితే ఆ ప్రయత్నాలు, ప్రయోగాలు విఫలమై బీజేపీకి చేదు అనుభవాన్ని మిగిల్చాయని విశ్లేషిస్తున్నారు. బీహార్లో బీజేపీ కుల రాజకీయం ఫెయిల్ అయిందని తాజాగా వెల్లడైన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. మరి అదే బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కూడా కుల రాజకీయాలను నడుపుతోంది... మరి ఆ రాజకీయాల పర్యవసానం ఎలా వుండబోతోందో! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార తెలుగుదేశానికి మిత్రపక్షంగా వుండి, అధికారంలో భాగస్వామ్యం పొందిన భారతీయ జనతా పార్టీ ఏపీలో తన భవిష్యత్తు గురించి అందమైన కలలు కంటోంది. మిత్రుడు మిత్రుడే రాజకీయం రాజకీయమే అన్నట్టుగా ఏపీ బీజేపీ నాయకుల వ్యవహారశైలి వుంది. 2019లో వచ్చే ఎన్నికలలో ఏపీలో సొంతగా అధికారాన్ని సంపాదించేయాలన్న అత్యుత్సాహం బీజేపీ నాయకులలో కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అందుకే టీడీపీతో మిత్రధర్మాన్ని పాటించకుండా వ్యాఖ్యలు చేయడంతోపాటు కుల రాజకీయాలను కూడా నడుపుతున్నారని విశ్లేషిస్తున్నారు. ఏపీ బీజేపీకి మొదటి నుంచి కమ్మ కులానికి చెందినవారే మహారాజపోషకులు. ఏపీలో బీజేపీ నిలదొక్కుకోవడానికి ఆ కులం వారే ప్రధానంగా కృషి చేశారు. అయితే ఆ సామాజికవర్గం బీజేపీకి ఎంతగా ఉపయోగపడుతున్నా, ఎంతయినా వాళ్ళు టీడీపీకి అనుకూలంగా వుంటారు కాబట్టి, ఆ కులాన్ని పార్టీలో ఎదగనీయకూడదన్న ధోరణి ఏపీ బీజేపీలో కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కాపు, రెడ్డి కులాలను మంచి చేసుకోవడం ద్వారా ఏపీలో రాజకీయంగా అగ్రస్థానానికి వెళ్ళిపోవాలని బీజేపీ భావిస్తోందని చెబుతున్నారు. ఆ ప్రయత్నాల్లోనే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కాపు కులానికి చెందిన సోము వీర్రాజును నియమించబోతున్నారని సమాచారం. సోము వీర్రాజు సామాన్యుడేం కాదు.. బీజేపీ ఆలోచనలను అక్షరాలా అమలు పెట్టే ‘వాగ్ధాటి’ వున్న నాయకుడు. టీడీపీ మద్దతుతో ఎమ్మెల్సీగా ఎదిగి ఆ పార్టీనే విమర్శించగల రాజకీయ చతురుడు. ఆ చతురతతోనే కాపులను, రెడ్లను బీజేపీకి స్నేహితులుగా చేసే కృషి చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. ఆ కృషిలో భాగంగానే ఔట్ డేటెడ్ కాపు నాయకుడైన చేగొండి హరిరామ జోగయ్య రాసిన ఆత్మకథ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమానికి ఏపీ బీజేపీ నాయకులుహాజరయ్యారు. కాపు నాయకుడు వంగవీటి రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం వుందని రాశారని తెలిసినా ఎంతమాత్రం ఇబ్బంది పడకుండా ఆ సభలో పాల్గొన్నారు. విచిత్రమైన విషయం ఏమిటంటే, చంద్రబాబు మీద కోపం వున్న పురందేశ్వరి కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే రంగా హత్య జరిగిన సమయంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వున్నారన్న విషయం ఆమె మరిచారనుకోలేం. కాపులను మంచి చేసుకోవడం కోసం, చంద్రబాబు మీద పగ తీర్చుకోవడం కోసం ఆమె ఆ సభకు మనసు రాయి చేసుకుని వెళ్ళి వుంటారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీ బీజేపీ నాయకులు మొన్నటి వరకూ పవన్ కళ్యాణ్‌ని గ్రిప్‌లో పెట్టుకుని కాపు ఓటు బ్యాంకు సంపాదించుకుందామని అనుకున్నారు. అయితే నిలకడలేని పవన్ కళ్యాణ్‌ని నమ్ముకుంటే దేన్నో పట్టుకుని గోదారి ఈదినట్టని అర్థం చేసుకున్నారు. అందుకే ఇతర మార్గాల ద్వారా కాపులకు దగ్గర కావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇటు కాపులతోపాటు వైఎస్ జగన్‌కి చేరువ కావడం ద్వారా రెడ్లను కూడా తమ పార్టీ వైపు తిప్పుకుని 2019 ఎన్నికలలో చక్రం తిప్పాలన్నది బీజేపీ వ్యూహంగా వుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాజాగా బీహార్లో కుల రాజకీయాలు బీజేపీకి చేదు అనుభవాన్ని ఇచ్చాయి. మరి ఏపీలో ఎలాంటి అనుభవాన్ని ఇవ్వబోతున్నాయో వేచి చూడాలి.

నితీష్ కంటే లాలూకే మొగ్గు చూపిన బిహార్ ప్రజలు?

  బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఊహించనంతగా ఎదురుదెబ్బతింది. మోడీ ప్రభావంతో బిహార్ ఎన్నికలలో అవలీలగా గెలవగాలమనుకొంటే కనీసం మీడియా సంస్థలు ఊహించినన్ని సీట్లు కూడా గెలుచుకోలేక చతికిలపడింది. ఈ ఎన్నికల ఫలితాలపై సర్వే చేసిన అన్ని మీడియా సంస్థలు కూడా నితీష్-లాలూల మహా కూటమి విజయం సాధిస్తుందని ఖచ్చితంగా చెప్పాయి. అదే సమయంలో ఎన్డీయే కూటమి కనీసం 90-100 సీట్లయిన గెలుచుకోవచ్చునని ప్రకటించాయి. కానీ బిహార్ ప్రజలు వాటి అంచనాలను తారుమారు చేస్తూ బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమికి కేవలం 58 సీట్లు మాత్రమే ఇచ్చేరు. డిల్లీ ఎన్నికల తరువాత మళ్ళీ మరోసారి నరేంద్ర మోడీ-అమిత్ షాలకు బిహార్ లో చాలా పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.   కొద్ది సేపటి క్రితమే బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. నితీష్-లాలూల మహా కూటమి మొత్తం సీట్లు గెలుచుకొంది. ఇక బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి కేవలం 58సీట్లు మాత్రమే గెలుచుకొంది. ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసివచ్చేయి. కాంగ్రెస్ మొత్తం 43స్థానాలకు పోటీ చేయగా వాటిలో 27 సీట్లు గెలుచుకొంది. ఇంత చక్కటి విజయం చవి చూసి కాంగ్రెస్ పార్టీకి చాలా కాలం అవడంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం పెల్లుబుకుతోంది.    ఈ ఎన్నికలలో విశేషం ఏమిటంటే  నితీష్ కుమార్ పరిపాలన, సమర్ధత, నిజాయితీలను చూసి ప్రజలను ఓట్లు వేయాలని మహాకూటమి కోరగా, ప్రజలు నితీష్ కుమార్ పార్టీ (జె.డి.యూ.)కి 71 సీట్లు, అవినీతి ఆరోపణలలో జైలుకి కూడా వెళ్లి వచ్చిన లాలూ ప్రసాద్ యాదవ్ కి చెందిన ఆర్.జే.డి. పార్టీకి 81 సీట్లు కట్టబెట్టారు. కానీ అందరూ నితీష్ కుమారే ఈ ఎన్నికలలో విజయం సాధించారని చెపుతుండటం, ఆయనకే అభినందనలు తెలియజేస్తుండటం విశేషం.

చెప్పు విసిరితే తప్పేంటి?

వరంగల్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల సందర్భంగా ప్రచారం చేస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మీద కొమురయ్య అనే రైతు చెప్పు విసరడం సంచలనం సృష్టించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని, రైతుల ఆత్మహత్యలకు కారణం అవుతోందని ఆగ్రహంతో కొమురయ్య చెప్పు విసిరాడు. ఒకపక్క రైతులు తమ ఉసురు తీసుకుంటూ వుంటే, ఆ సమస్య పరిష్కారం సంగతి తెలంగాణ ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే పదిహేను వందల మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.  ఈ అంశాన్ని పక్కన పెట్టి, రాజకీయ గేమ్‌లో భాగంగా ఎంపీ పదవికి రాజీనామా చేసిన కడియం శ్రీహరి ఇప్పుడు మళ్ళీ మా పార్టీ అభ్యర్థినే గెలిపించండీ అంటూ రైతుల దగ్గరకి ప్రచారానికి వెళ్ళడం ఏ రైతుకైనా ఆగ్రహం తెప్పించే విషయమే. సాధారణంగా తెలంగాణ రైతులు మనసులో కుమిలిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతూ వుంటారు. అయితే కొమురయ్య ధైర్యంగా చెప్పు విసిరాడు. దాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే చెప్పు విసిరిన రైతు బిడ్డ కొమురయ్య ఆవేదనను అర్థం చేసుకోకుండా అతన్ని ‘సైకో’ అనడం అన్యాయం. సభలు, సమావేశాలు జరుగుతున్నప్పుడు మధ్యలో ఇలా చెప్పులు విసరడం, నినాదాలు చేయడం ‘సైకో’తనం అయితే మరి తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతోమంది తెలంగాణ బిడ్డలు సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎన్నో ఆటంకాలు సృష్టించారు. వారిని అప్పుడు టీఆర్ఎస్ నాయకులు హీరోలని పొగిడారు. అలా ఆటంకాలు సృష్టించిన వారికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగాలు, ప్రమోషన్లు ఇచ్చారు. మరి ఇప్పుడు చెప్పు విసిరిన కొమురయ్య సైకో ఎలా అయ్యాడో కడియం శ్రీహరి గారే చెప్పాలి. తెలంగాణ బిడ్డలు సున్నిత హృదయులు వారి ఆవేదనను, ఆగ్రహాన్ని తీవ్రంగానే వ్యక్తం చేస్తారు. ఆ విషయాన్ని తెలంగాణ బిడ్డ అయిన కడియం శ్రీహరి గ్రహించకపోవడం ఎంతమాత్రం బాగాలేదు. ఒక్కొక్కరు తమ ఆవేశాన్ని, ఆవేదనను ఒక్కో రకంగా వ్యక్తంచేస్తూ వుంటారు. కొమురయ్య తన ఆవేదనను చెప్పు విసరడం ద్వారా వ్యక్తం చేశాడు. అంచేత, ఇప్పటికైనా చెప్పు విసిరిన కొమురయ్య మనసులోని ఆవేదనను కడియం శ్రీహరి అర్థం చేసుకోవాలి. అలా చెప్పు విసరడం ఎంతమాత్రం తప్పు కాదని కడియం బహిరంగంగా ప్రకటించాలి. కొమురయ్యను సైకో అన్నందుకు సారీ చెప్పాలి.

వరంగల్: ఎవరి ఆనందం వారిది!

వరంగల్ పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రస్తుతం ప్రచార పర్వం మొదలైంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్, కాంగ్రెస్ అభ్యర్థిగా సర్వే సత్యనారాయణ, టీడీపీ - బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ దేవయ్య, వైసీపీ అభ్యర్థిగా నల్లా సూర్య ప్రకాష్, వామపక్షాల అభ్యర్థిగా గాలి వినోద్ కుమార్ రంగంలో నిలిచారు. ఇక ఇండిపెండెంట్ల లిస్టు చాలా పెద్దగా వుంది. నామినేషన్ల ఉప సంహరణ నాటికి ఈ లిస్టు బాగా తగ్గే అవకాశం వుంది. మొత్తంమీద ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఐదుగురు రంగంలో వున్నారు. ఈ స్థానాన్ని మరోసారి  గెలవాలని టీఆర్ఎస్ పట్టుదలగా వుండగా, ఈ స్థానాన్ని తామే గెలవటం ద్వారా టీఆర్ఎస్ దూకుడుకు కళ్ళెం వేసి, తమ సత్తా చాటాలని మిగతా పార్టీలు వున్నాయి.   అన్ని పార్టీలూ ఇప్పటికే ప్రచారం ప్రారంభించేశాయి. ప్రచారం సందర్భంగా టీఆర్ఎస్ మినహా అన్ని పార్టీలూ ఒకే మాట పదేపదే అంటున్నాయి. ఆ మాట ఏమిటంటే, ‘‘ఈ ఎన్నికలో టీఆర్ఎస్ - మా పార్టీ మధ్యే ప్రధానమైన పోటీ వుంటుంది’’. ఇలా అన్ని పార్టీలు టీఆర్ఎస్‌నే టార్గెట్ చేయడంతోపాటు టీఆర్ఎస్‌కి తమ పార్టీనే ప్రధాన ప్రత్యర్థి అని చెప్పుకుంటూ ఆనందపడిపోతున్నాయి. ఇలా ఎవరికి వారు ఎవరి ఆనందం వారు పడిపోతూ వీరంతా కలిసి టీఆర్ఎస్‌కి ఉపయోగపడతామనే విషయాన్ని విస్మరిస్తున్నారు. దానితోపాటు తమ పార్టీయే టీఆర్ఎస్‌కి ప్రధాన పోటీ అని చెప్పుకోవడం కూడా కాస్తంత ఎక్కువ బిల్డప్పు అనిపిస్తోంది. కాంగ్రెస్, టీడీపీ -బీజేపీ అభ్యర్థులు అలా చెప్పుకుంటే సరే పర్లేదని అనుకోవచ్చుగానీ, చివరికి వైసీపీ అభ్యర్థి, వామపక్షాల అభ్యర్థి కూడా ఇదే మాట చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటూ వుండటం విచిత్రంగా అనిపిస్తున్న విషయం.

బీజేపీ కూటమిలో కొత్త ఆశావాదం

బీహార్ ఎన్నికలు ముగిశాయి. అటు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి, ఇటు నితీష్ కుమార్ నాయకత్వంలోని లౌకిక కూటమి ఈ ఎన్నికలలో హోరాహోరీగా పోరాడాయి. ఈ ఎన్నికలలో గెలుపు ఓటములు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్ఠ మీద ప్రభావం చూపించే అవకాశం వుండటంతో ఆయనతోపాటు ఎన్డీయే శక్తులన్నీ బీహార్ ఎన్నికల మీద దృష్టిని కేంద్రీకరించాయి. అయితే రెండు రోజుల క్రితం చివరి విడత పోలింగ్ ముగిసిన అనంతరం కొన్ని సర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు బీహార్‌లో నితీష్ కుమార్ పాలన మళ్ళీ రాబోతోందని చెప్పడంతో బీజేపీ వర్గాలు నిరాశలో కూరుకుపోయాయి. అయితే ఒక రోజు తర్వాత శుక్రవారం నాడు వెలువడిన మరో ఎన్నికల సర్వే ఫలితం  ఎన్డీయే కూటమికి అనుకూలంగా వుండటంతో బీజేపీ వర్గాలు మళ్ళీ ఆశావాదంలోకి వచ్చేశాయి. ప్రముఖ మీడియా సంస్థ ఎన్డీటీవీ తాను నిర్వహించిన ఎన్నికల సర్వే ఫలితాలను వెల్లడించింది. ఈ ఎన్నికలలో బీహార్లో ఎన్డీయే కూటమి 125 సీట్లను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎన్డీటీవీ తెలిపింది. అలాగే లౌకిక కూటమి 110 స్థానాలతో సరిపెట్టుకోవాలని తేల్చింది. 243 సీట్లున్న బీహార్‌లో ప్రభుత్వాన్ని స్థాపించాలంటే 124 సీట్ల మెజారిటీ అవసరం. అంటే ఎన్డీయే కూటమికి మెజారిటీ కంటే ఒక్క సీటు ఎక్కువగా వస్తుందన్నమాట. దాదాపు ఏడు సర్వే సంస్థలు బీహార్లో లౌకిక కూటమి అధికారంలోకి వస్తుందని చెబితే నిరాశలో కూరుకుపోయిన బీజేపీ వర్గాలు ఒక్క ఎన్డీటీవీ సర్వే ఫలితాలు తమకు అనుకూలంగా రావడంతో ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది.

‘ఆశా’ నిరాశేనా? మిగిలేదీ చింతేనా?

తెలంగాణ రాష్ట్రంలో వైద్య సేవలు అందించే ఆశా వర్కర్లు గత 65 రోజులుగా ఆందోళనా కార్యక్రమాలు చేస్తున్నారు. తమ వేతనాలు పెంచాలని, వైద్య సేవ చేయడం కోసం నిరంతరం శ్రమిస్తున్న తమ జీవితాలు కొద్దిగా అయినా మెరుగు పడాలని కోరుకుంటూ ఆశా వర్కర్లు ఉద్యమించారు. ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనల లాంటివి తెలంగాణ వ్యాప్తంగా గత 65 రోజులుగా చేస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వంలో కొద్దిమాత్రమైనా కదలిక కనిపించడం లేదు. ఆశా వర్కర్ల వేతనాలను పెంచే విషయంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రం మీదే పూర్తి బాధ్యతను నెట్టేసి తాను తప్పించుకోజూస్తోందన్న విమర్శలను ఆశా వర్కర్లు చేస్తున్నారు. తాము ఇన్ని రోజులుగా అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేకపోవడం బాధాకరమని వారు అంటున్నారు. ఆశా వర్కర్ల వేతనాలు పెంచే విషయంలో తెలంగాణ ప్రభుత్వం మొండి పట్టుదల విడిచిపెట్టి ఒక్క మెట్టు కూడా దిగే సూచనలు కనిపించడం లేదు. ప్రస్తుతం తెలంగాణలో ఆశా వర్కర్లకు జీతాలు చాలా తక్కువగా ఇస్తూ వుండటం మాత్రమే కాదు.. నెలనెలా సక్రమంగా కూడా ఇవ్వడం లేదు. ఆశా వర్కర్లకు ఇచ్చే జీతాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో వుండటం వల్ల ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని తెలంగాణ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఆందోళనలు, ఉద్యమాలు చేస్తే చేసుకోండని ఊరుకుంది. ఆశాల జీతాలను 20 నుంచి 30 శాతం వరకు పెంచాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపి చేతులు దులుపుకుంది. అయితే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఇటీవల ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో కేంద్రం జీతాలు పెంచకపోతే ఆ పెరిగే జీతాల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించడమే మేలన్న ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదన మీద తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. పరిస్థితులు చూస్తుంటే ఆశా వర్కర్ల ఆశలు నిరాశే అయ్యేట్టున్నాయని... వారికి మిగిలేది చింతేనని పరిశీలకులు అంటున్నారు.

కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందా?

  కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేక దేశంలో మత అసహనం, రచయితలపై దాడులు పెరిగిపోతున్నాయని కాంగ్రెస్ మొదలుపెట్టిన మోడీ వ్యతిరేక ప్రచారం అద్భుతమయిన ఫలితాలు ఇస్తుండటంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ తెదేపా ప్రభుత్వంపై అదే మంత్రం ప్రయోగించదానికి సిద్దపడుతున్నట్లుంది. విజయవాడలో జరిగిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మాట్లాడిన మాటలు విన్నట్లయితే ఆ విషయం అర్ధమవుతుంది.   “రాష్ర్టంలో తెదేపా అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు బాగా పెరిగిపోతున్నాయి. అలాగే సామాజిక వర్గాల మధ్య అసమానతలు కూడా పెరిగిపోతున్నాయి. ముఖ్యమంత్రి అభివృద్దిని, అధికారాన్ని అంతా ఒకే చోట కేంద్రీకరిస్తున్న కారణంగానే ప్రాంతీయ అసమానతలు పెరుగుతున్నాయి. ప్రభుత్వంలో అన్ని వర్గాలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడంతో సామాజిక అసమానతలు, కొన్ని వర్గాల మధ్య సమతుల్యత దెబ్బ తింటోంది కానీ ఆయన ఎవరి మాట వినే పరిస్థితిలో లేరిప్పుడు,” అని అన్నారు.   రాష్ట్ర విభజన కారణంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని అందరికీ తెలుసు. మళ్ళీ ఏదో విధంగా నిలద్రొక్కుకోవాలనే ప్రయత్నంలో ప్రత్యేక హోదా అంశం భుజానికెత్తుకొని ఇంతవరకు పోరాడింది. కానీ రాష్ట్ర ప్రజల అభిప్రాయాలను, మనోభావాలను ఏమాత్రం ఖాతరు చేయకుండా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ ఇప్పుడు ఆ ప్రజల కోసమే పోరాడుతోందంటే ఎవరూ నమ్మేందుకు సిద్దంగా లేరు. అందుకే దాని పోరాటాలకి ప్రజల నుండి స్పందన రాలేదు. పరిస్థితులు ఇలాగే మరికొంత కాలం కొనసాగినట్లయితే రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ అంతర్ధానం అయిపోక తప్పదని వారికీ తెలుసు. అయినా ఏమీ చేయలేని పరిస్థితి.   సరిగ్గా ఇటువంటి సమయంలోనే మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ అధిష్టానం అమలుచేస్తున్న వ్యూహం రాష్ర్ట కాంగ్రెస్ నేతలకి ఒక ఆశాకిరణంలాగ కనిపించడంతో దానిని అందిపుచ్చుకొని రాష్ర్టంలో తెదేపా ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రాంతీయ, సామాజిక అసమానతలు పెరిగిపోతున్నయంటూ విషప్రచారం మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్లు అనుమానం కలుగుతోంది. ఒకవేళ ఈ వ్యూహం ఫలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కోలుకోవచ్చని భావిస్తున్నరేమో? ఒకవేళ కాంగ్రెస్ నేతలు ఈ వ్యూహం అమలుచేసినట్లయితే దానిని తెదేపా ఏవిధంగా ఎదుర్కొంటుందో? చూడాలి.