ఒప్పుకుంటే సమీకరణ... లేదంటే సేకరణే...

  నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఇప్పటికే 33వేల ఎకరాలు సమీకరించి శంకుస్థాపన కార్యక్రమం కూడా పూర్తి చేసేసిన ఏపీ ప్రభుత్వం... మరో 3వేల ఎకరాలు సమీకరించాలని చూస్తోంది. నిజానికి మరో పదివేల ఎకరాలు సమీకరించాలని భావించినప్పటికీ రైతులు ముందుకు రాకపోవడంతో మూడు వేల ఎకరాలు మాత్రం కచ్చితంగా తీసుకోవాలని ప్రభుత్వం అడుగులు వేస్తోంది, ముఖ్యంగా సీడ్ కేపిటల్ పరిధిలో ఇంకా భూములివ్వని ఉండవల్లి, పెనుమాక గ్రామాల రైతులను ఒప్పించి భూములు తీసుకోవాలని యోచిస్తోంది. ఏడాదికి మూడు పంటలు పండే భూములను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదని, అయినా ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ సరిపోదని ఉండవల్లి, పెనుమాక రైతులు ఆందోళన బాట పట్టడంతో వాళ్లతో సంప్రదింపులు జరపాలని ప్రభుత్వం డిసైడైంది, ఇప్పటికే అధికారులకు ఆ మేరకు ఆదేశాలిచ్చిన ప్రభుత్వం... భూములు ఇచ్చేందుకు ఒప్పుకోని రైతులకు ప్యాకేజీ పెంచనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. ప్యాకేజీ పెంపుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచనప్రాయంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ ఈ రెండు గ్రామాల రైతులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే ప్యాకేజీ పెంచినా భూములు ఇవ్వడానికి రైతులు ముందుకు రాకపోతే కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం డిసైడైనట్లు తెలిసింది, సంప్రదింపులు జరిపాక కూడా భూసమీకరణకు ఒప్పుకోని పక్షంలో... చివరిగా భూసేకరణ చట్టాన్ని ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది. అయితే భూములివ్వని రైతుల పొలాల్లో పంటలను దుండగులు తగలబెడుతున్న తరుణంలో ప్రభుత్వ ప్యాకేజీకి ఒప్పుకుంటారో లేక భూసేకరణ చట్టాన్ని ప్రయోగించే పరిస్థితి తెచ్చుకుంటారో చూడాలి.

తాత్కాలిక ఖర్చుకు నో చెప్పిన చంద్రబాబు

  వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఎంత రాద్ధాంతం చేసినా అమరావతి శంకుస్థాపన వేడుకను ఎంతో అట్టహాసంగా అంగరంగవైభవంగా నిర్వహించిన చంద్రబాబునాయుడు... వేస్ట్ ఖర్చులకు మాత్రం తాను దూరమనే సంకేతాలు ఇచ్చారు, అమరావతిని ప్రపంచానికి పరిచయం చేయడానికే అంత పెద్దఎత్తున శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించామని, పైగా రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే విదేశాలను ఆకర్షించాలని, అందుకే అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని కనీవినీ ఎరుగని రీతిలో చంద్రబాబు జరపారని అంటున్నారు. అంతేకానీ అమరావతి పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయలేదని, అయినా ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టాలో, ఎక్కడ ఖర్చు పెట్టకూడదో... పెట్టిన పెట్టుబడి(ఖర్చు)కి ఎలా లాభాలు(పెట్టుబడులు) తీసుకురావాలో చంద్రబాబుకి తెలుసని టీడీపీ నేతలు అంటున్నారు. స్టేట్ డెవలప్ మెంట్ పై చంద్రబాబుకి ఫుల్ క్లారిటీ ఉందని, ఆయన ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతారని మంత్రులు కితాబిస్తున్నారు. అందుకే తాత్కాలిక అసెంబ్లీ పేరిట కోట్ల రూపాయలు ఖర్చు చేయడాన్ని చంద్రబాబు వ్యతిరేకించారని గుర్తుచేస్తున్నారు. అసలే ఆర్ధిక కష్టాలతో కొట్టుమిట్టాడుతోన్న ఆంధ్రప్రదేశ్ కి తాత్కాలికం పేరిట ఖర్చులు సరికాదని చంద్రబాబు భావించారని, అందుకే తుళ్లూరులో టెంపరరీ అసెంబ్లీ నిర్మాణానికి నో చెప్పారని అంటున్నారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాలను హైదరాబాద్ లోనే నిర్వహించాలని, లేదంటే మంగళగిరి సమీపంలోని హాయ్ లాండ్ ను వినియోగించుకోవాలని చంద్రబాబు తేల్చిచెప్పారు. మరో మూడేళ్లలో సీడ్ కేపిటల్ నిర్మాణం పూర్తికానుండటం, అందులో అసెంబ్లీ భవనం కూడా ఉన్నందున తాత్కాలిక అసెంబ్లీకి వృథా ఖర్చు వద్దని స్పీకర్ కోడెలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు, పైగా ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిపైనా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్న నేపథ్యంలో తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణం చేపడితే లేనిపోని తలనొప్పులు వస్తాయని స్పీకర్ కి సీఎం సర్దిచెప్పినట్లు తెలుస్తోంది.

ఆ రాజధాని మాది కాదు: వైకాపా

  జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచే అమరావతి నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరికిస్తున్నారనే సంగతి పెద్ద రహస్యమేమీ కాదు. అందుకు ఆయన చెపుతున్న కారణాలు ఒకటయితే, అసలు కారణాలు మాత్రం వేరేనని తెదేపా నేతలు వాదిస్తున్నారు. అమరావతి నిర్మాణం జరిగితే వచ్చే ఎన్నికలలో ప్రజలు మళ్ళీ తెదేపాకే అధికారం కట్టబెడతారనే భయంతోనే రైతులను రెచ్చగొడుతూ దానికి అడుగడుగునా అడ్డుపడుతున్నారని తెదేపా నేతల వాదిస్తున్నారు. జగన్ బ్యాచ్ అమరావతి శంఖుస్థాపన కార్యక్రమాన్ని బహిష్కరించడం, శంఖుస్థాపన కార్యక్రమం జరిగిన మర్నాడే రాజధాని గ్రామాలలో పర్యటించి రైతులను న్యాయపోరాటం చేయమని రెచ్చగొట్టడం వంటివన్నీ తెదేపా నేతల ఆరోపణలకు మరింత బలం చేకూర్చుతున్నాయి. ఆ అనుమానాలు నిజమేనని ప్రజలు భావించే విధంగా వైకాపా సీనియర్ నేత మైసూరా రెడ్డి మాట్లాడారు.   ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ “అమరావతి మా రాజధాని కాదు. దానితో మాకు ఎటువంటి సంబంధము లేదు. ఎందుకంటే అది రియల్ ఎస్టేట్ మాఫియాకి అడ్డాగా మారిపోయిందిపుడు. అక్కడ సామాన్య ప్రజలెవ్వరూ జీవించే పరిస్థితులు లేవు. అధికార పార్టీ నేతలు రైతులను భయబ్రాంతులను చేస్తున్నారు. అయినా అక్కడ రాజధాని నిర్మించడం రైతులకే కాదు మా రాయలసీమవాసులెవ్వరికీ ఇష్టం లేదు. ప్రభుత్వం ఎవరి మాట పట్టించుకొనే పరిస్థితిలో లేదు. కనుక ఆ రాజధానితో మాకు ఎటువంటి సంబంధము లేదు. అందుకే చంద్రబాబు నాయుడు అక్కడ ఏమి చేసుకొంటున్నా మేము పట్టించుకోవడం లేదు,” అని అన్నారు. మైసూరా రెడ్డి చాలా తెలివిగా రాయలసీమవాసుల ప్రస్తావన చేసినప్పటికీ ఆయన వైకాపా మనసులో మాటను విస్పష్టంగా బయటపెట్టుకొన్నారు.

పంట రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేయనున్న తెరాస ప్రభుత్వం

  ఎట్టకేలకు తెలంగాణా ప్రభుత్వం దిగివచ్చింది. ఈ ఆర్ధిక సంవత్సరంలోనే పంట రుణాలన్నిటినీ ఒకేసారి మాఫీ చేయబోతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి నిన్న ప్రకటించారు. అదే విధంగా ప్రతిపక్షాలు చేస్తున్న మరో డిమాండ్ కరువు మండలాలను ప్రకటించి తక్షణమే ఆ మండలాలకి ప్రత్యేక ఆర్ధిక సహాయం అందించడానికి కూడా తెరాస ప్రభుత్వం అంగీకరించినట్లు తెలిపారు.   పంట రుణాలను ఒకేసారి కాకుండా వాయిదాల పద్దతిలో ప్రభుత్వం మాఫీ చేస్తుండటం వలన తీవ్ర ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటున్న రైతన్నలు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని కనుక పంట రుణాలను ఒకేసారి మాఫీ చేయమని ప్రతిపక్షాలు శాసనసభ సమావేశాలలో ప్రభుత్వాన్ని గట్టిగా కోరాయి. ప్రభుత్వం వారి విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించకపోగా, ‘ప్రతిపక్షాలు నోటికి వచ్చినట్లు డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచుతూ అందుకు అంగీకరించనందుకు శాశనసభ సభ సమావేశాలు జరుగానీయకుండా అడ్డుపడుతున్నయంటూ’ అందరినీ సభ నుండి సస్పెండ్ చేసి చేతులు దులుపుకొంది. తెరాస మంత్రులు తమ ప్రభుత్వాన్ని సమర్ధించుకొంటూ, ఏ ప్రభుత్వం కూడా ఒకేసారి అంత భారీ మొత్తం విడుదల చేయలేదు. ఆ సంగతి తెలిసే ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకే నోటికివచ్చినట్లు డిమాండ్స్ చేస్తున్నాయి,” అని వాదించారు. కానీ మళ్ళీ ఇప్పుడు వారే పంట రుణాలన్నిటినీ ఒకేసారి మాఫీ చేయబోతున్నట్లు ప్రకటించారు.   బహుశః ప్రతిపక్షాలు రాష్ర్ట వ్యాప్తంగా చేపట్టిన రైతు భరోసా యాత్రల వలన ప్రజలలో, ముఖ్యంగా రైతులలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతుందనే భయంతోనే ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చును. పైగా త్వరలో వరంగల్ ఉప ఎన్నికలు ఆ తరువాత జి.హెచ్.ఎం.సి ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఇటువంటి సమయంలో ప్రజలలో వ్యతిరేకత ఏర్పడితే ఎన్నికలలో గెలవడం చాలా కష్టం. ఒకవేళ ఓడిపోతే అది ప్రజా వ్యతిరేకత వలననే ఓడిపోయిందని ప్రతిపక్షాలు ఇంకా జోరుగా ప్రచారం చేయవచ్చును. అప్పుడు ఇంకా అప్రదిష్ట మూటగట్టుకోవలసి ఉంటుంది. అందుకే తెరాస ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ నిర్ణయం తీసుకోన్నట్లుంది. అయితే ఈ నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వం చేసిన జాప్యం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. అధికారం చేప్పట్టిన వెంటనే ఇదే నిర్ణయం అమలుచేసి ఉండి ఉంటే బహుశః వారందరి ప్రాణాలు కాపాడబడి ఉండేవేమో?

తండ్రిని గుర్తు పట్టలేకపోయిన గీత

  పాకిస్తాన్ నుంచి నిన్న డిల్లీ వచ్చిన యువతి గీతకు ఆమెను ఇంత కాలం భద్రంగా చూసుకొన్న ఈధీ ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులకు భారత్ విదేశాంగ శాఖ అధికారులు ఘనస్వాగతం పలికారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ప్రధాని నరేంద్ర మోడిని వారు కలిసారు. భారత్ కు చెందిన గీతను ఇన్నేళ్ళపాటు ఎంతో భద్రంగా చూసుకొన్నందుకు ప్రధాని నరేంద్ర మోడి, సుష్మా స్వరాజ్ ఈధీ ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోడీ వారికి కృతజ్ఞతా పూర్వకంగా కోటి రూపాయలు విరాళం ఇచ్చేరు.   గీతను బీహార్ కు చెందిన ఆమె తండ్రి జనార్ధన్ మహతోకు అప్పగించే ముందు, ఆమె అతని తండ్రేనని నిర్ధారించుకొనేందుకు ఆమెకు, ఆమె తండ్రికి జనార్ధన్ మహతోకు డి.ఎన్.ఎ.పరీక్షలు నిర్వహించడానికి ఎయిమ్స్ వైద్యులు వారి రక్త నమూనాలు సేకరించారు. కానీ ఇక్కడే కధ ఊహించని మలుపు తిరిగింది. పాకిస్తాన్ లో 15ఏళ్లపాటు ఉండి వచ్చిన గీత జనార్ధన్ మహతోను తన తండ్రిగా గుర్తించలేకపోవడంతో ఆయనతో కలిసి ఆయన ఇంటికి వెళ్లేందుకు నిరాకరించింది. అధికారులతో బాటు ఆమె తండ్రిగా చెప్పుకొంటున్న జనార్ధన్ మహతో కూడా షాక్ అయ్యారు. డి.ఎన్.ఎ.పరీక్షల నివేదిక వస్తే గానీ అతను గీతకి తండ్రా కాదా అనే విషయం నిర్ధారణ కాదు. ఒకవేళ అతను నిజంగా ఆమె తండ్రి అయితే అప్పుడు వారి కుటుంబసభ్యులు అందరితో గీతని కూర్చోబెట్టి మాట్లాడించి ఆమెకు గత స్మృతులు జ్ఞప్తికి తెచ్చే ప్రయత్నం చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ జనార్ధన్ మహతో ఆమె తండ్రి కానట్లయితే, అతనీతో బాతి ఇంకా చాలా మంది ఆమె తల్లితండ్రులమని చెప్పుకొంటూ ముందుకు వచ్చిన వారినందరినీ పిలిపించి వారికీ డి.ఎన్.ఎ.పరీక్షలు నిర్వహించి వారిలో ఆమె అసలు తల్లితండ్రులు ఉన్నారో లేదో నిర్ధారించుకొంటారు. అంతవరకు గీతను ఇండోర్ లో ప్రభుత్వం మహిళా వసతి గృహంలో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎయిమ్స్ వైద్యులు ఇవ్వాళ్ళ వారిరువురి డి.ఎన్.ఎ నివేదికని సమర్పించవచ్చునని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ నటించిన బజరంగీ భాయ్ జాన్ సినిమాలో సరిగ్గా ఇటువంటి కధాంశంతోనే తీసినప్పటికీ దానిలో గీత ఇచ్చిన ఈ ట్విస్ట్ మాత్రం లేదు.

వీళ్లకి మహిళలంటే ఎంత గౌరవమో... అసలు రంగు

  వీళ్లకి మహిళలంటే ఎంత గౌరవమో... ( అసలు రంగు )   మహిళలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాధినేతలు, మంత్రులు, హోంమంత్రులు, ప్రతిపక్ష నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు, మహిళలంటే తమకెంతో గౌరవం, మహిళల భద్రతే తమ అజెండా... అంటూ ఎన్నికల సమయంలో ఊకదంపుడు ప్రసంగాలు చేసే వీళ్ల అసలు రంగు ఏమిటో... ఆ మాటలేంటో చదవండి... - ఇప్పటికిప్పుడు మిమ్మల్ని ఎవరో లాక్కెళ్లి అత్యాచారం చేస్తే, మేం ఏం చేయగలం -  మహిళా జర్నలిస్టుతో కర్నాటక బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప - ఇద్దరు కలిసి అత్యాచారం చేస్తే అది గ్యాంగ్ రేప్ కాదు... నలుగురైదుగురు కలిసి చేస్తేనే గ్యాంగ్ రేప్ - కర్నాటక హోంమంత్రి కేజే జార్జ్ - పాశ్చాత్య వస్త్రధారణ వల్లే మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి, మహిళలు హిందూ సంస్కతిని పాటిస్తే అత్యాచారాలు జరగవు, నేడు మహిళలు ధరిస్తున్న దుస్తులు, ప్రవర్తన సరిగా లేదు, నా భార్య చీర మాత్రమే ధరిస్తుందని, అందుకే ఆమెకు అల్లరి మూకల నుంచి వేధింపులు ఏనాడూ లేవు - గోవా మంత్రి దీపక్‌ ధావలికర్‌ - మీ దేవుడేమో నల్లనివాడు. మీ మ్యారేజీ బ్యూరో యాడ్స్‌లో మాత్రం తెల్లని వధువులు కావాలని ప్రకటనలిస్తారు, దక్షిణ భారతదేశంలో మహిళలు నల్లగా ఉంటారు. వారి అందం కూడా వారి శరీరాల్లాగే ఉంటుంది - జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ - మీడియాకు వ్యభిచారానికి లంకె పెట్టిన కేంద్ర మంత్రి వీకే సింగ్‌,  ప్రెస్టిట్యూట్ల ( ప్రాస్టిట్యూట్‌ ) నుంచి ఎక్కువ ఆశించలేం - మీడియాని ఉద్దేశించిన కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి వీకే సింగ్‌

చినబాబు దూకుడు... సొంత టీమ్ తో యాక్టివ్ రోల్

  తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా అపాయింటైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పార్టీలో మరింత యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు, మొన్నటివరకూ టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా మాత్రమే వ్యవహరించిన లోకేష్... ఇప్పుడు ప్రధాన కార్యదర్శి హోదాలో పూర్తిస్థాయిలో పార్టీపై పట్టుసాధించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ముఖ్యంగా ఏపీ టీడీపీపై ఫోకస్ పెట్టిన చినబాబు సొంత టీమ్ ను తయారుచేసుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే కొందరు నేతలకు ఆయా జిల్లాల బాధ్యతలు అప్పగించారు లోకేష్. ఏపీ టీడీపీ ప్రధాన కార్యదర్శులైన రెడ్డి సుబ్రమణ్యం, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, వర్ల రామయ్య, జయనాగేశ్వర్ రెడ్డి వీరిలో ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాకి చెందిన రెడ్డి సుబ్రమణ్యంకి శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల బాధ్యతలు అప్పగించగా, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరికి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలు అప్పగించారు, ఇక కృష్ణాజిల్లాకు చెందిన నేత వర్ల రామయ్యకు చిత్తూరు, కర్నూలు జిల్లాలు కేటాయించగా, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డికి కడప, అనంతపురం జిల్లాలు అప్పగించారు. అయితే వీరంతా ఎప్పటికప్పుడు ఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై నారా లోకేష్ కి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది, వీళ్లిచ్చే నివేదికల ఆధారంగా చినబాబు రంగంలోకి దిగి పార్టీని మరింత పటిష్టంచేయనున్నారు.

నేను అలాగా అనలేదు: ఎర్రబెల్లి దయాకర్ రావు

  త్వరలో వరంగల్ లోక్ సభ నియోజక వర్గానికి ఉప ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇటువంటి సమయంలో తెలంగాణా తెదేపాలో రేవంత్ రెడ్డి-ఎర్రబెల్లి దయాకర్ రావుల మధ్య విభేదాలు, పరస్పర విమర్శలు చేసుకొంటూ ఉండటం వలన పార్టీకి తీవ్రనష్టం జరుగవచ్చును. తెదేపా, బీజేపీలు కలిసి ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టాలని సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ తెదేపా తరపున రావుల చంద్రశేఖర్ రెడ్డి ఉపఎన్నికలలో పోటీ చేయాలనుకొంటున్నారు. ఒకవేళ బీజేపీ అందుకు అంగీకరిస్తే తేదేపాకు అది చాలా మంచి అవకాశంగా భావించవచ్చును. కానీ ఈ ఎన్నికలలో పార్టీని విజయపధంలో నడిపించవలసిన ఇద్దరు ముఖ్య నేతలు-రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ఈవిధంగా కలహించుకొంటుంటే, అది ప్రత్యర్ధ పార్టీలకు సానుకూల అవకాశంగా మారుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటువంటప్పుడు తెదేపా అభ్యర్ధిని నిలబెట్టి ప్రత్యర్ధ పార్టీలకు చేజేతులా ఈ సువర్ణావకాశాన్ని జారవిడుచుకోవడం కంటే బీజేపీ అభ్యర్ధిని నిలబెట్టి అతనికి మద్దతు ఇస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   ఎర్రబెల్లి దయాకరరావు తమ పార్టీ తరపున అభ్యర్ధిని నిలబెట్టాడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు రేవంత్ రెడ్డి వర్గం ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. దానిని ఆయన తీవ్రంగా ఖండించారు. తను ఎన్.డి.ఏ. అభ్యర్ధిని నిలబెడతామని చెప్పాను తప్ప బీజేపీ అభ్యర్ధిని నిలబెడుతున్నట్లు చెప్పలేదని అన్నారు. ఈ ఉపఎన్నికలలో ఏ పార్టీ అభ్యర్ధిని నిలబెట్టాలనే విషయంపై ఇంకా ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు జరుగుతుంటే తను బీజేపీ అభ్యర్ధిని నిలబెడుతున్నట్లు ఎందుకు ప్రకటిస్తానని ఆయన ప్రశ్నించారు. పార్టీలో కొందరు తనను దెబ్బతీయడానికే ఉద్దేశ్యపూర్వకంగా ఇటువంటి ప్రచారం చేతున్నారని ఆయన అన్నారు. ఏ పార్టీ అభ్యర్ధిని నిలబెట్టినా వారికి కేంద్రంలో మంత్రి పదవి దక్కే అవకాశం ఉంటుందని తాము ఎన్నికలలో ప్రచారం చేస్తామని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.

జగన్ తో కలిసి పనిచేయడానికి అభ్యంతరం లేదు: రఘువీరా రెడ్డి

  ఏపీకి ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి చేసిన నిరాహార దీక్షకి మదతు తెలిపిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ సింగ్, ప్రత్యేక హోదా సాధించడానికి తమ పార్టీ వైకాపాతో కలిసిపోరాడటానికి సిద్దంగా ఉందని కూడా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభీష్టానికి విరుద్దంగా రాష్ట్ర విభజన చేసినందుకు ఎన్నికలలో చాలా ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ, ఆ తరువాత నిలద్రొక్కుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ప్రజలు దానిని పట్టించుకోవడం లేదు. పరిస్థితులు ఇలాగే కొనసాగినట్లయితే రాష్ర్టం నుండి కాంగ్రెస్ పార్టీ కనబడకుండా పోయే ప్రమాదం ఉంది. బహుశః అందుకే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వైకాపా సహాయంతో పార్టీని కాపాడుకోవాలని భావిస్తున్నట్లుంది.   వైకాపాతో కలిసి ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దమని దిగ్విజయ సింగ్ చెప్పిన తరువాత పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి తమకు ఎటువంటి బేషజాలు లేవని తెలిపారు. ప్రత్యేక హోదా సాధించేందుకు రాష్ట్రంలో అన్ని పార్టీలు సమైక్యంగా పోరాడవలసిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డి దానిని మంజూరు చేయవలసిన ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించనంతవరకు ప్రజలు ఆయన చేస్తున్న పోరాటాలను విశ్వసించరని రఘువీరా రెడ్డి అభిప్రాయ పడ్డారు. జగన్ అంగీకరిస్తే వైకాపాతో కలిసి ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేయదానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉందని ఆయన తెలిపారు. ఆయన అంగీకరిస్తే కాంగ్రెస్ శ్రేణులు వచ్చి ఆయన వెనుక నిలబడేందుకు సిద్దంగా ఉన్నాయని స్పష్టం అవుతోంది. ఇప్పుడు బంతి జగన్ కోర్టులోనే ఉంది కనుక ఆయనే దీనిపై ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంది.

నేడు రాజధాని రైతులతో జగన్ సమావేశం...దేనికో?

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మొదటి నుండి రాజధాని భూసేకరణను వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రక్రియను పూర్తి చేసి అమరావతి శంఖుస్థాపన కార్యక్రమం కూడా పూర్తి చేసింది. జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమాన్ని బహిష్కరించడం ద్వారా తనకి రాజధాని నిర్మాణం జరగడం ఇష్టం లేదని స్వయంగా ద్రువీకరించినట్లయింది. రాజధానికి శంఖుస్థాపన జరిగిన తరువాత కూడా ఇంకా దానికి ఆయన అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు మానుకొన్నట్లు లేదు. ఇవ్వాళ్ళ ఆయన ఉద్దండరాయునిపాలెంలో రైతులతో సమావేశంకానున్నారు. త్వరలో రాజధాని నిర్మాణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున మొదలయ్యే అవకాశం ఉంది. మరి ఆయన వాటిని అడ్డుకొనేందుకు ఏదయినా వ్యూహరచన చేయడానికే రైతులతో సమావేశం అవుతున్నారేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్టీసీ బస్ చార్జీల పెంపును నిరసిస్తూ ఇవ్వాళ్ళ ఆయన గుంటూరులో ఆర్టీసీ బస్సు డిపో ఎదురుగా ధర్నా నిర్వహించబోతున్నారు.ఆ తరువాత ఉద్దండరాయునిపాలెం వెళ్లి అక్కడి రైతులతో సమావేశంకానున్నారు

వరంగల్ ఉపఎన్నికలలో ఉమ్మడి అభ్యర్దికే తెదేపా, బీజేపీలు మొగ్గు

  తెలంగాణా తెదేపా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ, కిషన్ రెడ్డి ఈరోజు సమావేశమయ్యి రెండు పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టాలని నిర్ణయించుకొన్నారు. తెదేపా పాలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడా వరంగల్ ఉపఎన్నికలలో పోటీ చేసేందుకు చాలా ఆసక్తి చూపిస్తున్నందున మళ్ళీ రేపు ఇరు పార్టీల నేతలు మరొకమారు సమావేశమయ్యి తమ ఉమ్మడి అభ్యర్ధి పేరును ఖరారు చేస్తారు. బీజేపీ అభ్యర్ధికి మద్దతు ఇవ్వడానికి తెదేపా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం.   కాంగ్రెస్, తెరాస పార్టీలు తమ అభ్యర్ధుల పేర్లను ఇంకా ఖరారు చేయలేదు. స్వతంత్ర అభ్యర్ధి గాలి వినోద్ కుమార్ కి వామపక్షాలు మద్దు ప్రకటించాయి. ఈ ఉపఎన్నికలలో వైకాపా కూడా పోటీ చేయబోతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. బహుశః తెదేపా-బీజేపీలకు పడే ఓట్లను చీల్చి తెరాసకు పరోక్షంగా సహాయపడేందుకే ఎన్నికల బరిలో దిగుతోందేమో లేకపోతే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దగ్గరవుతున్నందున, తెరాసను శత్రువుగానే పరిగణిస్తామని సూచించేందుకే పోటీ చేస్తుండవచ్చును.

సాక్షీ మహరాజ్... సంజయ్‌ రావత్‌... సుబ్రమణ్యస్వామి

  సాక్షీ మహరాజ్... సంజయ్‌ రావత్‌... సుబ్రమణ్యస్వామి   బీజేపీ ఎంపీల్లో సాక్షీ మహరాజ్ స్టైలే వేరు... ప్రధాని మోడీ అధికారంలో వచ్చాక ఆయన చేసినంత రచ్చ మరెవరూ చేయలేదేమో, సందర్భం ఏదైనా ప్రతిసారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సాక్షీ మహరాజ్... ముఖ్యంగా ముస్లింలపై కామెంట్స్ మాత్రం తీవ్ర దుమార్నే రేపాయి... అలాగే శివసేన ఎంపీ సంజయ్‌ రావత్, కేంద్ర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యలు మీకోసం   (బీజేపీ ఎంపీ సాక్షీ మహరాజ్‌) - దేశంలో పిల్లలను కనడంపై ఆంక్షలు విధించాలి, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న వారికే ఓటు హక్కు కల్పించాలి, హిందువులు కుటుంబ నియంత్రణ పాటించినప్పుడు, ముస్లింలు ఎందుకు పాటించరు ( బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్‌ ) గోవులను చంపేవారిని హత్య చేసినా తప్పులేదు ( బీజేపీ ఎంపీ సాక్షీ మహరాజ్‌ ) - నాథురామ్‌ గాడ్సే గొప్ప దేశభక్తుడు (శివసేన ఎంపీ సంజయ్‌ రావత్‌) - ముస్లింలకు ఓటు హక్కును తొలగించాలి (కేంద్ర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు) - అగ్గిపెట్టె, సిగరెట్లను తీసుకొని ఎన్నోసార్లు విమానంలో ప్రయాణించా... ఎవరూ చెక్‌ చేయలేదు (బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి) - లంకాధీశుడు రావణుడు, ఆయన భార్య మండోదరి ఉత్తరప్రదేశ్‌కు చెందిన దళితులే  

మాటలతో మోడీని టార్చర్ పెడుతున్న మంత్రులు

  మాటలతో మోడీని టార్చర్ పెడుతున్న మంత్రులు   ప్రధాని నరేంద్రమోడీకి కేంద్ర మంత్రులు చిక్కులు తెచ్చిపడుతున్నారు, మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచే ఏవో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మంత్రులు ఇరకాటంలో పెడుతుంటే... తాజాగా వీకే సింగ్ చేసిన వ్యాఖ్యలు కేంద్రాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది... మోడీ తలబొప్పి కట్టిస్తున్న మంత్రుల మాటలేంటో మీరూ చదవండి   (కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్) - ఎవరో కుక్కపై దాడి చేస్తే కేంద్రాన్ని నిందిస్తారా? ... ఫరిదాబాద్‌లో ఓ దళిత కుటుంబంపై అగ్రవర్ణాల దాడి, ఇద్దరు చిన్నారుల సజీవదహనంపై కేంద్ర మంత్రి వీకే సింగ్ కామెంట్ (కేంద్ర సహాయ మంత్రి మహేశ్ శర్మ) - ముస్లింలందరూ దేశ భక్తులు కాదు, మహాభారతం, రామాయణం లాగా బైబిల్, ఖురాన్ గ్రంథాలు భారత ఆత్మ కాదు (కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి) - భారతదేశంలో ఉండాలనుకుంటున్న వారంతా తాము శ్రీరాముని బిడ్డలమని అంగీకరించాలి (కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌) - పాకిస్తాన్ కు మద్ధతిచ్చేవారే మోడీని వ్యతిరేకిస్తున్నారు, మోడీని వ్యతిరేకించే నేతలంతా పాకిస్తాన్ వెళ్లిపోవాలి (బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ) - కులతత్వం బీహార్ డీఎన్ఏ లోనే ఉంది

మంత్రి... ముఖ్యమంత్రి... ఓ ఎమ్మెల్యే... మధ్యలో సెలబ్రిటీ...

  మంత్రి... ముఖ్యమంత్రి... ఓ ఎమ్మెల్యే... మధ్యలో సెలబ్రిటీ...      ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సెలబ్రిటీలు... ఒక్కోసారి తమ మనసులో మాట బయటపెట్టేస్తుంటారు... అవి ఆ తర్వాత ఎంత దుమారం రేపుతాయో మనకందరికీ తెలిసిందే... అలా పలువురు వీఐపీలు చేసిన వివాదాస్ప వ్యాఖ్యలు మీకోసం... ( మహారాష్ట్ర మంత్రి గిరీష్ బపత్ ) -  రాత్రిళ్లు మీరు మొబైల్ ఫోన్లలో ఎలాంటి క్లిప్పింగ్స్ చూస్తారో మేం కూడా అవే చూస్తాం. మాకు వయసైపోయిందని ఎలా అనుకుంటారు. మా మనసుకు సంబంధించినంత వరకూ మేము ఇంకా యువకులమే .... విద్యార్ధినీ విద్యార్ధులతో మహారాష్ట్ర మంత్రి గిరీష్ బపత్ (రాజస్థాన్‌ బీజేపీ ఎమ్మెల్యే సుందర్ లాల్) - సెల్ ఫోన్ వల్ల అమ్మాయిల జీవితాలు పాడైపోతున్నాయి, వారు అనవసరమైన విషయాలు నేర్చుకుంటున్నారు. సెల్ ఫోన్ వల్ల యువతుల జీవితాల మీద చెడు ప్రభావం పడుతోంది, అమ్మాయిల ప్రవర్తనపై మొబైల్‌ ఫోన్లు తీవ్ర ప్రభావం చూపుతున్నయి, తమ కూతుళ్లకు తండ్రులు ఎవరూ కూడా సెల్‌ ఫోన్లు ఇవ్వొద్దు ( ములాయం సింగ్ యాదవ్ ) - మగపిల్లలు అప్పుడప్పుడు తప్పు చేస్తుంటారు. అంతమాత్రానికే అత్యాచారం చేశారని ఉరిశిక్ష వేయడం సరికాదు. మా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే అత్యాచార నిందితులకి ఉరిశిక్ష రద్దుచేస్తాం (గోవా సీఎం లక్ష్మీకాంత్‌ పర్సేకర్‌) - నర్సులు ఎండలో సమ్మె చేస్తే గ్లామర్‌ పోతుంది. నల్లగా అయిపోతారు. ఆ తర్వాత పెళ్లికొడుకు దొరకడం కష్టం   (రాంగోపాల్ వర్మ) - తెలంగాణ ప్రజలు యాదగిరి నరసింహస్వామినే పూజించాలి, వారికి ఆంధ్రా దేవుళ్లు ఎందుకు?, తెలంగాణ ప్రజలు తమ సొంత దేవుడైన యాదగిరి నరసింహస్వామి కంటే ఎక్కువగా ఆంధ్రా దేవుడైన తిరుపతి వేంకటేశ్వరస్వామిని ఎందుకు పూజిస్తున్నారు

నోరు జారారా?... మనసులో ఉన్నదే చెప్పారా?... బీఫ్ పై బీజేపీ స్టాండ్

  నోరు జారలేదు... మనసులో ఉన్నదే చెప్పారు...  బీఫ్ పై బీజేపీ స్టాండ్   ఉత్తరప్రదేశ్ దాద్రిలో గొడ్డుమాంసం తిన్న అక్లాఖ్ హత్య... భారత్ లో ఉండాలంటే గోమాంసం తినడం మానాల్సిందేనన్న వార్నింగ్... జమ్మూకాశ్మీర్ లో బీఫ్ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్యేపై అసెంబ్లీలో దాడి... బీజేపీ నాయకుల వివాదాస్పద వ్యాఖ్యలు.... మోడీ సీరియస్... అమిత్ షా నోటీసులు... ఇంతకీ బీఫ్ పై బీజేపీ లీడర్స్ ఏమన్నారు? వాళ్లు నోరు జారారా? మనసులో ఉన్నదే బయటపెట్టారా? ( హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ ) -ముస్లింలు భారత్ లో ఉండాలంటే గోమాంసం తినడం మానాల్సిందే, ఆవు మాంసం తింటూ ముస్లింలు హిందువుల పవిత్రభావజాలాన్ని అవమానిస్తున్నారు, గోవులను హిందువులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు, మనది ప్రజాస్వామ్యదేశం. ఇక్కడ అందరికీ స్వేచ్ఛ ఉంటుంది, కానీ దానికీ ఓ హద్దు ఉంటుంది. ఇతరుల భావాలను భంగం కల్గించనంతవరకే స్వేచ్ఛకు పరిమితి ఉంటుంది (ఆరెస్సెస్ పత్రిక ‘పాంచజన్య’) - గోవధకు పాల్పడేవారిని చంపాలని వేదాల్లో ఉంది. హిందూ సమాజంలో గోవధ అనేది చాలా పెద్ద విషయం. హిందువుల్లో అనేకమందికి ఇది జీవన్మరణ సమస్య ( బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్‌ ) - గోవులను చంపేవారిని హత్య చేసినా తప్పులేదు ( యూపీ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్‌ సోమ్‌ ) - గోవులను చంపుతున్న ముస్లింలపై ప్రతీకారం తీర్చుకునే సామర్థ్యం హిందువులకు ఉంది (కేంద్ర మంత్రి మహేశ్‌ శర్మ) (కేంద్ర మంత్రి సంజీవ్‌ బల్యన్) - గోమాంసం తిన్నందుకు దాద్రిలో అక్లాఖ్ అనే ముస్లింని కొట్టిచంపిన ఘటన చాలా చిన్న విషయం

హోదాకోసం పోరాడుతున్న కాంగ్రెస్, వైకాపాల లక్ష్యాలు వేర్వేరు

  కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు రెండూ ఈ చారిత్రిక కార్యక్రమానికి హాజరుకానందున ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఆ రెండు పార్టీలు వేర్వేరు వ్యూహాలు అమలుచేస్తున్నాయి. వైకాపా అధికార తెదేపాని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తూ, నిరసన ప్రదర్శనలు మొదలుపెట్టగా, కాంగ్రెస్ పార్టీ తన బద్ధ శత్రువయిన మోడీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని “మట్టి సత్యాగ్రహం” ప్రారంభించింది.   జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని, రఘువీరారెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకొని పోరాటాలు చేస్తున్నారు. ఒకే అంశం మీద పోరాడుతున్న ఆ రెండు పార్టీల లక్ష్యాలు వేర్వేరుగా ఉండటం గమనిచినట్లయితే వాటి పోరాటం దేనికోసమో, ఎవరి మీదనో అర్ధం అవుతుంది. అవి చేస్తున్న ఆ పోరాటాలతో ప్రత్యేక హోదా రాదనే సంగతి వాటికీ తెలుసు. బహుశః అందుకే ఆ రెండు పార్టీలు ఆ అంశాన్ని ఏరికోరి భుజానికెత్తుకొన్నట్లు అనుమానించవలసి వస్తోంది. రెండు పార్టీలు ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటం వాటిని క్రమంగా దగ్గరయ్యేందుకు దోహదపడుతోంది కూడా.   రధాని నరేంద్ర మోడీ అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి హాజరయినప్పుడు ప్రత్యేక హోదా, ప్యాకేజీ గురించి ఎటువంటి ప్రకటన చేయకపోవడం వాటికి మరింత కలిసి వచ్చినట్లయింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా డిల్లీ నుంచి గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్ళు తెచ్చి చంద్రబాబు నాయుడు చేతిలో పెడితే, ఆయన ప్రత్యేక హోదా గురించి మోడీని నిలదీయకుండా వాటిని చాలా సంతోషంగా స్వీకరించారని కాంగ్రెస్, వైకాపాలు విమర్శిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ప్రధాని మోడీ ఐడియాను మళ్ళీ అదే ఐడియాతో తిప్పి కొట్టేందుకు సిద్దం అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పుణ్యక్షేత్రాల నుండి మట్టిని సేకరించి ప్రధాని నరేంద్ర మోడీకి పంపేందుకు ఈరోజు హైదరాబాద్ లో ‘మట్టి సత్యాగ్రహం’ ప్రారంభించారు. ప్రత్యేక హోదాతో సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టంలో ఇచ్చిన అన్ని హామీలను మోడీ ప్రభుత్వం అమలుచేయవలసిందేనని ఆయన అన్నారు. అంతవరకు మోడీ ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.

శంకుస్థాపన ఓకే... మరి సీడ్ కేపిటల్ సంగతేంటి?

  నవ్యాంధ్రప్రదేశ్లో ఒక చారిత్రక ఘట్టం ముగిసింది... అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించి శెభాష్ అనిపించుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందు అసలుసిసలైన లక్ష్యం నిలిచింది. అతి తక్కువ టైమ్ లో అమరావతి శంకుస్థాపనను ఎవరూ ఊహించనంత అద్భుతంగా ఆర్గనైజ్ చేయగలిగిన చంద్రబాబు... సీడ్ కేపిటల్ నిర్మాణం సవాలు విసురుతోంది. అంతేకాదు 2019 ఎన్నికల్లోపు అంటే 2018 డిసెంబర్ నాటికి సీడ్ కేపిటల్ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. 2018 డిసెంబర్లోపు అమరావతిలో సీడ్ కేపిటల్ ఫస్ట్ ఫేజ్ ను పూర్తి చేయాలని గడువు పెట్టుకున్న చంద్రబాబునాయుడు... అనుకున్న టైమ్ లోగా టార్గెట్ ను రీచ్ అవుతారో లేదోననే సందేహాలు కలుగుతున్నాయి, ఇంకా మూడేళ్లు మాత్రమే చంద్రబాబుకు సమయం ఉంది, ఈలోపే సీడ్ కేపిటల్ నిర్మాణం జరిగిపోవాలి, మరి ఇంత తక్కువ టైమ్ లో నిర్మాణాలను పూర్తి చేయడం సాధ్యమేనా అంటున్నారు. అయితే ఇప్పటికే సింగపూర్ ప్రభుత్వం... అమరావతి మాస్టర్ ప్లాన్ అందించడంతో సీడ్ కేపిటల్ పనులు అతిత్వరలోనే ప్రారంభంకానున్నాయని, కానీ ఆర్ధిక కష్టాలతో కొట్టుమిట్టాడుతోన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... ఏవిధంగా అంతర్జాతీయస్థాయి నగరాన్ని నిర్మిస్తుందనేది మాత్రం చంద్రబాబు సత్తాపై ఆధారపడి ఉందని అంటున్నారు. డబ్బుంటే కొండ మీద కోతినైనా కిందికి తీసుకురావొచ్చంటుంటారు, మరి తీవ్ర నిధుల కొరతతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకున్న గడువులోగా సీడ్ కేపిటల్ ను పూర్తి చేయగలుగుతుందా? ఏ విధానంలో సింగపూర్, జపాన్ ప్రభుత్వాలకు పనులు అప్పగించబోతున్నారు? ఈ కంపెనీలు గడువులోపు నిర్మాణాలను పూర్తి చేయగలుగుతాయా అనే సవాళ్లు మాత్రం ఏపీ ప్రభుత్వం ముందున్నాయి. మరి వీటన్నింటినీ అధిగమించి గడువులోగా సీడ్ కేపిటల్ ను నిర్మించి చంద్రబాబు మరోసారి తన సత్తా చాటుకుంటారో లేదో చూడాలి.

ప్రమాదంలో అమరావతి... ‘టీవోఐ‘ వార్నింగ్ స్టోరీ

  నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది, అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారే తప్ప, అక్కడ రాజధాని నిర్మాణం చేపట్టాలనుకునే ముందు కనీస జాగ్రత్తలు తీసుకోలేదని, గుంటూరు జిల్లాలో భూతత్వం, అక్కడి భౌగోళిక పరిస్థితుల గురించి అధ్యయనం చేయలేదని, చివరికి ఎన్జీఆర్ఐని కానీ, భూకంప శాస్త్రవేత్తలను గానీ సంప్రదించలేదని రాసుకొచ్చింది. గుంటూరు జిల్లాలోని చాలా ప్రాంతాలు భూకంప ప్రమాదంలో ఉన్నాయన్న టైమ్స్ ఆఫ్ ఇండియా... నవ్యాంధ్ర రాజధాని అమరావతి అయితే మూడో సెస్మిక్ జోన్ ఉందంటూ హెచ్చరించింది, మూడో సెస్మిక్ జోన్లో రిక్టర్ స్కేల్ పై 7.0 పాయింట్ల తీవ్రతతో భూకంపాలు సంభవిస్తాయని, అవి ఒక్కోసారి మరింత ప్రమాదకరమైన స్థాయిలో ఉండే అవకాశముందని రాసుకొచ్చింది. దీనికి గతంలో జరిగిన భూకంపాల నివేదికలను టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రస్తావించింది, 1950లో ఒంగోలులో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.2గా నమోదైందని, అదే భూకంపం అమరావతిలో సంభవిస్తే దాని ప్రభావం 5.5గా ఉంటుందని విశ్లేషించింది. అయితే అమరావతిలో రాజధాని నిర్మాణం చేపట్టాలని నిర్ణయించాక ఏపీ ప్రభుత్వం... ఎన్జీఆర్ఐ, భూకంప శాస్త్రవేత్తలను సంప్రదించలేదని టైమ్స్ ఆఫ్ ఇండియా రాసుకొచ్చినా, అమరావతిని ఎంపిక చేసిన సమయంలోనే నిపుణులు, శాస్త్రవేత్తలు... ముందుస్తుగానే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చినట్లు తెలుస్తోంది. భూకంప ప్రమాదాల జోన్ లో అమరావతి ఉన్నందున అక్కడ 9 పాయింట్ల భూకంప తీవ్రతను తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టాలని, అప్పుడే ఎలాంటి భూకంపాలనైనా తట్టుకోగలుగుతాయని నిపుణులు, శాస్త్రవేత్తలు అంటున్నారు.

ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అందుకే లంచం తీసుకొంటున్నాను : జేసి

  జేసి దివాకర్ రెడ్డి, జేసి ప్రభాకర్ రెడ్డి ఇరువురూ కూడా ఏదో ఒక సంచలన లేదా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. ప్రత్యేక హోదా రాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా కాలం క్రితమే తెలుసని కానీ ప్రజలను, పవన్ కళ్యాణ్ న్ని తృప్తి పరిచేందుకే పార్లమెంటు ముందు తాము ధర్నా చేసామని తెదేపా ఎంపీ జేసి దివాకర్ రెడ్డి చెప్పినప్పుడు తెదేపా చాలా ఇబ్బందికరమయిన పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఆయన సోదరుడు తాడిపత్రి తెదేపా ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి నిన్న చాలా వివాదస్పద ప్రకటన చేసారు.   తన తాడిపత్రి నియోజక వర్గం అభివృద్ధి చేసుకొనేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోవడం చేత తను కాంట్రాక్టర్ల దగ్గర లంచం తీసుకొంటున్నానని ప్రకటించారు. చనిపోయిన తరువాత కూడా తనను ప్రజలు గుర్తుంచుకోవాలనే ఉద్దేశ్యంతోనే ప్రజలకు ఉపయోగపడే కొన్ని మంచి పనులు చేయడానికి కాంట్రాక్టర్ల దగ్గర లంచం తీసుకొంటున్నానని ప్రభాకర్ రెడ్డి మీడియాకి తెలిపారు. అయితే ఆ డబ్బుని తను డీడీల రూపంలో తీసుకొంటూ దానికి ఆడిట్ లెక్కలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తానేమీ దీనిని రహస్యంగా దాచిపెట్టడం లేదని పూర్తి పారదర్శకతతో లెక్కలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎవరయినా ఆ లెక్కలు చూసుకోవచ్చని తెలిపారు.   అధికార పార్టీకి చెందిన ఒక ప్రజా ప్రతినిధి అయిన ప్రభాకర్ రెడ్డి తను లంచం తీసుకొంటున్నట్లు బహిరంగంగా ప్రకటించడం పైగా అదేమీ నేరం కాదన్నట్లు చెప్పడం, తన నియోజక వర్గం అభివృద్ధికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని చెప్పడం ప్రతిపక్షాలకు బలమయిన ఆయుధం అందించినట్లయింది. ఆయన మాట్లాడిన ఈ మాటలకు తెదేపా ప్రభుత్వం ప్రజలకు, ప్రతిపక్షాలకు సంజాయిషీలు చెప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆయన ప్రభుత్వాన్ని వారి ముందు దోషిగా నిలబెట్టారు. రాష్ట్రంలో ఒక్క నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేనప్పుడు అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి అన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చేయి? ఎందుకు అంత ఖర్చు చేసింది? అని ప్రతిపక్షాలు నిలదీయకమానవు.