దొరగారు కొడుకుని సింహాసనం ఎక్కించబోతున్నారా?

అనగనగా ఒక పెద్ద  సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో మనం చెప్పుకోబోతున్న రాజ్యం ఒక భాగం. ఆ రాజ్యాన్ని ఒక దొరగారు పరిపాలిస్తున్నారు. సదరు దొరగారు ఈ రాజ్యం మీద అధికారాన్ని చాలా తెలివిగా ప్లాన్ వేసి సంపాదించారు. అధికారం సంపాదించిన దగ్గర్నుంచి దొరగారు ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా నడుస్తోంది. హిట్లర్, ముస్సోలినీ తరహాలో చాలా నియంతృత్వంతో దొరగారు పరిపాలిస్తున్నారని విమర్శలు వస్తున్నా దొరగారు ఎంతమాత్రం పట్టించుకుండా తన శైలిలోనే పరిపాలిస్తున్నారు. దొరగారికి తగ్గ పాలకులు ఆయన కుమారుడు, అల్లుడుగారు కూడా. వాళ్ళిద్దరూ దొరగారి మంత్రివర్గంలోనే వున్నారు. అంతా బాగానే వుందిగానీ, దొరగారి కొడుక్కి, అల్లుడిగారికి ఒకరంటే మరొకరికి ఎంతమాత్రం పడదు. ఎంత పడదూ అంటే... ఇద్దరూ కలసి ఒకే వేదిక మీద కనిపించడానికి కూడా ఇష్టపడనంత పడదు. ఎందుకంటే దొరగారి తర్వాత సింహాసనం నేను ఎక్కాలంటే నేను ఎక్కాలని ఇద్దరి మధ్య పోటీ. ఫ్యూచర్లో సింహాసనం ఎక్కడానికి ఇప్పటి నుంచి ఎవరి ప్లాన్లో వాళ్ళు వున్నారు. దొరగారికి మాత్రం తన కొడుకునే తన సింహాసనం ఇవ్వాలనేది కోరిక. కానీ ఒకవేళ పుసుక్కుమని తనకి ఏమైనా జరిగితే అల్లుడు గారు చాలా ఘటికుడు కావడం వల్ల తన కొడుక్కి సింహాసనం దక్కకుండా చేస్తాడేమోనని దొరగారికి మనసులో డౌటుంది. అందుకని తన సింహాసనం తన కొడుక్కే దక్కేలాగా దొరగారు ఒక ప్లాన్ సిద్ధం చేశారని వినికిడి. ప్రస్తుతం సింహాసనం మీద వున్న దొరగారు అంతా బాగా వుండగానే వన్ ఫైన్ మార్నింగ్ సింహాసనం మీద నుంచి కిందకి దిగిపోతారు. ఆ సింహాసనం మీద తానే స్వయంగా తన కొడుకుని కూర్చోబెడతారని సమాచారం. అంతా బాగున్నప్పుడే ఇలా అధికారాన్ని తన కొడుకు చేతిలో పెట్టడం వల్ల తన అల్లుడు కూడా కిక్కురుమనకుండా వుంటాడనేది దొరవారి ప్లాన్ అని సమాచారం. వేరే రాజ్యంలో కూడా ఒక రాజుగారు ఇలాగే తనకు అంతా బాగానే వున్న సమయంలోనే తాను సింహాసనం మీద కూర్చోకుండా తన కొడుకుని కూర్చోబెట్టాడు. తన కొడుకు సింహాసనం మీద కూర్చుని అధికారం చెలాయిస్తూ వుంటే సదరు రాజు ఒక తండ్రిగా ఎంతో సంతోషిస్తున్నాడు. అదే తరహాలో ఇప్పుడు మన కథలోని దొరగారు కూడా తన కొడుకు సింహాసనం మీద కూర్చుని అధికారం చెలాయిస్తూ వుంటే తాను చూసి సంతోషించాలని అనుకుంటున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి దొరగారు ఈ ఆలోచనను అమలులో పెట్టే ఫైన్ మార్నింగ్ ఎప్పుడొస్తుందో వేచి చూడాలి.

ఇక్కడ కూడా నాలుగు చుక్కలు కురిస్తే బావుండు...

తుఫాను పుణ్యమా అని తమిళనాడుతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల పుణ్యమా అని చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో దశాబ్దాల కాలంగా నిండని చెరువులు, డ్యామ్‌లు ఎంచక్కా నిండిపోయి కళకళలాడుతున్నాయి. నీరు పొంగి పొర్లుతూ సముద్రంలో కలసిపోతోంది. భారీ వర్షాల కారణంగా కొన్ని సమస్యలు, బాధలు ఎదురవుతున్నప్పటికీ మొత్తమ్మీద చూస్తే ఈ వరుణ కరుణ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మేలు చేసిందనే చెప్పవచ్చు. వచ్చే ఎండాకాలం అక్కడ నీటి కొరత పెద్దగా వుండకపోవచ్చన్న అభిప్రాయాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. అక్కడ సంగతి అంతా బాగుంది.. మరి ఇక్కడి సంగతేమిటని తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగం బాధపడుతున్నారు. అక్కడ కురిసే భారీ వర్షాల్లోంచి నాలుగు చుక్కలు ఇక్కడ కూడా కురిస్తే బావుండని కోరుకుంటున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు రైతులకు మొండిచేయి చూపిస్తున్నాయి. ఈ సంవత్సరం అయితే పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వర్షాకాలం మొత్తంలో సరైన వర్షాలు రెండు మూడు తప్ప పెద్దగా కురవలేదు. వర్షాకాలం వెళ్ళిపోయి చలికాలం వచ్చేసింది. సాధారణంగా ఈ సమయానికి తెలంగాణలోని అన్ని చెరువులూ నీళ్ళతో కళకళలాడాలి. అయితే ఎక్కడా అలాంటి పరిస్థితి లేదు. వర్షాన్ని నమ్ముకుని పంటలను సాగుచేసే రైతులు ఈ సంవత్సరం భారీగా నష్టపోయారు. ఎంతో ఆశతో వేసిన పంటలు ఎండిపోతూ వున్నాయి. ఎండిన పంటలను చూసి ఎంతోమంది రైతుల గుండెలు పగిలిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికీ పొలాల్లో వున్న పంటలు నీటి చుక్క కోసం ఆశగా ఎదురుచూస్తు్న్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో కూడా నాలుగు వర్షపు చినుకులు పడితే రైతులు గట్టెక్కుతారు. అయితే ఏపీలో కుంభవృష్టిని కురిపిస్తున్న వరుణుడు తెలంగాణ మీద కనీస కరుణ కూడా చూపించకపోవడం రైతులకు బాధ కలిగిస్తున్న విషయం.

తెదేపా స్థానంలోకి వైకాపా ప్రవేశించాలని చూస్తోంది: వెంకయ్యనాయుడు

  గుంటూరులో నిన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం శంఖుస్థాపన కార్యక్రమ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి చురకలు వేశారు. తెదేపా-బీజేపీలు విడిపోతే తెదేపా స్థానంలోకి రాష్ట్రంలో ఒక పార్టీ (వైకాపా) ప్రవేశించాలని ఆశగా ఎదురుచూస్తోందని కానీ చంద్రబాబు నాయుడు-నరేంద్ర మోడీ జోడీ అయితేనే వేగంగా రాష్ట్రాభివృద్ధి సాధ్యం అవుతుందని ప్రజలు భావించి వారిని ఎన్నుకోన్నారనే సంగతి ఆ పార్టీ గ్రహిస్తే బాగుంటుందని అన్నారు. తెదేపా బీజేపీకి దూరం అయితే దాని స్థానంలోకి ప్రవేశించాలనే ఆ పార్టీ కోరిక ఎన్నటికీ తీరే అవకాశాలు లేవని అన్నారు. ప్రత్యేక హోదా వచ్చినా రాకపోయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి రాష్ట్రంలో అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క జిల్లాను నిర్లక్ష్యం చేయడం లేదని కానీ కొందరు రాజకీయనాయకులు తమ స్వార్ద రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రజలను రెచ్చగొడుతున్నారని అటువంటి ప్రయత్నాలు మానుకోవాలని వెంకయ్య నాయుడు హితవు పలికారు.

ఉప ఎన్నికలలో వైకాపా పోటీ పరమార్ధం అది కూడా?

  తెలంగాణా రాష్ట్రంలో కూడా వైకాపా ఉన్నప్పటికీ అది ఏనాడూ ప్రజా సమస్యలపై తెరాస ప్రభుత్వానికి వాటిరేకంగా పోరాడలేదు. ఆ రెండు పార్టీలకు మధ్య ఉన్న రహస్య అనుబంధమే దానిని నోరు విప్పనీయలేదని చెప్పవచ్చును. ఆ రెండు పార్టీల మధ్య చక్కటి, చిక్కటి అనుబంధానికి చిహ్నంగా శాసనమండలి ఎన్నికలలో తెరాసకు వైకాపా మద్దతు ఈయడం కనిపిస్తోంది. కానీ దాని వలన ఆంధ్రాలో పార్టీ పట్ల వ్యతిరేకత ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, రాష్ట్రానికి, ప్రజల ప్రయోజనాలకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తెరాస ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినందుకు ఆంధ్రాలో వైకాపా పట్ల కొంత వ్యతిరేకత ఏర్పడిందని జగన్మోహన్ రెడ్డి సరిగ్గా గుర్తించినట్లే ఉన్నారు.   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మనుగడ సాగిస్తూ అక్కడే ఏదో ఒకనాడు అధికారంలోకి రావాలని ఆశపడుతున్న వైకాపాకు అక్కడ ప్రజలలో పార్టీ పట్ల వ్యతిరేకత ఏర్పడితే చాలా ప్రమాదం. కనుక వైకాపా కూడా తెరాసను తన శత్రువుగానే భావిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేసేందుకు లేదా మభ్యపెట్టేందుకే వైకాపా ఈ ఎన్నికలలో తెరాసకు వ్యతిరేకంగా పోటీ చేస్తోంది తప్ప ఈ ఎన్నికలో గెలుస్తామనో లేక గెలవగలమనో ఉద్దేశ్యంతో మాత్రం కాదని చెప్పవచ్చును. ఈ ఎన్నికలో పోటీ చేయడం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలలో వైకాపా పట్ల ఏర్పడిన వ్యతిరేకతను తగ్గించుకొనే ప్రయత్నం చేస్తూనే మళ్ళీ ఓట్లు చీల్చి తెరాసకు పరోక్షంగా సహాయపడటం వైకాపాకి మాత్రమే సాధ్యం.

ఉగ్రవాదంపై పోరులో ఇక భారత్ కూడా పాల్గొంటుంది

  టర్కీలో నిన్న మొదలయిన జి-20 దేశాల శిఖరాగ్ర సమావేశాలలో ఉగ్రవాదంపై పోరు ప్రధాన ఎజెండాగా సాగింది. పారిస్ పై జరిగిన ఐసిస్ ఉగ్రవాదుల దాడుల నేపధ్యంలో ఈ రెండు రోజుల సమావేశాలలో పాల్గొన్న దేశాలన్నీ నానాటికీ పెరిగిపోతున్న ఉగ్రవాదాన్ని అడ్డుకట్టవేస్తామని శపథం చేసాయి. వాటిలో భారత్ కూడా ఉండటం విశేషం.   ఉగ్రవాద భాదిత దేశాలలో ఒకటయిన భారత్, ఇంతవరకు దాని నుండి తనను తాను కాపాడుకోవడానికే ప్రయత్నిస్తోంది తప్ప ఏనాడూ దాని నిర్మూలన కోసం యూరోప్ దేశాలతో కలిసి నేరుగా రంగంలోకి దిగలేదు. భారత్ కూడా అభివృద్ధి చెందిన దేశాలతో కలిసి ఉగ్రవాదుల స్థావరాలపై సంకీర్ణ వైమానిక దాడులలో పాల్గొన్నట్లయితే, ఉగ్రవాదులు యూరోప్ దేశాలతో పాటు భారత్ పై కూడా దాడులకు తెగబడినట్లయితే, వారిని అడ్డుకోవడం కష్టమనే ఉద్దేశ్యంతోనే ఇంతకాలం భారత్ ఉగ్రవాదులపై ప్రత్యక్షపోరాటానికి వెనుకంజ వేసినట్లు భావించవచ్చును. అయినా ఉగ్రవాదుల కళ్ళు భారత్ పై కూడా పడ్డాయని కాశ్మీర్ లో రెపరెపలాడుతున్న వారి జెండాలు, చాప క్రింద నీరులా దేశం నలుమూలల చేరుతున్న వారి సానుభూతిపరులను గమనిస్తే అర్ధమవుతుంది.   ఉగ్రవాదులపై భారత్ ప్రత్యక్ష పోరాటానికి దిగినా దిగకపోయినా వారు భారత్ ని వదిలిపెట్టబోరనే విషయం స్పష్టం అవుతోంది. అందుకే జి-20 దేశాల శిఖరాగ్ర సమావేశాలలో భారత్ కూడా ఉగ్రవాదంపై పోరుకి మిగిలిన దేశాలతో చెయ్యి కలిపేందుకు సిద్దపడింది. కానీ ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా నేతృత్వంలో సంకీర్ణ వైమానిక దాడులలో భారత్ పాల్గొనదు కానీ వారికి అడ్డుకట్ట వేసేందుకు జి-20 దేశాలు చేపట్టబోయే అనేక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనబోతోంది. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి ఇది చాలా సాహసోపేతమయిన నిర్ణయమేనని చెప్పవచ్చును. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకంటే వేరే మార్గం లేదు. కానీ ఇంకా భయపడుతూ ఉగ్రవాదులను ఉపేక్షిస్తూ కూర్చోవడం అంటే పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎదుర్కొని నివారించే ప్రయత్నం చేయకుండా, భయపడి కళ్ళు మూసుకొని కూర్చోన్నట్లే అవుతుంది. అందుకే భారత్ కూడా ఉగ్రవాదంపై పోరుకి సిద్దం అవకతప్పడం లేదు.   జి-20 దేశాల మొదటి రోజు సమావేశంలో సభ్య దేశాలు, ఉగ్రవాదం పెరగడానికి దోహదపడుతున్న కొన్ని అంశాలను గుర్తించాయి. ఉగ్రవాద సంస్థలకు నిధులు, ఆయుధాలు అందకుండా అడ్డుకోవడం వాటిలో ప్రధానమయినది. ఉగ్రవాదులకు వివిధ దేశాలలో ఉన్న వాటి సానుభూతిపరుల నుండి నిధులు అందకుండా చేసేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకొన్నాయి. అదే విధంగా ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను అన్ని దేశాలకు వ్యాపించేందుకు ఇంటర్నెట్, సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించుకొంటున్నట్లు గుర్తించిన జి-20 దేశాలు వాటిని ఉగ్రవాదులు వినియోగించకుండా నిరోధించేందుకు అవసరమయిన అన్ని చర్యలు చేపట్టాలని నిర్ణయించుకొన్నాయి. ఇకపై అన్ని సభ్యదేశాలు ఒకదానికొకటి సహకరించుకొంటూ పూర్తి సమన్వయంతో ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకొన్నాయి. ఈ నిర్ణయాలను అమలు చేయడంలో భారత్ కి కొత్తగా వచ్చే ఇబ్బందులు ఏవీ ఉండబోవు కనుక భారత్ కూడా జి-20 దేశాలతో కలిసి పనిచేసేందుకు సంసిద్దత వ్యక్తం చేసింది.

బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా ఏం చేశారో!?

హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆదివారం నాడు తన పుట్టినరోజును వైభవంగా జరుపుకున్నారు. క్రీడా రంగానికి, సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు సానియా మీర్జాకి పోటీలు పడి మరీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కొంతమంది ప్రముఖులు అయితే సానియాకి పుట్టినరోజు గిఫ్టులు పంపి తమ అభిమానం చాటుకున్నారు. సానియా వాళ్ళందరికీ ట్విట్లర్లో తన కృతజ్ఞతలు తెలిపారు. తనకు లభించిన రాజీవ్ ఖేల్ రత్న ఫొటోని చూపిస్తూ ఫొటోని కూడా ట్విట్లర్లో పోస్టు చేశారు. సానియా మీర్జా మన దేశం నుంచి అంతర్జాతీయ క్రీడాకారిణిగా విజయాలు సాధించడం అభినందించదగ్గ విషయమే. ఆమెకు చాలామంది అభిమానంతో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం కూడా మంచి విషయమే... క్రీడాకారిణిగా సానియా ఓకే... మరి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆమె ఏం చేశారన్న విషయాన్ని ఆలోచిస్తే తెలంగాణ ప్రజలకు మనసు బరువెక్కక మానదు. సానియా మీర్జా ప్రతిభని గౌరవిస్తూ ఇచ్చారో, ముస్లిం ఓటర్లని మాయ చేసి, జీహెచ్ఎంసీ ఎన్నికలలో గెలవాలని ఇచ్చారోగానీ అధికారాన్ని చేపట్టగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెకు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గౌరవాన్ని ఇచ్చి, రెండు విడతలుగా రెండు కోట్ల రూపాయలు కూడా సమర్పించారు. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా కేసీఆర్ గానీ, సానియా గానీ ఎంతమాత్రం పట్టించుకోలేదు. అయితే  సానియా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ హోదా తీసుకుని, తెలంగాణ ప్రజల కష్టార్జితం రెండు కోట్లు పుచ్చుకుని దాదాపు రెండేళ్ళు అవబోతోంది. మరి ఈ కాలంలో సానియా టెన్నిస్ ఆడటం మినహా తెలంగాణ కోసం ఏం చేశారనే ప్రశ్నకు సమాధానం దొరకదు. 

బాబోయ్... స్వచ్ఛ ‘భార’త్

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ‘స్వచ్ఛ భారత్’  అనే కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు జనం చాలా బావుందని అనుకున్నారు. మన దేశాన్ని మనం శుభ్రంగా వుంచుకోవాలనే కాన్సెప్ట్ మంచిదే కదా. ప్రధాని పిలుపుకు స్పందించి చాలామంది జనం, రాజకీయ నాయకులు చీపురు పట్టుకుని రోడ్డు మీదకు వచ్చి దుమ్ము రేపారు. ప్రధాని ఇచ్చిన పిలుపుతో దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నాయి. దేశంలోని చాలా ఊళ్ళు, పట్టణాలు, నగరాల ముందు ‘స్వచ్ఛ’ అనే పేరు తగిలించేసి రోడ్లు ఊడ్వటం, ఫొటోలకు పోజులు ఇవ్వడం రెగ్యులర్‌గా జరుగుతున్నాయి. ఇంతవరకూ బాగానే వుంది. ఇప్పుడు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం జనం జేబులకు భారంగా మారింది... అదే జనాలందరూ బాబోయ్ అనేలా చేస్తోంది. నానా తంటాలు పడి, అన్ని రకాల టాక్సులూ కట్టి  జనం సంపాదించుకున్న డబ్బును ప్రభుత్వం మళ్ళీ రకరకాల టాక్సులతో లాక్కుంటోందన్న అభిప్రాయాలు వున్నాయి. అన్ని టాక్సులకు తోడు ఇప్పుడు 14 శాతం సర్వీస్ టాక్స్‌ని కూడా వసూలు చేస్తున్నారు. ఇప్పడు ఆ సర్వీస్ టాక్స్‌కి ‘స్వచ్ఛ భారత్ సెస్’ పేరిటో మరో .5 శాతం కలిపి మొత్తం 14.5 శాతం సర్వీస్ టాక్స్ వసూలు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించడం దేశం మొత్తం ఒక్కసారిగా కెవ్వుమనేలా చేసింది. స్వచ్ఛభారత్ అంటే శ్రమదానమే అనుకున్నాం గానీ, ఇలా సంపాదనను కూడా దానం చేయాల్సి వస్తుందని ఊహించలేదని జనం అనుకుంటున్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రజల్ని కూడా భాగస్వాములను చేస్తామని ప్రభుత్వం అంటూవుంటే ఇంకేంటో అనుకున్నాం... ఇలా జేబులోంచి డబ్బు లాగేసి ఆర్థికంగా కూడా భాగస్వాములను చేస్తారని ఊహించలేదని జనం అనుకుంటున్నారు. స్వచ్ఛ భారత్ అంటే వీధులను క్లీన్ చేయడం అనుకున్నాం గానీ, తమ జేబులను కూడా క్లీన్ చేయడం అనుకోలేదని అంటున్నారు.

కాంగ్రెస్ మెడ మీద గుదిబండలు

పాతాళానికి పడిపోయిన కాంగ్రెస్ పార్టీ తిరిగి నిలదొక్కుకుని తలెత్తి చూడాలంటే ఎన్నెన్నో సమస్యలు. తల ఎత్తనివ్వకుండా మెడమీద ఎన్నో గుదిబండలు. వంద సంవత్సరాలకు పైగా వున్న చరిత్ర వున్న కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలకు పైగా చరిత్ర వున్న నాయకులు ఎందరో వున్నారు. తలలు పడిపోయిన నాయకులు మాత్రమే కాదు... నడవటానికి కూడా వీలు లేని వృద్ధ నాయకులు ఎంతోమంది వున్నారు. వాళ్ళు ఏ సమయంలో ఎలాగైనా మాట్లాడగలరు. తమ వ్యాఖ్యలతో ప్రజలను మాత్రమే కాదు.. పార్టీని కూడా ఇబ్బంది పెట్టగలరు.  కానీ ఎవరెన్ని రకాలుగా మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ లైట్‌గా తీసుకుంటుంది... అదే కాంగ్రెస్ పార్టీలో వున్న విచిత్రమైన పరిస్థితి. కాంగ్రెస్ నాయకులు మాత్రం దీనిని అంతర్గత ప్రజాస్వామ్యం అనుకుంటూ వుంటారు. అలా అంతర్గత ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ వున్న వేలాది మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులలో అందరూ ఎమ్మెస్ అని పిలుచుకునే ఎం.సత్యనారాయణ కూడా ఒకరు. చాలాకాలంగా రెస్టు తీసుకుంటున్న ఆయన ఇప్పుడు మళ్ళీ బయటకి వచ్చి చేసిన కామెంట్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ తీసేలా మారాయి. వరంగల్ ఉప ఎన్నికల పోరులో కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా విజయం సాధించాలని తంటాలు పడుతోంది. పార్లమెంటు తలుపులు మూసీ, ఎంపీలను చావబాది మరీ తెలంగాణ ఇచ్చినప్పటికీ తమకు తెలంగాణలో అధికారం రాలేదన్న బాధలో టీ కాంగ్రెస్ వుంది. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ప్రజల్లో వున్న వ్యతిరేకతను ప్రజలకు భూతద్దంలో చూపించి వరంగల్ పార్లమెంట్ స్థానం ఉప ఎన్నికలలో విజయం సాధించాలని ఉవ్విళ్ళూరుతోంది. అసలే బలమైన అభ్యర్థి అనుకున్న రాజయ్య కుటుంబ సమస్యల కారణంగా జైల్లో పడ్డాడు. ఆయన స్థానంలో సర్వే సత్యనారాయణను పట్టుకొచ్చి కాంగ్రెస్ పార్టీ వరంగల్‌లో తంటాలు పడుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పాలన బాగుందని అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎమ్మెస్ చేసిన వ్యాఖ్యలు టీ కాంగ్రెస్ నాయకుల నెత్తిన పిడుగులా మారాయి. ఓవైపు తామంతా టీఆర్ఎస్‌ని ఎండగడుతూ వుంటే, ఎమ్మెస్ చాలా ప్రశాంతంగా టీఆర్ఎస్ పాలన బాగుందని అనడం వరంగల్ ఓటర్ల మీద బాగా ప్రభావం చూపించే అవకాశం వుందని భయపడుతున్నారు. ఇలా మాట్లాడారంటూ ఎమ్మెస్ మీద అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఒరిగేదేమీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఆయన్ని సస్సెండ్ చేసిన ఆయన పెద్దగా ఫీలయ్యేది కూడా ఏమీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వరంగల్ గండం నుంచి గట్టెక్కేది ఎలా దేవుడా అని టీ కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకున్నారు.

వరంగల్: ఒక దెబ్బ... రెండు పిట్టలు

రాజకీయ నాయకులు రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి, అధికారంలోకి రావడానికి రకరకాల ప్లాన్స్ వేస్తూ వుంటారు. వాటిలో కొన్ని సక్సెస్ అవుతూ వుంటాయి. కొన్ని ఫెయిలవుతూ వుంటాయి. అనుభవం తక్కువ, ఆవేశం ఎక్కువ వున్న వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి తండ్రిచాటు బిడ్డగా వున్నంతవరకూ ఓకే... ఆ తర్వాతే రాజకీయంగా ఏ ప్లాన్ వేసినా సక్సెస్ కావడం లేదు. ఎన్ని ప్లాన్లు సక్సెస్ కాకపోయినా మొక్కవోని దీక్షతో ప్లాన్లమీద ప్లాన్లు వేస్తూ ముందుకు వెళ్తున్న ఆయన మనోనిబ్బరానికి హేట్సాఫ్ చెప్పాలి. గత కొంతకాలంగా టీఆర్ఎస్‌కి బాహాటంగా మద్దతు ఇవ్వడం ద్వారా వైసీపీ ఏపీలో ప్రజల ఆగ్రహానికి గురైంది. టీఆర్ఎస్‌కి బాహాటంగా మద్దతు ఇవ్వడం అంటే ఏపీలో కొరివితో తల గోక్కున్నట్టే అని అర్థమైన జగన్ సార్ నష్ట నివారణకు సరైన అవకాశం కోసం ఎదురుచూశారు. ఆయనకు దొరికిన మంచి అవకాశం వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక. అటు టిఆర్ఎస్‌కి హెల్ప్ చేయడంతోపాటు ఇటు ఏపీలో తాను టీఆర్ఎస్‌కి వ్యతిరేకమని ప్రచారం చేసుకోవడానికి వీలుగా ఒకే దెబ్బకు రెండు పిట్టల్లాంటి అవకాశమిది. వరంగల్ పార్లమెంట్ ఎన్నికలలో అధికార టీఆర్ఎస్‌ని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీతోపాటు టీడీపీ - బీజేపీ కూటమి కూడా చాలా పట్టుదలతో కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్‌లో ప్రతిపక్షాలకు పడే ఓట్లను చీల్చడానికి మరో పార్టీ సహాయం అవసరం. అందుకే కేసీఆర్ - జగన్ మధ్య జరిగిన లోపాయికారీ ఒప్పందం ఫలితంగానే వైసీపీ వరంగల్‌లో పోటీకి దిగిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇలా పోటీ చేయడం ద్వారా టీఆర్ఎస్‌ విజయానికి తనవంతు సహకారం అందించడంతోపాటు... చూశారా.. మా పార్టీ టీఆర్ఎస్ మిత్రపార్టీ కాదు... మొన్న వరంగల్ ఎన్నికలలో కూడా టీఆర్ఎస్‌కి వ్యతిరేకంగా పోటీ చేశాం... అని ఏపీలో చెప్పుకోవడానికి వీలు కలుగుతుందనేది వైసీపీ ప్లాన్ అని పరిశీలకులు అంటున్నారు. మొత్తానికి భలే ప్లాను.. ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందా... వికటిస్తుందా అనేది కాలమే తేల్చుతుంది.

‘సీమ’ ఉద్యమంపై కోస్తా సీరియస్

ఏపీలో అధికారం సాధించలేక, తెలంగాణలో అడ్రస్ లేక కునారిల్లుతున్న వైసీపీ సంధించిన కొత్త అస్త్రం ప్రత్యేక రాయలసీమ. అది కూడా సొంత బ్యానర్‌ మీద ఉద్యమం చేసే ధైర్యం లేక మైసూరారెడ్డిని ముందుకు నెట్టి ప్రారంభించిన ఉద్యమం ప్రత్యేక రాయలసీమ ఉద్యమం అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాయలసీమ సాధన సమితి పేరుతో ఉద్యమం ప్రారంభించబోతున్నానని, రాయలసీమలోని రాజకీయ శక్తులన్నిటినీ ఏకం చేయబోతున్నానని మైసూరారెడ్డి  ప్రకటించిన తర్వాత వివిధ పార్టీల్లో వున్న కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ఆయన వెంట నడవటానికి సిద్ధమయ్యారు. కానీ ఆ తర్వాత మైసూరా ఈ ఉద్యమం గురించి చప్పుడు చేయడం లేదు. అయితే కొంతమంది రాజకీయ పరిశీలకులు మాత్రం తనకు ఉద్యమం చేసే శక్తి లేదని అర్థం చేసుకున్న మైసూరా  చల్లబడ్డారని అంటున్నారు. ఆయన చల్లబడ్డా, ఎలావున్నా, రాయలసీమ ఉద్యమం పేరుతో రాయలసీమ జిల్లాల లిస్టులో ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కూడా చేర్చడం పట్ల ఆ జిల్లాలలోని ప్రజలు చాలా సీరియస్‌గా వున్నారు. ప్రస్తుతం వున్న రాయలసీమ జిల్లాలతోపాటు కోస్తాలో వున్న ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కూడా కలిపి ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ తలపెట్టిన ఉద్యమానికి రాయలసీమలో ఆదరణ  లభించడం లేదు. అదలా వుంచితే, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఆగ్రహాన్ని రగిలిస్తోంది. రాష్ట్ర విభజన కారణంగా హృదయాలు గాయపడి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని మరోసారి కల్లోలంలోకి నెట్టే ప్రయత్నాలను సహించబోమని ప్రజలు అంటున్నారు. రాయలసీమకు ఎంతో ప్రాధాన్యం లభిస్తున్న ఈ తరుణంలో ఇలాంటి రాజకీయ ఉద్యమాలు చేసి ప్రశాంత వాతావరణాన్ని భంగం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు ప్రజలయితే మరింత ఆగ్రహంగా వున్నారు. తమ రెండు జిల్లాలను కూడా రాయలసీమలో కలపాలని అనడం వెనుక ఉన్నది సముద్ర తీరాన్ని కూడా ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతోనే తప్ప మరోటి కాదని అంటున్నారు. అసలు తమ రెండు జిల్లాలను రాయలసీమలో కలపాలన్న ఆలోచనే అపరిపక్వంగా వుందని వారు విమర్శిస్తున్నారు. ఇలాంటి ఉద్యమాలు చేసుకుంటే చేసుకోండి... ఊరుకుంటే ఊరుకోండిగానీ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా విభజన చిచ్చు పెడితే సహించబోమని హెచ్చరిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీకి ఎం.ఎస్.దెబ్బ

  నోరు విప్పి మాట్లాడితే ఏదో ఒక వివాదం రేకెత్తించే నేతలలో మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత ఎమ్.సత్యనారాయణరావు కూడా ఒకరు. ఆయన మీడియాలో కనిపించి చాలా కాలమే అయ్యింది. కానీ లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తానన్నట్లు, మీడియా ముందుకు వచ్చి రావడంతోనే కాంగ్రెస్ పార్టీలో బాంబులు పేల్చి అందరినీ హడాలెత్తించారు. సరిగ్గా వరంగల్ ఉప ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అభ్యర్ధి రాజయ్య జైలు పాలవడంతో ఆయనకి బదులు సర్వే సత్యనారాయణని నిలబెట్టి ఆయనని గెలిపించుకొనేందుకు కాంగ్రెస్ నేతలందరూ చాలా ఆపసోపాలు పడుతుంటే, అకస్మాత్తుగా ఊడిపడిన ఎమ్.సత్యనారాయణరావు తెరాస ప్రభుత్వం దాని ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరును తెగ మెచ్చుకొన్నారు.   తెరాస ప్రభుత్వం చేపట్టిన గ్రామజ్యోతి తదితర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా అయన తెగ మెచ్చుకొని తెలంగాణా రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ బాగానే కృషి చేస్తున్నారని మెచ్చుకొన్నారు. కానీ కొంచెం దూకుడు తగ్గించుకొని ప్రతిపక్షాలని కూడా తనతో కలుపుకుపోవాలని సూచించారు. అలాగే ప్రతిపక్షాలు కూడా తెరాస ప్రభుత్వాన్ని ఏదో విమర్శించాలి గాబట్టి విమర్శిస్తున్నాయి తప్ప నిజంగా విమర్శించవలసినంత తప్పులు ఏమీ కనబడటం లేదని అభిప్రాయం వ్యక్తం చేసారు. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి నిర్మాణాత్మకమయిన సలహాలు ఇవ్వాలి తప్ప ఊరికే ప్రతీ దానికి ప్రభుత్వాన్ని విమర్శించకూడదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసారు. వరంగల్ ఉప ఎన్నికలలో ఎవరికీ ఓట్లు వేయాలో ప్రజలకి తెలుసని, బహుశః బిహార్ ఎన్నికల ఫలితాలు మళ్ళీ ఇక్కడ కూడా పునరావృతం అవుతాయని అభిప్రాయ పడ్డారు.   సరిగా వరంగల్ ఉప ఎన్నికలు జరిగే ముందు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత నుండి ఆటువంటి కితాబు అందుకోవడం తెరాసకు ఒక వరమనే చెప్పవచ్చును. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు తమపై చేస్తున్న విమర్శలకు జవాబుగా తెరాస నేతలు సత్యనారాయణ తమ ప్రభుత్వం గురించి వెలిబుచ్చిన అభిప్రాయాలనే పేర్కొనడం తధ్యం. తెరాస నేతలు వరంగల్ ప్రజలకు నచ్చజెప్పడానికి కూడా సత్యనారాయణ చెప్పిన మాటలను ఉపయోగించుకోవచ్చును.   కాంగ్రెస్ నేతలందరూ కలిసికట్టుగా తెరాస ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును తప్పు పడుతుంటే కాంగ్రెస్ పార్టీకే చెందిన సత్యనారాయణ తెరాస ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఈవిధంగా వెనకేసుకొని రావడంతో వారు చాలా ఇబ్బంది పడుతున్నారు.  బిహార్ ఎన్నికలలో అధికార కూటమి విజయం సాధించింది కనుక వరంగల్ ఎన్నికలలో కూడా అధికార తెరాస గెలుస్తుందని ఆయన జోస్యం చెపుతున్నారేమోనని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.ఈ ఉప ఎన్నికలలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తామని బల్లగుద్ది చెప్పిన రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజయ్య ఇంట్లో జరిగిన దుర్ఘటనప్పటి నుండి నేటి వరకు వరుసగా జరుగుతున్న ఈ పరిణామలన్నిటినీ చూసి ఇప్పుడు అదే మాట గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఇటువంటి సమయంలో సత్యనారాయణ వచ్చి తన మాటలతో కాంగ్రెస్ విజయావకాశాలను మరింత దెబ్బ తీశారని  కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు.

వైకాపా అభ్యర్ధికి ఓటేస్తే పార్టీలో ఉంటారో జంప్ చేస్తారో?

  వరంగల్ ఉప ఎన్నికలలో వైకాపా అభ్యర్ధిగా నల్లా సూర్యప్రకాష్ పోటీ చేస్తున్నారు. ఆయన తరపున ప్రచారం చేస్తున్న వైకాపా ఎమ్మెల్యే రోజా, “రాజన్న రాజ్యం కావాలంటే వైకాపా అభ్యర్ధికే ఓటు వేసి గెలిపించాలని” ప్రజలను కోరుతున్నారు. ఆ ఒక్కడి వలన రాజన్న రాజ్యం ఎలా సాధ్యమో తెలియదు కానీ ఏదో ఒకరోజు ఆయన కూడా తెరాస పార్టీలోకి జంప్ చేసేయడం మాత్రం ఖాయమని కాంగ్రెస్, తెదేపా, బీజేపీ నేతలు వాదిస్తున్నారు. ఇంతకాలం ప్రజా సమస్యలపై నోరు విప్పి మాట్లాడటానికి కూడా ఇష్టపడని వైకాపా నేతలు, ఇప్పుడు తెరాస ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ని విమర్శించడం చాలా ఆశ్చర్యంగా ఉంది.   అప్పుడెప్పుడో రాజశేఖ రెడ్డి అమలుచేసిన పధకాలే తప్ప తెరాస ప్రభుత్వం కొత్తగా అమలుచేసినవి ఒక్కటి కూడా లేవని రోజా విమర్శించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి పాలించిన ముఖ్యమంత్రులలో రాజశేఖర్ రెడ్డి ఒక్కరే చాలా ప్రజారంజకమయిన పరిపాలన చేసారని రోజా అన్నారు. కేసీఆర్ కి మాయమాటలు చెపుతూ ప్రజలను మభ్య పెట్టడం తప్ప అభివృద్ధి, సంక్షేమ పధకాలు అమలుచేయడం చేతకాదని రోజా విమర్శించారు. ఆంద్రాలో చంద్రబాబు, తెలంగాణాలో చంద్రశేఖర్ రావు ఇద్దరూ కూడా ప్రజలను మభ్య పెట్టడంలో ఒకరికొకరు ఏమాత్రం తీసిపోరని రోజా ఎద్దేవా చేసారు. ఇంతవరకు తెలంగాణాలో వైకాపా నేతలు ఎన్నడూ కూడా రైతుల ఆత్మహత్యలు గురించి నోరు విప్పి మాట్లాడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకు మాట్లాడలేదో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు రోజా తెలంగాణాలో 1400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొంటే తెరాస ప్రభుత్వం పట్టించుకాలేదని విమర్శించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. రోజా ప్రచారం చూస్తుంటే తెరాస-వైకాపాలు రెండు బద్ధ శత్రువులన్నట్లుగా ఉంది. కానీ ఈ ఎన్నికలలో గెలిచే అవకాశం ఏ మాత్రం లేదని తెలిసున్నప్పటికీ వైకాపా పోటీ చేస్తుండటం గమనిస్తే అది కేవలం ఓట్లు చీల్చి ఇప్పుడు తను విమర్శిస్తున్న తెరాసకు లబ్ది చేకూర్చడానికే తప్ప మరో ప్రయోజనం కనబడటం లేదు.

బీజేపీకి బెంగాల్ బెంగ

బీహార్ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ పరిస్థితి చీమ చిటుక్కుమన్నా ఉలిక్కిపడేలా వుంది. ప్రస్తుతం బీజేపీలో బీహార్ పరాజయానికి ఎవరిని బాధ్యులను  చేయాలా అన్న చర్చ భారీ స్థాయిలో జరుగుతోంది. మోడీనే పూర్తి బాధ్యుడిని చేయాలని ఒక వర్గం ప్రయత్నిస్తుంటే, ఇది మోడీ వైఫల్యం కాదని... ఈ పరాజయాన్ని సమష్టి బాధ్యతగా తీసుకోవాలని మరో వర్గం అంటోంది. ఈ అంతర్గత పోరు విషయం ఇలా వుంటే ఇప్పుడు బీజేపీకి బెంగాల్ బెంగ వచ్చి పడింది. బీహార్, బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు వరుసగా ఎన్నికలు జరుగుతాయి. బీహార్ పోరు ముగిసింది. ఫలితం తేలి బీజేపీ నెత్తిన బొప్పి కట్టింది. బీహార్లో విజయం సాధిస్తే బెంగాల్ ఎన్నికలలో బీజేపీ తీరు ఒకలా వుండేది. బీహార్లో ఓడిపోవడంతో ఇప్పుడు బెంగాల్లో ఆ పార్టీ తీరు మరోలా వుండబోతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు బీజేపీకి బెంగాల్ బెంగ పట్టుకుందని చెబుతున్నారు. ప్రచారం విషయంలో బీహార్‌లో వ్యవహరించిన తీరుకు పూర్తి విరుద్ధంగా బెంగాల్‌లో వ్యవహరించాల్సి వుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు  అమిత్ షా ఈనెల 30న కోల్‌కతాలో ఒక ర్యాలీ నిర్వహించాల్సి వుంది. బీహార్ ఎన్నికల్లో పరాజయానికి ముందు ఏర్పాటు చేసిన ర్యాలీ ఇది. అయితే బీహార్ ఓటమి తర్వాత ప్రచార వ్యూహంలో వచ్చిన మార్పు నేపథ్యంలో అమిత్ షా ర్యాలీని బీజేపీ వర్గాలు రద్దుచేశాయి. ప్రచార వ్యూహంలో మార్పే ఈ ర్యాలీ రద్దుకు కారణాలన్నది బహిరంగ రహస్యమైనప్పటికీ స్థానిక బీజేపీ వర్గాలు మాత్రం అలాంటిదేమీ లేదు... డిసెంబర్లో ఆరేడు పెద్ద స్థాయి ర్యాలీలు నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. అందువల్ల ఆ ర్యాలీలకు ముందుగా మరో ర్యాలీ ఎందుకులే అని రద్దు చేశామని బెంగాల్ అంటున్నాయి. మొత్తానికి బెంగాల్ ఎన్నికలలో బీజేపీ సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్ళాలని భావిస్తున్నట్టు సమాచారం. ఆ వ్యూహాలేంటో త్వరలో అందరం చూస్తాం.  

ఏపీ బీజేపీ కంటే టీఎస్ బీజేపీయే నయమా?

భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి మధ్య స్నేహం గత ఎన్నికల నుంచి కొనసాగుతోంది. కేంద్రంలో బీజేపీ తన మిత్రధర్మాన్ని పాటిస్తూ తనకు పూర్తి మెజారిటీ వున్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి కూడా మంత్రి పదవులు ఇచ్చింది. ఏపీలో కూడా టీడీపీ బీజేపీ నాయకులకు మంత్రి పదవులు ఇచ్చింది. ఈ స్నేహం ఇలాగా కొనసాగుతూ వుంటే చూడముచ్చటగా వుంటుంది. కానీ ఏపీ బీజేపీలో కనిపిస్తున్న ధోరణులు స్నేహధర్మానికి విరుద్ధంగా వున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీ బీజేపీ నాయకులు చేస్తున్న ‘మిత్రభేద’ పనులు కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జరుగుతున్నాయా, లేక ఏపీలో బీజేపీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ఇక్కడి నాయకులే అలా వ్యవహరిస్తున్నారా అన్న విషయాలను అలా వుంచితే ఏపీ బీజేపీ టీడీపీ విషయంలో స్నేహితుడిలా వ్యవహరించడం లేదన్నది స్పష్టమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సోము వీర్రాజు లాంటి నాయకుల నోటి వెంట నుంచి వస్తున్న మాటలు స్నేహాన్ని తుంచేలా వున్నాయే తప్ప పెంచేలా లేవన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. టీడీపీతో స్నేహం విషయంలో ఏపీ బీజేపీ కంటే తెలంగాణ బీజేపీయే చాలా నయమని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ బీజేపీలోని నాయకత్వానికి బీజేపీ టీడీపీతో స్నేహం చేయడం మొదట్లో ఇష్టం లేదు. అయితే  ఆ తర్వాత వారి ధోరణిలో మార్పు వచ్చింది. ఇప్పుడు తెలంగాణ బీజేపీ - టీడీపీల మధ్య సహకార ధోరణి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అధికార టీఆర్ఎస్ మీద పోరాటం చేసే విషయంలో ఈ రెండు పార్టీలూ ఐక్యతను ప్రదర్శిస్తున్నాయి. అలాగే త్వరలో జరగబోతున్న వరంగల్ ఉప ఎన్నికల విషయంలో కూడా ఈ రెండుపార్టీల మధ్య మంచి కో ఆర్డినేషన్ వుంది. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించే విషయంలో రెండు పార్టీలూ నిరంతరం చర్చించుకుంటూ స్నేహపూర్వకంగా ముందుకు వెళ్తున్నాయి. తెలంగాణలో పరిస్థితి అలా వుంటే, ఏపీలో మాత్రం మిత్రపక్షంగా వుంటూ, మంత్రివర్గంలో వుంటూ ప్రభుత్వం మీదే విమర్శలు చేసే స్థాయిలో బీజేపీ ‘స్నేహపూర్వక ధోరణి’ వుంది. ఈ విషయంలో తెలంగాణ బీజేపీ నుంచి ఏపీ బీజేపీ నేర్చుకోవాల్సింది చాలా వుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

తలసాని వారి కన్ఫ్యూజనేంటో...!

  తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర రాజకీయాలలో క్రియేట్ చేసిన కన్‌ఫ్యూజన్ తలలు పండిన రాజకీయ పరిశీలకులకే అర్థం కాని విధంగా వుందని విశ్లేషకులు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ద్వారా శాసనసభకు ఎన్నికైన ఆయన ఆ తర్వాత ఎంచక్కా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసేసి టీఆర్ఎస్‌లో చేరిపోయి మంత్రి అయ్యారు. అయితే ఆయన రాజీనామా విషయమే అంతు చిక్కకుండా వుంది. ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేశారని, ఆ రాజీనామా లేఖను స్పీకర్‌కి ఇచ్చారని అంటారు. స్పీకర్ కార్యాలయమేమో రాజీనామా మా దగ్గర లేదని అంటుంది. అయితే ఆ లేఖను స్పీకర్ తన దగ్గరే ఉంచుకున్నారన్నమాట అని ఎవరికి వారు సమాధానం చెప్పుకుంటున్న పరిస్థితి. ఆయన రాజీనామా చేసి చాలా నెలలు అయిపోయినప్పటికీ ఆ రాజీనామాను స్పీకర్ ఎందుకు ఆమోదించడం లేదనేది ఎవరికీ అర్థం కాని విషయం. ఒక ఎమ్మెల్యే చేసిన రాజీనామాను స్పీకర్ ఆమోదించకుండా ఎందుకు తనదగ్గరే వుంచుకున్నారన్న ప్రశ్నకు ఎవరి నుంచీ సమాధానం లభించడం లేదు. ప్రతిపక్షాలేమో రాజీనామా చేసిన వ్యక్తి ఇంతకాలం మంత్రిగా కొనసాగడం రాజ్యాంగ విరుద్ధం అని మొత్తుకుంటున్నాయి. అయితే ఆ మొత్తుకోళ్ళను వినేవాళ్ళు ఎవరూ కనిపించడం లేదు. రాజ్యాంగంలో వున్న లొసుగులను, స్పీకర్‌కి వుండే విశేషాధికారాలను అధికార పార్టీ చాలా చాకచక్యంగా వినియోగించుకుంటూ రాష్ట్ర రాజకీయాల్లో కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక పౌరుడు కోర్టులో వేసిన కేసు ఈ అంశాన్ని ఒక కొలిక్కి తెచ్చేలా వుంది. అసలు తమరి విషయం మీద క్లారిటీ ఇస్తారా అంటూ కోర్టు తలసాని శ్రీనివాస్ యాదవ్‌కి నోటీసులు జారీ చేసింది. కోర్టు నోటీసులకు తలసాని ఇచ్చే సమాధానం అయినా ఈ విషయంలో రాజకీయ వర్గాల్లో నెలకొన్న కన్ఫ్యూజన్ని తొలగిస్తుందని ఆశించాలని పరిశీలకులు అంటున్నారు.

పంచె కట్టుకొచ్చాడు... పంచ్‌లు వేయలేదు

  కథానాయకుడు, జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని గురువారం నాడు విజయవాడలో కలవటం, రెండు గంటలకు పైగా ఆయనతో భేటీ కావడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ముఖ్యంగా మీడియాకి బాగా ఫుడ్డు దొరికింది. వీళ్ళ భేటీనే ఒక ముఖ్యమైన అంశం అయితే, ఈ భేటికి పవన్ కళ్యాణ్ ఫుల్ గ్లామర్‌తో అది కూడా తెలుగు సంప్రదాయానికి ప్రతీక అయిన పంచెకట్టుతో రావడం ఈ అంశానికి మరింత గ్లామర్ని చేకూర్చింది. సాధారణంగా పవన్ కళ్యాణ్ రాజకీయాలకు సంబంధించిన మీటింగ్స్‌లో పాల్గొనడానికి వచ్చినప్పుడు బారుగా పెరిగిన గడ్డంతో, గజిబిజిగా వున్న బట్టలతో డీ గ్లామర్‌గా కనిపించేవాడు. అయితే చంద్రాబాబుతో భేటీకి మాత్రం ఫుల్ గ్లామర్‌గా, పంచెకట్టుతో రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.   మొన్నామధ్య అమరావతి ప్రాంత రైతులను కలవటానికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ చాలా ఆవేశంగా మాట్లాడి, ప్రభుత్వం మీద పంచ్‌లు వేశాడు. ఆయితే ఆ మర్నాడు నాలుక్కరుచుకుని వివరణలు ఇచ్చుకున్నాడు అది వేరేసంగతి. ఇప్పుడు చంద్రబాబుతో భేటీ అయి బయటకి వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఏవైనా పంచ్‌లు వేసి హాట్ హాట్ వాతావరణం సృష్టిస్తారేమోనని చాలామంది అనుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పంచె అయితే కట్టుకుని వచ్చాడుగానీ, పంచ్‌లు మాత్రం వేయలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో చాలా సానుకూల ధోరణితో వున్నట్టు మాట్లాడాడు. ఈ ధోరణిని చూస్తుంటే పవన్ కళ్యాణ్‌లో రాజకీయ పరిపక్వత పెరుగుతున్నట్టే వుందన్న అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

వరంగల్‌లో పవన్ కళ్యాణ్ ప్రచారం?

  వరంగల్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతున్న నేపథ్యంలో అక్కడ అన్ని పార్టీలూ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. అధికార పార్టీతో సహా అన్ని పార్టీలూ ఈ స్థానంలో తమ విజయం ఖాయమని కుండబద్దలు కొట్టి మరీ చెబుతున్నాయి. చివరికి తెలంగాణలో ఉనికేలేని వైసీపీ కూడా వరంగల్ స్థానం మాదేనని సగర్వంగా చెబుతూ వుండటం విశేషం. పోలింగ్ తేదీ ముంచుకుని వస్తూ వుండటంతో పార్టీలన్ని ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. టీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నాయకులందరూ వరంగల్‌లోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. అయితే వారికి ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ, బీజేపీ - టీడీపీ అభ్యర్థి దేవయ్య కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. వైసీపీ తరఫున సినీ నటి రోజా మొన్ననే వరంగల్ నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో తమ ప్రచారానికి సినీ గ్లామర్ కూడా జోడిస్తే మంచిగా వుంటుందని టీడీపీ, బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలో తమ తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారంలోకి వచ్చే అవకాశం వుందని ఆ పార్టీల వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు బీజేపీ కేంద్ర నాయకత్వం, తెలుగుదేశం అగ్ర నాయకత్వం పవన్ కళ్యాణ్‌తో సంప్రదింపులు కూడా ప్రారంభించేశారని, రేపో మాపో పవన్ కళ్యాణ్ ప్రచారానికి ఓకే అని రంగంలోకి దిగే అవకాశం వుందని టీడీపీ - బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. గురువారం నాడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలసిన పవన్ కళ్యాణ్ చాలా సానుకూల ధోరణిలో కనిపించారు. దీన్ని తమ పార్టీలకు అనుకూలంగా మలచుకుని టీడీపీ - బీజేపీకిలకు వరంగల్‌లో ప్రచారం కోసం దించాలన్న ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. 2014 సాధారణ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ టీడీపీ - బీజేపీ తరఫున ప్రచారం చేసిన విషయం తెలిసిందే.

మయన్మార్‌లో మరోసారి సైనిక తిరుగుబాటు?

మయన్మార్‌లో మరోసారి సైనిక తిరుగుబాటు జరిగే అవకాశం వుందా? ఆ దేశ ప్రముఖ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీని మళ్ళీ గృహ నిర్బంధం చేసే అవకాశం వుందా అనే ప్రశ్నలకు ‘‘అలా జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అలా జరగకపోతే మయన్మార్’కి మంచి రోజులు వచ్చినట్టే అనే సమాధానం అంతర్జాతీయ రాజకీయ పరిశీలకుల నుంచి వస్తోంది. ప్రస్తుతం మయన్మార్‌లో సైనిక పాలన సాగుతోంది. మయన్మార్‌కి చుట్టూ వున్న దేశాల్లో ప్రజాస్వామ్యం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. పక్కన అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియా వుంది. అయినప్పటికీ ఇప్పటికీ మయన్మార్‌లో సైనిక పాలన సాగుతోంది. సైనికులు ‘రంగూన్ రౌడీ’ల తరహాలో పనిపాలన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ దేశంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల నిర్వహించక తప్పని పరిస్థితి ఆ దేశ సైనిక పాలకుడు థీన్ సేన్‌కి తప్పలేదు. అనేకమంది మిలటరీ అధికారులతోపాటు ఆ దేశంలో ఎప్పటినుంచో ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేస్తూ ఎన్నో ఏళ్ళు గృహ నిర్బంధాన్ని ఎదుర్కొన్న ఆగ్ సాన్ సూకీకి చెందిన ఎన్ఎల్‌డి పార్టీ మయన్మార్ ఎన్నికల బరిలో దిగింది. ఈ ఎన్నికలలో సూకీ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రభుత్వం స్థాపించడానికి అసవరమైన పూర్తి మెజారిటీని సూకీ పార్టీ సాధించింది. అయితే అధ్యక్షుడు థీన్ సేన్ మాత్రం సైనికుల చేతులలోంచి అధికారాన్ని ప్రజల చేతుల్లోకి ఇవ్వడానికి వెనుకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. ‘‘శాంతియుతంగా అధికార బదలాయింపు చేసుకుందాం’’ అని ఆయన ప్రకటించినప్పటికీ అది ఆయన మనస్పూర్తిగా అనలేదన్న విషయం అర్థం అవుతూనే వుంది. ఇప్పటికే సూకీ ఆ దేశ అధ్యక్షురాలు కాకుండా చట్టాలు చేసేశారు. విదేశీయులను పెళ్ళాడిన వాళ్ళు ఈ దేశంలో అత్యున్నత పదవులు అధిష్టించకూడదన్న చట్టాన్ని సైనిక ప్రభుత్వం సూకీని దృష్టిలో పెట్టుకుని ఏనాడో చేసింది. ఇప్పుడు అధికారాన్ని బదలాయించడానికి సంశయిస్తోంది. ఈ నేపథ్యంలో మయన్మార్ ప్రజల్లో అసహనం పెరిగిపోయే అవకాశం వుందని, దీన్ని సాకుగా చూపించి 1990లో మాదిరిగా మరోసారి సైనిక తిరుగుబాటు జరిపించి ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టే అవకాశాలూ వున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. అదే జరిగితే సూకీకి మరోసారి గృహ నిర్బంధం తప్పకపోవచ్చు... అప్పుడు మయన్మార్‌‌లో ప్రజాస్వామ్య స్థాపన అనే ఆశలకు నీళ్ళు వదులుకోవడమే.

పవన్ కళ్యాణ్-చంద్రబాబు నాయుడు భేటీ వివరాలు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అనంతరం ఆయన మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకి జవాబులు చెప్పారు. క్లుప్తంగా ఆ వివరాలు.   "సినిమా షూటింగ్ ఉండటంతో నేను అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి రాలేకపోయాను. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రిని అభినందించి దీపావళి శుభాకాంక్షలు తెలుపుదామని వచ్చేను. ఈ సందర్భంగా అనేక విషయాలపై మేము చర్చించేము. రాజధాని ప్రాంతంలో నా దృష్టికి వచ్చిన రైతుల సంస్యలనన్నిటినీ ముఖ్యమంత్రికి తెలియజేశాను. రైతులకు, అలాగే విశాఖ ఏజన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాల విషయంలో గిరిజనులకు నష్టం కలగని విధంగా ప్రభుత్వం వ్యవహరించాలని నేను కోరాను. అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ అంశాలపై కూడా మేము చర్చించాము. ప్రస్తుతం ఆ అంశం కేంద్రం పరిశీలనలో ఉంది. దానిపై ప్రధాని నరేంద్ర మోడీ ఒక నిర్దిష్టమయిన ప్రకటన చేసిన తరువాతనే స్పందించాలని నేను భావిస్తున్నాను. జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు ఇచ్చినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో (జి.హెచ్.ఎం.సి.) పోటీ చేసేంత ఆర్ధిక స్తోమత మాకు లేదు కనుక పోటీ చేయడం లేదు. అదే కాదు 2019వరకు వచ్చే ఏ ఎన్నికలలోనూ జనసేన పార్టీ పోటీ చేయబోదు. అప్పటికి పార్టీ నిర్మాణం పూర్తి చేసుకొని పోటీ చేస్తాము. జి.హెచ్.ఎం.సి., వరంగల్ ఉప ఎన్నికలలో తెదేపా-బీజేపీ అభ్యర్ధుల తరపున ప్రచారం చేసే విషయంపై నేను ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దాని గురించి నా సన్నిహితులతో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొంటాను,” అని చెప్పారు.   బిహార్ ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాణ్ స్పందించడానికి నిరాకరించారు. అలాగే మీడియా అడిగిన ఒక ప్రశ్నకు జవాబిస్తూ, “నిజమే నేను డిల్లీ వెళ్లి ప్రధాని మోడీగారిని కలిసి ప్రత్యేక హోదా గురించి అడగవచ్చును. ఆయన నున్సి సానుకూల స్పందన రాకపోతే అప్పుడు మనమే బాధపడాల్సి వస్తుంది. అయినా రాష్ట్రంలో ఇంతమంది ఎంపీలు మనకున్నారు. వాళ్ళు స్వయంగా ప్రధానిని కలిసి ఒత్తిడి చేస్తే ఏమయినా ఫలితం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ విషయంలో కేంద్రానికి డెడ్-లైన్ పెట్టే అంత అర్హత నాకుందని అనుకోవడం లేదు. రోడ్లేక్కి ప్రత్యేక హోదా కోసం పోరాడటం వలన ఏమీ ప్రయోజనం ఉండదు. దేనినయినా ఓపికగా సాధించుకోవాలి. ఒకవేళ ప్రధాని నరేంద్ర మోడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని ఖచ్చితం చెప్పేస్తే అప్పుడు ఏమి చేయాలో ఆలోచిస్తాను. ఈలోపుగా ప్రజలకు ఎటువంటి కష్టాలు, సమస్యలు వచ్చినా నేను వచ్చి వారి తరపున నిలబడి ప్రభుత్వంతో పోరాడుతాను,” అని తెలిపారు.