మహిళా కాంగ్రెస్ నేతలపై కేరళ నేత అభ్యంతరకర కామెంట్స్

  కేరళలో వామపక్షాలకు అనుబంధ సభ్యుడుగా వ్యవహరిస్తున్న చెరియన్ ఫిలిప్ తన ఫేస్ బుక్ లో మహిళా కాంగ్రెస్ నేతల పట్ల చాలా అసభ్యకరమయిన కామెంట్స్ చేసారు. ఇటీవల కేరళలో త్రిసూరులో కొందరు యువజన కాంగ్రెస్ నేతలు ఎన్నికలలో తమకు టికెట్స్ కేటాయించకపోవడంపై పార్టీకి నిరసన తెలియజేసేందుకు చొక్కాలు ధరించకుండా అర్ధ నగ్నంగా ఒక ర్యాలీ నిర్వహించారు. దానిపై చెరియన్ ఫిలిప్ స్పందిస్తూ “కాంగ్రెస్ పార్టీలో మహిళా నేతలు కూడా టికెట్స్ కోసం పార్టీ పెద్దలతో వ్యవహారాలు సాగించారు,” అని తన ఫేస్ బుక్ లో ఒక మెసేజ్ పోస్ట్ చేసారు.   కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలకు చెందిన నేతలు, కాంగ్రెస్ మహిళా నేతలు, మహిళా సంఘాలు ఆయన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్త చేసాయి. తక్షణమే ఆయన ఫేస్ బుక్ నుంచి తన వ్యాఖ్యలను తొలగించి, మహిళకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.   కేరళ ముఖ్యమంత్రి వి.ఎస్. అచ్యుతానందన్ దీనిపై స్పందిస్తూ “ఇటువంటి వ్యాఖ్యలు సదరు వ్యక్తుల సంస్క్రతికి అద్దం పడుతుంటాయి. సంస్కృతి, సంస్కారం ఉన్నవాళ్ళు ఎవరూ మహిళల పట్ల ఇటువంటి వ్యాఖ్యలు చేయరు. ఈ విధమయిన మాటలు మాట్లాడేవారికి ప్రజలే సరయిన బుద్ధి చెపుతారు,” అని అన్నారు.   చెరియన్ ఫిలిప్ చేసిన ఈ అభ్యంతరకర వ్యాఖ్యలని అందరూ ముక్త కంఠంతో తప్పుపడుతున్నప్పటికీ, ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పైగా తనకు నిజ నిర్ధారణ (లై డిటెక్టర్) పరీక్ష నిర్వహించవలసిందిగా ప్రభుత్వానికి సవాలు విసిరారు. తనకు పరీక్షలు నిర్వహించినట్లయితే, మహిళా కాంగ్రెస్ నేతలు ఎవరెవరు టికెట్ల కోసం సాగించిన చీకటి వ్యహారాల గురించి తన మనసులో రహస్యంగా దాగి ఉన్న రహస్యాలన్నీ బయటపడతాయని అన్నారు. దాని వలన సదరు కాంగ్రెస్ నేతలే సమాజం ముందు సిగ్గుతో తలదించుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. అంటే ఆయన మహిళా కాంగ్రెస్ నేతలపై చేస్తున్న ఆరోపణలకు పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు ద్రువీకరిస్తున్నట్లు ఉంది.   ఆయన మహిళా కాంగ్రెస్ నేతలపై తీవ్ర అభ్యంతరకర ఆరోపణలు చేస్తుంటే, దానిని అడ్డుకోవలసిన సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, “చెరియన్ ఫిలిప్ చేసిన వ్యాఖ్యలు మహిళలు అందరినీ ఉద్దేశ్యించి అన్నవి కావు. ఆయన మహిళా వ్యతిరేకి కాదు,” అని అన్నారు.

ప్రకాశంలో వైసీపీ ఎమ్మెల్యేల పక్క చూపులు

జగన్ బంధుగణం ఆధిపత్య పోరుతో ప్రకాశం జిల్లా వైసీపీ కుతకుతలాడుతోంది, ముఖ్యంగా బావ, బావమరిది మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయని చెప్పుకుంటున్నారు, వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి పంచాయితీతో వైసీపీ కొంపకొల్లేరవుతోందని, వీళ్లిద్దరి మధ్యా ఆధిపత్య పోరు పార్టీని కోలుకోలేని దెబ్బతీస్తోందంటున్నారు, రెండు ఎంపీ, పదమూడు ఎమ్మెల్యే స్థానాలున్న ప్రకాశం జిల్లాలో ఒక ఎంపీ, ఆరు ఎమ్మెల్యే సీట్లు గెలిచి ఒడ్డున పడ్డా... బావ బారమరిది పోరుతో జిల్లాలో పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతోందని అంటున్నారు. తన ఓటమికి వైవీ సుబ్బారెడ్డే కారణమని రగిలిపోతున్న బాలినేని... జిల్లా పార్టీలో వైవీ పెత్తనాన్ని తట్టుకోలేకపోతున్నారని, దాంతో ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. జగన్ జైలుకెళ్లకముందు జిల్లాలో బాలినేని హవా నడిస్తే... జైలుకెళ్లాక వైవీ సుబ్బారెడ్డి చక్రం తిప్పారని, ఇప్పుడు కూడా వైవీ ఎంత చెబితే అంత అన్నట్లు ఉందని, దాన్ని బాలినేని జీర్జించుకోలేకపోతున్నారని అంటున్నారు, బావ బావమరుదల ఎత్తుకు పైఎత్తులతో ప్రజల్లో పార్టీ ఇమేజ్ దెబ్బతింటోందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జగన్ బంధువులు వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య ఆధిపత్య పోరుతో ప్రకాశం జిల్లాలో పార్టీ నలిగిపోతుంటే, ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు పక్కచూపులు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది, ఆదిమూలపు సురేష్, పోతుల రామారావులు జగన్ వైఖరిపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని, ఏదోరోజు గోడ దూకేయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది, ఇప్పటికే తెలుగుదేశం లీడర్స్ తో టచ్ లో ఉన్నారని, త్వరలో పార్టీ మారడం ఖాయమని చెప్పుకుంటున్నారు ఇక గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బాలినేని కూడా జగన్ తీరుపై అసంతృప్తిగా ఉన్నాడని, ఎమ్మెల్సీ సీటు ఇస్తాడని ఆశలు పెట్టుకుంటే నోరు మెదపడం లేదని సన్నిహితుల దగ్గర వాపోతున్నాడట, అయితే పార్టీని చక్కదిద్దాల్సిన జగన్మోహన్ రెడ్డి... బావబావమరుదుల్లో ఎవరికీ నచ్చచెప్పలేక ఇబ్బందిపడుతున్నారని అంటున్నారు, అందుకే వీరిద్దరినీ కాదని గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారని, అయినప్పటికీ ప్రకాశం జిల్లాలో వైసీపీ పరిస్థితి గాడిలో పడలేదని చెప్పుకుంటున్నారు

అమరావతి మరో హైదరాబాద్ కాకూడదని కోరుకొంటున్నా: పవన్ కళ్యాణ్

  ఆంద్రప్రదేశ్ మంత్రులు అయ్యన్నపాత్రుడు, డా. కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ జనార్ధన్ ఇవ్వాళ ఉదయం అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ న్ని ఆహ్వానించేందుకు ఆయన సర్దార్ సినిమా షూటింగ్ జరుగుతున్నా రామానాయుడు స్టూడియోకి వెళ్ళారు. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ సిబ్బంది మీడియా రిపోర్టర్ల చేతుల్లో నుండి కెమెరాలు బలవంతంగా గుంజుకొని వారి పట్ల చాలా దురుసుగా వ్యవహరించారు. అందుకు పవన్ కళ్యాణ్ మీడియాకి క్షమాపణలు చెప్పారు. ఆ తరువాత మంత్రులు అందించిన ఆహ్వానం స్వీకరించి వారితో రాజధాని శంఖుస్థాపన కార్యక్రమం గురించి వారిని వివరాలు అడిగి తెలుసుకొన్నారు.   అనంతరం పవన్ కళ్యాణ్ మీడియా అడిగిన ఒక ప్రశ్నకు జవాబుగా, “నేను ఈనెల 22న షూటింగ్ కోసం గుజారాత్ వెళుతున్నాను. నాకు ఏమాత్రం టైం దొరికినా శంకుస్థాపన కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతాను. అమరావతి మరో హైదరాబాద్ కాకూడదని కోరుకుంటున్నాను. అందరికీ సంతోషం కలిగించే విధంగా అమరావతి నిర్మాణం జరగాలని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం ఏర్పడటం నాకు చాలా సంతోషం కలిగిస్తోంది,” అని అన్నారు.   ఆయన చెప్పిన దానిని బట్టి ఆయన ఈ శంకు స్థాపన కార్యక్రమానికి హాజరు కాలేకపోవచ్చునని భావించవచ్చును. కానీ ఈ కార్యక్రమం ప్రాధాన్యత తెలుసు గనుక తప్పకుండా హాజరయ్యేందుకు ప్రయత్నిస్తానని నిజాయితీగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డిలాగ నాకు షూటింగ్ ఉంది నేను రాను అని చెప్పలేదు. అదే జగన్ కి పవన్ కి ఉన్న తేడా.   ఇదివరకు ఆయన రైతుల నుండి బలవంతంగా భూసేకరణ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బహుశః అందుకే ఆ రైతులకు కూడా ఇబ్బంది కలగకుండా వారు కూడా సంతోషించే విధంగా రాజధాని నిర్మాణం జరగాలని కోరుకొంటున్నానని అని ఉండవచ్చును. అమరావతి మరో హైదరాబాద్ లాగ కాకూడదంటే బహుశః ఆయన ఉదేశ్యం అభివృద్ధి అంతా అమరావతిలోనే కేంద్రీకరించకుండా అన్ని జిల్లాలకు వికేంద్రింకరించమని సూచిస్తున్నట్లుంది. పవన్ కళ్యాణ్ చాలా హుందా వ్యవహరించారని చెప్పవచ్చును.

అటువంటి ఉన్మాదుల నుండి రాష్ట్రాన్ని రక్షించుకోవాలి: బాబు

  ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి ప్రభుత్వం పిలిచినా తను రానని జగన్మోహన్ రెడ్డి చెప్పడం పై అధికార, ప్రతిపక్షాల మధ్య ప్రస్తుతం మాటల యుద్ధం జరుగుతోంది. ప్రజలు కూడా దాని గురించి చర్చించుకొంటున్నారు. మీడియాలో కూడా ఆయన నిర్ణయంపై రసవత్తరమయిన చర్చలు జరుగుతున్నాయి. ఎప్పుడూ చాలా సంయమనంగా ఆచితూచి మాట్లాడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డిని చాలా తీవ్రంగా విమర్శించారు.   ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ “ దేశంలో ఇతర రాష్ట్రాలు మాకు ముంబై ఉంది...మాకు చెన్నై ఉంది...మాకు డిల్లీ ఉంది... మాకు హైదరాబాద్ ఉంది...అని గొప్పగా చెప్పుకొంటుంటే మనం ఏమి చెప్పుకోవాలి? మాకు 13 జిల్లాలు ఉన్నాయని చెప్పుకోవాలా? మనమూ గర్వంగా చెప్పుకొనే అటువంటి రాజధాని నగరం మనకి అవసరం లేదా? అనేక సమస్యలని, సవాళ్ళని ఎదుర్కొంటూ మనమందరం గర్వపడే విధంగా ఒక గొప్ప రాజధాని నగరం నిర్మించాలని నేను ప్రయత్నం చేస్తుంటే, ఆయన (జగన్) నేనేదో డబ్బు వెనకేసుకోవడానికే కడుతున్నానని అర్ధం పర్ధం లేని విమర్శలు చేస్తూ రాజధాని నిర్మాణానికి అడుగడుగునా అడ్డుపడుతున్నాడు. ఇంత నెగెటివ్ థింకింగ్, అసూయ, ఓర్వలేనితనం ఉన్న వ్యక్తిని నేను నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. అమెరికాలో తుపాకులు పట్టుకొని అన్నెం పున్నెం తెలియని విద్యార్ధులపై కాల్పులు జరిపే ఉన్మాదుల వంటి వ్యక్తుల నుండి మనం మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు నేను కృషి చేస్తుంటే, రాష్ట్రాభివృద్ధికి అడుగడునా జగన్ అడ్డం పడుతూనే ఉన్నాడు. ఆయనకి మేము చేసే పనులను వ్యతిరేకించడం తప్ప మరేమీ పని లేదు. అటువంటి వ్యక్తులకు గల్లీ నుండి డిల్లీ వరకు అందరూ లోకువగానే కనిపిస్తుంటారు. అందుకే నోటికి వచ్చినట్లు లేనిపోని ఆరోపణలు చేస్తూనే ఉంటారు,” అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

కోమటిరెడ్డి & బ్రదర్స్ ఇంకా ఎంత కాలం డైలెమాలో ఉంటారో?

  నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతల్లో కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రముఖులు. వారిలో వెంకట రెడ్డి మాజీ మంత్రికాగా, రాజగోపాల్ రెడ్డి మాజీ ఎంపి. అదే జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత కె.జానారెడ్డితో వారికి తీవ్ర విభేదాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు అవి పెద్ద సమస్యగా కనబడలేదు. పైగా తెలంగాణా ఉద్యమాలు జోరుగా జరుగుతున్నందున వారి విభేదాలు మరుగునపడ్డాయి. తెలంగాణా సాధన కోసం కోమటిరెడ్డి వెంకట రెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేసి నిరాహార దీక్షలు కూడా చేసారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది కానీ తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది. కనుక మళ్ళీ ఇప్పుడు వారి మధ్య విభేదాలు మెల్లగా బయటపడుతున్నాయి.   కాంగ్రెస్ పార్టీ జానారెడ్డికి ప్రాధాన్యత ఇస్తూ తమని పట్టించుకోవడంలేదని వారు ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. బహుశః ఆ కారణంగానే కోమటిరెడ్డి సోదరులిద్దరూ కాంగ్రెస్ పార్టీకి, దాని కార్యక్రమాలకి చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు. కోమటిరెడ్డి సోదరులిద్దరినీ తెరాసలోకి ఆకర్షించాలని కేసీఆర్ ప్రయత్నించినట్లు, అందుకు వారిద్దరూ కూడా సానుకూలంగానే ఉన్నట్లుగా ఆ మధ్యన ఎప్పుడో వార్తలు వచ్చేయి. కానీ ఎందుకో నేటికీ వారు తెరాసలో చేరలేదు. నేటికీ వారిరువురూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటునప్పటికీ దానితో కలిసి పనిచేయడం లేదు.   రైతుల ఆత్మహత్యలపై తెరాస ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర బంద్ కి పిలుపునిచ్చినప్పుడు కోమటిరెడ్డి సోదరులిద్దరూ అందులో పాల్గొనలేదు అందుకు తమ మద్దతు ప్రకటించలేదు. మళ్ళీ నిన్న వారి స్వంత జిల్లా నల్గొండలోనే కె.జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, గుత్తా సుఖేందర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ తదితరులు అందరూ కలిసి నిర్వహించిన రైతు భరోసా యాత్ర సభకి కోమటిరెడ్డి సోదరులిద్దరూ మొహం చాటేశారు.   వారు తెరాసలోకి వెళ్లేందుకే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని కాంగ్రెస్ నేతలే అనుమానిస్తున్నారు. అటువంటప్పుడు తెరాసలోకి వెళ్ళకుండా ఇంకా ఎందుకు ఆగిపోయరంటే చాలా స్వేచ్చా స్వతంత్రాలు కోరుకొనే కోమటిరెడ్డి వెంకట రెడ్డి, కేసీఆర్ నియంతృత్వ వైఖరిని సహిస్తూ ఆయన ముందు చేతులు కట్టుకొని ఉండలేమనే ఆలోచనతోనే తెరాసలో చేరేందుకు వెనకాడుతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అటువంటప్పుడు వారు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగడం మంచిది. ఎందుకంటే కేవలం ఆ ఒక్క పార్టీలోనే స్వేచ్చ ఎక్కువగా ఉంటుంది. కనుక జానారెడ్డి కారణంగా కాంగ్రెస్ పార్టీకి, రాజకీయాలకి దూరమయ్యి తమ రాజకీయ భవిష్యత్ ని తామే నాశనం చేసుకోవడం కంటే ఆయనతో రాజీపడి కాంగ్రెస్ పార్టీలో తమ స్థానం సుస్థిరం చేసుకోవడం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి కోమటిరెడ్డి సోదరులిద్దరూ చివరికి ఏమి నిర్ణయం తీసుకొంటారో..ఇలాగ ఎంతకాలం కాంగ్రెస్ పార్టీకి, రాజకీయాలకి దూరంగా ఉంటారో చూడాలి.

జగన్ అందుకే బెట్టు చేస్తున్నాడా?

  రాజధాని శంఖు స్థాపన కార్యక్రమానికి ప్రభుత్వం పిలిచినా రానని జగన్మోహన్ రెడ్డి చెప్పడం విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆయన అందుకు ఒక ఎనిమిది కారణాలు తన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. కానీ ఆయన ఆ లేఖలో పేర్కొనని అసలు కారణం మరొకటి ఉండిపోయిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.   ఆయన ఆరు రోజుల నిరాహార దీక్షని ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పుడు ప్రజలందరి దృష్టి అమరావతి శంఖుస్థాపన కోసం మొదలయిన హడావుడిపైనే ఉంది. జగన్ దీక్షని నీరుగార్చేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని వైకాపా నేతలు పదేపదే ఆరోపించదమలో ఉద్దేశ్యం అదే. వారు పైకి చెప్పలేదు కానీ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే అమరావతి శంఖు స్థాపనకి ‘మన నీళ్ళు మన మట్టి’ అంటూ హడావుడి చేసిందని భావిస్తున్నట్లున్నారు. కనుక ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న ఈ శంఖు స్థాపన కార్యక్రమంపై నుండి రాష్ట్ర ప్రజల దృష్టిని తన వైపు మళ్ళించుకొనేందుకే జగన్మోహన్ రెడ్డి తను దానికి పిలిచినా రానని చెపుతున్నట్లున్నారేమో? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తను స్వయంగా వెళ్లి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆహ్వానిస్తానని చెప్పినప్పుడు మీడియా ఆ విషయం గురించి చాలా విశ్లేషించింది. దానితోబాటే ఈ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి వస్తారా రారా? అని అప్పుడే అనుమానం వ్యక్తం చేస్తూ అనేక కధనాలు ప్రచురించాయి. ఊహించినట్లే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అత్యంత ముఖ్యమయిన కార్యక్రమానికి హాజరు కాబోనని ప్రకటించేసి మీడియాకి మళ్ళీ చేతి నిండా పని కల్పించారు. ప్రస్తుతం మీడియాలో ప్రముఖంగా దీని గురించే చర్చ జరుగుతోంది. అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల దృష్టిని అమరావతి కార్యక్రమం నుంచి తనపైకి మళ్ళించుకొనేందుకే అటువంటి విచిత్రమయిన నిర్ణయం తీసుకొని ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.   ఆయన వేసిన ఈ ఐడియా తాత్కాలికంగా ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చును. కానీ శాస్వితంగా ఆయన రాజకీయ జీవితంలో ఒక చారిత్రిక తప్పిదంగా మిగిలిపోవడం ఖాయమని వారు అభిప్రాయపడుతున్నారు. అంతే కాదు ప్రజల దృష్టిని ఆకర్షించడం కోసం ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వలన ఆయన పట్ల ప్రజలలో మరింత విముఖత పెరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. జగన్ తీసుకొన్న ఈ నిర్ణయం వలన అధికార తెదేపా నేతలకు జగన్ స్వయంగా బలమయిన అస్త్రం కూడా అందించినట్లయిందని అభిప్రాయపడుతున్నారు. తెదేపా నేతలు తనను ఎంతగా విమర్శిస్తే అంతగా తన పేరు జనంలో మీడియాలో నానుతుందని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారేమో కానీ అది ఆయన గురించి నెగెటివ్ పబ్లిసిటీ అవుతుందని దాని వలన తనకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని గ్రహించలేకపోవడం ఆశ్చర్యమే.

మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు కాల్ డ్రాప్ కి రూ.1 జరిమానా చెల్లించాల్సిందే

  ఇప్పుడు భారతదేశంలో మొబైల్ ఫోన్లు వాడే వారి సంఖ్య నానాటికీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. దానితో మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ మధ్య పోటీ కూడా చాలా పెరిగిపోతోంది. కానీ ఇతర నెట్ వర్క్ లలో ఉన్నవారిని, కొత్త కష్టమర్స్ ని ఆకర్షించడానికి మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు చూపిస్తున్న శ్రద్ధ అందుకు అవసరమయిన నెట్ వర్క్ ఏర్పాటు చేసుకోవడంలో చూపించడం లేదు. ఇంతకు ముందు ఒక సెల్ ఫోన్ టవర్ కొన్ని వందలు మొబైల్ ఫోన్లు పనిచేస్తుంటే ఇప్పుడు అదే టవర్ల నుండి కొన్ని వేలు పనిచేస్తున్నాయి. సెల్ ఫోన్ టవర్స్ పై ఒత్తిడి పెరిగినప్పుడు అకస్మాత్తుగా కాల్స్ మధ్యలో కట్ అయిపోతుంటాయి.వాటినే కాల్ డ్రాప్స్ అంటారు.   కాల్ డ్రాప్స్ అయినప్పుడు ప్రజలు మళ్ళీమళ్ళీ కాల్ చేసేందుకు ప్రయత్నిస్తారు. దానివలన మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లకి మరింత ఆదాయం పెరుగుతుందే తప్ప తగ్గదు. బహుశః అందుకే కనెక్షన్లు పెంచుకోవడంపై చూపిస్తున్నంత శ్రద్ద కొత్తగా టవర్స్ ఏర్పాటు చేసుకోవడంపై చూపడం లేదు. ఈ సమస్య ఎంతగా పెరిగిపోయిందంటే సాక్షాత్ రాష్ట్ర మంత్రులు, కేంద్రమంత్రులకీ ఈ కూడా ఈ బాధ తప్పడం లేదు. ఏదయినా తనదాకా వస్తే కానీ తెలియదంటారు పెద్దలు. ఆ కష్టం ఏమిటో ప్రభుత్వానికి కూడా తెలిసివచ్చిందిప్పుడు.   అందుకే టెలిఫోన్ రెగ్యులేటరీ అధారిటీ సంస్థ జనవరి 1, 2016 నుండి దేశంలో అన్ని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు ఒక్కో “కాల్ డ్రాప్” కి రూపాయి చొప్పున జరిమానగా వినియోగదారునికి చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఒకరోజులో గరిష్టంగా కేవలం మూడు కాల్ డ్రాప్స్ కి మాత్రమే అంటే మూడు రూపాయలు మాత్రమే చెల్లించేందుకు పరిమితి విధించింది. వియోగదారుడు మాట్లాడుతున్నప్పుడు కాల్ మధ్యలోఒకవేళ కట్ అయినట్లయితే అప్పటి నుండి నాలుగు గంటలలోగా ఆ వినియోగదారుడుకి సదరు మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థ ఎస్.ఎం.ఎస్. మెసేజ్ ద్వారా డబ్బు చెల్లించబోతున్నట్లు తెలియజేయాల్సి ఉంటుంది.   పోస్ట్ పెయిడ్ వాళ్ళకి తరువాత బిల్లులో ఆ మొత్తం అడ్జస్ట్ చేయబడుతుంటుంది. ప్రీ పెయిడ్ వాళ్లకి అందుకు సరిసమానమయిన కాల్ సమయం పెంచబడుతుంది. దీనివలన తమపై చాలా విపరీతమయిన ఆర్దికభారం పడుతుందని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు వాదిస్తున్నారు. రోజుకి మూడు రూపాయల చొప్పున కొన్ని లక్షలు కోట్ల మందికి చెల్లించాలంటే తమ మనుగడ సాగించడం చాలా కష్టం అవుతుందని వాదిస్తున్నారు. ఆ పరిస్థితి రాకూడదనుకొంటే మరిన్ని సెల్ టవర్లు అత్యవసరంగా నిర్మించుకోవలసి ఉంటుందని ప్రభుత్వం సూచిస్తోంది. ప్రజల దగ్గర ప్రతీ సెకనుకి డబ్బు వసూలు చేస్తున్నప్పుడు అందుకు తగ్గట్లుగా సేవలు కూడా అందించాల్సిన అవసరం మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లపైనే ఉంది తప్ప ప్రభుత్వం పైనో ప్రజలపైనో కాదు.

శంఖుస్థాపనకి రాకపోతే ఆయనకే చెడ్డపేరు: యనమల

  ఆంద్రప్రదేశ్ రాజధాని శంఖుస్థాపన కార్యక్రమం తెదేపా స్వంత కార్యక్రమం అని జగన్ భావిస్తున్నారేమో తెలియదు కానీ దానికి తనను పిలిచినా హాజరు కానని లిఖితపూర్వకంగా చెప్పుకొని ప్రజలలో మరింత చులకన అయ్యారు. ఆయన వైరం తెదేపాతో దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతోనే కానీ రాష్ట్రంతో రాజధానితో కాదని అనుకొంటే ఆయన ఈ శంఖుస్థాపన కార్యక్రమానికి తప్పకుండా హాజరయ్యేవారు. కానీ పిలిచినా రానని చెప్పుకొని తన రాజకీయ అపరిపక్వతను మరొక్కమారు చాటుకొన్నారు. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి సంబందించిన రాజధాని శంఖుస్థాపన కార్యక్రమానికి పిలిచినా రానని ఆయన చెపుతారని వైకాపా నేతలు కూడా ఊహించినట్లు లేదు. అసలు జగన్ అటువంటి ప్రకటన చేసేముందు తన పార్టీలో సీనియర్లను సంప్రదించి వారి సలహాలు అడిగారో లేదో తెలియదు. అందుకే ఇంతవరకు వైకాపా నేతలు ఎవరూ కూడా స్పందించలేకపోయారు. బహుశః వారు తమ అధినేత ఇచ్చిన ఈ షాక్ నుండి నేదో రేపో కోలుకొని ఆయనను సమర్ధిస్తూ వాదించడం మొదలుపెడతారేమో?   వైకాపా నేతలు దీనిపై తమ వాదనలు ఇంకా తయారు చేసుకొంటుంటే, తెదేపా నేతలు మాత్రం తక్షణమే స్పందించారు. జగన్ ఆ విధంగా చెప్పి రాష్ట్ర ప్రజలను అవమానించారని మంత్రి పల్లె రఘునాథ రెడ్డి అన్నారు. జగన్ రాజకీయాలలోకి వచ్చి చాలా కాలం అయినా ఆయనలో ఇంకా ఫ్యాక్షనిస్ట్ లక్షణాలు పోలేదని అందుకే అంత మొండిగా చెప్పగలిగారని ఆయన అన్నారు.   ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ “జగన్ రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడానికి మొదటి నుండి విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆయన రాజధాని నిర్మాణానికి వ్యతిరేకినని స్వయంగా లిఖిత పూర్వకంగా చాటుకొన్నారు. కనుక ఈ శంఖుస్థాపన కార్యక్రమాన్ని అడ్డుకొనేందుకు కూడా కుట్రలు పన్నుతున్నారని మాకు అనుమానం కలుగుతోంది. ఆయన రాష్ట్ర కార్యక్రమానికి పిలిచినా రానని చెప్పుకొని ప్రజలలో తనే నవ్వుల పాలయ్యారు. ఆయన వచ్చినా రాకపోయినా సంప్రదాయం ప్రకారం మేముఆయనని కూడా ఆహ్వానిస్తాం. ఈ కార్యక్రమానికి వచ్చి తన గౌరవం నిలబెట్టుకొంటారో లేక ప్రజల చేత అసహ్యింప జేసుకొంటారో ఆయన ఇష్టం,” అని అన్నారు.

ములాయం సింగ్ కి ఎన్సీపీ టాటా...బైబై..

  బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో కేవలం నరేంద్ర మోడిని ఎదుర్కోవడానికే ఆరు పార్టీలు కలిసి ములాయం సింగ్ నేతృత్వంలో జనతా పరివార్ ఎప్రాటు చేసుకొన్నాయి. కానీ అందులో ప్రధాన భాగాస్వాములుగా ఉన్న నితీష్ కుమార్ (జె.డి.యు) లాలూ ప్రసాద్ యాదవ్ (ఆర్.జె.డి) ములాయం సింగ్ కి తెలియకుండా తలో వంద సీట్లు పంచేసుకొని మిగిలిన 40 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేయడంతో ఆగ్రహించిన ములాయం సింగ్ జనతా పరివార్ కి గుడ్ బై చెప్పేసి ఒంటరిగా పోటీకి దిగారు. ఆయనతో బాటే ఎన్సీపీ కూడా బయటకు వచ్చేసింది.   యస్పీ, ఎన్సీపి తదితర ఆరు పార్టీలు ఆయనతో చేతులు కలపడంతో అదొక తృతీయ కూటమిగా అవతరించింది. బీహార్ ఎన్నికలలో ఇప్పుడు ఎన్డీయే, జనతా పరివార్, వామపక్ష కూటమి, ఈ తృతీయ కూటమి పోటీ చేస్తున్నాయి. ములాయం సింగ్ తృతీయ కూటమికి నేతృత్వం వహిస్తున్నప్పటికీ ఆయన క్రమంగా ప్రధాని నరేంద్ర మోడీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ జాతీయవాదం కలిగిన పార్టీ అని మెచ్చుకొన్నారు. మళ్ళీ మొన్న జరిగిన ఒక ఎన్నికల ప్రచార సభలో తమ కూటమికి ఓటువేయమని ప్రజలను కోరుతూనే బీహార్ లో బీజేపీ గాలి వీస్తోందని, ఈ ఎన్నికలలో బీజేపీయే గెలిచే అవకాశాలు కనబడుతున్నాయని చెప్పడంతో తృతీయ కూటమిలో పార్టీలన్నీ కంగుతిన్నాయి. తమ కూటమిని గెలిపించామని ప్రజలను అడగవలసిన ములాయం సింగ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పడం చూసి వారు విస్తుపోయారు.   అందుకు ఆగ్రహించిన ఎన్సీపీ తాము తృతీయ కూటమి నుండి తప్పుకొంటున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా పోరాదేందుకే తాము తృతీయ కూటమిలో జేరితే ములాయం సింగ్ మళ్ళీ అదే బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేయడాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని అందుకే తృతీయ కూటమి నుండి వైదోలగుతున్నామని ఎన్సీపీ ప్రధాన కార్యదర్శి తారిక్ అన్వర్ ప్రకటించారు. అయితెహ్ ఎన్సీపీ మొదట అదే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి పనిచేసేందుకు సిద్దపడిన విషయాన్ని ఆయన దాచిపెట్టినా దాగే విషయం కాదు. జనతా పరివార్ తో కాంగ్రెస్ పార్టీతో బాటు ఎన్సీపీ కూడా మొదట చేతులు కలిపింది. కానీ కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు కేటాయించి తమకు కేవలం మూడు సీట్లే ఇచ్చినందుకు నిరసనగా ములాయం సింగ్ తో కలిసి బయటకొచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు తృతీయ కూటమి నుండి కూడా బయటకు వెళ్లిపోయింది.

అనంత వైసీపీలో ముదిరిన గొడవలు

  2014 ఎన్నికల్లో ఓవర్ కాన్ఫిడెన్సే వైసీపీ కొంపముంచిందంటారు, అనంతపురం జిల్లాలో అదిమరీ శృతిమించి పార్టీని నిలువునా ముంచేసిందని, గెలవాల్సిన చోట కూడా ఓటమి మూటగట్టుకోవాల్సి వచ్చిందంటారు, దీనికి నేతల మధ్య అనైక్యతే కారణమని, అనంత వైసీపీలో ఏ ఇద్దరి నేతల మధ్య సఖ్యత లేదని, దాంతో జిల్లాలో పార్టీ పరిస్థితి మరింత దిగజారిందని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డికి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డికి మధ్య ఉన్న వైరం తారాస్థాయికి చేరిందంటున్నారు,అదే సమయంలో ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డితోనూ గుర్నాథ్ కు పొసగడం లేదని చెప్పుకుంటున్నారు, 2014లో తన ఓటమికి వెంకట్రామిరెడ్డే కారణమనే భావన ఉన్న గుర్నాథరెడ్డి... అనంతపై గుర్రుగా ఉన్నారని అంటున్నారు, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుడు శంకర్ నారాయణతో కూడా గుర్నాథ్ కు వైరం ఉందంటున్నారు. దాంతో గుర్నాథ్ రెడ్డి... వైసీపీలో కొనసాగడం కష్టమేనంటున్నారు, అదే సమయంలో కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా కూడా జగన్ వైఖరిపై అసహనంతో ఉన్నాడని, మైనార్టీ సభ్యుడినైన తనకు పార్టీలో సరిగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని వాపోతున్నట్లు తెలిసింది. ఇక అనంత వైసీపీ అధ్యక్షుడు శంకర్ నారాయణ ఆవేదన మరోలా ఉంది, జిల్లాలో తనను ఎవరూ గౌరవించడం లేదని, పార్టీ మీటింగ్స్ పెట్టినా హాజరుకావడం లేదని వాపోతున్నారు, జిల్లాలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పెత్తనం కోసం పాకులాడుతున్నారని, గుర్నాథ్ రెడ్డి వ్యవహారమైతే పెద్ద తలనొప్పిగా మారిందని అంటున్నారు, అలాగే జిల్లా పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటాడనుకున్న అనంత వెంకట్రామిరెడ్డి కూడా మొక్కుబడిగా పార్టీ సమావేశాలకు వస్తూ సైడైపోతున్నాడని, దాంతో జిల్లా పార్టీలో అసలేం జరుగుతుందో అర్థంకాక ద్వితీయశ్రేణి నాయకులు తలలు పట్టుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. పైగా ఇప్పటివరకూ జిల్లా కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, మండల, గ్రామ కమిటీలే వేయలేదని, అధినేత జగన్ కు చెప్పినా పట్టించుకోవడం లేదని అంటున్నారు ప్రస్తుతం అనంతలో వైసీపీ పరిస్థితి రెక్కలు విరిగిన ఫ్యాన్ లా ఉందని, జిల్లాపై జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టకపోతే పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు

బాబుకి బహిరంగ లేఖ, సినీ స్టైల్లో జగన్ డైలాగ్ లు

  నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తనను ఆహ్వానించవద్దని, ఆహ్వానించినా తాను రాలేనంటూ వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.... బహిరంగ లేఖ రాశారు, రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని, అయితే రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, కార్పొరేట్ శక్తులకు వేలాది ఎకరాల భూములను కట్టబెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, అందుకే రాజధాని శంకుస్థాపనకు రావడం లేదన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను లెక్క చేయకుండా వ్యవహరించడం, పేదల భూములను బలవంతంగా లాక్కోవడం, అసైన్డ్ ల్యాండ్ ఓనర్స్ ను చులకనగా చూడడం వంటి కారణాల రీత్యా ప్రభుత్వ వైఖరికి నిరసనగా తాను శంకుస్థాపనకు రాలేనని జగన్ తెలిపారు. పైగా రాజధాని శంకుస్థాపన పేరుతో 400 కోట్ల రూపాయలను దుబారా చేయడాన్ని జగన్ తప్పుబట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ను తానే స్వయంగా ఆహ్వానిస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో జగన్ ఈ లేఖ రాశారు, అయితే లేఖలో జగన్ ప్రస్తావించినా అంశాలు పరమ రొటీన్ గానూ, సినిమా డైలాగ్స్ లా ఉన్నాయి, రాష్ట్ర విభజన కారణంగా కట్టుబట్టలతో నడిరోడ్డున పడ్డ ఆంధ్రప్రదేశ్ ను పునాదుల నుంచి నిర్మించడమంటే మాటలు కాదు, అలాగే నవ్యాంధ్రప్రదేశ్ పునర్ నిర్మాణానికి ఆయువుపట్టు అయిన అంతర్జాతీయ రాజధానిని కట్టడమంటే అది ఒక యుద్ధం లాంటిదే, మరి యుద్ధం అన్నాక...కష్టనష్టాలు కచ్చితంగా ఉంటాయ్, త్యాగాలు ఇబ్బందులుంటాయ్, రిస్క్ చేయాల్సి వస్తుంది, ఒక్కోసారి ప్రాణనష్టం ఉంటుంది. నవ్యాంధ్ర పునర్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు మహాయ‌జ్ఞమే చేస్తున్నారు, సాధ్యమైనంతవరకూ ఎవరికీ ఎలాంటి నష్టం జరగకుండా సరికొత్త విధానాలతో ముందుకెళ్తూ ప్రజల మనసులను గెలుచుకుంటున్నారు, రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూసమీకరణ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చి రైతుల నుంచి ఎలాంటి ప్రతిఘటన లేకుండా దాదాపు 35వేల ఎకరాలను ఆయన సమీకరించగలిగారు, ఇక్కడ రైతుల త్యాగం ఎంతో గొప్పదైనా, వారిని ఒప్పించడంతో బాబు సక్సెస్ అయ్యారు, అలాగే అంతర్జాతీయస్థాయి నగరాన్ని నిర్మించాలంటే లక్షలకోట్ల రూపాయలు కావాలి, అంత డబ్బు ఎక్కడ్నుంచి తేవాలి? అందుకే కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు, దాన్లో భాగంగానే సింగపూర్, జపాన్ లాంటి దేశాలకు... కేపిటల్ నిర్మాణంలో భాగస్వామ్యం కల్పించారు. ఇలా నవ్యాంధ్రప్రదేశ్ డెవలప్ మెంట్ కు చంద్రబాబు బాటలు వేస్తుంటే, సహకరించాల్సిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి... అడ్డుబండలు వేయడం సరికాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మహాయ‌జ్ఞం చేస్తుంటే... కొన్ని కష్టనష్టాలు తప్పకుండా ఉంటాయనే విషయాన్ని జగన్ తెలుసుకోవాలని, ప్రతిదానికీ కోడిగుడ్డ మీద ఈకలు పీకకుండా, మంచి పనులను ప్రోత్సహించాల్సిన అవసరముందని సూచిస్తున్నారు.

బీజేపీకి ఏ గన్నులు అచ్చిరావట్లేదు!

  బీజేపీకి ఏ గన్ను అచ్చిరానట్లుంది. గన్ అంటే ఆ గన్ను కాదు..బాలీవుడ్ నటులు శత్రు’గన్’ సిన్హా, అజయ్ దేవగన్. ఇంతకు ముందు శత్రు‘గన్’ సిన్హాని నమ్ముకొంటే ఆయన వెళ్లి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కి బాకా ఊదడం మొదలుపెట్టారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రధానంగా నితీష్ కుమార్, నరేంద్ర మోడిల మధ్యనే యుద్ధం జరుగుతోంది. మోడీ నితీష్ కుమార్ ని విమర్శిస్తుంటే, శత్రుగన్ సిన్హా “నితీష్ కుమార్ అంత మంచివాడు, సమర్దుడయిన ముఖ్యమంత్రి లేడని” పొగుడుతున్నారు. అప్పుడు బీజేపీకి ఎలాగుటుందో తేలికగానే ఊహించవచ్చును.   తనకే శత్రువుగా మారి బ్యాక్ ఫైర్ అవుతున్న ఆ శత్రు ‘గన్’ న్ని బీజేపీ పక్కనబెట్టి బీహార్ ఎన్నికల కోసమే బాలీవుడ్ నుంచే మరో కొత్త ‘గన్’ తెచ్చుకొంది. అదే అజయ్ దేవ్ ‘గన్.’ కానీ ఈ కొత్త గన్ కూడా బ్యాక్ ఫైర్ అవుతుండటంతో బీజేపీ అభ్యర్ధులు చాలా కంగారుపడుతున్నారు.   నలందా జిల్లాలోని బీహారి షరీఫ్ నియోజకవర్గం నుండి బీజేపీ తరపున సునీల్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఆయన తరపున ఎన్నికల ప్రచారం చేయడం కోసం అజయ్ దేవగన్ బయలుదేరారు. కానీ ఆయన ఎక్కవలసిన రైలు జీవిత కాలం లేటు అన్నట్లుగా ఆయన దిగవలసిన సభకి ఐదారు గంటలు లేటుగా చేరుకొంటున్నారు. దానితో సహనం కోల్పోయిన జనాలు కుర్చీలు విసిరి కొడుతుంటే, వారిని అదుపు చేయడానికి పోలీసులు కర్రలు తీయవలసి వస్తోంది. ఎన్నికల ప్రచారసభ కాస్త రణరంగంగా మారిపోయింది. క్రింద జరుగుతున్న ఆ హడావుడి చూసి అజయ్ దేవగన్ హెలికాఫ్టర్ లో నుండే ప్రజలకు టాటా బైబై చెప్పేసి వెళ్లిపోయారు.   అజయ్ దేవగన్ వస్తున్నాడని ఆయనని చూసేందుకు జనాలు వస్తే పోలీసుల చేత లాఠీ దెబ్బలు తినవలసి వచ్చింది. అయినా ఓపికగా ఆకాశం నుండి ఊడిపడే ఆ బాలివుడ్ గన్ కోసం అన్ని గంటలపాటు మండుటెండలో ఎదురుచూస్తే చివరికి ఆయన ఆకాశంలోనుంచే టాటా బై బై చెప్పేసి ఎగిరిపోతే అప్పుడు జనాలు ఎలా రియాక్ట్ అవుతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తుప్పు పట్టిన పాత గన్ న్ని పక్కనపెట్టి ఈ కొత్త గన్ న్ని తెచ్చుకొంటే అది కూడా ఇలా బ్యాక్ ఫైర్ అవుతుండటంతో ఆ గన్ పేరు చెపితే చాలు బీజేపీ అభ్యర్ధులు భయపడిపోతున్నారు. మా తిప్పలేవో మేమే పడతాము మాకు ఏ గన్నూ వద్దని అంటున్నారుట.

వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్దపడ్డారుట!

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం చేసిన దీక్ష విషయంలో అనుకొన్నది ఒకటయితే జరిగింది మరొకటి. ప్రత్యేక హోదా అంశంపై నిరాహార దీక్ష చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని బుక్ చేసేయాలనుకొంటే చివరికి తనే అడ్డంగా బుక్ అయిపోయారు. ప్రభుత్వం పోలీసులను పంపి దీక్ష భగ్నం చేయకపోయుంటే జగన్ పరిస్థితి ఏమిటి? అప్పుడు వైకాపా నేతలు ఏమి చేసేవారు? అని ఆలోచిస్తే బహుశః వారే జగన్ చేత దీక్షని విరమింపజేసి ఉండేవారని చాలామంది భావించారు. కానీ ఏడవరోజు తెల్లవారుజామున ప్రభుత్వం పోలీసులను పంపి జగన్ దీక్షను భగ్నం చేయకపోయుంటే చివరి అస్త్రంగా వైకాపా ఎమ్మెల్యేలు అందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని అనుకొన్నారుట. కానీ ఆ సంగతి ముందే పసిగట్టిన ప్రభుత్వం పోలీసులను పంపించి వైకాపా నేతలు కోరుకొన్నట్లే జగన్ దీక్ష భగ్నం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారుట.   ఒకవేళ ప్రభుత్వం పోలీసులను పంపకుండా ఆలశ్యం చేసి ఉంటే వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉండేవారనుకొంటే, జగన్ దీక్ష వలన చివరికి వైకాపాయే నష్టపోయేదని అర్ధం అవుతోంది. అప్పుడు కూడా వారిలో కొందరు రాజీనామాలు చేయడానికి నిరాకరించినా లేదా ఇతర పార్టీలలోకి జంప్ అయిపోయినా అది ఇంకా అప్రదిష్ట అవుతుంది. కానీ జగన్ అదృష్టం కొద్దీ ప్రభుత్వం సకాలంలో పోలీసులను పంపించి ఆయన ప్రాణాలని, ఆయన పార్టీని కూడా కాపాడిందనుకోక తప్పదు. చంద్రబాబు నాయుడుని ఇరుకునపెట్టి ఆనందిద్దామనుకొంటే, చివరికి ప్రాణాలు రక్షించుకొనేందుకు తన ఎమ్మెల్యేలనే బలిచేసుకొనే పరిస్థితి ఏర్పడటం విచిత్రమే. ఏది ఏమయినప్పటికీ జగన్ మళ్ళీ ఎప్పుడయినా నిరవదిక నిరాహార దీక్ష చేయలనుకొంటే ఒకటికి పది సార్లు ఆలోచించుకొనేలా చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తన రాజకీయ అనుభవం ముందు జగన్ ఎన్ని కుప్పిగంతులు వేసినా ప్రయోజనం ఉండదని మరొకమారు నిరూపించారు.

అమరావతి కంటే జగన్ పోరాటాలే ముఖ్యమా?

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోరుతూ నిరాహార దీక్ష చేసారు. ఆరు రోజులకే అది ముగిసిపోయింది. ఆయన ప్రత్యేక హోదా కోసమే దీక్ష చేసినప్పటికీ, ప్రత్యేక హోదా గురించి కంటే ఆయన నిరాహార దీక్ష గురించి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి, రాష్ట్రం కోసం ఆయన ఏవిధంగా ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన దాని గురించే సాక్షి మీడియా హైలైట్ చేసి చెప్పుకొంటోంది. చివరికి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అతి ముఖ్యమయిన రాజధాని శంఖుస్థాపన కార్యక్రమం గురించి ఎక్కడా పొరపాటున కూడా ఒక్క ముక్క పలకకుండా జాగ్రత్తపడుతూ జగన్ దీక్ష, జగన్ ఆరోగ్యం, తెలంగాణాలో బతుకమ్మ పండుగ సంబరాల గురించి మంచి కవరేజ్ ఇస్తోంది.   రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నానని పదేపదే చెప్పుకొంటున్న జగన్మోహన్ రెడ్డి మరి అమరావతి శంఖుస్థాపన గురించి ఒక్క ముక్క కూడా ఎందుకు మాట్లాడటం లేదు? కనీసం ఆయన సాక్షి మీడియా కూడా దానికి ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదు? జగన్ దీక్షకి ఉన్నంత ప్రాధాన్యత దానికి లేదా? లేక చంద్రబాబు నాయుడు చేపట్టే ఏ కార్యక్రమాన్నయినా వ్యతిరేకించడమే తన పార్టీ సిద్దాంతంగా మార్చుకొన్న జగన్ అమరావతి శంఖుస్థాపనని కూడా వ్యతిరేకిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   మహాకవి శ్రీశ్రీ లోకం యొక్క బాధను తన బాధగా భావిస్తూ కవితలు వ్రాసేవారు. కానీ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు తన బాధనే లోకం యొక్క బాధగా అభివర్ణిస్తూ కవితలు వ్రాసేవారు. జగన్మోహన్ రెడ్డి కూడా కృష్ణశాస్త్రి గారి పద్ధతిలోనే ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. జగన్ కి ఎంతసేపు తన పార్టీ, తన పోరాటాలు, తన దీక్ష, తన ఆరోగ్యం, తన పదవి లాలస, అన్నీ తనవే...కానీ వాటినే ప్రజల కోసం చేస్తున్న పోరాటాలుగా చెప్పుకొంటూ అందుకు ప్రజల మద్దతు ఆశిస్తున్నట్లు అనిపిస్తోంది. ఈ సమస్యలన్నిటికీ ఆయన చెపుతున్న ఏకైక పరిష్కారం ఒక్కటే...తను తక్షణమే ముఖ్యమంత్రి అయిపోవడం. అందుకోసమే ఈ పోరాటాలు ఆరాటాలు అని నేరుగా చెప్పకుండా రాష్ట్రం కోసం తానొక్కడే పోరాడుతుంటే ప్రభుత్వం దానికి అడ్డు పడుతోందని వాదిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తను రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నారని విమర్శిస్తుంటారు. వారిద్దరిలో రాష్ట్రానికి ఎవరివల్ల మేలు కలుగుతోంది...ఎవరి వల్ల హాని కలుగుతోంది? అని ప్రజలే ఆలోచించుకోవాలి.

అనంతలో జగన్ పార్టీ గ్రాఫ్ ఎలా ఉందంటే?

  రాయలసీమ రాజకీయాల్లో అనంతపురం జిల్లాకు ఓ ప్రత్యేకత ఉంది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటైన అనంత పేరుచెప్పగానే ముందుగా పరిటాల రవి గుర్తుకువస్తారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన పరిటాల రవి... అనంతపురం జిల్లాలో టీడీపీని తిరుగులేని శక్తిగా మలిచారు, ఇటీవల రాజకీయ సమీకరణాలు మారినా అనంతలో ఇప్పటికీ టీడీపీ ప్రాభవాన్ని చాటుకుంటోంది. 2014 సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రెండు ఎంపీ స్థానాలతోపాటు పన్నెండు ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుని మరోసారి తన సత్తా చాటింది.   రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోగా, కొత్తగా పుట్టుకొచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం... అతి విశ్వాసంతో ముందుకెళ్లి కేవలం రెండు ఎమ్మెల్యే సీట్లను మాత్రమే గెలుచుకుని చతికిలపడింది, అయితే సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గట్టిపోటీనిచ్చిన వైసీపీ... ఇప్పుడు మరింత బలహీనపడిందంటున్నారు, మొన్నటి ఎన్నికల్లో రెండు సీట్లే గెలిచి రెక్కలు విరిగిన ఫ్యాన్ లా తయారైతే... వర్గ విభేదాల కారణంగా ఇప్పుడు వైసీపీ అడ్రస్సే గల్లంతయ్యేలా ఉందంటున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ తో రెండు ఎంపీ, పద్నాలుగు ఎమ్మెల్యే స్థానాల్లో కేవలం రెండంటే రెండే సీట్లకు పరిమితమైన వైసీపీ గ్రాఫ్... గ్రూపు రాజకీయాలతో మరింత దిగజారిపోయిందంటున్నారు. నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతోపాటు ఎవరికివారు యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తుండటంతో అనంతలో వైసీపీ జెండా ఎగరడం కూడా కష్టమేనంటున్నారు, మరోవైపు అధినేత జగన్మోహన్ రెడ్డి ఒంటెద్దు పోకడలు, కేవలం రెడ్డి సామాజికవర్గంపైనే ఫోకస్ పెట్టడంతో అనంత వైసీపీ కష్టాల్లో కూరుకుపోయిందని చెప్పుకుంటున్నారు, పార్టీ గ్రాఫ్ ఇదేవిధంగా కొనసాగితే భవిష్యత్ లో ఇప్పుడున్న ఆ రెండు సీట్లు దక్కవంటున్నారు.

‘అమరావతి’కి యాంకర్ గా సాయికుమార్

నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవం కోసం  అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అతిరధమహారథులు ఈ బృహత్ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఈ  కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ప్రముఖ నటుడు సాయికుమార్ ను ఎంపికచేశారు. తెలుగుతనాన్ని గంభీరంగా ప్రదర్శించేందుకు, అతిథులను ఆత్మీయంగా పలకరించేందుకు సాయికుమార్ ను ఎంచుకున్నారు. రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా సాయికుమార్ ఎంపికపై నిర్ణయం తీసుకున్నారు. శంకుస్థాపన మహోత్సవంనాడు నిర్వహించే వివిధ కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ సాయికుమార్ వ్యాఖ్యానం చేయనున్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి మూడు వేదికలను సిద్ధంచేస్తున్నారు, ప్రధాన వేదికతోపాటు దానికిరువైపులా మరో రెండు వేదికలు ఉండనున్నాయి, ప్రధాన వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రధాని నరేంద్రమోడీతో సహా 15మంది వీవీఐపీలు కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో వేదికపై న్యాయమూర్తులు, విదేశీ రాయబారులు, కార్పొరేట్ కంపెనీల అధిపతులు, వ్యాపారవేత్తలు... మూడో వేదికపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులు కూర్చోనున్నారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు కూడా హాజరుకానున్నారు. ప్రధాన వేదికపై 13 జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండేలా కలశాలను, సంకల్ప పత్రాలను ఉంచనున్నారు, ఇదిలా ఉండగా శివమణి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, కూచిబొట్ల ఆనంద్ ఆధ్వర్యంలో కూచిపూడి, జానపద నృత్యాలు ప్రదర్శిస్తారు.

బీజేపీని నిలువరించేందుకు నితీష్, లాలూ తిప్పలు

  బీహార్ అసెంబ్లీలో 32స్థానాలకు రెండవ దశ ఎన్నికలు ఈనెల 16న జరుగుతాయి. కానీ మొదటి దశ ఎన్నికలు జరుగక ముందే అన్ని సర్వేలు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నట్లు తేల్చి చెప్పాయి. ఈ ఎన్నికలలో ఎలాగయినా విజయం సాధించాలనే తాపత్రయంతోనే భిన్న దృక్పధాలున్న రాజకీయపార్టీలు ఐదు కలిసి జనతా పరివార్ కూటమిగా ఏర్పడ్డాయి. అయినా సర్వేలు బీజేపీకే మొగ్గు చూపడంతో లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ ఇద్దరికీ ఈ సమస్యను అధిగమించడానికి ప్రత్యామ్నాయాలు వెదుకుతున్నారు.   వారిలో లాలూ ప్రసాద్ యాదవ్ “బీజేపీ ఇంతవరకు తన ముఖ్యమంత్రి అభ్యర్ధిని ఎందుకు ప్రకటించలేదు.. ముఖ్యమంత్రి అభ్యర్ధిపై స్పష్టత లేని బీజేపీ రాష్ట్రాన్ని ఏవిధంగా పరిపాలించాలనుకొంటోంది? అది నేరుగా ఎవరి పేరు చెప్పదు కానీ ఒక్కో చోట ప్రజలను మభ్యపెట్టడానికి ఒక్కో పేరుని లీక్ చేస్తుంటుంది. అసలు ఇంతకీ దాని ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరు? అతని పేరు ఇంకా ఎప్పుడు ప్రకటిస్తుంది...ప్రజలను ఈవిధంగా ఇంకా ఎంతకాలం మోసం చేస్తుంది?” అని ప్రశ్నిస్తున్నారు.   ఆయన ఆ విధంగా నిలదీయడానికి బలమయిన కారణాలే ఉన్నాయి. బీహార్ ఎన్నిలలో కులాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఏ కులానికి చెందిన వ్యక్తి పేరు ప్రకటించినా మిగిలినవారిని జనతా పరివార్ తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తుంది. అందుకే బీజేపీ తన ముఖ్యమంత్రి అభ్యర్ధి పేరు ప్రకటించలేదు. కానీ ముఖ్యమంత్రి రేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుషీల్ కుమార్ మోడీ, కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, దళితుల ప్రతినిధిగా తనను అభివర్ణించుకొనే బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంజీ ఉన్నారు.   తాజాగా ఆ జాబితాకి బీజేపీ మరోపేరు కూడా జోడించింది. గయ బీజేపీ ఎమ్మెల్యే ప్రేమ్ కుమార్. ఆయన వెనుకబడిన వర్గాలలోకెల్లా బాగా వెనుకబడిన ఒక వర్గానికి చెందిన వ్యక్తి. మోడీ బీహార్ పర్యటనకి వచ్చినప్పుడల్లా ఆయన పక్కనే కనబడుతుంటారు. ఆయన పేరు కూడాముఖ్యమంత్రి పదవి కోసం పరిశీలనలో ఉన్నట్లు ఇటీవల బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ మీడియాతో అన్నారు. ప్రేమ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న కులానికి చెందినవారు రాష్ట్రంలో 8 నుండి 11 శాతం వరకు ఉన్నారు. ఇక బాగా వెనుకబడిన కులాలన్నీ కలిపి 32 శాతం వరకు ఉన్నట్లు 1931 జనాభా లెక్కలో అంచనా వేశారు. ఆ సంఖ్య నేటికి గణనీయంగా పెరిగి ఉంటుంది కనుక బీజేపీ ఆ వర్గానికి వల వేసేందుకే ప్రేమ కుమార్ పేరుని ఇప్పుడు లీక్ చేస్తోందని లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపిస్తున్నారు. కానీ అదయినా దైర్యంగా ఎందుకు ప్రకటించడం లేదు? అని ప్రశ్నిస్తున్నారు.   జనతా పరివార్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఉన్న నితీష్ కుమార్ ప్రజలలో ప్రాంతీయవాదం రెచ్చ గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీహార్ రాష్ట్రాన్ని పరిపాలించవలసినది బీహారీలా లేక బాహర్ వాలా (బయట వాళ్ళా)? అని ప్రశ్నిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరూ ఏ ఎన్నికలలో బీజేపీకి నేతృత్వం వహిస్తున్నందుకు నితీష్ కుమార్ దానిని కూడా ఒక అవకాశంగా వాడుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దానిని అమిత్ షా అంతే గట్టిగా తిప్పి కొట్టారు. ఎన్నికలలో పార్టీ తరపున ప్రచారం చేయడానికి చాలా మంది వస్తారు. కానీ అలాగా వచ్చిన వాళ్ళలో ఒకరిని బీహార్ ముఖ్యమంత్రిగా చేయలేము కదా? బీహార్ ఎన్నికలలో పోటీ చేసి గెలిచినా బీహారీ వ్యక్తే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు తప్ప బయట వాళ్ళు కాదు కదా? అని జవాబు చెప్పారు.

ఏపీకి ఆర్ధిక ప్యాకేజీపై ప్రకటన ఇంకా ఎప్పుడు?

  ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రప్రభుత్వం ఇంచుమించు తేల్చి చెప్పేసింది. దానికి బదులుగా మంచి ఆర్ధిక ప్యాకేజీ ఇస్తామని ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. రాష్ట్రానికి ఎటువంటి ఆర్ధిక ప్యాకేజి అవసరమో తెలిపే రోడ్ మ్యాప్ సిద్దం చేయమని ప్రధాని నరేంద్ర మోడీ సంబందిత అధికారులను ఆదేశించి చాలా కాలమే అయ్యింది. వారు రాష్ట్ర అధికారులతో కలిసి అదే పని మీద ఉన్నారు. బహుశః ప్రధాని నరేంద్ర మోడీ ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి వచ్చేలోగానే దానిపై ఒక నిర్దిష్టమయిన ప్రకటన వెలువడవచ్చని అందరూ భావిస్తున్నారు.   ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవ్వాళ్ళ డిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని, హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ లని కలిసి వారిని అమరావతి శంఖుస్థాపనకు ఆహ్వానించినపుడు ప్రత్యేక ప్యాకేజి గురించి కూడా వారితో మాట్లాడే అవకాశం ఉందని భావించవచ్చును. కనుక ఈరోజు ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ దాని గురించి ఏమయినా ప్రకటన చేస్తారా లేక ప్రధాని నరేంద్ర మోడీయే స్వయంగా అమరావతి వచ్చినప్పుడు స్వయంగా ప్రకటిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

ప్రత్యేక హోదా సాధించేవరకు పోరాడుతాం: బొత్స సత్యనారాయణ

  జగన్మోహన్ రెడ్డి ఆరు రోజుల ‘నిరవధిక నిరాహార దీక్ష’ చివరికి ఏవిధంగా ముగుస్తుందని అందరూ భావించారో అదే విధంగా ముగిసింది. కానీ దీక్ష మొదలుపెట్టిన మొదటి రోజు నుండి చివరి రోజు వరకు తెదేపా-వైకాపా నేతల మధ్య చాలా రసవత్తరమయిన వాదోపవాదాలు, విమర్శలు ప్రతివిమర్శలు సాగాయి. జగన్ దీక్షను పోలీసులు భగ్నం చేసిన తరువాత సమావేశమయిన వైకాపా నేతలు ప్రత్యేక హోదా కోసం తమ పోరాటాన్ని కొనసాగించేందుకు కార్యాచరణ రూపొందించారు.   దాని ప్రకారం బుదవారం నాడు విజయవాడ పి.డబ్ల్యూ డి మైదానం నుంచి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహిస్తారు. దీనిలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు నేతలు, కార్యకర్తలు అందరూ పాల్గొంటారు. ఆ తరువాత మళ్ళీ ఈనెల 17నుండి 21వ తేదీ వరకు అన్ని నియోజక వర్గాలలో రిలే నిరాహార దీక్షలు, 18న నియోజక వర్గాలలో ర్యాలీలు, 19న నియోజక వర్గ కేంద్రాలలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నాలు, 20వ తేదీ సాయంత్రం అన్ని నియోజక వర్గాలలో కొవ్వొత్తుల ర్యాలీలు, 21న అన్ని బస్సు డిపోల ముందు ధర్నాలు నిర్వహిస్తారు.   సాధారణంగా గ్రామస్థాయి నుండి ఇటువంటి కార్యక్రమాలతోనే ఉద్యమాలు మొదలుపెట్టి, చిట్ట చివరి అస్త్రంగా నిరాహార దీక్ష చేస్తుంటారు. కానీ కారణాలు ఎవయితేనేమీ జగన్మోహన్ రెడ్డి ముందు నిరాహార దీక్షకి కూర్చొన్నారు. ఆశించిన ఫలితం పొందకుండానే దీక్ష ముగిసిపోయింది. దీక్షతో పతాక స్థాయికి చేరవలసిన ఉద్యమాన్ని మళ్ళీ ఏబిసిడిల నుండి మొదలుపెట్టవలసి వస్తోంది. ప్రత్యేక హోదా సాధించేవరకు తమ పోరాటం కొనసాగుతుందని వైకాపా నేత అంబటి రాంబాబు తెలిపారు. కానీ వైకాపా చేస్తున్న ఈ పోరాటానికి ఎంతకాలం ప్రజలు మద్దతు ఇస్తారు? ప్రజల మద్దతు లేకుండా వైకాపా ఎంతకాలం తన పోరాటం కొనసాగించగలదు? అని ఆలోచించుకొని మొదలుపెడితే మంచిదేమో? లేకపోతే మళ్ళీ మధ్యలోనే ముగిస్తే చివరికి నవ్వులపాలయ్యేది జగన్మోహన్ రెడ్డే.