ఈ ప్రశ్నలు వేసుకుందాం... సిగ్గనిపిస్తే తలదించుకుందాం!
హవాల్డార్ రవి పాల్, జమ్ము...
సిపాయ్ రాకేష్ సింగ్, బీహార్...
సిపాయ్ జవ్రా ముండా, జార్ఖండ్...
సిపాయ్ జనరావ్ ఉకే, మహారాష్ట్ర...
సిపాయ్ బిస్వజీత్ ఘొరాయ్, పశ్చిమ బెంగాల్...
లాన్స్ నాయక్ ఆర్కే యాదవ్, ఉత్తర్ ప్రదేశ్...
వీళ్లంతా ఎవరో తెలుసుగా? పాక్ నుంచి అక్రమంగా వచ్చిన ఉగ్ర నక్కలకి బలైపోయిన మన సింహాల్లాంటి జవాన్లలో కొందరు!
అది సర్లేగాని... ఈ అమరులు నిజంగా ఎవరు? బీసీలా? దళితులా? ఆదివాసీలా? బ్రాహ్మణులా? ఏ కులం వారు? వాళ్ల రంగేంటి? ఉత్తరాదిన వుండే తెల్లటి ఆర్యులా? దక్షిణాదిన వుండే నల్లటి ద్రవిడులా? పోనీ వాళ్లు ఏ భాష మాట్లాడతారు? మరాఠీనా, డోగ్రీనా, మైథిలీనా, బెంగాలీనా, తెలుగా? సరే... కనీసం వాళ్లు తాగే నీళ్లేవీ? కావేరీవా? కృష్ణవా? గంగవా? లేక యమునవా? ఈ ప్రశ్నలకి సమాధానం ఇదొక్కటే... ఆ వీర జవాన్ల గుర్తింపు ఒక్కటే... భారత సైనికులు! వాళ్ల వర్ణం కూడా ఒక్కటే... అది తమ యూనీఫామ్ రంగు! ఇక వాళ్లు మాట్లాడే భాష కూడా ఒకే ఒక్కటి! నామ్ , నమక్ ఔర్ నిషాన్... ఇదే ఆ అమరులు ఎప్పుడూ మాట్లాడింది!
ఇవాళ్ల హుతాత్ములై అమర జవాన్ల స్థూపంలో తాము అంతర్భాగమైన వీరంతా సజీవ దహనం చేయబడ్డారు. ఆద మరిచి నిద్రపోతున్నప్పుడు ఉగ్రవాదులు పిరికిపందల్లా వారిని శాశ్వత నిద్రలోకి తోసేశారు. అయినా మనకు చీమ కుట్టినట్టైనా వుందా? ఏమైనా చేద్దామని హృదయం ద్రవిస్తోందా? లేదు కదా... ఒక రోహిత్ వేముల తనని తాను ఉరివేసుకుంటే వేల మంది కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చింది. అలా కదిలిపోయేలా ఉద్యమం నడిపించారు. ఒక దోషిగా తేలిన ఉగ్రవాది, యాకుబ్ మెమన్ ఉరికంబం ఎక్కితే చాలా మందికి ఊపిరాడలేదు. వేలాది మంది అతడి అంతిమ యాత్రలో పాలుపంచుకున్నారు! ఇక మొన్నటికి మొన్న ఒక ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్లో ఎండ్ అయ్యాడు. కాని, తరువాతేం జరిగింది? ఆయన తండ్రి స్కూల్ హెడ్ మాస్టర్ అంటూ గొప్పగా సానుభూతి ప్రచారం మొదలైంది!
మరి... ఇప్పుడు మన కోసం, మన దేశం కోసం ప్రాణాలొదిలిన ఈ 17మంది అంతిమ యాత్రకు ఎంత మంది బయలుదేరుతారు? అయినా మనకు అసలు అంత టైముందా? ఈ దేశంలో ప్రతీ రోజూ వేలాది మంది రోడ్ల మీదకు వస్తారు. ప్రభుత్వ అస్తుల్ని తగులబెడతారు. ప్రజలపై పరోక్షంగా దాడి చేస్తారు. ఒక రోజు కొందరు నీళ్లు కావాలని రోడ్డెక్కితే, మరో రోజు మరి కొందరు రిజర్వేషన్లు కావాలంటూ గళమెత్తుతారు, ఇక ఇంకా కొందరు తమ భాష కోసం, నేరస్థులు, ఉగ్రవాదులకి తమ మద్దతు తెల్పటం కోసం కూడా వీధుల్లో వీరంగం వేస్తారు! కాని, ఇప్పుడు జాతి శత్రువుల చేతిలో నిర్జీవులైన జవాన్ల కోసం ఎవ్వరూ ఇంటి నుంచి బయటకు రారు!
నిన్న 17మంది కావచ్చు... రేపు 25మంది అవ్వొచ్చు... ఎంత మంది యువ సైనికులు భరతమాత కోసం ప్రాణాలు అర్పిస్తే మాత్రం మనకేంటి? ఒక జాతిగా మన ప్రతిస్పందన ఏంటి? అదే రక్తం మరిగిన పాకిస్తాన్ తో క్రికెట్ ఆడతాం! అదే పాకిస్తాన్ నుంచి వచ్చే గులాం అలీ సంగీతం వింటూ గంగిరెద్దుల్లా తలలూపుతాం! భజ్రంగీ భాయ్ జాన్, పీకే లాంటి పాకీ కనెక్షన్ వున్న పాడు సినిమాల్ని సూపర్ హిట్ చేస్తాం! ఉగ్రవాదుల్ని మన మీదకి పంపించే పాకిస్తాన్ లోంచే నటుల్ని తెచ్చుకుని సిగ్గూ షరమ్ లేకుండా... చొంగ కారుస్తూ బాలీవుడ్ తెరపై చూసుకుంటాం!
మన కోసం, మన దేశం కోసం, మన దేశ సార్వభౌమత్వం కోసం, స్వేచ్ఛా, స్వతంత్రం, సంతోషాల కోసం... చలిలో, వేడిలో, కష్టంలో, నరకంలో దేశ రక్షణ చేసే అసలు హీరోలు సైనికులు! వాళ్లని గౌరవించలేని మనం.. వాళ్లు పెట్టే భిక్ష లాంటి స్వాతంత్ర్యానికి అర్హులమేనా? ఆలోచించుకుందాం...