'బిర్యానీ' రుచి మరుగుతోన్న నిరసనకారులు!
posted on Sep 19, 2016 @ 12:26PM
కొన్ని సంఘటనలు అప్పటికప్పుడు షాక్ కి గురి చేస్తాయి! కాని, తరువాత మెల్లిమెల్లిగా మన సమాజంలోని సత్యాన్ని బయటపెడుతూ ఆందోళన కలిగిస్తాయి! అలాంటిదే ఈ మధ్య జరిగిన కావేరీ జలాల గొడవ, దాని తాలూకూ విద్వంసం... తమిళనాడు, కర్ణాటకల మధ్య కావేరీ జలాల పంపకంపై గొడవ ఈనాటిది కాదు. అది రెండు వైపుల ప్రజల్లో దారుణమైన సెంటిమెంట్ గా మారిపోయింది. దానికి రాజకీయ నాయకులు ఆజ్యం పోసీ పోసీ జనాన్ని శత్రువులుగా మార్చేశారు. ఇదొక పెద్ద విషాదం. ఒక నది నీళ్లు న్యాయంగా పంచుకోవటానికి కూడా వీలుపడని అమానుష స్థితి సాటి భారతీయుల మధ్య ఏర్పడటం... చాలా ఆందోళనకరం!
కావేరీ జలాలు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల రాజకీయ నేతల వ్యవహార శైలి.... ఇదంతా ఒక ఎత్తైతే... అసలు విషాదం మరొకటి వుంది. ఎక్కడో సుప్రీమ్ కోర్టు తమిళనాడుకు నీళ్లివ్వాలని కర్ణాటకను ఆదేశిస్తే బెంగుళూరులో విధ్వంసం జరిగింది. అదీ జనం తమంత తాముగా రోడ్ల మీదకి వచ్చి బస్సలు, టైర్లు తగులబెట్టారన్నట్టుగా ప్రచారం జరిగింది. కాని, కాస్త ఆలోచిస్తే దీంట్లో బోలెడు కుట్ర కనిపిస్తుంది. కావేరీ జలాల అవసరం అత్యంత ఎక్కువగా వుండేది కర్ణాటక రైతులకి. వాళ్లు విధ్వంసం సృష్టించిన దాఖలాలు కనిపించటం లేదు. ఎవరో ముక్కూ, మొఖం తెలియని బెంగుళూరు నగరంలోని అల్లరి మూకలు బస్సుల్ని తగులబెట్టాయి. వీళ్లకు కావేరీ జలాల మీద, రైతుల మీద ఎందుకంత ప్రేమ? ఎవరు వాళ్లని ఉసిగొల్పుతున్నారు? ఇవే అసలు ప్రశ్నలు!
కర్ణాటకలోనే కాదు ఆ మధ్య రాష్ట్ర విభజనకి ముందు మన తెలుగు నేలపై కూడా ఇదే జరిగేది! ఒక పద్ధతి ప్రకారం ఏర్పడ్డ వ్యవస్థ గంటల వ్యవధిలో నిరసనకారుల్ని రోడ్లపైకి తెచ్చేసేది. తెలంగాణ కావాలన్నా కోరిక, సమైక్యాంధ్ర వుండాలన్న తపన ... ఈ రెండూ నిజమే అయినా జనం తమంత తాముగా వీదుల్లోకి రారు. మరి వాళ్లను ఎవరు తీసుకొస్తున్నారు? దీనికి సమాధానమే బిర్యానీ బ్యాచీ! దేశంలో ఎంత పెద్ద ఉద్యమమైనా, లేదంటే ఎంత పెద్ద బహిరంగ సభ అయినా, కాదంటే ఎంత పెద్ద ఓదార్పు యాత్రైనా... ఇలా ఎక్కడ ఏ కార్యక్రమానికి జనం అవసరం అయినా బిర్యానీ టెక్నిక్ వాడుతున్నారు ఈవెంట్ మ్యానేజర్స్! ఓ బిర్యానీ, రెండొందలో, మూడొందలో డబ్బు ఇస్తే ఇన్స్టాంట్ ఉద్యమకారులు ప్రత్యక్షమం అవుతన్నారు. వీళ్ల మద్యే పాపం కొంత మంది నిజాయితీ పరులు కూడా తమ వర్గమో, జాతి క్షేమం కోసమో పోరాడవచ్చు. కాని, ఈ అసలు కంటే కొసరు శాల్తీలు మరీ ఎక్కువైపోతున్నాయి. ఎన్నికల ప్రచారం నుంచి మొదలు పెడితే తాజా కావేరీ జలాల నిరసనల వరకూ అంతటా బిర్యానీ బ్యాచీనే!
ఏ నిరసన, ఏ ధర్నా, ఏ రాస్తారోకో అయినా బిర్యానీ పెట్టించి జనాన్ని తేవటం పెద్ద ప్రమాదకరం ఏం కాదు అనుకుంటే పొరపాటే. బెంగుళూరులో కావేరీ జలాల గొడవ నేపథ్యంలో కేపీఎన్ అనే సంస్థ తాలూకూ బస్సుల్ని నిరసనకారులు తగులబెట్టారు. ఒకటి రెండు కాదు 42బస్సుల్ని దహనం చేశారు. దీనికి ప్రధాన కారణం అంటూ పోలీసులు ఓ 22ఏళ్ల యువతిని అరెస్ట్ చేశారు! ఆశ్చర్యకరంగా ఆమె ఎవరో పార్టీ మనిషి కాదు, పోనీ ఏదో సంఘానికి నాయకురాలు కూడా కాదు. కేవలం కూలి పని చేసుకునే పేదరాలు! కూలీకి వెళ్లే 22ఏళ్ల మహిళ తనకు బిర్యానీ పెట్టి వంద రూపాయలు ఇస్తారంటే నిరసనల్లోకి వచ్చింది. తీరా వచ్చాక తానేం చేస్తుందో తనకు తెలిసేలోపే ఇతర నిరసనకారుల్ని రెచ్చగొట్టి 42 బస్సుల్ని తగులబెట్టించింది. కేపీఎన్ సంస్థ ఉద్యోగుల పై కూడా డీజిల్ పోశారట! అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం కాలేదు!
పోలీసులు చెబుతున్నట్టు బిర్యానీ కోసం రోడ్డుపైకి వచ్చిన ఒక పేదరాలే నిజంగా దారుణమైన విధ్వంసానికి కారణం అయితే ... దీనిపై గట్టి నిఘా పెట్టాల్సిందే! ఏ కార్యక్రమం జరిగినా జనం ఎక్కడ్నుంచి వస్తున్నారు, ఎవరు తెస్తున్నారు, ఎలా వాళ్లని తీసుకొచ్చే వారు కన్విన్స్ చేస్తున్నారు... ఇవన్నీ నిఘా సంస్థలు కనిపెడుతూ వుండాలి. లేదంటే... బెంగుళూరు తరహా అరాచకం మళ్లీ మళ్లీ జరిగే ప్రమాదం వుంది!