భారత సైనికుల్ని... ఇండియానే చంపిందంటోన్న పాక్ మీడియా!
posted on Sep 20, 2016 @ 11:48AM
భారతదేశానికి కాశ్మీర్ ఒక సమస్య. కాని, పాకిస్తాన్ కు కాశ్మీర్ సమస్యే పెద్ద జీవనాధారం! ఇది కాస్త విచిత్రంగా వున్నా నిజం. అక్కడి పాలకులకి కాశ్మీర్ సమస్య చక్కటి మంత్రదండం! తమకు ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు బయటకి తీస్తుంటారు. మనపైనే కాదు తమ స్వంత ప్రజలపై కూడా ప్రయోగిస్తుంటారు.
పాకిస్తాన్ లో లేని దరిద్రం అంటూ లేదు. అక్కడ పేదరికం, నిరుద్యోగం, మతోన్మాదం, హింస, స్త్రీలు, బాలలపై దాడులు... ఇలా అన్నీ వున్నాయి. అన్నిట్నీ మరిపించి జనాన్ని ఆవేశంతో ఊగిపోయేలా చేసేది... కాశ్మీర్ ఒక్కటే! పాకిస్తాన్ పాలకులు పదే పదే కాశ్మీర్ ప్రస్తావన చేయటం ఇందుకే. తమ లోకల్ మీడియా గొట్టాల ముందు మొదలు పెడితే ఐక్యరాజ్య సమితి మీటింగ్ లో మైకుల ముందు వరకూ పాకీలకు ఇదే పని! కాశ్మీర్ జపం చేస్తూ తమ దేశంలో జరుగుతున్న అరాచకం కప్పి పుంచుకుంటుంటారు.
పాకిస్తాన్ లో పొలిటీషన్స్, మిలటరీ వాళ్లు, ఉగ్రవాద నాయకులు, మతోన్మాదులు...ఇలాంటి వాళ్లు సరే! ఆఖరుకి మీడియా కూడా ఇండియా, కాశ్మీర్ నెపం చెప్పుకునే బతికేస్తోంది! మొన్న యూరీలో జరిగిన ఉగ్రవాద దాడి తరువాత అక్కడి న్యూస్ పేపర్లు వింత వింత వాదనలు ముందు తీసుకొచ్చాయి! తమ ప్రధాని నవాజ్ షరీఫ్ యూఎన్ ఓలో కాశ్మీర్ ప్రస్తావన తేబోతుండటంతో భారత్ కావాలనే ఉగ్రవాద దాడి నాటకం నడుపుతోందని ఆరోపించాయి! అవును... మీరు వింటున్నది నిజమే... పాక్ పత్రికలు ఇండియ తన సైనికుల్ని తానే చంపుకుని పాక్ పై నింద వేస్తోందని చెబుతున్నాయి! ఇదీ వరస...
పాకిస్తాన్ పేపర్లకు టీవీలు కూడా ఏం తీసిపోవు. వాటిల్లో కూడా పొద్దున్నా, సాయంత్రం మైకులు పగిలేలా చర్చలు పెడుతుంటారు. అందులోనూ పాకిస్తాన్ జనానికి అసలు నిజం కాకుండా అంతా బూతులే వినిపిస్తుంటారు! సో కాల్డ్ మేధావులు స్టూడియోల్లోకి వచ్చి పిచ్చి వాగుడంతా వాగుతుంటారు! పాకిస్తాన్ మిలటరీ కమాండర్లు మాట్లాడినట్టే ఉన్మాదంగా ఇండియాని ఓడిస్తాం అంటూ బీరాలు పలుకుతుంటారు! వీటన్నిటి మధ్యా సామాన్య పాకిస్తానీలు మాత్రం భ్రమలు, భయాలు, ఆవేశాలు, ఆక్రోశాల మధ్యే కాలం గడిపేస్తున్నారు! పాకిస్తాన్ తన ఉగ్ర వాద నక్కలతో కలిసి చేసే చిన్నా చితకా దాడులతో ఏదో ఒక రోజు కాశ్మీర్ భారత్ నుంచి విడిపోతుందని కలలుగంటున్నారు! ఇక వాళ్లని, వాళ్ల దేశాన్ని అక్కడి మీడియా, మేధావులు, నేతలు, మిలటరీ, ఉగ్రవాదుల నుంచి ... అల్లానే కాపాడాలి!