పాకిస్తాన్ కోసం పాపిష్ఠి ప్లాన్ వేసిన కాంగ్రెస్!
posted on Sep 21, 2016 @ 5:49PM
సెప్టెంబర్ 21... ఇంటర్నేషనల్ పీస్ డే! పీస్ అంటే శాంతే కాదు... ఇంగ్లీషులో చిన్న ముక్క అని కూడా అర్థం! గత యూపీఏ ప్రభుత్వం బహుశా పీస్ అంటే శాంతికి బదులు ముక్క అని అర్థం చేసుకుందేమో! అందుకే, పాకిస్తాన్ కు మన దేశం లోంచి ఓ ముక్కను తీసి ఇచ్చేద్దామనుకుంది! అదీ ఏ పనికిమాలిన ప్రాంతమో కాదు. ఏకంగా అత్యంత భౌగోళిక ప్రాధాన్యమున్న సరిహద్దు ప్రాంతాన్నీ! ఇంతకీ మన్మోహన్ సింగ్ వారి సోనియా ప్రభుత్వం చేసిన ఘనకార్యం ఏంటో తెలుసా?
వికీలీక్స్ తాజా లీకేజీల్లో కాంగ్రెస్ మార్కు జాతి విద్రోహం బయటపడింది. భారత్, పాక్ సరిహద్దులో వున్న సియాచిన్ గ్లేసియర్ ప్రాంతం శత్రు దేశానికి అప్పగిద్దామని యూపీఏ భావించిందట! కాని, ఇండియన్ ఆర్మీ తీవ్ర అభ్యంతరం చెప్పటంతో మన్మోహన్ వారు వెనక్కి తగ్గారట. ఇంతకీ సియాచిన్ పాక్ కు ఇచ్చేస్తే లాభం ఏంటి? ఏం లేదనే అంటున్నారు బుర్రలో ఏ మాత్రం గుజ్జు వున్న వారైనా. కాని, సోనియా నేతృత్వంలోని యూపీఏకు అలా అనిపించలేదు. సియాచిన్ హిమనీ ప్రాంతం పాక్ కు ఇచ్చేస్తే ఆ దేశం మంచిదైపోయి మనల్ని ఇబ్బంది పెట్టకుండా వుంటుందని అనుకున్నారు! అంతే కాదు, కాశ్మీర్ సమస్య పరిష్కారానికి, పాక్ తో శాంతికి మన్మోహన్ కూడా తన వంతు కృషి చేశారని చరిత్ర చెప్పుకుంటుందని కక్కుర్తి పడ్డారు!
సియాచిన్ ఊరికే మన దేశంలో అంతర్బాగం కాలేదు. ఇప్పటి వరకూ దాదాపు 900ల మంది జవాన్లు అమరులైతే అది మన చేతుల్లో వుంది. 1984లో భారత ఆర్మీ ఎంతో కష్టపడి, ప్రాణాలొడ్డి దాన్ని కైవసం చేసుకుంది. ఎత్తైన ఆ ప్రాంతం ఒకవేళ పాక్ చేతిలో వుంటే పై నుంచి కాల్పులు జరపటం తేలిక. బుల్లెట్స్ కి ఎదురొడ్డి పైకి ఎక్కుతూ యుద్ధం చేయటం మన సైనికులకి నరకం లాంటిది. అయినా ఇవేవీ సోనియా, మన్మోహన్ లకు పట్టలేదు...
యూపీఏ అధికారంలో వుండగా సియాచిన్ పాక్ కు అప్పగించి మంచి పేరు తెచ్చుకుందామని అప్పటి పాలకులు దాదాపు నిర్ణయించారట. కాని, ఆర్మీ వద్దని పట్టుబట్టడంతో వెనక్కి తగ్గారట. వికీలీక్స్ చెప్పిన సారాంశం ఇది. కాని, ఇక్కడ విబ్రాంతికరం ఏంటంటే మన పాలకుల జాతి వ్యతిరేక స్వార్థ చింతన!
అసలు కాశ్మీర్ సమస్యకు నెహ్రు ఎంతగా మూల కారణమో అందరికీ తెలిసిందే. ఆ తరువాత ఇందిర దైర్యంగా బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించి పాక్ కు చుక్కలు చూపించింది. కాని, ఆమె కూడా ప్రపంచం ముందు మంచి పేరు తెచ్చుకోవటం కోసం 90వేల మంది పాక్ సైనికుల్ని బేషరతుగా విడిచిపెట్టింది. కాని, బంగ్లాదేశ్ యుద్దం తరువాత మన వద్ద గొప్ప అవకాశం వుండింది. పాక్ తన 90వేల సైనికులు, మన చేతిలో వున్న కరాచీ నగరం కోసం అప్పుడే కాశ్మీర్ సమూలంగా మనకు ఇచ్చేసేది. కాని, చరిత్రలో తనకంటూ గొప్ప పేరు వుండాలని ఇందిరా గాంధీ కాశ్మీర్ తేల్చకుండానే పాక్ ను విడిచిపెట్టేసింది!
ఇందిర తరువాతి కాలంలో పీఎం అయిన మరో అతి సెక్యులర్ మేధావి ఐకే గుజ్రాల్. బారత దేశ ముస్లిమ్ లను వెనకేసుకు రావటానికి, పాక్ ను వెనకేసుకురావటానికి కూడా ఈయనకు తేడా తెలియదు. పాకిస్తానీలు తనకు ఓటు వేస్తారన్నట్టుగా రా కార్యకలాపాలు మూసేయించాడు. అవును, గుజ్రాల్ మహానుభావుడు పాక్ పై నిఘా పెట్టే ఆర్ సంస్థ కార్యకలాపాలే కట్టి పెట్టేశాడు! అది సృష్టించిన సమాచార లోపమే చివరకు వాజ్ పేయ్ టైంలో కార్గిల్ ఉదంతంగా మారింది.
వాజ్ పేయి,ఇప్పుడున్న మోదీ కూడా పాక్ తో సత్సంబంధాలే కోరుకున్నారు. కాని, చరిత్ర స్పష్టంగా చెబుతోన్న గుణపాఠం ఏంటంటే పాక్ ది వంకర తోక. అది ఇక్కడి ప్రధాని ఎవరు స్నేహ హస్తం చాచినా ఆ చేయిపై వేటు వేయాలనే చూస్తుంది! అందుకే, ఒకవేళ మన్మోహన్ సియాచిన్ ఇచ్చివేసి వుంటే కూడా ఇలాగే ఉగ్రదాడులు చేస్తూనే వుండేది. పైగా మన సైన్యం ఆ నిర్మానుష్యమైన మంచు ముక్క కోసం చేసిన త్యాగాలు వృథా అయ్యేవి!
కాంగ్రెస్ పాలనలో సాగిన యూపీఏ శకం దారుణమైన పాక్ అనుకూల వాదులకి సాక్షి. ఆ పార్టీ నేత మణిశంకర్ అయ్యర్ మోదీ ప్రధాని అయ్యాక కూడా పాక్ వెళ్లి అక్కడి వారితో కలిసి మోదీని ఓడిద్దాం అంటాడు. దిగ్విజయ్ సింగ్ పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని జనాభ్, సాహెబ్ అంటూ గౌరవంగా పిలుస్తుంటాడు. మొన్నటికి మొన్న భారత ఆక్రమిత కాశ్మీర్ అంటూ సిగ్గు లేకుండా మాట్లాడాడు. అంతే కాదు, ముంబై దాడులకి పాక్ ఉగ్రవాదులు కాదు ఆరెస్సెస్ కారణమంటూ రాసిన పిచ్చి పుస్తకాన్ని కూడా దిగ్విజయ్ సింగే ఆవిష్కరించాడు...
ఎవరో చిన్నా చితక నేతలు కాదు ఏకంగా రాహుల్ గాంధీనే... అరెస్సెస్, ఇస్లామిక్ ఉగ్రవాదం కంటే డేంజర్ అంటూ చెప్పాడు. ఆ విషయం కూడా వికీలీక్సే బయటపెట్టింది! ఇలా పార్టీ మొత్తం ఇండియాకు వ్యతిరేకంగా పని చేస్తూ వచ్చింది సోనియా నేతృత్వంలో. తాజాగా బయటపడ్డ ఆధారాలతో ఇటలీ నుంచే కాశ్మీర్ వేర్పాటు వాదులకి నిధులు కూడా వస్తున్నాయని తేలింది. ఇన్ని విధాలుగా మన నాయకులు దేశానికి హాని చేయటానికి సిద్ధపడ్డారు...
సియాచిన్ పాక్ కు ఇచ్చేస్తే ఆ దేశం బాగుపడుతుందని ఒకవేళ నిజంగానే మన్మోహన్ ఆశిస్తే అది గొప్పతనం కాదు... ఆయన అమాయకత్వం అవుతుంది. ఇంకా కాదంటే సోనియా కారణంగానే అతను అలా ప్రవర్తించి వుంటాడని అనుకోవచ్చు. ఎందుకంటే, యూపీఏలో ప్రభుత్వం మన్మోహన్ దైనా పాలన సోనియాదే కదా! అప్పుడు ఈ సియాచిన్ పాపం కూడా గాంధీల ఖాతాలోకే వెళ్లాలి...