బాప్ రే బాప్ అంటోన్న బచ్చా సీఎం...
posted on Sep 22, 2016 @ 12:52PM
మనకు సైకిల్ గుర్తు చూడగానే టీడీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. కాని, ఉత్తరాదిలో మరో సైకిల్ వుంది. అదే సమాజ్ వాది వారి సైకిల్! ములాయం సింగ్ యాదవ్ వారి ఈ పార్టీ ఉత్తర్ ప్రదేశ్ ను ఏళ్ల తరబడి ఏలింది. ఇప్పుడూ ఏలుతోంది! కాకపోతే, గతంలో ములాయం సీఎం అయితే ఇప్పుడు ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ సీఎం. అలాగని మీరు తండ్రి తరువాత కొడుకు వారసత్వం తీసుకున్నాడు అని లైట్ తీసుకుంటే పొరపాటే! ప్రస్తుతం సమాజ్ వాది సైకిల్ రెండు చక్రాలు ఒక దానితో ఒకటి గొడవ పడుతున్నాయి. సరిగ్గా ఎన్నికలకు ఇంకా కొన్ని నెలలే వున్న సమయంలో నానా గందరగోళం జరుగుతోంది!
దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్. దానిపై కర్చీఫ్ వేయాలని అన్ని పార్టీలు చూస్తాయి. కాని, గతంలో దశబ్దాలు లక్నోని ఏలిన లక్కీ పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు అక్కడ డమ్మీ అయిపోయింది.
రాహుల్ రైతులకి మంచాలు వేసి మీటింగ్ లు పెడుతూ నానా తంటాలు పడుతున్నా అధికారంలోకి వచ్చే సీన్ కనిపించటం లేదు. అలాగే, ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో వున్న రామ జన్మభూమి వివాదంతో బీజేపి ఇవాళ్ల ఏకంగా దేశాన్నే ఏలుతోంది. ఒకప్పుడు ఉత్తర్ ప్రదేశ్ ను కూడా పరిపాలించింది. కాని, కాల క్రమంలో బాబ్రీ లాగే ఆ పార్టీ కూడా కుప్పకూలింది. ఇప్పుడు అమిత్ షా ఎలాగైనా ఉత్తర్ ప్రదేశ్ లో కమలం వికసింపజేయాలని, రాముని భూమిలో రాజ్యం చేయాలని తపిస్తున్నారు!.ఉత్తర్ ప్రదేశ్ లో జాతీయ పార్టీలకు బతుకు దుర్బరం చేసినవి ప్రాంతీయ పార్టీలే. వాటిలో మొదటిది సమాజ్ వాది. రెండోది బహుజన్ సమాజ్ పార్టీ. వీళ్లు కులాల ఫార్ముల నమిలి మింగి అరిగించేసుకుని రాటుదేలారు. మాయవతి దళితులంటే ములాయం యాదవ్ లు, బీసీలు, ముస్లిమ్ లు అన్నాడు. ఇలా సమాజాన్ని అడ్డంగా విభజించి పాలిస్తున్నాయి ఉత్తర్ ప్రదేశ్ లోని రెండు సమాజ్ పార్టీలు! అందులో ప్రస్తుతం అధికారంలో వున్నది ... దేశంలోనే అత్యంత కరుడుగట్టిన కుటుంబ పార్టీ సమాజ్ వాది!
యూపీని పరిపాలిస్తోన్న ఎస్పీ మళ్లీ అధికారంలోక్ వచ్చే సూచనలు అస్సలు కనిపించటం లేదు. అందుకు కారణం గత నాలుగేళ్లుగా ఆ రాష్ట్రంలో జరుగుతున్న దారుణమైన నేరాలే. అభివృద్ది మాట అటుంచితే కనీసం శాంతి భద్రతలు కూడా కాపాడలేకపోయాడు అఖిలేష్ యాదవ్. అందుకు కారణం మరెవరో కాదు ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు, మద్దతు దారులే.సమాజ్ వాది అధికారంలో వస్తే దళితులు టార్గెట్ అవుతారన్న మాట మరోసారి నిజం చేశారు ఈసారి కూడా. యూపీలో పదే పదే దళితులపై దాడులు జరిగాయి. అంతే కాదు, ఆజం ఖాన్ లాంటి ఎస్పీ నేతల వల్ల హిందు, ముస్లిమ్ గొడవలు కూడా బాగానే జరిగాయి. ఎక్కడపడితే అక్కడ మత కలహాలు రాజుకున్నాయి.
ఎలాగో నాలుగేళ్లు పూర్తి చేసుకుని వచ్చే సంవత్సరం ఎన్నికలకి వెళుతోన్న అఖిలేష్ కి క్లైమాక్స్ కి ముందు స్వంత తండ్రే షాకిచ్చాడు. అఖిలేష్ తన మద్దతు దారులకి పార్టీ పదవులు కట్టబెడుతూ ఎన్నికలకి ప్రిపేర్ అవుతుంటే ములాయం అడ్డంగా ఎంటరై తన తమ్ముడ్ని పార్టీ చీఫ్‌గా ఎంపిక చేశాడు. అఖిలేష్ ను పట్టించుకోకుండా ములాయం నిర్ణయాలు తీసుకోవటమే కాదు అసలు కుర్ర యాదవ్ తన వల్లే సీఎం అయ్యాడని ప్రకటించాడు. ఇప్పటికే నేనే బాస్ అంటూ హెచ్చరించాడు.మొత్తానికి ములాయం చర్యల వల్ల అఖిలేష్ డమ్మీ కావాల్సి వచ్చింది! ఆయన ఎంపిక చేసిన అభ్యర్థుల్ని ఇప్పుడు ములాయం మనుషులు టార్గెట్ చేసి పార్టీ నుంచి బయటకు పంపుతున్నారు. ఒకప్పటి ములాయం స్నేహితుడు, జయప్రదకి ఆప్తుడు అమర్ సింగ్ కూడా చక్రం తిప్పటం మొదలుపెట్టాడు. అఖిలేష్ కి అమర్ సింగ్ అంటే కూడా పడదు. ఇలాంటి అమర్ సింగ్ లు చాలా మందే ములాయం అండతో సమాజ్ వాదిలో చెలరేగుతున్నారు!
దేశంలోని చాలా పార్టీల్లో అంతర్గత విభేదాలు చూశాం. కాని, ఎస్పీ లాంటి ఒక కుటుంబ పార్టీలో తండ్రి కొడుకులు ములాయం, అఖిలేష్ లే ప్రత్యర్థులుగా మారటం ... నిజంగా విడ్డూరమే! తమ పార్టీనే ఇంత గొప్పగా నడుపుతున్న సదరు నేతలంతా ఉత్తర్ ప్రదేశ్ ను ఎంత ఉత్తమంగా నడిపి వుంటారో .. మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు!