ఆటలాడితే కోట్లు... ఆత్మ త్యాగం చేస్తే లక్షలా..?
posted on Sep 20, 2016 @ 6:00PM
ఇప్పుడు దేశమంతా దేని గురించి మాట్లాడుతోంది? యూరీలో జరిగిన దారుణం గురించి, పాకిస్తాన్ గురించి, ఉగ్రవాదం గురించి, అమరులైన జవాన్ల గురించి! మనం ఓ పని చేద్దాం. వెరైటీగా కొన్నాళ్ల కింద నడిచిన ఒలంపిక్స్ మెడల్ హంగామా గురించి మాట్లాడుకుందాం! ఎందుకు అంటారా? వినండీ... మీకే తెలుస్తుంది!. సింధు సిల్వర్ గెలిచింది! ఈ వార్త దేశమంతా దావాణలంలా వ్యాపించింది. అంతకంటే ముందే సాక్షి మలిక్ కుస్తీలో పతకం సాధించింది. అదీ సెన్సేషనే! ఇక ఈ మెడల్స్ అనౌన్స్ అయ్యాక అసలు జాతర మొదలైంది. సాక్షి తమ హర్యానా అమ్మాయి కాబట్టి అక్కడి సీఎం, తనకు ఏ సంబంధం లేకపోయినా కేజ్రీవాల్... ప్రైజ్ మనీ ప్రకటించారు! సింధుకైతే డబుల్ ధమాకా... ఒక రోజు తెలంగాణలో ఏం జరిగిందో... అదే మళ్లీ ఆంద్రాలో రీపీట్! రెండు రాష్ట్రాలు, ఇద్దరు సీఎంలు, రెండేసి సన్మానాలు, డబుల్ ప్రైజ్ మనీ! కోట్లకు కోట్లు నజరానా! అసలు చంద్రబాబు, కేసీఆర్ లే కాదు ఒలంపిక్ విజేతలకు మొక్కులు చెల్లించుకోటానికి దేశంలోని ఎక్కడెక్కడి రాష్ట్రాల సీఎంలో పోటీ పడ్డారు!
కట్ చేస్తే... ఒలంపిక్స్ విజేతలకు ఎన్ని కోట్లు ఇచ్చినా తప్పుపట్టేదేం లేదు. కాని, తప్పంతా ఇప్పుడు జరుగుతోంది! ఆటగాళ్లు దేశం కోసం మహా అయితే తమ కాలాన్ని, శ్రమని, జీవితాన్ని వెచ్చిస్తారు! మరి అర్థరాత్రి ఆద మరిచి నిద్రలో వున్న మన జవాన్లు ఎవరి కోసం ప్రాణాలు అర్పించారు? ఉగ్రవాదుల రక్తపు దాహానికి ఎందుకు బలయ్యారు? దేశం కోసం, దేశ వాసులమైన మనందరి క్షేమం కోసం! వాళ్లే లేకుంటే... మనం అసలు క్షణమైనా పడుకోగలమా? కళ్లు మూసుకుంటే మళ్లీ కళ్లు తెరవగలమా? జాతి అస్థిత్వానికే మూలమైన సైనికులు చనిపోతే... ఒలంపిక్ విజేతలకు పోటీ పడి మొక్కులు చెల్లించిన ముఖ్యమంత్రులు... ఇప్పుడు ఎక్కడా గట్టిగా గొంతు విప్పి మాట్లాడటం లేదు!
మహారాష్ట్ర, బీహార్, ఉత్తర్ ప్రదేశ్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు తమ తమ అమర జవాన్ల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించాయి! ఎంత అనుకున్నారు? అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్ 20లక్షలు అయితే అతి తక్కువగా బీహార్ 5లక్షలు ఇస్తామని చెప్పాయి! మళ్లీ ఇందులోనూ ఒక ట్విస్ట్ వుంది. ఏ రాష్ట్ర జవాను చనిపోతే ఆ రాష్ట్ర సీఎం మాత్రమే డబ్బులిచ్చారు! ఒలంపిక్స్ పతక విజేతలకు ఎగబడి ప్రైజ్ మనీ ఇచ్చిన ఏ సీఎం ఇప్పుడు స్సందిచటం లేదు.
ఢిల్లీ రాష్ట్రం నుంచి ఏ జవానూ చనిపోలేదు కాబట్టి కేజ్రీవాల్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. తెలుగు రాష్ట్రాల సీఎంలది కూడా ఇదే రూటు. తెలుగు సైనికులు అమరులు కాలేదు కాబట్టి మిగతా జవాన్లకు రూపాయి ప్రకటించలేదు. ఇది తప్పేం కాదు. కాని, దారుణం! ఒలంపిక్స్ లో పతకం గెలవటం కంటే ప్రాణాలు ధారపోయటం చిన్న విషయమా? పతక విజేతలకు కోట్లు, అమరులకు లక్షలా? సీఎంల చేతుల్లో వుండే ప్రజాధనం ఉపయోగించే పద్ధతి ఇదేనా?ఆటగాళ్లకి , సినిమా స్టార్లకి ప్రాధాన్యత ఇవ్వటం తప్పు కాదు. కాని, అంతకంటే ముఖ్యమైన రియల్ హీరోలకి గుర్తింపు , గౌరవం ఇవ్వటం మనందరి బాధ్యత. దీనికి ప్రజలు, పాలకులు ఎవ్వరూ మినహాయింపు కాదు...