కృష్ణా జిల్లా టీడీపీలో... అందరూ హ్యాపీయేనా?
posted on Sep 22, 2016 @ 12:22PM
ప్రస్తుతం వర్షాలు బాగా కురుస్తున్నాయి. దాంతో నదుల్లో వరదలు పొటెత్తుతున్నాయి. రిజర్వాయర్లు నిండుగా కళకళలాడుతున్నాయి. కాని, అదే సమయంలో హఠాత్తుగా వచ్చి చేరుతున్న కొత్త నీటితో పాత నీరు కొంత అలజడికి గురవుతోంది! ఇప్పుడు కృష్ణా జిల్లా టీడీపి పరిస్థితి కూడా నిండా నిండిన రిజర్వాయర్లా వుంది! కొత్త నీరు, పాత నీటితో కళకళ లాడుతోంది!. టీడీపికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిర్మాణం, కార్యకర్తలు, నేతలు, బడా నాయకులు వున్నా కృష్ణా జిల్లా ప్రత్యేకం. ఇప్పుడంటే అమరావతి రాజధాని కాబట్టి రాజకీయ వ్యవహారాలు పెరిగాయని అనుకోవచ్చు. కాని, గతంలో కూడా కృష్ణా జిల్లా టీడీపీ పవర్ పాలిటిక్స్ కి పెట్టింది పేరు. ఎన్టీఆర్ జన్మస్థలం నిమ్మకూరు మొదలు ఆంధ్రా రాజకీయాల రాజధాని విజయవాడ వరకూ అన్నీ కృష్ణా జిల్లాలోనే వుండటమే దీనికి కారణం. ఇక విజయవాడ చుట్టూ వుండే నియోజకవర్గాల రాజకీయ చైతన్యం గురించి అందరికీ తెలిసిందే...
2014లో టీడీపీ నవ్యాంధ్ర తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక అమరావతి రాజధాని అయింది. దాంతో సీఎం సహా మంత్రులంతా ఇక్కడే వుంటున్నారు. కాబట్టి రాజకీయంగా కీలకంగా మారిన కృష్ణా జిల్లాలో పట్టు సంపాదించటం పై చంద్రబాబు దృష్టి పెట్టారు. ఆ ఎఫెక్టే ఒకప్పటి కీలక నేత దేవినేని నెహ్రు పునరాగమనం! పార్టీ స్థాపించినప్పటి ప్రముఖ నేత అయిన దేవినేని తరువాతి కాలంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పదేళ్ల కాంగ్రెస్ హయంలో తనదైన రాజకీయం చేశారు. అయితే, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన తిరిగి స్వంత పార్టీలోకి వచ్చేశారు. ఇది ఆయనకు లాభమే కావొచ్చు కాని... అంతకంటే ఎక్కువగా టీడీపికి లాభం! ఇదే విషయం దేవినేని ప్రత్యర్థులకి బాబు చెప్పరంటున్నాయి టీడీపి వర్గాలు.
దేవినేనికి కృష్ణా జిల్లాలోని ఇతర కీలక నేతలైన వల్లభనేని వంశీ, బోడే ప్రసాద్ వంటి వారితో పెద్దగా పొసగదు. ఇది బహిరంగ రహస్యమే. అందుకే, దేవినేని వర్గం కొత్త నీరులా వచ్చి పార్టీలో చేరటంతో పాత నీరు లాంటి వల్లభనేని, ప్రసాద్ వర్గాలు కొంత ఆందోళన చెందాయి. అయినా చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి అంతా మౌనంగానే వున్నారు. కాని, దేవినేని పూర్తిస్థాయిలో టీడీపి కండువా కప్పుకునేందుకు ఏర్పాటు చేసిన బహిరంగ సభకి మాత్రం నెహ్రు ప్రత్యర్థులు ఎవరు రాలేదు. కాని, ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో వున్న నెహ్రుతో విభేదాలు ఓకే. కాని, ఇప్పుడందరూ టీడీపీలోనే వుంటూ ఎడ ముఖం పెడ ముఖంగా వుంటే ఎలా? అందుకే, దేవినేనితో పడని వారిని పిలిపించుకుని బాబు మీటింగ్ పెట్టారట...
దేవినేని కాంగ్రెస్ లోని కీలక నేత. పైగా కృష్ణా జిల్లాలో వైసీపీ కంటే ఇప్పటికీ కాంగ్రెస్సే బలంగా వుంది. కాబట్టి ఆ పార్టీని ఎదుర్కోవటానికి ఒకప్పటి టీడీపీ నేతైన దేవినేని అయితేనే బాగుంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారట. ఆ క్రమంలో వచ్చే చిన్న చిన్న ఇబ్బందులను సర్దుకుపోవాలని ఆయన సూచించారట. టీడీపీ వర్గాల సమాచారం మేరకు దేవినేని రాకతో ఇప్పటికే పార్టీలో వున్న పాత నేతలకి, వాళ్ల కార్యకర్తలకి ఎలాంటి ఇబ్బంది రాదని సీఎం హామి ఇచ్చారట... దేవినేని చేరికతో పార్టీ లోపల ఏం జరగబోతోందో ముందు ముందు తెలుస్తుంది. కాని, పార్టీ వెలుపల మాత్రం జిల్లాల్లో టీడీపీకి తిరుగులేకుండా పోతుంది. ఇది టీడీపీ అభిమానులకి పెద్ద గుడ్ న్యూసే....