ప్రత్యేక ప్యాకేజ్ కి ఓకే అంటోన్న... 'ఆ నలుగురు'!

ప్రత్యేక హోదాకి బదులు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చేందుకు రెడీ అయిన కేంద్రం ఆ దిశగా చకచకా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది! హోదా తప్ప ఏదీ వద్దని ఒకవైపు ఆంధ్రప్రదేశ్ నేతలు స్టేట్మెంట్లు ఇస్తున్నా ఢిల్లీ పెద్దలు వాటిని పట్టించుకున్నట్టు కనిపించటం లేదు! అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్యాకేజ్ తప్ప అంతకంటే ఎక్కువ మోదీ సర్కార్ నుంచి ఆశించటం అత్యాశే అవుతుంది. ఎందుకంటే, ఆర్దిక సంఘం సిఫారసుల కారణంగా ఇక పై ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కే సూచనలు కనిపించటం లేదు. కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ కు కూడా ఇందుకు మినహాయింపు కాదు... ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి ఆంధ్రాను బుజ్జగించాలని ప్లాన్ వేసిన కేంద్రం అటుగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది కూడా. కేంద్ర ఆర్దిక మంత్రి తాను ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటిస్తే ఏపీ నుంచి వచ్చే వ్యతిరేకత కంటే ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే స్పందనలను లెక్కలోకి తీసుకుంటున్నారు. అందుకే, జైట్లీ ఇప్పటికే అనేక రాష్ట్రాల సీఎంలతో మాట్లాడరని సమాచారం. నవ్యాంధ్రకు ప్యాకేజ్ ఇస్తే అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం వున్న అందరితో ఆయన చర్చించినట్టు తెలుస్తోంది.  పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎలాంటి షరతులు లేకుండా ఏపీని ఆదుకోవాలని కేంద్రానికి సూచించారంటున్నారు. విభజన సమయంలో చెప్పినట్టు చేయాల్సిందేనని దీదీ అన్నారట. ఇక ఏపీకి బార్డర్ స్టేట్ అయిన తమిళనాడు సీఎం మాత్రం ప్యాకేజ్ ఇస్తే తమకు ఎలాంటి ఇబ్బంది లేదంటూనే పారిశ్రామిక రాయితీలు మాత్రం వద్దన్నారట. అలా చేస్తే తమ రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు ఏపీకి వెళ్లిపోతాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారట. ఈ భయం తమిళనాడుకు ముందు నుంచీ వుంది. బీహార్ సీఎం నితీష్ ని జైట్లీ కాన్ఫిడెన్స్ లోకి తీసుకున్నట్టు సమాచారం. ఎందుకంటే, బీహార్, ఒడిశా రాష్ట్రాలు ఆంధ్రాకు ప్రత్యేక హోదా అన్నప్పుడల్లా తమకూ ఇవ్వాలని పట్టుబడుతు వస్తున్నాయి. అయితే, ప్రత్యేక ప్యాకేజీ విషయంలో మాత్రం బీహార్, ఒడిశా రాష్ట్రాలు అడ్డుపడలేదు. నితీష్ కుమార్ ఆంధ్రాకు ప్యాకేజ్ ఇవ్వాలని అంటే... ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పోలవరం మాత్రం కట్టటానికి వీలులేదని అన్నారు. ఆయన కూడా ప్యాకేజ్ కి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు... ఈ చర్చలు , కేంద్రంలో వచ్చిన ఈ వేగం చూస్తుంటే ఏపీకి స్పెషల్ ప్యాకేజ్ ఆల్మోస్ట్ రెడీ అయినట్టే అర్థమవుతోంది. అయితే, అన్ని రాష్ట్రాల్ని అడిగి తెలుసుకున్న జైట్లీ ఏపీకి దాయాది రాష్ట్రం అయిన తెలంగాణను అభిప్రాయం అడిగినట్టు వినిపించటం లేదు. ఏపీకి ప్యాకేజ్ ప్రకటిస్తే తెలంగాణ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి... 

కలామ్ కలల కోసం... కబాలి రంగంలోకి దిగుతాడా?

రజినీకాంత్, రాజకీయాలు... ఈ రెండు పదాల కాంబినేషన్ ఇప్పటిది కాదు! తలైవా పాలిటిక్స్ లోకి వచ్చి తాట తీస్తాడని ఆయన అభిమానులు ఎప్పుట్నుంచో ఆశిస్తున్నారు! రమ్మని నినదిస్తున్నారు! కాని, కబాలి కరుణించలేదు... ఈ మధ్యే మన సీపీఐ నారాయణ పవన్ కళ్యాణ్ గురించి ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. వస్తే ఫుల్ టైం పాలిటిక్స్ లోకి రావాలి. లేదంటే రజినీకాంత్ లా ఇంట్లో కూర్చోవాలి అన్నారు! అంటే.... చాలా వరకూ రజినీకాంత్ రాజకీయాల్లోకి రాడని డిసైడ్ అయిపోయారన్నమాట. అది నిజం కూడా. జనం సైతం ఈ మధ్య రజినీ రాజకీయాల్లోకి రాడులే అనేసుకుంటున్నారు!  బాబా ఇక పాలిటిక్స్ కి బైబై చెప్పినట్టే అని అంతా అనుకుంటున్న టైంలో ఈ మధ్య చెన్నైలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ తో దివంగత కలామ్ అనుచరుడు పొన రాజ్ భేటీ అయ్యారు. ఈ పొన రాజ్ ఎవరు అంటారా? కలామ్ కాలం చేశాక ఆయన ప్రధాన అనుచరుడైన పొన రాజ్ ఓ పార్టీ స్థాపించారు. కలామ్ పేరుతో వుండే ఈ పార్టీ ఆయన ఆశయాలు, స్వప్నాలకి అనుకూలంగా పని చేస్తుందని చెప్పారు. గత తమిళనాడు ఎన్నికల్లో అయితే ఈ కలామ్ పార్టీ పోటీ చేయలేదు. కాని, ముందు ముందు చేసే అవకాశాలున్నాయి. ఆ క్రమంలోనే రజినీకాంత్ ని కలిశారు కలామ్ పార్టీ నేత పొన రాజ్!  రజినీకాంత్ ని పొన రాజ్ కలిసినంత మాత్రాన మన ముత్తు పాలిటిక్స్ కి పరుగెత్తుకు వస్తాడని అనుకోలేం. కాని, 2019 నాటికి తలైవా మనసు మారే ఛాన్స్ మాత్రం వుంది. ఇప్పటికే 65దాటిన ఆయన అప్పుడు హీరోగా సినిమాలు చేయటం ఆపేయ వచ్చు. అభిమానులు ఆయన్ని చూసేందుకు సిద్ధంగానే వున్నా ఏజ్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. కాబట్టి యాక్టింగ్ మానేసి వచ్చే జనరల్ ఎలక్షన్స్ నాటికి బాక్సాఫీస్ నుంచి బ్యాలెట్ బాక్సుల వైపు కదలొచ్చు!  ఇప్పటికే జయలలిత ఆరోగ్యం ఆందోళనకరంగా వుంటోందని సమాచారం. ఇంకో ద్రవిడ నాయకుడు కరుణానిది కూడా 90లలోకి వచ్చేసి మరీ పెద్దాయన అయిపోయాడు. ఆయన రేంజ్లో చక్రం తిప్పే సీన్ ఆయన కొడుకులు స్టాలిన్, అళగిరికి లేదని ఇప్పటికే తేలిపోయింది. కాబట్టి నిజంగా రజినీకాంత్ కోరుకుంటే తమిళ సీఎం పదవి ఆయనకు స్వాగతం పలుకుతున్నట్టే! ఎన్ని పాజిటివ్ సిగ్నల్స్ వున్నా రజినీకాంత్ తొందరపడి రాజకీయాల్లోకి వచ్చి విజయ్ కాంత్, మన చిరంజీవి లాంటి వాళ్ల లాగా విమర్శలు, ఓటములు వంటివన్నీ భరిస్తాడా? లేక హ్యాపీగా ఓపిక వున్నంత కాలం సినిమాలు చేసి హిమాలయాలకు వెళ్లిపోతాడా? వేచి చూడాలి. ప్రస్తుతానికి మాత్రం కలామ్ అనుచరుడు పొన రాజ్ కబాలీతో మీటింగ్ పెట్టడం... కొంత ఆసక్తికర పరిణామమే!

అగజానునికి... అగ్రికల్చర్ కి లింకేంటో తెలుసా?

వినాయక చవితి... కేవలం ఒక్క రోజు పండుగ కాదు. చవితినాడు మొదలై చతుర్ధశి దాకా సాగే సుదీర్ఘ పండగ! వినాయక నవరాత్రులు అంటారుగాని పది లేదా పదకొండు రోజులు కొనసాగే అతి పెద్ద పండుగ! ఇన్ని రోజులు నడిచే మరో పండగ ఏదీ హిందువులకు లేదు మన దేశంలో! అంటే... అందరికంటే ఎక్కువగా పండుగలు చేసుకునే మనకే లేదంటే... ఇక భూమ్మీద మరెవరికి ఇంత కాలం కొనసాగే పండగ లేదన్నట్టే! మొత్తానికి ప్రపంచంలో అతి సుదీర్ఘ పండగ... వినాయక ఉత్సవం! వినాయక చవితి పండుగ ఎక్కువ రోజులు కొనసాగటం మాత్రమే విశేషం కాదు! గణపతికి సంబంధించిన ప్రతీదీ ప్రత్యేకమే! మామూలుగా విఘ్నేశ్వరుని పార్వతీ తనయుడు, శివ నందనుడు, షణ్మఖు సోదరుడు అంటుంటాం. అలాగే, ఆయన మూషికాసురుని సంహరించాడని, విఘ్నాలకి అధిపతి అని పురాణ కథలు చెప్పుకుంటూ వుంటాం. కాని, వీటన్నిటికంటే విశేషమైన కోణం మరొకటి వుంది గణాధిపతిలో! ఆయన రూపం వ్యవసాయానికి , వ్యవసాయ ఆధారిత జీవనశైలికి సంకేతం అని మీకు తెలుసా?  గణపతి కేవలం పురాణాల్లో చెప్పిన ఒకానొక దేవుడు మాత్రమే కాదు. ఆయన్ని పూజించని హిందువు ఎవ్వరూ ఉండరు! అందుక్కారణం ఏ పూజ చేసినా ప్రథమ పూజ అందుకోవాల్సింది ఆయనే! అంత ప్రాముఖ్యత గణపతికి వుండటానికి కారణం ఆయనతో అత్యంత సామాన్య జనానికి కూడా వున్న సంబంధం , అనుబంధమే!. వినాయక చవితి వచ్చేది భాద్రపద శుక్ల పక్షంలో. అంటే వర్షాలు పడుతూ రైతులు నాట్లు వేసే సమయమన్నమాట! అందుకే, మన ఋషులు ఆయన రూపాన్ని ప్రత్యేకంగా మట్టితో తయారు చేయమన్నారు! గణపతి భూ స్వరూపుడు! జగన్మాత అయిన పార్వతి నలుగు పిండితో, అంటే భూ అంశతో , ఆయన్ని రూపుదిద్దుతుంది! ఇలా భూ తత్వం గల వినాయకుడ్ని పూజిస్తే పంటలు సమృద్దిగా పండుతాయని మన వారి విశ్వాసం! ఇక గజాననుడైన వినాయకుడికి ఒక దంతం వుంటుంది. అందుకే , ఆయన ఏకదంతుడని అంటారు! ఇది వ్యవసాయ దృష్టితో చూసినప్పుడు నాగలికి సంకేతం! నాగలి వుంటేనే పంటలు పండేది! కడుపులు నిండేది!. నాగలి మాత్రమే కాదు గణపయ్య రూపంలో తూర్పార పట్టే చేటలు కూడా వుంటాయి! అవ్వే ఆయన పెద్ద పెద్ద ఏనుగు చెవులు! ఇంకాస్త కిందకి వస్తే లంబోదరుడైన ఆయన పెద్ద పొట్ట ధాన్యం నిలువ చేసే గాదెలకు సంకేతం. అంతే కాదు, తాను ఎంత భారీగా వున్నా చిట్టి ఎలుకని మూషిక వాహనుడు ఎక్కడం వెనుక కూడా వ్యవసాయ కోణం వుంది! పంటల్ని పాడు చేసే ఎలుకల్ని వినాయకుడు తన అధీనంలో వుంచుకుంటాడన్నమాట! ఎలుకల్ని నిలువరించే పాముల్ని కూడా గణాధిపతి తన కడుపుకి మొలతాడుగా కట్టుకుంటాడు!  గణేశుడి రూపంలోని సంకేతమే కాదు ఆయన పూజ కూడా ప్రకృతితో ముడిపడిందే! 21 రకాల పత్రాలతో పచ్చగా సాగిపోతుంది పార్వతీ తనయుడి ఆరాధన! ఈ రకరకాల పత్రాలన్నీఊళ్లలో పంట, పొలాల పక్కనే దొరుకుతాయి. అంటే... వ్యవసాయం బావుండాలని పూజ చేస్తూ అదే పొలాల్లో దొరికే పూలు, పత్రితో పూజించటం అన్నమాట!. పదకొండు రోజులు పూజలందుకున్న గణనాథుడు నిమజ్జనానికి గంగమ్మ వద్దకు వెళతాడు! ఇది కూడా వ్యవసాయానికి సంకేతమే! మట్టిని దున్ని పంటలు పండించుకుని రకరకాల పత్రాలు, పూలు మొలిచిన తరువాత ఏం చేస్తాం? కొత్త పంట వేసుకునే ముందు నిండుగా నీళ్లతో మడులన్నీ నింపేస్తాం! అచ్చం అలాగే, మట్టితో చేసిన మహాగణపయ్యని నీళ్లలో నిమజ్జనం చేసి నీటిని పావనం చేస్తాం! భారతీయ పండుగలు కేవలం ఛాందసమైన విశ్వాసాల ఆధారంగా ఏర్పడ్డవి కావని నిరూపించే మరో మహోన్నత పర్వం వినాయక చవితి! ఈ పండుగలో భక్తి మాత్రమే కాక ప్రకృతి పట్ల ప్రేమ కూడా అణువణువునా తొణికిసలాడుతుంది! 

రేసుని రక్తి కట్టిస్తోన్న డొనాల్డ్ ట్రంప్!

2014కి ముందు ఇండియాలో ఏం జరిగిందో అలాంటిదే ఇప్పుడు అమెరికాలో జరుగుతోంది! మన దగ్గర మోదీ పీఎం అన్న మాటలు అంతకు ముందు చాలా సార్లు వినిపించేవి. కాని, అంతా కొట్టిపారేసేవారు! బీజేపిలోనూ చాలా మంది నేతలు మోదీ ప్రధాని అవుతాడని ధైర్యంగా చెప్పేవారు కాదు. కాని, అమాంతం 2014 ఎన్నికల సమయం వచ్చేసరికి అందర్నీ నమో వెనక్కి నెట్టేశారు. అనూహ్యంగా బీజేపికి స్వంతంగా ఫుల్ మెజార్జీ సంపాదించి పెట్టి తాను పీఎం అయ్యారు! ఇప్పుడు అమెరికాలో ట్రంప్ ఇంచుమించూ మోదీలానే దూసుకొస్తున్నారు! డొనాల్డ్ ట్రంప్ మోదీ లాగా వార్తల్లో వుండొచ్చు. కాని, మోదీ లాంటి ఫుల్ టైం పొలిటీషన్ కాదు. పక్కా బిజినెస్ మ్యాన్. వందల కోట్ల వ్యాపారాలు వున్నాయి ట్రంప్ కి. అందుకే మొదట్లో అతడ్ని ఎవ్వరూ సీరియస్ గా తీసుకోలేదు. అందరి దృష్టీ డెమొక్రాట్ అభ్యర్థి, మాజీ అధ్యక్షడు బిల్ క్లింటన్ భార్య హిల్లరీ పైనే వుండేది. కాని, మెల్లమెల్లగా ట్రంప్ హై వే పై ట్రక్కులా దూసుకొచ్చాడు. రోజుకో వివాదాస్పద వ్యాఖ్య చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షించి ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా నిలిచాడు! డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ అభ్యర్థి అయ్యాక చాలా మంది పోటీ వన్ సైడ్ అనుకన్నారు. హిల్లరీ అమెరికాలోని అనేక వర్గాల మద్దతు కూడగట్టి ఈజీగా ఫస్ట్ లేడీ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అవుతుందని అనుకున్నారు. కాని, అది కూడా ఇప్పుడు తలకిందలు అవుతున్నట్టు కనిపిస్తోంది. ట్రంప్ పై హిల్లరీ ఈజీగా గెలుస్తుందని నిన్నటి మొన్నటి దాకా చెప్పిన సర్వేలు మెల్లగా ట్యూన్ మారుస్తున్నాయి. సీఎన్ఎన్ తాజా సర్వే అయితే గతంలో కంటే హిల్లరీ ఆధిక్యం సగం తగ్గిపోయిందని చెబుతోంది! హిల్లరీ 42 శాతం మంది మద్దతు పొందుతోంటే ట్రంప్ 37శాతం మంది సపోర్ట్ తో చాలా దగ్గరగా వున్నాడు రేస్ లో! అమెరికా అధ్యక్షడు ఎవరవుతారన్న ఆదుర్దా మొత్తం ప్రపంచానికి వుండటం సహజమే! కాని, ఈ సారి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ మాత్రం మరీ ఎగ్జైటింగ్ గా సాగుతున్నాయి. నవంబర్ లో తేలనున్న చివరి ఫలితం అప్పటి వరకూ ఊరిస్తూనే వుండేలా వుంది. ఎందుకంటే, డొనాల్డ్ ట్రంప్ ఇంతకు ముందు ఏ అమెరికన్ ప్రెసిడెన్షియల్ అభ్యర్థీ చేయని విధంగా కామెంట్స్ చేశాడు. ముస్లిమ్ లను దేశంలోకి రానీయనని ఘాటుగా మాట్లాడిన ఆయన రోజుకో విధంగా నిప్పు రాజేస్తూనే వున్నాడు. ఒకవేళ ఆయనే అమెరికన్ ప్రెసిడెంట్ అయితే ముందు ముందు అనేక సంచలనాలు, సంక్షోభాలు చూడాల్సి రావచ్చు! ఎన్నారై ఇండియన్స్ అయితే ఎక్కువగా హిల్లరీనే కోరుకుంటున్నారని సమాచారం... 

2019లోనూ 'నమో'స్తుతే అనబోతోందట దేశం....

మోదీ అంటే కొందరికి ఇష్టం వుండొచ్చు! కొందరికి ఇష్టం లేకపోవచ్చు! కాని, మోదీని పట్టించుకోని వారు మాత్రం ఎవరూ వుండరు! అదే ఆయన సక్సెస్ సీక్రెట్!. దేశంలో పీఎం మోదీ అత్యంత ప్రజాదరణ కలిగిన నేత. అంతే స్థాయిలో వివాదాస్పదుడు కూడా! ఇప్పుడే కాదు గుజరాత్ సీఎంగా వున్నప్పటి నుంచే ఆయన కాంట్రవర్సియల్ ఫిగర్. గుజరాత్ అల్లర్లు అంటూ ఆయన్ని పన్నెండేళ్లు వెంటాడారు అభ్యుదయవాదులు. మీడియా, మేధావులు కలిసి మోదీని ప్రతీ రోజూ టార్గెట్ చేసేవారు. అయినా ఆయన తన పని తాను చేసుకుపోయేవారు. గుజరాత్ ను అభివృద్ధిలో మిగతా దేశం మొత్తానికంటే ముందుంచారు. చివరకు, తన చేసిన విమర్శల్నే ఆయుధాలుగా చేసుకుని ఫుల్ ఫేమస్ అయిపోయారు! పీఎం కూడా అయ్యారు! తనకు ఎదురైనా సవాళ్లనే సువర్ణావకాశాలుగా చేసుకుని దూసుకొచ్చిన మోదీ ఇప్పుడు ప్రధానిగా కూడా అదరగొడుతున్నారు. ఢిల్లీ చేరుకుని రెండున్నర ఏళ్లవుతున్నా ఆయన ఫాలోయింగ్ చెక్కుచెదరలేదు. తాజాగా ఓ ఆన్ లైన్ సర్వేలో ఎంత మంది నమోస్తుతే అన్నారో తెలుసా? డెబ్బై శాతం!  సాధారణంగా ఏ నేత అయినా సంతృప్తికరంగా పని చేస్తే 50శాతానికి మించి మార్కులు పడుతుంటాయి. 60శాతం కూడా దాటితే అతను చాలా బాగా పని చేస్తున్నట్టు లెక్క. కాని, నెక్స్ట్ పీఎం ఎవరైతే బావుంటుంది అంటూ చేసిన ఈ సరికొత్త సర్వేలో ఏకంగా 70శాతం జనం మోదీనే కావాలన్నారట! ఆయన వచ్చాక ధరలు తగ్గలేదు, ఉద్యోగాలు రాలేదు లాంటి ఆరోపణాలు చేస్తోన్న ప్రతిపక్షానికి ఇది దుర్వార్తే!  మోదీ వచ్చాక నిజంగా కూడా భారీ మార్పులు రాలేదు. కాని, జనం ఆయన నిజాయితీకి, కృషికి గుర్తింపు ఇస్తున్నట్టే కనిపిస్తోంది. దేశదేశాలు తిరుగుతూ భారత్ స్థాయి అంతర్జాతీయంగా పెంచుతూ వస్తోన్న మోదీ రచ్చ గెలవటమే కాదు ఇంట్లో కూడా గెలుస్తున్నాడు. కాని, ఆయన నిర్ణయాల ఫలితాలు కాస్త మెల్లగా జనానికి అందుతున్నాయి. స్వచ్ఛ్ భారత్ నుంచి మేకిన్ ఇండియా వరకు మోదీ చేపట్టిన అనేక సంస్కరణలు, కార్యక్రమాలు 2019 ఎన్నికల నాటికి సానుకూల ఫలితాలు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే... ఈ తాజా సర్వే ప్రకారం డెబ్బై శాతం మంది పీఎంగా కోరుకుంటోన్న మోదీయే మరోసారి ప్రధాని కావటం గ్యారెంటీ! ఇది నమో భక్తులకి, బీజేపి అభిమానులకి నిజంగా చాలా పెద్ద గుడ్ న్యూసే! 

టీఆర్ఎస్ పై 'కోదండం' ఎక్కుపెడుతోన్న టీజేఏసీ!

సాధారణంగా పాలక పక్షానికి అతి పెద్ద తలనొప్పి ఎవరుంటారు? ఇంకెవరు, ప్రతి పక్షమే! కాని, తెలంగాణలో సీన్ వేరేలా వుంది. అధికార టీఆర్ఎస్ కి ప్రతిపక్ష కాంగ్రెస్ కన్నా పెద్ద తలనొప్పి మరొకటి తయారైంది. అదే టీజేఏసీ! తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఒకప్పుడు టీఆర్ఎస్ కి పెద్ద అండ. ప్రత్యేక రాష్ట్ర సాధనలో టీఆర్ఎస్ , టీజేఏసీ రెండూ కలిసి పని చేశాయి. కాని, ఇప్పుడు అవే రెండు కత్తులు దూస్తున్నట్లు కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా, జేఏసీ చైర్మన్ కోదండరామ్ టీఆర్ఎస్ నేతల ఆగ్రహానికి పదే పదే గురవుతున్నారు. తాజాగా కేసీఆర్ కూతురు, నిజాంబాద్ ఎంపీ కవిత ఆయన్ని టార్గెట్ చేశారు! ఎంపీ కవిత కోదండరామ్ పై విమర్శలు ఎక్కుపెట్టటానికి కారణం ఈ మధ్య జరిగిన ఆల్ పార్టీ మీటింగ్. జేఏసీ ఏర్పాటు చేసిన ఈ మీటింగ్ కి ప్రధానమైన టీఆర్ఎస్ నే పిలవలేదట. అయితే, మీటింగ్ ఎందుకు పెట్టారంటే... నిజాం షుగర్ ఫ్యాక్టరీ మళ్లీ తెరిపించాలనే డిమాండ్ తో మీటింగ్ పెట్టారు. అంటే... అధికార పార్టీగా తమ ప్రభుత్వం చేత టీఆర్ఎస్సే నిజాం షూగర్ ఫ్యాక్టరీ తెరిపించాలన్నమాట! అందుకే, ఆ పార్టీని తప్ప జేఏసీ మిగతా అన్ని పార్టీల్ని పిలిచింది. కాని, ఇదే విషయం కవిత ఆగ్రహానికి కారణమైంది... ఆల్ పార్టీ మీటింగ్ అని పేరు పెట్టి తమని పిలవకపోవటం ఏంటని ప్రశ్నించిన కవిత అక్కడితో ఊరుకోకుండా ఇన్ డైరెక్ట్ విమర్శలు చాలానే చేశారు. జేఏసీ పెద్దలు ప్రభుత్వం వాదన వినేందుకు సిద్ధంగా లేరని ఆమె అన్నారు. అంతే కాదు వాళ్లు జనం నుంచి కొన్ని అంశాలు దాచి పెడుతున్నారని దుయ్యబట్టారు. అయితే, కవిత ఎక్కడా కోదండరామ్ పేరు ఊపయోగించకపోయినా ఆమె మాటలు ఆయన్నే టార్గెట్ చేశాయని ఎవరికైనా ఇట్టే అర్థం అయిపోతుంది... నిజాం షూగర్ ఫ్యాక్టరీ విషయంలోనే కాదు కోదండరామ్ ఈ మధ్య కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే స్టేట్మెంట్ ఇచ్చారు. గవర్నమెంట్ జనం కోరినట్లు విభజన చేయాలని ఆయన సుది మెత్తగా సూచించారు! ఇక మల్లన్న సాగర్ కోసం భూముల సేకరణ అంశంలో కూడా కోదండరామ్ నిరసన స్వరమే వినిపించారు. ఆ మద్య కేసీఆర్... నిరాధారంగా ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ నేతలు జైలుకెళతారని ఘాటుగా స్పందిస్తే... కోదండరామ్, పాలకులు అపొజిషన్ చేసే విమర్శకు తగిన విధంగా సమాధానం ఇవ్వాలని చెప్పుకొచ్చారు! మొత్తం మీద తనకు వీలున్నప్పుడల్లా జేఏసీ చైర్మన్ టీఆర్ఎస్ కి, కేసీఆర్ కి వ్యతిరేకంగా గొంతు వినిపిస్తూనే వున్నారు... నిన్న మొన్నటి వరకూ టీఆర్ఎస్ లోని చాలా మంది నాయకులు కోదండరామ్ పై కామెంట్స్ చేసినా కేసీఆర్ ఫ్యామిలీ లీడర్స్ మాత్రం ఆయన్ని నేరుగా టార్గెట్ చేయలేదు. కవిత వ్యాఖ్యలతో కోదండరామ్ పై ముందు ముందు ప్రతి దాడి ఎక్కువయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. వాట్ని జేఏసీ చైర్మన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి...

ప్యాకేజీ అంటే... నేతి బీరకాయలోని నెయ్యే!

మన పురాణాల్లోని కథలు మీరెప్పుడైనా గమనించారా? చాలా మంది తపస్సు చేస్తుంటారు. వెంటనే బ్రహ్మో, శివుడో ప్రత్యక్షం అవుతుంటారు. వాళ్లని తపస్సు చేసిన వారు మరణం లేకుండా వరం ఇవ్వమంటారు. అది కుదరదని నానా రకాల ఇతర టెంప్టింగ్ ఆఫర్స్ అందిస్తారు దేవుళ్లు! అవ్వన్నీ విని కొందరు సంబరపడిపోయి అమాయకంగా ఓకే చేసేస్తారు! మరికొందరికి ఆ వరాలన్నీ ఉత్తివే అని తెలిసినా, మరణం తప్పదని అర్థమైనా... కష్టపడి తపస్సు చేశాం కదా అని తలాడిస్తారు! లేదంటే ఏ వరమూ ఇవ్వకుండా దేవుడు మాయమైపోవచ్చు! అదీ ప్రాబ్లం... ఈ ఇంట్రడక్షన్ అంతా ఎందుకు అంటే... ప్రస్తుతం హాట్ టాపిక్ గా నడుస్తోన్న ప్రత్యేక ప్యాకేజ్ గురించే! మీరు సరిగ్గా గమనించారో లేదో చర్చ అటు తిరిగి ఇటు తిరిగి ఈ మధ్య ఎక్కడి దాకా వచ్చిందంటే... మీడియాలో నేరుగా ప్రత్యేక ప్రకటన, ప్రత్యేక ప్యాకేజీ అనౌన్స్ మెంట్ అనేస్తున్నారు! అసలు ప్రత్యేక హోదా అన్న పదమే తక్కువగా వినిపిస్తోంది! అది పూర్వకాలంలో తపస్సు చేశాక మరణం లేకుండా వరం ఇమ్మన్నట్టుగా తయారైపోయింది! ప్రత్యేక హోదా ఆంధ్రుల తీరని కోరికే తప్ప ప్రాక్టికల్ గా వర్కవుట్ అయ్యేది కాదు అన్నట్టుగా వుంది ఛందం!   మీడియా, తెలివైన మేధావులు, వాళ్లకంటే తెలివైన రాజకీయ నాయకులు అంతా కలిసి గత కొన్ని రోజుల్లో ప్రత్యేక హోదా అనేది అసాధ్యం అన్నట్టుగా కలరింగ్ ఇచ్చేశారు. ఎక్కడైనా ఎవరైనా ప్రత్యేక హోదా కావాల్సిందే అనే స్టేట్మెంట్ ఇస్తే ... వాళ్లది వితండవాదం అన్నట్టుగా, స్కూలుకు పోనని ఏడుస్తున్న చిన్న పిల్లల పెంకితనం మాదిరిగా బిల్డప్ ఇస్తున్నారు! జనం కూడా ప్రత్యేక హోదా అనేది ... రెండు కాళ్లు లేని వాడు నాట్యం చేయటం లాంటిది, రెండు చేతులు లేని వాడు కుస్తీ పట్టు పట్టడం లాంటిది అన్నట్టుగా లైట్ తీసుకుంటున్నారు!   ఏపీకి ప్రత్యేక హోదా... దీన్ని అసలు ఎవరు ఇస్తామన్నారు? కేంద్రం! కాని, ఇప్పుడు కుదరదని చెప్పకనే చెబుతోన్నది ఎవరు? కేంద్రమే! అప్పుడు ఇస్తామన్నది యూపీఏ. ఇప్పుడు ఇవ్వటం కుదరదని చెబుతోన్నది ఎన్డీఏ. ఆంధ్ర ప్రజల అభిప్రాయం, వాళ్లకు జరిగే లాభ, నష్టాలు ఇవేవీ చర్చలోకే రావటం లేదు. ప్యాకేజీ ఇస్తాం, పారిశ్రామిక అభివృద్ధికి నిధినిస్తాం, హోదాలో వుండే లాభాలన్నీ ప్యాకేజీలోనే ఇచ్చేస్తాం అంటూ బురిడీ మాటలు చెప్పేస్తున్నారు! అన్నీఇచ్చేదే వుంటే... హోదానే ఇవ్వొచ్చు కదా? ఇక్కడే వుంది అసలు ట్విస్ట్!   ఢిల్లీ ప్రభుత్వం... ''హోదాలో వున్న సరుకంతా ఇస్తాం కాని, దానికి ప్యాకేజీ అని లేబుల్ పెడతాం... '' అనటం ఎలాగుందంటే... చీరా, సారె, నగలు, నట్రా అన్నిటితో అలంకరించిన పెళ్లికూతుర్ని ఇస్తాం... కాని, ఆ పెళ్లి కూతురు బొమ్మ పెళ్లి కూతురు! మనిషి కాదు అన్నటుగా వుంది! హోదా కాకుండా ప్యాకేజీ ఇవ్వటం అంటే.... అయిదేళ్లో, పదేళ్లో ఆంధ్ర రాష్ట్రానికి అన్ని ఖర్చులు భరించి వైద్యం చేయించటం! ప్యాకేజీ అంటే ... కెమెరాల ముందు మంచం వద్దకొచ్చి.. పళ్లు, బ్రెడ్డు అందించి చెక్కేయటం! ఈ తేడా మన మీడియా, మేధావులు, జనం గుర్తించాలి! రాజకీయ నాయకులు తెలిసినా తెలియనట్లు నటించే అవకాశాలే పుష్కలం...

కేజ్రీవాల్ ని రనవుట్ చేసే పనిలో సిద్దూ!

సవజ్యోత్ సింగ్ సిద్దూ... ఈ పేరు ఇండియన్ క్రికెట్లో ఎంత పాప్యులరో అంతే వివాదాస్పదం కూడా! అసలు ఆయన ఎలా ఆడేవాడో ఈ కాలం క్రికెట్ లవ్వర్స్ కి పెద్దగా తెలియదు! కాని, విచిత్రం ఏంటంటే, ఆయన క్రికెట్ ఎలా ఆడేవాడో తెలియకపోవటమే కాదు పాలిటిక్స్ ఎలా ఆడతాడో కూడా జనానికి అర్థం కావటం లేదు ప్రస్తుతం! ఎవరికి మేలు చేసి ఎవరికి కీడు చేస్తాడో, ఎవరి కొంప కొల్లేరవుతుందో అస్సలు తెలియటం లేదు...   సిద్దూ అద్భుతమైన బ్యాట్సమన్ అయినా పెద్దగా పాలిటిక్స్ తెలిసిన వ్యక్తి కాదు. అందుకే, చాలా రోజులు ఇండియా కోసం ఆడినా క్యాప్టెన్ అవ్వలేకపోయాడు. రిటైర్మెంట్ అయ్యాక బీజేపిలో చేరి ఒకింత సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఆ పార్టీ సిద్దూకి తగినంత గుర్తింపు ఇచ్చింది. ఎంపీగా పోటీ చేయించింది. రాజ్యసభ  సీటు కూడా ఇచ్చింది. అయినా ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా రాజకీయం నిజంగా ఒంటబట్టని సిద్దూ ఎందుకోగాని ఈ సారి మొత్తం అతలాకుతలం చేసుకున్నాడు!   పార్టీ మీద అలిగో, లేదంటే ఇతర పార్టీల్లోంచి వస్తున్న టెంప్టింగ్ ఆఫర్ల వల్లో నవజ్యోత్ సింగ్ సిద్దూ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఎవ్వరూ చేయని సాహసం చేసి బంగారం లాంటి రాజ్యసభ సీటు వదులుకున్నాడు. రాజీనామా చేసి కొన్ని రోజులుగా ఖాళీగా కూర్చున్నాడు! అందరూ అనుకున్నట్టు ఆప్ లో చేరిపోలేదు...   సిద్దూ ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిగా చక్రం తిప్పేందుకే బీజేపి ఇచ్చిన రాజ్యసభ సీటు వద్దనుకున్నాడని అంతా భావించారు. ఆయన వెళ్లి కేజ్రీవాల్ ని కలిసి ఆ అంచనాల్ని నిజం కూడా చేశాడు. కాని, ఏమైందో ఏమోగాని ఆప్ క్రీజులోకి సిద్దూ వెళ్లలేదు. పెవెలియన్ లోనే వుండిపోయి ... హఠాత్తుగా స్వంత పార్టీ ప్రకటన చేశాడు!   పంజాబ్ లోని మరికొంత మంది చిన్నా, చితకా నేతలతో కలిసి ఆయన ఆవాజ్ ఏ పంజాబ్ అనే ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నట్టు తాజాగా ప్రకటించాడు! ఇది ఎవ్వరూ ఊహించని పరిణామం. పైగా ఈ ఫ్రంట్ పెట్టటం ద్వారా ఇటు ఆకాళీదల్, బీజేపి కూటమిని, అటు కాంగ్రెస్ ను, మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీని సిద్దు ఎదుర్కొని ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది! అంత పోటీలో ఈ ఆవాజ్ ఏ పంజాబ్ ఊడబొడిచేదేం లేదంటున్నారు క్రిటిక్స్! అయినా సిద్దూ ఇలాంటి సాహసం చేయటానికి కారణం ఏంటి?   కొందరి టాక్ ప్రకారం... నవజ్యోత్ సింగ్ సిద్దూ బీజేపిలో అసంతృప్తిగా వుండటం చూసి కేజ్రీవాల్ వల వేశాడట! ఆయన తన పంజాబ్ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తానని అనటంతో సిద్దూ బీజేపి టీమ్ లోంచి ఆప్ టీమ్ లోకి జంప్ అవుదామనుకున్నాడు. కాని, తీరా రాజ్యసభ సీటు కూడా వదిలేసి వచ్చాక అరవింద్ కేజ్రీవాల్ తన కేడీ వేషాలు మొదలు పెట్టాడట! సీఎం అభ్యర్థిగా ఛాన్స్ ఇచ్చేంత లేదని స్పష్టమైపోయింది. దాంతో సిద్దూకి తిక్కరేగిపోయింది...   అటు బీజేపికి, ఇటు ఆప్ కి కాక సతమతం అవుతోన్న సిద్దూపై కాంగ్రెస్ కూడా ఓ కర్చీఫ్ వేసింది. కాని, పంజాబ్ లో ప్రస్తుతం ప్రతి పక్షం అయిన కాంగ్రెస్ కి గెలిచేటంత సీన్ లేదని డౌట్స్ వున్నాయి. కాబట్టి కాంగ్రెస్ లో కాలేయకుండా ఆప్ దిమ్మతిరిగిపోయేలా సిద్దూ స్వంత ఫ్రంట్ ఆలోచన చేశాడంటున్నారు!   ఆవాజ్ ఏ పంజాబ్ ని కూడా షార్ట్ గా పిలిస్తే ఆప్ అనే అనాల్సి వస్తుంది. పైగా పంజాబ్ లో చెప్పుకోదగ్గ స్థాయిలో బీజేపి, అకాళీదల్ కూటమికి డ్యామేజ్ చేయాలని చూస్తోంది ఆప్. ఇలాంటి సమయంలో సిద్దూ తన దుకాణం ఒకటి కొత్తగా తెరవటంతో ప్రతి పక్షాలన్నిటి మధ్యా ఓట్లు చీలి అధికార కూటమికి లాభం చేకూరే సూచనలు కనిపిస్తున్నాయి! చూడాలి మరి.... పంజాబ్ ఎన్నికల మ్యాచ్ లో సిద్దూ బ్యాటింగ్ ఎలా వుంటుందో! రన్స్ కొట్టి బీజేపిని గెలిపిస్తాడో...బాల్స్ వేస్ట్ చేసి ఆప్ నో, కాంగ్రెస్ నో గెలిపిస్తాడో! ఏది ఏమైనా సిద్దు కలలు కన్నట్టు పంజాబ్ సీఎం ఆయనే అయ్యే అవకాశాలు మాత్రం పెద్దగా లేవంటున్నారు రాజకీయ విశ్లేషకులు!

స్మార్ట్ సర్వే ... ఓవర్ స్మార్ట్ సమాధానాలు!

  హనుమంతుడి బొమ్మ వేయబోతే... చివరికి కోతి బొమ్మ ప్రత్యక్షమైందట పేపర్ మీద! ఈ మాటే గుర్తొస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ పల్స్ సర్వే గురించి చెప్పుకుంటే! అసలు రాష్ట్రంలో ఎంత మంది జనం వున్నారు, అందులో పేదలు ఎందరు, ధనికులు ఎందరు, ఎవరికి ఏం కావాలి, ఏ వర్గం సమస్యలు ఏంటి... వంటి అనేక ప్రశ్నలకి సమాధానంగా గవర్నమెంట్ ఈ సర్వేను ఎంచుకుంది. కాని, ఇప్పటిదాకా జరిగిన వ్యవహారం చూస్తే ఎవరైనా అవాక్కవుతారు! ఆఖరుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలే షాకవుతున్నాయి సర్వే ఫలితాలు చూసి!   సర్వే ఫలితాలు చూసి షాకవటం అంటే నిజాలు బయటపడ్డాయి అనుకోకండి! ఈ చిన్న ఉదాహరణ చూస్తే... మీకే అసలు పరిస్థితి అర్థం అవుతుంది. సర్వేలో భాగంగా ఇప్పటి వరకూ రాష్ట్రంలోని సగం జనాభాని ప్రశ్నించారు. వివరాలు సేకరించారు. అయితే, ఇందులో సగానికి కంటే ఎక్కువ మంది ఏ రోజున పుట్టారో తెలుసా? 55శాతం మంది జనవరి ఒకటిన పుట్టారట!   జనవరి ఒకటో తేదీన న్యూ ఇయర్ తో బాటు ఇంత మంది పుట్టటం ఎలా సాధ్యం? ఇప్పుడే అధికారులు ఇదే ప్రశ్న వేసుకుని ఆశ్చర్యపోతున్నారు! అంతే కాదు, సర్వేలో ఎక్కడ లోపం తలెత్తిందో తెలియదుగాని జిల్లా, మండల స్థాయిలో వున్న ఏ ఒక్క ప్రజా ప్రతినిధి కూడా సంవత్సరానికి రెండున్నర లక్షల కంటే ఎక్కువ సంపాదించటం లేదు! సర్పంచ్ లు, జిల్లా పరిషద్ సభ్యులు లాంటి వాళ్లు సంవత్సరం మొత్తం మీద రెండున్నర లక్షలకి మించి సంపాదించకపోవటం ఏంటి? ఇక దాదాపు పది లక్షల మంది ప్రజలు తమ సంవత్సర ఆదాయం సున్నాగా చెప్పారట! ఫైనల్ గా... ఇప్పటి దాకా జరిగిన యాభై శాతం సర్వేలో ఏం తేలిందో తెలుసా? ఎనభై శాతం ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువనే వున్నారట!   చంద్రబాబు సర్కార్ అత్యంత ప్రాధాన్యతనిస్తూ చేయిస్తోన్న ఈ సర్వేతో నవ్యాంధ్ర స్వరూప, స్వభావాలు తెలుస్తాయని అంతా అనుకున్నారు. ముందు ముందు చేపట్టబోయే సంక్షేమ పథకాలు వంటివి మరింత సమర్థంగా రూపొందించి, అమలు చేయవచ్చని ఆశించారు. కాని, ఇప్పటి దాకా వెలువడిన ఫలితాల్ని చూస్తే సర్వే సరిగ్గా సాగటం లేదన్నది స్పష్టంగా చెప్పవచ్చు. దీనికి కారణాలు అనేకం వుండవచ్చు అంటున్నారు నిపుణులు. సర్వే చేస్తున్న వారు తగినంత శ్రద్ధగా చేయకపోవటం ఒక కారణం అవ్వొచ్చు. రెండోది రాష్ట్రంలో చాలా మందికి సరైన ఆధారాలతో కూడిన బర్త్ ప్రూఫ్స్ వుండకపోవటం కావొచ్చు. బర్త్ డేట్ నమోదు అయ్యి లేనప్పుడు జనవరి ఫస్ట్ ఈజీగా గుర్తుండిపోతుంది కాబట్టి చాలా మందికి అధికారులు అది రాసి వుండవచ్చు! అయితే, జిల్లా, మండల స్థాయి ప్రజా ప్రతినిధులు ఏ ఒక్కరూ రెండున్నర లక్షల కంటే ఎక్కువ ఆదాయం లేదని చెప్పటం ఆశ్చర్యకరమే! దీనికి కారణం ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు రెండున్నర లక్షలు దాటితే అందకపోవటమే. ఇలాంటి అనేక అంశాల వల్ల సర్వేలో తప్పుడు సమాచారం చొరబడి వుంటుంది...   సర్వేలో అనేక నమ్మశక్యం కాని అంకెలు బయటపడుతుండటంతో అన్ని వివరాలు రీ వెరిఫై చేసే యోచనలో వున్నారు అదికారులు. ప్రజలు అందించిన వివరాల్ని యూనివర్సిటీలు మొదలైన వాటి సాయంతో క్రాస్ చెక్ చేయించే ఆలోచన చేస్తున్నారు. ఇలా థర్డ్ పార్టీ వెరిఫికేషన్ వల్ల కొంత వరకూ పారదర్శకత, విశ్వసినీయత వచ్చే ఛాన్స్ వుంది.   ఏది ఏమైనా అత్యంత జాగ్రత్తగా సర్వే జరిగేలా ప్రభుత్వం చూస్తే తప్ప దీని వల్ల ఫలితం వుండదు. ఎందుకంటే, ఇప్పటి దాకా జరిగిన సర్వేలో దాదాపు 5వందల మంది తమ మాతృ భాష ఇంగ్లీష్ అని చెప్పారట! ఇదెలా సాద్యం? మదర్ టంగ్ ని మీడియంగా భావించి చెప్పి వుంటారు! ఇలాంటి పొరపాట్లే చాలా జరిగి వుండవచ్చని సర్వే ఫలితాలు చూసిన అధికారులు భావిస్తున్నారు... 

దావూద్ కి ఇక కౌంట్ డౌన్ మొదలైనట్టేనా?

  మోదీ ప్రధాని అయ్యాక మొత్తం ప్రపంచంలో తల పట్టుకుని కూర్చున్న ఏకైక దేశం ఏదైనా వుందంటే అది పాకిస్తానే అనాలి! అందుక్కారణాలు బోలెడు... మొన్నటికి మొన్న స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో బలూచిస్తాన్ గురించి మోదీ మాట్లాడినప్పటి నుంచీ అక్కడ నానా రచ్చ జరుగుతోందని రిపోర్ట్స్ వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వున్న ప్రవాస బలూచిస్తాన్ ప్రజలు మోదీ ఫోటోలతో వీధులకు ఎక్కుతున్నారు. ఇండియా జెండాలతో నిరసనలు తెలుపుతూ పాక్ గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. ఇదంతా ఒకవైపు అయితే మరో కోణంలో కూడా మోదీ సర్కార్ పాక్ ని టెన్షన్ పెడుతోంది! అదే కరాచీలో దాక్కున్న దావూద్ కోణం!   ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో మోస్ట్ వాంటెడ్ అయిన దావూద్ ఇబ్రహీం పాక్ లో వున్నాడని అందరికీ తెలిసిందే. పాకిస్తాన్ ఎన్ని కహానీలు చెప్పినా డి కంపెనీ బాస్ ఆ దేశంలోనే తిష్ట వేశాడని మన రా అధికారుల వద్ద పక్కా సమాచారం వుంది. అంతే కాదు, కరాచీలోని ఏ వీధిలో ఏ ఇంట్లో ఏ పేరుతో వున్నాడో కూడా ప్రదాని మోదీ సలహాదారు అజిత్ ధోవల్ కు క్లియర్ గా తెలుసు...   మోదీ ప్రధాని అయినప్పటి నుంచీ దావూడ్ పై మన నిఘా వర్గాల కన్ను తీవ్రంగా పడింది. అసలు ఈ పాటికే దావూద్ ఎన్ కౌంటర్ ఎప్పుడో జరిగిపోవాల్సింది. కాని, పాకిస్తాన్ లాంటి శత్రుదేశంలో తల దాచుకోటంతో కొంత ఆలస్యం అవుతోంది. అంతే కాదు, దావూద్ ని ప్రాణాలతో పట్టుకుంటే ఇండియాకి చాలా లాభం. అందు కోసం కూడా తగిన సమయం కోసం వేచి చూస్తున్నాయి ఇండియా నిఘా వర్గాలు.   తాజాగా ఇండియన్ గవర్నమెంట్ దావూద్ ప్లాన్స్ ని ఇండియా టుడే బయటపెట్టింది. ఆ పత్రిక ఇచ్చిన సమాచారం కరెక్టే అయితే మాత్రం మాఫియా డాన్ కదలికలపై నిఘా వుంచేందుకు దాదాపు 50మంది అధికారులతో స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసిందట ప్రభుత్వం. ఇన్ కమ్ ట్యాక్స్, ఈడీ, రా విభాగాల నుంచి ఈ అఫీషియల్స్ ను ఎంపిక చేశారట. వీళ్లంతా ఎప్పటికప్పుడు దావూద్ కదలికల్ని, అతడి అనుచరుల కదలికల్ని, అతని కుటుంబ సభ్యుల వ్యవహారాల్ని గమనిస్తుంటారట!   దావూద్ కరాచీలో వున్నట్టు, అతడి ఆరోగ్యం తీవ్రంగా పాడైనట్టు, షేక్ ఇస్మాయిల్ మర్చెంట్ అనే దొంగ పేరుతో అతడు కాలం గడుపుతున్నట్టు మన ఇంటలిజెన్స్ వర్గాలు ఇప్పటికే బయటపెట్టాయి. అనేక వందల మంది చావులకి కారణమైన ముంబై దారుణానికి మూలం దావూద్. అలాంటి మాఫియా రాక్షసుడు త్వరలోనే పట్టుబడాలని ఆశిద్దాం. లేదంటే అమెరికా లాడెన్ హతమార్చినట్టు మన వాళ్లు దావూద్ ని పాక్ భూభాగంలోనే ఖతమ్ చేయాలని కోరుకుందాం... 

ట్రంప్ భార్యకు 'వెయ్యి కోట్ల' కోపం వచ్చింది!

  ఆమె ఆషామాషి ఆడది కాదు! అంత స్పెషలా అంటారా? అవును చాలా స్పెషల్! ఎందుకంటే ఆమె అంతా సవ్యంగా సాగితే అమెరికా ఫస్ట్ లేడీ అవుతుంది కాబట్టి! కాని, అంతటి ఇంపార్టెన్స్ వున్న సదరు సెలబ్రిటీ మహిళపై ఓ అమెరికన్ టాబ్లాయిడ్ నోరు పారేసుకుంది. అందుకే, ఆమె కూడా తిక్కరేగి కోర్టు మెట్లెక్కింది. ఏకంగా వెయ్యి కోట్లు పరువు నష్టం దావా వేసింది!   అమెరికా అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతోన్న డోనాల్డ్ ట్రంప్ తెలుసుగా? యూఎస్ ప్రెసిడెంట్ అవ్వకుండానే ఫుల్ ఫేమస్ అయిపోయాడు అతను. సహజంగానే బిజినెస్ మ్యాన్ కాబట్టి ఎలాంటి వ్యూహాలు పన్నాలో బాగా తెలిసిన వాడు. దాంతో వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం మీడియాలో వుంటున్నాడు!   ట్రంప్ తనకు నొటికి వచ్చిందల్లా మాట్లాడటం మనకు కొత్తేం కాదు. కాని, అతడి గురించి అమెరికన్ మీడియా కూడా అత్యుత్సాహంతో చాలానే రాసింది. అతడి భార్యని కూడా వదల్లేదు. డైలీ మెయిల్ అనే టాబ్లాయిడ్ ట్రంప్ భార్య మెలానియా ఒకప్పుడు సెక్స్ వర్కర్ అంటూ ఇష్టానుసారం కూతలు కూసింది. అందుకు పెద్దగా సాక్ష్యాలు కూడా చూపలేదట ఆ పేపర్!   1990లలో మోడల్ గా పని చేసి 2005లో ట్రంప్ ను పెళ్లాడింది మెలానియా. కాని, ఆమె అంతకు ముందు సెక్స్ వర్కర్ గా, ఎస్కార్ట్ పొట్ట పోసుకుందని డైలీ మెయిల్ రిపోర్ట్ చేసింది. ఈ వార్తపై ఆగ్రహంతో ఊగిపోయిన మెలానియా కోర్టుకు వెళ్లింది. తన పరువుకు భంగం కలిగించిన ఆ పత్రిక తనకు 150మిలియన్ డాలర్లు నష్టపరిహారం ఇవ్వాలని కేసు వేసింది!     కోర్టులో మెలానియా వేసిన కేసు ఏమవుతుందో ముందు ముందు తెలుస్తుంది. అలాగే, హిల్లరీ క్లింటన్ తో పోటీ పడుతోన్న ఆమె భర్త ట్రంప్ కూడా అమెరికా అధ్యక్షుడు అవుతాడో లేదో మరి కొన్ని నెలల్లో తేలిపోతుంది! అంతలోపు ఈ పరువు నష్టం దావా మంచి పబ్లిసిటీ ఇష్యూగా మాత్రం ఊపయోగపడుతంది!

ఆమె గెలిచింది... ఊరు మెరిసింది!

  ఒక్క గెలుపు... ఒకే ఒక్క గెలుపు... మొత్తం జీవితాన్నే మార్చేస్తుంది! అవును... ఒలంపిక్స్ లో స్వర్ణం గెలిస్తే జీవితం మారిపోక మరేం అవుతుంది? అమాంతం మొత్తమంతా మారిపోతుంది! మన దేశంలో అయితే కాంస్యం, రజతం గెలిచినందుకే కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటారు. కోట్లు గుమ్మరించి సత్కారాలు చేసి రాత్రికి రాత్రి క్రీడకారుల్ని 'గొప్పొళ్ల'ని చేసేస్తారు! కాని, ఆ కెన్యా దేశపు బంగారు కన్య తాను కోటీశ్వరురాలు కావాలనుకోలేదు. తన ఊరే ముఖ్యమనుకుంది! ఇలాంటి సిన్సియర్ ప్లేయర్స్ మన దేశంలోనూ వుంటే ఎంత బావుండు కదా అనిపిస్తుంది ఆమె ఇన్ స్పిరేషనల్ స్టోరీ వింటే...   ఫెయిత్ కిపీగాన్.... ఈ పేరుతో ఒక అథ్లెట్ రియోలో పరుగు పందెంలో పాల్గొన్నదని మనకు తెలియకపోవచ్చు. కాని, పాల్గొనటమే కాదు ప్రపంచ నెంబర్ వన్ రన్నర్ ని ఓడించి స్వర్ణం కూడా గెలుచుకుంది. ఆ తరువాత పరిణామాలన్నీ మనం ఊహించుకోవచ్చు. ఫెయిత్ తిరిగి తన దేశం వెళ్లగానే ప్రధాని సహా అందరూ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతారు. ప్రైజ్ మనీ ప్రకటిస్తారు. ఫెయిత్ కష్టాలన్నీ తీరిపోతాయి. ఆమె తన నెక్ట్స్ ఛాంపియన్ షిప్ పై దృష్టి పెడుతుంది! ఇంతే అనుకుంటాం...   బాగా పేద దేశమైన కెన్యాలో ఫెయిత్ పుట్టింది ఓ మారుమూలు కుగ్రామంలో. అది ఎంత పేద గ్రామం అంటే అక్కడ ఇప్పటికీ కరెంట్ వుండదు. టీవీల ప్రశ్నే లేదు. ఇక మిగతా విద్య, వైద్య సదుపాయాల్లాంటివి కూడా మాట్లాడుకోకపోవటమే మంచిది! అలాంటి చిరు గ్రామం నుంచి ఫెయిత్ తన పేరుకు తగ్గట్టుగానే విశ్వాసంతో విశ్వ వేదిక మీదకి దూసుకొచ్చింది! బంగారు పతకం గెలిచింది!   ఫెయిత్ ఇంతకు ముందు ఎన్నో కూడా పతకాలు గెలిచింది. కానీ, అవేవీ ఆమె కుటుంబంతో సహా ఊరి వారు ఎవరూ టీవీల్లో చూడలేకపోయే వారు. కారణం కరెంట్ అన్నదే లేకపోవటం. కాని, ఒలంపిక్స్ విషయంలో అలా జరగటానికి వీలు లేదని నిశ్చయించుకుని  ఫెయిత్ తండ్రి ఓ సాహసం చేశాడు. తనకు ప్రభుత్వం పేదలకిచ్చి రాయితీలు ఇవ్వనక్కర్లేదని, బదులుగా ఆ డబ్బుతో తమ ఊరికి కరెంట్ ఇవ్వమని కోరాడు. అప్పుడు విషయం తెలసుకున్న కెన్యా ప్రభుత్వం ఫెయిత్ స్వగ్రామానికి కరెంట్ ఏర్పాటు చేసింది. ఫైనల్స్ లో ఫెయిత్ స్వర్ణం గెలవటాన్ని ఊరంతా కళ్లారా చూసింది!   మెడల్ గెలుచుకుని తిరిగొచ్చిన ఫెయిత్ ప్రైజ్ మనీ అందుకోటానికి తహతహలాడిపోలేదు. ఎవ్వరు తనని కలవాలన్నా తన ఊరికే రమ్మని చెప్పింది. దాంతో కెన్యా ప్రధాని కూడా ఫెయిత్ వాళ్ల చిరు పల్లెటూరికి రావాల్సి వచ్చింది. అప్పుడు ఆ ఊరి పరిస్థితే మారిపోయింది! కరెంట్ వచ్చింది! ఇంటింటికి సామ్ సంగ్ వాళ్లు అందించిన ఎల్ సీడీ టీవీలు కూడా వచ్చాయి. ఇక మీదట ఫెయిత్ ప్రపంచంలో ఎక్కడ పోటీలో పాల్గొన్నా ఆ ఊరి జనం సగర్వంగా టీవీల్లో చూసుకోగలరు!   తన విజయంతో తన జీవితంలో కొత్త వెలుగులు సంతరించుకోవటం ఎవరైనా చేస్తారు! కాని, ఫెయిత్ లాగా... తన విజయాన్ని తన ఊరిలో కొత్త వెలుగులు తీసుకొచ్చేందుకు వాడటం... నిజంగా అద్భుతమే!

మళ్లీ సభలో గుభాళించే ప్రయత్నంలో... రోజా!

  రోజూ వార్తల్లో వుండటం రాజకీయంలో ఓ భాగమే కావొచ్చుగాని... రోజూ వార్తల్లో వుండటం మాత్రమే రాజకీయం కాదు! ఈ విషయం రోజాకు ఎట్టకేలకు బోధపడి వుంటుంది. వైసీపీ ఎమ్మేల్యే అయిన ఆమె గత కొన్ని నెలలుగా అసెంబ్లీలో కాలుమోపలేక జబర్డస్త్ షూటింగ్లు చేసుకుంటూ రచ్చబండ వద్దే కాలక్షేపం చేస్తోంది! అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ ఎక్స్ హీరోయిన్ అసెంబ్లీ స్పీకర్ కి బేషరతుగా సారీ చెప్పిందట! అదీ రాత పూర్వకంగా...    కొన్నాళ్ల క్రితం వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా అసెంబ్లీలో లైవ్ గా చెలరేగిపోయింది. ఆ విషయం ఇంకా ఎవరు మర్చిపోలేదు కూడా! ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా టీడీపీ లీడర్లు చాలా మందిపై ఆమె రుసరుసలాడింది. బూతులు కూడా తిట్టిందని అధికార పక్షం వారన్నారు. మొత్తానికి ఎలాంటి సభా సంప్రదాయాలు పాటించని రోజాపై సంవత్సరం పాటూ వేటు పడింది అసెంబ్లీలో. తరువాత ఆమె సుప్రీమ్ కోర్టు దాకా వెళ్లినా కూడా తిరిగి సభలో కాలుపెట్టడం కుదరలేదు. అందుకే, ఇప్పుడు తాను కోర్టులో చెప్పినట్టే స్పీకర్ కి సారీ చెప్పిందంటున్నారు. ఆమె రాసిన లేఖ అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి చేరిందట! అందులో రోజా బేషరతుగా స్పీకర్ కి, సభకి, అలాగే, టీడీపీ ఎమ్మేల్యే అనితకి కూడా సారీ చెప్పిందట!    తొలిసారి సభలో కాలుపెట్టడం వల్లనో, లేక బయట జరిగే ప్రెస్ మీట్లకి, లైవ్ ప్రొసీడింగ్స్ కి తేడా తెలియకపోవటం వల్లనో రోజా నోరు జారింది. ఫలితంగా అమూల్యమైన కాలాన్ని కోల్పోవలసి వచ్చింది. ఇప్పటికైనా సారీ చెప్పింది కాబట్టి శాసన సభ స్పీకర్ క్షమించాలని ఆశిద్దాం. ఆమెను సభకి పంపిన జనం తరుఫున రోజా గళమెత్తాలని కోరుకుందాం. ఇక మీదైనా ఆమె తన దూకుడు తగ్గించి జనం సమస్యల గురించి మాట్లాడుతూ పరిణతి ప్రదర్శిస్తుందనే అనుకుందాం. ఎందుకంటే, సంచలన వాఖ్యలు అప్పటికప్పుడు మీడియాలో గరంగరంగా వినిపిస్తాయి కాని... దీర్ఘ కాలంలో సదరు రాజకీయ నేత భవిష్యత్ కే ప్రమాదంగా పరిణమిస్తాయి! ఈ సత్యం ఈ పాటికే వైసీపీ ఎమ్మేల్యేకి బోధపడి వుంటుంది...  

ఈ మంత్రులకి... దసరా సరదా వుండకపోవచ్చు!

తెలంగాణ , ఆంధ్ర రాష్ట్రాలుగా సమైక్యాంధ్ర విభజన తరువాత రెండు చోట్లా కొత్త ప్రభుత్వాలు ఏర్పాడ్డాయి. అయితే, నవ్యాంధ్రలో టీడీపీ సర్కార్ ఇప్పటి వరకూ మంత్రి వర్గ విస్తరణ జోలికి వెళ్లలేదు. ఏపీ ఫస్ట్ క్యాబినేట్ రెండున్నర ఏళ్లుగా అలానే పని చేస్తోంది. కాని, అతి త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి వర్గ ప్రక్షాళనకి తెర తీయనున్నారని సమాచారం. దసరాకు అటు ఇటుగా కొంత మంది పదవులు ఊడే చాన్స్ లేకపోలేదని అధికార పార్టీ వర్గాలు అంటున్నాయి.  కొత్తగా మంత్రి పదవులు ఎవర్ని వరిస్తాయో ఇప్పుడే క్లారిటీగా చెప్పలేకపోయినా కొంత మంది పేర్లు మాత్రం పదవులు ఊడే లిస్ట్ లో వినిపిస్తున్నాయి. ఈ లిస్ట్ ఫైనల్ కాకపోయినా చాలా వరకూ కన్ ఫర్మేనని అంటున్నారు. గుంటూరు జిల్లా నుంచి ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్ బాబు పేర్లు వినిపిస్తున్నాయి. విజయనగరం నుంచి కిమిడి మృణాళిని పేరు వినిపిస్తోంది. అలాగే, ప్రకాషం జిల్లా మంత్రి సిద్ధా రామారావు పేరు కూడా లిస్ట్ లో వుండబోతోందని టాక్. అనంతపురం నుంచి పరిటాల సునీత, నెల్లూరు నుంచి పొంగూరు నారాయణ కూడా మంత్రి వర్గ మార్పులు, చేర్పుల్లో భాగంగా పదువులు కోల్పోయే ఛాన్స్ వుందంటున్నారు. ఇక కృష్ణా జిల్లా నుంచి కొల్లు రవీంద్రపై వేటు పడే వీలుందని తెలుస్తోంది.

కేజ్రీవాల్ వారి కేడీ మంత్రులు!

గంగ.... ఆకాశం నుంచి శివుని శిరస్సుపైకి,అక్కడ్నుంచి హిమాలయాల మీదకి, అటు నుంచి భూమ్మీదకి, చివరకు సముద్రంలోకి పతనం అవుతూ వస్తుంది! ఢిల్లీ సీఎం కే్జ్రీవాల్ వారి ఆమ్ ఆద్మీ పార్టీని చూస్తే అలాగే అనిపిస్తోంది! చీపురు కట్టనే పార్టీ గుర్తుగా పెట్టుకుని అవినీతి ఊడ్చేస్తానని ఆయన వచ్చాడు. కాని, ఇప్పుడు జనం చీపుర్లు తిరగేసి కొట్టేలా ఆప్ నేతలు ప్రవర్తిస్తున్నారు! ఆమ్ ఆద్మీ పేరు చెప్పుకుని, అవినీతి అంతం చేస్తామంటూ, అన్నా హజారేను కూడా తెలివిగా వాడుకున్న కే్జ్రీవాల్ తిరుగులేని మెజార్టీతో సీఎం అయ్యాడు. అయినా కూడా తన సహజ ధోరణి విడిచిపెట్టకుండా మోదీపై విమర్శలతోనే కాలం వెల్లబుచ్చుతున్నాడని ఆరోపణలు వున్నాయి. ఢిల్లీలో రేపుల సంఖ్య ఏదీ తగ్గుముఖం పట్టటం లేదు. అన్నీ సమస్యలు పెరిగిపోతూనే వున్నాయి. కొన్నిటికి లెఫ్టెనెంట్ జనరల్ కారణం అంటాడు. కాదంటే మిగతా వాటికి మోదీ కారణమంటాడు. తాను మాత్రం ఎందుకు బాధ్యుడు కాడంటాడు కేజ్రీవాల్!. పరిపాలన సంబంధమైన విషయాల్లో, రాజకీయ చదరంగంలో కేజ్రీవాల్ ప్రవర్తన ఎలా వున్నా ఆయన అనుచరులు కొందరు చేస్తున్న పనులు మాత్రం ఆప్ ఖాతాలో ఘోరమైన పాపాలుగా చేరిపోతున్నాయి. రానున్న ఎన్నికల్లో ప్రజలు తీవ్రమైన గుణపాఠం చెప్పే పరిస్థితులు తీసుకొస్తున్నాయి! కొన్నాళ్ల కిందట జైన నగ్న సాధువు తరూణ్ సాగర్ హర్యాణ అసెంబ్లీలో స్పీచ్ ఇస్తే నానా రచ్చ చేశారు కొందరు ఆప్ లీడర్లు. ట్విట్టర్ లో అనధికారికంగా నోటికి వచ్చిందంతా వాగేశారు. బట్టలు వేసుకోని ఒక సాధువు గురించే అంత అల్లరి చేసిన వారంతా ఇప్పుడు అవాక్కై వుండిపోవాల్సి వచ్చింది. ఆమ్ ఆద్మీ నేత సందీప్ కెమెరా కంటికి బట్టలు లేకుండా చిక్కాడు. ఇద్దరు మహిళలతో కాంప్రమైజింగ్ పొజీషన్లో చిక్కాడు! పైగా ఈ ఆప్ నేత, కేజ్రీవాల్ కేబినేట్ లో మహిళా శిశు సంక్షేమ శాఖామాత్యులు!. సీడీలో సందీప్ అనే మినిస్టర్ గారి కొన్ని ఫోటోలు కూడా వున్నాయి. అన్నీ చూసి కేజ్రీవాల్ అర్థగంటలోనే సందీప్ ని మంత్రి పదవి నుంచి తొలగిం చేశాడు. ఇది ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే! కాని, ఆప్ లో ఇలాంటి ముసలం పుట్టడం ఇది మొదటి సారి కాదు. అదే ఆందోళన కలిగిస్తోన్న విషయం...  తమ పార్టీ అన్నిటికంటే స్వచ్ఛమైన దుకాణం అని చెప్పుకునే కేజ్రీవాల్ ఇంతకు ముందు మరో మంత్రిని ఇలాగే తొలగించాల్సి వచ్చింది. అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన ఆప్ పార్టీ ప్రభుత్వంలోనే ఆహార మంత్రిగా పని చేస్తున్నాయాన లంచం తీసుకుంటూ దొరికాడు. ఆయన్ని కూడా సస్పెండ్ చేసి సీబీఐ విచారణకు ఆర్డర్ ఇచ్చాడు సీఎం. అరవింద్ కేబినేట్ లోని మరో మంత్రి గృహ హింస చట్టం కింద స్వంత భార్య చేతనే కేసు ఎదుర్కొంటున్నాడు. ఇంకొకాయన దొంగ సర్టిఫికెట్ల కేసులో పదవికి రాజీనామా చేశాడు. ఇలా ఎవర్ని కదిలించినా ఘాటైన కేసులు బయటపడుతున్నాయి ఢిల్లీలో.  త్వరలో రానున్న పంజాబ్ ఎన్నికల్లో సత్తా చాటాలని తహతహలాడుతోన్న ఆప్ రోజుకో మంత్రి, నేత నిర్వాకం వల్ల అడ్డంగా బుక్కైపోతోంది. ఒక వైపు అధికారంలో వున్న బీజేపి, మరోవైపు వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ లను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక సతమతం అవుతోంది. అయినా కూడా కేజ్రీవాల్ ఇమేజ్ తో గట్టెక్కవచ్చని ఆశిస్తోంది! చూడాలి మరి చీపురు పార్టీ భవిష్యత్ ఏంటో? 

నగరమా? నరకమా?

మరోసారి వర్షం పడింది. మరోసారి హైద్రాబాద్ నీటిపాలైంది. ఒకరు హైటెక్ సిటీ అంటే మరోకరు సైబర్ హబ్ అంటారు. ఇక మన నేతలైతే ఇప్పుడు హైద్రాబాద్ ని విశ్వనగరం అంటున్నారు. కాని, గట్టిగా ఒక్క జల్లు పడితే చాలు విశ్వనగరం విశ్వ ప్రయత్నం చేసినా కోలిక్కిరాదు! ఇదీ పరిస్థితి!  వర్షం పడగానే భాగ్యనగరం బెంబేలెత్తిపోవటం కొత్తేం కాదు. రొటీన్ గా మీడియా కూడా కెమెరాలు వేసుకుని రోడ్లపైకి వచ్చి జలమయమైన రోడ్లని చూపటమూ కొత్త కాదు. కాని, బుధవారం జరిగింది వేరు. వున్నట్టుండీ ఆకాశానికి చిల్లు పడ్డట్టు మేఘాలు వర్షించాయి. కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి కాబట్టి... ఇలాంటి జోరు వాన ఆనందించాల్సిన విషయమే. కాని, నగరవాసులు మాత్రం బిక్కుబిక్కుమంటూ కూర్చోవాల్సి వచ్చింది. అందుక్కారణం మన విశ్వనగరం మెయింటెనెన్సే! ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ హైద్రాబాద్ బ్రాండ్ ఇమేజ్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. అందుకు తగ్గట్టే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు భాగ్యనగరంలో జరుగుతున్నాయి. ఇక మొన్న హైద్రాబాద్ కార్పోరేటర్ ఎన్నికల తరువాతైతే సిటీ కోసం ప్రత్యేకంగా తన కొడుకునే కేటాయించారు సీఎం. కేటీఆర్ రంగంలోకి దిగి రాజధానిపై కన్నేసినా పరిస్థితిలో మార్పు లేదు. మరీ విభ్రాంతికరం ఏంటంటే... కేటీఆరే స్వయంగా హైద్రాబాద్ రోడ్లు బాగోలేవని ఒప్పుకోవటం! తానూ, సీఎం కూడా రోజూ హైద్రాబాద్ రోడ్లపై తిరుగుతున్నామనీ, అవ్వి ఎంత దారుణంగా వున్నాయో తెలుసునని ఆయన అన్నారు! అయితే, ఇప్పటికిప్పుడు చేయగలిగింది ఏం లేదని ఆయనే అన్నారు. వచ్చే వర్షా కాలం వరకూ పరిస్థితిలో మార్పు రావొచ్చని కేటీఆర్ చెప్పుకొచ్చారు... స్వయంగా మంత్రే హైద్రాబాద్ పరిస్థితి అద్వాన్నంగా వుందని అంగీకరించాక ఇక డిస్కషన్ చేసేదేముంది? కాకపోతే, ఆయన చెప్పిందాంట్లోనూ పాయింట్ వుంది. గత అరవై ఏళ్లుగా హైద్రాబాద్ ను పాలకులు బంగారు గుడ్లు పెట్టే బాతుగా చూస్తూ వచ్చారు కాని దాన్ని బాగోగుల మీద తగినంత దృష్టి పెట్టలేదు. అదే ఇవాళ్టి పరిస్థితికి కారణం. దాన్ని సరిద్దిద్దడానికి నేడున్న ప్రభుత్వానికి మరి కొంత టైం ఇవ్వటం కూడా సరైందే. అయితే, కనీసం మరోసారి కుంభవృష్టి కురిసే నాటికైనా మన విశ్వనగరం పేరుకి తగ్గట్టుగా వుంటే ... జనం హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. లేదంటే, నగరమో, నరకమో తెలియని స్థితిలో పేదలు, మధ్యతరగతి వాళ్లు ఎప్పటిలాగే సతమతం అవుతారు! 

'ప్రత్యేక' ప్రకటనకి కారణం పవనా? చంద్రబాబా?

ప్రత్యేక హోదా... మొన్నటి వరకూ ఇదే ప్రయోగం వినిపించేది ఎక్కడ చూసినా! కాని, ఇప్పుడు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్రకటన అనేది వినిపిస్తోంది! అంటే ఏంటో ఇప్పటికిప్పుడు ఎవరికీ తెలియదు. కాని, ప్రత్యేకమైన ప్రకటన ఒకటి ఏపీ కోసం చేస్తారని మాత్రం అందరి అంచనా. అందుకు తగ్గట్టే ఢిల్లీలో అలజడి కూడా వుంది. వెంకయ్య, సుజనా చౌదరి లాంటి ఏపీ నేతలు బిజీబిజీగా మీటింగ్ లకు అటెండ్ అవుతున్నారు. జైట్లీ, షా లాంటి హస్తిన పెద్దలు కూడా ఏపీపైన దృష్టి పెట్టినట్టే కనిపిస్తోంది....  ప్రత్యేక హోదా ఇస్తామని గత యూపీఏ ప్రభుత్వం చట్ట సభలో అధికారికంగా చెప్పింది. అందుకు కారణం కూడా వెంకయ్య నాయుడే. ఆయనే ఒంటరిగా లేచి నిల్చుని ప్రత్యేక హోదా కావాలని నినదించారు. మన్మోహన్ తో ప్రకటన చేయించారు. అయితే, ఇప్పుడు అదే బీజేపి పెద్దలకు తలనొప్పిగా మారింది! ప్రత్యేక హోదా ఇవ్వటం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత తేలిక కాదు. ఒక్క ఆంద్రప్రదేశ్ కు ఇస్తే అది అక్కడితో ఆగేది కూడా కాదు. ఇంకా చాలా రాష్ట్రాలు అదే డిమాండ్ తో ముందుకు వస్తాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కూడా స్పెషల్ స్టేటస్ కోరే ఛాన్స్ వుంది. ఇలాంటి పొలిటికల్ ప్రాబ్లమ్స్ మాత్రమే రాజ్యాంగ బద్ధంగా కూడా అనేక సమస్యలు వచ్చే అవకాశం వుంది ప్రత్యేక హోదా విషయంలో. అందుకే, ప్రత్యేక హోదా ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజ్ లేదా ప్రత్యేక ప్రకటనగా మారిపోయింది. ఇంతకీ ప్రత్యేక ప్రకటనలో వుండేదేంటి?  ప్రత్యేక ప్రకటనలో మోదీ సర్కార్ ఏపీకి ఇచ్చేదేంటో ఇప్పుడే తెలియదు. కాని, ప్రత్యేక హోదాలో వుండే అన్ని లాభాలు ఇందులో వుంటాయని అంటున్నారు. కాని, అంత పెద్ద వరాల చిట్టా హఠాత్తుగా కేంద్రం ఇప్పుడెందుకు విప్పుతోంది? కారణం పవన్ కళ్యాణ్ తిరుపతి బహిరంగ సభ అనుకున్నారు చాలా మంది. ఎందుకంటే, పవర్ స్టార్ సభ పెట్టి బీజేపిని ఇస్టానుసారం విమర్శించాకే ఢిల్లీలో కదలిక వచ్చింది. కాని, ఇప్పుడు కొన్ని వర్గాల సమాచారం ప్రకారం మరో విషయం తెలుస్తోంది!. ఎన్డీఏలో టీడీపి భాగస్వామి. మోదీతో ఎన్నికల ముందు చాలా పార్టీలు జట్టు కట్టటానికి వెనుకంజ వేశాయి. కాని, అలాంటి సమయంలోనే చంద్రబాబు స్నేహ హస్తం అందించారు. ఓటింగ్ కంటే ముందే ఎన్డీఏలో భాగస్వామిగా వుండి నవ్యాంధ్రలో బీజేపి గెలుపుకు వీలైనంత సహకరించారు. 2014 తరువాత కూడా గత రెండేళ్లుగా శివసేన లాంటి ఎన్డీఏ పక్షాల్లాగా టీడీపీ అల్లరి పెట్టలేదు. ఎన్డీఏలో క్రమశిక్షణగానే మెదులుతూ వచ్చింది.  రెండేళ్లుగా టీడీపీ ఎన్డీఏకు ఎంతగా సహకరించినా ప్రత్యేక హోదా విషయంలో మోదీ క్యాబినేట్ ఎలాంటి డెసీషన్ తీసుకోలేదు. దీని వల్ల చంద్రబాబు గవర్నెమెంట్ జనం ముందు దోషిగా నిలబడాల్సి వచ్చింది. అంతే కాదు, ఏపీకి మేలు జరగకున్నా ఎందుకు ఎన్డీఏలో వుంటున్నారనే వారు కూడా ఎక్కువైపోతున్నారు. వీటన్నిటి నేపథ్యంలో చంద్రబాబు తన అంతిమ అస్త్రంగా ఎన్డీఏ నుంచి బయటకు వస్తామని చెప్పారంటున్నారు. కేంద్రం పెద్దలకు బాబు ఇక మా వల్ల కాదు మేం గుడ్ బై చెప్పేస్తాం అనటంతోనే కాస్త కదలిక వచ్చిందట! దాని ఫలితమే ప్రత్యేక ప్రకటన కసరత్తు అని కూడా తెలుస్తోంది... నిజంగా చంద్రబాబు వారెంట్ ఇచ్చారో లేదో తెలియదుగాని ఏదో ఒక కారణం చేత రాష్ట్రానికి మేలు జరిగితే అదే చాలు! 

పవన్ కళ్యాణ్ బర్త్ డే నాడే ' ఆ ప్రత్యేక ప్రకటన ' రానుందా?

ప్రత్యేక హోదా... తెలంగాణ, ఆంధ్రా విడిపోయాక అత్యంత వివాదాస్పదమైన పదాల్లో ఇదొక్కటిగా చేరిపోయింది! రాజకీయ నాయకులతో పాటూ శివాజీ, పవన్ కళ్యాణ్ లాంటి నటులు కూడా ప్రత్యేక హోదా అంటూ నానా రభసకి కారణమైపోయారు. అటు ప్రజల్లో కూడా ప్రత్యేక హోదా సెంటిమెంట్ అంతకంతకి పెరిగిపోతోంది. హైద్రాబాద్ తో సహా తెలంగాణని విడదీశాక ఆంధ్రకి అన్యాయం జరిగిందన్న భావం జనాల్లో విపరీతంగా వుంది. అది ప్రత్యేక హోదా ఇవ్వకపోవటంతో మరింతగా పెరిగిపోయింది. చివరకు, అటు పోయి ఇటు పోయి కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం మెడకు చుట్టుకుంటోంది. ఎందుకంటే, నవ్యాంధ్రకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే... అది కేంద్ర ప్రభుత్వానికే సాధ్యం. ఇవ్వకుండా నాన్చుతోంది కూదా మోదీ సర్కారే! అందుకే, మొన్న తిరుపతి సభలో కాషాయ పార్టీకి కషాయం తాగించాడు పవన్ కళ్యాణ్! భాగస్వామ్య దర్మంతో టీడీపీ పెద్దగా విమర్శలు చేయకున్నా పవర్ స్టార్ మాత్రం కమలదళాన్ని ఉతికి ఆరేశాడు. అయినా కూడా ఆశ్చర్యకరంగా పవన్ కు బీజేపి నుంచి పెద్దగా కౌంటర్లు రాలేదు!  పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా గురించి కేవలం బీజేపిని, మోదీ సర్కార్ నే టార్గెట్ చేసినా కూడా ఆ పార్టీ నాయకులు ఆయన్ని ఏమీ అనకపోవటానికి కారణం... త్వరలో రానున్న ప్రకటనే అంటున్నారు పొలిటికల్ పండిట్స్. మరి కొద్ది రోజుల్లో, అంటే సెప్టెంబర్ 2న కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై ఓ కీలక ప్రకటన చేయనుందని సమాచారం. అందులో ఏం వుండాలి, ఏం వుండకూడదు అనే చర్చ కూడా ఇప్పటికే జరిగిపోయిందట. అమిత్ షా, అరుణ్ జైట్లీ నేతృత్వంలో పలు మీటింగ్ లు జరిగాయి ఢిల్లీలో. పవన్ కళ్యాణ్ చేత నానా మాటలు పడ్డ వెంకయ్య నాయుడు ఈ చర్చల్లో ప్రధాన పాత్ర వహించారట! ప్రత్యేక హోదా అన్న పదం మాత్రం లేకుండా ఆంధ్ర రాష్ట్రానికి అన్ని లాభాలు చూకూరేలా ప్రకటన చేయాల్సిందిగా వెంకయ్య కేంద్ర ఆర్దిక మంత్రికి చెప్పారట. అలాగే బీజేపి ప్రెసిడెంట్ అమిత్ షా కూడా ఇక ప్రకటన చేయాల్సిన టైం వచ్చిందనే భావనతోనే వున్నారట. ఎందుకంటే, ప్రత్యేక హోదా వాయిదా వేసినంత కాలం తెలుగు ప్రజల్లో బీజేపికి నెగటివ్ మార్కులే పడుతుంటాయని ఆయన గ్రహించారంటున్నారు.... అంతా అనుకున్నట్టే జరిగితే సెప్టెంబర్ 3 న ప్రధాని విదేశీ యాత్రకు బయలుదేరే ముందే ఓ సెప్టెంబర్ 2 న ఓ ప్రకటన వెలువడుతుందట! ఆ రోజే పవన్ కళ్యాణ్ బర్త్ డే కూడా! అంటే.... పవన్ పుట్టిన రోజు నాడే కేంద్రం ఆంధ్రాపై వరాలు వర్షం కురిపించనుందన్నమాట! ఒకవేళ ప్రకటన వార్త నిజమే అయితే మాత్రం.... జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ఆయన పుట్టిన రోజున వచ్చే కీలక ప్రకటనతో 'పండగ' చేసుకుంటారు! వాళ్ల సంగతి ఎలా వున్నా మంచి ప్రకటన వస్తే మాత్రం తెలుగు ప్రజలు హాయిగా ఊపిరి పీల్చుకుంటారు....

ఓటుకు నోటు కేసులో... నిజంగా దమ్మెంతా?

ఓటుకు నోటు కేసు... ఈ వార్త కొన్నాళ్ల కింద తెలుగు రాష్ట్రాల్ని ఒక కుదుపు కుదిపింది. కారణం... తెలంగాణ ప్రభుత్వమే స్వయంగా రంగంలోకి దిగి ఆంధ్రా ప్రభుత్వ సీఎంపై ఆరోపణలు చేయటం! సమైక్యాంధ్ర విభజన తరువాత అతి పెద్ద పొలిటికల్ కాంట్రవర్సీ ఇదే అనవచ్చు. ఒకవైపు కేసీఆర్ , మరో వైపు చంద్రబాబు అన్నట్టుగా సాగటమే ఈ కేసులోని విశేషం. అయితే, తరువాత కొన్నాళ్లకి సదరు కేసు కాస్తా టీ కప్పులో తుఫాన్ గా మారిపోయింది. అంతా చల్లబడిపోయింది! ఇక ఓటుకు నోటు , ఫోన్ ట్యాపింగ్ పదాల్ని అంతా మరిచిపోతుండగా ఈ మధ్య మరోసారి వేడి రాజుకుంది. ఏసీబీ కోర్టు మరోసారి చంద్రబాబు వాయిస్ వున్న టేపులకు సంబంధించి విచారణకు అనుమతించింది. దీంతో మళ్లీ వార్తల పరంపర మొదలైంది. మరీ ముఖ్యంగా, మీడియాలో వున్న యాంటీ టీడీపీ, యాంటీ చంద్రబాబు వర్గం కలకలం రేపుతోంది! ఇక అంతా అయిపోయినట్టే అన్నట్లు కథనాలు జనం మీదకి వచ్చిపడుతున్నాయి! కాని, నిజం మరోలా వుందంటున్నారు కొందరు న్యాయ నిపుణులు... ఓటుకు నోటు కేసు ఏసీబీ కోర్టులో వుండగానే హై కోర్టు  గతంలో ఓ తీర్పునిచ్చింది. అసలు ఎన్నికల వేళ డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేయటం అవినీతి కిందకి రాదని తేల్చింది. అది ఎన్నికల నియమావళి ఉల్లంఘనగా చూడాలని చెప్పింది. కాబట్టి ఏసీబీ కోర్టు ఓటుకు నోటు విషయంలో పెద్దగా చేయగలిగింది ఏం లేదంటున్నారు కొందరు సీనియర్ న్యాయకోవిదులు. కేసు విషయంలో ఏం జరగాలన్నా హైకోర్ట్ పరిధిలో జరగాల్సిందేనని వారంటున్నారు. అలాంటప్పుడు ఏసీబీ కోర్ట్ మరోసారి కొత్త ఆదేశం ఇవ్వటం వల్ల జరిగేదేం లేదని తేల్చేస్తున్నారు.  ఒక వైసీపీ ఎమ్మెల్యే టేపులకి సంబంధించి ప్రైవేట్ గా చేయించుకన్న పరీక్షలో ఎలాంటి నిజాలున్నా అవ్వి చెల్లవని అంటున్నారు సీనియర్ అడ్వకేట్స్. టేపుల్లో వున్నది చంద్రబాబు వాయిసే అని పిటీషనర్ వాదిస్తున్నప్పటికీ అది ప్రైవేట్ సంస్థ చేసిన పరీక్ష మాత్రమే. అలాంటి సాక్ష్యాలు కోర్టులో నిలిచేవి కావు. మరో వైపు , చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్, టేపుల్లో ఆయన వాయిస్ కి లింక్ పెట్టడం కూడా సరైంది కాదంటున్నారు. ఎందుకంటే, సీఎం చెప్పింది తన ఫోన్స్ ట్యాప్ చేస్తున్నారని మాత్రమేనని. ఓటుకు నోటు కేసులో బాబు వాయిస్ గా చెబుతోన్న ఫోన్ ఆయనది కాదని వారు పాయింట్ అవుట్ చేస్తున్నారు. చివరగా, అసలు టేపుల్లో వున్నది బాబు వాయిసే అయినా ఆయన మాట్లాడింది తప్పేం కాదని కూడా కొందరంటున్నారు. ఓటు వేయాల్సిన ఎమ్మెల్సీని స్వేచ్ఛగా  ఓటు వేయమనే ఆయన చెప్పారని. అందులో ఎంత మాత్రం చట్ట వ్యతిరేక అంశం లేదని చెబుతున్నారు! మొత్తం మీద ఓ వర్గం మీడియా చేసినంత హడావిడి నిజంగా ఓటుకు నోటు కేసులో ఏం లేదని అర్థం చేసుకోవాల్సిన సారాంశం!