5 రాష్ట్రాల ఎన్నికలు... మోదీ నేర్పిన 5 గుణపాఠాలు!
posted on Mar 15, 2017 @ 6:16PM
2017 సంవత్సరం మొత్తానికి సరిపోయేంత షాకిచ్చిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇప్పుడు అపోజిషన్ కి నేర్పే అయిదు గుణపాఠాలు ఏంటి? ఓ సారి చూద్దాం...
1. మన దేశంలో బీజేపిని ఎదుర్కొనే బాధ్యత ప్రధానంగా కాంగ్రెస్ , లెఫ్ట్ పార్టీలది. అయితే, ఎర్ర పార్టీలతో సహా కాంగ్రెస్ , రీజినల్ పార్టీలు అన్నీ వెర్రిగా వామపక్ష అతివాదుల వెంటపడుతున్నాయి. కన్నయ్యా, ఉమర్ ఖిలీద్ లాంటి వారికి సపోర్ట్ చేస్తూ... ఆ అఫ్జల్ గురుని సమర్థించే అతి లెఫ్ట్ ఉద్యమకారులతో... ఓటర్ల నుంచి లాభం పొందటం మాట అటుంచి భారీ నష్టం మూటగట్టుకోవాల్సి వస్తుంది! అదే జరిగింది...
2. మోదీ భారతీయ యువత ఆశలకి, ఆశయాలకి అనుగుణంగా డిజిటలైజేషన్ అంటుంటే... అఖిలేష్ యాదవ్ స్మార్ట్ ఫోన్లు పాటలు వినటానికి, గేమ్స్ ఆడుకోటానికి అంటాడు! ఫోన్ లో బ్యాంకింగ్ ఏంటంటూ వెటకారం చేస్తాడు! రాహుల్ బాబా చిరిగిన కుర్తా వేసుకుని వచ్చి డ్రామా చేస్తాడు! ఆ కుర్తా చిరిగింది కాదనీ, చింపుకుని వచ్చిందనీ యువతకి తెలియదా?
3. మైనార్టీలు, దళితుల విషయంలో బీజేపిని విలన్ని చేసి చూపించవచ్చు అనే భ్రమకి మన ప్రతిపక్షాలు దూరం కావాలి! మోదీ నేతృత్వంలో అంబేద్కర్ ని ఆరాధ్య దైవంగా స్వీకరించేసింది కమలం పార్టీ! యూపీలో ముస్లిమ్ మెజార్టీ స్థానాల్లో కాషాయ ధ్వజం ఎగరటం కూడా ముస్లిమ్ లలో మారుతున్న అభిప్రాయానికి సంకేతం!
4. బీహార్లో మహాఘట్ బంధన్ అంటూ ఒక ముఠాను తయారు చేసి బీజేపిని అబిమన్యుడిలా చుట్టాముట్టాయి అన్ని పార్టీలు. కాని, మతతత్వ శక్తుల్ని అడ్డుకోటానికి మేమంతా కలుస్తున్నామంటే ఇక మీదట జనం నమ్మకపోవచ్చు. మరింత నమ్మదగ్గ కారణం ఏదైనా చూపిస్తేనే ఎస్పీ, కాంగ్రెస్ లాంటి పొత్తుల్ని ఓటర్లు ఓకే చేస్తారు!
5. ప్రతిపక్షాలు మీడియాని నమ్ముకోవటం తగ్గించాలి. నోట్లు రద్దైన మరుసటి రోజు నుంచీ డీమానిటైజేషన్ వల్ల జనం నరకం చూస్తున్నారని హడావిడి చేసింది మీడియా. అది నమ్మిన కేజ్రీవాల్ మొదలు రాహుల్ బాబా వరకూ అందరూ అడ్డంగా బుక్కయ్యారు! ఆ ఫలితం గోవా నుంచి యూపీ దాకా జనం ఓట్లతో చూపించారు!