కాంగ్రేస్ వాళ్ల కొత్త మ్యాచ్ లో సిద్ధూ బై రన్నర్ మాత్రమేనా?
posted on Mar 17, 2017 @ 6:37PM
నవజ్యోత్ సింగ్ సిద్దూ... ఈ పేరు ఎప్పుడూ సంచలనమే! వివాదాస్పదమే! క్రికెట్లో వున్నా, ఇప్పుడు రాజకీయాల్లో వున్నా సిద్దూ డేరింగ్ అండ్ డాషింగే! కాని, ఆయన తెగింపు, సాహసం ఎప్పుడూ పెద్దగా లాభం చేకూర్చినట్టు కనిపించదు పాపం! క్రికెట్లో కూడా అద్బుతమైన టాలెంట్ వున్న సిద్దూ ఎలాంటి అద్బుతాలు చేయకుండానే రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది. 1996 ప్రపంచ కప్ సిరీస్ కి ఆయన ఎంపికయ్యాడు. కాని, ఇండియా, పాకిస్తాన్, శ్రీలంకల్లో జరిగిన ఆ సీరిస్ లో ఆయన ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు! మ్యానేజ్ మెంట్ ఆడనివ్వలేదు! దాంతో విసిగిపోయిన ఆయన తరువాత కొన్నాళ్లకే రిటైర్ మెంట్ తీసుకున్నాడు! ఇక ఆ తరువాత మొదలైన పొలిటికల్ జర్నీలో కూడా క్రికెట్ లో జరిగిందే రిపీట్ అవుతున్నట్టు కనిపిస్తోంది!
సిక్సర్ల సిద్దూగా పేరు తెచ్చుకున్న నవజ్యోత్ సింగ్ నిజానికి టీమిండియా క్యాప్టెన్ అవ్వగలిగిన వాడు. సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడగలిగే వాడు. కాని, ఆయన నిజాయితీ వల్లో, ముక్కు సూటితనం వల్లో, లేక నిలకడలేనితనం వల్లో కొన్ని సెంచరీలు, కొన్ని రికార్డ్ లు తప్ప ఏమీ సాధించలేకపోయాడు! రాజకీయాల్లోకి వచ్చి 15ఏళ్లు బీజేపీలో వున్నా ఇక్కడా ఆయన పరిస్థితి అదే! సిద్దూను కమల దళం అవమానించిందని చెప్పలేం. కాని, ఆయన మాత్రం ఆ పార్టీలో ఎంత మాత్రం సంతృప్తిగా వుండలేదు. చివరకు, పంజాబ్ లో ఓడిపోయే ప్రమాదం వుందని గ్రహించిన బీజేపి నాయకత్వం ఆయన్ని పిలిచి ఆ మధ్య రాజ్యసభ సీటిచ్చింది. ఆ చర్యతో ఆయన కాంగ్రెస్ , ఆప్ ల వైపు వెళ్లడని భావించింది. కాని, సిద్దూ తన ఇమ్మెచ్యురిటీతో ఎన్నికల ముందు అనేక నాటకీయ పరిణామాలకి ఆస్కారం ఇచ్చాడు! ఒక సారి కాంగ్రెస్ వైపు, ఒకసారి ఆప్ వైపు మొగ్గు చూపుతూ పొలిటికల్ గా చులకన అయ్యడు. ఎట్టకేలకు బీజేపి ఇచ్చిన రాజ్యసభ పదవిని మూడు నెలలకే వదులుకుని మరీ కాంగ్రెస్ లో చేరాడు. సిద్దూ లాంటి వ్యక్తిత్వం వున్న వారికి కాంగ్రెస్ లాంటి మహాలంకలో ఏం జరుగుతుందో ప్రమాణ స్వీకారం అయ్యేటప్పటికే తెలిసిపోయింది!
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఖాళీ అవుతున్నా పంజాబ్ లో అదృష్టం బాగుండీ ఘన విజయమే సాధించింది. అందుకు ప్రధాన కారణం కెప్టెన్ అమ్రీందర్ సింగ్. ఆయన నేతృత్వంలో మంచి మెజార్టీ సాధించిన కాంగ్రెస్ ఇప్పుడు ఎన్నికల ముందు తమ పార్టీలోకి వచ్చిన సిద్దూను నమ్మీ నమ్మనట్టు వ్యవహరిస్తోంది. ప్రమాణస్వీకారోత్సవం ముందు వరకూ సిద్దూ ఉప ముఖ్యమంత్రి అని ప్రచారం జరిగింది. కాని, ప్రతీ నేతా సీఎమ్మే అయిన కాంగ్రెస్ లో మన కొత్త పక్షికి అంత ఇంపార్టెన్స్ దక్కనిస్తారా? చాలా మంది సీనియర్లు అడ్డుపడటంతో ఉప ముఖ్యమంత్రిని కాస్త మంత్రికే పరిమితం చేశారు. అదీ సాంస్కృతిక, పర్యాటక, స్థానిక సంస్థల మంత్రిగా ప్రకటించారు! ఇవేవీ క్యాబినేట్లో ప్రధానమైవి కావు. సిద్దూ భార్య గత ప్రభుత్వంలో వైద్యశాఖను నిర్వహించారు. ఆ దృష్టితోనైనా కనీసం సిద్దూకి వైద్య ఆరో్గ్య శాఖ ఇవ్వలేదు. ఎలాంటి ప్రాధాన్యం లేని జూనియర్ శాఖలే అంటగట్టారు!
ఇప్పటి వరకూ జరిగిన వ్యవహారం చూస్తుంటే సిద్దూ ఆశలు కాంగ్రెస్ లో చేరాక కూడా సిద్ధించేటట్టు కనిపించటం లేదు. పైగా ఇప్పుడు బీజేపితో కూడా చెడింది కాబట్టి కాంగ్రెస్ లోనే కంటిన్యూ అవుతూ జాగ్రత్తగా బండి నడపాలి. దేశంలోని అతి పాత పార్టీలో కొత్తగా చేరిన ఆయన ఇష్టం వున్నా లేకున్నా టైంపాస్ చేయక తప్పదు. అయితే, ముక్కుసూటి మనిషని పేరు పడ్డ సిద్దూ కాంగ్రెస్ మార్కు ట్రీట్మెంట్ తో ఎన్నేళ్లు వేగుతాడు! అదే పెద్ద సస్పెన్స్!