తెలుగుదేశం కంచుకోటలపై పవన్ కల్యాణ్ ఫోకస్
posted on Mar 16, 2017 @ 1:03PM
2019 ఎన్నికల కోసం పవన్ కల్యాణ్ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నాడు. లేటైనా లేటెస్ట్‌గా వస్తానంటూ... తాను వేసే ఒక్కో అడుగుతో రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తున్నారు. సైలెంట్‌గానే సంచలనాలు సృష్టిస్తున్నాడు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయంగా వేస్తోన్న ఒక్కో అడుగు.... అధికార పార్టీ తెలుగుదేశంలోనూ ప్రకంపనలు పుట్టిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీకి అత్యధిక స్థానాలు కట్టబెట్టిన జిల్లాలపై పవన్ దృష్టి పెట్టడం, అదీ కూడా టీడీపీకి బాగా పట్టున్న జిల్లాలపై పవన్ ఫోకస్ పెట్టడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కలవరం మొదలైంది.
2014లో తెలుగుదేశం పార్టీకి అత్యధిక స్థానాలు కట్టబెట్టిన జిల్లాలపై పవన్ దృష్టి పెట్టడం చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జిల్లాలోని పదహారు స్థానాలను ఏకపక్షంగా టీడీపీకే కట్టబెట్టారు. పశ్చిమగోదావరి తర్వాత ఆ స్థాయిలో అనంతపురం జిల్లాలో టీడీపీకి భారీ విజయం దక్కింది. జిల్లాలోని 14 స్థానాల్లో ఏకంగా 12 చోట్ల గెలిచి ప్రభంజనం సృష్టించింది.
అయితే ఇఫ్పుడు ఈ రెండు జిల్లాలపై పవన్ కన్ను పడింది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచే పోటీ చేయడమే కాకుండా, అనంతపురం జిల్లాలో కరవు, రైతు ఆత్మహత్యలు, సాగు, తాగు నీరు, ఉమెన్ ట్రాఫికింగ్ ఇలా అన్ని సమస్యలపై జాతీయ స్థాయిలో పోరాటానికి సిద్ధమని ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది. అనంతలో పోటీ చేస్తానని ప్రకటించడం, జిల్లా సమస్యలపై జాతీయ స్థాయిలో ఉద్యమిస్తానని చెప్పడంతో... వచ్చే ఎన్నికల్లో తమ గెలుపు అవకాశాలు దెబ్బతింటాయనే ఆందోళన టీడీపీ నేతల్లో మొదలైంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు లేకుండా జనసేన పోటీచేస్తే.... తమ గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపుతుందని భయపడుతున్నారు.
ఇక తన ఓటు హక్కును హైదరాబాద్ నుంచి ఏలూరుకు మార్చుకున్న జనసేనాధిపతి... పశ్చిమగోదావరిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్లు చెబుతున్నారు. మెగా కుటుంబానికి పశ్చిమగోదావరి సొంత జిల్లా కావడం, ఏపీ రాజధానికి సమీపంగా ఉండటంతో....రాష్ట్రంలో జనసేన పాలిటిక్స్‌కు ఏలూరే సెంటర్ పాయింట్ అవుతుందంటున్నారు. ఆ లెక్కన పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన తీవ్ర ప్రభావం చూపించే అవకాశముందంటున్నారు.
అంతేకాదు 2009లో చిరంజీవి పోటీ చేసినట్లుగా... ఇటు రాయలసీమ నుంచి... అటు కోస్తాంధ్ర నుంచీ కూడా పవన్ బరిలోకి దిగితే... ఏలూరు లేదా నర్సాపురాన్ని ఎంచుకుంటారనే టాక్ వినిపిస్తోంది. అయితే గత ఎన్నికల్లో పవన్ అండతో పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీకి ఇది మింగుడుపడటం లేదు. ఒకవేళ పవన్ ...గోదావరి జిల్లాలతోపాటు కాపులు అధికంగా ఉన్న నియోజకవర్గాలపై ఫోకస్ పెడితే.... తెలుగుదేశం కంచుకోటలకు బీటలు ఖాయమంటున్నారు. అయితే కాపులు అధికంగా ఉండే పాలుకొల్లులో చిరంజీవి ఓటమి చవిచూసిన నేపథ్యంలో పవన్ పొలిటిల్ స్ట్రాటజీ ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది.