ఐటీ రిటర్న్స్ వేశారా? అయితే, యాక్సిడెంటైనా నో ప్రాబ్లమ్..!

ప్రతీ సంవత్సరం అందరూ ఐటీ రిటర్న్స్ బుద్దిగా సబ్ మిట్ చేస్తే ఏంటి లాభం? ఏముంది… దేశం బాగుపడుతుంది. ప్రభుత్వ ఆదాయం పెరిగి జనానికి మంచి చేసే కార్యక్రమాలు గవర్నమెంట్స్ చేపడతాయి. ఇలా అనుకుంటే పొరపాటే! ఈ మధ్య ఓ ఫేక్ వాట్సప్ మెసేజ్ ఐటీ రిటర్న్స్ కి కొత్త లాభం ఆపాదించింది! అదేంటంటే, వరుసగా లాస్ట్ త్రీ ఇయర్స్ ఐటీ రిటర్న్స్ ఎవరైతే చక్కగా దాఖలు చేస్తారో… వారికి దురదృష్టవశాత్తూ యాక్సిడెంట్ అయితే ప్రభుత్వం పది రెట్లు నష్టపరిహారం అందజేస్తుందట! ఇదేంటి నాకు తెలియదే అంటారా? ఎవరికీ తెలిసే ఛాన్స్ లేదు! ఎందుకంటే, అదంతా ఫేక్ కాబట్టి!   వాట్సప్ లో చక్కర్లు కొడుతోన్న ఓ సమాచారం ప్రకారం… ఎవరైనా వరుసగా మూడు సంవత్సరాలు ఐటీ రిటర్న్స్ వేస్తే … వారికి యాక్సిడెంట్ అయిన సందర్భంలో గవర్నమెంట్ ఆ వ్యక్తి ఆదాయానికి సగటు లెక్కగట్టి నష్టపరిహారం ఇవ్వాలట! అదీ ఏకంగా పది రెట్లు! దీన్ని నమ్మించటానికి ఆ పోస్ట్ లో 1988 మోటర్ వెహికల్స్ యాక్ట్ ను కూడా పేర్కొన్నారు. సుప్రీమ్ కోర్టు జడ్జిమెంట్ కూడా వుందంటూ చెప్పారు. కాని, అసలు విషయం అది కానేకాదు.   వాట్సప్ పోస్ట్ లో చెప్పినట్టు మోటర్ వెహికల్స్ యాక్ట్ లో ఎక్కడా యాక్సిడెంట్ అయిన వారికి ప్రభుత్వం చెల్లించే నష్టపరిహారం గురించి వుండదు. యాక్సిడెంట్లప్పుడు ఎవరైనా యాక్సిడెంట్ చేస్తారో వారే నష్టపరిహారం చెల్లించాల్సి వుంటుంది. ఇక సుప్రీమ్ కోర్టు కూడా గతంలో ఎప్పుడూ యాక్సిడెంట్ అయిన వారికి, ఐటీ రిటర్న్స్ క్రమం తప్పకుండా ఫైల్ చేసిన వారికి… ఎంత నష్ట పరిహారం ఇవ్వాలని ఎప్పుడూ చెప్పలేదు! కాని, ఎలాంటి సెన్సు , సెన్సారు లేని సోషల్ మీడియా మెసేజెస్ నిజానిజాలతో సంబంధం లేకుండా చక్కర్లు కొట్టేస్తుంటాయి! ఇదీ అంతే!   

జీఎస్టీ… పక్కా లోకల్ బ్రాండ్స్ కి పక్కలో బల్లెమేనా?

పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు మహావృక్షాలే కూలిపోతాయి. గడ్డి మొక్కలు కాదు! ఇది జీవిత సత్యమే! కాని, జీఎస్టీ సత్యం మాత్రం కాదు! ఎందుకంటే, కొంత మంది ఆర్దిక నిపుణుల అభిప్రాయం ప్రకారం జీఎస్టీ దెబ్బకి పెద్ద పెద్ద బ్రాండ్స్ హ్యాపీగా వున్నాయి. కాని, జూలై ఫస్ట్ తరువాత లోకల్ బ్రాండ్స్ జీఎస్టీ తుఫాన్ కి గజగజ వణికిపోనున్నాయట!   మీరెప్పుడైనా పల్లెటూళ్లకి వెళితే బోలెడు లోకల్ బ్రాండ్స్ కనిపిస్తుంటాయి. ఊళ్లలో కనిపించే సబ్బులు, చిరుతిళ్ల లాంటి లోకల్ బ్రాండ్స్ మొదలు పెడితే పట్టణాల్లో కనిపించే లోకల్ మేడ్ ఎల్సీడీ టీవీల దాకా ఇండియాలో చీప్ అండ్ బెస్ట్ పక్కా లోకల్ సరుకు బోలెడంత! లక్స్ , ఎల్జీ, సామ్ సంగ్, హల్దీరామ్స్, బింగో లాంటి రకరకాల బ్రాండెడ్ ప్రాడెక్ట్స్ తో ఈ లోకల్ బ్రాండ్స్ ఎన్నో దశాబ్దాలుగా పోటిపడుతున్నాయి. కాని, జీఎస్టీ వస్తే ఈ చిన్న చిన్న మొక్కలు ట్యాక్స్ దుమారానికి గాల్లో కలిసిపోవాల్సిందేనట!   ఇంత కాలం నడుస్తోన్న ట్యాక్స్ విధానం వల్ల చాలా లోకల్ బ్రాండ్స్ అతి తక్కువ ట్యాక్స్ లు చెల్లిస్తూ వస్తున్నాయి. అంతే కాదు, చాలా చోట్ల లోకల్ బ్రాండ్ తయారీదారులు నేరుగా హోల్ సేలర్ తో నగదు లావాదేవీలు జరిపి వ్యాపారం చేస్తూ వస్తున్నారు. దీని వల్ల పెద్దగా ట్యాక్స్ లు కట్టే తప్పనిసరి పరిస్థితి ఏర్పడలేదు. కాని, జీఎస్టీ అమలు జరిగితే ట్యాక్స్ ల చెల్లింపులో పూర్తి పారదర్శకత రానుంది. ఏ వ్యాపారీ ట్యాక్స్ చెల్లించకుండా సరుకు అమ్మటం, కొనటం చేయలేడు. కాబట్టి అనేక లోకల్ బ్రాండ్స్ పెద్ద మొత్తం లో ట్యాక్స్ చెల్లించాల్సి వుంటుంది. ఉదాహరణకి లోకల్ సబ్బుల్నే తీసుకుంటే … భారీ బ్రాండ్స్ అయిన లక్స్, లైఫ్ బాయ్ లాగే అవ్వి కూడా 18శాతం జీఎస్టీ విభాగంలోకి వస్తాయి. లోకల్ టీవీ తయారీదారులు కూడా సోని, సామ్ సంగ్ లతో సమానంగా 28శాతం పన్ను చెల్లించాలి. ఇంత మొత్తంలో ట్యాక్స్ కట్టి లోకల్ బ్రాండ్ తయారీదారులు మార్కెట్లో నిలదొక్కుకోవటం అనుమానమే అంటున్నారు ఎనలిస్టులు!   ఒకవైపు లోకల్ , చిరు బ్రాండ్స్ జీఎస్టీ వేడికి అల్లాడబోతుంటే … పెద్ద పెద్ద కార్పోరేట్ బ్రాండ్స్ తయారీదారులు మాత్రం కూల్ గా కనిపిస్తున్నారు. ఒకటి రెండు శాతం ధరలు పెరిగినా, తగ్గినా వారికి వచ్చే పెద్ద ప్రమాదమేం లేనట్టుగానే కనిపిస్తోంది. పైగా ఎక్స్ పర్ట్స్ చెబుతున్నట్టు లోకల్ బ్రాండ్స్ తగ్గిపోతే అది పేరు మోసిన బ్రాండ్లకి మరింత శుభసూచకం!

ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి ఈ 5 అంశాలు మీకు తెలిసి వుండకపోవచ్చు!

రాష్ట్రపతి దేశానికి ప్రథమ పౌరుడు. కాని, ఆ ప్రథమ పౌరుడ్ని ఎన్నుకునే హక్కు, బాధ్యతా రెండూ దేశ పౌరులకి వుండవు. మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే మన తరుఫున రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. అయితే, అనేక ఆసక్తికర అంశాల రాష్ట్రపతి ఎన్నికలో కీలకమైన అయిదు ప్రధాన అంశాల్ని ఇప్పుడు తెలుసుకుందాం…   1. దేశంలోని దాదాపు అన్ని ఎలక్షన్స్ ఇప్పుడు ఈవీఎంల ద్వారా జరుగుతున్నాయి. కాని, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు పేపర్ బ్యాలెట్ ద్వారానే ఓటు వేయాల్సి వుంటుంది. ఎంపీలకు ఆకుపచ్చ రంగు స్లిప్ ఇస్తారు. ఎమ్మెల్యేలకు పింక్ స్లిప్ ఇస్తారు. అయితే, ప్రజా ప్రతినిధులు బాలెట్ లో తప్పకుండా స్పష్టంగా పేర్కొనాల్సింది… తమ తొలి ప్రాధాన్యత ఎవరికి అని! ఫస్ట్ ప్రిఫరెన్స్ చెప్పని , తప్పుగా చెప్పిన బాలెట్లని తిరస్కరించటం జరుగుతుంది…   2. రాష్ట్రపతిగా పోటీ చేయటానికి ఎవరైనా అర్హులే. అయితే, తప్పనిసరిగా వార్ని 50మంది ప్రజాప్రతినిధులు సపోర్ట్ చేయాలి. ఆ 50మంది తప్పనిసరిగా రాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కు కలిగిన వారై కూడా వుండాలి. ఇలా జరగని పక్షంలో ఆ నామినేషన్ తిరస్కరించటం జరుగుతుంది. 1977లో 7వ రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా మొత్తం 36నామినేషన్లు తిరస్కరించారు. మిగిలిన ఒకే ఒక్క స్వీకరింపబడ్డ నామినేషన్ వేసిన నీలం సంజీవ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు…   3. ఇతర ఏ ఎన్నికలో అయినా ఓటర్ తనకు కేటాయించిన బూత్ కి మాత్రేమే వెళ్లి ఓటు వేయాలి. కాని, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొనే రాష్ట్రపతి ఎన్నిక కోసం వారు అడిగిన బూత్ కేటాయిస్తారు. సాధారణంగా దిల్లీలోని పార్లమెంట్ హౌజ్ లో ఎంపీలకు బూత్ వుంటుంది. ఎమ్మెల్యేల కోసం వారి వారి రాష్ట్రల రాజధానుల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య పట్టణాల్లో బూత్ లు వుంటాయి. వాటిల్లో కాకుండా  వేరే చోట ఎవరైనా ఎంపీ, ఎమ్మెల్యే ఓటు వేయాలనుకుంటే ఈసీకి పది రోజుల ముందు సమాచారం ఇవ్వాలి…   4. రాష్ట్రపతి పదవికి పోటీ పడుతోన్న అభ్యర్థులు ప్రస్తుతం కడుతోన్న డిపాజిట్ అమౌంట్ 15వేలు. 1997కి ముందు ఇది 2500 వుండేది. 97లో పెంచారు. అయితే, తన 15వేల డిపాజిట్ ఒక అభ్యర్థి తిరిగి రాబట్టుకోవాలంటే… రాష్ట్రపతిగా గెలిచేందుకు అవసరమయ్యే ఓట్ల సంఖ్యలో అరవ వంతు ఓట్లు అతడికి పోలవ్వాలి. అంతకంటే తక్కువగా ఓట్లు వచ్చిన వారికి డిపాజిట్ దక్కదు!   5. రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కేవలం దిల్లీలోని పార్లమెంట్ హౌజ్ లోనే జరుగుతుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలైన ఓట్లని కూడా ప్రత్యేక సీల్డ్ కవర్లలో దిల్లీకి తరలిస్తారు. ఓట్లని బాలెట్ బాక్సుల్లోంచి కవర్లలోకి మార్చేది ప్రత్యేక అధికారులు. వీళ్లు రాష్ట్రపతి పదవికి పోటీపడుతోన్న అభ్యర్థుల ప్రతినిధుల సమక్షంలో ఓట్లను కవర్లలో భద్రపరుస్తారు. 

చంద్రుల చక్రవ్యూహంలో ప్రధాని మోడీ..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్, చంద్రబాబుల మధ్య ఏమంత సానుకూల వాతావరణం లేదు.  ఓటుకు నోటు కేసు ఈ గ్యాప్‌ను ఇంకా పెంచింది. అయితే అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్, ఆయుత చండీయాగానికి చంద్రబాబు వెళ్లడంతో ఇద్దరి మధ్య వైరం కాస్త తగ్గింది..ఆ తర్వాత ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉండటంతో మళ్లీ చంద్రులు కలిసింది లేదు. ఏ సమస్య పరిష్కారమైనా..కాకపోయినా వీరిద్దరికి ఒక కామన్ ప్రాబ్లమ్ ఉంది. విడి విడిగా ప్రయత్నిస్తే లాభం లేదనుకున్నారో ఏమో కానీ ఇద్దరూ ఒక్క మాటపై నిలబడ్డారు. అంతేకాదు ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ చుట్టూ స్కెచ్‌ గీస్తున్నారు.   ఇరు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపుపై చంద్రులిద్దరూ కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ప్రధానిపై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. నియోజకవర్గాల పెంపు బిల్లును కేంద్ర న్యాయశాఖ ఎప్పుడో సిద్ధం చేసినప్పటికీ, ప్రధాని కార్యాలయం నుంచి ఆదేశాల కోసం వేచి చూస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న కేసీఆర్..రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన సమయంలో చంద్రబాబును కలిసి వెంటనే ఈ వార్తను ఆయన చెవిలో వేశారు.   సీట్ల పెంపుపై తాను ఎప్పటి నుంచో చెబుతున్నప్పటికీ సాంకేతిక సమస్యలని, రాజ్యాంగ కారణాలని ఏవేవో సాకులు చెప్పి వాయిదా వేస్తున్నారని బాబుతో అన్నారట. తాను కూడా ప్రయత్నిస్తున్నానని..ఈ సారి మోడీని కలిసినప్పుడు సీట్ల పెంపు అంశాన్ని మరోసారి లేవనెత్తాలని కేసీఆర్ సూచించారట చంద్రబాబు. ఇలా ఉమ్మడి వ్యూహంతో మోడీని ఉక్కిరి బిక్కిరి చేసేందుకు చంద్రులు పావులు కదుపుతున్నారు. మరి మోడీ వీరి ఎత్తుకు పై ఎత్తు వేస్తారో లేక చంద్రవ్యూహంలో ఇరుక్కుంటారో వేచి చూడాలి.

తెలంగాణ అపోజిషన్…కేసీఆర్ ఉచిత పంపిణీల వ్యూహం ముందు ఓడిపోతోందా?

  కేసీఆర్ నిస్సందేహంగా గొప్ప ఉద్యమకర్త. అరవై ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో తమ పాత్ర కూడా వుందని ఎందరు చెప్పుకున్నా …. కేసీఆరే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ హీరో! అందుకే, రాష్ట్రం ఏర్పాటు కాగానే ఇచ్చిన కాంగ్రెస్ ను కాదని టీఆర్ఎస్ ను ఎంచుకున్నారు టీ ఓటర్లు! అయితే, ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ లోని మరో కోణం ఇప్పుడు బయటకొస్తోంది! ఆయన ఎంత మంచి ఉద్యమకారుడో, ఎంత మంచి వక్తో, అంతే మంచి రాజకీయ నేత కూడా! ఒక్కసారి అధికారం చేజిక్కగానే తనలోని పొలిటీషన్ని అదును చూసి బయటపెడుతున్నారు కేసీఆర్!   సీఎం అయ్యాక బంగారు తెలంగాణ నినాదం నెత్తికెత్తుకున్న కేసీఆర్ అందుకు తగ్గట్టే హడావిడి కూడా మొదలు పెట్టారు. జనం ఎలా భావిస్తున్నప్పటికీ ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం ఆయన పాలన హడావిడే అంటూ పెదవి విరుస్తోంది. మిషన్ కాకతీయ, మిషన్ భగరీథ మొదలు వివిధ ప్రాజెక్ట్ ల కోసం భూముల సేకరణ, ఆఖరుకు ధర్నా చౌక్ తరలింపు… ఇలా చాలా విషయాలపై కేసీఆర్ ను టార్గెట్ చేయాలని ప్రయత్నించారు టీ కాంగ్రెస్ వారు. ఇక టీ టీడీపీ, టీ బీజేపి ప్రయత్నాలనైతే పెద్దగా చెప్పుకోవాల్సింది కూడా లేదు. వారు ఎంత ప్రయత్నించినా… ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ వల్లే అవ్వనిది వారి వల్ల కూడా అవ్వటం లేదు. మొత్తానికి కేసీఆర్ మూడేళ్ల పాలనలో జనానికి మేలు చేసినా, చేయకపోయినా… విపక్షాలపై మాత్రం పై చేయి సాధించారు!   కేసీఆర్ ప్రస్తుతం కొనసాగిస్తోన్న వ్యూహం కుల వృత్తుల్ని ప్రొత్సహించటం! ఆయన చేస్తున్న పనుల్ని ఎలా విమర్శించాలో అర్థం కాక సతమతం అవుతున్నాయి తెలంగాణ విపక్షాలు! కురుమ కులస్థులకి ఆయన గొర్రెల్ని పంపిణీ చేస్తామని ప్రకటించి అమల్లో పెట్టేశారు కూడా! గొర్రెల్ని ఎందుకు పంపిణీ చేస్తున్నారని అడగలేక... అలాగని కేసీఆర్ చేస్తున్న పనిని మెచ్చుకోలేక ఉత్తమ్ కుమార్ టీమ్ సందిగ్ధంలో వుండిపోయింది. వివిధ కులాల వారికి కావాల్సింది ఉద్యోగాలు కానీ.. గొర్రెలు కాదని కొంత మంది నాయకులు విమర్శలు చేసినా అవ్వి పెద్దగా నిలవలేదు!   గొర్రెల పంపిణీ వర్కవుట్ కావటంతో టీఆర్ఎస్ గవర్నమెంట్ మరిన్ని కులాల్ని టార్గెట్ చేసింది! తాజాగా రజకులకి వాషింగ్ మెషిన్లు, డ్రయ్యర్లు, ఇస్త్రీ పెట్టెలు ఇవ్వాలని నిర్ణయించారు. నాయి బ్రాహ్మణులకి అత్యాధునిక సెలూన్ల నిర్వహణ కోసం ఆర్దిక సాయం కూడా అందజేస్తారట. ఇక విశ్వఖర్మ, వడ్రంగీ, కల్లుగీత, టైలరింగ్ వృత్తుల వారికి కూడా తమ తమ పనుల్లో ఉపయోగపడే యంత్రాల్ని, పరికరాల్ని ప్రభుత్వం ఇవ్వనుందని చెబుతున్నారు. ఇలా ఒక్కో కులాన్నీ వెదికి వెదికి సాయం చేయటంలో కేసీఆర్ ఆంతర్యం ఏంటి? వచ్చే ఎన్నికల్లో అన్ని కులాల వారు తమకు ఓటు వేసేలా చూసుకోవటమే!   రైతులకి వచ్చే  యేడాది నుంచి ఉచిత ఎరువు అంటోన్న సీఎం దాదాపుగా సమాజంలోని అన్ని వర్గాల్ని ఎంచుకుని మరీ ఏదో ఒక ఉచిత సాయం చేసేస్తున్నారు. ఈ ఫ్రీ ఆఫర్స్ అన్నీ అసలు వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించే వ్యూహమే అంటున్నాయి ప్రతిపక్షాలు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమ డిమాండ్స్ ఇంకా అలానే వున్నాయనీ… వాటి గురించి జనం సీరియస్ గా ఆలోచించకుండా చేయటమే కేసీఆర్ లక్ష్యమని నేతలంటున్నారు. అది నిజమే అయినా… కేసీఆర్ తెలివిగా ఎక్కుపెట్టిన కుల వృత్తుల ప్రొత్సాహమనే బాణం అంత ఈజీగా తిప్పకొట్టడం సాధ్యం కావటం లేదు అపొజీషన్ కి! అనేక కులాల వారు, వర్గాల వారు నేరుగా లబ్ధి పొందుతుండటంతో విమర్శలు చేయటం కష్టంగా మారింది. మరీ… ఉచిత పంపిణీల వ్యూహం గులాబీ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఎన్ని ఓట్లు తెస్తుందో చూడాలి!

కసబ్‌లకు బిర్యానీలు… సామాన్య ఖైదీలకు నరకం… మన జైళ్ల పరిస్థితి!

రెండు రోజులుగా మీడియాలో అడపాదడపా వస్తోన్న న్యూస్… షీనా బోరా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఇంద్రాణి ముఖర్జీపై ఎఫ్ఐఆర్! ముంబైలోని బైకుల్లా జైలులో మొత్తం 2వందల మంది మహిళా ఖైదీలపై ఎఫ్ఐఆర్ నమోదు. వారిలో ఒకరే ఇంద్రాణి ముఖర్జీ! ఈ ఖైదీలంతా జైలులో నిరసనలకి దిగి , కొన్ని కాగితాలు, కొంత ఫర్నిచర్ తగలబెట్టారు! అందుకుగానూ… వారిపై కేసు నమోదైంది. అయితే, మీడియా దృష్టంతా ఇంద్రాణి ముఖర్జీపైనే వుంది కాని… అసలేం జరిగిందో చాలా వరకూ బయటకు రాలేదు! కాని, తెలిస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది మన జైళ్లు, పోలీసుల పరిస్థితి చూసి…   ఇంద్రాణి ముఖర్జీ గతంలో ఒక పెద్ద మీడియా సెలబ్రిటీ, బాగా పేరు వుండింది. తరువాత ఆమె తన స్వంత కూతురు షీనా బోరాను హత్య చేసిందని ఆరోపణలు రావటంతో అరెస్ట్ అయింది. ఇప్పుడు విచారణ ఎదుర్కొంటోంది. కాని, ఇలాంటి సెలబ్రిటీ కూడా ముంబైలోని బైకుల్లా జైలులో ఇతర సాధారణ ఖైదీలతో కలసి నిరసనకు దిగింది! మరో కేసులో ఇప్పుడు ఇరుక్కుంది. కాని, దాని వెనుక చాలా సీరియస్ కారణమే వుంది. ఇంద్రాణితో సహా బైకుల్లా జైలులోని వందల మంది మహిళా ఖైదీలు జైలు సిబ్బందికి వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. ఇది అత్యంత అసాధారణ విషయం…   మీడియాలో పెద్దగా బయటకి రాని అసలు విషాదం ఏంటంటే… బైకుల్లా జైలులో మంజుల అనే ఒక ఖైదీ, జీవిత ఖైదు అనుభవిస్తోంది. వివిధ జైళ్లలో గత 11ఏళ్లుగా శిక్ష అనుభవిస్తోన్న ఆమె సత్ప్రవర్తనతో వార్డెన్ గా బాధ్యతలు నిర్వహించే స్థాయికి వచ్చింది. దాదాపు పోలీసు సిబ్బందితో సమానంగా ఆమె పనులు చే్స్తుండేది. ఇతర ఖైదీల్ని నియంత్రణలో వుంచటం ఆమె బాధ్యత. అలాంటి మంజుల తనకు రావాల్సిన రెండు గుడ్లు, కొన్ని రొట్టెలు తక్కువగా వచ్చాయని కంప్లైంట్ చేసిందట! ఆ విషయంలోనే బైకుల్లా జైలు సిబ్బందికి , మంజులకి గొడవ జరిగింది.   మంజుల వున్న బ్యారెక్ లోకి వచ్చిన కొందరు మహిళా కానిస్టేబుల్స్ ఆమెని వివస్త్రని చేసి, కాళ్లు విడదీసి పట్టుకుని, మర్మాంగంలోకి లాఠీ చొప్పించారట. దాని వల్ల నరకం అనుభవించిన మంజుల చివరకు రక్త స్రావంతో స్పృహ తప్పింది. జైలు సిబ్బంది ఎట్టకేలకు హాస్పిటల్ కి తీసుకెళ్లే సరికి ఆమె మృతి చెందింది. ఇదీ జరిగిందనీ ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఎఫ్ఐఆర్ లో ఇదే నమోదైంది.   మన జైళ్లలో పాకిస్తాన్ నుంచి వచ్చిన కసబ్ లాంటి వారికి పోలీసులు బిర్యానీలు వడ్డించి సేవలు చేసి తరిస్తారు. కాని, సామాన్య ఖైదీల్ని మాత్రం అమానుషంగా హింసిస్తుంటారు. నిజంగా బైకుల్లా జైలులో ఏం జరిగినప్పటికీ మన పోలీసుల్లో మానవత్వం పెరగాల్సిన అవసరం ఎంతైనా వుంది. వార్ని సంస్కరించే దిశగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎప్పటికి చర్యలు తీసుకుంటాయో … ఏమో!

రజినీ… బీజేపికి ఇష్టం! బీజేపి నేత స్వామికి మాత్రం కోపం! ఎందుకు?

మంట, కారంపొడి, కత్తి… ఇలాంటివి చాలా డేంజర్! మనవే కదా అనుకుని వాట్ని ఎలాగంటే అలా హ్యాండిల్ చేస్తే మనల్ని కూడా ఖతమ్ చేస్తాయి. అచ్చంగా సుబ్రమణ్యం స్వామి కూడా అలాంటి వారే! ఆయనతో పెట్టుకుంటే ఇతర పార్టీల వారు ఎలాగూ మూడు  చెరువుల నీళ్లు తాగాల్సిందే. కాని, సుబ్బుతో పెట్టుకుంటే స్వంత పార్టీ వారికి కూడా చుక్కలు కనిపిస్తుంటాయి. ఆయన స్వభావం అలాంటిది! ఎవర్ని ఎప్పుడు ఎందుకు టార్గెట్ చేస్తాడో తెలియదు. కాని, ఒక్కసారి కన్నేశాడా… అంతే సంగతులు!   సుబ్రమణ్యం స్వామి అంటే సాక్షాత్తూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు కూడా హడలే. వాళ్లని కూడా జైలు దాకా తీసుకెళ్లి వెనక్కి తెచ్చిన మొండివాడు. నేషనల్ హెరాల్డ్ కేసులో స్వామి పోరాటం ఇప్పటికీ సోనియా, రాహుల్ కి ఇబ్బందికరంగానే వుంది. వాళ్లు ప్రస్తుతం బెయిల్ పై బయట తిరుగుతున్నారంటే అందుకు ఈయనే కారణం! అటువంటి సుబ్రమణ్య స్వామి తాజాగా రజినీకాంత్ ని రఫ్ఫాడించాలని డిసైడ్ అయ్యాడు! ఇది నిజంగా అందరికంటే ఎక్కువగా బీజేపి అభిమానులకి పెద్ద షాక్!   రజినీకాంత్ ఒక ఆర్దిక నేరగాడు అనేశాడు స్వామి. అంతే కాదు, ఆయన పాలిటిక్స్ లో వస్తే డొంకంతా కదులుతుందని బెదిరించాడు కూడా! మరో మాటగా రజినీకాంత్ ఏమీ చదువుకోని నిరక్షరాస్యుడని ఆరోపణ చేశాడు. పాలిటిక్స్ పనికిరాడని తేల్చేశాడు. కాని, ఇదంతా ఒక బీజేపి నాయకుడిగా వుంటూ సుబ్రమణ్య స్వామి చేయటం ఆందోశనకర పరిణామం!   స్వామి పై ప్రత్యక్ష ఆందోళనలకి, పోరాటాలకి దిగవద్దని తలైవా తన అభిమానులకి ఆల్రెడీ చెప్పినట్టుగానే కనిపిస్తోంది. అందుకే, వారి విమర్శలన్నీ ట్విట్టర్ , ఫేస్బుక్ లకే పరిమితం అయ్యాయి. లేకుంటే రజినీపై నోరు పారేసుకున్నందుకు ఈపాటికి వందల మంది తమిళనాడు రోడ్లపైకి వచ్చేవారు. కాని, అలా జరగలేదు. రజినీ కూడా ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు రాజకీయాల విషయంలో. ఆయన స్వామి లాంటి వారి ఆరోపణలకి రెచ్చిపోతాడని అనుకోవటం మన మూర్ఖత్వమే!   తమిళనాడులో ఎలాగైనా పట్టు సాధించాలని చూస్తోన్న మోదీ, అమిత్ షా ద్వయం రజినీకాంత్ ని తమ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి అనుకూలంగా వాడుకోవాలనుకుంటోంది! ఇది పైకి చెప్పకున్నా అందరికీ తెలిసిన పబ్లిక్ సీక్రెట్టే! కాని, మోదీ, అమిత్ షాల బీజేపిలోనే వున్న స్వామి మాత్రం రజినీని టార్గెట్ చేస్తున్నాడు. తన పార్టీకి తమిళనాడులో మేలు చేసే సూపర్ స్టార్ పై సుబ్బూకి ఎందుకు కోపం? ఆయనకు శశికళ వర్గంపై వున్న ప్రేమే అలా మాట్లాడిస్తోందని కొందరి అనుమానం!   స్వామి ఒకప్పుడు జయ, శశికళపై కేసు వేసి వార్ని జైల్లో పెట్టించాడు. చివరకు, ఇప్పుడు కూడా శశికళ అనుభవిస్తోన్న జైలు శిక్షకి ఆయనే కారకుడు. కాని, మోదీ, అమిత్ షాకి పెద్దగా సదుద్దేశం లేని శశికళ అంటే స్వామికి సాఫ్ట్ కార్నర్ వుంది. స్టాలిన్ కంటే ఆమె వేయి రెట్లు బెటర్ అని పబ్లిగ్గానే చెప్పాడు. పన్నీర్ సెల్వం తిరుగుబాటు అప్పుడు కూడా స్వామి శశికళ వర్గానికే మద్దతు పలికాడు. ఇలా ఆయనే కేసు వేసి దోషిగా నిరూపించిన వార్ని ఆయనే వెనకేసుకొస్తున్నాడు. ఇప్పుడు రజీనీపై అక్కసు కూడా శశికళకు మద్దతుగానే భావించాలి!   భారత రాజకీయాల్లో సుబ్రమణ్యం స్వామి ఒక వింత పొలిటీషన్. ఆయన పోలింగ్ బూతుల్లో కన్నా ఎక్కువ కోర్టు బోనుల్లోనే పోరాడాడు. అందుకే ఆయన తమపై పోటీ చేస్తాడన్నా భయపడని నాయకులు కోర్టు నోటీసు పంపుతాడంటే బెదిరిపోతారు! ఇప్పుడు ఆ వంతు రజినీకి వచ్చింది. నిజంగా తలైవా ఆర్దిక నేరం చేశాడో లేదో గాని… స్వామి కోర్టుకు లాగితే సూపర్ స్టార్ కి సూపర్ ఇక్కట్లు తప్పవు. అలాగే, బీజేపికి కూడా తమిళనాడులో వచ్చే నాలుగూ ఓట్లు రాకపోవచ్చు! మోదీ, షా ఎలా సుబ్రమణ్య అస్త్రాన్ని రజినీపైకి వెళ్లకుండా దారి మళ్లిస్తారో చూడాలి…

క్లింటన్, బుష్, ఒబామా ఇచ్చిన ‘ ఆ విందు ‘ ట్రంప్ ఎందుకు ఇవ్వలేదు?

భారత ప్రధాని మోదీ మరోసారి అమెరికా పర్యటనలో వున్నారు. మన మీడియా అంతా మోదీ, ట్రంప్ ల విందు మీదే మనసు పెట్టేసింది. కాని, అంతర్జాతీయ మీడియా మాత్రం వైట్ హౌజ్ లో జరగాల్సిన మరో విందుపైన దృష్టి పెట్టింది. ఇరవై ఏళ్లుగా ఈ సమయంలో తప్పక జరగాల్సిన ఆ విందుని ఈసారి ట్రంప్ ఏర్పాటు చేయలేదు. సరి కదా… అది ఎందుకు జరగటం లేదో కూడా వైట్ హౌజ్ వర్గాలు చెప్పలేదు! ఇంతకీ ట్రంప్ ఇవ్వని ఆ వివాదాస్పద విందు ఏంటో తెలుసా? వైట్ ఇఫ్తార్!   మన దగ్గర రాజకీయ నేతలు అధికారికంగా ఇఫ్తార్ విందులు రంజాన్ నెలలో ఇస్తూ వుంటారు. ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారేమో అన్నంత విరివిగా, ఘనంగా ఇచ్చేస్తుంటారు. ఇఫ్తార్ విందుల్లో ముస్లిమ్ ల మీద ప్రేమకన్నా మన వారి ఓట్ల రాజకీయమే ఎక్కువగా కనిపిస్తుంటుంది. హలీమ్ తింటూ, నెత్తిన టోపీ పెట్టుకుని అమాంతం ముస్లిమ్ గెటప్ లలోకి వచ్చేస్తారు మన లౌకిక వాద నాయకులు! ఇదంతా తప్పు పట్టాల్సిందేం కాకపోయినా… ఇఫ్తార్ విందులు ఇవ్వటం సింబాలిక్ గా మారిపోయింది. అదే సమయంలో మోదీ, యోగి ఆదిత్యనాథ్ లాంటి వారు తమ హిందూత్వ సిగ్నల్స్ బలంగా పంపటానికి ఇఫ్తార్ విందులు ఇవ్వకుండా రివర్స్ రాజకీయం చేస్తుంటారు! అయితే, ఇలాంటి ఇఫ్తార్ పాలిటిక్స్ అమెరికాలో కూడా జరుగుతాయంటే నమ్మగలరా? అదీ వైట్ హౌజ్ అంతర్భాగంలో విందు రాజకీయాలు వుంటాయంటే ఆశ్చర్యంగా వుంది కదూ…   వైట్ హౌజ్ లో ప్రెసిడెంట్లు విందులు ఇవ్వటం అమెరికాలో మొదట్నుంచీ పరిపాటి. ఆ కోవలోకే వస్తుంది ప్రస్తుతం అమెరికాలో వున్న మన మోదీకి ట్రంప్ ఇస్తోన్న వర్కింగ్ డిన్నర్! కాని, ప్రతీ రంజాన్ నెలలో ఇచ్చే ఇఫ్తార్ విందు అన్నిటి కంటే కాస్త ప్రత్యేకం! అమెరికాలో మన దేశంలో మాదిరిగా ముస్లిమ్ ఓట్లు గణనీయంగా ఏం వుండవు. కాబట్టి అమెరికన్ ప్రెసిడెంట్లు ఇచ్చే ఇఫ్తార్ విందులు మన దగ్గరిలా ఓట్ల రాజకీయం కోసం కాదు. వాళ్లకి అంతర్జాతీయంగా ముస్లిమ్ సమాజాన్ని మచ్చిక చేసుకోవటం ఎంతో అవసరం. అందుకే, గత రెండు దశాబ్దాలుగా క్లింటన్, బుష్, ఒబామా లాంటి వారు ప్రతీ ఏటా రంజాన్ విందు వైట్ హౌజ్ లో గ్రాండ్ గా ఇస్తున్నారు. ఇక బరాక్ హుస్సేన్ ఒబామా కాలంలో అయితే మరింత గొప్పగా , శ్రద్ధగా జరిగేవి ఇఫ్తార్ సంబరాలు!   అంతర్జాతీయంగా ముస్లిమ్ లు ఎంతో ద్వేషించే జార్జ్ బుష్ ఓ వైపు అఫ్గనిస్తాన్, ఇరాక్ ల మీద బాంబులు వేస్తూనే ఇఫ్తార్ ఇవ్వడం మాత్రం మానలేదు. లాడెన్ ను వెదికి చంపించిన ఒబామా కూడా ఇఫ్తార్ రాజకీయం పక్కన పెట్టలేదు. కాని, ట్రంప్ మాత్రం తన స్టైల్ కి తగ్గట్టుగా ఏళ్ల తరబడి సాగిన సంప్రదాయాన్ని పక్కన పెట్టేశాడు. ఈసారి రంజాన్ వచ్చింది, పోయింది… కాని, వైట్ హౌజ్ లో మాత్రం హలీమ్ ఘుమఘుమలు ఎక్కడా గుప్పుమనలేదు! సెక్యులర్ వాసనలు కూడా…

అధికారం కోసం కాంగ్రెస్‌ కొత్త ఎత్తు... వ్యూహం మార్చిన టీపీసీసీ ?

కాంగ్రెస్‌ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ... నేతల మధ్య సఖ్యత చాలా తక్కువ... ఒకరు ఎడ్డెం అంటే... మరొకరు తెడ్డెం అనే టైపు.... కానీ అధికారం కోసం అర్రులు చాస్తోంది. నెక్స్ట్ పవర్లోకి వచ్చేది తామేనని చెబుతోంది... అయితే పార్టీలో అనైక్యత, విభేదాలు... ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని టీపీసీసీ ఓ సూపర్‌ ప్లాన్‌ను రూపొందించింది. అందుకు రాహుల్ గాంధీనే పెద్ద దిక్కుగా వినియోగించుకుంటోంది.   ఇటీవల సంగారెడ్డిలో ప్రజా గర్జన పేరుతో ఓ సభను నిర్వహించి దానికి రాహుల్ ను తీసుకొచ్చిన హస్తం నేతలు...ఇప్పుడు ఆయన ప్రసంగాలను ప్రజలకు వినిపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పార్టీ నాయకులు  గ్రామ గ్రామానికి వెళ్లాలంటూ...సంగారెడ్డి సభలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పిలుపునివ్వడంతో... రాహుల్ సందేశ్ యాత్ర పేరుతో కాంగ్రెస్ నేతలు కార్యాచరణకు దిగిపోయారు. రంజాన్ తర్వాత ఈ యాత్రను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు.   యాత్రలో భాగంగా జిల్లాల వారీగా స‌భ‌లు నిర్వహించి... సంగారెడ్డి సభలో రాహుల్ చేసిన ప్రసంగాలనే ప్రజలకు వినిపించనున్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఓ ఛార్జిషీట్ ను పంపిణీ చేయడంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలు... కార్యక్రమాల గురించి కూడా వివరించనున్నారు.    అయితే రాష్ట్ర నేతల్లో ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వకుండా.... రాహుల్ పేరుతో యాత్ర నిర్వహిస్తే  భిన్న ధృవాలుగా వ్యవహరించే వారంతా కలిసి వస్తారనేది పీసీసీ నేతల ఆలోచనగా కనిపిస్తోంది. మరి వారి వ్యూహం ఫలిస్తుందో లేదో రాహుల్ సందేశ్ యత్ర ప్రారంభమైతేగానీ తెలియదు.

తెలంగాణలో షాడో సీఎం?... ఇబ్బంది పడుతోన్న సీనియర్‌ మంత్రులు..!

సాధారణంగా ముఖ్యమంత్రి బిజీగా ఉన్నప్పుడు ఆయన బాధ్యతలను సీనియర్‌ మోస్ట్‌ మంత్రులు నిర్వర్తిస్తారు. అయితే తెలంగాణలో ఇద్దరు ఉపముఖ్యమంత్రులున్నా... వారిలో మహమూద్‌ అలీకి పాలనానుభవం లేదు. ఇక కడియం శ్రీహరి అందరికీ ఆమోదయోగ్యంగా లేరు. దాంతో వారిద్దరూ సొంత శాఖలకే పరిమితమవుతున్నారు. అయితే కేసీఆర్‌ తర్వాత ఇటు ప్రభుత్వంలోనూ, అటు పార్టీలోనూ అంత ప్రాముఖ్యత, ప్రాధాన్యతున్న వ్యక్తులు ఇద్దరే ఇద్దరూ. వారిలో ఒకరు కేసీఆర్‌ మేనల్లుడు హరీష్‌రావు, మరొకరు కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్‌... ఇటీవల ఏ పనినైనా కొడుకు కేటీఆర్‌కే అప్పగిస్తున్నట్లు చర్చ నడుస్తోంది.    ఇటీవల కేసీఆర్‌ హాజరుకాలేని అతిము‌ఖ్యమైన కార్యక్రమాలకు కేటీఆర్‌నే పంపిస్తున్నారు. మొన్న బ్రాహ్మణ భవన్ శంకుస్థాపనకు కేటీఆరే ముఖ్య అతిధిగా హజరయ్యారు. జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రారంభోత్సవాలు, సదస్సుల్లోనూ ప్రభుత్వం తరపున కేటీఆరే పాల్గొంటున్నారు. అంతేకాదు... తన మంత్రిత్వశాఖ కాకున్నా ఢిల్లీలో జరిగే సమావేశాలకు సైతం అప్పుడప్పుడూ కేటీఆరే హజరవుతున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కీలక భేటీకి ఆర్థికమంత్రి ఈటెల గైర్హాజరు కావడంతో ఆయనకు బదులు కేటీఆరే ఆ సమావేశానికి అటెండ్‌ అయ్యారు. దీని వెనుక ముఖ‌్యమంత్రి వ్యూహముందని, కేసీఆరే స్వయంగా.... కేటీఆర్‌ ప్రాధాన్యతను పెంచుకుంటూ పోతున్నారని గులాబీ గ్రూప్‌లో చర్చ జరుగుతోంది.   ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ కేటీఆర్‌ పాత్రను మెల్లమెల్లగా పెంచుతున్న కేసీఆర్‌.... వివిధ పనులపై తన దగ్గరికొచ్చే మంత్రులు, ఉన్నతాధికారులను కేటీఆర్‌ దగ్గరికి పంపుతున్నారట. తాను బిజీగా ఉన్నానని, ఏమన్నా ఉంటే కేటీఆర్‌ను సంప్రదించాలని స్వయంగా కేసీఆరే... మంత్రులకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో కేసీఆర్‌కు చెప్పాల్సినవన్నీ కేటీఆర్‌తో చర్చిస్తూ... తగిన సూచనలు సలహాలు ఇవ్వమని కోరుతున్నారట. అయితే కేటీఆర్‌ దగ్గరకు వెళ్లడం కొందరు సీనియర్‌ మంత్రులకు ఇబ్బందిగా మారిందని టాక్‌ వినిపిస్తోంది. అటు వయసులోనూ ఇటు పాలనలోనూ జూనియర్‌ అయిన కేటీఆర్‌ నుంచి సలహాలు తీసుకోవడానికి ఫీలవుతున్నారట. అయితే బాస్‌ కేసీఆరే ఆర్డర్‌ వేయడంతో చేసేదిలేక ఫాలో అయిపోతున్నారట. ఇలా మంత్రులంతా కేటీఆర్‌ దగ్గరకి క్యూ కడుతుండటంతో షాడో సీఎం అని పిలుస్తున్నారట. 

క్రైమ్‌ థ్రిల్లర్‌‌ను మించిన సినిమా..‌శిరీష కేసులో రోజుకో ట్విస్ట్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బ్యూటీషియన్‌ శిరీష కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సరికొత్త ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఆడియో టేపులు బయటికి రావడంతో కొత్త క్యారెక్టర్లు తెరపైకి వచ్చాయి. రాజీవ్‌ స్నేహితులతో శిరీష మాట్లాడిన ఫోన్ సంభాషణలు బయటికి రావడంతో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజీవ్‌పై తనకున్న ప్రేమను నవీన్‌, నందుతో శిరీష పంచుకుంది. రాజీవ్‌ అంటే తనకు ప్రాణమని... రాజీవ్‌ను ఎవరేమన్నా చంపేస్తానని హెచ్చరించింది. రాజీవ్‌ ప్రియురాలు తేజస్విని గురించి కూడా మాట్లాడిన శిరీష.... ఆమెను తమ మధ్యకు రాకుండా చూడాలని రాజీవ్‌ స్నేహితులను కోరింది. అలాగే తేజస్విని, శిరీష మధ్య వాట్సప్‌‌లో మెసేజ్‌ల సమరం కొనసాగినట్లు తెలుస్తోంది.   శిరీష లోదుస్తులపై రక్తపు మరకలు ఉండటంతో .... అత్యాచారం జరిగి ఉంటుందనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అత్యాచారం జరిగిందా లేదా అనేది ఫోరెన్సిక్‌ రిపోర్టులు వచ్చాకే తేలనుంది. ఇక ఆడియో టేపుల్లో బయటపడ్డ నందు, నవీన్‌‌ కూడా కేసులో కీలకంగా మారారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న మూడు మొబైల్స్‌లో రాజీవ్, శిరీష, తేజస్విని, నవీన్‌, నందు, రవి సంభాషలతోపాటు.... అశ్లీల వీడియోలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో వాటిని పోలీసులు... ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కి పంపారు. ఇక విజయవాడలో ఉంటోన్న రాజీవ్‌ ప్రియురాలు తేజస్విని నుంచి కొంత సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది.   ఆర్జే స్టూడియోలో పనిచేసే యువకుల్లో ఎవరో ఒకరు ఈ ఆడియో టేపులను బయటపెట్టి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఆ ఆడియోలోని గొంతు శిరీషదేనా? కాదా అనేది కూడా తేల్చాల్సి ఉందని చెబుతున్నారు. మరోవైపు రాజీవ్‌, శ్రవణ్‌లను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరిన పోలీసులు.... ఇంటరాగేషన్ తర్వాత మరిన్ని సంచలనాలు బయటికి వస్తాయని అంటున్నారు.

తెలంగాణను వదిలేసిన జగన్‌.. ఏపీలో దూకుడు

ఉమ్మడి రాష్ట్రంలో అటు కోస్తా, రాయలసీమతో పాటు ఇటు తెలంగాణలోనూ ఎంతోకొంత బలంగా ఉన్న వైసీపీ.... రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. తెలంగాణలో పార్టీ బాధ్యతలను చెల్లెలు షర్మిలకు అప్పగించినా... ఆమె కూడా పట్టించుకోవడం మానేశారు. ఏదో ఒక్కసారి మాత్రం ఓదార్పు యాత్ర అంటూ హడావిడి చేసిన షర్మిల.... ఆ తర్వాత అటువైపు కన్నెత్తి చూడటమే మానేసింది. అంతేకాదు ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కూడా అధికార టీఆర్‌ఎస్‌లో చేరిపోవడంతో... పార్టీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. తెలంగాణ వైసీపీ అధ్యక్షుడిగా గట్టు శ్రీకాంత్‌రెడ్డి నామమాత్రానికి ఉన్నా... ఎలాంటి ఉపయోగం లేదు. దాంతో ఉన్న కొద్దిమంది నేతలు కూడా అధికార పార్టీలో చేరిపోయారు.   రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ ఉందంటూ నేతలు హడావిడి చేస్తున్నా.... అధినేత మాత్రం తెలంగాణ వైపు కన్నెత్తి చూడటం లేదు. తెలంగాణలో పార్టీని జగన్‌ అస్సలు పట్టించుకోవడం లేదు. కనీసం ఇప్పటివరకూ తెలంగాణలో ప్రజాసమస్యలపై జగన్‌ స్పందించింది కూడా లేదు. గత ఎన్నికల్లో పార్టీ ఘోరంగా విఫలమవడంతో... తెలంగాణలో ఇప్పట్లో పార్టీ బలపడే అవకాశమే లేదని జగన్‌ డిసైడైనట్లు తెలుస్తోంది. అందుకే తెలంగాణ నేతలు నిర్వహిస్తున్న ప్లీనరీకి కూడా జగన్‌ వెళ్లడం లేదు. కేవలం పార్టీ పొలిటికల్‌ సెక్రటరీని మాత్రమే తెలంగాణ వైసీపీ ప్లీనరీకి పంపిస్తున్న జగన్‌.... తాను మాత్రం విశాఖ ధర్నాలో పాల్గోనున్నారు.   ఆంధ్రప్రదేశ్‌లో అధికారమే టార్గెట్‌గా పెట్టుకున్న జగన్‌... తెలంగాణలో పార్టీని లైట్‌ తీస్కుంటున్నారని అంటున్నారు. అంతేకాదు తెలంగాణలో పార్టీకి సీన్‌ లేదని డిసైడైపోయారని... ఇక తెలంగాణలో పార్టీని దాదాపుగా వదిలేసినేనట్లని వైసీపీ నేతలు మాట్లాడుకుంటున్నారు.

వైసీపీ ఎమ్మెల్యేకి... స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చిన చంద్రబాబు

చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనలో అసెంబ్లీని తలపించే సీన్‌ జరిగింది. నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు. జైన్‌ ప్రాజెక్ట్‌ శంకుస్థాపన సందర్భంగా... ముఖ‌్యమంత్రి చంద్రబాబు.... వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్య మధ్య మాటల యుద్ధం జరిగింది. తన నియోజకవర్గంలో జరుగుతోన్న అభివృద్ధి, ఏర్పాటు చేస్తోన్న ఫ్యాక్టరీపై తనకే సమాచారం లేదన్న ఐజయ్య.... అసలు ఎంతమందికి ఉపాధి లభిస్తుంది.... రైతులకు పరిహారం ఎంతిస్తున్నారంటూ ప్రశ్నించారు. వ్యవసాయ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయొద్దన్న వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్య..... అసలిక్కడ ఏం చేస్తున్నారో స్థానిక ఎమ్మెల్యేనైన తనకే తెలియదని, ఇక ప్రజలకేమీ తెలుస్తుందన్నారు.    ఐజయ్య మాటలతో సీరియస్‌ అయిన చంద్రబాబు.... కలెక్టర్‌‌ను పంపి... ఇక ముగించాలని స్పీచ్‌కి అడ్డుతగిలారు. అయితే స్థానిక ఎమ్మెల్యేకి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వరా అంటూ ఐజయ్య అంటుండగానే మధ్యలో కలుగుజేసుకున్న సీఎం....  మైక్‌ కట్‌ చేయించారు.... మాట్లాడింది చాలు... ఇక కూర్చో కూర్చో అంటూ గద్దించారు. అంతేకాదు జనం చేత... ఐజయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేయించారు. దాంతో తీవ్ర నిరసన వ్యక్తంచేస్తూ....  ఐజయ్య అక్కడ్నుంచి నిష్క్రమించారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు.....అభివృద్ధిని అడ్డుకుంటే సహించబోమని ఘాటుగా హెచ్చరించారు. పేదల అభ్యున్నతికి, ప్రజా సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుంటే.... ప్రతిపక్షం అడ్డుకోవాలని చూస్తోందంటూ ఫైరయ్యారు.   అయితే ప్రతిపక్ష ఎమ్మెల్యే మాట్లాడుతుండగా అడుగడుగునా అడ్డుపడటమే కాకుండా.... మైక్‌ కట్‌ చేసి అవమానపర్చడం.... ముఖ్యమంత్రి గద్దించడం సరికాదని, ఇది చంద్రబాబు అహంకారానికి నిదర్శనమని వైసీపీ మండిపడుతోంది. ప్రశ్నించడం ప్రతిపక్షంగా తమ బాధ్యతని.... దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలే కానీ... ఇలా అవమానపర్చడం తగదంటున్నారు.

ఐవైఆర్ కృష్ణరావు…. కూర్చున్న కొమ్మనే నరుక్కున్నారా?

ఏపీలో సోషల్ మీడియా తుఫాన్ లు పదే పదే చెలరేగుతున్నాయి. ఆ మధ్య వైసీపీకి సపోర్ట్ గా, టీడీపీకి వ్యతిరేకంగా కొందరు పోలిటికల్ పంచ్ లు అంటూ కేసుల్లో ఇరుక్కున్నారు. జైలుకి వెళ్లారు. ఇప్పుడు ఏకంగా చంద్రబాబు ప్రభుత్వంలోని సీనియర్ అధికారే సోషల్ మీడియాలో కలకలం రేపారు. అదీ తనకు పిలిచి పదవిచ్చి గౌరవించిన సీఎంని, సర్కార్ నే విమర్శిస్తూ! ఇంతకీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణ రావు చేసిన నిర్వాకం ఏంటి?   ప్రభుత్వం అంటే ఒకరో, ఇద్దరో మనుషులు కాదు. సీఎం నుంచీ గవర్నమెంట్ క్లర్కుల దాకా అందరూ సమిష్టిగా చేసే పాలనే… గవర్నమెంట్! ఇందులో అత్యంత కీలకమైన వారు ఐఏఎస్ లు. వారు పాలక పక్షాలు మారినా ఎక్కడికి పోరు. సర్వీస్ ముగిసేదాకా దశాబ్దాల పాటూ దేశం, రాష్ట్రంపై ప్రభావం చూపుతారు. అలాంటి బాధ్యతగల ఐఏఎస్ గా మంచి పేరే తెచ్చుకున్నారు ఐవైఆర్. అందుకే, ఆయన్ని ఏరికోరి తన ప్రధాన కార్యదర్శిగా నియమించుకున్నారు చంద్రబాబు. అయితే, ఇప్పుడు ఈ మాజీ ప్రధాన కార్యదర్శి రివర్స్ లో వస్తున్నారు. తనకు ప్రధాన కార్యదర్శి పదవే కాక క్యాబినేట్ హోదాగల బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ పోస్ట్ కూడా ఇచ్చిన ముఖ్యమంత్రిపై సోషల్ మీడియా దాడి మొదలుపెట్టారు!   ఐవైఆర్ కృష్ణరావు గత కొన్ని రోజులుగా ఏపీ సీఎంకి, మంత్రి లోకేష్ కి, మొత్తంగా టీడీపీ ప్రభుత్వానికే వ్యతిరేకంగా పోస్టులు చేస్తూ వస్తున్నారు ఫేస్బుక్ లో. ప్రభుత్వానికి కుల పిచ్చిని అంటగట్టే పోస్టుల్ని కూడా షేర్ చేశారట. ఇక టీటీడీ ఈవోగా తెలుగువాడు కాని అధికారిని చంద్రబాబు నియమించడం కూడా కృష్ణరావుకు నచ్చలేదు. సోషల్ మీడియాలో అదే విషయం స్పష్టంగా చెప్పారు. కాని, ఇలా ప్రభుత్వ నిర్ణయాలు నచ్చకుంటే ఫేస్బుక్ లో విమర్శించాల్సింది సామాన్య ప్రజలు, ప్రతిపక్షాలు. కాని, అధికారంలోని గవర్నమెంట్ ఇచ్చిన క్యాబినేట్ హోదా గల పదవిలో వున్న కృష్ణరావు అందరి ముందూ నోరుపారేసుకోవటం ఎందుకు? నేరుగా చంద్రబాబుతో తన అభ్యంతరాలు చెప్పవచ్చు కదా? అది వీలుకాకపోతే సర్కార్ ఇచ్చిన పదవి వదిలేసి వచ్చి స్వేచ్ఛగా విమర్శలు చేయాలి. అంతే కాని, ఏ గవర్నమెంటైతే సరిగ్గా పని చేయటం లేదని ఆరోపిస్తున్నామో… అదే ప్రభుత్వం నుంచి నెలనెలా లబ్ధి పొందుతూ .. తిరిగి జనం ముందు బురదజల్లడం, ఎలాంటి నైతికత అనిపించుకుంటుంది?   ఇప్పటికే… గత కొన్ని నెలలుగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అగ్ర నాయకులు కొందరు తమ ఇష్టానుసారం కామెంట్స్ చేస్తున్నారు. స్వంత పార్టీ, నాయకత్వం పరువు తాకట్టు పెడుతున్నారు. ఇక ఇప్పుడు కృష్ణరావు లాంటి అధికారులు కూడా తోడైతే… చంద్రబాబుకు తీవ్ర నష్టం తప్పకపోవచ్చు. కాబట్టే సీఎం అమాంతం ఐవైఆర్ ను నామినేటెడ్ పదవి నుంచి తొలగించారు కూడా! ఈ మొత్తం వ్యవహారంతో కృష్ణరావు ఒకవేళ జగన్ కు ఏమైనా దగ్గరవ్వాలని ఆశించి వుంటే… ఆయన రాజకీయ ఆశలు, లెక్కలు ఎంత వరకూ వర్కవుట్ అవుతాయో ఇప్పుడే చెప్పలేం. కాని, ఆయన మాత్రం చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడి నమ్మకాన్ని వమ్ము చేసి చెడ్డ పేరు తెచ్చుకున్నారన్నది మాత్రం వాస్తవం…

మోదీ, టీ బీజేపి… మధ్యలో కేసీఆర్ చాతుర్యం!

          తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయం భలే తెలివిగా వుంటుంది. అసలు ఆయన ఎవర్ని ఎప్పుడు టార్గెట్ చేస్తారో, ఎవర్ని ఎప్పుడు మెచ్చుకుంటారో ఎవ్వరికీ అర్థం కాదు. కాని, ఆయనకు మాత్రం ప్రతీ దాంట్లో ఓ క్లారిటీ వుంటుంది! ఇన్ ఫ్యాక్ట్, కేసీఆర్ ఎవర్నైనా తిట్టినా, మెచ్చుకున్నా … సదరు వ్యక్తి అలెర్ట్ గా వుండాల్సిందే! అవును… కేసీఆర్ ఒక్కోసారి సానుకూలంగా మాట్లాడినా అందులో పెద్ద వ్యూహమే వుంటుంది!   మొదట నుంచీ తెలంగాణ ముస్లిమ్ లని ఆకాశానికి ఎత్తటంలో కేసీఆర్ ఛాంపియన్ అని నిరూపించుకుంటూనే వున్నారు. ఇక ఆ మధ్య అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ముస్లిమ్ లకు పన్నెండు శాతం రిజర్వేషన్ అంటూ తీర్మానం అమోదింపజేశారు. దాన్ని కేంద్రానికి పంపి బాల్ బీజీపి కోర్టులోకి తోశారు. ఇప్పుడు అదే అంశాన్ని మరోసారి రంజాన్ సందర్భంగా ముస్లిమ్ సోదరుల ముందు లేవనెత్తారు! మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు తాను ఇచ్చితీరుతానని శపథం చేశారు. అయితే, ఇక్కడే చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ముస్లిమ్ రిజర్వేషన్లకు మోదీ అనుకూలం అంటూ డైలాగ్ విసిరారు!   మోదీ ముస్లిమ్ రిజర్వేషన్లకు అనుకూలం అనేది ఒకటికి రెండుసార్లు విన్నా ఎవరూ నమ్మలేని విషయం. కాని, కేసీఆర్ అదే మాట ఇఫ్తార్ విందుకి వచ్చిన బీజేపి కేంద్ర మంత్రి దత్తాత్రేయ ముందు అన్నారు! ఇంతకీ నిజం ఏంటి? కేసీఆర్ ముస్లిమ్ రిజర్వేషన్ల హడావిడి జరుగుతున్నప్పుడే ఓ మీటింగ్ లో మోదీ ముస్లిమ్ లలో వెనుకబడిన వారికి చేయూత అవసరం అన్నారు. అదే విషయాన్ని కేసీఆర్ తనదైన రీతిలో ఇఫ్తార్ కొచ్చిన ముస్లిమ్ ల ముందు చెప్పారు! వెనుకబడిన ముస్లిమ్ లకు రిజర్వేషన్ల విషయంలో మోదీ అనుకూలం. కాని, ఆయన గాని, ఆయన పార్టీ అయిన బీజేపీగాని మొత్తానికి మొత్తంగా ముస్లిమ్ సమాజానికి రిజర్వేషన్లకు వ్యతిరేకం! ఈ విషయం కేసీఆర్ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు!   అసలు కేసీఆర్ పదే పదే చెబుతోన్న ముస్లిమ్ రిజర్వేషన్లు కూడా మతం ఆధారంగా ఇస్తోన్నవి కావనీ… ముస్లిమ్ లలో వెనుకబడిన వారికి మాత్రమే బీసీ వర్గంలో చేర్చి ఇవ్వనున్నారని వాదించే వారు కూడా వున్నారు. ఏది ఏమైనా, కేసీఆర్ ముస్లిమ్ రిజర్వేషన్ ఓసారి , ముస్లిమ్ లలో వెనుకబడిన వారికి రిజర్వేషన్ అని ఓసారి మాటల చాతుర్యం ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడైతే ఏకంగా దత్తాత్రేయ హాజరైన మీటింగ్ లోనే మోదీ అనుకూలం అనేశారు! మరి దీనిపై తెలంగాణ బీజేపి ఎలా స్పందిస్తుందో చూడాలి! జనానికి సరిగ్గా క్లారిటీ ఇవ్వకపోతే మాత్రం, ముస్లిమ్ రిజర్వేషన్ల అంశంపై… మోదీ మాట వేరు, తెలంగాణ బీజేపి పోరాట బాట వేరు అనుకునే ప్రమాదం వుంది!

తెలంగాణ బీజేపీలో చిచ్చు... ఫొటోల వివాదంతో ఆగిపోయిన ప్రచారం

తెలంగాణ బీజేపీలో చిచ్చు రేగింది. రాష్ట్ర నేతలకు....జిల్లా నాయకులకు మధ్య వివాదం నడుస్తోంది. జాతీయ నాయకత్వం పిలుపు మేరకు విస్తారక్ యోజన కార్యక్రమం నిర్వహిస్తోన్న టీబీజేపీ.. మోడీ ప్రభుత్వ విజయాల గురించి ఇంటింటికి తిరిగి ప్రచారం చేపడుతోంది. దాదాపు 8వేల మంది కార్యకర్తలు గ్రామగ్రామానికీ వెళ్లి ఎన్డీఏ సర్కారు అమలు చేస్తున్న పథకాలు, పార్టీ సిద్దాంతాలతో పాటు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఉపదేశాలతో కరపత్రాలను ప్రతి ఇంటికి అతికిస్తున్నారు. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి వివరిస్తూ...మరో కరపత్రాన్ని పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ విస్తారక్ కార్యక్రమం పార్టీకి మంచి చేసిందో లేదో తెలియదు కానీ.. బీజేపీ నేతల మధ్య విభేదాలకు కారణమైంది.   విస్తారక్ కార్యక్రమంలో పంచే కరపత్రాలపై అగ్రనేతలైన దత్తాత్రేయ, మురళీధర్ రావు, లక్ష్మణ్, కిషన్ రెడ్డి ఫొటోలు మాత్రమే ముద్రించారు. దీనిపై జిల్లా జిల్లా నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. నియోజకవర్గాల్లో పంచే పాంప్లెట్లలో స్థానిక నేతల ఫొటోలు ప్రింట్ చేయకుండా జాతీయ, రాష్ట్ర నేతల ఫొటోలు ముద్రిస్తే ఏం ప్రయోజనమని నిలదీశారు. నియోజకవర్గానికి చెందిన నాయకుని ఫొటోను పెడితే అతనికి ప్రచారం పెరిగి... వచ్చే ఎన్నికల్లో ఓట్ షేర్ పెరిగే అవకాశం ఉందని, అది కూడా తెలియకుండా... కేవలం జాతీయ, రాష్ట్ర నేతల ఫొటోలు మాత్రమే ముద్రిస్తే ఏం లాభమని నిలదీశారు.   ఫొటోల విషయంపై నియోజకవర్గాల నేతలు జిల్లా నాయకుల్ని నేతల్ని ప్రశ్నిస్తుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక బిక్కమొహం వేస్తున్నారు రాష్ట్ర నేతలు. అంతేకాదు...తమ ఫొటోలు లేకుండా విస్తారక్ కార్యక్రమాన్ని నిర్వహించడం కష్టమని స్థానిక నేతలు తేల్చి చెప్పినట్లు తెలిసింది.

కేసీఆర్‌ సర్వేపై కేటీఆర్‌కే నమ్మకం లేదట..?

వచ్చే ఎన్నికల్లో కారు దూసుకుపోతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ సర్వేలు చెబుతున్నా... కొందరు మంత్రులకు మాత్రం నమ్మకం కుదరడం లేదట. సర్వేల్లో మంచి మార్కులు వచ్చిన మంత్రులకు సైతం... తాము కచ్చితంగా గెలుస్తామన్న ధీమా రావడం లేదట. అందుకే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారనే టాక్‌ వినిపిస్తోంది. సురక్షిత ప్రాంతాల కోసం అన్వేషిస్తున్నారట. అంటే ప్రస్తుత నియోజకవర్గాలను వదిలేసి..సేఫ్ సీట్ల అన్వేషణలో పడిపోయారట. అయితే ఎక్కువ మంది మంత్రులు హైదరాబాద్‌పైనే గురి పెట్టినట్లు తెలుస్తోంది.   నియోజకవర్గాల సంఖ్య పెరిగితే...టీఆర్ఎస్ ఎక్కడ బలంగా ఉందో అక్కడే బరిలో నిలవాలని కొందరు మంత్రులు భావించారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయో లేదో గ్యారెంటీ లేదు. ఢిల్లీలో అలాంటి సూచనలేవీ కనిపించడం లేదు. ఎందుకంటే అసెంబ్లీ సెగ్మెంట్లను పెంచడం వల్ల బీజేపీకి పెద్దగా లాభం లేదని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. దాంతో ఈ అంశాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవడం లేదు. ఈ విషయం తెలుసుకున్న మంత్రులు సురక్షిత నియోజకవర్గాలను చూసుకుంటున్నారనే చర్చ గులాబీ పార్టీలో సాగుతోంది. ఇక మంత్రులు కొందరు హైదరాబాద్ ను ఎంచుకోవడానికి కారణం...జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 సీట్లను గెలుచుకోవడమే. అందుకే పలువురు మంత్రులు ...జిల్లాలను వదిలేసి రాజధానిలో పాగా వేసే యోచనలో ఉన్నారు.    హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న మంత్రుల జాబితాలో ప్రముఖంగా కేటీఆర్ పేరే వినిపిస్తోంది. ఆయన వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి కాకుండా జూబ్లీహిల్స్ లేదంటే..ఉప్పల్ నుంచి పోటీ చేస్తారనే చర్చ నడుస్తోంది. దీనికి కారణం...రైతన్నలు, నేతన్నలు ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉండటమేనట. చేనేత కార్మికులు అధికంగా ఉన్న సిరిసిల్లలో అనేక ఆత్మహత్యలు జరిగాయి. నష్ట పరిహారం అందించడంలో గానీ, బాధిత కుటుంబాలను ఆదుకోవడంలోగానీ ప్రభుత్వం విఫలమైందనే ప్రచారం జరుగుతోంది. ఇది వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అంచనా వేయడం కష్టం. అందుకే...సీఎం సర్వేల్లో కేటీఆర్ కు 91 శాతం మార్కులు వచ్చినా.... సిరిసిల్లను వదులుకొని జూబ్లీహిల్స్ కానీ ఉప్పల్ కు కానీ రావాలనే ఆలోచనలో కేటీఆర్ ఉన్నట్లు సమాచారం. ఉప్పల్ లో అయితే వరంగల్ సెటిలర్లు అధికంగా ఉండటంతో పాటు..అక్కడ తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉంది. పైగా ఆ నియోజకవర్గ పరిధిలో అందరూ టీఆర్ఎస్ కార్పొరేటర్లు కావడం..మేయర్ బొంతు రామ్మెహన్ కూడా ఉప్పల్ పరిధిలోని చర్లపల్లి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ కారణంగా ఉప్పల్ లో కేటీఆర్ గెలుపు నల్లేరు మీద నడకనే భావన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.    మరో మంత్రి మహేందర్ రెడ్డి కూడా ఇంచుమించు ఇదే రకంగా ఆలోచిస్తున్నారట. తాండూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయన వ్యవహార శైలితోనే తాండూరు మున్సిపాలిటీ చేజారిపోయిందనే ప్రచారం ఉంది. అందుకే నియోజకవర్గం మారాలనే నిర్ణయంతోనే తాండూరును ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో శేరిలింగంపల్లి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. అందుకే ఈ నియోజకవర్గంలో మహేందర్‌రెడ్డి విస్తృతంగా పర్యటిస్తూ...హడావిడి చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.   ఇక మంత్రి జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేటలో ఆయనకు ఎదురు గాలి విస్తోందంటున్నారు. సీఎం సర్వేల్లో సైతం ఆయనకు 30 శాతం మార్కులే వచ్చాయి. సూర్యాపేట లో ఆయన ఓటమి ఖాయమని ఇంటలిజెన్స్ నివేదికలు కూడా అందాయి. దీంతో నల్గొండ సెటిలర్లు అధికంగా ఉన్న ఎల్బీ నగర్ లేదంటే హుజూరు నగర్ నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ మీద పోటీకి దిగాలని యోచిస్తున్నారట.ఉత్తమ్ మీద గెలిస్తే జెయింట్ కిల్లర్ గా పేరొస్తుంది...ఓడితే గట్టి పోటీ ఇచ్చినట్లవుతందని జగదీష్ రెడ్డి భావిస్తున్నారట.    మంత్రులే కాదు... ఏకంగా సీఎం కేసీఆర్ కూడా గజ్వేల్ నుంచి కాకుండా ఈసారి ఆలేర్ నుంచి  పోటీ చేస్తారనే చర్చ పార్టీలో జరుగుతోంది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణ వివాదం నేపథ్యంలో గజ్వేల్ లో ప్రభుత్వం వ్యతిరేకత ఉందని పార్టీ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. అందుకే రిస్క్ లేకుండా ఆలేర్ నుంచి బరిలో నిలవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట.

మరో రాష్ట్రం హస్తం చేజారిపోతోందా?

  కాంగ్రెస్ ముక్త్ భారత్… మోదీ చేసిన ఈ నినాదం నిజం అవ్వదులే అని ఎవరైనా భావిస్తుంటే వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేసే పనిలో బిజీగా వుంది హస్తం పార్టీ! అలాగే, దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచీ కాంగ్రెస్ తరువాతి స్థానంలో జాతీయ పార్టీ హోదాని అనుభవిస్తోంది సీపీఎం. ఇప్పుడు సదరు రెడ్ పార్టీ కూడా డెడ్లీ క్రైసిస్ లోకి జారిపోయిందని నిరూపితం అయింది షిమ్లాలో! అతి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న హిమాలయ రాష్ట్రంలో కాంగ్రెస్ యథావిధిగా మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయింది. సీపీఎం వున్న కొద్ది పాటి పట్టు కూడా కోల్పోయి… బీజేపి ఘన స్వాగతం పలికాయి!   ఈ సంవత్సరంలోనే అసెంబ్లీ ఎన్నికలు వున్న హిమాచల్ లో రాజధాని షిమ్లా కాంగ్రెస్ చేజారిపోయింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం హస్తం పార్టీదే. కాని, దేశం మొత్తంలో వీస్తున్నట్టే అక్కడా ఎదురుగాలి వీస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే, హిమాచల్ కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు షిమ్లా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించ వద్దని ప్రయత్నించింది. కోర్టు జోక్యంతో ఎలక్షన్స్ తప్ప లేదు. అప్పటికీ పార్టీ గుర్తుల మీద కాకుండా వ్యక్తిగతంగా పోటీ చేసేలా రూల్ తీసుకొచ్చింది. దాంతో బీజేపీ, కాంగ్రెస్ వర్గాలుగా పోటీ జరగలేదు. అయినా కూడా రెండు పార్టీలు స్పష్టంగా తమ తమ అభ్యర్థులకి మద్దతు పలికాయి. అలా సపోర్ట్ చేసిన వారిలో 17మంది బీజేపి కార్పోరేటర్లు గెలవగా, 13మంది మాత్రమే కాంగ్రెస్ వారు గెలిచారు. ముగ్గురు ఇండిపెండెంట్లు, ఒక సీపీఎం అభ్యర్థి కూడా గెలిచారు.   షిమ్లా మున్సిపల్ కార్పోరేషన్ గెలుపు చరిత్రాత్మకం అంటున్నారు పొలిటికల్ ఎనలిస్ట్స్ . ఎందుకంటే, గతంలో ఎప్పుడూ షిమ్లా బీజేపి కైవసం అవ్వలేదు. 30ఏళ్లుగా అది కాంగ్రెస్ కుంచుకోట! అంతకంటే, ప్రమాదకరం ఏంటంటే… షిమ్లాలో కమలం గెలుపు దాదాపుగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్ని కూడా చెప్పేస్తుందని పండితులు అంటున్నారు! అదే జరిగితే పంజాబ్ గెలుచుకున్న కాంగ్రెస్ మరోసారి పతనం బాటలో దూసుకుపోతున్నట్టే లెక్కా!   చల్లచల్లటి షిమ్లాలో బీజేపి గెలుపు… సీపీఎంకి కూడా వేడి పుట్టిస్తోంది! గత షిమ్లా కార్పోరేషన్ ఎన్నికల్లో కామ్రేడ్స్ మేయర్, డిప్యూటి మేయర్ పదవులు గెలుచుకున్నారు! ఈసారి మేయర్ కాదు కదా… కనీసం కార్పోరేటర్లు కూడా ఇద్దరు, ముగ్గురు గెలవలేదు! ఒకే ఒక్క కార్పోరేటర్ గెలిచాడు! అమిత్ షా మార్కు రాజకీయంతో ఆ ఏకైక సీపీఎం కార్పోరేటర్ ఎంత కాలం కాషాయం ధరించకుండా వుంటాడో, వుండనిస్తారో డౌటే!   దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆకుపచ్చ రాజకీయం, కామ్రేడ్ల ఎర్ర రాజకీయం బీజేపీ కాషాయ రాజకీయంతో వేగలేకపోతున్నాయి. షిమ్లా మున్సిపాలిటీ మరోసారి అదే ఋజువు చేసింది…

రాష్ట్రపతి ప్రణబ్ ఎన్నిసార్లు క్రిమినల్స్ ని ఉరి కంబం ఎక్కించారో తెలుసా?

  ఇప్పుడు అందరి దృష్టీ తరువాతి రాష్ట్రపతి ఎవరనే దానిపైనే వుంది! కాని, దేశ ప్రథమ పౌరుడి హోదాని మరికొన్ని రోజుల్లో వదులుకోబోతున్న ప్రణబ్ ముఖర్జీ ఏం  చేస్తున్నారు? ప్రస్తుత భారత రాష్ట్రపతి అయిన ఆయన కేవలం ప్రెసిడెంట్ కి మాత్రమే వుండే ప్రత్యేక అధికారాన్ని సద్వినియోగం చేశారు! రెండు క్షమాభిక్ష అభ్యర్థనల్ని తిరస్కరించి మొత్తం 30 క్షమాభిక్షల్ని తొసిపుచ్చిన రాష్ట్రపతిగా చరిత్రలో నిలిచారు!   భారత రాజ్యాంగం ప్రకారం కోర్టు ఉరిశిక్ష వేసిన ఖైదీకి క్షమాభిక్ష పెట్టే అధికారం రాష్ట్రపతికి వుంటుంది. అయితే, మిగతా అన్ని అంశాల్లాగే ఇది కూడా కేంద్ర మంత్రి వర్గం వ్యక్తం చేసిన అభిప్రాయం మేరకే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయాల్సి వుంటుంది. కాని, ఇప్పటి వరకూ ఒక్కో రాష్ట్రపతి ఒక్కో పద్ధతిలో క్షమాభిక్ష వ్యవహారాల్ని డీల్ చేశారు. ప్రస్తుత రాష్ట్రపతి తాజాగా రెండు క్షమాభిక్షల్ని తిరస్కరించి మొత్తం ముప్పై అభ్యర్థనల్ని కాదన్న వారిగా నిలిచారు! అయితే, ప్రణబ్ కంటే ముందు ప్రెసిడెంట్ గా వున్న ప్రతిభా పాటిల్ సరిగ్గా ముప్పై క్షమాభిక్షల్నే అంగీకరించటం ఇక్కడ పెద్ద విశేషం! ఆమె తన అయిదేళ్ల కాలంలో ముప్పై క్షమాభిక్షలు పెద్ద మనసు చేసుకుని ఒప్పుకుంది!   సాధారణంగా భారతీయ కోర్టులు అత్యంత కరుడుగట్టిన ఉన్మాదులకి తప్ప ఉరిశిక్షలు వేయవు. అందుకే, మన రాష్ట్రపతులు అంత త్వరగా క్షమాభిక్ష పెట్టరు. తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఎందుకని అంత మందికి క్షమాభిక్ష మంజూరు చేశారోగాని.. యాకుబ్ మెమన్ తో సహా ఎవ్వర్నీ కరుణించలేదు ప్రణబ్ దా! తాజాగా కూడా రెండు కేసుల్లో రేపిస్టుల్ని, మర్డర్లు చేసిన వార్ని ఆయన ఉరి తీయాల్సిందేనంటూ సంతకం చేశారు. ఇక తనదైన స్టైల్లో పని చేసిన డిఫరెంట్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలామ్ కేవలం రెండు క్షమాభిక్షలపైన నిర్ణయం తీసుకున్నారు. కేఆర్ నారాయణన్ తన అయిదేళ్ల కాలంలో ఒక్క పీటీషన్ పైన కూడా నిర్ణయం తీసుకోలేదు!   ముప్పై మెర్సీ పీటీషన్లు తిరస్కరించిన ప్రణబ్ ముఖర్జీ చాలా మంది రాష్ట్రపతుల కంటే కఠినంగా వ్యవహరించినట్టే. కాని, ఆయనకంటే టఫ్ గా నేరస్థుల్ని ఉరికంబం ఎక్కించారు ఆర్. వెంకట్రామన్. 1987-1992 మధ్య కాలంలో ఆయన అత్యధికంగా 44 క్షమాభిక్ష పీటషన్లు తిరస్కరించారు!