కసబ్‌లకు బిర్యానీలు… సామాన్య ఖైదీలకు నరకం… మన జైళ్ల పరిస్థితి!
posted on Jun 27, 2017 @ 4:18PM
రెండు రోజులుగా మీడియాలో అడపాదడపా వస్తోన్న న్యూస్… షీనా బోరా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఇంద్రాణి ముఖర్జీపై ఎఫ్ఐఆర్! ముంబైలోని బైకుల్లా జైలులో మొత్తం 2వందల మంది మహిళా ఖైదీలపై ఎఫ్ఐఆర్ నమోదు. వారిలో ఒకరే ఇంద్రాణి ముఖర్జీ! ఈ ఖైదీలంతా జైలులో నిరసనలకి దిగి , కొన్ని కాగితాలు, కొంత ఫర్నిచర్ తగలబెట్టారు! అందుకుగానూ… వారిపై కేసు నమోదైంది. అయితే, మీడియా దృష్టంతా ఇంద్రాణి ముఖర్జీపైనే వుంది కాని… అసలేం జరిగిందో చాలా వరకూ బయటకు రాలేదు! కాని, తెలిస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది మన జైళ్లు, పోలీసుల పరిస్థితి చూసి…
ఇంద్రాణి ముఖర్జీ గతంలో ఒక పెద్ద మీడియా సెలబ్రిటీ, బాగా పేరు వుండింది. తరువాత ఆమె తన స్వంత కూతురు షీనా బోరాను హత్య చేసిందని ఆరోపణలు రావటంతో అరెస్ట్ అయింది. ఇప్పుడు విచారణ ఎదుర్కొంటోంది. కాని, ఇలాంటి సెలబ్రిటీ కూడా ముంబైలోని బైకుల్లా జైలులో ఇతర సాధారణ ఖైదీలతో కలసి నిరసనకు దిగింది! మరో కేసులో ఇప్పుడు ఇరుక్కుంది. కాని, దాని వెనుక చాలా సీరియస్ కారణమే వుంది. ఇంద్రాణితో సహా బైకుల్లా జైలులోని వందల మంది మహిళా ఖైదీలు జైలు సిబ్బందికి వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. ఇది అత్యంత అసాధారణ విషయం…
మీడియాలో పెద్దగా బయటకి రాని అసలు విషాదం ఏంటంటే… బైకుల్లా జైలులో మంజుల అనే ఒక ఖైదీ, జీవిత ఖైదు అనుభవిస్తోంది. వివిధ జైళ్లలో గత 11ఏళ్లుగా శిక్ష అనుభవిస్తోన్న ఆమె సత్ప్రవర్తనతో వార్డెన్ గా బాధ్యతలు నిర్వహించే స్థాయికి వచ్చింది. దాదాపు పోలీసు సిబ్బందితో సమానంగా ఆమె పనులు చే్స్తుండేది. ఇతర ఖైదీల్ని నియంత్రణలో వుంచటం ఆమె బాధ్యత. అలాంటి మంజుల తనకు రావాల్సిన రెండు గుడ్లు, కొన్ని రొట్టెలు తక్కువగా వచ్చాయని కంప్లైంట్ చేసిందట! ఆ విషయంలోనే బైకుల్లా జైలు సిబ్బందికి , మంజులకి గొడవ జరిగింది.
మంజుల వున్న బ్యారెక్ లోకి వచ్చిన కొందరు మహిళా కానిస్టేబుల్స్ ఆమెని వివస్త్రని చేసి, కాళ్లు విడదీసి పట్టుకుని, మర్మాంగంలోకి లాఠీ చొప్పించారట. దాని వల్ల నరకం అనుభవించిన మంజుల చివరకు రక్త స్రావంతో స్పృహ తప్పింది. జైలు సిబ్బంది ఎట్టకేలకు హాస్పిటల్ కి తీసుకెళ్లే సరికి ఆమె మృతి చెందింది. ఇదీ జరిగిందనీ ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఎఫ్ఐఆర్ లో ఇదే నమోదైంది.
మన జైళ్లలో పాకిస్తాన్ నుంచి వచ్చిన కసబ్ లాంటి వారికి పోలీసులు బిర్యానీలు వడ్డించి సేవలు చేసి తరిస్తారు. కాని, సామాన్య ఖైదీల్ని మాత్రం అమానుషంగా హింసిస్తుంటారు. నిజంగా బైకుల్లా జైలులో ఏం జరిగినప్పటికీ మన పోలీసుల్లో మానవత్వం పెరగాల్సిన అవసరం ఎంతైనా వుంది. వార్ని సంస్కరించే దిశగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎప్పటికి చర్యలు తీసుకుంటాయో … ఏమో!