తోటి ఎమ్మెల్యే ఆరోపణలు చేశాడు.. సాటి ఎమ్మేల్యేలు తన్ని తగలేశారు!

చెత్తనంతా ఊడ్చేస్తామంటూ చీపురు గుర్తుతో రంగంలోకి దిగిన ఆప్ మిగతా పార్టీలకంటే మరింత ఎక్కువ దుమ్మూ, ధూళిలో పొర్లాడుతోంది! పరిస్థితి చూస్తుంటే అరవింద్ కేజ్రీవాల్ ఆదర్శాల పార్టీ అత్యంత చౌకబారు రాజకీయాలకు కేరాఫ్ గా మారిపోయినట్టు అనిపిస్తోంది! ఇంతకాలం అరాచక ప్రవర్తన రోడ్ల మీదకే పరిమితమయ్యేది. కాని, ఇప్పుడు ఏకంగా జనం ఎంతో విశ్వాసంతో మెజార్టీ ఇచ్చిన దిల్లీ అసెంబ్లీలోనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు బరితెగించారు. భౌతిక దాడికి దిగిపోయి తాము వచ్చిన నేపథ్యం ఏంటో నిరూపించుకున్నారు!   గత కొన్ని రోజులుగా కేజ్రీవాల్ పై కపిల్ మిశ్రా చేస్తున్న ఆరోపణల వ్యవహారం అందరికీ తెలిసిందే! నిజానికి ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్న కపిల్ చేసే ఆరోపణల్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అసవరం లేదు. కేజ్రీవాల్ అవినీతిపరుడని చెప్పటం కోసం ఆయన రోజుకో ప్రెస్ మీట్, రోజుకో డ్రామా చేస్తున్నారు. అది ఆయన రాజకీయ వ్యూహంలో భాగం. ఆప్ అధినేతపై పగ, ప్రతీకారం! అంతే తప్ప నిజంగా కేజ్రీవాల్ మోసాల్ని బయటపెట్టడం కపిల్ మిశ్రా ఉద్దేశం కాదు. అయినా కూడా తమ మీద వస్తున్న ఆరోపణల్ని సంయమనంతో ఎదుర్కోవాల్సిన ఆప్ రౌడీలు, గూండాల ముఠాలా వ్యవహరిస్తోంది!   తమ బాస్ కేజ్రీవాల్ పై ఆరోపణలు చేసి నిరాహార దీక్షకు దిగిన మిశ్రాపై గతంలోనే ఒక ఆప్ ఎమ్మెల్యే భౌతిక దాడి చేశాడు. అయితే, ఈసారి ఏకంగా దిల్లీ అసెంబ్లీలోనే అయిదుగురు కేజ్రీవాల్ ఎమ్మెల్యేలు మిశ్రాపై స్పీకర్ ముందే దాడి చేశారు. విచిత్రంగా సదరు స్పీకర్ గారు దాడి చేసిన వార్ని సభలో వుంచి తన్నులు తిన్న మిశ్రాను మార్షల్స్ తో బయటకి గెంటేయించారు! ఇంతకీ ఆయన దాడికి గురి కావటానికి చేసిన పాపం, ఘోరం ఏంటి? కపిల్ మిశ్రా కేజ్రీవాల్ ఔషధాల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణ చేయబోయాడు! అంతే ఆప్ ఎమ్మెల్యేల చేతిలో మనోడి దవడలు వాచిపోయాయి!   కపిల్ మిశ్రాపై సభలోపల, బయట రెండు సార్లు దాడి చేసిన ఆప్ ఒక్క విషయం బాగా ఆలోచించుకోవాలి… మోదీ మొదలు అంబానీ వరకూ అందరిపైనా అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేశాడు! చేస్తూనే వున్నాడు! మరి కేజ్రీవాల్ పైన కూడా ఆరోపణలు ఎదుర్కుంటున్న వారు దాడులకి దిగితే? ఈ పాటికి కనీసం వెయ్యి దాడులు జరిగేవి ఆప్ అధినేత మీద! అన్ని ఆధారం లేని ఆరోపణలు చేశాడాయన! కాని, ప్రజాస్వామ్యంలో విమర్శలు, ఆరోపణలు సహజం కాబట్టి ఎవ్వరూ దాడులకి దిగలేదు! ఆ సంస్కారం రోజు నీతులు చెప్పే అవినీతి వ్యతిరేక ఆప్ పార్టీకి మాత్రం వున్నట్టు కనిపించటం లేదు!   లైవ్ అసెంబ్లీలో సాటి ఎమ్మెల్యే పై తన ప్రజా ప్రతినిధులు దాడి చేస్తుంటే కేజ్రీవాల్ ఏం చేస్తున్నారు? ఏమో! కాకపోతే, ఆల్రెడీ దిల్లీ మున్సిపల్ పోల్స్ లో దారుణమైన ఫలితాన్నిచ్నిన ఓటర్లు రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు!

రాజస్థాన్ హైకోర్ట్ సై అంది! తమిళనాడు హైకోర్ట్ నై అంది!

ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించండి. ఆవుని చంపితే జీవిత ఖైదు విధించగలిగేలా చట్టం చేయండి. ఈ మాటలన్నది ఎవరో తెలుసా? ఏ కాషాయ నేతో మీడియా ముందు చేసిన హాట్ కామెంట్స్ కాదు! రాజస్థాన్ హై కోర్టు వేసిన ఆర్డర్! కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 48, 51A(g) ల ప్రకారం గో రక్షణ చేయాలని న్యాయస్థానం సూచించింది!   అసలు ఆవుని రక్షించాల్సిన బాధ్యత కోర్టు పై ఎందుకు పడింది అంటారా? రాజస్థాన్ లోని ఓ ప్రపంచ ప్రఖ్యాత గోశాల నిర్వహణపై ప్రస్తుతం కేసు నడుస్తోంది. అందులో పోయిన సంవత్సరం జనవరి నుంచి జూలై మధ్య కాలంలో 8వేల ఆవులు వివిధ కారణాల వల్ల మృత్యువాత పడ్డాయి. ఆ అంశాన్ని విచారిస్తున్న న్యాయమూర్తులు గో సంరక్షణ గురించి కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారి చేశారు. భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం కాబట్టి పశు సంపద కాపాడుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా వుందని పేర్కొంటూ ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్ని రాజస్థాన్ కోర్టు సూచించింది!   ఒకవైపు రాజస్థాన్ కోర్టు ఆవుని కాపాడాలని కేంద్రానికి చెబుతుంటే మరో వైపు తమిళనాడు హైకోర్టు మంగళవారం నాడు పశు విక్రయాలపై మోదీ సర్కార్ చేసిన నిర్ణయంపై స్టే విధించింది. పశువుల్ని వ్యవసాయ అవసరాల కోసం తప్ప కబేళాలకు అమ్మటానికి వీలు లేదని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇతర ప్రతి పక్ష పార్టీలు తీవ్ర నిరసనలకు దిగుతుండటం తెలిసిందే కదా! వారితో పాటూ ఇప్పుడు హై కోర్టులు కూడా రెండు వైపులా మోహరించినట్టు కనిపిస్తోంది. రాజస్థాన్ హై కోర్టు ఆర్డర్ బీజేపికి అనుకూలంగా వుంటే , మద్రాస్ హై కోర్ట్ స్టే విధింపు అపోజిషన్ కు ఆనందంగా వుంది!   కేరళలో కమ్యూనిస్టులు ఆవు మాంసం పబ్లిగ్గా తింటూ నిరనసన తెలిపారు. కాంగ్రెస్ నాయకుడు ఒకరు మరో అడుగు ముందుకేసి కెమెరాల ముందు గోవధకి పాల్పడి అమానుషంగా ప్రవర్తించారు. మమతా బెనర్జీ కూడా గోమాంసంపై తీవ్రంగా గోల చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో కోర్టులు కూడా అదికార, ప్రతిపక్షాలకి ఆయుధాల్లా ఉపయోగపడే నిర్ణయాలు చేస్తుండటం… గొడవ మరింత ముదిరేలా చేస్తుందనిపిస్తోంది! చూడాలి మరి ముందు ముందు దేశ రాజకీయాలు, గోమాత పరిస్థితి ఎలా తయారవుతాయో! 

మన సర్కారీ దవాఖానాల రోగం… మందులకి తగ్గేది కాదు!

  శారీరిక ఆరోగ్యం బాగాలేక గవర్నమెంట్ ఆసుపత్రికి వెళితే మానసిక వేదనకి గురి చేసి నాలుగు రోజులు ముందుగానే చంపేస్తారు! ఇదీ మన దవాఖానాల్లో పరిస్థితి! ఒకవైపు ప్రైవేటు కార్పోరేట్ హాస్పిటల్స్ ఇంటికే వచ్చి వైద్యం చేస్తామంటూ అతి సేవలు అందిస్తోంటే సర్కార్ ఆసుపత్రులు మాత్రం అత్యంత దయనీయంగా మిగిలిపోతున్నాయి. అయినా కూడా డబ్బులు లేని, బిల్లులు కట్టలేని అభాగ్యులు ప్రైవేట్ హాస్పిటల్స్ ముఖం చూడకుండా గాంధీ, ఉస్మానియాల వంటి వాటికే రావాల్సి వస్తుంటుంది. అలా వచ్చిన కూలీలు, కార్మికులు, పల్లెటూరి జనం, పట్టణ పేదలు… వీరందరి నరకం వర్ణనాతీతం!   గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వైద్యం సరిగ్గా వుండదనేది చాలా పెద్ద చర్చకు దారి తీసే అంశం. అసలు అక్కడికి వెళ్లిన చిక్కి శల్యమైన నిరు పేద రోగులకి వీల్ చెయిర్లు, స్ట్రెచర్లు వుంటాయా? తగినన్ని మంచాలుంటాయా? సెలైన్ ఎక్కించే స్టాండ్లు వుంటాయా? ఏవీ వుండవు! ఎలాగోలా దిక్కూమొక్కూ లేని భారతీయులు సర్కార్ దవాఖానాలో వైద్యం పొందగలిగితే… అక్కడి వారు ఎక్కించే సెలైన్లో పురుగులుండవని గ్యారెంటీ లేదు! ఇది మన దేశ, రాష్ట్ర గవర్నమెంట్ వైద్య రంగం పరిస్థితి! ఇలాంటి నరక కూపం లాంటి ఆసుపత్రులు ఆఫ్రికా దేశాల్లో కూడా వుండవనుకుంటా! కాని, ప్రపంచంలోనే చైనా కంటే వేగంగా అభివృద్ధి చెందుతోన్న మన దేశంలో మాత్రం వుంటాయి! బంగారు తెలంగాణ మెరిసిపోతన్నా మన రాష్ట్రంలోనూ వుంటాయి!     ఆ మధ్య సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి… నడిచి లోపలికి వెళ్లలేని ఒక రోగి వస్తే కనీసం వీల్ చెయిర్ ఇవ్వలేదు అక్కడి సిబ్బంది. అది పెద్ద దుమారంగా మారింది మీడియాలో. తరువాత తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖా మంత్రి స్వయంగా హాస్పిటల్ కి వెళ్లి పరిస్థితులు చూసొచ్చారు. అయినా మార్పు రాలేదు. సరి కదా ఇప్పుడు తాజాగా… ఒక ఎమ్మెల్యే భార్య తన బంధువుని గాంధీ అసుపత్రికి తీసుకొస్తే ఎవ్వరూ పట్టించుకోలేదు! దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య తానే స్వయంగా వీల్ చెయిర్ తెచ్చుకుని బంధువైన రోగిని అందులో కూర్చోబెట్టుకుని తోసుకెళ్లారు! ఇంతా జరిగినా ప్రభుత్వాసుపత్రి పెద్దలు ఒక్కరూ స్పందించలేదు!   ఎమ్మేల్యే భార్యకి ఎదురైన దుస్థితి చూశాక పూట గడవని పేదలు మన ప్రభుత్వాసుపత్రుల్లో ఎంత గౌరవం, ప్రమా పొందుతున్నారో చక్కగా అర్థం చేసుకోవచ్చు! పరిస్థితి ఇలా వుంటుంది కాబట్టే , దాదాపు ఎప్పుడూ మన ఎమ్యేలేలు, ఎంపీలు, వారి బంధువులు సర్కార్ నడుపుతారు కానీ … సర్కారీ దవాఖానాకు రారు! తమ పిల్లల్ని సర్కారీ బడుల్లో చదివించరు! ఇక విద్యా, వైద్యం కోట్లాది మంది పేదలకి అందని దేశం … అది ఏదైనా, ఎంతటిదైనా ఎలా బాగుపడుతుంది? సర్కార్ నడిపే షావుకార్లే ఆలోచించాలి!

టార్గెట్‌ నల్గొండ... ఒకే దెబ్బకు రెండు పిట్టలంటున్న కేసీఆర్‌

  బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్... ఇపుడు ఈ మూడు పార్టీల టార్గెట్ ఒకటే. అదే నల్గొండ జిల్లాలో పైచేయి సాధించడం. వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థులను పడగొట్టి తమ సత్తా చాటడం. అందుకే ఇపుడు రాష్ట్ర రాజకీయాలకు ఈ జిల్లా సెంటర్ పాయింట్‌గా మారింది. దాంతో నల్గొండ జిల్లా రాజకీయాలు ఎన్నికలకు రెండేళ్ల ముందే వేడెక్కుతున్నాయి. గెలుపు కోసం ఇప్పట్నుంచే ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి.   నల్గొండ జిల్లా కాంగ్రెస్ కు కంచుకోట లాంటిది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ లీడర్‌, ప్రతిపక్ష నేత జానారెడ్డి, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డిలాంటి కాకలు తీరిన నేతలంతా ఈ జిల్లాకు చెందినవారే. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అధికార పార్టీకి ఎదురునిలిచి తమ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని గెలిపించుకోగలిగారు. ఇలాంటి చోట కాంగ్రెస్ ను ఖతం చేసి తమ జెండా ఎగరేయాలనుకుంటున్నాయి టీఆర్ఎస్, బీజేపీ.   మూడ్రోజులపాటు నల్గొండలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. ఒక్కసారిగా జిల్లా రాజకీయాలను వేడెక్కించారు. జిల్లాలో చాలామంది నేతలు కాషాయ కండువా కప్పుకోవడానికి రెడీగా ఉన్నారంటూ బాంబు పేల్చారు. వచ్చే ఎన్నికల్లో తమదే గెలుపంటూ క్యాడర్ లో నూతనోత్తేజాన్ని నింపారు.   అమిత్ షా రాకతో రాజుకున్న రాజకీయ వేడిని... తన సర్వేతో మరింత పెంచారు సీఎం కేసీఆర్. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని అసెంబ్లీ స్థానాలన్నిటినీ తామే కైవసం చేసుకోబోతున్నామని, ప్రత్యర్థి పార్టీలకు ఒక్కసీటు కూడా రాదని ప్రకటించి పొలిటికల్ వార్ కు తెరలేపారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలను కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఓవైపు తమ క్యాడర్ లో జోష్ నింపుతూనే... మరోవైపు జిల్లాలో బలంగా ఉన్న కాంగ్రెస్.... బలపడాలని కోరుకుంటున్న బీజేపీని టార్గెట్ చేసుకున్నారు. మరి 2019లో జిల్లా ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి.

అక్షయ్, సైనాను  తప్పుబట్టిన మావోలు జనానికి ఇస్తోన్న సంకేతం ఏంటి?

  పేదల కోసం, తాడిత, పీడిత జనం కోసం, గిరిజనుల కోసం మొదలైన ఉద్యమం నక్సల్ బిరీ ఉద్యమం. అది క్రమంగా పెరిగి పెద్దదై ఇవాళ్ల మావోయిస్టు హింసగా మారింది. యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న అడవిలో అన్నల ఆదర్శం… వేలాది ప్రాణాలు బలి తీసుకుని సాధించింది ఏంటి? సూటిగా మాట్లాడుకుంటే ఎలాంటి సమాధానం దొరకదు. ఛత్తీస్ గఢ్ అడవుల్లో తప్ప మరెక్కడా ఇప్పుడు మావోయిస్టుల ప్రాబల్యం లేదు. మిగతా చోట్ల అక్కడక్కడా బలంగా వున్నా మొత్తానికి మొత్తంగా ప్రభావితం చేసే శక్తి అంతకంతకూ తగ్గిపోతోంది. ఈ క్రమంలో మావోయిస్టులు వున్నట్టుండీ విరుచుకుపడి జవాన్లను చంపటం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. తరువాత ఆర్మీ, ప్రభుత్వాలు కూడా ప్రతీకార దాడులతో మరింత రక్తపాతం చేస్తున్నాయి…   అంతం అంటూ లేకుండా నడుస్తోన్న మావోయిస్టు హింసలో అమరులయ్యే సైనికులు, పోలీసులే అత్యంత అభాగ్యులు. ఎందుకంటే, వారు అన్నల మాదిరిగా అడవుల్లోకి ఏవో ఆదర్శాలతో ఆవేశంతో రారు. ఉద్యోగం కోసం భద్రతా దళాల్లో చేరి తరువాత అధికారులు చెప్పిన విధంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలోకి వస్తారు. వారికి ఏ నక్సలైటుతోనూ , గిరిజనుడితోనూ వ్యక్తిగత పగ, ప్రతీకారం వుండదు. కాని, వారు తమని చంపుతున్నారు కాబట్టి మావోలు కూడా వాళ్లని మట్టుబెడుతుంటారు. యుద్ధంలో అది తప్పు కాకపోవచ్చు. కాని, అసలు సీఆర్పీఎఫ్ జవాన్ల కూంబింగ్ ఎందుకు నడుస్తోంది? వామపక్ష ఉగ్రవాదులు ఆయుధాలు వదలకపోవటం వల్ల. యాభై ఏళ్లుగా తమకంటే వందల రెట్లు బలవంతమైన ప్రభుత్వాల్ని చాలీ చాలని ఆహారం, ఆయుధాలతో ఎదుర్కోవాలని ప్రయత్నిస్తుండటం వల్ల! ఇలా కొండను ఢీకొడుతూనే వుంటే ఎప్పటికి అది పగిలేది? ఎప్పుడు సమ సమాజం ఏర్పడేది? మావోయిస్టుల వద్ద ఎలాంటి సమాధానం లేదు!   రష్యా మొదలు నిన్న మొన్నటి నేపాల్ వరకూ ఎక్కడా సాయుధ విప్లవం శాశ్వత మార్పు సాధించలేకపోయింది. రక్త చరిత్ర అలాంటి నిజం చెబుతున్నా… మన మావోలు మాత్రం తమ పంథా మార్చుకునే ఉద్దేశంలో లేరు. కనీసం ఇప్పుడున్న పంథాలోని లోపాల్ని సైతం విశ్లేషించుకునే తీరికలో లేరు. పైగా అక్షయ్ కుమార్, సైనా నెహ్వాల్ అమరులైన జవాన్ల కుటుంబాలకి ఆర్దిక సాయం చేస్తే మావోయిస్టులు దాన్ని తప్పుపట్టడం ఆశ్చర్యకరం! విషాదం! ఎందుకంటే, అక్షయ్, సైనా జీవితం గడపటం సమస్యగా మారిన కుటుంబాల్ని ఆదుకున్నారు కాని మావోయిస్టులపై పోరుకి జవాన్లకి ఆయుధాలు కొనివ్వలేదు. కాబట్టి వారికి యుద్ధంతో సంబంధం లేదు. యుద్ధం ఆపాల్సింది మావోలు. వాళ్లతో చర్చలు జరిపి సంధికి ప్రయత్నించాల్సింది ప్రభుత్వాలు. మధ్యలో జవాన్ల కుటుంబాల్ని ఆదుపుకున్న ఆక్షయ్, సైనాల్ని టార్గెట్ చేస్తే వారేం చేస్తారు?   ఎప్పుడు ఏ ఎన్ కౌంటర్ జరిగినా అది ఫేక్ అంటూ మానవ హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు మావోయిస్టులకు మద్దతుగా బయటకు వస్తుంటాయి. ప్రజాస్వామ్యంలో వారలా సాయుధ విప్లవకారులని సపోర్ట్ చేయటం సబబైతే జవాన్లకి ఆర్దిక సాయం చేసిన అక్షయ్, సైనాల్ని ఏమనగలం? వారి స్వంత కష్టార్జితం ఎవరికి ఇచ్చినా తప్పేముంది? అలాంటి సెలబ్రిటీల్ని కూడా తమ కరపత్రాల్లో విమర్శించి మావోయిస్టులు సామాన్య జనం ముందు మరింత తప్పైపోతున్నారు. ఇది ఖచ్చితంగా అత్యంత అట్టడుగు వర్గాల క్షేమం కోసం ప్రాణాలకు తెగించి పోరాడే అన్నలు పునరాలోచించుకోవాల్సిన చారిత్రక సమయం!

సంగారెడ్డిలోనే రాహుల్‌ సభ ఎందుకు? నానమ్మ సెంటిమెంట్‌ వర్కవుట్‌ అవుతుందా?

  నానమ్మ సెంటిమెంట్ ను ఇప్పుడు మనువడు ఫాలో అవుతున్నాడు. ఓడిన చోటే గెల్చుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. అందుకే నానమ్మ బాటలో సంగారెడ్డి నుంచి సమర శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమయ్యాడు రాహుల్‌. ప్రభుత్వ వైఫల్యాలను నానమ్మ ఇందిరాగాంధీలాగే ఎండగట్టి తిరిగి కాంగ్రెస్‌ను ప్రజల దగ్గరికి చేర్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.   సంగారెడ్డి అంటే కాంగ్రెస్ మొదటి నుంచి సెంటిమెంటుగా భావిస్తుంది. 1979లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ.. సంగారెడ్డి నుంచే ఎన్నికల శంఖరావాన్ని పూరించారు. మెదక్ ఎంపీగా పోటీచేసి భారీ మెజార్టీ సాధించారు. దేశవ్యాప్తంగా అత్యధిక సీట్లు సాధించి మరోసారి ప్రధాని అయ్యారు. అందుకే సంగారెడ్డి కలిసోస్తుందని పార్టీ పెద్దలకు నమ్మకం. అదే నమ్మకంతో రాహుల్ గాంధీ సభను సంగారెడ్డిలో ఏర్పాటు చేశారు. జూన్ 1న ప్రజా గర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.    సంగారెడ్డి సెంటిమెంట్ తమకు కలిస్తోందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఎమర్జెన్సీ టైమ్‌లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోయింది. బడా నేతలకు సైతం కనీసం డిపాజిట్లు రాలేదు. ఇక కాంగ్రెస్ పని అయిపోయిందనుకున్నారు. అయితే 1979 ఎన్నికల్లో కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరించి అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ప్రచారాన్ని సంగారెడ్డి నుంచి ప్రారంభించిన ఇందిరా గాంధీ కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారు. అందుకే సంగారెడ్డిలో రాహుల్ సభ ఏర్పాటు చేశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఈ సభ ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే కాకుండా... భారీగా ఉచిత హామీలు గుప్పించి... మరోసారి ప్రజలకు చేరువై 2019 ఎన్నికల్లో పుంజుకోవాలని చూస్తున్నారు. మరి సంగారెడ్డి సెంటిమెంట్ కాంగ్రెస్ కు కలిసొస్తుందా లేదా అన్నది ఎన్నికల తర్వాతే తేలుతుంది.

ఆ మంత్రి ఓటమి ఖాయం... కేసీఆర్‌ సర్వేలోనే తేలింది?

  తెలంగాణలో ఇప్పుడు సర్వేల గోలే నడుస్తోంది. అయితే సర్వేలపై అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధాన్ని పక్కనబెడితే... కేసీఆర్‌ మూడో సర్వేలో ఆయన ప్రియ శిష్యుడు, మంత్రి లాస్ట్‌ ప్లేస్‌లో నిలవడం టీఆర్‌ఎస్‌లో హాప్‌ టాపిక్‌‌గా మారింది. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన మంత్రి జగదీశ్‌‌రెడ్డికి వందకి కేవలం 30 మార్కులే వచ్చాయట. దాంతో శిష్యుడి పరువు పోతుందని జగదీశ్‌రెడ్డి మార్కులను కేసీఆర్‌ ప్రకటించలేదంటున్నారు గులాబీ నేతలు. టీఆర్‌ఎస్‌ఎల్పీ మీటింగ్‌లో జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే ఫలితాలను ప్రకటించిన కేసీఆర్‌... జగదీశ్‌రెడ్డి పేరు మాత్రం దాటవేశారు. తర్వాత చూద్దామంటూ తనదైన స్టైల్లో సైడ్‌ ట్రాక్‌ చేశారు. అయితే మంత్రికి ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకునేందుకు ఎమ్మెల్యేలు ఆసక్తిచూపడంతో దిమ్మదిరిగే వాస్తవాలు తెలిశాయి. జగదీశ్‌‌రెడ్డికి కనీసం పాస్‌ మార్కులు కూడా రాలేదని తెలుసుకుని ముక్కున వేలేసుకున్నారు.    జగదీష్ రెడ్డి మంత్రి కావడం... అది కూడా కేసీఆర్ కు అత్యంత ప్రియమైన శిష్యుడు కావడంతో ఫలితాలను ప్రకటించడానికి సీఎం ఇబ్బంది పడ్డారంటున్నారు. ఫలితాలు ప్రకటిస్తే ఓ బాధ... ప్రకటించకుంటే మరో బాధలా తయారైంది అధినేత పరిస్థితి. అందుకే జగదీష్‌రెడ్డి సర్వే ఫలితాలు  ప్రకటించకపోవడమే బెటర్ అనుకున్నారు సీఎం. అయితే జగదీష్ రెడ్డిని పేరును కాకుండా ఆ తర్వాత తక్కువ మార్కులు వచ్చిన ఎమ్మెల్యేలైన తీగల, బాబూమోహన్, మాధవరం పేర్లను ప్రకటించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. తమ పేర్లు ప్రకటించి... జగదీష్ రెడ్డి పేరు ప్రకటించక పోవడాన్ని తప్పుబడుతున్నారు. జగదీశ్‌‌రెడ్డి.... కేసీఆర్‌కు ప్రియశిష్యుడు కావడం వల్లే ఆయన ఫలితాలను ప్రకటించలేదని గులాబీ లీడర్లు గుసగుసలాడుకుంటున్నారు.   సర్వేలో జగదీష్ రెడ్డి ఫెయిల్ కావడం వెనుక చాలా కారణాలున్నాయంటున్నారు. పెద్ద, చిన్నా తేడా లేకుండా దూషణల పర్వానికి దిగుతారనే పేరుంది. అసెంబ్లీ వేదికగా ఇతర సభ్యులపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసి క్షమాపణలు కూడా చెప్పారు. ఏలాగూ సీఎం ఏమీ అనరన్న ధైర్యంతో ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారన్న ఆరోపణలున్నాయి. మరో వైపు నియోజకవర్గలో సైతం ఆయనకు మంచి పేరు లేదు. కనీసం కార్యకర్తలకు ప్రతి నమస్కారం కూడా చేయరని తెలుస్తోంది. అయినా సీఎంకు చాలా క్లోజ్ కాబట్టి నోరెత్తలేకపోతున్నారు. అయితే సీఎం మాత్రం జగదీష్ రెడ్డి విషయంలో చాలా క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే... వచ్చే ఎన్నికల్లో జగదీష్ రెడ్డి గెలుస్తాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఆయన ఓడిపోతే.. ఎలా అకామిడేట్ చేయాలన్న దానిపై కేసీఆర్ ఆలోచిస్తున్నారని పార్టీలో చర్చ సాగుతుంది. దాంతో ఆయన ఓటమి ఖాయమని పార్టీ నేతలు చెబుతున్నారు.

సైన్యం సైలెంట్‌గా మారిపోతోంది! ఆర్మీ చీఫ్ రావత్ ఆటా మొదలెట్టారు!

    ఏ దేశానికైనా అత్యంత అవసరమైన ఇద్దరే ఇద్దరు పౌరులు… జవాన్, కిసాన్! ఆ ఇద్దరిలో కూడా ఎవరు ఇంకా చాలా ముఖ్యం? ఖచ్చితంగా ఇప్పుడున్న ఆధునిక అణు బాంబుల యుగంలో జవానే కీలకం! ఇది కొంత మందికి నచ్చకపోవచ్చు… ఆర్మీకి విపరీతంగా ఖర్చు పెడుతున్నారని వాపోయే మేధావులు కూడా వుంటారు.. కాని, అవన్నీ కేవలం మాటలే. నిజంగా ప్రపంచ పటంలోని ప్రస్తుత పరిస్థితి చూస్తే … సైన్యం లేకుంటే దేశమే లేదు. ఒక వైపు పాక్, మరో వైపు చైనా, ఇంకో వైపు దేశం లోపల మావోయిస్టులు, ప్రకృతి విపత్తులు… ఇన్ని సుడిగుండాల నేపథ్యంలో ఇండియాకి సోల్జర్స్ కంటే ముఖ్యం ఇంకెవరో చెప్పండి?   ఆర్మీ వల్లే ఏ దైశమైనా బతికి బట్టకట్టేది. భారతదేశమూ అంతే! కాని, అప్పుడప్పుడూ, అక్కడక్కడా సైనికులు కూడా తప్పులు చేస్తుంటారు. అరాచకాలకు పాల్పడవచ్చు కూడా. కాని, వారి వల్ల కలిగే లాభంతో పొలిస్తే ఇబ్బంది చాలా స్వల్పం. అయినా కొందరు ఆర్మీని టార్గెట్ చేయటం అభ్యుదయవాదం అనుకుంటారు. మొన్నటికి మొన్న ఓ కేరళ మంత్రి ఆర్మీ వారు వచ్చి ఆడవాళ్లని కి్డ్నాప్ చేసి రేప్ చేస్తారంటూ నోటికి వచ్చినట్టు వాగేశాడు. కన్నయ్యా కుమార్ లాంటి జేఎన్ యూ విద్యార్థి కూడా చదువబ్బని వారు సైన్యంలో చేరతారంటూ అవమానకరంగా మాట్లాడు. ఇలాంటి వారు మన దేశంలో బోలెడు!   ఆర్మీని ఆడిపోసుకునే బాపతు వర్గం వారు ఆ మధ్య ఒక కాశ్మీరీని జీపుకి కట్టేస్తే నానా గొడవ చేశారు. అది నిజానికి మానవహక్కుల ఉల్లంఘనే అయినా మేజర్ నితిన్ గొగోయ్ ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? ఈ ప్రశ్న వేసుకునే ఓపిక లేదు కొందరు మేధావులకి! రాళ్లు రువ్వే కాశ్మీరీ అరాచాక ముఠాల బారి నుంచీ పోలింగ్ సిబ్బందిని కాపాడాల్సిన బాధ్యత ఆర్మీ మేజర్ పై పడింది. అప్పుడు ఆయన కాశ్మీరీ రాళ్లు రువ్వే యువత బారి నుంచీ వాళ్లలో ఒకర్నే జీపుకి కట్టేసి దాడి నివారించాడు. పోలింగ్ సిబ్బందిని క్షేమంగా బయటకు తీసుకొచ్చాడు. ఇలాంటి కారణంగా సదరు సంఘటన వెనుక వుంది కాబట్టే భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ … మేజర్ గొగోయ్ ని ప్రశంసా పత్రంతో సత్కరించారు!   మోదీ ఏరికోరి ఆర్మీ చీఫ్ గా నియమించిన బిపిన్ రావత్ నిశ్శబ్ధంగా భారత సైన్యాన్ని సమూలంగా మార్చేసే చర్యలు చేపడుతున్నారు. అందులో మొదటిది కాశ్మీరీని జీపుకి కట్టేసిన మేజర్ కి అవార్డ్ ఇవ్వటం! మామూలుగా అయితే అలాంటి సాహసం చేసిన ఆర్మీ అధికారిని భారత సైన్యం శాఖా పరమైన చర్యలకి గురి చేస్తుంది. ఎందుకంటే, మానవ హక్కుల ఉల్లంఘన అంటూ అంతెత్తున లేచి ఆర్మీ ప్రత్యేక అధికారాలు తొలంగించాలంటూ సెలవిచ్చే వారికి కేంద్ర ప్రభుత్వం బయపడుతుంది కాబట్టి! ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మోదీ సర్కార్ ఆర్మీ చీఫ్ కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టే కనిపిస్తోంది   ఇక ఇండియాన్ ఆర్మీ చీఫ్ ఈ మధ్య కాలంలో తీసుకున్న మరో నిర్ణయం సైన్యానికి, సర్కార్ కి మధ్య వుండే పేమెంట్ గొడవలకు స్వస్తి పలకటం! గతంలో ఎప్పుడు చూసినా ఆర్మీ అధికారులు, భారత ప్రభుత్వ అధికారులకి మధ్య ఆర్దిక విషయాల్లో అభిప్రాయ భేదాలు వుండేవి. ఆర్మీ అధికారుల్లో తమకు రావాల్సిన జీతాభత్యాల గురించి అసంతృప్తి వుండేది. బిపిన్ రావత్ తన అధికారులు కొందరు ఒప్పుకోకున్నా ప్రభుత్వంతో ఒక ఒప్పందానికి వచ్చేశారు. దాని ప్రకారం ఇకపైన సైన్యం మొత్తానికి కొత్తగా నిర్ణయించిన జీతాలు చేతికందనున్నాయి. ఇది కుటుంబాలకు దూరంగా దేశం కోసం పని చేసే ఆర్మీ వారికి ఎంతో మేలు చేసే అంశం…   మన ఆర్మీ బాస్ తీసుకున్న మరో మంచి నిర్ణయం … యుద్ధం చేయటంలో ఎంతో శిక్షణ పొందిన జవాన్లని సహాయకులుగా వాడటాన్ని నివారించటం. గన్నులు పట్టుకుని దేశ సేవ చేయాల్సిన సిబ్బందిని అధికారుల ఇళ్లలో వివిధ సేవలకి వినియోగించుకోవటం ఎప్పట్నుంచో వస్తోంది.  ఆ పద్ధతికి బదులుగా బిపిన్ రావత్ కొంత మంది సాధారణ పౌరుల్ని సహాయకులుగా నియమించాలని నిర్ణయించారు. అప్పుడు కఠినమైన ట్రైనింగ్ తీసుకున్న సోల్జర్స్ యుద్ధానికి సిద్ధంగా వుండగలుగుతారు!    నెల నెలకి, వారం వారానికి పాక్ ఆగడాలు మితిమీరుతున్న వేళ సైన్యానికి నైతిక, ఆర్దిక స్థైర్యం కలిగించే చర్యలు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేపట్టడం నిజంగా అభినందనీయం. సంతోకరం.

నా కూతురూ కాదు... ఆమె పెళ్లమూ కాదు... సాయిశ్రీ కేసులో కొత్త మలుపు

  నాన్నా బతికించు అంటూ సెల్ఫీ వీడియోతో అందరి చేత కన్నీళ్లు పెట్టించి... ప్రాణాలొదిలిన విజయవాడ చిన్నారి సాయిశ్రీ కేసు కొత్త మలుపు తిరిగింది. సాయిశ్రీ, ఆమె తల్లి సుమశ్రీ ఎన్ని ఆరోపణలు చేసినా స్పందించని మాదంశెట్టి శివకుమార్‌ మీడియాకి సుదీర్ఘమైన లేఖ రాశాడు. సాయిశ్రీ, సుమశ్రీలతో తనకెలాంటి సంబంధం లేదని ట్విస్ట్‌ ఇచ్చాడు. సాయిశ్రీ అసలు తన కుమార్తే కాదన్నాడు. సుమశ్రీ కూడా తన భార్య కాదంటూ కొత్త బాంబు పేల్చాడు. పోలిన కృష్ణకుమార్‌‌కు సుమశ్రీ మూడో భార్య అన్న మాదంశెట్టి శివకుమార్‌.... సాయిశ్రీ అనారోగ్యంతో చనిపోలేదని, చంపేశారంటూ సంచలన ఆరోపణలు చేశాడు. సుమశ్రీ, మరికొందరు కలిసి సాయిశ్రీని చంపేశారని, దీనికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నాడు. సాయిశ్రీ మరణంపై మానవ హక్కుల కమిషన్‌ను కలుస్తానన్న శివకుమార్‌.... హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు తెలిపాడు.   సాయిశ్రీతో కలిసి సుమశ్రీ కొంతకాలం క్రితం తన ఫ్లాట్‌లో అద్దెకు దిగిందని, ఆ తర్వాత 8లక్షల విలువైన బంగారు ఆభరణాలను దొంగిలించి హైదరాబాద్‌లోని కృష్ణకుమార్‌ వద్దకు పారిపోయిందని శివకుమార్‌ ఆరోపించాడు. దీనిపై పామర్రు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశానన్నాడు. సుమశ్రీ, సాయిశ్రీతో తనకు ఎలాంటి సంబంధం లేదన్న శివకుమార్‌.... కేవలం మానవతా దృక్పథంతోనే పాపను పెంచానని, సాయిశ్రీ వైద్యానికి సుమారు పాతిక లక్షల రూపాయలు ఖర్చు చేశానన్నారు. అయితే తన ఫ్లాట్‌లో మరో మహిళతో కలిసి సుమశ్రీ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిందని‌.... దీనిపై చుట్టుపక్కలవారు ఎన్నోసార్లు పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కి ఫిర్యాదు కూడా చేశారన్నాడు.   నాన్నా బతికించు అంటూ సెల్ఫీ వీడియోతో అందరి చేత కన్నీళ్లు పెట్టించి.... మరణించిన సాయిశ్రీ తీవ్ర కలకలం రేపితే.... ఇప్పుడు మాదంశెట్టి శివకుమార్ ఆరోపణలు మరింత సంచలనం రేపుతున్నాయి. అయితే మానవతా దృక్పథంతోనే వైద్యం చేయించానంటున్న మాదంశెట్టి శివకుమార్‌... సాయిశ్రీ తనకు ఏమీ కాకపోతే పాతిక లక్షలు ఎలా ఖర్చు పెడతారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి సాయిశ్రీ తన బిడ్డే కాదంటూ కేసును కొత్త మలుపు తిప్పాడు శివకుమార్‌. మరి ముందుముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.... ఇంకెన్ని సీక్రెట్లు బయటికొస్తాయో చూడాలి.

సర్వేలను నమ్ముకుంటే జగన్‌‌కు ఎదురైన పరిస్థితే... ట్రంప్‌లాగా ఎందుకు జరగదు?

  2019లో అధికారం ఎవరిదన్న దానిపై కేసీఆర్‌, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీఆర్ఎస్‌ సర్వే బోగసన్న కాంగ్రెస్‌, బీజేపీ నేతలపై కేసీఆర్‌ విరుచుకుపడుతున్నారు. టీఆర్‌ఎస్‌కు 111 సీట్లు వస్తాయని సర్వేలో తేలడంతో విపక్షాలకు బుర్ర పాడైందంటూ తన స్టైల్లో సెటైర్లు పేల్చారు. టీఆర్‌ఎస్‌ దెబ్బకు తెలంగాణలో అడ్రస్‌ లేని కాంగ్రెస్‌... కేడర్‌ లేని బీజేపీ కకావికలం అవుతున్నాయన్నారు.  తమను రాజీనామాలు కోరే హక్కు ఎవరికీ లేదన్న కేసీఆర్‌.... కాంగ్రెస్‌ లీడర్లకు అంత ధీమా ఉంటే.... రిజైన్లు చేసి ఎన్నికలకు వెళ్లాలంటూ సవాల్‌ విసిరారు. అంత  పౌరుషం దమ్మూ ఉంటే రాజీనామా చేసి రండి.... ఆ సీట్లలో ఎవరు గెలుస్తారో చూద్దామంటూ కేసీఆర్ రివర్స్‌ కౌంటర్‌ ఇచ్చారు.   తెలంగాణ బీజేపీ నేతలపైనా కేసీఆర్‌ ఒంటి కాలిపై లేచారు. తమ సర్వే బోగస్‌ అంటున్న బీజేపీ లీడర్ల మైండే పెద్ద బోగస్‌ అంటూ ఫైరయ్యారు. సర్వేలపై నమ్మకం లేదంటున్న బీజేపీ నేతలు... సర్వేల్లో మోడీ గ్రాఫ్‌ పెరిగిందంటూ ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఒక్క సీటూ రాని బీజేపీకి... వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తుందంటూ కేసీఆర్‌ ప్రశ్నించారు.   అయితే కేసీఆర్‌ సర్వేలపై సీఎల్పీ లీడర్‌, ప్రతిపక్ష నేత జానారెడ్డి మండిపడ్డారు. ప్రజలు, రైతుల సమస్యలు పరిష్కరించకుండా... రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికలపై కేసీఆర్‌‌కి అప్పుడే తొందరెందుకంటూ చురకలంటించారు. తనకు సర్వేలపై నమ్మకం లేదన్న జానా... 2019లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం మాత్రం ఖాయమన్నారు. అమెరికాలో ట్రంప్‌ గెలిచినట్లుగా.... ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్‌ పవర్‌లోకి వస్తుందన్నారు. మొత్తానికి రెండేళ్ల ముందే తెలంగాణలో ఎన్నికల వేడి రగిలింది. అయితే కేసీఆర్‌ చెబుతున్నట్లుగా టీఆర్‌ఎస్‌కి 111 సీట్లు వస్తాయనడం మాత్రం నమ్మశక్యంగా లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సర్వేలను నమ్ముకుంటే జగన్‌‌కు ఎదురైన పరిస్థితే ఎదురవుతుందని హెచ్చరిస్తున్నారు.

చెమటలు పట్టిస్తున్న చంద్రబాబు...

  తండ్రి ముఖ్యమంత్రి... కొడుకు మంత్రి... ఇద్దరి మధ్యా 30ఏళ్లపైనే ఏజ్‌ గ్యాప్‌. ఒకరు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు... మరొకరు ఆయన తనయుడు నారా లోకేష్‌... చంద్రబాబు వయసు ప్రస్తుతం 67 సంవత్సరాలు... లోకేష్‌ ఏజ్‌ సుమారు 34ఏళ్లు... కానీ ఇద్దరి పనితీరులో భారీ వ్యత్యాసం. 67ఏళ్ల వయసులోనూ చంద్రబాబు.... నవ యువకుడిలా పరిగెడుతుంటే... ఆయన తనయుడు లోకేష్‌ మాత్రం తండ్రి వేగాన్ని అందుకోలేక ఆపసోపాలు పడుతున్నారు. ఇది ఎవరో ప్రత్యర్ధులు అన్న మాట కాదు... స్వయంగా నారా లోకేషే ఒప్పుకున్న నిజం...   మహానాడు వేదికగా చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసిన లోకేష్‌... ఆయనతో పోటీ పడటం తన వల్ల కాదంటూ చేతులెత్తేశారు. నవ యువకులకు కూడా అసూయ పుట్టేలా ఆయన కష్టపడతారని పొగడ్తలతో ముంచెత్తారు. యువకుడినైనా తానే...ఆయనతో పోటీ పడలేకపోతున్నాని చెప్పారు. చంద్రబాబు వేగాన్ని అందుకోవడానికి తామంతా ఆపసోపాలు పడుతున్నామన్నారు. 67ఏళ్ల వయసులోనూ రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని, తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల కోసమే ఆలోచిస్తున్నారని లోకేష్‌ అన్నారు. ఆర్ధిక కష్టాలతో సతమతమవుతున్న రాష్ట్రాన్ని పైకి తెచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారని తండ్రిపై... లోకేష్‌ ప్రశంసలు వర్షం కురిపించారు.   లోకేష్‌ వ్యాఖ‌్యలు కొంత ఆశ్చర్యం కలిగించినా... ప్రస్తుత ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు ఉన్నంత యాక్టివ్‌గా మరొకరు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే 67ఏళ్ల ఏజ్‌లో కూడా ఆయన పాతికేళ్ల యువకుడిలా పరిగెడుతున్నారు. ఆయన తన శరీరాన్ని అదుపులో పెట్టుకున్న తీరు... అందరికీ ఆదర్శమే. అంతేకాదు రాజకీయాల్లో ఎనర్జిటిక్ లీడర్లనే జనం లైక్‌ చేస్తారు. బాహుబలిలా ఉండకపోయినా ఫర్లేదు కానీ... చురుగ్గా లేకపోతే మాత్రం అస్సలు ఇష్టపడరు. అందుకే చంద్రబాబు వయసు మీదకొచ్చేకొద్దీ మరింత జాగ్రత్తలు తీసుకుంటూ తన పనితీరుతో యువతకే చెమటలు పట్టిస్తున్నారు. అందుకు లోకేష్‌ వ్యాఖ‌్యలే రుజువు. మరి మీరేమంటారు?

ఆ ‘రెండే’ వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అధికారం నిలబెట్టేవి

  మహానాడు ముగిసింది. తెలుగు దేశం పార్టీ మహా సంబరం కూడా అయిపోయింది. యధావిధిగా ఘుమఘుమలాడే వంటకాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. కాని, అదే రేంజ్లో ఘాటైన రాజకీయ ఉపన్యాసాలు చెవిన పడలేదని కొందరు బాధపడ్డారు. అయితే, టీడీపీ అభిమానులు మాత్రం మహానాడు ఘనంగా ముగియటంతో హ్యాపీగా ఫీలయ్యారనే చెప్పాలి. కాకపోతే, అధికారంలోకి వచ్చిన మూడో ఏడు నడుస్తున్న ఈ కీలక సమయంలో జరిగిన మహానాడు సారాంశం ఏంటి?   మహానాడులో బోలెడు మాటలు, ఇంకా చాలా తీర్మానాలు వినిపించి వుండవచ్చు. కాని, మొత్తం సంబరం అంతా ఒక్క వాఖ్యంలో మాట్లాడేసుకోవాలంటే… అది చంద్రబాబు చెప్పిన ‘’ అమరావతి, పోలవరం … రెండు నాకు రెండు కళ్లు! ‘’ అన్నది. ఈ ఒక్క స్టేట్మెంట్ వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశానికి మళ్లీ అధికారం ఎలా వస్తుందో చెప్పగలదు. అదే సమయంలో ఏ అంశాలు నిర్లక్ష్యం చేస్తే జనం మనసులో మార్పు ఆలోచన చోటు చేసుకుంటుందో ఆ రహస్యం కూడా అందులోనే దాగుంది!   నవ్యాంధ్రగా ఏర్పడ్డ ఏపీ ఇప్పుడు అస్థిత్వ పోరాటంలో వుంది. అసెంబ్లీ, సెక్రటేరియట్ కూడా లేని స్థితిలో సరికొత్త ప్రస్థానం మొదలు పెట్టాల్సి వచ్చింది. అందుకు కారణమైన జాతీయ కాంగ్రెస్ ను ఆంధ్రా ప్రజలు సున్నా సీట్లతో కోలుకోలేని విధంగా శిక్షించారు. అదే సమయంలో నవ్యాంధ్రకు నవ్యమైన ఆత్మవిశ్వాసం కలిగించే గొప్ప బాధ్యత కూడా అనుభవం, దూరదృష్టీ వున్న చంద్రబాబుపై పెట్టారు. జగన్ని కాదని అధికారం ఇచ్చారు. అందుకే, అమరావతి తన రెండు ప్రాధాన్యాల్లో ఒకటని చెప్పారు బాబు. అయితే, కేవలం ఒక రాజధాని నిర్మాణం మాత్రమే అమరావతి అనిపించుకోదు. అమరావతి రూపంలో ఆంధ్రులకి ఎంతో అవసరమైన అవకాశల వెల్లువ మొదలవ్వాలి. అదంత తేలికైన విషయం కాకున్నా పని చేసే సత్తా వున్న ప్రతీవారికీ ఉద్యగం ఇప్పించగలగటమే  సీఎంకు అతి పెద్ద సవాల్! ఆ ఛాలెంజ్ కాని సమర్థంగా ఎదుర్కొంటే రానున్న ఎన్నికలు నల్లేరు పై నడకే!   చదువుకున్న యువత ఉద్యోగం కోరితే రైతులు కన్నీరు తుడిచే సాగునీరు కోరతారు. అందుకే, చంద్రబాబు పోలవరం కూడా ప్రస్తావించారు. ఒక్క పోలవరం పూర్తైతే యావత్ ఆంధ్ర రాష్టం స్థితి, గతే మారుతుంది. ఇది అందరూ ఒప్పుకునేదే. సాగునీరు, తాగు నీరు రెండూ జనానికి అంది సస్యశ్యామలం అవుతుంది తెలుగు నేల. కరువు రహిత రాష్ట్రం కూడా అవుతుంది. కాని, పోలవరం పూర్తి అసాధ్యం కాకపోయినా అసాధారణ విషయమే. చంద్రబాబు ఎంతో పట్టుదలతో భగరీథ ప్రయత్నం చేస్తే తప్ప అది సాకారం కాదు. కాని, ఒక్కసారి పోలవరం పూర్తి అయితే మాత్రం అది టీడీపీకి ఖచ్చితంగా పెద్ద వరమే అవుతుంది!   సీఎం చంద్రబాబు మహానాడులో చెప్పినట్టు వచ్చే ఎన్నికల లోపు అమరావతి, పోలవరం ఎంత వరకూ సాకారం అవుతాయో తెలియదుగాని … ఆయన కార్యదక్షతతో వాటిని నిర్మిస్తే మాత్రం సరికొత్త ఆంధ్ర రాష్ట్రం నిర్మాణం జరిగినట్టే! అలాగే, తెలుగు దేశం కూడా మరిన్నేళ్లు తెలుగు దేశానిదే!    

ఫేస్‌బుక్ ఫ్రెండ్ కోసం..తల్లిదండ్రుల ఏకాంతాన్ని వీడియో తీశాడు

సైబర్ నేరగాళ్లు అమాయకులను బుక్ చేయడానికి చాలా రకాల మార్గాలు వాడతారు వాటిలో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది ఫేస్‌బుక్. ఇప్పటి వరకు కేటుగాళ్ల మాయలో చిక్కుకుని ఎంతోమంది ధన, మాన, ప్రాణాలను పొగొట్టుకున్నారు. వారు ఎలాగో పోతారు...కాని వారి వల్ల కుటుంబం మొత్తం చిక్కుల్లో పడితే..అచ్చం ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఫేస్‌బుక్‌కు బానిసగా మారిన ఓ 13 ఏళ్ల కుర్రాడు తన ఫేస్‌బుక్ ఫ్రెండ్ కోసం ఏకంగా తన తల్లిదండ్రులు ఏకాంతంగా ఉన్న వీడియోని తీసి అతనికి పంపాడు. అయితే అవతలి వ్యక్తి బ్లాక్ మెయిలర్‌గా మారడంతో ఆ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.   అసలు వివరాల్లోకి వెళితే బెంగళూరులోని హీరోహళ్లి-ఆంధ్రాహళ్లి రోడ్‌లో నివాసిస్తున్న 13 ఏళ్ల బాలుడు గతేడాది ఫేస్‌బుక్ అకౌంట్ తెరిచాడు. ఈ క్రమంలో తేజల్ పటేల్ అనే వ్యక్తి నుంచి బాలుడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగా, అతడు దానిని వెంటనే యాక్సెప్ట్ చేశాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య చాటింగ్ కొనసాగింది. బాలుడికి అభ్యంతరకర ఫోటోలు పంపడం మొదలెట్టిన తేజల్ పటేల్ చిన్నారిని చైల్డ్ పోర్నగ్రఫీకి అలవాడు చేశాడు. ఆ తర్వాత బాలుడిని మీ పేరేంట్స్ న్యూడ్ ఫోటోలు పంపాల్సిందిగా కోరాడు. అతడి కోరిక కాదనలేకపోయిన చిన్నారి తల్లిదండ్రులు ఏకాంతంగా ఉన్నప్పుడు రహస్యంగా వీడియో తీసి దానిని తేజల్ పటేల్‌కు పంపాడు.   వాటిని అందుకున్న అతను ఇక తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. తనకు కోటి రూపాయలు ఇవ్వకుంటే ఆ వీడియోని అడల్ట్ వెబ్‌సైట్‌లో పెడతానని బెదిరించాడు. దీనికి భయపడిన బాలుడు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వారు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ప్రస్తుతం అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తతతో ఉండాలంటున్నారు పోలీసులు..పిల్లలు గంటల తరబడి కంప్యూటర్ల ముందు గడపకుండా కాస్ల ఓ కన్నేసి ఉంచాలంటూ తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. లేదంటే మీ పిల్లలు చేసిన తప్పు వల్ల మొత్తం కుటుంబమే చిక్కుల్లో పడే అవకాశం ఉందంటున్నారు. సో బీ అలర్ట్.

సినిమా చూపిస్తాననీ..బాలికపై స్నేహితులతో కలిసి గ్యాంగ్‌రేప్

సినిమా చూపిస్తాననీ మాయ మాటలు చెప్పి విద్యార్ధినిపై స్నేహితులతో గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డాడు ఓ కామాంధుడు. అసలు వివరాల్లోకి వెళితే బెంగళూరు నగరంలోని పిణ్యా ఇండస్ట్రియల్ ఏరియాలో నివాసం ఉంటున్న ఓ యువకుడికి అదే ప్రాంతంలో నివసిస్తున్న 14 ఏళ్ల బాలికతో స్నేహం పెంచుకున్నాడు. ప్రతీ రోజు ఏదో ఒక వంకతో బాలికతో మాటలు కలపడంతో వారి మధ్య పరిచయం బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో గత ఆదివారం సినిమాకు వెళదామని చెప్పి బాలికను తీసుకెళ్లాడు. ఇద్దరూ సినిమా చూసిన అనంతరం బయటకు వచ్చారు. అనంతరం పిణ్యాలో నిర్మాణంలో ఉన్న భవనంలోకి బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.   అంతటితో ఆగకుండా స్నేహితులకు ఫోన్ చేసి అక్కడికి పిలిపించాడు. మళ్లీ స్నేహితులతో కలిసి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. రాత్రి వరకు అదే భవనంలో బాలికను నిర్బంధించిన ఆ కామాంధులు తమ లైంగిక వాంఛ తీర్చుకున్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి ఆమెను అక్కడే వదిలి పారిపోయారు. ఇంటికి వెళ్లడానికి భయపడిని బాలిక తన స్నేహితురాలి ఇంట్లో తలదాచుకుంది. ఐదు రోజులైనా తమ కుమార్తె ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పిణ్యా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలిక ఆచూకీని కనుగొన్నారు. అనంతరం జరిగిన దారుణాన్ని పోలీసులకు, తల్లిదండ్రులకు చెప్పింది. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని అదుపులోకి తీసుకోగా, వారిలో ఇద్దరు మైనర్లు.

గన్నులు పట్టే ఉగ్రవాదులు… వారికండగా రాళ్లు రువ్వే ఉగ్రవాదులు!

కాశ్మీర్ కి మంచి కాలం ఇప్పుడప్పుడే వచ్చేలా లేదు! సంవత్సర కాలంగా రాళ్ల వర్షం కురుస్తోంది. అందుకు సమాధానంగా భారత ఆర్మీ, జమ్మూ , కాశ్మీర్ పోలీసులు కూడా గట్టిగా స్పందిస్తున్నారు. అయితే, తాజాగా మరో ఎన్ కౌంటర్ మరోసారి రాళ్లు రువ్వే వేర్పాటవాద ఉన్మాద మూకలకి పని కల్పించింది. ఆర్మీ, పోలీసులు టార్గెట్ గా వేలాది రాళ్లు గాల్లోకి ఎగురుతున్నాయి…   సంవత్సరం క్రితం బుర్హాన్ వనీ అనే హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ కమాండర్ కాశ్మీర్లో ఎన్ కౌంటర్ అయ్యాడు. అప్పట్నుంచీ పాకిస్తాన్ పంపే డబ్బులు తీసుకుంటున్న కాశ్మీరీ అల్లరి మూకలు రాళ్లు రువ్వే దుర్మార్గానికి తెగబడుతున్నాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎంతగా నియంత్రించే చర్యలు చేపట్టినా ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేసే దేశ ద్రోహులు బుద్ది మార్చుకోవటం లేదు. తాజాగా మరో ఎన్ కౌంటర్లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకే చెందిన సబ్జార్ అహ్మాద్ అనే టెర్రరిస్ట్ హతమయ్యాడు. అతను బుర్హాన్ వనీకి వారసుడుగా, హిజ్బుల్ కమాండర్ గా కొనసాగుతున్నాడు! ఇక సంవత్సరం కాలంగా ఏ బుర్హాన్ కోసమైతే రాళ్లు రువ్వారో వారంతా ఇప్పుడు అహ్మద్ కోసం అరాచకానికి తెగబడుతున్నారు. ఒకవైపు పుల్వామా జిల్లాలో ఎన్ కౌంటర్ జరుగుతుండగానే మరో వైపు అల్లరి మూకలు ఫేస్బుక్, వాట్సప్ లాంటి సోషల్ మీడియా వ్యవస్థల ద్వారా సమాచారం పంచుకుని రోడ్లపైకి వచ్చి దాడులు మొదలుపెట్టాయి. అందుకే, నెల తరువాత ఇంటర్నెట్ సేవలకు అనుమతించిన రాష్ట ప్రభుత్వం పన్నెండు గంటలు కూడా గడవక ముందే వాట్ని మళ్లీ నిషేధించింది!   వేర్పాటువాదులు, అల్లరి మూకలు, అరాచక యువత , విద్యార్థుల వల్ల సామాన్య కాశ్మీరీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతోంది. ఇంటర్నెట్ లాంటివి కూడా లేక బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. ఇంత జరుగుతున్నా ఆర్మీ, పోలీసులు పూర్తి స్థాయిలో తమ సత్తా చాటి అరాచవాదుల్ని అణచివేయటం లేదు. ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవటం, కోర్టులు రాళ్లు రువ్వే వారిపై కాల్పులు జరపవద్దని చెప్పటం, మానవ హక్కుల సంఘాలు, మీడియా నిరంతర నిఘా భద్రతా దళాల్ని ఏం చేయలేని స్థితిలోకి నెట్టేస్తున్నాయి. ప్రధాని మోదీ ఈ స్థితిపై ప్రత్యేక దృష్టి పెట్టి శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిన అవసరం వుంది. పాకిస్తాన్ కంటే ఈ రాళ్లు రువ్వే అంతర్గత శత్రువులే కాశ్మీర్ పాలిట పెద్ద విలన్లుగా మారిపోతున్నారు…

షా వలసల అస్త్రం… కేసీఆర్ ఆకర్ష్ దివ్యాస్త్రం!

తెలంగాణ రాజకీయం వలసల సెగలతో సలసల కాగిపోనుందా? అవుననే అంటున్నారు రాజకీయ పండితులు! ఎందుకూ అంటే… 2014 ఎన్నికల ముందు వరకూ సమైక్య రాష్ట్రంలో కాంగ్రస్, టీడీపీలే ప్రధాన పార్టీలు. తరువాత వచ్చిన వైసీపీ బలమైన శక్తిగా ఎదిగింది. కాని, ఆ పార్టీ కూడా పూర్తి స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల్ని తొలిసారి ఎదుర్కొంది 2014లోనే! అప్పుడు టీడీపీతో పోటీపడి ఆంధ్రాలో ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. ఇటు తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, టీడీపీ, బీజేపి లాంటి సీనియర్ పార్టీల కంటే టీఆర్ఎస్ టీ సెంటిమెంట్ తో బలంగా దూసుకుపోయింది. ప్రత్యేక రాష్ట్రపు తొలి గులాబీ సర్కార్ ఏర్పాటు చేసింది! కాని, కేసీఆర్ సీఎం అయ్యాక వలసల విషయంలో కొత్త ఊపు తీసుకొచ్చారు!   ఒక దశలో టీఆర్ఎస్ అస్థిత్వాన్నే ప్రశ్నించేలా ఎమ్మెల్యేల్ని చీల్చి వైఎస్ రాజకీయం చేశారు. సరిగ్గా అదే ఆయుధం ఉపయోగించి కేసీఆర్ తెలంగాణ ఏర్పడ్డాక టీ కాంగ్, టీ టీడీపీలకు చుక్కలు చూపించారు! వారానికో ఎమ్మేల్నో, సీనియర్ నేతనో గులాబీ వనంలోకి లాక్కుంటూ తెలుగు దేశానికి, కాంగ్రెస్ కి మనః శాంతి లేకుండా చేశారు. చివరకు, టీ టీడీపీ తెలంగాణలో నామ మాత్రంగా మిగిలిపోయింది. కాంగ్రెస్ కు చావు తప్పి కన్ను లొట్టపోయింది!   తెలంగాణలో కేసీఆర్ తన మిషన్ ఆకర్ష్ మొదటి దశ జరిపినప్పుడు చెక్కుచెదరకుండా వుండగలిగింది బీజేపి మాత్రమే! ఆ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేల్ని లాక్కోవలని ప్రయత్నించారో లేదో గాని… వున్న ఐదుగురు మాత్రం కాషాయదళంలోనే కంటిన్యూ అవుతున్నారు. కాని, తాజాగా అమిత్ షా టీ టూర్ చేసి వెళ్లటంతో బీజేపి అన్ని పార్టీల వారికి వెల్ కమ్ చెప్పే ప్లాన్ లో వుందని వార్తలోచ్చాయి. ఇంకా ఎవరూ కండువాలు కప్పుకోలేదు కాని… కాంగ్రెస్, టీఆర్ఎస్ లకు ఎంతో కొంత టెన్షన్ అయితే ప్రారంభమైంది. అధికారంలో వున్న కార్ ను వదిలి పెద్దగా నాయకులు వెళ్లరనే భావించినా దిల్లీలో అధికారంలో వున్న  బీజేపి అసంతృప్తుల్ని ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు. అందుకే, కేసీఆర్ ఇక రెండో దఫా ఆకర్ష్ కి రెడీ అవుతున్నారని మీడియాలో టాక్!   బీజేపి వారు టీఆర్ఎస్ , కాంగ్రెస్ నాయకులకి, అలాగే కాంగ్రెస్ వారు టీఆర్ఎస్ లోని అసంతృప్తులకి గాలం వేసేలోపే గులాబీ బాస్ ఇంకో సారి వలసల దండయాత్ర చేయనున్నారట. ఆదిలాబాద్ లోని టీ టీడీపీ సీనియర్ నాయకుడు, గిరిజన నేత రమేష్ రాథోడ్ వికెట్ త్వరలోనే పడనుందంటున్నారు. ఆయన సైకిల్ దిగి కార్ ఎక్కేస్తారట. రానున్న నెలల్లో ఇలా ఇంకా చాలా మందే టీడీపీ, కాంగ్రెస్ నుంచి గులాబీ వైపు వెళ్లవచ్చట! ఈ వలసల వల్ల వచ్చే ఎన్నికల్లో విజయావకాశాలు ఎలా వుండబోతున్నాయో మనకు తెలియదుగాని… కేసీఆర్ కి, టీఆర్ఎస్ కి బీజేపి గండం మత్రం 2019ఎన్నిలైపోయేదాకా కొనసాగే సూచనలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే, అమిత్ షా కూడా కేసీఆర్ ప్రయోగిస్తున్న వలసల అస్త్రాన్నే తెలంగాణ రాజకీయాలపై ప్రయోగించనున్నారు! కాబట్టి ఐపీఎల్ ఆటగాళ్ల వేలం తరహాలో హాడావిడి తప్పదు…

నాడు, నేడు, మహానాడు…

  మరో సంవత్సరం గడిచింది. మరో మహానాడు కోలాహలం మొదలైంది. ఈసారి విశాఖ తీరం పసుపు రంగు కలయికతో మనోహరంగా మారింది. అయితే, ఇలా మహానాడు ప్రతియేటా జరిగేదే. వైజాగ్ లోనూ మహానాడు జరగటం ఇది మూడోసారి. కాని, సంవత్సరానికి ఒకసారి జరిగే టీడీపీ వార్షికోత్సవాల లాంటి మహానాడు సంబరాలు… ఊరికే మీడియాలో చూపించినట్టు ఉపన్యాసాలు, రకరకాల వంటకాలు, విందులు, వినోదాలు, ఏవో ఒకట్రెండు రాజకీయ అలజడులు మాత్రమే కాదు! మహానాడు అంటే ఇందిరా హయాంలోని ఇనుమడిస్తున్న కాంగ్రెస్ ను ఓడించి నిలిచిన ఒక పసుపు పచ్చ ఆత్మ గౌరవ పతాకానికి నిదర్శనం! తెలుగు జాతి ఆధునిక చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం!   అన్న ఎన్టీఆర్ దిల్లీ వీధుల్లో ఆంధ్రుల ఆత్మగౌరవం అంటూ ఆవేదన చెంది రాజేసిన నిప్పు కణం తెలుగుదేశం పార్టీ. అది ఇవాళ్ల , ఒక విధంగా జాతీయ పార్టీగా అవతరించగలిగింది. తెలంగాణలో విపక్షంగా, నవ్యాంధ్రలో పాలక పక్షంగా, రెండు రాష్ట్రాల్లోనూ ప్రజా పక్షంగా అస్థిత్వం కొనసాగిస్తోంది. ఏ మహానాడుకైనా ఇదే అసలు సగర్వ కారణంగా చెప్పుకోవాలి. ఎందుకంటే, చరిత్రలో ఎన్నో పార్టీలు కాంగ్రెస్ పై పోరుకి సై అంటూ బరిలోకి దిగాయి. అంతే త్వరగా హస్తం చరుపులకి నేలకూలిపోయాయి. కాని, ఎన్టీఆర్ భగ్గున వెలిగించిన తెలుగు దేశం ఇవాళ్టికీ దిల్లీ కాంగ్రెస్ పెద్దల అహాన్ని సవాలు చేస్తూ దూసుకుపోతుంది. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే రెండూ కలిసి జాతీయ కాంగ్రెస్ ను కట్టడి చేస్తే మన దగ్గర టీడీపీ ఒక్క పార్టీనే సింగిల్ హ్యాండ్ గా వందేళ్ల పార్టీని ఢీకొట్టింది!   సమైక్య రాష్ట్రంలో అధికారంలో వున్నా లేకపోయినా చాలా మహానాడు సంబరాలు హైద్రాబాద్ లోనే జరిగాయి. ఈ సారి అలాకాక టీడీపీ చేతిలో వున్న నవ్యాంధ్రలో… రాజధాని అమరావతిలో కాకుండా విశాఖలో జరుగుతున్నాయి. ఇలా వేరు వేరు నగరాల్లో మహానాడు ఏటేటా జరపటం పార్టీని కార్యకర్తలకి మరింత దగ్గర చేసే అవకాశం వుంటుంది. అయితే, అంతకంటే ముఖ్యంగా, తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా అవతరించిన ఈ చారిత్రక సందర్భరంలో మహానాడు మేధోమథనంలో టీడీపీ నేతలు చేయాల్సిన మరో ముఖ్యమైన పని కూడా వుంది. ఆంధ్రలో తెలుగు దేశం సత్తా చాటింది. చంద్రబాబు భాషలో చెప్పాలంటే తల్లి కాంగ్రెస్ , పిల్ల కాంగ్రెస్ లను అధిగమించి అధికారం చేపట్టింది. కాని, సమస్యల్లా టీఆర్ఎస్ ఈదురు గాలికి వణికిపోతోన్న టీ టీడీపీతోనే!   విశాఖలో జరుగుతోన్న మహానాడుకి రెండు రైళ్లలో తెలంగాణ టీడీపీ కార్యకర్తలు తరలి వచ్చారట. అలాంటి వేలాది సైకిల్ సైనికుల కోసమైనా చంద్రబాబు టీ టీడీపీపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. టీ కాంగ్, టీఆర్ఎస్ ఆక్రమించిన తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని టీడీపీ మరోసారి మార్చాలి. బీజేపితో కలిసిగాని… స్వంతంగా కాని… తెలంగాణలో మరోసారి పచ్చ జెండా రెపరెపలాడించాలి. ఇది కేవలం పార్టీకి, కార్యకర్తలకి మాత్రమే కాదు జనానికి కూడా ఎంతో మేలు చేసే పరిణామం. అందుకే, ఈ మధ్య తెలంగాణ మహానాడులో బాబు చెప్పినట్టు టీ టీడీపీపై ప్రత్యేక దృష్టి పెట్టి పునాదులు నిలుపుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే జాతీయ పార్టీగా వెలుగొందే అవకాశం తెలుగుదేశానికి , పేరుకు తగ్గట్టుగా వుంటుంది.

ఓటమి తప్పని యుద్ధానికి సిద్ధమవుతోన్న సోనియా!

  ఇప్పుడు దేశంలో అందరికీ ఆసక్తి కలిగిస్తోన్న అంశం… నెక్ట్స్ ప్రెసిడెంట్ ఎవరు? అద్వానీ నుంచీ రజినీకాంత్ దాకా చాలా మంది పేర్లే వినిపించాయి. అయితే, అటు అద్వానీ కాని… ఇటు రజినీకాంత్ కాని రాష్ట్రపతి అవ్వకపోవచ్చని ఆల్రెడీ సంకేతాలు వచ్చేస్తున్నాయి. అద్వానీ మీద కోర్టు విచారణ రాష్ట్రపతి ఎన్నికల కంటే వేగంగా దూసుకొస్తోంది. ఇటు రజినీకాంత్ తన స్వంత పార్టీ పెట్టి తమిళనాడు సీఎం అవ్వాలని ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది! మరి తరువాతి రాష్ట్రపతి ఎవరు?   ప్రణబ్ తరువాత రాష్ట్రపతి భవన్ ఎవరిదో తెలియదుగాని… ప్రణబ్ మాత్రం ఇక సెలవు అంటున్నారు దిల్లీకి! మరో రెండు నెలల్లో తన పదవీ కాలం ముగుస్తుంది కాబట్టి తనతో పని చేస్తోన్న అధికారుల్ని వారి వారి మంత్రిత్వ శాఖలకి తిప్పి పంపేస్తున్నాని ఆయన చెప్పారు. అంటే అర్థం ప్రణబ్ దా ఇక నేరుగా కోల్ కతా ఫ్లైట్ ఎక్కేస్తారనే! ఆయన ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూల్లో శేష జీవితం స్వరాష్ట్రంలో గడుపుతానని అన్నారు!   ప్రణబ్ తనకు రెండోసారి రాష్ట్రపతి రేసులో వుండే ఉద్దేశం లేదని చెప్పటానికి కారణం పదవి మీద ఇష్టం లేక కాదు. ప్రస్తుతం మెజార్టీ వున్నా బీజేపికాని, ఎన్డీఏ కూటమి కాని ఆయనకు మరో ఛాన్స్ ఇచ్చే ఉద్దేశంలో లేవు. అటువంటప్పుడు ప్రతిపక్షాల్ని నమ్ముకుని పోటీలో వుండటం కోరి ఓడిపోవటమే తప్ప మరోటి కాదు. అందుకే, గౌరవంగా పక్కకు తప్పుకుంటున్నాడు మన సీనియర్ కాంగ్రెస్ లీడర్. కాని, ట్విస్ట్ ఏంటంటే… ఒకవైపు ప్రణబ్ ముఖర్జీ తాను రెండోసారి రాష్ట్రపతి రేసులో వుండనని చెబుతోంటే మరో వైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా అపొజిషన్ పార్టీలతో రాష్ట్రపతి అభ్యర్థి గురించి మీటింగ్ పెడుతున్నారు. కాంగ్రెస్ తో పాటూ చాలా పార్టీలు ప్రణబ్ తమకు ఓకే అని చెప్పాయి. కాని, మోదీ సర్కార్ ఎంత మాత్రం అలాంటి ఆలోచనలో లేదు!   సోనియా ఎలాగైనా మోదీ ప్రతిపాదించే అభ్యర్థిపై తమ క్యాండిడేట్ ను పోటీకి నిలపాలని ప్రయతిస్తన్నారు. గెలవటం కోసం కాకపోయినా… ప్రతిపక్ష పార్టీలన్నిటికీ రాష్ట్రపతి ఎన్నికని అడ్డుపెట్టుకుని తాము నేతృత్వం వహించాలని కాంగ్రెస్ ప్లాన్. కాని, సోనియా ఎన్నో ఆశలు పెట్టుకున్న బెంగాల్ ఫైర్ బ్రాండ్ మమత కూడా మోదీతో మాటా మంతీ అయ్యాక టోన్ మార్చారు! ప్రతిపక్షాలకు కూడా అంగీకారమయ్యే అభ్యర్థిని ఎన్డీఏ ప్రతిపాదిస్తే తాము మద్దతిస్తామనీ, రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవమైతే బెటరని దీదీ అన్నారు! ఎలాగైనా ఎలక్షన్ జరిగేలా చూసి… మోదీకి గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోన్న సోనియాకి ఇది నిజంగా చిరాకు పరిచే స్టేట్మెంటే! అందరికీ అమోదయోగ్యం అయ్యే అబ్దుల్ కలామ్ లాంటి అభ్యర్థి అంటూ మమతా బెనర్జీ క్లాజులు పెట్టడం మోదీకి వెసులుబాటు కలిగించే అంశం! ఒడిషాకు చెందిన జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్మూ లాంటి వారిని రేపు బీజేపి తమ అభ్యర్థిగా నిలబెడితే… మమతా బెనర్జీ ఆమె గిరిజన మహిళ అంటూ మద్దతు ప్రకటించవచ్చు! అప్పుడు కాంగ్రెస్ టీమ్ లోంచి ఓ కీలక వికెట్ పడిపోయినట్టే!   కాంగ్రెస్ చరిత్రలో ఎప్పుడూ లేనంత బలహీనంగా వున్న వేళ వస్తోన్న ఈ రాష్ట్రపతి ఎన్నికలు ఖచ్చితంగా హస్తానికి తప్పనిసరి ఓటమే అవ్వనున్నాయి!

నక్కని ప్రేమించింది… నరకానికి వెళ్లి తిరిగొచ్చింది!

  ఉజ్మా అహ్మద్… నెల రోజుల క్రితం వరకూ ఎవ్వరికీ తెలియని ఒక భారతీయ ముస్లిమ్ మహిళ. కాని, ఇప్పుడు ఆమె ప్రపంచం ముందు పాక్ నుంచి ఇండియాకి ప్రాణాలతో తిరిగొచ్చిన అదృష్టవంతురాలు! గురువారం విదేశాంగ శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ సమక్షంలో ఆమె మీడియా ముందుకొచ్చింది. తన నాలుగేళ్ల కూతుర్ని కళ్ల వెంట నీళ్లు కారిపోతుంటే గట్టిగా వాటేసుకుంది. అలా తనని ముద్దాడగలనని బహుశా ఆమె కొన్నాళ్ల క్రితం ఊహించి కూడా వుండదు. అంతటి నరకకూపంలోకి ప్రమాదవశాత్తూ జారిపోయి మళ్లీ బయటపడింది!   ఉజ్మా అహ్మద్ మలేషియాలో ఒక ట్యాక్సీ డ్రైవర్ తో ప్రేమలో పడింది. తాహిర్ అలీ అనే అతను పాకిస్తానీ. అయితే, అతడ్ని కలిసేందుకు కొన్నాళ్ల క్రితం పాకిస్తాన్ వెళ్లిన ఉజ్మా నరకం ఎలా వుంటుందో చవి చూసింది. తాహిర్ అలీ మలేషియాలో అయితే ప్రేమించాడు కాని… తన స్వంత దేశం పాక్ కి వచ్చేటప్పటికి రాక్షసుడిలా మారిపోయాడు. గన్ పెట్టి బెదిరించి ఉజ్మాను పెళ్లాడిన తాహిర్ ఆమెను కొడుతూ, హింసిస్తూ నరకం చూపాడు. ఎలాగో అతడ్ని తాను భారత హై కమీషన్ ఆఫీస్ కి వెళతానని, వీసాలు తెచ్చుకుంటాననీ కన్విన్స్ చేసిన ఉజ్మా … ఒక్కసారి ఇండియన్ ఎంబసీలో కాలుమోపి మళ్లీ బయటకి వెళ్లలేదు. తనని తాహిర్ కి అప్పగించాలని భారతీయ అధికారులు నిర్ణయిస్తే విషం తీసుకుని ఛస్తానని చెప్పింది!   ఈ వ్యవహారం మొత్తం తెలుసుకున్న మన విదేశాంగ శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ నేరుగా రంగంలోకి దిగి ఉజ్మాతో మాట్లాడి  భరోసా ఇచ్చారు. రోజులు కాదు… ఏళ్లైనా సరే … ఉజ్మాను ఇండియన్ ఎంబసీలోనే వుంచి కాపాడతామని చెప్పారు. దాంతో ధైర్యం తెచ్చుకున్న ఉజ్మా పాకిస్తాన్ కోర్టులో కేసు వేసి అనుకూల తీర్పు సంపాదించుకుని భారతదేశంలోకి క్షేమంగా అడుగుపెట్టింది!   సుష్మ స్వరాజ్ మొదలు పాక్ లోని భారతీయ అధికారుల వరకూ ఎందరో గట్టి కృషి చేస్తే మాతృదేశానికి తిరిగి వచ్చిన ఉజ్మా… పాకిస్తాన్ ఒక మృత్యు కూపం అని తేల్చి చెప్పింది. పాక్ అనే బావిలోకి దూకితే చావు తప్పదనీ, ఆడవాళ్లు కాదు… ఆ దేశంలో మగవాళ్లు కూడా క్షేమంగా వుండలేరని ఆమె హెచ్చరించింది. పూర్తిగా అరాచకమయం అయిపోయిన పాక్ స్థితేంటో ఈ సంఘటన మరోసారి ఋజువు చేసింది!   ఈ మధ్య కాలంలోనే దిల్లీలోని ప్రఖ్యాత నిజాముద్దీన్ దర్గా ప్రధాన మౌల్వీ, ఆయన బంధువు కూడా పాక్ లో కిడ్నాప్ కి గురయ్యారు. ఆ దేశానికి వెళ్లిన వాళ్లిద్దర్నీ పాకిస్తాన్ భద్రతా దళాలే నిర్భంధంలో వుంచాయని తరువాత తేలింది. అప్పుడు కూడా మన దేశ విదేశాంగ శాఖ ఎంతో శ్రమ చేసి వార్ని వెనక్కి తీసుకురావాల్సి వచ్చింది!   అరాచకానికి మారుపేరుగా మారిపోయిన పాకిస్తాన్ అక్కడి స్వంత ప్రజలకే ప్రమాదకరం అయినప్పుడు విదేశాల వారికి నరకంలా తోచటం ఆశ్చర్యమేం కాదు. ఉజ్మాలాగే దురదృష్టం కొద్దీ పాక్ మృత్యు కూపంలో పడిపోయిన మన కల్భూషణ్ జాదవ్ కూడా క్షేమంగా తిరిగి రావాలని కోరుకుందాం…