సినీ సెలబ్రిటీల చర్యలు, కామెంట్సే డ్రగ్స్ కేసులో గందరగోళానికి కారణమా

డ్రగ్స్ కేస్ విచారణ… ఏ ఛానల్ లోకి ట్యూన్ అయినా, ఏ పేపర్ తిరగేసినా ఇప్పుడు ఇదే వార్త! అసలు ఇంతగా కలకలం ఎందుకు రేగుతోంది? సినిమా యాంగిల్ వుండటమే! పూరీ నుంచి ఛార్మీ దాకా పెద్ద పెద్ద సినీ సెలబ్రిటీలు డ్రగ్స్ ఉచ్చులో ఇరుక్కున్నారు. ఇప్పుడే వారంతా దోషులని, కాదనీ ఏమీ చెప్పలేం. కాని, సామాన్య జనానికి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆత్రుత వుంటుంది. అందుకే, మీడియా తెలిసింది, తెలియంది అంతా కలిపి కలగాపులగం చేసే వండి వడ్డిస్తోంది. అయితే, ఇదే క్రమంలో ఆరోపణలు ఎదుర్కొంటోన్న సినిమా వారు కూడా రచ్చని మరింత పెద్దది చేసేలా వ్యవహరిస్తున్నారు. బహుశా ఇది కూడా ఓ వ్యూహమేనేమో అనుకుంటున్నారు సామాన్యులు!   రేపు విచారణకు అటెండ్ అవ్వాల్సిన ఛార్మి కోర్టు తలుపు తట్టింది. ఆమె పిటీషన్ ఆగమేఘాల మీద విచారించిన న్యాయస్థానం తను అడిగిన ప్రధానమైన వెసులుబాటు కల్పించలేదు. సిట్ ప్రశ్నలు వేస్తున్నప్పుడు ఛార్మి తరుఫు న్యాయవాది వుండటానికి వీలులేదని తేల్చేసింది. అయితే, ఛార్మి కోరిన విధంగా సాయంత్రం 5గంటల తరువాత విచారణ చేయకూడదనీ, బలవంతంగా బ్లడ్ శాంపిల్స్ తీసుకోకూడదనీ మాత్రం ఆదేశించింది. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఛార్మి మొదటి నుంచీ తాను విచారణకు హాజరుకానని చెప్పలేదు. విచారణకు హాజరవుతాను కాని.. నాకు ఫలానా డౌట్స్, భయాలు వగైరా వగైరా వున్నాయని ఆమె కోర్టుకు చెప్పింది!   ఛార్మి కోర్టు ఎపిసోడ్ చూశాక ఎవరికైనా ఒక అనుమానం తప్పక వస్తుంది. ఆమె నిజంగా డ్రగ్స్ కేసులో నిర్దోషి అయితే ఇంత నెర్వస్ నెస్ ఎందుకు? అలాగే, విచారణ ఎదుర్కొన్న పూరీ జగన్నాథ్ కూడా మీడియాని, ఇండస్ట్రీలోని పలుకుబడి గల వార్ని టార్గెట్ చేశాడు. ఆయన కూడా ఇంచుమించూ సిట్ ను తప్పుబట్టినట్టే మాట్లాడాడు. ఇక వర్మ సంగతైతే సరేసరి! ఓ సారి సినిమా వాళ్లలా డ్రగ్స్ తీసుకున్న చిన్న పిల్లల్ని కూడా 12గంటలు విచారించండి అంటాడు. ఇంకోసారి సినిమా వాళ్లని అకున్ సబర్వాల్ టార్గెట్ చేశారంటాడు. ఇక తాజాగా కేసీఆర్, టీఆర్ఎస్, హైద్రాబాద్ ప్రతిష్ఠ మసకబారుతోందని ఫేస్బుక్ లో వాపోయాడు. అసలింకా ఏ సినిమా వాళ్లనీ, ఏ డ్రగ్స్ పెడ్లర్స్ ని కోర్టులో హాజరపరచలేదు, ఎవరికీ శిక్షలు పడలేదు… అప్పుడే కేసీఆర్ పేరు పాడైపోవటం ఏంటి? అసలు వర్మ అంత తీవ్రంగా సిట్ పైన మాటల దాడి చేయాల్సిన అవసరం ఏంటి? ఆయనకే తెలియాలి…   భారీగా బ్యాక్ గ్రౌండ్ వున్న టాలీవుడ్ వాళ్ల మీద డ్రగ్స్ కేసు ఎపెక్ట్ పడలేదు. అది అందరూ ఒప్పుకునేదే. కాని, అంత మాత్రం చేత ఎక్సైజ్ శాఖ చేస్తోన్న విచారణే వద్దన్నట్టు, లేదంటే మేము చెప్పినట్టే సాగాలన్నట్టు వర్మ లాంటి వారు మాట్లాడటం గందరగోళం సృష్టించటమే అవుతుంది. అలాగే ఛార్మి కోర్టుకు వెళ్లి తన ప్రధానమైన డిమాండ్ సాధించుకోలేకపోయింది. కాని, జనంలో మాత్రం ఆమె అంతగా భయపడటానికి కారణం ఏంటనే కీలకమైన అనుమానం రేకెత్తింది. కనీసం ముందు ముందు అయినా సినిమా వాళ్లు విచారణను ప్రభావితం చేసేలా చర్యలు, కామెంట్లు చేయకుండా వుంటే గౌరవంగా వుంటుంది. ఎందుకంటే, మన దేశంలో తప్పు చేసిన సామాన్యులకి శిక్షలు పడటమే చాలా కష్టం. అటువంటిది నిజంగా ఏ తప్పూ చేయకుంటే సినిమా సెలబ్రిటీలు నిర్దోషులుగా బయటపడటం పెద్ద కష్టమేం కాదు. అసాధ్యం అంతకన్నా కాదు.

హురియత్ నేతలు జైలుకి! వేర్పాటువాదం కథ కంచికి

గతంలో ఎప్పుడూ లేనంతగా కాశ్మీర్ అల్లోకల్లోలం అవుతోంది. అయితే, చరిత్రలో ఎప్పుడూ జరగనవి కూడా కాశ్మీర్లో ఇప్పుడు జరుగుతున్నాయి! నిన్న అరెస్ట్ చేసిన హురియత్ కీలక నేతల్ని ఇవాళ్ల దిల్లీ కోర్టులో హాజరుపరిచారు ఎన్ఐఏ అధికారులు! ఇది అస్సలు సాధారణ విషయం కాదు. అసలు ఇలాంటి చర్య కాశ్మీర్ చరిత్రలో గతంలో ఎప్పుడూ జరగలేదు. 1990ల తరువాత నుంచీ హురియత్ నేతలు అడ్డూ అదుపు లేకుండా వేర్పాటువాద ఉపన్యాసాలు, నినాదాలు చేస్తూ స్వైర విహారం చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు మోదీ సర్కార్ తొలి సారి వేర్పాటువాదులపై వేటు వేసింది! ఇక ఇప్పుడు అసలు ఆట మొదలైంది…   హురియత్ అంటే కాశ్మీర్లోని వేర్పాటు వాద సంస్థ. ఒక్కటిగా లేకుండా మూడు ముక్కలైన హురియత్ మొత్తం మీద మాత్రం భారత్ కు వ్యతిరేకం. హురియత్ నేతల్లో కొందరు అతివాదులు, కొందరు మితవాదులు, కొందరు పూర్తిగా పాకిస్తానీ చెంచాలు. ఎవరు ఏది అయినా… అందరి లక్ష్యం మాత్రం ఒక్కటే! భారత్ నుంచి కాశ్మీర్ ను విడదీయటం. అయితే, 2106నుంచీ పదే పదే కొనసాగుతోన్న హింసాత్మక రాళ్లు రువ్వే దుశ్చర్య వీరి పన్నాగమే. ఆ విషయం తేల్చేలా ఖచ్చితమైన ఆధారాలు సేకరించిన ఎన్ఐఏ ఇప్పడు హురియత్ ప్రధాన నేతల్ని అరెస్ట్ చేసింది. అందులో హురియత్ అత్యున్నత నాయకుడైన సయ్యద్ గిలానీ అల్లుడు కూడా వున్నాడు. వీరందర్నీ జైలుకి తరలించటం, త్వరలో ఇంటరాగేట్ చేయనుండటం… అతి పెద్ద పరిణామం అనే చెప్పాలి…   హురియత్ పైకి కాశ్మీరీ స్వాతంత్ర్యం అని కబుర్లు చెప్పినా దాని అసలు ఉద్దేశం పాకిస్తాన్ కు సాయపడటం. ఎలాగైనా కాశ్మీర్ ను ఇండియా నుంచి విడదీయాలని కలలు కనే పాక్ నిరంతరాయంగా ఈ హురియత్ వేర్పాటువాద నాయకుల్ని మేపుతూ వుంటుంది. అలా వారికి లభించిన పాకిస్తానీ నిధుల్లోంచే వారు మధ్య స్థాయి హురియత్ నేతలకి డబ్బుల మూటలు అందించారు. అవ్వి తరువాతి దశలో కింది స్థాయి కాశ్మీరీ రాళ్లు రువ్వే అల్లరి మూకలకి అందాయి. ఇంత కాలం దీన్ని మాటల్లో చెప్పిన మన దర్యాప్తు సంస్థలు గత కొన్ని నెలల్లో పక్కా ఆధారాలు సంపాదించాయి. రాళ్లు రువ్వుటంలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన దాదాపు 50మంది కాశ్మీరీ యువత హురియత్ నేతలతో మాట్లాడిన ఫోన్ కాల్స్ ఎన్ఐఏ రికార్డ్ చేసింది. పదే పదే వారు చేసిన కాల్స్, అలాగే, కాశ్మీర్లోని అనేక సమస్యాత్మక ప్రాంతాల నుంచి అదే స్టోన్ పెల్టర్స్ హురియత్ వాళ్లతో మాట్లాడటం పోలీసుల అనుమానాలు నిజం చేసింది. కాశ్మీర్లో రాళ్లు రువ్వటం ఊరికే జనం ఆవేశంతో చేస్తున్నది కాదు. అంతా వ్యూహాత్మకంగా డబ్బులిచ్చి చేయిస్తున్న కుట్ర. ఇది నిరూపించే ఆధారాలు దొరకటంతోనే హురియత్ నేతల్ని అరెస్ట్ చేశారు…   హురియత్ వేర్పాటు వాద నాయకుల తరువాత రాళ్లు రువ్వటంలో పాల్గొన్న అల్లరి మూకల్ని అరెస్ట్ చేసే అవకాశం వుంది. అంతే కాదు, రానున్న కాలంలో వేర్పాటు వాదం పేరుతో పాకిస్తాన్ కు సాయపడుతున్న హురియత్ నామరూపాలు లేకుండా పోయే ఛాన్స్ కూడా వంది. అతి త్వరలో గిలానీ, యాసిన్ మలిక్ లాంటి సీనియర్ హురియత్ నాయకుల్ని కూడా అదుపులోకి తీసుకుంటారని అంటున్నారు. అదే జరిగితే వేర్పాటు వాదం తీవ్రంగా నష్టపోక తప్పదు. రాళ్లు రువ్వే అల్లరి మూకలు కూడా తోకలు ముడవాల్సి వస్తుంది…

అంబానీ భార్య వాడే ఫోన్ ధర… అమ్మో అనిపించకమానదు!

అంబానీ… ఈ పేరు ఇండియాలో డబ్బుకి మారు పేరు! మనీ అన్నా, అంబానీ అన్నా ఒకేలా ఫీలవుతారు మన వాళ్లు! నిజంగానే… అంతలా డబ్బు సంపాదించేశారు అంబానీ ఫ్యామిలీ వారు! ఇక ఈ మధ్య జియోతో మరోసారి తన సత్తా చాటారు ముఖేష్ అంబానీ. 4జీ స్మార్ట్ ఫోనుని ఉచితంగా ఇస్తానంటూ మొబైల్ బిజినెస్ లో గేమ్ రూల్స్ అన్నీ ఛేంజ్ చేసేశారు. అది ఆయన ప్రొఫెషనల్ లైఫ్లోని లేటెస్ట్ న్యూస్. కాని, ముఖేష్ అంబానీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు కూడా అప్పుడప్పుడూ సంచలనం రేపుతుంటాయి. అటువంటిదే తాజాగా ఒకటి బయటకొచ్చింది…   అంబానీ భారతదేశంలోనే అ్యతంత ధనికుడు. మరి ఆయన లైఫ్ స్టైల్ కూడా అందుకు తగ్గుట్టుగానే వుంటుంది కదా! ఆ మధ్య ఆయన ఇల్లు కట్టారు. ముంబైలోని ఆ మహల్ ధర 12వేల కోట్లు! మరోసారి 25కోట్లు పెట్టి కార్ కొన్నారు ముఖేష్ అంబానీ. ఇక ఆయన దగ్గర మొత్తం 160కార్లు వున్నాయని ఓ టాక్! అంతే కాదు… ఆ మధ్య ఓ సారి తన భార్య నీతా అంబానీకి ముఖేష్ బర్త్ డే గిఫ్ట్ గా ఏమిచ్చారో తెలుసుగా? షిప్ బహుమతిగా ఇచ్చారు! అవును… వందల కోట్ల విలువైన షిప్పును ముఖేష్ … నీతాకి బహుమానంగా ఇచ్చారు!   అంబానీల ఖరీదైన విలాసల గురించి ఇప్పుడు మరోసారి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే … జియో బంపరాఫర్ కింద 15వందల రీఫండబుల్ అమౌంట్ తో 4జీ ఫోన్ ఉచితంగా ఇస్తోన్న ముఖేష్ అంబానీ … భార్య నీతా అంబానీకి ఏ రేంజ్ ఫోన్ కొన్నిచ్చాడో తెలుసా? మిసెస్ నీతా ముఖేష్ అంబానీ వాడుతోన్న ప్రస్తుత ఫోన్ ఖరీదు 312 కోట్లు! మీరు విన్నది కరెక్టే! అక్షరాలా 312కోట్లు విలువ చేసే ఫాల్కన్ సూపర్ నోవా ఐఫోన్6 పింక్ డైమండ్ ఫోన్ ఆమె వాడుతున్నారట! ఈ కాస్ ట్లీయస్ట్ ఫోన్ స్పెషల్ ఆర్డర్ మీద మాత్రమే తయారు చేస్తారు. పూర్తిగా బంగారంతో తయారైన నీతా అంబానీ ఫోన్ వెనుక భాగంలో పింక్ కలర్ డైమండ్ కూడా వుంటుంది! మరిక వజ్రం బంగారంలో పొదిగిన అంబానీల ఫోన్ 312కోట్లు ఖరీదు చేయటం… ఆశ్చర్యమేముంది? 

భారత మహిళా క్రికెట్‌కు "బూస్ట్" దొరికినట్లేనా..?

ఎక్కడో ఇంగ్లాండ్‌లో పుట్టిన క్రికెట్‌కు ఇండియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎన్నో మతాలతో అప్పుడప్పుడు కొట్టుకుచచ్చే ఈ దేశంలో అందరినీ ఏకం చేసేది ఏదైనా ఉంది అంటే అది ఒక్క క్రికెట్ మాత్రమే. మ్యాచ్ ఉందంటే చాలు చిన్న పెద్దా ఇళ్లలో, రోడ్ల మీద, ఆఫీసుల్లో గుమిగూడి కమాన్ ఇండియా..! అంటూ ఆటగాళ్లను ఎంకరేజ్ చేస్తుంటారు. ఇక క్రికెటర్లకు భారత్‌లో ఉండే ఫాలోయింగ్ మరే ఇతర సెలబ్రిటీస్‌కి ఉండదు, వాళ్లను దేవుళ్లతో సమానంగా పూజిస్తారు అభిమానులు. సచిన్, సౌరవ్, ద్రవిడ్, ధోని, కోహ్లీ ఇలా ఎంతోమందిని గుండెల్లో పెట్టుకుని పూజిస్తారు ఈ దేశంలో..మనకు పురుషుల క్రికెట్ జట్టు ఉందని అందరికీ తెలుసు.   కానీ మహిళా జట్టు కూడా ఒకటి ఉందని..ఎంత మందికి తెలుసు. కనీసం ఒక్క మహిళా క్రికెటర్ పేరైనా తెలుసా..? అన్ని రంగాల్లో మహిళలపై వివక్ష ఉన్నట్లే..క్రికెట్‌లోనూ ఉంది. మహిళా క్రికెటర్లంటే వాళ్లను పిచ్చివాళ్లలా చూసేవారు. దీనికి కారణం పరిమిత శిక్షణా అవకాశాలు, పరిమిత మ్యాచ్‌లు, రోజువారీ ఖర్చులకు డబ్బులు ఇవ్వని స్థితి..ఇన్ని అవమానాలు, అడ్డంకుల మధ్య తాము పురుషులకు ఏమాత్రం తక్కువ కాదని నిరూపిస్తోంది టీమిండియా మహిళల జట్టు. మిథాలీ రాజ్, వేద కృష్ణమూర్తి, హర్మన్ ప్రీత్ తదితర క్రికెటర్ల రాకతో భారత మహిళా జట్టుకు కొత్త రూపు వచ్చింది. క్రమంగా వీరి ప్రాతినిధ్యంలో జట్టు విజయాల శాతం పెరిగింది. ఇటీవల ముగిసిన మహిళల ప్రపంచకప్‌లో తృటిలో ట్రోఫిని కోల్పోయినా యావత్ భారతావని హృదయాలను వారు గెలుచుకున్నారు. ఇది మన మహిళా క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు బీజం వేసినట్లైంది.   ఇంతకాలం ఆటుపోట్లకు, అవమానాలకు గురైన మహిళల జట్టుపై బీసీసీఐ, ప్రభుత్వం, ప్రజలు దృష్టి సారించడానికి ఈ ప్రపంచకప్ బాటను వేసిందని చెప్పవచ్చు. దీని వల్ల మహిళా క్రికెటర్ల నైపుణ్యాలు పెరగడంతో పాటు, ఆర్థికంగా పుంజుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. అంతా సవ్యంగా జరిగితే అతి త్వరలోనే మహిళా ఐపీఎల్ కూడా ప్రారంభమయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

5దేశాల ప్రధానుల సీక్రెట్ మీటింగ్!

ఒక్కోసారి చిన్న పొరపాటు పెద్ద ఆశ్చర్యానికి దారి తీస్తుంది! పెద్ద పెద్ద కలకలానికి కూడా దారి తీయవచ్చు! కాని, పరిస్థితి అంతదాకా వెళ్లలేదు ఇజ్రాయిల్ లో! ఈ మధ్యే మన ప్రధాని మోదీ ఇజ్రాయిల్ వెళ్లివచ్చారు. ఆ తరువాత మన మీడియా మరోసారి ఇజ్రాయిల్ గురించి పెద్దగా మాట్లాడటం మానేసింది. ఇన్ ఫ్యాక్ట్ అవసరం కూడా లేదు! అయితే, తాజాగా ఇజ్రాయిల్ లో జరిగిన ఓ పొరపాటు సంచలనం రేపుతోంది! అందులో మన నమో పేరు కూడా ఇన్వాల్వ్ అవ్వటం మరింత ఆసక్తికరంగా మారుతోంది!   ఇంతకీ… ఇజ్రాయిల్ లో ఏం జరిగిందంటే… ఓ మైక్రో ఫోన్ అనుకోకుండా ఆన్ చేసి వుండిపోయింది! దీని వల్ల ఏం జరిగుంటుంది అనుకుంటున్నారా? ఆ మైక్రో ఫోన్ వున్నది ఓ సీక్రెట్ మీటింగ్ జరుగుతోన్న రూంలో! అందులో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్న్యాహుతో పాటూ యూరప్ నుంచి వచ్చిన నాలుగు దేశాల ప్రధానులు వున్నారు! యూరోపియన్ యూనియన్ లో భాగమైన హంగేరి, చెక్ రిపబ్లిక్, పోలాండ్, స్లోవేకియా దేశాల అధిపతులు మీటింగ్ లో వుండగా ఇజ్రాయిల్ ప్రైమినిస్టర్ వాళ్లని కడిపారేశాడు. అదంతా మరో రూంలో వున్న జర్నలిస్టుల చెవుల్లో పడింది. అలా బయటకు పొక్కింది. సాధారణంగా ఇలాంటి హైలెవల్ మీటింగ్ ల వివరాలు యధాతథంగా బయటకు రావు…   ఈయూ భాగస్వామ్య దేశాలతో ఇజ్రాయిల్ ప్రధాని ముఖ్యంగా మాట్లాడింది ఏంటంటే… పాలస్తీనాకు మద్దతుగా తమతో యూరోపియన్ దేశాలు తగినంత స్నేహం చేయటం లేదని. దీని వల్ల తమకు జరిగే నష్టం కన్నా యూరోపియన్ దేశాలకు కలిగే నష్టమే ఎక్కువ ముఖం మీద చెప్పాడు. అంతే కాదు, ఈయూ ఇజ్రాయిల్ లాంటి సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాన్ని పట్టించుకోకుండా చరిత్రలో కలిసిపోవాలని భావిస్తే తాను ఏమీ చెప్పేది లేదని కటువుగా మాట్లాడాడు నెత్యాన్న్యాహు! అయితే, ఇదే క్రమంలో చైనా, ఇండియా గురించి కూడా ఆయన ప్రస్తావించాడు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తమతో అనేక రంగాల్లో సహకరించటానికి సిద్దంగా వున్నాడని యూరప్ నేతలకి తెలిపాడు. ఇక మన మోదీ తన పర్యటనలో భాగంగా పరిశుభ్రమైన నీళ్లు కావాలని, అవి ఎలా దొరుకుతాయని అడిగారట!   ఇజ్రాయిల్ నుంచి సాంకేతిక అంశాల్లో భారత్ లాభపడాలన్నది మోదీ సర్కార్ ఆలోచన. అందులో భాగంగానే పీఎం మంచి నీటి సమస్యని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై చర్చించారు నెత్యాన్న్యాహుతో! మొత్తానికి ఒక చిన్న మైక్రోఫోన్ ఆఫ్ చేయకపోవటం వల్ల ఇంత సమాచారం బయటకొచ్చేసింది. మరీ ముఖ్యంగా, యూరప్ నేతలకి ఇజ్రాయిల్ ప్రధాని చైనా, ఇండియాల్ని చూపిస్తూ హెచ్చరిక చేయటం ఇక్కడ మనం గమనించాల్సిన అంశం!

ఒప్పో తిప్పలు చూస్తే… చైనా మనతో వారెందుకు చేయదో అర్థమవుతుంది!

  ఇండియా, చైనాల మధ్య యుద్ధం వస్తుందా? ఏమో చెప్పలేం. తప్పకపోవచ్చనే కొందరంటున్నారు. కొందరు మాత్రం చైనా అంత దుస్సాహసం చేయదని వాదిస్తున్నారు. ఏది ఏమైనా చైనాను నమ్మటానికి అస్సలు వీలులేదు! అయితే, చైనాతో భారత ఆర్మీ ఇంకా పూర్తి స్థాయిలో వార్ కి దిగలేదు కాని… కామన్ ఇండియన్స్ అప్పుడే యుద్ధం మొదలు పెట్టారు! చైనా మీద ఇండియన్స్ కి రోజురోజుకి పెరుగుతోన్న వ్యతిరేకతకి స్సష్టమైన సంకేతం… పాపం ఒప్పో కంపెనీకి తెలిసి వచ్చింది!   ఒప్పో స్మార్ట్ పోన్ల కంపెనీ ప్రస్తుతం ఇండియాలో జోరుగా బిజినెస్ చేస్తోంది. సెల్ఫీ ఎక్స్ పర్ట్ అంటూ సెల్స్ పెంచుకుంటోంది. అయితే, ఈ మధ్య ఆ సంస్థ పంజాబ్ విభాగంలో కలకలం రేగింది. అరుణ్ శర్మ అనే భారతీయ ఉద్యోగిని చైనా అధికారి దురుసుగా తిట్టాడట. అక్కడితో ఆగకుండా ఇండియాన్స్ అంతా అడుక్కునే వారని నోటికొచ్చినట్టు మాట్లాడట! ఈ విషయం మొత్తం లెటర్ రూపంలో అరుణ్ శర్మ మీడియాకు అందించాడు. అది మీడియా నుంచి సోషల్ మీడియాకు పాకింది! ఫలితంగా ఒప్పో కంపెనీలోని చైనీస్ అధికారులపై జనం తీవ్రంగా ఆగ్రహానికి గురయ్యారు! అంతే కాదు, సిక్కింలో మన భూభాగంలోకి రావాలని చూస్తోన్న చైనాపై ఆల్రెడీ వున్న కోపం ఒప్పో బ్రాండ్ పై చూపారు! అమాంతం ఆ సెల్ ఫోన్ల సేల్స్ పడిపోవటం మొదలుపెట్టాయట!   ఒప్పో కంపెనీ తన సేల్స్ నేల చూపులు చూడటం గ్రహించి టెన్షన్ అయిపోయింది! చివరకు, చేసేది లేక పంజాబ్ లోని తన చైనీస్ ఉద్యోగుల చేత రాజీనామాలు చేయించింది! ఈ విషయం అధికారికంగా చెప్పకున్నా నష్ట నివారణ చర్యలు మాత్రం ఒప్పో చేపట్టిందట! మరి మార్కెట్లో ఈ చైనీస్ కంపెనీ మళ్లీ ఎలా పుంజుకుంటుందో ఏమో! నిజమైన యుద్ధం సంగతి అక్కడి పాలకులు, ఇక్కడి పాలకులు చూసుకుంటారు. కాని, అంతలోనే ఒప్పోకు మాత్రం గొప్ప కష్టమే వచ్చిపడింది!   ఒకవేళ ఫుల్ లెంగ్త్ వార్ జరిగితే ఒప్పో లాగే చాలా చైనీస్ బ్రాండ్లు వేల కోట్ల విలువైన ఇండియన్ మార్కెట్ పై ఆశలు వదులుకోవాలని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు! అదే డ్రాగన్ దూకుడును కంట్రోల్ చేస్తోందని కూడా చెబుతన్నారు!

కాదేదీ... మంచు లక్ష్మికి అనర్హం...

మన మంచు లక్ష్మి అక్కాయ్ కి ... సినిమాలు, రాజకీయాలు అనే తేడాలేం ఉండవ్. ఎక్కడైనా తన వాణిని వినిపించగలదు. ఏ విషయంపైనైనా... నిర్మొహమాటంగా స్పందించగలదు. అందుకే... . ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ‘మంచు’ అక్కయ్య.    రీసెంట్ గా తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారాకరామారావుకీ, కాంగ్రెస్ జాతీయ నాయకుడు దిగ్విజయ్ సింగ్ కు ట్విట్టర్ వేదికగా యుద్ధం జరిగితే... పానకంలో పుడకలా వారిద్దరి మధ్య ‘నేనూ ఉన్నాను’ అన్నట్లు ఓ ట్వీట్ ట్వీటింది మంచు లక్ష్మి. సినిమా రంగానికి చెందిన మంచువారమ్మాయికి ఈ రాజకీయాల గోలేందుకు? అని అందరూ ఒకటే చెవులు కొరక్కుంటున్నారు. ఇక విషయంలొకెళ్తే...   ఈ మధ్య హైదరాబాద్లో మొదలైన డ్రగ్స్ కంపు దేశం మొత్తం వ్యాపించింది. దాంతో.. దేశవ్యాప్తంగా దిల్లీ నుంచి కూడా ఎవరికి తోచినట్టు వాళ్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంకో వంద అడుగులు ముందుకేస్తూ... కాంగ్రెస్ జాతీయ నాయకుడు దిగ్విజయ్ సింగ్  ట్విట్టర్ వేదికగా కేసీయార్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. ‘అసలు ఈ డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో కేసీయార్ కుమారుడు కేటీయార్ కూడా ఉన్నాడు’అని భారీ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశాడు.    ఇక కేటీయార్ ఊరుకుంటాడా? అసలే యువకుడు... తను కూడా ట్విట్టర్లో చెలరేగిపోయాడు. ‘దిగ్విజయ్ విచక్షణ కోల్పోయారు. ఆయన విశ్రాంతి తీసుకునే సమయం ఆసన్నమైంది. వయసుకు తగ్గ కామెంట్లు చేస్తే మంచింది. ఇప్పటికైనా‘తెలంగాణ’ అనే పదాన్న రాయడం నేర్చకున్నందుకు ధన్యవాదాలు’ తనదైన శైలిలో దిగ్విజయ్ కి కౌంటర్ ఇచ్చేశాడు. ఇదంతా బాగానే ఉంది. మరి మధ్యలో మంచు లక్ష్మి పాత్ర ఏంటి? అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా.    కేటీయార్ ట్విట్టర్ లో కామెంట్ పెట్టీ పెట్టగానే... వెంటనే మంచు లక్ష్మి ట్విట్టర్ లో రెస్పాండ్ అయ్యారు. ‘కరెక్ట్ చెప్పావ్ రామ్. ఆయన విచక్షణ ఎప్పుడో కోల్పోయాడు’మెసేజ్ పోస్ట్ చేశారు. ఇక ఈ మెసేజ్ చూసిన కొందరు కాంగ్రెస్ లీడర్లు... ‘ఇదేంటయ్యా... తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీయార్ కుటుంబంపై అంతెత్తు లేచింది కదా ఈ అమ్మాయి. మళ్లీ ఇప్పుడు మన వాళ్లను తిడుతుందేంటి? ’అని ఆశ్చర్యానికి లోనవుతున్నారట. తెలివితేటలు ఎవరి సొంతం చెప్పండి. పైగా మంచు లక్ష్మి అక్కయ్య అంటే మామూలు విషయమా? 

పూరీ జగన్నాథ్.. ఆ విషయాన్ని గ్రహించాలి!

నిందితుడిపై అభియోగం రుజువైతే... అప్పుడు నేరస్తుడవుతాడు. ఈ చిన్న లాజిక్ కూడా మరిచిపోయి బిహేవ్ చేస్తున్నాయ్ కొన్ని ఛానళ్లు. నిందితులు నేరస్తులో కాదో తేల్చాల్సింది కోర్టులు. కానీ... మన ఛానళ్లే తీర్పులిచ్చేస్తున్నాయ్. ఇది ఇప్పటి పరిస్థితి. పదే పదే చెబితే... నిజం కూడా అబద్ధం అవుతుందీ... అబద్ధం కూడా నిజం అవుతుంది. సో... ఇలాంటి విషయాల్లో కాస్త ఎవరికైనా సంయమనం అవసరం.    డ్రగ్స్ మాఫియా ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ రాలేదు. చాలా ఏళ్లుగా ఇక్కడ వేళ్లూనుకుంది. గతంలో కూడా ఇలాంటి ఎలిగేషన్స్ కొంతమంది సెలబ్రిటీలపై వచ్చాయి. కానీ... తర్వాత నీరు కారిపోయాయి. అలా ఎందుకు జరిగిందో.. ఇప్పుడు అప్రస్తుతం. మేం చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే... డ్రగ్ మాఫియా మూలాలను కూకటి వేళ్లతో పెకిలించే దిశగా అటు చట్టంగానీ, ఇటు మీడియా కానీ... అడుగులు వేయాలి. అంతే కానీ...  సినీరంగంలో కొంతమంది దొరికే సరికి వారి పైనే ఫోకస్ మొత్తం పెట్టి... వారని మాత్రమే బదనాం చేసే పనిలో పడటం. దాన్ని సుదీర్ఘంగా కొనసాగించడం  సరికాదు.    ఒక్క సినిమా రంగంలోనే కాదు, ప్రముఖ రాజకీయ నాయకుల పిల్లలు, వ్యాపారవేత్తల పిల్లలు, విద్యార్థలు, బడా నేతలు... ఇలా చాలామంది డ్రగ్ మాఫియాకు బలైపోయారు. మరి అలాంటప్పుడు ఆ మిగిలిన వారి గురించి ఎందుకు ఆలోచించరు. పొద్దున లేచిన దగ్గర్నుచీ, దర్శకుడు పూరీ జగన్నాథ్ అండ్ టీమ్  పైనే మీడియా అంతా వెళ్లిపోతోంది. ఒక వేళ వీళ్లు డ్రగ్స్ తీసుకుంటున్నది నిజమే అయితే... పూరీ, ఛార్మీ, సుబ్బరాజు, శ్యామ్ కె.నాయుడు, నందు, తరుణ్, నవదీప్, తనీష్... వీళ్లందరూ కేవలం బాధితులు మాత్రమే. నేరస్థులు కాదు.  వీళ్లకు కావాల్సింది కౌన్సిలింగ్.  ఆ డ్రగ్స్ సప్లయ్ చేసిన వాళ్లు నేరస్తులు. వాళ్లకు పడాలి శిక్ష.    నిన్న పూరీ..  సిట్ కార్యాలయంలో హాజరయ్యాడు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. పది గంటలు జరిగిన విచారణలో కొన్ని కీలకమైన విషయాలను కూడా బయటపెట్టినట్టు మీడియాలో వినిపిస్తుంది. మరి ఆ సమాచారం మీడియాకు ఎలా తెలిసింది? ఈ ప్రశ్నకు సమాధానం సదరు ఛానల్స్ వారే చెప్పాలి. అయితే పూరీ మాత్రం తన ట్విట్టర్ ద్వారా మీడియా తీరుపై అభ్యంతరం వెలిబుచ్చుతూనే... ఆవేదన వ్యక్తం చేశాడు. ఓ దశలో ‘మా జీవితాలు నాశనం చేశారు’అని మీడియాపై నిప్పులు కక్కాడు. తనకు పోలీసులంటే ఇష్టమని, అందుకే పోలీస్ నేపథ్యంలో చాలా చిత్రాలు తీశానని, అలాగే మీడియాపై ఉన్న గౌరవంతో ‘ఇజం’సినిమా తీశానని, మీడియాలో తనకు చాలామంది మిత్రున్నారనీ, కానీ... వారే తన జీవితాన్ని నాశనం చేశారనీ పూరీ ట్విట్టర్ ద్వారా వాపోయాడు.    కానీ... ఇక్కడ పూరీ కూడా గ్రహించాల్సిన విషయం ఒకటుంది. మీడియా తన గురించి నెగిటీవ్ గా ప్రచారం చేస్తున్నా... సోషల్ మీడియా మాత్రం తనకు అండగా నిలిచింది. పూరీ ట్విట్టర్ లో పెట్టిన వీడియోకి లక్షల్లో లైక్ లే కాకుండా, కామెంట్ల ద్వారా అందరూ పాజిటీవ్ గా స్పందిస్తున్నారు. అంతేకాదు... ఆ విడియోకి వేలల్లో షేర్లు చేస్తున్నాయి కూడా. ఎవరి అభిప్రాయం వారు నిస్కర్షగా చెప్పగలిగే సాంఘిక మాధ్యమం అండగా ఉన్నంతవరకూ... పూరీ భయపడాల్సిన అవసరం లేదు.    ఇకనైనా... అనవసరమైన వాటి గురించి ఆలోచించకుండా... చెడు వ్యసనాలను దూరంగా పెట్టి.. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన సినిమా గురించి ఆలోచించడం మొదలుపెడితే... పూరీ మళ్లీ పాత వైభవాన్ని చూస్తాడు. ఎందుకంటే... దర్శకునిగా అతని ప్రతిభ అలాంటిది. పూరీకి గానీ... మిగిలిన అభియోగ దారులకు కానీ... ఇప్పుడు ఏర్పడ్డ గాయం నయం కావాలంటే... దానికి ఒక్కటే మందు ‘సక్సెస్’. తప్పు చేస్తే పశ్చాత్తపపడండి. కొని తెచ్చుకున్న కష్టాలను అధిగమించి... మంచి హిట్ కొట్టేయండి. అన్ని సర్దుకుంటాయ్.    -నరసింహ బుర్రా 

‘ఆయన’ కాపాడకుంటే… గాంధీ 1944లోనే చనిపోయేవారా?

  గాంధీని చంపింది ఎవరు? గాడ్సే! అందరం చెబుతాం! కానీ, గాంధీని కాపాడింది ఎవరు? చెప్పలేం! అసలింతకీ మహాత్ముడ్ని కాపాడటం ఏంటి అంటారా? గాంధీ జీని అంతిమంగా తుపాకీతో కాల్చి చంపటానికి ముందు గాడ్సే మరో రెండు హత్యా ప్రయత్నాలు చేశాడు. కాని, అవ్వి వర్కవుట్ కాలేదు. అందులో ఒకటి 1944 జూలైలో జరిగింది! అదుగో అప్పుడు ఒకాయన సాహసం చేసి గాడ్సే నుంచి గాందీని కాపాడాడు. అతనే… బీకూ దాజీ భిలారే! అంతా భిలారే గురూజీ అనే ఈయన 98ఏళ్ల వయస్సులో బుధవారం ఆనారోగ్యంతో మరణించాడు.   గాంధీ జీపైన అంతిమ హత్యా ప్రయత్నానికి ముందు చాలా సార్లే అసాసినేషన్ అటెంప్ట్స్ జరిగాయి. అందులో ఒకటి ఆయన 1944లో పూణే నగరానికి దగ్గరలో వున్న పంచగని పర్వత ప్రాంతంలో వుండగా జరిగింది. అక్కడికి బాపు మలేరియా కారణంగా రెస్ట్ తీసుకోవటానికి వెళ్లారు. ఓ బంగళాలో విడిది చేసిన ఆయనికి తమ నిరసన తెలియజేయటానికి కొంత మంది యువకులు పూణే నుంచి బస్సులో వచ్చారట. మొత్తం ఇరవై మంది వరకూ వున్న ఆ బృందం రోజంతా నిరసనలు, నినాదాలు చేసింది. వారి నాయకుడైన నాథూరామ్ గాడ్సేను బాపూ జీ కలవలాని భావించారట. కాని, అందుకు గాడ్సే ఒప్పుకోలేదు. చివరకు, సాయంత్రం ప్రార్థన కోసం మహాత్ముడు హాలులోకి వచ్చే వేళ గాడ్సే అమాంతం కత్తితో దాడి చేయబోయాడు. కాని, అప్పుడే అక్కడున్న భిలారే గురుజీ అతడ్ని గట్టిగా పట్టుకుని చేయి వెనక్కి విరిచి కత్తి కిందపడేలా చేశాడు…   గాడ్సే చేసిన ఈ విఫల హత్యా యత్నం గురించి భిలారే గురుజీ చాలా సార్లే చెప్పారు. ఆయన కాకుండా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ కూడా ఓ పుస్తకంలో భిలారే గాంధీని కాపాడాడని చెప్పాడు. కాని, 1944లో గాంధీ పంచగనిలో వుండగా హత్యా యత్నం ఏదీ జరిగినట్టు బలమైన ఆధారాలు మాత్రం ఇంతవరకూ దొరకలేదు. దాని గురించి పెద్దగా చర్చ అప్పట్లో ఎక్కడా జరిగినట్టు సాక్షాలు లేవు. కాకపోతే, గాంధీని కాపాడిన భిలారే కూడా 98ఏళ్ల వయస్సులో ఇప్పుడు మరణించటంతో… స్వతంత్రోద్యమంలో ఒక శకం ముగిసినట్టైంది!

ఇండియాలో 2032 ఒలంపిక్స్… అవసరమా? ఆర్భాటమా?

  ఒలంపిక్స్… ఈ పదం విన్నప్పుడల్లా భారతీయుల మనస్సుల్లో రకరకాల భావాలు కలుగుతుంటాయి! అందుక్కారణం వంద కోట్లు దాటిన జనాభ గల మన దేశం ఇప్పటి వరకూ ఒలంపిక్స్ లో అద్భుతాలు సృష్టించింది లేదు. నాలుగేళ్లకోసారి భారీ టీమ్ తో ఒలంపిక్స్ కు వెళ్లటం, ఒకటి అరా మెడల్స్ తో మెడలు వంచుకుని రావటం మామూలైపోయింది. ఇక వచ్చాక మెడల్స్ తీసుకొచ్చిన ఒకరిద్దర్నే ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులు, గవర్నర్లు, ఆఖరుకు రాష్ట్రపతి కూడా తోచినంత పొగడటం రొటీన్! ఇలాంటి దుస్థితి బహుశా ప్రపంచంలోని ఏ పెద్ద దేశానికి ఒలంపిక్స్ లో వుండదనుకుంటా!   ఇంతకీ… వున్నట్టుండీ ఒలంపిక్స్ గొడవ ఇప్పుడెందుకని అనుమానం వచ్చిందా? కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కారణంగా! 2032లో ఒలంపిక్స్ భారత దేశంలో ఎందుకు నిర్వహించకూడదని ఆలోచిస్తుందట స్పోర్ట్స్ మినిస్ట్రి! మోదీ సర్కార్ అనుమతిస్తే ఒలంపిక్స్ ఇండియాలో నిర్వహించటానికి బిడ్స్ వేయనున్నారట. అదీ 9ఏళ్లు ముందు, అంటే, 2025లో ఇండియా ఒలంపిక్స్ నిర్వహణకు అనుమతి పొందాలి. అప్పుడు 2032లోగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి.   నిజానికి భారత్ లో ఒలంపిక్స్ ఇప్పటి వరకూ జరగలేదు. కాబట్టి మనం నిర్వహించుకుంటే బావుంటుంది. కాని, దీని వెనుక రెండు ఆలోచించాల్సిన పరిణామాలు వున్నాయి! ఒకటి…. వేల కోట్లు ఖర్చు పెట్టి ఒలంపిక్స్ నిర్వహించాక మనకొచ్చే మెడల్స్ ఎన్ని? 2032లోగా అద్బుతాలు జరిగి మన క్రీడా రంగం ఒక వెలుగు వెలిగిపోతే తప్ప మామూలుగా అయితే పది మెడల్స్ రావటం కూడా గొప్పే! ఇది నిజానికి ఒక ఆతిథ్యం ఇచ్చిన దేశానికి అవమానకరం! అమెరికా, చైనా లాంటి పెద్ద దేశాలు ఒలంపిక్స్ నిర్వహిస్తే అత్యధిక మెడల్స్ తమకే వచ్చేట్టు క్రీడాకారుల్ని తయారు చేసుకున్నాయి! అలాంటి పరిస్థితి మన దేశంలో రావాలి…   ఒలంపిక్స్ వెనుక వున్న మరో ఆందోళనకర అంశం… ఈ భారీ విశ్వ క్రీడా సంరంభం నిర్వహించిన చాలా దేశాలు తరువాత ఆర్దికంగా నానా ఇబ్బందులు పడుతున్నాయి. మొన్నటికి మొన్న బ్రెజిల్ కూడా ఒలంపిక్స్ నిర్వహించి లాభం మాట అటుంచితే… ఆర్దికంగా అతలాకుతలం అయిపోయింది! అసలు ఈ కారణం చేతనే 2028ఒలంపిక్స్ నిర్వహణకి ఏ దేశమూ ముందుకి రావటం లేదట! 2024లో ఒలంపిక్స్ ప్యారిస్ లో జరగనున్నాయి. ప్యారిస్ తో పోటీ పడి ఓడినలాస్ ఏంజెల్స్ నగరానికి 2028 ఒలంపిక్స్ నిర్వహణ బాధ్యత అప్పజెప్పింది అంతర్జాతీయ ఒలంపిక్ సంఘం! ఇదీ పరిస్థితి!   ఆర్దిక భారానికి భయపడి సంపన్న దేశాలే ముందుకు రాని ఒలంపిక్స్ మన దేశానికి ఎందుకు? ముందు క్రీడా రంగం బాగు చేసుకుని ఇతర దేశాల్లో జరిగే ఒలంపిక్స్ లో సత్తా చాటితే… అప్పుడు ఇక్కడ నిర్వహించుకోవటం గురించి ఆలోచించవచ్చు! ఆఫ్ట్రాల్… ఒలంపిక్స్ అంటే లేజర్ షోలు, స్టేడియమ్స్, అథ్లెట్ల కోసం ఏర్పాట్లు మాత్రమే కాదు కదా! ఒలంపిక్స్ అంటే స్వదేశీ క్రీడాకారులు జాతి గౌరవాన్ని ఇనుమడింపజేయటం! అ స్థితైతే ఇప్పుడు అస్సలు లేదు…

నక్కలా యుద్ధానికి రెడీ అవుతోన్న డ్రాగన్!

  మన శత్రువు పాకిస్తాన్ కాదు చైనాయే! ఈ మాటలన్నది గతంలో రక్షణ శాఖ మంత్రిగా పని చేసిన ములాయం సింగ్ యాదవ్. నిజంగా పాకిస్తాన్ మనకు శత్రువు కాదా? అలా చెప్పలేం. కాని, పాకిస్తాన్ కంటే పెద్ద శత్రువు, ప్రమాదకర శత్రువు చైనా! ఇది మాత్రం నిస్సందేహం! గతంలో ప్రోక్రాన్ అణు పరీక్షలు జరిపిన తరువాత కూడా అప్పటి రక్షణ శాఖ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ ఇలాంటి మాటే చెప్పారు. అణు పరీక్షలు పాక్ ను ఉద్దేశించి కాదనీ… చైనాను దృష్టిలో పెట్టుకునేనని… ఆయన చెప్పారు!   గ్రౌండ్ లెవల్లో డ్రాగన్ చేస్తోన్న సన్నాహాలు చూస్తుంటే చైనా ఎందుకు ప్రధాన శత్రువో తేలిగ్గా అర్థమైపోతుంది ఎవరికైనా. తాజా మీడియా రిపోర్ట్స్ ని బట్టి చూస్తే చైనా ఇప్పటికే వేల టన్నుల యుద్ధ సామాగ్రి టిబెట్ లోకి తరలించింది. హాంకాంగ్ బేస్డ్ గా పబ్లిష్ అవుతున్నో చైనా అధికార పత్రిక కథనం ప్రకారం, ఆ దేశ మిలటరీ పశ్చిమ సరిహధ్దులో యుద్ధానికి సర్వ సన్నద్ధంగా వుంది. చైనా దేశ పశ్చిమ సైన్య విభాగం ఇండియాతో బార్డర్ వ్యవహారాల్ని చూసుకుంటుంది. అటువంటి వెస్టన్ థియేటర్ కమాండ్ ఇప్పుడు వార్ మూడ్ లో వుందంటే అర్థం ఏంటి? అంతే కాక జూన్ లో ఒకవైపు ఆర్మీని సన్నద్ధం చేసుకుంటూనే చైనా మనల్ని సిక్కింలో కవ్వించింది. ఇంకో వైపు టిబెట్ లోని పలు కీలక మిలటరీ బేస్ లలో యుద్ధ విన్యాసాలు చేసింది. మొత్తంగా భారత్ కు గట్టి యుద్ధ సంకేతాలు పంపటమే చైనా లక్షంగా పెట్టుకుంది. అందులో విజయవంతం కూడా అయింది. మరీ బరితెగించి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ తో చైనా ప్రతినిధి భేటీ కూడా అయ్యారు. అంటే…. చైనా కుట్రలు సరిహద్దుల వద్ద, దిల్లీలోనూ హద్దులు మీరుతున్నాయి.   చైనా ఇప్పటికిప్పుడు యుద్దానికి ఎందుకు ఉవ్విళ్లూరుతుంది? లోలోన ఇండియాతో వారంటే చైనాకూ ఆందోళనే. తైవాన్, వియత్నాం, ఫిలప్పీన్స్ లాంటి డ్రాగన్ మాట వినని దేశాల్నే బీజింగ్ ఏం చేయలేకపోతోంది. అటువంటిది… ప్రపంచంలో చైనాకు ధీటుగా ఎదుగుతోన్న భారత్ అంటే కమ్యూనిస్టు దేశానికి ఎంత మాత్రం సహించదు. పైగా మోదీ పాలన మొదలయ్యాక అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు ఇండియా ఎప్పుడూ లేనంత దగ్గరవుతోంది. ఈ పరిణామం చైనాకు ఆందోళన కలిగిస్తోంది. ఆ చికాకుతోనే చైనా యుద్ధం పేరుతో భయపెట్టే కార్యక్రమానికి తెర తీసింది. కాని, సిక్కింలోని డోక్లామ్ ప్రాంతంలో మన ఆర్మీ, చైనా సైనికులు ముఖాముఖి ఎదురుకాక ముందే యుద్దానికి ఏర్పాట్లు పూర్తైనా… చైనా ఎందుకని యుద్ధం మొదలు పెట్టలేదు? దీంట్లోనే మతలబు వుంది! రకరకాల ఏర్పాట్లు, చిన్న చిన్న గొడవలతో యుద్ధ వాతావరణం సృష్టించి భారత్ ను బెంబేలెత్తించటమే చైనా వ్యూహం. అంతకుమించి ప్రత్యక్ష దాడులకి దిగుతుందా అంటే చాలా చాలా అనుమానమే!   యుద్ధం జరిగే సూచనలు మరీ స్పష్టంగా లేకున్నా ఇండియా మాత్రం జాగ్రత్తగా వుండాల్సిందే. చైనా యుద్ధం మొదలు పెడితే పాకిస్తాన్ కూడా రెచ్చిపోయే అవకాశం వుంది. అసలు గత కొన్ని నెలలుగా అదే పనిగా కాల్పుల ఉల్లంఘన చేస్తోన్ పాక్ వ్యూహం భారత ఆర్మీని బిజీగా వుంచటమే అయి వుండవచ్చ. ఆ విధంగా ఇండియా చైనాను పట్టించుకోకపోతే హఠాత్తుగా చైనా దాడి చేసే అవకాశమూ వుంది. కాబట్టి మోదీ ఇప్పుడు చైనాను, అదే స్థాయిలో పాక్ ను కనిపెట్టాలి. యుద్ధం అనివార్యమైతే రెండు దేశాలతో మనం పోరాడాల్సి వుంటుందని గుర్తించి వ్యూహాలు సిద్ధం చేయాలి…

శత్రువులు మారొచ్చు గాక

మనం చిన్నప్పుడు బయటి ప్రపంచం గురించి అంతగా అవగాహన లేని సమయంలో మన పాఠ్యాంశాల్లో తెలుసుకున్న విషయం ఏంటంటే, భారత దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు దాదాపు 200 ఏళ్ళు దోచుకెళ్లారు. కాబట్టి, మన ప్రథమ శత్రువులు వాళ్ళే అని అప్పట్లో నిర్ణయించుకున్నాం. తర్వాత మన పెద్దలు, ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకున్న విషయం ఏంటంటే, భారత్ కి అసలు ప్రధాన శత్రువు పాకిస్తాన్.    ఒకప్పుడు కలిసి ఉన్న మన సహోదరులు, బ్రిటిషర్లు పెట్టిన మత చిచ్చులో ఉడికి, ప్రత్యేక దేశం కావాలని ఉద్యమం చేసిన సమయంలో, ఎందుకులే ఒక వర్గాన్ని ఇబ్బంది పెట్టి కలసి ఉండడం అని, మహాత్మా గాంధీ దేశం విడిపోవాలని సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. మహానుభావుడు, ఆ సమస్య అక్కడితో సమసిపోతుందని అనుకొని ఉండొచ్చు. కానీ, కాశ్మీర్ లో కొంత భాగం సమర్పించినప్పటికీ ఇండియా, పాకిస్తాన్ చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. ఉగ్ర రూపంలో మన దేశంపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.   అయితే, మనకి పాకిస్తాన్ ని మించిన శత్రువు ఒకరున్నారు తెలుసా? పాకిస్థానీయులకి తెలివి తేటలు నిల్ కాబట్టి, వాళ్ళను ఉపయోగించుకొని తమకి పెద్ద పోటీదారు అయినా భారత్ ని దొంగ దెబ్బ కొట్టే విషయంలో 'డ్రాగన్' దేశం చైనా ఎప్పుడూ తమ సహాయ సహకారాలు అందిస్తూ వస్తుంది. 2014 వరకు చైనా ఆటలు సాగినా..నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రాగన్ పప్పులు ఉడకడం లేదు.   మోడీ ఏంటి మాటి..మాటికి విదేశీ పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఇక దేశం గురించి పట్టించుకునే దెప్పుడు అని. విపక్షాలు విమర్శలు చేస్తున్న సమయంలో కొందరు, 'ఏది చెబితే' అది నమ్మే వాళ్ళు అవును మోడీ దేశాన్ని ఎటు తీసుకెళ్తున్నారు అని తమ గొంతు కలిపారు. అలాంటి వాళ్లందరికీ ఇప్పుడు మోడీ 'విదేశీ పర్యటనల' వెనుక రహస్యం ఇప్పడిప్పడే అర్ధమవుతోంది. భారత్ కి మిత్రులని పెంచుకోవడం... తద్వారా మన బలం ఇది అని చైనా కి హెచ్చరికలు పంపడం... ఇది మోడీ వ్యూహం.   చైనా మీడియా లో మాత్రం ఇండియా చేస్తుంది అక్షరాలా తప్పు అని సరిహద్దు దేశాలన్నిటితో గొడవలు పెట్టుకుంటుందని అవాకులు, చవాకులు పేలుతుంది. ఈ విషయం వచ్చిన ప్రతిసారి '1962 ' గుర్తుంది కదా అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది డ్రాగన్. కానీ, వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భారత్ లో అప్పటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులకీ భారీ తేడా ఉంది. ఇప్పుడు మనతో పెట్టుకుంటే చెడేది తామే అన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు. ఆ మధ్య ఇండియా, అమెరికా, జపాన్ నావికా దళాలు బంగాళాఖాతంలో చేసిన విన్యాసాలు చైనాకి గుబులు పుట్టిస్తున్నాయి.   ఒకటి మాత్రం వాస్తవం, మనకి శత్రువులు పెరుగుతున్నారు, లేదా మారుతున్నారు అంటే అర్ధం మనం చెడ్డ వాళ్ళం అని కాదు, అతి మంచి కూడా కొన్ని సార్లు చెడు చేస్తుంది. ఈ విషయం గుర్తు పెట్టుకుని ఇరుగు పొరుగుతో సత్సంబంధాలు కొనసాగించాలి.

డ్రగ్స్ మత్తు! సినీ గ్లామర్ గమ్మత్తు!

  ఒక సన్నని వస్త్రం. దాని మీద కదిలే బొమ్మలు. సినిమా అంటే ఇంతే! కాని, ఈ టెక్నాలజీని కనుగొంటున్నప్పుడు సదరు సైంటిస్ట్ ఊహించి కూడా వుండడు! ఏమని? మన భారతదేశం లాంటి దేశంలో, తెలుగు, తమిళ రాష్ట్రాల్లాంటి ప్రాంతాల్లో సినీ గ్లామర్ డ్రగ్స్ కంటే ఎక్కువ మత్తు కలిగిస్తుందని! పూరీ జగన్నాథ్ విచారణ కోసం ఎక్సైజ్ శాఖ అధికారుల ముందుకి వచ్చినప్పుడు జరిగిన హంగామా చూస్తే ఎవరికైనా ఇదే ఫీలింగ్ కలుగుతుంది!   అసలు సినిమా వాళ్లకు వుండే ఫ్యాన్స్, వారి పట్ల జనం చూపించే క్రేజ్ ఏ లాజిక్కి అందదు! అయితే, హీరోలు, హీరోయిన్స్ విషయంలో దాన్ని అర్థం చేసుకోవచ్చు! హీరోలో తమని తాము చూసుకుంటారు ఫ్యాన్స్! తమకు లేనివన్నీ అతడిలో చూసుకుని తాత్కాలిక సంతృప్తి పొందుతారు! ఇక హీరోయిన్స్ కైతే వారి అందమే వారికి సర్వం. దాని వల్లే మగ, ఆడా అందరూ అభిమానించేస్తుంటారు. నటన కూడా ఓ కారణమే అయినా హీరోయిన్స్ కి ప్రధనా ఆకర్షణ వారి అందమే! అందుకే బోలెడంత మంది ఫ్యాన్స్! కాని, డ్రగ్స్ తీసుకున్నాడని ఆరోపణ ఎదుర్కొంటోన్న దర్శకుడు  పూరీ జగన్నాథ్ కు భీభత్సంగా ఫ్యాన్స్ వుండటం ఏంటి? వారొచ్చి విచారణ జరుగుతోంటే రోడ్ల మీద పడిగాపులు పడటం ఏంటి? మా దర్శకుడు అమాయకుడు, కడిగిన ముత్యంలా బయటకొస్తాడంటూ మీడియా వారికి చెప్పటం ఏంటి?   డైరెక్టర్ కి ఫ్యాన్స్ వుండకూడదని ఎక్కడా లేదు. హిట్ సినిమాలు ఇస్తే డైరెక్టర్స్ కి కూడా ఫ్యాన్స్ ఏర్పడతారు. కాని, డ్రగ్స్ వాడటం లాంటి సీరియస్ కేసులో ఇరుక్కున్న  పూరీకి ఫ్యాన్స్ అండ లభించటం ఆశ్చర్యకరమే! తెర వెనుక వుండే టెక్నీషియన్స్ కి కూడా ఈ రేంజ్లో ఫాలోయింగ్ వుండటం .. బహుశా తెలుగులో కాక తమిళంలో మాత్రమే వుంటుందేమో! అంతే కాదు, జగన్ విచారణ సమయంలో అక్కడికొచ్చిన అతడి తమ్ముడు, కొడుకుతో కూడా చాలా మంది సెల్ఫీలు దిగారట! ఇది సినీ గ్లామర్ కున్న మరో కోణం! పూరీ ఫ్యామిలీ డ్రగ్స్ కేసు విచారణ సందర్భంగా వుంటే జనం మాత్రం సెల్ఫీలతో మురిసిపోవటం… నిజంగా క్రేజీనే!   జనంలో సినిమా వాళ్లపై అభిమానం వుండకూడదనీ, వాళ్లు తమ అబిమాన హీరో, హీరోయిన్, దర్శకుల వంటి వారికి కష్టమొస్తే నైతికంగా మద్దతు ఇవ్వకూడదనీ మనం చెప్పలేం. అలాగే, ఎవరు ఎవరితో ఎక్కడ సెల్ఫీలు దిగాలో కూడా వారి వారి ఇష్టం! కాని, పూరీ జగన్నాథ్ విచారణ సందర్భంగా ప్రూవ్ అయింది మాత్రం ఒక్కటే! సినిమా గ్లామర్ కు డ్రగ్స్ కంటే మత్తెక్కువ! దాన్నుంచి జనం బయటపడటం అంత ఈజీ కాదు. అందుకే, ఒక్కోసారి చట్టం తన పని తాను చేసుకుపోనీయకుండా రోడ్ల మీదకొచ్చి హంగామా చేస్తుంటారు. అది సల్మాన్ అయినా, జయలలిత అయినా మరొకరైనా ఇంకొకరైనా! ఇప్పుడు పూరీ విచారణ సమయంలోనే ఈ రేంజ్లో హడావిడి జరిగితే రేపు రవితేజ, ఛార్మీలు వస్తే ఏమవుతుందో ఈజీగా ఊహించుకోవచ్చు!

ఉన్న ఆ ఒక్క దిక్కుని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్..!

తెలుగు రాష్ట్రాలకి ఢిల్లీ పెద్దలు ఎప్పుడూ మొండి చేయి చూపిస్తూ వచ్చారు. కాంగ్రెస్ హయాంలో అసలు మనకి పెద్దగా ఒరగబెట్టిందేం లేదనే చెప్పొచ్చు. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక కేంద్ర మంత్రి పదవి చేబట్టిన వెంకయ్య నాయుడు పుణ్యమా అని ఆంధ్ర ప్రదేశ్ కి చాలా విషయాల్లో మంచి జరిగింది. స్పెషల్ ప్యాకేజ్ రావడం అవొచ్చు, కాపిటల్ సిటీ నిర్మాణంలో తోడ్పాటు అవొచ్చు, కొత్త ప్రాజెక్టులు రాష్ట్రానికి తెప్పించే ప్రయత్నాలు అవొచ్చు, ఏది ఏమైనా మన పెద్దాయన ఢిల్లీ లో ఉన్నాడు అనే భరోసా ఉండేది తెలుగు వారికి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో సంబంధాలు మెరుగుపడడంలో వెంకయ్య నాయుడిది కీలక పాత్ర. ఒక మాటలో చెప్పాలి అంటే ఆంధ్ర రాష్ట్ర బాగోగుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి వారధిగా పనిచేసారు నాయుడు గారు.   అలాంటి, మన పెద్ద తన పదవిని త్యజించి ఉప రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలుచున్నారు. ఎవరూ ఊహించని విధంగా, ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే వెంకయ్య నాయుడి పేరు ప్రతిపాదించింది. మంచి, చెడులు బేరీజు వేసిన నాయుడు గారు కాబినెట్ పదవి కన్నా, ఉప రాష్ట్రపతి పదవే మిన్న అని తీర్మానించుకుని తన మంత్రి పదవికి రాజీనామా చేసారు. అలాగే, ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ కూడా దాఖలు చేసారు. ఇది మన తెలుగు వాడికి దక్కిన గౌరవంగా భావించాలా లేక మన దురదృష్టం గా భావించాలో అర్ధం కానీ సందిగ్ధ పరిస్థితి. ఎందుకంటే, మన గోడు దేశ రాజధానిలో వినే నాథుడు మరొకరు లేరు.   బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన వెంకయ్య నాయుడు బీజీపీ కష్ట కాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీ ని అంటబెట్టుకుని ముందుండి నడిపించాడు. ఎవరూ ధైర్యం చేయని సమయంలో నేనున్నానంటూ పార్టీ అధ్యక్షుడి బాధ్యతలు కూడా నిర్వహించారు. ఉత్తరాదిలో ఎన్ని రాజకీయాలు చేసినా, దక్షిణాదిని, ప్రముఖంగా ఆంధ్ర ప్రదేశ్ కి ఎప్పుడూ తన సహాయ సహకారాలు అందించారు. అలాంటి పెద్దాయన సేవలు ఇక మనం కోల్పోతున్నామా అంటే అవుననే చెప్పవచ్చు. అలాగని, తెలుగు వారి బాగోగుల గురించి మొత్తంగా మరచిపోతాడని కాదు, కానీ ఇంతకు ముందులా అన్ని విషయాల్లో పట్టించుకునే సమయం వారికి ఉండకపోవచ్చు.   ఇంకా ఎన్నికలు జరగనప్పటికీ, ప్రత్యర్థిగా గాంధీ వారసుడు గోపాల కృష్ణ గాంధీ ఉన్నప్పటికీ, ఎన్డీయే కి ఉన్న బలం దృష్ట్యా, వెంకయ్య ఉప రాష్ట్రపతి కావడం నల్లేరు మీద నడకలాంటిదే. ఆయన పదవి చేపట్టిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో జోక్యం చేసుకునే అవకాశం లేనప్పటికీ, తన వాళ్ళ కోసం, ఢిల్లీ పెద్దల్ని మెప్పించే ప్రయత్నాలు కొనసాగిస్తారని ఆశిద్దాం! 

డ్రాగన్ … రాక్షసత్వం!

  చైనా తన చుట్టూ వున్న దేశాలతో నక్క రాజీకీయం చేస్తుంటుంది! ఒక విధంగా చూస్తే ఆ దేశం మొత్తం 18దేశాలతో ప్రస్తుతం గొడవ పడుతోంది. తన చుట్టూ వున్న ఏ దేశంతో కూడా చైనాకు స్నేహ బంధం లేదు. అంతటా, అందరి మీదా దౌర్జన్యం చేయటమే చైనా తత్వం! అయితే, ఇది కేవలం విదేశాలకే పరిమితం అనుకుంటే పొరపాటే! తన స్వంత ప్రజల్ని కూడా చైనా దయతో చూడదు. తేడా వస్తే అక్కడి కమ్యూనిస్టు పాలకులు రాక్షసులైపోతారు! అందుకు చక్కటి ఉదాహరణ జూలై 13న మరణించిన 61ఏళ్ల లియు జియబో! ఆయనెవరూ అంటారా…   లియు జియబో ఓ చైనీస్ రచయిత, కవి, మేధావి. ఆయన సంవత్సరాల తరబడి జైల్లో మగ్గి చివరకు క్యాన్సర్ వ్యాధితో విషాదంతం అయ్యారు! నోబెల్ శాంతి బహుమతి కూడా పొందిన ఆయన దేశ ద్రోహం ఆరోపణతో జైల్లో మగ్గిపోయారు. పదకొండేళ్ల శిక్ష అనుభవిస్తోన్న లియు చివరకు అది పూర్తి కాకుండానే మరణించారు. ఒక నోబెల్ గ్రహీత క్యాన్సర్ తో బాధపడుతోంటే చైనీస్ పాలకులు ఎంత మాత్రం పట్టించుకోలేదు. సరి కదా అమెరికా, జర్మనీ లాంటి దేశాలు ఆయనకు ట్రీట్మెంట్ ఇప్పిస్తాం అనుమతించమంటే అందుకు కూడా ఒప్పుకోకుండా రాక్షసంగా ప్రవర్తించారు! అయితే, చైనా కమ్యూనిస్టు పాలకులు లియు అనే రచయిత, కవి, ప్రొఫెసర్ పై ఎందుకు పగ పెంచుకున్నారు?   లియు చేసిన ఘోర తప్పిదం చైనాలో ప్రజాస్వామ్యం కావాలనటం! 1989లో జరిగిన టియానెన్మెన్ స్క్వేర్ ఉద్యమానికి ఆయన మద్దతు పలికారు. విద్యార్థులు కోరిన విధంగా ప్రజాస్వామ్యం వుండాలనీ, ఒకే పార్టీ దేశాన్ని ఏలటం తప్పని చెప్పాడు. అది నచ్చని కమ్యూనిస్టులు వేలాది మంది విద్యార్థుల్ని టియానెన్మెన్ స్క్వేర్ లో కాల్పులు జరిపించి చంపించారు. తరువాత లియును జైల్లో పెట్టించారు. ఆయన క్యాన్సర్ తో చనిపోయేదాకా వదిలిపెట్టలేదు. ఆయన భార్యని కూడా గృహనిర్భంధంలో వుంచి కనీసం ఆమె తల్లిదండ్రులు చనిపోతే అంత్యక్రియలకు కూడా వెళ్లనివ్వలేదు! అంతటి రాక్షసత్వం చైనా పాలకులు లియు , లియు భార్యపై ప్రదర్శించారు!   మాట మాట్లాడితే… సిక్కిం వేర్పాటు వాదులకి మద్దుతు ఇస్తాం, కాశ్మీర్ సమస్యలో వేలు పెడతాం అని బెదిరించే చైనాకి ఇండియా, అమెరికా, జపాన్లు గట్టిగా బుద్ది చెప్పాలి. లియు లాంటి ప్రజస్వామ్య వాదులకి అవసరమైన సహాయం చేయాలి. అక్కడి మానవ హక్కులకి భంగం కలిగిస్తోన్న కమ్యూనిస్టు ప్రభుత్వం పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చేలా పావులు కదపాలి. అది చైనా సామాన్య ప్రజలకి, దాని చుట్టు పక్కల దేశాలకీ, ప్రపంచానికి కూడా మంచిది!

పేర్లు బయటొచ్చాయి! దిమ్మ తిరిగింది! మైండ్ బ్లాంకైంది!

  మొదట డ్రగ్స్ రాకెట్ కలకలం. తరువాత స్కూలు పిల్లలు కూడా డ్రగ్స్ కు బానిసలవుతున్నారంటూ సంచలనం! ఆ తరువాత డ్రగ్స్ కు, టాలీవుడ్ కు లింక్! ఈ మాట చెప్పగానే మీడియా మొత్తం అదరిపోయింది. కొందరికి నోటీసులు కూడా వెళ్లాయనే సరికి మరింత అలెర్ట్ అయ్యాయి న్యూస్ ఛానల్స్. అయితే, నిన్నటి దాకా పోలీసులు టాలీవుడ్ డ్రగ్స్ బాబులు ఎవరో బయటపెట్టలేదు. కాని, వున్నట్టుండీ ఇవాళ్ల ఉదయం తెలుగు సినిమా పరిశ్రమలోని బడాబడా పేర్లు బయటకొచ్చాయి! మత్తు రాజాలు, మత్తు రాణీలు జనం ముందుకొచ్చేశారు! అయితే, అసలు ఇంతగా హంగామా ఎందుకు జరుగుతోంది? గతంలో ఎప్పుడూ లేని విధంగా పేర్లతో సహా వ్యవహారమంతా బయటకి పొక్కటం ఏమిటి?   పూరీ జగన్నాథ్, ఛార్మి, రవితేజ… ఇలాంటి వారి పేర్లు కూడా మీడియాకి లీక్ కావటం ఎవ్వరూ ఊహించనిదే! నిన్నటి దాకా ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చింది మీడియా. కాని, ఇవాళ్ల నేరుగా పేర్లు చెప్పేయటం వెనుక పోలీసుల లీకులే వున్నాయి. వారు ఈ సెలబ్రిటీలకు ఖచ్చితంగా నోటీసులు పంపామని చెప్పకుండా ఏ ఛానల్ కూడా అగ్ర హీరో, మంచి పేరున్న హీరోయిన్, టాప్ డైరెక్టర్ … వీళ్ల పేర్లు జనానికి చెప్పేయదు! అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… టాలీవుడ్ ప్రముఖుల పేర్లు ఎలా బయటకొచ్చాయని పోలీసులు బాస్ అకున్ సబర్వాల్ కూడా సీరియస్ అవుతున్నారట! ఆయనకు కూడా పేర్లు మీడియాకి లీక్ కావటం మరీ విడ్డూరం!   తరూణ్ నుంచీ తనీష్ దాకా చాలా మంది పేర్లు డ్రగ్స్ లిస్టులో చేరిపోయాయి. వాళ్లలో నిజంగా డ్రగ్స్ వాడిన వారు ఎందరో, డ్రగ్స్ బిజినెస్ లో కూడా వేలు పెట్టిన వారు ఎందరో మనకు తెలియదు. కాని, కొన్నవారు, అమ్మినవారు మొత్తం అందరూ ఇప్పుడు పరువు పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. బహుశా లీకుల వెనుక పోలీసుల వ్యూహం ఇదే అయి వుంటుంది. టాలీవుడ్లో డ్రగ్స్ కల్చర్ పెంచి పోషిస్తున్న ప్రముఖులందర్నీ జనం ముందు బుక్ చేయటం వారి ఐడియా అయి వుండాలి. ఎందుకంటే, ఇప్పుడు నోటీసులు అందుకున్న వారందరికీ కోర్టుల దాకా వ్యవహారం వెళ్లి శిక్షలు పడే అవకాశం లేదు. విచారణకు హాజరు కావాలని అధికారులు చెప్పారు కాబట్టి సినిమా వాళ్లు వస్తారు. హాజరవుతారు. వారికి వార్నింగ్ ఇచ్చామన్న పోలీసులు అక్కడితో కథని సుఖాంతం చేస్తారు. ఇంతకంటే ఎక్కువగా స్క్రీన్ ప్లే నడిచే అవకాశాలు దాదాపు లేవు!   టాలీవుడ్లో డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా జరుగుతోందని ఇప్పుడే కాదు చాలా రోజులుగా చాలా మందికి తెలుసు. అయితే, ఇప్పుడు వాళ్లలో కొందరి పేర్లు బయటకు వచ్చాయి. అలాగని పేర్లు బయటకి రాని ఇంకా చాలా మంది మత్తు బాబులు బుద్దిమంతులు అనలేం. కేవలం కెల్విన్ అనే ఒక డ్రగ్ పెడ్లర్ పట్టుబడితేనే ఇంత డొంక కదిలింది. కాబట్టి సినిమా పరిశ్రమలో చీకటి తతంగాలు ఇంకా చాలానే వుండివుంటాయి. కాకపోతే, ఎవ్వరినైనా జైలు శిక్ష దాకా తీసుకెళ్లటం మన వ్యవస్థలో చాలా పెద్ద పని! సల్మాన్ పై వున్న తీవ్రమైన నేరారోపణలు, కేసుల సంగతి చూస్తే మనకు ఎంత సమయం పడుతుందో తెలిసిపోతుంది. అందుకే, మీడియాకి లీకులు ఇవ్వటం ద్వారా డ్రగ్స్ వాడిన సెలబ్స్ కి షాకిచ్చారని భావించవచ్చు. ఈ ఎసిపోడ్ తో ఇక మీదట చాలా మంది ప్రముఖులు జాగ్రత్తగా పడే అవకాశాలున్నాయి. డ్రగ్స్ కు దూరంగా వుండే అవకాశాలూ లేకపోలేదు!   కేవలం మన టాలీవుడ్ ను మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా వున్న సినిమా రంగాల్ని గమనిస్తే మనకు ఒక్కటి అర్థమవుతుంది. చాలా మంది సినిమా సెలబ్రిటీలు, ఇతరుల గ్లామర్ ప్రపంచపు జీవులు డ్రగ్స్ కు బానిసలఅవుతూనే వుంటారు. అందుక్కారణం వారికుండే మానసిక ఒత్తిడి. అలాగే చుట్టూ వుండే మనసు బలహీన పరిచే లైఫ్ స్టైల్. వీటి వల్ల ఇతర రంగాల కంటే కొంచెం ఎక్కువే సినిమా వారు డ్రగ్స్ కు లొంగుతుంటారు. మోడలింగ్ రంగంలోని వారు కూడా ఇదే కోవకు వస్తారు. కాబట్టి టాలీవుడ్ డ్రగ్స్ కలకలం మరీ ఊహించరానిది చూడకూడదు! దాన్ని గ్లామర్ ప్రపంచపు సహజమైన సైడ్ ఎఫెక్ట్ గా స్వీకరించాలి!

బీహార్లో మాడిపోతోన్న లాలూ ఫ్రై!

బీహార్లో నితీష్ కుమార్, బీజేపి పెద్దల పనుల్ని లాలూ ప్రసాద్ కొడుకే స్వయంగా తేలిక చేసి పెడుతున్నట్టు కనిపిస్తోంది! ఎలాగైనా లాలూ ప్రసాద్ తో తెగదెంపులు చేసుకోవాలని చూస్తోన్న నితీష్ కు ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ వ్యవహార శైలి మరింత కలిసి వస్తోంది! తాజాగా ఆయన మనుషులు మీడియా వాళ్లని కూడా వదల్లేదు. రిపోర్టర్లు, కెమెరామెన్ ని చితగొట్టారు! తరువాత తీరిగ్గా మీడియా వాళ్లే గందరగోళానికి కారణం అంటూ ఫేస్బుక్ పోస్టు పెట్టాడు తేజస్వీ!   లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కూతురు, కొడుకుల ఆస్తుల మీద సీబీఐ, ఈడీ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే! కానీ దాని ఎఫెక్ట్ ఇప్పుడు నేరుగా బీహార్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా వున్న తేజస్వీ యాదవ్ పై పడుతోంది. పొత్తులో భాగంగా నితీష్ లాలూ కొడుక్కి డిప్యుటీ సీఎం పదవి ఇచ్చారు. మొదట్లో బీజేపిని కట్టడి చేయటానికి ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్నారు నితీష్. కాని, రాను రాను లాలూ , ఆయన కొడుకుల తీరుతో విసిగిపోయారు. అందుకే, మెల్లగా నోట్ల రద్దును సమర్థించటం లాంటి సంకేతాలతో బీజేపికి దగ్గరయ్యారు. ఇప్పుడు ఇక చివరి అడుగులు వేస్తున్నారు. మోదీ సర్కార్ లాలూ స్థావరాలపై దాడులు చేయిస్తుండటంతో ఇదే అదనుగా నితీష్ పొత్తు నుంచి తప్పుకోవాలనుకుంటున్నాడు!   నితీష్ ఇప్పటికే డిప్యుటీ సీఎం తేజస్వీ యాదవ్ కు నాలుగు రోజుల డెడ్ లైన్ పెట్టాడు. తన మీద వస్తోన్న అవినీతి ఆరోపణలకు వివరణ ఇవ్వాలని కోరాడు. అంటే , ఇన్ డైరెక్ట్ గా రాజీనామా కోరాడన్నమాట. అందుకు లాలూ, అతడి కొడుకు ససేమీరా అంటున్నారు. ఈ గొడవ చివరకు లాలూ, నితీష్ పార్టీల విడాకులకి దారి తీస్తుందని అంతా భావిస్తున్నారు. అంతలోనే లాలూ కొడుకు తన మనుషులతో మీడియా మీద దాడి చేయించాడు!   టీవీ కెమెరాల ముందు తేజస్వీ యాదవ్ మనుషులు స్పష్టంగా చేయి చేసుకోవటం కనిపించినా మళ్లీ తమ తప్పు ఏమీ లేదని బుకాయిస్తున్నాడాయన! మరో వైపు మీడియా కూడా దాడిని సీరియస్ గా తీసుకుని బీహార్ డిప్యుటీ సీఎంని ఏకిపారేస్తోంది. మొత్తంగా ఈ గొడవంతా నితీష్ వ్యూహానికి అనుకూలిస్తోంది. ఆయన ఆర్జేడీ నుంచి విడిపోతే జనంలో వచ్చే వ్యతిరేకత అంతకంతకూ తగ్గిపోతోంది. ఇటు బీజేపి కూడా నితీష్ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తోంది! సో… లాలూ, బీజేపీల గొడవ నితీష్ కి కలిసి వస్తోందన్నమాట!

తన పార్టీ రాష్ట్రపతి అభ్యర్థినే ఇందిర ఎందుకు ఓడించారో తెలుసా?

త్వరలో భారతదేశానికి 14వ రాష్ట్రపతి ఎన్నికాబోతున్నారు. రామ్ నాథ్ కోవింద్, మీరా కుమార్ లు పోటీ పడుతున్నారు. ఇద్దరిలో అధికార పక్షం మద్దతున్న రామ్ నాథ్ కోవింద్ గెలిచే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. దాదాపు ప్రతీసారీ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఇలాగే జరిగిపోతుంది. ఎన్నిక ముందే ఎవరు గెలుస్తారో అందరికి తెలిసిపోతుంది! కాని, 1969లో మన నాలుగవ రాష్ట్రపతి ఎన్నిక సమయంలో మాత్రం ఎవ్వరూ ఊహించని పరిణామం జరిగింది! అధికార కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి ఇందిరా గాంధీ కారణంగా ఓడిపోయారు! ఇండిపెండెంట్ గా పోటీ చేసిన క్యాండిడేట్… ఇందిరమ్మ దయతో ప్రథమ పౌరుడైపోయారు!  మరో విచిత్రం ఏంటంటే… ఆ సంవత్సరం ఓడింది, గెలిచింది ఇద్దరూ తెలుగు వారే!   1969నాటి కాంగ్రెస్ లో రెండు పవర్ హౌజెస్ వుండేవి. ఇందిరా గాంధీ ప్రధానిగా అత్యంత శక్తివంతురాలిగా చెలామణి అయ్యేవారు. అదే సమయంలో ఆమెకంటే సీనియర్లు, కాంగ్రెస్ పెద్దల నేతృత్వంలో ఏఐసీసీ వుండేది. అంటే… అప్పటికి ఇంకా హస్తం పార్టీ పూర్తిగా గాంధీ కుటుంబం హస్తగతం కాలేదన్నమాట! ఆ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ తరుఫున రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయటానికి ఏఐసీసీ నీలం సంజీవ రెడ్డిని ఎంపిక చేసింది. ఆయన మన అనంతపురం జిల్లా వాసి!   ఏఐసీసీ చేసిన ఎంపిక నచ్చని ఇందిర విభేదించింది. అప్పటికి ఉప రాష్ట్రపతిగా వున్నా వివి గిరి పదవికి రాజీనామా చేసి ప్రెసిడెంట్ గా నామినేషన్ వేశారు! ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఆయనకు ప్రధాని మద్దతు పలికారు! కాంగ్రెస్ తరుఫున పీఎంగా వున్న ఇందిర తన పార్టీ అభ్యర్థిని కాక ఇండిపెండెంట్ ని సమర్థించారు! అంతే కాదు, తనదైన స్టైల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరికీ ‘మనస్సాక్షి’గా ఓటు వేయమని చెప్పారు!   ఇందిర లాంటి శక్తివంతమైన ప్రధాని ఇచ్చిన మనస్సాక్షిగా ఓటు వేయండనే పిలుపుకి … కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు విధేయంగా స్పందించారు! దాని ఫలితమే… చరిత్రలో ఒకే ఒక్కసారి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అభ్యర్థి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారు! అలా రాష్ట్రపతి అయిన వివి గిరి కూడా ఒరిస్సాలో పుట్టిన తెలుగు వారే! మొత్తానికి అలా నాలుగువ రాష్ట్రపతి ఎన్నిక కాంగ్రెస్ అధికార అభ్యర్థి కాంగ్రెస్ ప్రధాని కారణంగానే ఓడిపోవటంతో ముగిసింది!

ఎన్టీఆర్‌కు బిగ్ బాస్… బిగ్ లాసా..?

  తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ రామకృష్ణ. ఆయన సీనియర్ ఎన్టీఆర్ కి, జూనియర్ కి కూడా అభిమాని. అయితే, ఆయన తాజా స్టేట్మెంట్ ప్రకారం తారక్ బిగ్ బాస్ షో హోస్ట్ చేయకపోవటం మంచిదట! బిగ్ బాస్ షో చేయటం వల్ల జూనియర్ ఇమేజ్ పాడవుతుందని రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. అంతే కాదు, ఎన్టీఆర్ కంటే ముందు చాలా మంది టాలీవుడ్ అగ్రహీరోల్ని బిగ్ బాస్ షో నిర్వాహకులు అప్రోచ్ కూడా అయ్యారట. వారెవరూ ఒప్పుకోకపోవటానికి కారణం… బిగ్ బాస్ షో వివాదాలమయం కావటమే!   ఇంతకీ బిగ్ బాస్ వల్ల నిజంగా ఎన్టీఆర్ కి ప్రమాదం పొంచి వుందా? ఈ ప్రశ్నకి సమాధానం ఇంచుమించూ అవుననే చెప్పుకోవాలి! తెలుగులో బిగ్ బాస్ షో ఇంకా మొదలు కానప్పటికీ అటు హిందీ, ఇటు తమిళ వర్షన్ల గోల చూస్తుంటే మనకు బిగ్ సంగతేంటో తెలిసిపోతుంది! అసలు కొందరు రకరకాల బ్యాక్ గ్రౌండ్స్ వున్న సెలబ్రిటీల్ని ఒక్కచోటకి చేర్చి… బయటకి వెళ్లకుండా చేసి… వాళ్లకి రకరకాల టాస్క్ లు ఇచ్చి విజేత ఎంపిక చేయటం బిగ్ బాస్ షో ఫార్మాట్! ఇది మన ఇండియాలో పుట్టిన ఐడియా కాదు. విదేశాల్లో టెలివిజన్ ఎంటర్టైన్మెంట్ ను కొత్త పుంతలు తొక్కించటానికి చేసిన ప్రయోగం. అక్కడ బాగా వర్కవుట్ అయింది. దాంతో ఇక్కడికి కూడా పార్సిల్ అయింది. కాకపోతే, పారిన్ లోనూ బిగ్ బ్రదర్ లాంటి షోలు ఎప్పుడూ వివాదాల్లోనే మగ్గుతుంటాయి. అలా లండన్ వెళ్లి బిగ్ బ్రదర్ షోలో పాల్గొన్న మన శిల్ప శెట్టి రాత్రికి రాత్రి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఆమె మీద మరో బ్రిటన్ నటి జాతి వివక్ష ప్రదర్శించటంతో శిల్పా శెట్టి అందరి దృష్టిలో పడింది! అప్పట్లో అదొ పెద్ద దుమారం!   ఇక హిందీలో సల్మాన్ హోస్ట్ చేసే బిగ్ బాస్ కూడా మామూలు రచ్చేం కాదు. చాలా సీజన్స్ నుంచీ నడుస్తోన్న హిందీ బిగ్ బాస్ ప్రతీ సంవత్సరం కొత్త తలనొప్పులు సృష్టిస్తూనే వుంటుంది. కొన్ని సార్లు బిగ్ బాస్ గా వ్యవహరించిన సల్లూ కూడా నానా రకాల ఆరోపణలు, విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది! అయినా కూడా రకరకాల కేసులతో కోర్టుల చుట్టూ తిరిగే కండల ఖాన్ కి ఈ బిగ్ బాస్ కాంట్రవర్సీలు పెద్దగా లెక్కలోకి రాలేదు. పైగా ప్రతీ గొడవా మనోడికి నెగటివ్ గానో, పాజిటివ్ గానో ఉపయోగపడింది కూడా! కాని, అలాంటి ఇమేజ్ మన ఎన్టీఆర్ ది కాదు. ఇప్పుటి వరకూ జూనియర్ పెద్ద పెద్ద వివాదాల్లోకి ఇరుక్కోలేదు. ఇప్పుడు బిగ్ బాస్ వల్ల అనవసరంగా రొంపిలోకి రావాల్సి వస్తుందేమో అని కొందరు భయపడుతున్నారు!   ఎన్టీఆర్ శ్రేయోభిలాషులు టెన్షన్ పడటానికి మరో కారణం… తాజాగా వార్తల్లోకి వచ్చిన తమిళ బిగ్ బాస్. ఎన్నో ఏళ్లుగా మంచి నటుడని పేరున్న కమల్ కు ఈ షో లేనిపోనీ బ్యాడ్ నేమ్ తెస్తోంది. ఆల్రెడీ జనం పెద్దగా పట్టించుకోవటం లేదని ప్రచారం జరుగుతుండగా పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది! కమల్ తమిళ సంస్కృతి చెడగొట్టే విధంగా షో నడుపుతున్నారని అక్కడ కొందరు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. బిగ్ బాస్ షో నడిచే తీరు తెలిసిన వారు ఎవరైనా సంస్కృతి విషయంలో ఆందోళన చెందటం సహజమే! అందుకే, బిగ్ బాస్ పై పదే పదే వివాదాలు రేగుతుంటాయి!   తెలుగు బిగ్ బాస్ జనం ముందుకొచ్చాక రెస్పాన్స్ ఎలా వుంటుందో ఇప్పుడే తెలియదు! కానీ, వివాదాలు మాత్రం తప్పకపోవచ్చన్నట్టుగా వుంది ముందస్తు పరిస్థితి. ఏది ఏమైనా తారక్ ఎలాగోలా తన ఇమేజ్ పాడుకాకుండా జాగ్రత్తపడితే మంచిది! లేదంటే కమల్, సల్మాన్ లా ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది!