హ్యాండిచ్చిన కాంగ్రెస్ అభయహస్తం చూపితే ఆంధ్రులు నమ్మేస్తారా?

  కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ సౌత్ వైపుకొచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ నేత  మాటల్లో చెప్పాలంటే ఆయన బాహుబలి! మన తెలుగు బాహుబలి దక్షిణం నుంచీ ఉత్తరం వెళ్లి బాక్సాఫీసులు కొల్లగొడితే ఉత్తరాది బాహుబలి అయిన రాహుల్ దక్షిణాదికి వచ్చారు. ఓట్లు కొల్లగొట్టగలిగారా లేదా ఎన్నికలొస్తే తెలుస్తుంది! కాని, అసలు విషయం ఏంటంటే… ప్రధాన ప్రతిపక్షంగా వున్న తెలంగాణలో సభ ఓకే! కాని, సున్నా సీట్లున్న ఏపీలో కాంగ్రెస్ బాహుబలి బహిరంగ సభ సంగతేంటి?   వైఎస్ పాదయాత్రతో అధికారంలోకి వచ్చిన సోనియా కాంగ్రెస్ పదేళ్లు సమైక్య ఆంధ్రను ఆటాడుకుంది. మరీ ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత దిల్లీ నుంచీ వచ్చే ఆదేశాలు, సందేశాలు, ఉద్దేశ్యాలతో తెలుగు నేల గందరగోళం అయిపోయింది. చివరకు , 2014లో రెండు ముక్కలు కూడా అయింది. అయితే, తెలంగాణ ప్రజల చిరకాలం వాంఛ తీర్చి కూడా ప్రతిపక్షానికే పరిమితం అయింది రాహుల్ బాబా పార్టీ! మరి ఆంధ్రాలో విభజనకి కారణమై ఏం మూటగట్టుకుంది? ఇప్పుడప్పుడే చల్లారని ఆంధ్రుల ఆగ్రహాన్ని స్వంతం చేసుకుంది! అటువంటి ఖాతా తెరవని , తెరవలేని రాష్ట్రంలో యువరాజా హడావిడి అనవసర హంగామానే అనుకోవాలి!   గుంటూరులో సభ పెట్టి చంద్రబాబును, జగన్ను, మోదీని చెడామడా విమర్శించిన రాహుల్ ప్రధానంగా ప్రత్యేక హోదా సమస్య రాజేయాలని తాపత్రయపడ్డారు. ఆంధ్రా ప్రజలకి నిజంగానే ప్రత్యేక హోదా రాలేదనే బాధ వుంది. కాని, అందుకు మూల కారణమైన కాంగ్రెస్సే ఇప్పుడు దాన్ని క్యాష్ చేసుకోవాలనుకోవటం దారుణం! విభజన బిల్లు తయారు చేసిన కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రత్యేక హోదా ఆలోచనే చేయలేదు. పట్టుబట్టిన వెంకయ్య నాయుడుని చల్లబర్చేందుకు మన్మోహన్ చేత మాట ఇప్పించారు. అసలు బిల్లులో పెట్టని హోదా ఎన్డీఏ ఎందుకని ఖచ్చితంగా ఇవ్వాలి? దీనికి రాహుల్ వద్ద సమాధానం లేదు! అలాగే,జనం కోరిక మేరకు బీజేపి ఇవ్వకుండా మోసం చేసిన హోదా కాంగ్రెస్ వస్తే ఎలా ఇస్తుంది? నీతీ ఆయోగ్ లాంటి వ్యవస్థల్ని కాదని ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వటం సాధ్యమా? అస్సలు కుదరదు. ఇప్పుడు అధికారంలో వున్న బీజేపీ,టీడీపీల వల్ల కాని ఆర్దిక సంబంధమైన నిర్ణయం రేపు కాంగ్రెస్ వస్తే కూడా వీలు కాదు. ప్రత్యేక హోదా అనే ఏర్పాటు గడిచిపోయిన చరిత్ర ఒక్క ఆంధ్రాకే కాదు ఇక మీదట ఏ భారతీయ రాష్ట్రానికీ అటువంటి అవకాశం లేదు. అన్నీ తెలిసినా రాహుల్ తాము వస్తే ప్రత్యేక హోదా అంటూ పచ్చి మోసానికి తెర తీశాడు!   హోదానే కాదు… పోలవరం గురించి రాహుల్ మాట్లాడినదంతా కూడా విడ్డూరమే! తాము పదేళ్లు పునాదులు తోడి పక్కన పారేసిన పోలవరం చంద్రబాబు కమీషన్ల కోసం కడుతున్నారని అనటం… విచిత్రం. పోలవరం కాంగ్రెస్ అధికారంలో వున్నప్పుడు ఎందుకు పూర్తి చేయలేదు? దీనికి కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ దగ్గర నో యాన్సర్! కాని, ఒకేసారి సున్నా ఎమ్మెల్యే స్థానాల నుంచి అధికారంలోకి తీసుకొచ్చే మ్యాజిక్ ఫిగర్ దాకా తమని ఓటర్లు నెత్తిన పెట్టుకుని అసెంబ్లీకి తీసుకుపోతే … ఏపీకి మహర్ధశ పట్టిస్తారట!   పోయిన చోటే వెదుక్కోవాలని మనకు ఓ సామెత వుంది. అలా ప్రత్యేక తెంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో తెలుగు ప్రాంతాన్ని మొన్నటి వరకూ ఓ ఆటాడుకున్న కాంగ్రెస్ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో మరోసారి అధికారం వెదుక్కుంటోంది! తెలంగాణలో కాస్త ఆశలు పెట్టుకోవచ్చు కాని… అంతా పోయిన ఆంధ్రాలో అందలం ఎక్కటం అంత ఈజీ కాదు! నిజానికి… అసాధ్యం! కాబట్టి రాహుల్ సభల మీద కంటే ఏపీలో ముందు పార్టీని కింద నుంచి బలోపేతం చేసుకోటంపై దృష్టి పెడితే బెటర్!

ప్రతి సభలో ఓ పావుగంట... కాంగ్రెస్‌పై కసిని పెంచుతున్న చంద్రబాబు

కాంగ్రెస్‌పై చంద్రబాబు విరుచుకుపడుతున్నారు. రాహుల్‌ సభతో ప్రత్యేక హోదాపై వేడి రగల్చడంతో తన నోటికి పనిచేబుతున్నారు. ప్రతి సభలోనూ కనీసం ఓ పావుగంట.... కాంగ్రెస్‌పై విమర్శలకు కేటాయిస్తున్నారు. ఏపీకి అన్యాయం చేసిన వారిపై జాలిపడొద్దనీ, అలాగని విధ్వంసాలకు పాల్పడవద్దంటూ ప్రజలకు చంద్రబాబు సీఎం హోదాలో పిలుపునివ్వడం రాజకీయంగా హాట్‌ టాపిక్‌‌గా మారింది.   కౌరవ సభలో ద్రౌపదికి అవమానం జరిగితే నాడు పెద్దలు ఎలా మౌనంగా ఉన్నారో ....రాష్ట్ర విభజన సమయంలో కూడా కాంగ్రెస్ పెద్దలు అలానే మౌనంగా ఉన్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. నాడు అధికారంలో ఉండి అన్యాయం చేసిన వాళ్లే ...మళ్లీ రాష్ట్రంపై కపట ప్రేమను కురిపిస్తున్నారని రాహుల్‌గాంధీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ క్షమించరాని నేరం చేసిందనీ, వైసీపీ కూడా అందులో కుట్రదారేనని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన వారిపై జాలిపడొద్దనీ, అలా అని విధ్వంసాలకు పాల్పడవద్దని ప్రజలకు బాబు పిలుపునిచ్చారు.   మొత్తంగా నవనిర్మాణ దీక్షల పేరుతో ప్రతిరోజూ జరుగుతున్న సభల్లో కాంగ్రెస్ విభజన చేసిన తీరును గుర్తు చేస్తూ ప్రజల్లో కసి పెంచే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. 

ముగిసిన అధ్యాయమా..? కథ ఇంకా ఉందా..?

ఏపీలో మళ్ళీ ప్రత్యేక హోదాగ్ని రగిలింది. కొంతకాలంగా సబ్దుగా ఉన్న అంశాన్ని మరోసారి మేల్కొలిపింది కాంగ్రెస్ పార్టీ. హోదా వచ్చేవరకు పోరు ఆగదని హెచ్చరించింది. గుంటూరు సభతో ప్రత్యేక హోదా ఆకాంక్ష మరోసారి బలంగా వినిపించింది. దేశంలోని ప్రముఖ పార్టీల నేతలంతా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని నినదించారు. ఈ దెబ్బతో హోదా డిమాండ్ మళ్ళీ ప్రముఖంగా తెరపైకి వచ్చింది. కానీ కేంద్రం మాత్రం మెట్టు దిగే పరిస్థితి కనిపించడం లేదు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమనే చెబుతోంది. ప్యాకేజీతో నవ్యాంధ్ర బతుకు చిత్రం మారేస్తామంటోంది. కేంద్రం మాటలకు చంద్రబాబు అండ్ కో కూడా వంత పాడుతోంది. తాజాగా నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగరియా కూడా మరోసారి ప్రత్యేక హోదా కథ ముగిసిందని తేల్చేశారు.    ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమో కాదో గానీ..భవిష్యత్తులో మాత్రం ఇదే అంశం కీలకంగా మారే ఛాన్స్ కనిపిస్తోంది. 2019 ఎన్నికల నాటికి ఇదే బలమైన డిమాండ్ అవ్వబోతోంది. ఏపీలోని విపక్ష పార్టీలకు ప్రత్యేక హోదా ఒక వరంగా మారబోతోందన్నది నిజం. ప్రజల్లో ఉన్న భావోద్వేగాన్ని క్యాష్ చేసుకోవడానికి అన్ని పార్టీలు శక్తి వంచన లేకుండా ప్రయత్నించే అవకాశం కనిపిస్తోంది.    జనసేనాని పవన్ కల్యాణ్ , వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే ప్రత్యేక హోదా గళం గట్టిగా వినిపించారు. జగన్ అయితే రాజీనామాలకు సైతం సై అన్నారు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ కూడా ఇప్పుడు ప్రత్యేక హోదా అంశాన్నే ఫోకస్ చేస్తోంది. ప్రత్యేక హోదా భావోద్వేగ సమస్య కాదనీ.. రాష్ట్ర జీవన్మరణ సమస్య అనే తరహాలో... ఆయా పార్టీలు ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. మొత్తంగా 2019 ఎన్నికల వరకు ఈ అంశం సజీవంగా ఉండటమే కాకుండా... ప్రధాన ఎన్నికల నినాదంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. 

కాంగ్రెస్‌ హటావో... దేశ్ బచావో అన్న నోటితోనే జైకొట్టడమేంటి?

  ఏపీలో స్పెషల్ స్టేటస్ ఫైట్ మళ్లీ ఊపందుకున్నట్లు కనిపిస్తోంది. ప్రత్యేక హోదా కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ-టీడీపీలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న పార్టీలకు మద్దతుగా పరిణామాలు మారుతున్నాయి. ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా తమ యువనేత రాహుల్ గాంధీతో సమరశంఖం పూరించిన కాంగ్రెస్ కు జనసేనాని మద్దతివ్వడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. గుంటూరులో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో మద్దతు తెలిపారు. అంతేకాదు... స్పెషల్ స్టేటస్ సాధించేందుకు అన్ని పార్టీలు ఒకే వేదికపైకి రావాలని కూడా సూచించారు.   సభకు రావాలని కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందినా సమయాభావంతో రాలేకపోతున్నానన్న పవన్... బహిరంగ సభల ద్వారానే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలమని ట్వీట్ చేశారు. అయితే... ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమని నీతి అయోగ్ తాజాగా ప్రకటించేసింది. సీఎం చంద్రబాబు కూడా దానిపై ఆశలు వదిలేసి ప్రత్యేక ప్యాకేజీతోనే సరిపెట్టుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ఇంతకాలం ఆయనకు మిత్రపక్షంగా కొనసాగిన పవన్... ఇలా కాంగ్రెస్ పోరాటానికి మద్దతు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.   కాంగ్రెస్ సభకు పవన్ మద్దతివ్వడమంటే అధికార పార్టీకి ఝలక్ తగిలినట్లేనని కొందరు విశ్లేషిస్తుంటే... ప్రత్యేక హోదా కోసమే ఎన్నికల బరిలోకి దిగుతానన్న పవన్ కల్యాణ్.. ఇలా మరో పార్టీకి మద్దతివ్వడమే కాకుండా.. అందరూ ఒక్కతాటిపైకి రావాలని పిలుపునివ్వడమేంటని మరికొందరు ఆశ్చర్యపోతున్నారు. మొత్తంగా పవన్ కల్యాణ్ తాజా ట్వీట్స్‌పై హాట్‌హాట్‌గా చర్చ నడుస్తోంది. స్పెషల్ స్టేటస్ కోసం రాహుల్ ను రాష్ట్రానికి రప్పించిన కాంగ్రెస్ పార్టీపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. జనసేనాని మాత్రం జై కొట్టడం వెనక ఆంతర్యమేంటని అంటున్నారు. అంతేకాదు కాంగ్రెస్‌ హటావో... దేశ్ బచావో అన్న నోటితోనే మూడేళ్లు తిరగకుండానే కాంగ్రెస్‌కు జైకొట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు.

నేవీలో పోకిరీలు... అమ్మాయిలు స్నానం చేస్తుంటే వీడియోలు...

  విశాఖ తూర్పు నావికా దళ ప్రతిష్ట మసకబారుతోంది. వరుసగా జరుగుతున్న ఘటనలు నేవీ పేరును మంట కలుపుతున్నాయి. ఎంతో క్రమశిక్షణతో ఉండాల్సిన నేవీ ఉద్యోగుల్లో కొందరు పోకిరీ వేషాలు వేస్తూ అభాసుపాలవుతున్నారు. విశాఖ శ్రీహరిపురం ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీలో ఓ మహిళ స్నానం చేస్తుండగా...నేవీ ఉద్యోగి సందీప్ నర్వాల్ పోకిరీ వేశాలేశాడు. వీడియో చిత్రీకరిస్తూ అడ్డంగా దొరికి పోయాడు. దాంతో చితకబాదిన స్థానికులు... సందీప్‌ను పోలీసులకు అప్పగించారు. నిందితుడు గతంలో కూడా మహిళల అభ్యంతర కరమైన వీడియోలు తీసి... పోర్న్‌ సైట్లో పోస్ట్‌ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.   సందీప్ నర్వాల్ తరహాలోనే కొందరు ఉద్యోగులు అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారు.  హిజ్రాలతో గొడవ, మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలు చేయడం వంటి కేసులు నమోదు అయ్యాయి. సందీప్ నర్వాల్ అరెస్టుకు కొద్ది గంటల ముందే ఐఎన్ఎస్ రాణా యుద్ద నౌక లో పని చేస్తున్న మధ్యప్రదేశ్ కు చెందిన వికాస్ అనే సైలర్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. నౌక దగ్గరకు విధులకు వెళ్లిన కొద్దిసేపటికే గన్‌ పేలి ప్రణాలు కోల్పోయాడు. వికాశ్‌ మృతిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.   అయితే ఎక్కువరోజులు కుటుంబాలకు దూరంగా ఉండటం వల్లే ఉద్యోగులు మానసిక ఒత్తిడికి లోనై మద్యానికి బానిస కావడం, నేరాలకు పాల్పడం పారిపాటిగా మారుతున్నట్లు తెలుస్తోంది.

మియాపూర్‌ ల్యాండ్‌ స్కామ్‌ వెనుక సీఎం పేషీ హస్తముందా?

  మియాపూర్ ల్యాండ్‌ స్కామ్‌ రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. ఓవైపు అరెస్టుల పర్వం కొనసాగుతుండగానే మరోవైపు నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వేలకోట్ల విలువైన భూముల అక్రమ రిజస్ట్రేషన్లలో అధికార పార్టీ నేతల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ కేసులో మంత్రి తలసాని ప్రమేయం ఉందన్నారు దిగ్విజయ్ సింగ్. దిగ్విజ్‌ ఆరోపణలపై తలసాని సీరియస్‌ అయ్యారు. తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు గాను దిగ్విజయ్ కి లీగల్ నోటీసులు పంపిస్తానని.... 10కోట్ల పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.   మియాపూర్‌ ల్యాండ్‌ స్కామ్‌లో సీఎం పేషీ ప్రమేయముందని షబ్బీర్‌ అలీ ఆరోపించారు. ఎంసెట్‌, నయీమ్, ఓటుకు నోటు కేసులను సైడ్‌ ట్రాక్‌ చేసినట్లే.... దీన్ని కూడా పక్కనబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే మియాపూర్‌ భూకుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ కూడా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ పాలన మూడు స్కామ్‌లు.... ఆరు అవినీతి దందాల్లా సాగుతోందన్నారు. మియాపూర్‌ భూదందాలో 17వేల కోట్ల స్కామ్‌ జరిగిందన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న రేవంత్‌... ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సీఎం మహమూద్ అలీపై చర్యలు తీసుకోవాలన్నారు.   మొత్తానికి మియాపూర్‌ ల్యాండ్‌ స్కామ్‌... కేసీఆర్‌ సర్కార్‌ మెడకు చుట్టుకుంటోంది. ఈ కుంభకోణంలో ఏకంగా సీఎం పేషీపైనే ఆరోపణలు రావడం.... మరోవైపు విపక్షాలన్నీ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తుండటంతో.... టీఆర్‌ఎస్‌ సర్కార్‌ తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.

హైదరాబాద్‌లో లేడీ గ్యాంగ్‌... సాఫ్ట్‌గా వచ్చి కోట్లు కొట్టేస్తారు...

  వాళ్లను చూస్తే పోలీసులకు కూడా అనుమానం రాదు... చూడ్డానికి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిస్‌లా ఉంటారు... స్టార్‌ హోటళ్లలోనే బస చేస్తారు... కాస్ట్లీ కారుల్లోనే ప్రయాణిస్తారు..... హాలీవుడ్‌ సినిమా మాదిరిగా దోపిడీ చేసి మళ్లీ ఫ్లైట్‌లో ఈజీగా చెక్కేస్తారు.... చోరీ సొత్తును దేశాలు దాటించి సొమ్ము చేసుకుంటారు... వీళ్లంతా కాస్ట్‌లీ దొంగలు... దేశవ్యాప్తంగా ఎన్నో దొంగతనాలు చేశారు.... కానీ ఎవరికీ దొరకలేదు.... ఈసారి హైదరాబాద్‌పై కన్నేశారు. భారీ స్కెచ్చే వేశారు. అనుకున్నట్లు టార్గెట్‌ రీచ్‌ అయ్యారు...   దేశవ్యాప్తంగా ఎన్నో చోరీలు చేసిన ఈ ఇంటర్నేషనల్‌ గ్యాంగ్‌ ఈసారి హైదరాబాద్‌‌‌ను ఎంచుకుంది.... అనుకున్నట్లే రెండు నెలల క్రితం స్టార్‌ హోటల్‌లో దిగారు. హైదరాబాద్‌లో ఎక్కడ దోపిడీ చేయాలని ప్లాన్‌ చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో రెక్కీ కూడా నిర్వహించారు. ఎంత వెదికినా అనువైన స్పాట్‌ దొరకలేదు. కొంచెం లేటైనా భారీ టార్గెట్‌ కొట్టాలనుకున్నారు. అనుకున్నట్లే ఏప్రిల్‌ 8న బంగారం వ్యాపారం అభిషేక్ అగర్వాల్‌.... కూకట్‌పల్లిలో ఈ గ్యాంగ్‌ కంటబడ్డాడు. గోల్డ్‌ షాపులకు బంగారం విక్రయిస్తుండగా చూశారు. అదేరోజు హాలీవుడ్‌ థ్రిల్లర్ సినిమాను తలపించేలా చోరీ చేసి ఎస్కేప్‌ అవ్వాలని పథక రచన చేశారు. అయితే ఆరోజు వీలుకాకపోవడంతో 8రోజులు ఆగి... ఏప్రిల్‌ 16న తమ స్కెచ్‌ అమలు చేసింది గ్యాంగ్‌. అగర్వాల్‌ ఇంటి దగ్గర బయల్దేరినప్పటి నుంచి వెంబడించాడు. అనువైన ప్రాంతాన్ని ఎంచుకుని అగర్వాల్‌ కారుకు పంక్చర్‌ చేసి తమ ప్లాన్‌ అమలు చేశారు. ఇదేమీ గమనించని అగర్వాల్‌.... కారులో వెళ్తుండగా... వెనుక నుంచి ఫాలో అవుతోన్న ముఠా.... మీ కారు పంక్చర్‌ అయ్యిందంటూ ఓవర్ టేక్‌ చేస్తూ చెప్పారు. వెంటనే అగర్వాల్‌ కారు ఆపి చూడగా.... టైర్లో గాలి లేదని గమనించి.... టైరు మార్చే పనిలో పడ్డాడు. అదే సమయంలో ఓ మహిళను రంగంలోకి దింపిన గ్యాంగ్.... అగర్వాల్‌ దృష్టిమరల్చి కారులో ఉన్న బంగారు నగల బ్యాగ్‌‌ను తీసుకుని ఉడాయించింది. అయితే టైరు మార్చుకుని వచ్చేసరికి నగల బ్యాగ్‌ లేకపోవడంతో.... అగర్వాల్‌ పోలీసులకు సమాచారమిచ్చాడు. మొత్తం మూడున్నర కిలోల గోల్డ్ చోరీకి గురైందని, దాని విలువ కోటిన్నర ఉంటుందని ఫిర్యాదు చేశాడు.   కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు ఇంటర్నేషనల్‌ గ్యాంగ్‌ ఆటకట్టించారు. టెక్నికల్‌ పాయింట్స్‌, సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా కారును ఐదుగురు డ్రైవ్‌ చేసినా.... పోలీసుల నుంచి తప్పించుకోలేకపోయారు. ఇక వీరు ఉపయోగించిన కారును.... OLXలో కొనుగోలు చేసి, నకిలీ పాస్‌పోర్ట్‌ జిరాక్స్‌ ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. నిందితులు వాడిన మొబైల్‌ నెంబర్లను కూడా పోలీసులు కనిపెట్టారు. సెల్‌ నెంబర్ల ఆధారంగా దర్యాప్తు చేయగా.... ఢిల్లీలో ఫేక్‌ సిమ్స్‌ను 2వేల రూపాయలకు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ముఠాలోని వారంతా విదేశీయులే. మొత్తం 8మంది నిందితుల్లో నలుగురిని పట్టుకోగా.... మరో నలుగురు పరారీలో ఉన్నారని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ శాండిల్యా తెలిపారు. అయితే నిందితుల నుంచి ఎక్కువ బంగారాన్ని రికవరీ చేయలేకపోయామని సీపీ వెల్లడించారు.

రాహుల్‌ సభలో మాజీ డిప్యూటీ సీఎంకు అవమానం... ఆలస్యంగా వెలుగులోకి...

  ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగారు. రాష్ట్రం విడిపోవడానికి ముందున్న కాంగ్రెస్ సర్కారులో నెంబర్ టూ. అలాంటి వ్యక్తిని సంగారెడ్డి కాంగ్రెస్‌ ప్రజాగర్జన సభలో పక్కనబెట్టేశారు. రాహుల్ పాల్గొన్న కీలక సభలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహది ప్రేక్షక పాత్రే అయ్యింది. సభ జరిగింది స్వయానా దామోదర సొంత జిల్లాలోనే. అయితే ఈ సభలో రాహుల్ రావడానికి ముందు.....రాహుల్ వచ్చాక చాలా మంది నేతలు మట్లాడారు. మెదక్ జిల్లా నేతలతో పాటు ఆ జిల్లాకు చెందని వారు కూడా ప్రసంగాలు దంచేశారు. కానీ దామోదరునికి మాత్రం మైకు పట్టుకునే అవకాశం రాలేదు.   నిజానికి సంగారెడ్డి సభ ఏర్పాట్లలో దామోదర రాజనర్సింహ చాలా చురుగ్గా పాల్గొన్నారు. సొంత జిల్లాలో జరుగుతున్న సభ కావడంతో చాలా ఉత్సాహం కనబరిచారు. కానీ క్లైమాక్స్ కు వచ్చేసరికి సీన్ రివర్స్ అయ్యింది. ఆయన ఎవరికీ కాకుండా పోయారు. ఓ సాధారణ నేతలా స్టేజీపైన కూర్చుండిపోయారు. రాహుల్ కు జరిగిన సన్మాన కార్యక్రమాల్లో కానీ ...స్టేజిపై మాట్లాడే విషయంలో కానీ మాజీ డిప్యూటీకి అస్సలు అవకాశం దక్కలేదు. అయితే పార్టీ నేతలే ఆయన చేత మాట్లాడించలేదా..? ఆయనే ప్రసంగానికి దూరంగా ఉన్నారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.   అయితే రాహుల్ సభలో దామోదరను పక్కన పెట్డానికి అంతర్గత కుమ్ములాటలే కారణమని పార్టీ నేతలు చెప్పుకొంటున్నారు. ఏదిఏమైనా రాహుల్‌ పాల్గొన్న సభలో దళిత సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతను దూరంగా ఉంచడంపై విమర్శలు చెలరేగుతున్నాయి.

ఎన్నికల్లోపు మరో నాలుగైదు... రాహుల్‌ టూర్‌ సక్సెస్‌తో టీకాంగ్రెస్‌లో జోష్‌...

రాహుల్‌ టూర్‌తో తెలంగాణ కాంగ్రెస్‌ నేలు ఖుషీ అవుతున్నారు. సంగారెడ్డి సభ సూపర్‌ సక్సెస్‌ అయ్యిందంటున్న టీకాంగ్‌ నేతలు... ఇలాంటి సభలు ఎన్నికల్లోపు ఆరేడు పడితే ప్రజల్లోకి మన వాయిస్‌ బలంగా వెళ్తుందని, పార్టీ ఊహించని విధంగా పుంజుకుంటుందని భావిస్తున్నారు. రాహుల్‌ తన ప్రసంగంలో కేసీఆర్‌ ఫ్యామిలీని ఏకిపారేశారని, అదే సమయంలో తెలంగాణ ప్రజలు ఆలోచించే విధంగా మాట్లాడారని అంటున్నారు. ప్రసంగ పాఠాన్ని రాష్ట్ర నేతలే ప్రిపేర్‌ చేసినప్పటికీ... సూటిగా సుత్తి లేకుండా పాయింట్‌ టు పాయింట్‌ ప్రజల్లోకి వెళ్లిందంటున్నారు.   ముఖ్యంగా హక్కుల కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం... కేసీఆర్‌ కుటుంబం చేతిలో బందీ అయ్యిందంటూ రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయంటున్నారు. ఒక్క కుటుంబం కోసమేనా... తెచ్చుకుంది... ఆ నలుగురి కోసమే నాలుగు కోట్ల ప్రజలు పోరాటాలు చేయాలా అంటూ రాహుల్‌ సంధించిన ప్రశ్నలు... జనంలో ఆలోచనను రేకెత్తించాయని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. తెలంగాణ శక్తి, వనరులు, ప్రజల ఆశలు, కలలు, మీ పిల్లల భవిష్యత్‌, అధికారాలు అన్నీ కేసీఆర్‌ కుటుంబం చేతిలో బందీ అయ్యాయన్న రాహుల్‌... ఇదేనా మీరు కోరుకున్న తెలంగాణ అంటూ ప్రజల్లో ప్రశ్నలు రేకెత్తించగలిగారని అంటున్నారు.   ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలు గురించి మాట్లాడిన రాహుల్‌... అన్నదాతల ఆత్మహత్యలతో తెలంగాణ స్మశానంగా మారుతోందన్నారు. ఈ మూడేళ్లలో 2వేల 855మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే... అందులో ఒక్క కేసీఆర్‌ నియోజకవర్గంలోనే వంద మంది ఉన్నారని ఆరోపించారు. మద్దతు ధర అడిగితే సంకెళ్లు వేసి జైల్లో పెడతారా అంటూ ప్రశ్నించారు. రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదన్న రాహుల్‌.... ఇదేం రుణమాఫీ అంటూ ఎద్దేవా చేశారు. ఇంటికో ఉద్యోగమని చెప్పి.. ఊరికో ఉద్యోగమైనా ఇవ్వలేదని మండిపడ్డారు. రీడిజైనింగ్‌ పేరుతో దోచుకుంటున్నారని... ఇదేనా బంగారు తెలంగాణ అంటే అంటూ నిలదీశారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌కు తూట్లు పొడిచి... ఆ డబ్బుతో ఇల్లు కట్టుకున్నారంటూ రాహుల్‌ ఆరోపించారు. నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందన్న రాహుల్‌... తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన  విద్యార్ధులకు ఏం చేశారంటూ ప్రశ్నించారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి... 4వేల స్కూళ్లను మూసేశారంటూ ఆరోపించారు. ల్యాండ్‌ మాఫియా, పార్టీ ఫిరాయింపులపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందరి అధికారాలను లాక్కుని... ఆ నలుగురే అధికారం అనుభవిస్తున్నారంటూ రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళ్లాయి. ఆర్ధిక జల భూవనరులపై హక్కులు, బంగారు భవిష్యత్‌ కోసం ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటే.... కేసీఆర్‌ కుటుంబం కోసమే తెలంగాణ ఏర్పడినట్లుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.   మొత్తానికి కేసీఆర్‌ ఫ్యామిలీ టార్గెట్‌గా సాగిన రాహుల్‌ స్పీచ్‌.... తెలంగాణ కాంగ్రెస్‌ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఇదే తరహాలో ఎన్నికల్లోపు కనీసం నాలుగైదు సభలు రాహుల్‌ చేత నిర్వహిస్తే... పార్టీ పుంజుకునే అవకాశముంటుందని అంటున్నారు.

సింహం సింగిల్‌గానే వస్తుంది... జులైలో పొలిటికల్ ఫొటో షూట్..?

  రజనీ పొలిటికల్ ఎంట్రీ ఊహాగానాలు తమిళ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే నేతలు రజనీ వైపు చూస్తున్నారన్న వార్త... ఆయా పార్టీల్లో కాక పుట్టిస్తోంది. అయితే రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందా..? ఉంటే..ఏ పార్టీలో చేరతారు.. లేదా సొంత పార్టీ పెడతారా..? సొంతంగా వస్తే... ముహూర్తం ఎప్పుడు..? అనే ప్రశ్నలకు సమాధానం దొరికింది.   రజనీ పొలిటికల్ ఎంట్రీ గురించి ఆయన అన్నయ్య స‌త్యనారాయ‌ణ‌ గైక్వాడ్ సంచ‌లన ప్రక‌ట‌న చేశారు. అవినీతిని అంతం చేయ‌డానికి త‌న సోద‌రుడు రాజ‌కీయాల్లో వ‌స్తున్నట్టు చెప్పేశారు. పార్టీ పేరు, జెండా, ఎజెండా గురించి చ‌ర్చలు జ‌రుగుతున్నాయని జులైలో ప్రక‌ట‌న ఉంటుంద‌ని స‌త్యనారాయ‌ణ గైక్వాడ్ స్పష్టం చేశారు. అలాగే కొద్దిరోజుల కిందట గాంధీ ప్రజాసంఘం అధ్యక్షుడు దమిళరువి మణియన్‌ ...రజనీకాంత్‌ను కలిసిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి రావడం తథ్యమని తేల్చి చెప్పారు. వీరి మాటలు ఇప్పుడు తమిళ రాజకీయాల్లో మరింత వేడిని రాజేశాయి. అంతేకాదు రజనీ పార్టీలో చేరతామంటూ ఐదుగురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాయబారం పంపడం హాట్‌ టాపిక్‌‌గా మారింది   తమిళనాడులో కొన్ని దశాబ్దాలుగా అన్నాడీఎంకే, డీఎంకే గుత్తాధిపత్యం మాత్రమే సాగుతోంది. ఈ రెండు పార్టీల్లో ఏదో పార్టీకి మాత్రమే అధికారం దక్కుతోంది. అయితే అమ్మలేని అన్నాడీఎంకేను తీసేస్తే....ప్రస్తుతం తమిళనాట ఏకైక బలమైన పార్టీ డీఎంకే మాత్రమే. కానీ ఆ పార్టీ అధినేత కరుణానిధి వృద్ధాప్యం కారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కరుణానిధి కొడుకు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఇంకా తనను తానుగా నిరూపించుకోవాల్సి ఉంది. ప్రస్తుతం తమిళ ప్రజలు తమను పరిపాలించే బలమైన నేత ఎవరా అని వేయి కనులతో ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితిలో రజనీకాంత్ కు మాత్రమే ఆ స్థానాన్ని భర్తీ చేయగల సత్తా ఉందని రాజకీయ శ్లేషకులు చెబుతున్నారు. అన్నాదురై.. కరుణానిధి... ఎంజీఆర్, జయ తరహాలో తమిళనాడు రాజకీయాలను శాసించగల అవకాశం అభిమాన ధనం కబాలీకి ఉందని విశ్లేషకుల అంచనా. రజనీ పొలిటికల్ ఎంట్రీకి సరైన సమయమిదేనని.... తలైవా రాజకీయ ప్రవేశంతో తమిళనాడులోని ప్రధాన పార్టీల జాతకాలు తారుమారవడం ఖాయమని లెక్కలు కడుతున్నారు. మరి సింహం సింగిల్‌గా వస్తుందా? లేక మరో సింహంతో కలిసి వస్తుందో చూడాలి.

స్వాతి-నరేష్‌ లవ్‌ అండ్‌ మర్డర్‌ కేసులో మరో ట్విస్ట్‌... వెలుగులోకి కొత్త విషయాలు

  సంచలనం సృష్టించిన భువనగిరి స్వాతి-నరేష్‌ లవ్‌ అండ్‌ పరువు హత్య కేసులో ఎల్బీనగర్‌ పోలీసులు.... హైకోర్టుకు పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. నరేష్‌ను స్వాతి తండ్రి శ్రీనివాస్‌రెడ్డే చంపాడన్న పోలీసులు.... ఆధారాలు దొరకకుండా నరేష్‌ అస్థికలను మూసీ నదిలో కలిపారంటూ తెలిపారు. నరేష్‌ మర్డర్‌ తర్వాత స్వాతి ఆత్మహత్య చేసుకుందని... అయితే ఈ సంఘటనపైనా అనుమానాలున్నాయంది. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందన్న పోలీసులు.... ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకున్నట్లు తెలియజేసింది. ఆత్మకూరు ఎస్సైను సస్పెండ్‌ చేయడంతోపాటు రామన్నపేట సీఐ శ్రీనివాస్‌, భువనగిరి టౌన్‌ సీఐ శంకర్‌గౌడ్‌, చౌటుప్పల్‌ ఏసీబీ స్నేహిత, భువనగిరి ఏసీపీ మోహన్‌రెడ్డిలకు ఛార్జ్‌ మెమోలు ఇఛ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు.   అయితే నరేష్‌ ఆచూకీ తెలపాలంటూ అతని తల్లిదండ్రులు దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై విచారణను హైకోర్టు క్లోజ్‌ చేసింది. నరేష్‌ హత్య చేయబడ్డాడంటూ పోలీసులు నివేదిక ఇవ్వడంతో ఇక విచారణ అవసరం లేదంటూ కేసును మూసివేసింది. అయితే పోలీసుల తీరుపై పలు అనుమానాలున్నాయని, దర్యాప్తు సరిగా సాగడం లేదని నరేష్‌ తండ్రి తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దాంతో పోలీసుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన హైకోర్టు...  దర్యాప్తులో ఏమైనా అనుమానాలుంటే.... తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని నరేష్‌ తల్లిదండ్రులకు సూచించింది. ఇక నరేష్‌తోపాటు కూతుర్ని కూడా శ్రీనివాస్‌రెడ్డే చంపేశాడని నరేష్‌ తండ్రి ఆరోపించాడు. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని నరేష్‌ తండ్రి కన్నీటిపర్యంతమయ్యాడు.   మరోవైపు నిందితులను ఐదురోజుల పోలీస్‌ కస్టడీకి భువనగిరి కోర్టు అనుమతించడంతో... మరింత సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దాంతో ఇప్పటికే అనేక ట్విస్టులు, మలుపులు తిరిగిన ఈ కేసులో ఇంకెన్ని సంచలనాలు బయటికొస్తాయో చూడాలి.

కేసీఆర్‌ శెభాష్‌ అంటుంటే... హైకోర్టు ఏకిపారేసింది... జనం మాటే వినిపించింది

  తెలుగు రాష్ట్రాల పోలీసులను ఉమ్మడి హైకోర్టు ఏకిపారేసింది. భువనగిరి స్వాతి-నరేష్‌ లవ్‌ అండ్‌ మర్డర్‌ కేసును విచారించిన ఉన్నత న్యాయస్థానం.... పోలీసుల తీరుపై విరుచుకుపడింది. పోలీసులు ‎ఎందుకు పారదర్శకంగా ఉండటం లేదని ప్రశ్నించింది.... పోలీసులు తమ ఇమేజ్‌ కాపాడుకోవాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మెజారిటీ ప్రజలు.... పోలీసులు తీరుపై అసంతృప్తితో ఉన్నారన్న డివిజన్‌ బెంచ్‌.... ఎందుకు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది. పోలీసుల వ్యవహారశైలిపై మెజారిటీ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని అభిప్రాయపడ్డ హైకోర్టు.... తమ ఇమేజ్‌ను కాపాడుకునేలా పోలీసులు వ్యవహరించాలంటూ ఘాటు వ్యాఖ‌్యలు చేసింది.   తెలుగు రాష్ట్రాల్లో పరువు హత్యలపై ఉమ్మడి హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా తెలంగాణలో పరువు హత్యలు పెరిగిపోతున్నాయంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసిన న్యాయస్థానం..... పోలీసులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడింది. నరేష్‌-స్వాతి కేసులో పాయింట్‌ టు పాయింట్ ప్రశ్నించిన డివిజన్‌ బెంచ్‌... పోలీసులను ఏకి పారేసింది. ఎందుకు బాధితుల పక్షాన నిలబడటం లేదంటూ నిలదీసింది. ప్రజలు ఆరోపిస్తున్నట్లుగా పోలీసులు ఏకపక్షంగానే వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడింది. నరేష్‌-స్వాతి కేసులో పోలీసుల దర్యాప్తు తీరుపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల తీరుపై మెజారిటీ ప్రజలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని... పనితీరు, వ్యవహారశైలి మార్చుకోవాలని సీరియస్‌ వార్నింగ్‌ ఇఛ్చింది.   భువనగిరి స్వాతి-నరేష్‌ లవ్‌ అండ్‌ మర్డర్‌ కేసులో హైకోర్టు వ్యాఖ్యలు పోలీస్‌ శాఖలో సంచలనంగా మారాయి. ఒకవైపు పోలీసుల పనితీరుపై తెలంగాణ ప్రభుత్వం, ముఖ‌్యమంత్రి కేసీఆర్‌ శెభాష్‌ అంటుంటే.... హైకోర్టు వ్యాఖ‌్యలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉండటంతో ...పోలీస్‌ వ్యవస్థలో సమూల ప్రక్షాళన అవసరమనే మాట వినిపిస్తోంది.

ఆంధ్రా మాల్యా..గోల్డ్‌స్టోన్ ప్రసాద్..!

హైదరాబాద్ శివార్లలో వెలుగులోకి వచ్చిన భారీ భూకుంభకోణం ప్రభుత్వవర్గాల్లోనూ..అధికారుల్లోనూ తీవ్ర అలజడి రేపుతోంది. సుమారు రూ.10 వేల కోట్ల విలువైన భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ల ద్వారా పక్కదారి పట్టించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ భూముల మళ్లింపు ద్వారా ప్రభుత్వానికి రూ.587.11 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు పేర్కొన్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.10 వేల కోట్లు ఉంటుందని అంచనా. ఈ కుంభకోణం వెనుక దాగిఉన్న పెద్ద తలకాయలు ఎవరా అన్నది చర్చానీయాంశంగా మారింది. పలువురు రియల్టర్లు, గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు కలిసి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో కుమ్మక్కై ఈ కుంభకోణానికి తెర లేపినట్లు సమాచారం. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టిన ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్న అక్రమార్కులు..తమ బండారం బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో ఇందులో పాత్రధారులతో పాటు తెర వెనుక సూత్ర ధారులను పట్టుకునేందుకు పోలీసులు వేట ప్రారంభించారు. ఈ వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా నడిపించిన వ్యక్తి గోల్డ్ స్టోన్ ప్రసాద్‌ ఆచూకీ కోసం పోలీసులు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దేశం మొత్తం గాలిస్తున్నారు.   అసలు ఎవరీ గోల్డ్‌స్టోన్ ప్రసాద్..? ఇప్పటి వరకు పోలీసులు చేసిన దర్యాప్తులో ప్రసాద్ చీకటి కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఇతని పూర్తి పేరు పొన్నాపుల సంజీవ ప్రసాద్ అలియాస్ పిఎస్ ప్రసాద్ అలియాస్ గోల్డ్‌స్టోన్ ప్రసాద్. గోల్డ్ స్టోన్ గ్రూప్ ఛైర్మన్‌గా, మానసిక వైద్యుడిగా చలామణి అవుతూ దాని వెనుకే కబ్జాలు, సెటిల్‌మెంట్లతో భూదందా సాగిస్తున్న అతని నిజస్వరూపం వెలుగులోకి వస్తోంది.  అతని ప్రస్థానం అనేక చీకటి కోణాల మయం. ఏకంగా అమెరికాలోని ఫైనాన్షియల్ సంస్థలకు టోకరా వేసి ఘనత వహించిన అమెరికా దర్యాప్తు సంస్థలనే ముప్పుతిప్పలు పెట్టిన ఘనుడు. లేని ఆస్తులను ఉన్నట్లు చూపించి బీసీసీఐ బ్యాంక్ నుంచి 16.8 మిలియన్ డాలర్లు, 1.4 మిలియన్ డాలర్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, 1.5 మిలియన్ డాలర్లు బ్యాంక్ ఆఫ్ ఒమన్ నుంచి, బ్రాంచ్ బ్యాంక్ అండ్ ట్రస్ట్ కంపెనీ ఆఫ్ నార్త్ కరోలినా నుంచి 2.5 మిలియన్ డాలర్లు , ఇలా మొత్తం 27 మిలియన్ డాలర్ల లోన్‌ను మంజూరు చేయించుకున్నారు.   బీసీసీఐ బ్యాంక్‌ నుంచి రుణాన్ని మంజూరు చేయించుకునేందుకు గాను బ్యాంక్ ఛైర్మన్‌కు 2.50 లక్షల డాలర్లు, చీఫ్ క్రెడిట్ మేనేజర్‌కు లక్ష డాలర్లు లంచం ఇచ్చినట్లు గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌పై అభియోగాలున్నాయి. ఇచ్చిన రుణం వెనక్కు రాకపోవడం..తదితర కారణాలతో అనతి కాలంలోనే బీసీసీఐ బ్యాంక్ దివాళా తీసింది. ఉన్నపళంగా ఈ బ్యాంక్ దివాళాకు కారణమేంటో తెలుసుకోవాలని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఒక దర్యాప్తు కమిటీని నియమించింది. ఇక్కడే ఉంటే తన బాగోతం బయటపడుతుందని భావించిన ప్రసాద్ అమెరికా నుంచి మెల్లగా జారుకున్నాడు. ఈ కేసుతో అతనికి world's most wanted fugitiveగా పేరు వచ్చింది. భారత్‌కు తిరిగివచ్చిన తన పలుకుబడితో మళ్లీ కంపెనీలు ప్రారంభించాడు..అప్పట్లో ఓ మాజీ ప్రధాని, ఇతర ప్రముఖులతో ఉన్న సాన్నిహిత్యం ఉండటంతో ఇతను ఆడింది ఆట, పాడింది పాటగా సాగింది. మాజీ ప్రధానికి అత్యంత సన్నిహితులుగా ముద్రపడ్డ సతీశ్ శర్మ అతని సోదరుడు గ్యారీ శర్మ గోల్డ్‌స్టోన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు.   హైదరాబాద్‌ను తన కార్యకలాపాలకు కేంద్ర స్థానంగా మార్చిన ప్రసాద్‌కు ఉమ్మడి ఏపీకి పీసీసీ చీఫ్‌గా పనిచేసి ప్రస్తుతం టీఆర్ఎస్‌లో కీలకపాత్ర పోషిస్తున్న నేత బాగా దగ్గరయ్యాడు. ఇంకేముంది రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉండటంతో తనలోని కబ్జాదారుడిని మెల్కొలిపాడు. సాధారణ ప్రజల భూముల నుంచి ప్రభుత్వ భూములను హామ్ ఫట్ చేస్తూ అతని దందా సాగింది..ప్రసాద్ కబ్జాల గురించి శివారు ప్రాంతాల ప్రజలు కథలు, కథలుగా చెప్పుకుంటారు. నిజాం కుటుంబానికి చెందిన అత్యంత విలువైన భూములను కూడా అక్రమంగా ప్రసాద్ అనుచరులు రాయించుకున్నట్లు ఫిర్యాదులున్నాయి. ఖుర్షీద్ జాహి ఎస్టేట్‌కు చెందిన రూ.40 వేల కోట్ల రూపాయల విలువైన భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని హామీద్ ఉన్నీసాబేగం గతంలో ముఖ్యమంత్రులను కలిసి ఫిర్యాదు చేసినా ఫలితం లేదు.   తాను ఏం చేసినా అడిగేవారు లేరని ఇప్పుడు ఏకంగా అతిపెద్ద భూకుంభకోణానికే తెరదీశాడు. అప్పుడు బీసీసీఐ బ్యాంక్ అధికారులు సహకరించినట్లుగానే ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ రాచకోండ శ్రీనివాస్, అధికారులు, బడా రాజకీయ నేతలు ప్రసాద్‌ పనిలో తలో చేయ్యి వేసి ప్రభుత్వానికి వందల కోట్లు నష్టం చేకూర్చారు. అడ్డూ అదుపు లేకుండా పెద్ద ఎత్తున భూకబ్జాలు, లావాదేవీలు జరుపుతున్నా ఇంతవరకు ఆయన పేరు గానీ..ఆయన పై ఫిర్యాదు కానీ నమోదు కాలేదంటే ఎంతటి బలమైన వ్యక్తులు ప్రసాద్ వెనుకున్నారో అర్థం చేసుకోవచ్చు. కానీ పాపం పండినప్పుడు ఎంతటి పలుకుబడి ఉన్నా..ఎవరున్నా తప్పించుకోలేరు..

మోదీతో మీటింగ్ కి… చిన్న డ్రస్సు వేసుకొచ్చిన పెద్ద పాప!

ఫేస్బుక్, ట్విట్టర్ లాంటివి వచ్చాక సెలబ్రిటీలు ఏం చేసినా న్యూసే అవుతుంది! ప్రియాంక జర్మనీలో ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకోవటం అలాగే పెద్ద బ్రేకింగ్ న్యూసైంది! అసలు ఇండియాలో హ్యాపీగా కలుసుకోక మన ప్రధానిని మరేదో దేశంలో కలుసుకోవటం మొదటి విడ్డూరం. పోనీ కలిస్తే కలిసింది అనుకుంటే… పిగ్గీ చాప్స్ చాలా నెలలుగా హాలీవుడ్ ప్రాజెక్ట్స్ కోసం విదేశాల్లో వుంటోంది! ఆ ఎఫెక్టేమో… కాస్త పొట్టి డ్రెస్ వేసుకుని పీఎం ముందుకి వచ్చింది. అంతేనా… కాలు మీద కాలేసుకుని ఆయనతో మాట్లాడింది! ఈ మీటింగ్ లో పెద్దగా చెప్పుకోటానికి ఇంపార్టెంట్ అప్ డేట్స్ ఏం లేవుగాని… పీసీ ఒక పీఎం ముందు ఇలా డ్రెస్సింగ్ చేసుకుని అలా కూర్చోవచ్చా అన్నదే పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది!   ప్రియాంక వేసుకున్న డ్రస్ గురించి మోదీగాని, బీజేపిగాని ఏం అనలేదు. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ జరిగిపోయింది. ఆమె డ్రస్, ఆమె వ్యవహారశైలి బాగోలేదని ట్రాల్స్ అల్లరి చేశారు. ఇక తాను కూడా వెనక్కి తగ్గేది లేదని డిసైడ్ అయిన ప్రియాంక చోప్రా … తల్లితో కలిసి పొట్టి డ్రస్సులు వేసుకున్న ఒక ఫోటో తీసి మళ్లీ సోషల్ మీడియాలో పెట్టింది! తల్లికూతుళ్ల కాళ్లు కనిపించేలా వున్న ఆ ఫోటోని మన సంప్రదాయవాద సోషల్ మీడియా సైనికులు విపరీతంగా ట్రెండింగ్ చేశారు! ఇక యథావిధిగా బాలీవుడ్లోని ఇతర నటీనటులు మా ప్రియాంక చోప్రా చేసింది చాలా గొప్ప పనంటూ వెనకేసుకొచ్చారు!   నిజానికి విదేశంలో వున్న ప్రధానితో సమావేశం అన్నప్పుడు ప్రియాంక కాస్త హుందాగా వస్తే బావుండేది. అలాగే, ఆమె చేసిందేదో ఘోరమైన అపరాధం అన్నట్టు సోషల్ మీడియా యుద్ధ వీరులు కూడా అల్లరి చేయకుంటే ఇంకా బావుండేది! నెగిటివ్ గా అయినా సరే.. ప్రస్తుతం తన బేవాచ్ రిలీజ్ అవబోతున్న సమయంలో పీసీ మాత్రం హ్యాపీగా పబ్లిసిటీ సంపాదించుకుంది! సోషల్ మీడియా వల్ల వచ్చిపడ్డ కొత్త ట్రెండ్ ఈ టీకప్పులో తుఫాన్ వివాదాలు! 

ఏలియన్స్… మనకు అనుమానం రాకుండా మన మధ్యే వున్నారట!

ఏలియన్స్ అనే టాపిక్ మీద ఇండియన్స్ కి శ్రద్ధ కాస్త తక్కువే! గ్రహాంతర వాసులు వున్నారా? వుంటే ఎక్కడ వున్నారు? ఎలా వుంటారు? ఇటు వైపేమైనా వచ్చే అవకాశం వుందా?... ఇలాంటి కొశన్స్ మనం అసలు వేసుకోం! వేసుకునే కొద్ది మంది కూడా హాలీవుడ్ సినిమాల్లో చూపే ఏలియన్స్ కథలు చూసి… అదే నిజమనుకుంటూ వుంటారు! కాని, ఫ్యాక్ట్ ఏంటంటే.. ఇప్పటి వరకూ సైంటిస్టులు అధికారికంగా గ్రహాంతర వాసులు వున్నారని ప్రకటించలేదు!   విశ్వాన్ని, అంతరిక్షాన్ని అధ్యయనం చేసే నాసా, ఇస్రో సైంటిస్టులు ఇప్పటి దాకా ఏలియన్స్ గురించి అఫీషియల్ గా ఏం చెప్పకపోయినా… ఒక్కాయన మాత్రం నోరు విప్పారు! గ్రహాంతర వాసులు వున్నారనీ… వారిలో కొందరు మన మధ్యే వున్నారని కూడా ఆయన అంటున్నాడు! అసలు మన నడుమనే ఏలియన్స్ వున్నా మనకు ఆ విషయం తెలియటం లేదని సదరు మేదావి చెప్పుకొచ్చారు! ఆయనే… రాబర్ట్ బిగ్లో!   రాబర్ట్ నాసా వారితో కలిసి అంతరిక్ష వ్యాపారం చేస్తోన్న ఒక బిజినెస్ మ్యాన్! ఆయన కంపెనీ అంతరిక్షంలో చెక్కుచెదరని నిర్మాణలు ఎలా చేయాలన్న అంశంపై నాసాతో కలిసి పని చేస్తోంది! రాబర్ట్ కంపెనీ రెడీ చేస్తోన్న నమూనాలు ఓకే అయితే… అంతరిక్షంలో రేపు అవ్వే హోటల్స్ , ల్యాబ్ లు, ఫ్యాక్టరీలుగా మారతాయి! అందుకే, ఆయనకి అంతరిక్ష పరిశోధనలు, గ్రహాంతర వాసుల గురించి అధ్యయనం చేసే నాసా బృందాలతో దగ్గరి సంబంధాలు వున్నాయి!   రాబర్ట్ ను ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో అడుగగా, ఆయన ఏలియన్స్ ఖచ్చితంగా వున్నారని స్పందించాడు! అంతే కాదు, మన మధ్యే ఏలియన్స్ సాదాసీదా కలిసిపోయారని ఆయన చెప్పాడు. వార్ని గుర్తించటం చాలా కష్టమన్నాడు. అయితే, ఆయన తనకు అలాంటి నమ్మకం కలగటానికి కారణమైన అంశాల్ని మాత్రం చెప్పలేదు. అలాగే మన మధ్యే ఏలియన్స్ వున్నారన్న తన కామెంట్ కి సపోర్ట్ గా ఎలాంటి ప్రూఫ్స్ చూపలేదు! ఇక నమ్మలా వద్దా అన్నది మన ఇష్టం! 

అవినీతి బురద కొద్దిగా వున్నప్పుడే… కడుక్కోవటం మంచిది!

కేంద్రంలో యూపీఏ పాలన పదేళ్లు, సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పదేళ్లు కొనసాగాయి. తరువాత 2014లో ఏపీ, తెలంగాణ,  దిల్లీల్లో ప్రభుత్వాలు మారాయి. అయితే, మోదీ, చంద్రబాబు, కేసీఆర్ ఇంత వరకూ గర్వంగా చెప్పుకోగలిగింది అవినీతి రహిత పాలనే! ఆంధ్రాలో వైసీపీ బాబుగారి అవినీతి అంటూ గోల చేసినా ఇప్పటి వరకూ బలమైన ఆధారాలతో ఏ కేసులోనూ కార్నర్ చేయలేకపోయింది. ఇక మోదీ, కేసీఆర్ అయితే ప్రతిపక్షాలకి అవినీతి విషయంలో కొంచెం కూడా అవకాశం ఇవ్వలేదు. వేరే వివాదాలు ఎన్ని తలెత్తినా అవినీతి, కుంభకోణాలు మాత్రం అటు ఎన్డీఏ ప్రభుత్వాన్ని, ఇటు గులాబీ సర్కార్ ని ఇబ్బంది పెట్టలేదు. కాని, తాజాగా బయటపడ్డ మియాపూర్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ కుంభకోణం… టీఆర్ఎస్ ప్రభుత్వానికి మచ్చతెచ్చేలా కనిపిస్తోంది…   ఎనీవేర్ రిజిస్ట్రేషన్ పద్ధతిని ఆసరా చేసుకుని సబ్ రిజిస్ట్రార్ స్థాయి అధికారులు చేతి వాటం చూపిన సంగతి కొన్ని రోజులుగా హాట్ టాపిక్ అవుతోంది. కోట్లు ఖరీదు చేసే నగరంలోని భూములు ఆక్రమార్కుల చేతికి చిక్కాయి. ఇప్పుడు కేసీఆర్ గట్టి చర్యలు తీసుకుని జరిగిన డ్యామేజ్ కంట్రోల్ చేయటానికి ప్రయత్నిస్తున్నప్పటికీ మీడియాలో వస్తున్న కథనాలు ఆయన సర్కార్ ప్రతిష్ఠ దిగజార్చేలా వున్నాయి. తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోకుంటే తొలి తెలంగాణ ప్రభుత్వంపై వున్న పారదర్శకమైన అభిప్రాయం బలహీనపడే అవకాశం వుంది.   మియాపూర్ లో కోట్లాది రూపాయల విలువ చేసే భూములు గోల్ మాల్ చేశారు అధికారులు. అయితే, ఇప్పుడు సరికొత్తగా వినిపిస్తున్న టాక్ ప్రకారం కేసీఆర్ క్యాబినేట్లోని ఒక సీనియర్ మంత్రి ఈ కుంభకోణానికి సహకరించారట! ఆయన పేరు, ఆయన శాఖ గురించి మీడియా చెప్పకున్నా…. చాలా బలమైన ఆధారాలే లభించాయట ఆయన ఇన్వాల్వ్ మెంట్ గురించి. అసలు మియాపూర్ భూముల గోల్ మాల్ లో తొలి లబ్ధిదారుడు ఆయనే అంటోంది మీడియా. 50కోట్లు విలువ చేసే భూమి మంత్రి ఫ్రీగా కాజేశారట.   కేసీఆర్ క్యాబినేట్లో ఒక సీనియర్ మంత్రి స్వయంగా ప్రొత్సహించి మియాపూర్ భూముల అక్రమాలు నడిపించారనేది మామూలు ఆరోపణ కాదు. అందులో నిజం వున్నా లేకున్నా సీఎం వెంటనే ఆ మంత్రి ఎవరో నిర్ధారించుకుని చర్యలు తీసుకుంటే బావుంటుంది. అసలు అవినీతి జరగకపోతే చాలా బావుండేది. కాని, తప్పు జరిగిందని ఆల్రెడీ అర్థమవుతోంది. ఇక అందులో మంత్రి హస్తం వుందని వార్తలు రావటం జనంలోకి తప్పుడు సంకేతాలు పంపుతాయి. అందుకే, కేసీఆర్ సదరు మంత్రి ఎవరో తెలుసుకుని వేటు వేస్తే నైతికంగా వుంటుంది. ఆయన తప్పేం లేదని భవిష్యత్ లో తేలితే తిరిగి పదవి ఇవ్వవచ్చు. గతంలో సీఎం మంత్రి రాజయ్యను కఠిన వైఖరి అవలంబి తొలగించారు. ఇప్పుడూ అలాగే చేస్తే ఆయనపై జనంలో నమ్మకం పెరుగుతుంది! లేదంటే, ప్రభుత్వ ప్రతిష్ఠ మసకబారే అవకాశం లేకపోలేదు. ఈ మధ్యే జింకల వేట విషయంలో కూడా ఓ మంత్రి పేరు పదే పదే పరోక్షంగా వినిపిస్తూ వచ్చింది…

కేసీఆర్‌ సర్వేలపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదట?

  సర్వే ఎవరి చేత చేయించారు? శాంపిల్ గా ఎంత మందిని తీసుకున్నారు? ఈ ప్రశ్నలు వేస్తోంది...ఏ విపక్ష ఎమ్మెల్యేనో... ప్రత్యర్ధులో కాదు... స్వయంగా టీఆర్‌‌ఎస్‌ ఎమ్మెల్యేలే కేసీఆర్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకేంటే...కేసీఆర్ సర్వే ఫలితాలపై సొంత పార్టీ ఎమ్మెల్యేల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. 119 సీట్లకు గానూ 111 సీట్లు రావడమేంటని... ఇది అతిశయోక్తి కాకపోతే మరేంటని అంటున్నారు.   చాలా మంది టీఆర్ఎస్ MLA లు కేసీఆర్ సర్వేల తీరును తప్పుబడుతున్నారు. అసలు సర్వేలు ప్రమాణికం కాదంటున్నారు. 2004 ఎన్నికల ముందు అప్పటి సీఎం చంద్రబాబు కూడా సర్వేలను అతిగా నమ్మి మోసపోయారని గుర్తుచేస్తున్నారు. గతంలో చంద్రబాబు సొంత మనుషులతో సర్వేలు చేయించుకుని టీడీపీదే గెలుపనే నమ్మకంతో ముందస్తు ఎన్నికలకెళ్లి బొక్కబోర్లా పడ్డారని ఉదహరిస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా సర్వేల శాస్త్రీయత గురించి పట్టించుకోకుండా... వాటినే నమ్ముతున్నారని పెదవి విరుస్తున్నారు. అంతేకాదు కేసీఆర్ సర్వేపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.   కేసీఆర్ రెండు నెలల క్రితం చేయించిన రెండో సర్వేలో టీఆర్ఎస్ కు 106 సీట్లు వస్తాయని తేలగా.. తాజా సర్వేలో 111 స్థానాలు వస్తాయని తేల్చారు. అంటే మూడో సర్వేలో గతం కంటే ఐదు సీట్లు ఎక్కువ వచ్చాయి. నిజానికి ఈ కొద్దికాలంలోనే ప్రభుత్వంపై అనేక వర్గాల్లో వ్యతిరేకత ఏర్పడింది. మిర్చి గిట్టుబాటు ధర లేకపోవడం, రైతులకు బేడీలు వేసిన ఘటన, ధర్నా చౌక్ గొడవ, నిరుద్యోగ ధర్నాలతో రాష్టం అట్టుడికింది. అలాంటప్పుడు సీట్లు తగ్గాల్సి ఉండగా...ఎలా ఎక్కువ వస్తాయని టీఆర్‌ఎస్‌ నేతలే ప్రశ్నిస్తున్నారు.   కాంగ్రెస్ కు కేవలం రెండు సీట్లే రావడమేంటని అంటున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ సిట్టింగులు ఆ పార్టీకి గడ్డు పరిస్థితులున్న రోజుల్లో కూడా ఓడిపోలేదని... అలాంటిది ఇప్పుడెలా ఓడిపోతారని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి హమీలు సరిగా అమలు కాకపోవడంతో... తామే నియోజకవర్గాల్లో తిరిగే పరిస్థితి లేదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఇక తన పనితీరుపై తన నియోజకవర్గంలో సమాచారం సేకరించినట్లుగా ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పలేదని నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువ MLA అంటున్నారు. కేసీఆర్ చెప్పిన లెక్కలు ఇంటలిజెన్స్ విభాగం ఇచ్చిన సమాచారంలా ఉందని అంటున్నారు.   అతి విశ్వాసానికి పోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని అధికార పార్టీ ఎమ్మెల్యేలు కొందరు ఆందోళన చెందుతున్నారు. ఎలాగూ గెలుస్తాం కదా అని అస్త్ర సన్యాసం చేస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు...MIM సీట్లలో మరో పార్టీ గెలవడం ఎలాగూ అసాధ్యం. కాబట్టి కాంగ్రెస్ గెలిచే రెండు సీట్ల కోసం..రాబోయే రెండేళ్ళపాటు కష్టపడాలా అన్న భావన పార్టీ కాడర్ లో వస్తే..సెల్ఫ్ గోల్ కావడం ఖాయమని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. విపక్షాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే కేసీఆర్ సర్వేల పేరుతో మైండ్ గేమ్ ఆడుతున్నారని...అయితే అది బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

రజినీ పొలిటికల్ ఎంట్రీ… పచ్చి బూతులు మాట్లాడుతోన్న సీనియర్ డైరెక్టర్!

హీరోలు చాలా మందే వుంటారు! అందరూ స్టార్లు కారు! స్టార్లు కూడా చాలా మంది వుంటారు! అందరూ సూపర్ స్టార్లు కారు! ఇక రజినీకాంత్ అవ్వటం… సూపర్ స్టార్లు అందరికి కూడా సాధ్యం కాదు! అలాంటి ఫాలోయింగ్ అండ్ క్రేజ్ తలైవాది! ఆ కారణం చేతనే.. ఇప్పుడు తమిళ రాజీకయ, సినిమా ప్రముఖులు తెగ ఉలిక్కిపడుతున్నారు నరసింహ పేరు చెబితే!   కబాలి పొలిటికల్ ఎంట్రీ కన్ ఫర్మ్ అయిపోయింది. అందుకే, ఇప్పుడు ఇక ఇంత కాలం నోరు మూసుకుని కూర్చున్న తమిళ పొటుగాళ్లందరూ రంకెలు వేస్తున్నారు! కమల్ హసన్ నుంచీ శరత్ కుమార్ దాకా అందరికీ రజినీ ఫోబియా పట్టుకుంది! మరీ ముఖ్యంగా, జయ, కరుణా ప్రభావం లేని ప్రస్తుత తమిళ రాజకీయ ముఖ చిత్రంలో రజినీ వచ్చేస్తే ఆయనే గాఢ్ ఫాదర్ అయ్యే ప్రమాదముంది! గ్యారెంటీగా రజినీకాంత్ సెన్సేషన్ సృష్టిస్తారని చెప్పలేకున్నా… పెద్ద పెద్ద వాళ్లు కూడా బెంబేలెత్తుతున్న తీరు చూస్తే పెను మార్పులు తప్పవనిపిస్తోంది!   ఫ్యాన్స్ తో సమావేశమైన రజినీకాంత్ తమిళనాడులో మంచి పొలిటీషన్స్ లేరని ఒక కామెంట్ చేశాడు. అదే ఇప్పుడు భారతీరాజా అనే సీనియర్ దర్శకుడికి ఆగ్రహం తెప్పించింది. సూపర్ స్టార్ పై తిట్ల వర్షం కురిపించేలా రెచ్చగొట్టింది. తలైవాని విమర్శించ వద్దని ఎవ్వరమూ చెప్పకున్నా.. భారతీరాజా మాట్లాడిన మాటలు వింటే జుగుప్స కలుగుతుంది ఎవరికైనా! అంతలా దిగజారి మాట్లాడాడు ఎంతో సీనియర్ అయిన ఆయన! తమిళుడు కాని రజినీకాంత్ ఇప్పుడొచ్చి తమిళ ప్రజలపై పెత్తనం చెలాయిస్తే ఊరుకునేది లేదంటూనే… తమిళ రాజకీయ నేతలు మంచివారు కాదని అనటాన్ని తప్పుబట్టారు! కాకపోతే తనదైన స్టైల్లో మీతిమీరి మాట్లాడుతూ … మా నేతలు మంచి వారు కాకపోతే నువ్వు వస్తావా? నా భార్యకి గర్భం రాకపోతే నా బిడ్డకి నువ్వు తండ్రివి అవుతానంటావా? అంటూ వెకిలిగా ప్రశ్నించాడు భారతీరాజా!   ఇప్పటికే తనని తాను గొప్ప ఫిలాసఫర్ గా ఫీలయ్యే కమల్ హాసన్ … రజినీ పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ ఆయనకు కెమెరాలు ఎక్కడ వుంటాయో తెలుసునని ఇండైరెక్ట్ విమర్శలు చేశాడు. ఆయనని మించిపోయిన భారతీరాజా ఏకంగా బూతులు అందుకున్నాడు! ఇదంతా చూస్తుంటే… రజినీ ఎంట్రీతో తమిళ సినీ, రాజకీయ రంగాలు మనం ఊహించిన దానికంటే ఎక్కువే అతలాకుతలం అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది!

పొగ తాగటం హానికరం! వారి పక్కనుండటం ప్రమాదకరం!

మే 31… ప్రపంచ పోగాకు వ్యతిరేక దినం! అంటే… వాల్డ్ నో టోబాకో డే! నిజానికి పొగాకుకి నో చెప్పాల్సింది ఒక్క రోజు కాదు! ప్రతీ రోజూ, ప్రతీ నిమిషం టొబాకో గో బ్యాక్ అనాల్సిందే! అంతటి పెను ప్రమాదం అందులో వుంది! అయితే, గుట్కా, గంజాయి లాంటి ఇతర మాదక ద్రవ్యాలు ఒక ఎత్తు.. సినిమాల్లో హీరోలు సైతం స్టైల్ గా తాగేసే సిగరెట్ ఒక ఎత్తు! అసలు చాలా మంది సిగరెట్ కాల్చటం పెద్ద ప్రాణగండమేం కాదు అనుకుంటారు! వారికి ఎలాగూ కౌంట్ డౌన్ మొదలైనట్టే… కాని, వారొదిలే పొగ వల్ల పక్కనున్న వారికి కూడా ప్రాణాపాయం తప్పదు! ఈ ప్రమాదకర కోణమే సిగరెట్ ని మిగతా పొగాకు ఉత్పత్తుల కన్నా హింసాత్మకంగా మార్చేస్తుంది!   ఇంతకీ పొగ తాగే వారి వల్ల పొగ పీల్చుకుంటోన్న వారికి ముంచుకొస్తున్న ప్రమాదాలేంటి? ఇంగ్లీషులో పొగ తాగకున్నా పీల్చుకునే వార్ని ప్యాసివ్ స్మోకర్స్ అంటారు! ఈ ప్యాసివ్ స్మోకర్స్ కి సిగరెట్ కాల్చే వారికి వస్తున్నట్టే ఉపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం వుందట. అలాగే, గొంతులోని స్వర పేటిక కూడా క్యాన్సర్ బారిన పడే భయానక స్థితి రావచ్చట! ఇక ఉపిరితిత్తులు, స్వర పేటిక మాత్రమే దెబ్బతింటాయిలే అని ఉపిరి పీల్చుకోవటానికి కూడా వీల్లేదంటున్నారు డాక్టర్స్! ప్యాసివ్ స్మోకర్స్ కి గుండె నొప్పులకు, ఛాతిలో నొప్పికి, గుండె పోటుతో మరణించే అవకాశాలు కూడా పుష్కలంగానే వున్నాయట! దీనికి కారణం… పొగ పీలుస్తూ వుండటం వల్ల గుండెకు రక్తాన్ని తీసుకు వెళ్లే నాళాలు మూసుకుపోవటమే!   సిగరెట్ కాల్చేవారు మానవ బాంబుల్లాంటి వారంటున్నారు డాక్టర్స్! ఎందుకంటే, తాము మృత్యువాత పడుతోంది కాకుండా తమ పిల్లల్ని కూడా వీరు దారుణంగా దెబ్బతీస్తున్నారు. స్మోకర్స్ వుండే ఇళ్లలో చిన్న పిల్లలు పొగ పీలుస్తూ పెరగటం వల్ల పెద్దయ్యాక గుండె జబ్బులు వచ్చే అవకాశాలు విపరీతంగా పెరుగుతాయట! కాబట్టి ఒక సిగరెట్ స్మోకర్ ఆ వ్యసనం మానేయటం అంటే…  తాను బతికిపోవటమే కాదు… తన పిల్లల్ని కాపాడుకోవటం కూడా!   గుండె, ఊపిరితిత్తులు లాంటి కీలకమైన అవయవాల్ని పాడు చేసే ప్యాసివ్ స్మోకింగ్ లావెక్కిపోయేలా కూడా చేస్తుందట! చెయిన్ స్మోకర్ల దెబ్బకి మీరుగాని రోజంతా పొగ పీల్చేస్తూ వుంటే.. త్వరలోనే లావైపోవటం తప్పదట! లంగ్స్ లోకి చెడు గాలి చేరిపోవటంతో శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలో మార్పులు వచ్చి ప్యాసివ్ స్మోకర్స్ లావైపోవటం డాక్టర్స్ గమనించారు!   సిగరెట్ తాగకపోవటం బాధ్యత! సిగరెట్ తాగే వారి చేత ఎలాగోలా మాన్పించటం కర్తవ్యం! ఇక మీద అందరూ ఆ పనిలో వుండాలన్నమాట!