మరోసారి ‘స్వామి’ వారి ఆగ్రహానికి గురైన రజినీకాంత్!

  రామేశ్వరం పోయినా అదేదో తప్పలేదంటారు! అలా తయారైంది రజినీకాంత్ పరిస్థితి. ఇంకా ఆయన రాజకీయాల్లోకి అధికారికంగా వచ్చిందీ లేదు. ఎన్నికల్లో పోటీ పడిందీ లేదు. కాని, ఆయన పేరున దుమారాలు మాత్రం రేగుతున్నాయి. మరీ ముఖ్యంగా రజినీకాంత్ కు ఎవ్వరూ ఊహించని విధంగా సుబ్రమణియన్ స్వామీ నుంచీ తలనొప్పులు వస్తున్నాయి. నిజానికి రజినీ రాజీకీయాల్లోకి వస్తే ఇటు ఏఐఏడీఎంకే, అటు డీఎంకే పార్టీలకి నష్టం. సుబ్రమణియన్ స్వామీకిగాని, బీజేపికిగాని ఎలాంటి నష్టం లేదు. కాస్తో, కూస్తో లాభం కూడా! అయినా సుబ్బూ రజినీ మీద అవాకులు చెవాకులు పేలి రాజకీయ రంగం రుచి ఎలా వుంటుందో అప్పుడే తలైవాకి చూపించేస్తున్నాడు!   రజినీకాంత్ ప్రస్తుతం తాను చేస్తోన్న సినిమా షూటింగ్ కూడా ఆపేసి… అమెరికా వెళ్లాడు. అక్కడాయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. కాని, ఇంతలోనే సుపర్ మ్యాన్ సుబ్రమణియన్ స్వామీ తనదైన స్టైల్లో ట్విట్టర్ లో రెచ్చిపోయాడు.  సూపర్ స్టార్ అమెరికాలోని ఓ క్యాసినోలో పందెం కాస్తోన్న ఫోటో ట్విట్ చేసి… ఇదేనా ట్రీట్మెంట్ అంటూ వెటకారం చేశాడు! అమెరికా వెళ్లి గ్యాంబ్లింగ్ చేస్తోన్న రజినీకాంత్ కి ఆ డబ్బులు ఎలా వచ్చాయో తేల్చాలని గవర్నమెంట్ ను డిమాండ్ చేశాడు!   నిజంగానే… వైద్యం కోసం అమెరికా వెళ్లిన రజినీ గ్యాంబ్లింగ్ గేమ్ లో ఎందుకు పాల్గొన్నట్టు? ఆయన క్యాసినోలో వున్నప్పటి ఫోటో సుబ్రమణియన్ స్వామికి ఎలా చిక్కింది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వుండవు. కాకపోతే, ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోన్న అంశం సుబ్రమణియన్ స్వామీకి రజినీకాంత్ ఎందుకు నచ్చటం లేదనేది! మరీ దారుణంగా రజినీ లాంటి సూపర్ స్టార్ ను ఆయన ట్విట్టర్ లో 420 అన్నాడు. ఇది ఇప్పుడు తలైవా అభిమానుల కోపం కట్టలు తెంచుకునే చేస్తోంది! మరో వైపు రజినీకాంత్ మాత్రం ఇంతదాకా సుబ్బూని ఒక్క మాట కూడా అనలేదు!   ఇంతకు ముందు కూడా స్వామీ, రజినీకాంత్ ఆర్దిక మోసాలకు పాల్పడ్డాడని ఆరోపించాడు. ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన మానుకోకపోతే తాను అన్నీ బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేశాడు. ఇది నిజంగా విచారకరం. రజినీ తప్పు చేస్తే కోర్టులో నిరూపించి శిక్ష పడేలా చేయోచ్చు కాని… ఆయన రాజకీయాల్లోకి వస్తే మాత్రమే కోర్టుకీడుస్తానని అనటం … రౌడీయిజం అనిపించుకుంటుంది!   సుబ్రమణియన్ స్వామీ ఇలా రజినీకాంత్ మీద కామెంట్లు, ట్వీట్లు చేయటం బీజేపి పార్టీకి కూడా నష్టం తెచ్చే విషయమే. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, కనీసం ఆయన్ని రజినీ వ్యతిరేక కామెంట్స్ చేయకుండా కూడా కట్టడి చేయకపోతే తలైవా అభిమానుల ముందు కమలదళం కూడా విలన్ అవుతుంది. కాబట్టి సుబ్రమణియన్ స్వామిని నియంత్రించే పని మోదీ, అమిత్ షా ఇప్పటికైనా చేయాలి. లేదంటే… తమ పార్టీలో చేరకుండా రజినీ స్వంత పార్టీ పెట్టడం… కమలదళం పెద్దలకి ఇష్టం లేక… ఇలా స్వామీ చేత బ్లాక్ మెయిల్ చేయిస్తున్నారని వినిపిస్తోన్న మరో టాక్ కూడా నిజమయ్యే ఛాన్సెస్ లేకపోలేదు!  

ఇజ్రాయిల్‌లో ఇండియన్ పీఎం… టెన్షన్ లో పాకిస్తాన్ మీడియా!

  నరేంద్ర మోదీ విదేశ పర్యటనలకు వెళ్లటం ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయింది. ఆయన పీఎం అయిన కొత్తలో  విరివిగా ఫారిన్ టూర్ లకి వెళుతోంటే చాలా దుమారమే రేగింది. కాని, రాను రాను మ్యాటర్ అర్థమవటంతో అంతా సైలెంట్ అయిపోయారు. అదే రేంజ్లో మోదీ భక్తులు కూడా ఆయన ఏ దేశం వెళ్లినా తమ నేతకు లభిస్తోన్న ఘన స్వాగతాల గురించి సోషల్ మీడియాని ముంచెత్తారు. అమెరికాకు మొదటి సారి వెళితేనైతే భూమి, ఆకాశం ఏకం చేశారు! కాని, ఇప్పుడు ఇరువైపులా హడావిడి తగ్గింది. మోదీ విదేశీ పర్యటనల్ని విమర్శించే వారు కాస్త చల్లబడ్డారు. అదే స్థాయిలో మోదీని నెత్తికెత్తుకునే వర్గం కూడా ఆయన తాజా ఇజ్రాయిల్ పర్యటన మీద ఊహించినంత కోలాహలం చేయటం లేదు!   ప్రపంచ ముస్లిమ్ లు దాదాపు నూటికి నూరు శాతం తమ శత్రువుగా భావించే ఇజ్రాయిల్ ను ఇప్పటి వరకూ ఏ ఒక్క భారత ప్రధానీ సందర్శించలేదు. కాని, మోదీ ఆ పని చేశారు. అందుకే, ఇజ్రాయిల్ ప్రధానితో సహా యావత్ క్యాబినేట్ నమోకి ఎదురువచ్చి నమస్కారాలు చేసి స్వాగతం పలికింది! అంతటితో ఊరుకోకుండా ఆయన వెంట అనుక్షణం ప్రధాని, మంత్రులు వుంటూనే వచ్చారు. మోదీ అన్న పేరుని తమ దేశంలోని ఒక పువ్వుకు కూడా పెట్టుకున్నారంటే ఇజ్రాయిలీలు ఈ పర్యటనని ఎంత ముఖ్యంగా భావిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు! అలాగే, మోదీ కూడా పాకిస్తాన్ నుంచి పని చేసే ఉగ్ర మూకలకి, అర్థం పర్థం లేకుండా అతివాద మైనార్టీ వర్గాలకి తలొగ్గే రాజకీయ నేతలకి బలమైన సంకేతాలు పంపించారు. భారతదేశానికి మేలు చేసే ఎక్కడికైనా తాను వెళతానని నిరూపించారు. అంతే కాదు, పాక్ ఉగ్రవాదుల చేతుల్లో ముంబై దాడుల్లో తల్లిదండ్రుల్ని కోల్పోయిన యూదు అబ్బాయిని కూడా ఆయన కలిశారు! పదకొండేళ్ల ఆ బాబు ఐ లవ్ యూ మోదీ అన్నడాంటే… ఇజ్రాయిలీలు భారత ప్రధాని పట్ల ఎలాంటి భావాలతో వున్నారో అర్థం చేసుకోవచ్చు!   మోదీ ఇజ్రాయిల్ పర్యటించినంత మాత్రాన ఆ దేశం పాలస్తీనా మీద చేసే దాడుల్ని మనం సమర్థించినట్టు కాదు. కేవలం మనం ముస్లిమ్ సమాజానికి వ్యతిరేకం కాదని నిరూపించుకునేందుకు ఇంత కాలం ఎంతో బలమైన దేశమైన ఇజ్రాయిల్ ను దూరం పెడుతూ వచ్చాం. కాని, మోదీ ఆ దేశంలో కాలుమోపటంతో మనకి రక్షణ రంగంలో, వారికి వ్యాపార రంగంలో అనేక లాభాలు కలగనున్నాయి. ఇదే ఇప్పుడు పాకిస్తాన్ కు పెద్ద బెంగాగ మారింది! మోదీ ఇజ్రాయిల్ యాత్ర గురించి మన పత్రికల కంటే అక్కడి పత్రికలే ఎక్కువ సంపాదకీయాలు రాసేస్తున్నాయి. ఆ ఎడిటోరియల్స్ అన్నిటి సారాంశం ఇండియా, ఇజ్రాయిల్ నూతన సంబంధాలు ముస్లిమ్ లను మరింత అణిచివేయటానికేనని! అటు నెతన్యాహు, ఇటు మోదీ ఇద్దరూ కరుడుగట్టిన ముస్లిమ్ వ్యతిరేకులని! ఇజ్రాయిల్ పాలస్తీనాను అణగదొక్కుతున్నట్టే , ఇండియా కాశ్మీర్ వేర్పాటువాదుల్ని అంతం చేస్తోందని!   మోదీ ఇజ్రాయిల్ పర్యటన గురించి పాకిస్తాన్ పత్రికలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయంటే ఏంటి అర్థం? టెల్ అవివ్, న్యూ దిల్లీ స్నేహం పాకిస్తాన్ కు బయటకు చెప్పుకోలేని నష్టం. అందుకే, నీతులు వల్లిస్తూ సంపాదకీయాలు రాసేస్తున్నాయి అక్కడి పత్రికలు! వాటిల్లో వ్యక్తం అవుతోన్న ఆందోళన చూస్తుంటే మోదీ ఇజ్రాయిల్ పర్యటన మంచి నిర్ణయమే అనుకోవాలి. కాకపోతే, ఇప్పటికే ఈ పని ఎవరైనా చేసి వుండాలి. చేయకపోవటం భారతదేశ దురదృష్టం…

కేసీఆర్ పిచ్చి చంద్రబాబుకు అంటుకుందా..?

  జాతకాలు, ముహూర్తాలు, వాస్తుపై ఎవరి నమ్మకం వాళ్లది..కొందరికి ఇందులో మంచి జరిగి ఉండవచ్చు..మరి కొందరు వీటిని మూఢనమ్మకాలుగా కొట్టిపారేయవచ్చు. అయితే సాధారణ జనానికి ఇందులో ఏం జరిగినా..జరక్కున్నా పెద్దగా వచ్చిన ఇబ్బంది ఏం లేదు..కానీ ప్రజా జీవితంలో ఉన్న నేతలకు అది కూడా పాలకులకు ఇలాంటి వాటిపై పిచ్చి ఉంటే అది చాలా మందికి ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్లో జాతకాలు, వాస్తుపై బాగా నమ్మకం ఉన్న రాజకీయ నాయకుడు ఎవరు అంటే టక్కున వచ్చే సమాధానం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనే చెబుతారు. ఆయన అడుగు తీసి అడుగు వేయాలంటే పండితుల సలహాలు తీసుకోకుండా చేయరని టాక్. చివరకు ఈ పిచ్చి ఎక్కడికి వెళ్లిందంటే వాస్తు బాగోలేదని ఏకంగా సచివాలయాన్నే కూల్చి కొత్తది కడతా అన్నంతగా..అయితే అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో గులాబీ బాస్ ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. బేగంపేట క్యాంపు ఆఫీసులో తనకు ముందు ఉన్న ముఖ్యమంత్రులకు కలిసిరాకపోవడానికి కారణం వాస్తు దోషమే అని భావించి..పక్కా వాస్తుతో, అత్యాధునిక సదుపాయాలతో ఏకంగా కొత్త క్యాంపు ఆఫీసు నిర్మించారు కేసీఆర్.. అలాంటి వాస్తు, జ్యోతిష్యాల పిచ్చి ఇప్పుడు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అంటుకుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా వ్యవహరించిన సమయంలో ఇలాంటి వాటికి ఆమడ దూరంలో ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ఏ పని చేయాలన్నా పండితులను సంప్రదిస్తున్నారు. వాస్తు అంటే చాలు అటెన్షన్ అయిపోతున్నారు. హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని మూడు దశాబ్దాల పాటు ఉన్న ఇంటిని కూల్చడమే కాకుండా ..కోట్లు ఖర్చు చేసి కొత్త ఇంటిలో గృహప్రవేశం చేశారు. అంతేనా టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు కూడా వాస్తు ప్రకారం మార్పులు చేయించారు. ఇప్పుడు తాజాగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నూతనంగా నిర్మించిన సచివాలయానికి వాస్తు దోషాలు ఉన్నాయని చెప్పడంతో వాటిని సరిదిద్దే పనిలో పడ్డారు ఏపీ సీఎం..సచివాలయం వద్ద ప్రస్తుతం నిర్మించిన ప్రహరీ గోడను కూల్చి కొత్తగా మరో గేటు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఇప్పుడున్న నాలుగు గేట్లకు అదనంగా మరో గేటు నిర్మిస్తున్నారు. ఇలా ఇద్దరు ముఖ్యమంత్రులు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాస్తు పేరుతో ఎన్ని కోట్లు ఖర్చు చేశారో లెక్కే లేదు..ఎందుకంటే ఆ సొమ్మంతా వారు కష్టపడి సంపాదించింది కాదు కదా..? అంతా ప్రజాధనమే కదా అని కొందరు విమర్శిస్తున్నారు.

ఈ మంత్రిగారు అసెంబ్లీలోనే చంపి పాతరేస్తారట..?

  భారతదేశంలో చట్టసభలకు ఒక చరిత్ర ఉంది..ప్రజల సమస్యలకు పరిష్కారాలు కనుగొనేందుకు ప్రజాప్రతినిధులు ఒకచోట కూర్చొని చర్చించుకునేందుకు వీలుగా రాజ్యాంగం వెసులుబాటు కల్పించింది. ఎంతో మంది రాజకీయ ఉద్ధండులు ప్రజా సమస్యలపై తమ గళం వినిపించిన సందర్భాలు ఎన్నో..మరెన్నో..అలాంటి చట్టసభలు నేడు వ్యక్తిగత విమర్శలకు, ప్రజా ప్రతినిధుల బలాబలాలు తేల్చుకునేందుకు వేదికలుగా మారుతున్నాయి. తాజాగా జమ్మూకశ్మీర్ అసెంబ్లీ పరువు ప్రతిష్టలను మంటగలిపే ఘటన ఒకటి జరిగింది. వస్తు, సేవల పన్ను విషయంపై శాసనసభలో నిన్న చర్చ జరిగింది...ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ఐటీ, సాంకేతిక విద్యల శాఖా మంత్రి ఇమ్రాన్ అన్సారీ, ప్రతీపక్ష పార్టీ నేత దేవేందర్ రాణాను సభలోనే చంపి పాతరేస్తానంటూ బెదరించారు. దేశవ్యాప్తంగా ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ..జమ్మూకశ్మీర్‌లో మాత్రం అమల్లోకి రాలేదు. ఆ రాష్ట్ర అసెంబ్లీ అందుకు ఆమోదించకపోవడమే దీనికి కారణం. దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని..ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్ భావించింది. ఇందులో భాగంగానే నిన్న జరిగిన సమావేశంలో జీఎస్టీని కశ్మీర్‌లోనూ అమలు చేయాలని నేషనల్ కాన్ఫరెన్స్ నేత దేవేందర్ రాణా ప్రభుత్వాన్ని నిలదీశారు..తాను పన్నులు ఎగ్గొట్టలేదని..చీకటి వ్యాపారాలు చేయాల్సిన ఖర్మ తనకు పట్టలేదని అధికార పక్షానికి బదులిచ్చారు..ఓ వైపు ఆయన మాట్లాడుతుండగానే..మంత్రి ఇమ్రాన్ అన్సారీ ఆగ్రహంతో..నేను తలచుకుంటే నిన్ను ఇక్కడే చంపి పాతరేయగలను..నీ దొంగ వ్యాపారాలు నాకు తెలుసు..కశ్మీర్ మొత్తంలో నీ కంటే పెద్ద దొంగ ఎవరూ లేరు. నీకు అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో మాకు తెలియదా..అంటూ బెదిరింపులకు దిగారు..దీంతో అధికార విపక్ష సభ్యులు కుర్చీలపైకి ఎక్కి నిరసన తెలియజేశారు..మంత్రి చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా సమాధానం చెప్పాలని నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు డిమాండ్ చేశారు. ఇవి కాస్త రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.

మోదీ కీలక నిర్ణయాలకు కేసీఆర్ ఎందుకు మద్దతిస్తున్నారు?

  కాబోయే రాష్ట్రపతి వద్ద కేసీఆర్ నూటికి నూరు మార్కులు కొట్టేశారు! ఆయన చేత శభాష్ అనిపించుకున్నారు! తనకు మరెక్కడా ఇంత ఘనస్వాగతం లభించలేదని రామ్ నాథ్ కోవింద్ కేసీఆర్ ని పొగిడేశారు! అంతే కాదు, ఆయన తనకు దారి పొడవునా ఎదురైన భారీ హోర్డింగ్ లు ఎంతగానో ఆనందం కలిగించాయని చెప్పుకొచ్చారు! ఇదంతా చేసిన కేసీఆర్ ను ఆయన ఫుల్ గా మెచ్చేసుకున్నారు. పనిలో పనిగా యూపీ వాడినైన తనకు అర్థమయ్యేలా చక్కటి హిందీలో కేసీఆర్ ప్రసగించినందుకు ఉప్పొంగిపోయారు! మొత్తం మీద ఇంకా ప్రెసిడెంట్ అవ్వని ఫ్యూచర్ రాష్ట్రపతి వద్ద తెలంగాణ సీఎం సూపర్ టాక్ సంపాదించుకున్నారు!   రామ్ నాథ్ తాను ప్రెసిడెంట్ అయ్యే పనిలో వున్నారు కాబట్టి మద్దతిస్తోన్న కేసీఆర్ ని పొగిడారని భావించలేం. అది నిజమే అయినా … బీజేపిలో కీలక నేతైన వెంకయ్య నాయుడు కూడా  గులాబీ బాస్ ని ఆకాశానికి ఎత్తారు. నోట్ల రద్దులో, జీఎస్టీ విషయంలో, ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థి మద్దతు అంశంలో… కేసీఆర్ బేషరతుగా సపోర్ట్ చేశారని అన్నారు. ఎన్డీఏలో లేని మరో నేత ఎవరూ ఇలా లేరన్నారు వెంకయ్య! నిజంగా కూడా ఒక రాష్ట్రం చేతిలో వుంచుకుని మోదీతో ఇంత సఖ్యంగా వున్న నాన్ ఎన్డీఏ సీఎం ఎవరూ లేరు! మమత, అరవింద్, నితీష్ లాంటి వారి సంగతి మనకు తెలిసిందే కదా…   ఇంతకీ… ఆ మధ్య అమిత్ షా వచ్చి టీఆర్ఎస్ మీద నానా ఆరోపణలు చేసి నల్గొండ పర్యటన చేసి వెళ్లారు. కాని, ఇప్పుడు వెంకయ్య పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కేసీఆర్ కూడా మోదీని వీలైనప్పుడల్లా మంచి వాడని చెబుతూనే వున్నారు. ఇక దత్తాత్రేయ అయితే కేసీఆర్ తో హ్యాపీగా వేదికలు పంచుకుంటారు! ఇదంతా దేనికి సంకేతం? పైకి పరిణతి చెందిన రాజకీయం అని చెప్పుకున్నా… రాబోయే ఎన్నికల పొత్తుల విషయం కూడా ఇందులో ఎంతోకొంత కనిపిస్తోందని చెప్పవచ్చు! ముస్లిమ్ ఓటు బ్యాంక్ భారీగా వున్న టీఆర్ఎస్ రాబోయే ఎన్నికల్లో ఓటింగ్ కి ముందు పొత్తు పెట్టుకోకున్నా తరువాత ఎన్డీఏలో చేరే ఛాన్స్  పుష్కలంగా వుంటుంది. ఆ ఆప్షన్ తెరిచి వుంచుకోటానికే కేసీఆర్ కేంద్ర బీజేపితో ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారని కొందరు విశ్లేషకులు అంటున్నారు. మోదీ వేవ్ దేశమంతా వున్నప్పుడు ఊరికే కేజ్రీవాల్ , మమత బెనర్జీలాగా ఆరో్పణలు, విమర్శలు చేసి సాధించేదేమీ లేదు కాబట్టి అంశాల వారీగా మద్దుతు తెలుపుతు వుంటే భవిష్యత్ రాజకీయ అవసరాలు ఎప్పుడైనా తీర్చుకోవచ్చని కేసీఆర్ వ్యూహం కావచ్చు!   టీఆర్ఎస్ , బీజేపి ముందు ముందు దగ్గరవ్వటానికి మరో కారణం కూడా బలంగా పని చేసే అవకాశం వుంది. అదే కాంగ్రెస్! తెలంగాణలో టీఆర్ఎస్ కి, దేశ వ్యాప్తంగా బీజేపికి… ఇద్దరికీ కాంగ్రెస్సే ప్రత్యర్థి. కాబట్టి రెండు పార్టీలు ముందు ముందు ఎన్నికల్లో కలిసి పని చేయటానికి కాంగ్రెస్ కూడా కారణం కావచ్చు! మరి ఇప్పుడు టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తోన్న రామ్ నాథ్ కోవిందే 2019లో ఏర్పడబోయే కేంద్ర ప్రభుత్వంతో ప్రమాణస్వీకారం చేయిస్తారు! ఆ రోజు టీఆర్ఎస్ నాయకులు కూడా మంత్రులుగా రామ్ నాథ్ సమక్షంలో వుంటారా? వేచి చూడాల్సిందే!

బీజేపి ఎమ్మెల్యే… బస్సులో కిస్ చేశాడు! ఇప్పుడు బతుకు బస్టాండైంది!

  మహారాష్ట్రలో రవీంద్ర అనే పేరు పెట్టుకున్న రాజకీయ నేతలకు టైం బ్యాడ్ గా వున్నట్టుంది. ఆ మధ్య రవీంద్ర గైక్వాడ్ అనే శివసేన ఎంపీ చేశాడో గుర్తుందిగా? విమానాశ్రయంలో నానా రచ్చ చేశాడు. సిబ్బందిపై దాడి చేసి తన బలుపు చూపించుకున్నాడు. అంతే కాదు, తనని ఎవ్వరూ ఏం చేయలేరన్నట్టు వీడియోలో క్షమాపణ కూడా చెప్పనుపొమ్మని రెచ్చిపోయాడు. చివరకు, మనోడి కోసం శివసేన ఇతర ఎంపీలు లోక్ సభలో రచ్చ చేశారు. మన ఆశోక్ గజపతి రాజుపై దాడి దాకా వెళ్లారు! ఇంత కల్లోలానికి కారణం ఎవరు? రవీంద్ర గైక్వాడ్!   ఇప్పుడు మహారాష్ట్రకే చెందిన మరో రవీంద్ర సిగ్గుమాలిన పని చేశాడు! అయితే, ఈ రవీంద్ర  బవన్ థాడే అనే నేత బీజేపి పార్టీవాడు! అధికారంలో వున్న కమలదళం ఎమ్మెల్యే ఎంత దిగజారొచ్చో అంతా దిగజారిపోయాడు! తన పరువు తీసుకోటమే కాక పార్టీని కూడా అవమానకర స్థితిలోకి నెట్టాడు!   బీజేపి తరుఫున ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్ర ఒక మహిళని బస్సులో ముద్దాడుతున్న వీడియో అనూహ్యంగా బయటపడింది. నాగ్ పూర్ నుంచీ చంద్రాపూర్ వెళ్తోన్న బస్సులో ఎమ్మెల్యేగారు ఈ ఘనకార్యం చేశారు. అదంతా బస్సులోని సీసీ టీవీలో రికార్డైంది. తరువాత ఇంటర్నెట్ లోకి పొక్కింది. దాంతో సదరు బాధితురాలు నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్లో రేప్ కేసు పెట్టింది! రవీంద్ర బవన్ థాడే తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడనీ, పెళ్లి కూడా చేసుకుంటానన్నాడనీ… ఆమె ఆరోపిస్తోంది! ఆ సంగతులు  ఎలా వున్నా ఎమ్మెల్యే నిర్లజ్జగా బస్సులో ఇతర ప్రయాణికులు కూడా వుండగానే… శృంగారానికి తెగబడటం మాత్రం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది!   తన మీద కేస్ బుక్కైనప్పటి నుంచీ రవీంద్ర బవన్ థాడే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇంకా పోలీసులు అతడ్ని అరెస్ట్ చేయలేదు. అధికార మహారాష్ట్ర బీజేపి కూడా ఇంకా ఎలాంటి స్పందన తెలియజేయలేదు. చూడాలి మరి… ప్రతిపక్షాలకు బలంగా దొరికిన ఈ అస్త్రాన్ని దేవేంద్ర ఫడ్నవీస్, అమిత్ షాలు ఎలా నిర్వీర్యం చేస్తారో! రేప్ ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఎమ్మెల్యేని పార్టీ నుంచి బహిష్కరించి అరెస్ట్ చేయించటం తప్ప మరో మార్గం లేనట్లేకనిపిస్తోంది!

ఇండియన్ క్రికెటరంటే పిచ్చి అభిమానమంటోన్న పాక్ ప్లేయర్!

  పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టు… క్రికెట్టందు పురుషుల క్రికెట్ వేరయా! ఆడవాళ్ల క్రికెట్ కూడా వున్నా… మనం పెద్దగా పట్టించుకోం. అయితే, ఈ మధ్య మహిళా క్రికెట్ కూడా అడపాదడపా వార్తల్లోకి వస్తోంది. ప్రస్తుతం నడుస్తోన్న వుమన్ వాల్డ్ కప్ లో మిథాలీ సేన పాకిస్తాన్ని చిత్తుగా ఓడించింది. 95పరుగుల తేడాతో మన బద్ధ శత్రువుని ఓటమి పాలుజేసింది. అయితే, మొన్నీ మధ్యే గొప్పగా చెప్పుకునే మన ఇండియన్ క్రికెట్ టీం పాక్ ముందు తల వంచక తప్పలేదు. కోహ్లీ సేన మరీ దారుణంగా కనీసం పోరాట పటిమ కూడా చూపకుండా ఓడిపోయింది. ఓటమి కన్నా క్రికెట్ లవ్వర్స్ కి ఇదే బాగా బాధ కలిగించింది. పాక్ బౌలర్ల ముందు గల్లీ క్రికెటర్లలా విలవిల లాడిపోయారు మన ఆటగాళ్లు. కాని, ఇండియన్ వుమన్ పాక్ దుమ్ము దులిపారు! ఇప్పటి వరకూ పాకిస్తాన్ టీమ్ మన ఇండియన్ వుమన్ క్రికెట్ టీమ్ పై ఒక్కసారి కూడా గలవలేదంటే మనోళ్ల సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు!   మామూలుగా మనం అస్సలు పట్టించుకోని మహిళా క్రికెటర్స్ పాకిస్తాన్ పై విజయంతో కాస్త దృష్టిని ఆకర్షించారు. అయితే, మన అమ్మాయిల్ని మనం ఎంకరేజ్ చేయాల్సింది మాత్రం చాలా వుంది. కోహ్లి సేనతో సమానంగా మిథాలీ సేనను కూడా ప్రొత్సాహించాలి. ఎందుకంటే తాజాగా ఓ అభిమాని మన ఇండియన్ వుమన్ టీమ్ లో ఒక ఆలౌరండర్ ని ఆకాశానికి ఎత్తేసింది! ఆమెవరో ఇండియనో క్రికెట్ లవ్వర్ అయితే ఇంతగా చెప్పుకోవాల్సింది ఏం లేదు! ఆమె ఓ పాకిస్తానీ! అంతే కాదు, పాకిస్తాన్ టీమ్ తరుఫున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడే ఫాస్ట్ బౌలర్!   ఒక ఇండియన్ క్రికెటర్ నాకు ఇష్టం అని పాకిస్తానీ ప్లేయర్ చెప్పాలంటే ఎంత గట్స్ కావాలి? అలాంటి సాహసం పాకిస్తానీ మగ క్రికెటర్లు చచ్చినా చేయరు! ఎందుకంటే, పబ్లిక్ గా నాకు ఫలానా ఇండియన్ క్రికెటర్ అంటే అభిమానం అని చెబితే… చచ్చిపోతారు కాబట్టి! కాని, పాకిస్తానీ వుమన్ క్రికెటర్ కైనత్ ఇంతియాజ్ అదే పని చేసి చూపించింది! తనకు ఇష్టమైన క్రికెటర్ జులన్ గోస్వామీ అని సోషల్ మీడియాలో చెప్పింది. అంతే కాదు, ఇండియా తరుఫున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడే బెంగాలీ ప్లేయరైన జులన్ గోస్వామీతో కైనత్ ఫోటో కూడా దిగింది. దాన్ని కూడా ధైర్యంగా షేర్ చేసింది! జులన్ గోస్వామి ఇండియన్ వుమన్ క్రికెట్ టీమ్ లో కీ ప్లేయర్!   పాకిస్తానీ ఫాస్ట్ బౌలర్ అయిన కైనత్ తనకు ఇండియన్ ప్లేయరైన గోస్వామీ అంటే అభిమానమనే కాక ఆమె వల్లే తాను క్రికెటర్ అయ్యానని కూడా చెప్పింది. అందుకే, ఇండియా తమని ఓడించిన ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్ తరువాత తాను వెళ్లి గోస్వామీతో ఫోటో దిగానని వివరించింది! కైనత్ అభిమానం, ధైర్యం, స్పోర్టివ్ స్పిరిట్ అన్నీ మెచ్చుకోవాల్సిందే! కాని, ఇండియా అన్నా, ఇండియన్ క్రికెటర్స్ అన్నా ఉన్మాదంతో రెచ్చిపోయే పాకిస్తానీలు కైనత్ చేసిన పని ఎలా స్వీకరిస్తారో చూడాలి! ఆమె చేసింది ప్రాణాలకు సైతం ప్రమాదం తెచ్చి పెట్టే చర్య!

గొర్రెల్ని తినటానికి భూమ్మీదకొచ్చిన గ్రహాంతరవాసులు!

  ఒకవైపు సోషల్ మీడియా, మరోవైపు యూ ట్యూబ్ వ్యూస్ కోసం తహతహ… ఈ రెండిటితో ఏ క్షణాన ఏ అబద్ధం నిజంలాగా మేకప్ చేసుకుని మనల్ని మోసం చేస్తుందో అర్థం కాని పరిస్థితి వచ్చేసింది! ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్ లు వచ్చాక జనం సమాచారం ఇష్టం వచ్చినట్లు పంచుకుంటున్నారు. ఇందులో నిజం కంటే అబద్ధాలే ఎక్కువని అందరికీ తెలుసు. అయినా కూడా ఎప్పటికప్పుడు కలకలం రేపే పోస్టులు పోటెత్తుతుంటూనే వుంటాయి! ఇక సోషల్ మీడియాకి జోడుగా ఇప్పుడు యూ ట్యూబ్ వీడియోల దుమారం మొదలైంది. ఎవరు నాలుగు వ్యూస్ కోసం ఓ వీడియో చేసి పెట్టినా… అది వైరల్ అవుతోంది. నెటిజన్స్ తెలిసో, తెలియకో షేర్ లు చేసేసి గందరగోళానికి తెర తీస్తున్నారు! ఇప్పుడు అలాంటిదే… ఆదిలాబాద్ లో గ్రహాంతరవాసుల హంగామా!   ఏంటి ఆదిలాబాదులో గ్రహాంతర వాసులా అంటూ ఆశ్చర్యపోతున్నారా? ఇదే కావాలి… సదరు యూ ట్యూబ్ వీడియో పోస్ట్ చేసిన వారికి! ఇంతకాలం ఎక్కడో అమెరికాలో ఏలియన్స్ కనిపించారు, డ్యాన్స్ చేశారు, పాటలు పాడారు అంటూ కథలు చెప్పేవారు. ఇప్పుడు క్రియేటివిటికి, నేటివిటి జోడించి గ్రహాంతరవాసుల్ని ఆదిలాబాద్ అడవులకి తీసుకొచ్చారు. అటవీ శాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఏలియన్స్ ఫోటోలు చిక్కాయంటూ మాంచి ఫోటో షాప్ పనితనం చూపించారు! పెద్ద పెద్ద గోర్లు, నెత్తిన రెండు కొమ్ములు వున్న వింత జంతువుల్లాంటి జీవుల్ని చూపించి … అవే గ్రహాంతరవాసులంటూ కహానీలు చెప్పేస్తున్నారు!   ఆసక్తికరమైన అబద్ధాల సమాహారంలా వున్న యూ ట్యూబ్ వీడియోలో మరో విడ్డూరం కూడా చెప్పారు! ఎక్కడో సుదూర గ్రహం నుంచి వచ్చిన గ్రహాంతరవాసులు ఇక్కడ మన గొర్రెల్ని చంపి తింటున్నారట! ఈ మాత్రం దానికి అంత దూరం నుంచి భూమ్మీదకి రావాలా? వాళ్ల గ్రహంలో గొర్రెలు లేవంటారా? కరెక్టే… ఇక్కడ మనుషులు కూడా గొర్రెల్లా ఒకర్నొకరు ఫాలో అయిపోతుంటారని భావం కావచ్చు!   ఏది ఏమైనా, ఇప్పటి దాకా ఏ ఒక్కసారీ పక్కాగా నిరూపితం కాని గ్రహాంతర వాసుల కథనాల్ని నమ్మటం అంటే… ఆధునిక మూఢనమ్మకాల్ని ఆనందంగా అంగీకరించటమే! టైం వేస్ట్ తప్ప మరేం వుండదు!  

జయ కొడనాడు ఎస్టేట్ … చనిపోతున్నారా? చంపబడుతున్నారా?

  కొన్ని హారర్ సినిమాల్లో చనిపోయిన వారి ప్రేతాత్మ బతికున్న వార్ని వెంటాడుతూ వుంటుంది. అలాగే ఒక ఎస్టేటో, ఫామ్ హౌజో దెయ్యానికి టార్గెట్ గా వుంటుంది. అక్కడికి వచ్చిన వార్ని, అందులో పని చేసే వార్ని టైం టూ టైం ఖతమ్ చేసేస్తూ వుంటుంది! దివంగత జయలలిత కొడనాడు ఎస్టేట్ మిస్టరీ ఇలాగే తయారవుతోంది. పాపం అమ్మ జయలలితను మనం అనుమానించాల్సిన పని లేదు కాని… వరుసగా కొడనాడు ఎస్టేట్ తో లింక్ వున్న ఒక్కొక్కరూ మృత్యువాత పడుతున్నారు! అదే ఇప్పుడు తమిళనాడులో చర్చకు కారణం అవుతోంది!   జయలలిత మరణించిన కొద్ది రోజులకి చెన్నై మెరీనా బీచ్ లో జయ ఆత్మ కనిపించిందంటూ ఫేక్ వీడియోలు బయలుదేరాయి. అవన్నీ ఉట్టివేనని తేలిపోయింది కాని… జయ మరణం ఎఫెక్ట్ మాత్రం ఇంకా తగ్గటం లేదు! మరీ ముఖ్యంగా ఆమె కొడనాడు ఎస్టేట్ తో సంబంధం వున్న వారు ఒక్కొక్కరు మృతి చెందుతున్నారు. తాజాగా జయలలిత అకౌంటెంట్ దినేష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఇంట్లోని ఫ్యాన్ కు ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో ప్రాణం తీసుకున్నాడు! కారణాలు ఏంటో ఇంకా తెలియటం లేదట!   ఆత్మ చేసుకున్న జయలలిత అకౌంటెంట్ దినేష్ కుమార్ కొడనాడు ఎస్టేట్ లోనే పని చేసేవాడు. ఆదే ఎస్టేట్ లో ఆ మధ్య సెక్యూరిటీ గార్డ్ హత్యకి గురయ్యాడు. అతడ్ని దొంగతనానికి వచ్చిన దుండగులు మర్డర్ చేశారు. ఆ మర్డర్ చేసిన వారిలో కూడా మరొకరు అనుమానాస్పదంగా రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారు. తరువాత ఇంకో దొంగ కూడా రోడ్డు యాక్సిడెంట్లోనే అనూహ్యంగా అంతమయ్యాడు! ఇలా ఇప్పుడు అకౌంటెంట్  మిస్టరీ డెత్ తో నాలుగో ప్రాణం పోయింది కొడనాడు ఎస్టేట్ ఖాతాలో!   జయలలిత మరణం తరువాత జరుగుతోన్న చావులకి ఆమె ఆత్మకి సంబంధం లేదని ఎవరైనా చెప్పేయోచ్చు. కాని,అసలు ఈ అనుమానాస్పద మరణాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇది ఇప్పుడు పెద్ద ప్రశ్న! ఎస్టేట్ లోని ఆస్తులు, పత్రాలకి , మరణాలకి ఏమైనా సంబంధం వుందా అన్నది పోలీసులు తేల్చాలి! లేదంటే మరిన్ని ప్రాణాలు పోయే ప్రమాదం లేకపోలేదు!

జమ్మల‘మడుగు’లో రెండు పెద్ద చేపల జగడం!

  కాకి తన స్వంత గూడు కట్టుకోదట! కోకిల ఏర్పాటు చేసిన దాంట్లోనే తన పిల్లల్ని కూడా వుంచేస్తుందట. తీరా కాకి పిల్లలు రెక్కలు రాగానే గూట్లోంచి తుర్రుమంటాయట! ఇదంతా నిజమో కాదోగాని… ప్రస్తుతం మన రాజకీయాలు చూస్తోంటే పక్కా నిజమనిపిస్తోంది! ఏ నియోజకవర్గంలో చూసినా ఒక నేత పుట్టలో మరో నేత వచ్చి వేలు పెడతాడు. వలస మంత్రం పటిస్తూ తాను గెలిచిన పార్టీ వదిలేసి అధికార పార్టీలోకి జంప్ అవుతాడు. ఇక ఆ తరువాత అంత కాలం పార్టీని నమ్ముకుని వున్న నాయకుడికి, కార్యకర్తలకి చుక్కలు చూపిస్తాడు. ఇదీ వ్యవహారం…   దేశంలో ఎక్కడ చూసినా జంప్ జిలానీలు ఎక్కువైపోయారు. ఇందుకు ఆంధ్ర రాష్ట్రం కూడా మినహాయింపు కాదు! అయితే, నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు… పాలన మీద దృష్టి పెట్టలేకుండా ఈ జంప్ జిలానీల రగడ ఎక్కువపోతోంది. అంతలా ఏదో ఒక నియోజకవర్గం రోజూ వార్తల్లో నిలుస్తోంది. ఉప ఎన్నికల కోలాహలంతో వున్న నంద్యాల మొన్నటి వరకూ భూమా, శిల్పా వర్గాల నడుమ భీభత్సమైన వార్ తో వార్తల్లోకి ఎక్కింది. అక్కడ అన్ని సమస్యలకి మూలం వైసీపీ నుంచి జరిగిన వలసలే అని అందరికీ తెలిసింది!   కడప జిల్లా టీడీపీలో కూడా చంద్రబాబుకు హెడేక్ తెచ్చే కలకలం ఒకటి చాలా రోజులుగా రేగుతోంది. ఎట్టకేలకు ఇప్పుడు అది ముఖ్యమంత్రి సమక్షంలోకి చేరింది. ఇంతకాలం జమ్మలమడుగు కాన్ స్టిట్యుయెన్సీకే పరిమితమైన రామ సుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి గొడవ ఇప్పుడు చంద్రబాబు కోర్ట్ లోకి వచ్చింది. ఎప్పట్నుంచో టీడీపీలో వుంటోన్న రామసుబ్బారెడ్డి సీఎం కలిసి ఆదినారాయణ రెడ్డి, ఆయన వర్గం గురించి కంప్లైంట్ల వర్షం కురిపించారట! చాలా చోట్ల వలస నేతలు వస్తే ఏమవుతుందో ఇక్కడా అదే అవుతోంది. వైసీపీ నుంచి ఆదివారాయణ రెడ్డి రావటంతో అప్పటికే టీడీపీలో వున్న రామ సుబ్బారెడ్డి, అతడి వర్గం ఇబ్బందిగా ఫీలవుతున్నారు. రకరకాల అభివృద్ధి పనుల్లో కూడా ప్రాధాన్యత ఆదినారాయణ రెడ్డి మనుషులకే దక్కుతోందట. దీంతో టీడీపీ కండువా భుజం మీద నుంచి తీయని ఎందరో సిన్సియర్ కార్యకర్తలు మెల్లమెల్లగా నిరాశకి, ఆగ్రహానికి గురవుతున్నారట!   మహానాడుకి కూడా రాకుండా నిరసన తెలిపిన రామసుబ్బారెడ్డి ఇప్పుడు చంద్రబాబుకి కంప్లైంట్ చేసేదాకా వెళ్లారు. ముందు ముందు ఈ జమ్మలమడుగు సంక్షోభం ఎటు దారితీస్తుందో మరి! కాకపోతే, నాయకులు, క్యాడర్ల మధ్య పోరు మొత్తంగా వచ్చే ఎన్నికల్లో పార్టీకి నష్టం చేస్తే ఆది ఇబ్బందికరమైన స్థితే! ఎందుకంటే, కడప జిల్లా జగన్ కంచుకోట. అక్కడ ప్రతీ ఓటు టీడీపీకి ఎంతో అమూల్యం మరి…

నిందితుడూ ఆయ‌నే..బాధితుడూ ఆయ‌నే

రాజకీయాల్లో నాయకుడిగా ఎదగాలంటే సందర్భానికి తగ్గట్టు ఎత్తులకు..పై ఎత్తులు వేయడమే కాదు..జనాన్ని ఆకట్టుకునే వాగ్థాటి ఉండాలి..నిజానికి నాయకునికి ఉండాల్సిన మొదటి లక్షణం వాక్ఛాతుర్యం. చాతుర్యం ఉన్నా లేకున్నా కనీసం వాక్కులైనా సరిగ్గా వాగకపోతే ఓట్లు సంగతి తర్వాత..తిట్లు మాత్రం పక్కా. ఎంత కాకలు తిరిగిన రాజకీయ నాయకునికైనా ప్రసంగాలు చేస్తున్నపుడు..కంగారులోనో, అనుకోకుండానో నాలుక కొన్నిసార్లు తడబాటు గురవుతుంది..అప్పుడు వాస్తవంగా చెప్పాలనుకున్న దాని బదులు వేరేది చెప్పేస్తారు. ఇన్ని రోజులు టీడీపీ నేత, మంత్రి లోకేశ్ ప్రసంగాలను విమర్శించి..ఎగతాళీ చేసిన వైసీపీ నేతలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు...ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.   పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రులో దళితులు, అగ్రవర్ణాల మధ్య గొడవ చెలరేగి, కులాల కుంపటి రాజుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న జగన్ ఆ ఊరు వెళ్లి ఇరువర్గాల మధ్య రాజీ కుదర్చాలనుకున్నారు. ఇక్కడి వరకు ఆయన్ను అభినందించాల్సిందే..ఇక వెళుతూ వెళుతూ విలేకరులతో మాట్లాడిన జగనన్న నాలుకకు ఏమైందో ఏమో కానీ..బాధితుల్ని ముందే అరెస్ట్ చేస్తే ఈ గొడవ లేకపోయేది కదా..? అన్నాడు..దీంతో అక్కడున్న జర్నలిస్టులు, వైసీపీ నేతలు, జనం షాక్ తిన్నారు. నిజానికి ఆయన అనాలనుకున్నది "నిందితుల్ని ముందే అరెస్ట్ చేస్తే ఇంత గొడవ జరిగేది కాదు కదా.." అని..   మైకు దొరికితే చాలు ఆఫ్టర్ వన్ ఇయర్ ఏపీకి కాబోయే ముఖ్యమంత్రిని నేనే అంటూ ఊగిపోతున్న జగన్ అదే పనిగా ఎక్కువ ఆలోచించి..అదే ధ్యాసగా ఉండి..ఆక్రోశం తన్నుకొచ్చేస్తుంటే..ట్రాన్స్‌లోకి వెళ్లినట్లున్నారు..అందుకే నోటికి ఏం వస్తుందో కూడా తెలియడం లేదనుకుంటా..లోకేశ్ ఎక్కడ దొరుకుతాడా అని ఎదురుచూసే వైసీపీ నేతలు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి..లోకేశ్‌కు తెలుగు మీద పరిజ్ఞానం తక్కువ..ఇంకా కాస్త బెరుకు పోలేదు..కాబట్టి టంగ్ స్లిప్ అవుతుంది అంటే అర్థముంది..కానీ అనుభవంలోనూ..వయసులోనూ ఎంతో వ్యత్యాసం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి నోరు జారడం విడ్డూరంగా ఉంది..అయినా అక్కడ ఎవరో తరుముతున్నట్లు మాట్లాడటం దేనికి..? హాయిగా, ప్రశాంతంగా ఆచితూచి మాట్లాడితే జగన్‌ని అడిగేవారు ఎవరు లేరు..? కాబట్టి బీ కూల్ అండ్ టేక్ కేర్.

రోజూ చెమట పట్టనివారికి… ముచ్చెమటలు తప్పటం లేదు!

  ఒకప్పుడు మన దేశంలో ఊహించటానికి కూడా వీలు లేని చర్చలు ఇప్పుడు జరుగుతున్నాయి. అలాంటి వాటిల్లో అత్యంత ఆందోళకర అంశం… అధిక బరువు! భారత్ వేల సంవత్సరాలుగా వ్యవసాయ ప్రధాన దేశం. మన దగ్గర పోతన లాంటి కవీశ్వరులు కూడా నాగలి పట్టి దున్నారు. సీతమ్మ వారు జనకుడికి పొలం దున్నుతుంటేనే లభించింది! ఇక శ్రీకృష్ణుడి అన్న బలరాముడికి ఆయుధం… నాగలి. అంతగా వ్యవసాయం మన సంస్కృతిలో భాగంగా వుండేది. రాజుల నుంచి పేదల దాకా అందరూ మట్టిలో , బురదలో శ్రమించి పని చేసేవారు! బహుశా అందుకేనేమో గతంలో ఎప్పుడూ మన దగ్గర అధిక బరువు ఒక సమస్యగా మారలేదు. ఎవరో కొందరు స్థూల కాయులు ఎప్పుడూ వున్నప్పటికీ సమాజం మొత్తం తల పట్టుకుని కూర్చునేలా అందరికందరూ లావైపోవటం ఎప్పుడూ జరగలేదు! కాని, ఇప్పుడు అదే జరుగుతుండటం ఆలోచించాల్సిన విషయం!   సాధారణంగా మనకు ఇంతకు ముందు వున్నంతగా శరీర శ్రమ వుండటం లేదు. కాని, మనస్సు పైన తీవ్రమైన ఒత్తిడి వుంటోంది. ఈ రెండూ కలిసి వయస్సుతో సంబంధం లేకుండా అధిక బరువుతో బాధపడుతున్నా కోట్లాది భారతీయులు. ఇందులో మామూలు వారే కాదు సెలబ్రిటీలు కూడా బోలెడు మంది వున్నారు. అత్యంత తాజాగా దాసరి నారాయణ రావు అనూహ్య పరిస్థితిలో స్వర్గస్తులయ్యారు. ఆయనకు చాలా రోజులుగా ఏదో ఆనారోగ్యం వున్నట్టుగా కూడా ఎవ్వరూ వినలేదు. కాని, కేవలం మూడు, నాలుగు నెలల వ్యవధిలో చనిపోయే స్థితి దాపురించింది. ఇందుకు కారణం… అధిక బరువుతో వచ్చిన ఒత్తిడేనంటే నమ్ముతారా?   దాసరి వెయిట్ రిడక్షన్ ట్రీట్మెంట్ తీసుకుని , వికటించి మరణించారంటే మొదట్లో ఎవరో నమ్మలేదు. కాని, ఆయనకు ఆప్తుడైన మరో దర్శకుడు రేలంగి నరసింహారావు అదే విషయాన్ని ధృవీకరించారు! దాసరి బరువు తగ్గటానికి చికిత్స తీసుకుని , అది సరిగ్గా కుదరక మరణించారంటున్నారు ఆయన! దీన్ని ఒప్పుకోని వారు కూడా వుంటే వుండొచ్చు కాని… ఆ మధ్య ఆర్తి అగర్వాల్ కేసైతే అందరికీ తెలిసిందే! ఆమె కూడా అధిక బరువు వల్ల బాధపడి ప్రాణాంతక ట్రీట్మెంట్ తీసుకుని మనకు దూరమయ్యారు!   మ్యూజిక్ డైరెక్టర్ చక్రీ అధిక బరువు తగ్గించుకునే రిస్క్ ఏం చేయలేదు కాని… ఆయనకు గుండెపోటు రావటానికి ఓవర్ వెయిటే కారణమని కొందరు వాదిస్తుంటారు. ఇలా అందరికీ తెలిసిన సెలబ్రిటీలు అధిక బరువుతో మృత్యు వాత పడితే మనకు తెలుస్తుంది. కాని, సామాన్యుల పరిస్థితి ఏంటి? మారిపోయిన లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది అనేక రోగాలకు బలవుతున్నారు. వాటిలో చాలా వాటికీ కారణం అధిక బరువే. ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవటం ప్రాణాలు తీసేదాకా వెళుతుంది. అలాగని సాహసం చేసి వివిధ రకాల సర్జరీలు, చిక్సిత్సలతో కొవ్వు తీయించుకున్నా… అదీ ప్రమాదకరంగానే పరిణమిస్తోంది! ఇలా ఊరుకున్నా, ఉద్రేకపడినా ఇబ్బందిగా మారిపోయింది ఓవర్ వెయిట్!   ఏదో చూడటానికి బాగా వుండమనో, లేక రోజువారీ పనులు చేసుకోటం కూడా కష్టమవుతుందనో మనం అధిక బరువు తగ్గాల్సిన అవసరం లేదు. కాని, అవసరానికి మించి బరువు వుండటం వల్ల జీవితమే నిరాశా,నిస్పృహలతో నిండిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే, కొన్నేళ్లకు మన బరువే మన శత్రువుగా మారి ఆయుష్షు తగ్గించేస్తుందంటున్నారు. అయితే, దీనికి ఉచిత పరిష్కారం కూడా ఉచితంగానే చెబుతున్నారు నిపుణులు. బాబా రాందేవ్ లాంటి యోగా గురువులు మొదలు డైటీషన్లు, ఫిట్ నెస్ ఎక్సపర్ట్స్  అందరూ ఒకటే అంటున్నారు. యోగాతోనో, జిమ్ లోనో, పరుగులు పెట్టటానికి వీలుగా వుండే గ్రౌండ్లోనో… ఎక్కడో ఓ చోట, లేదంటే ఇంట్లోని ట్రెడ్ మిల్ పైనా… ఎక్కడైనా, ఎలాగైనా కొవ్వు కరిగించమంటున్నారు! మందులు, చిక్సిత్సలకంటే ఒళ్లు వంచి శ్రమపడటం చాలా సేఫ్ అండ్ గ్యారెంటీ అంటున్నారు!   ఎవరికైతే చెమట పట్టడం లేదో… వారికి అధిక బరువు ముచ్చెమటలు పట్టిస్తుందనేది… ఇప్పటి మన ఏసీల కాలపు సుఖమైన ఆధునిక జీవన సత్యం!

ఆ బీజేపీ లీడర్ ‘బ్యాన్’ చేయాల్సిందే అంటున్నాడు! గోమాంసం కాదు!

  దేశంలో ఒక వైపు బీఫ్ తింటున్నారని ఆరోపిస్తూ అనేక చోట్ల హత్యలకి తెగబడుతున్నారు అరాచకవాదులు. దీన్ని తమ రాజకీయాలకు అనుకూలంగా వాడుకుంటున్న ప్రతిపక్షాలు అవ్వి కేవలం ముస్లిమ్ మైనార్టీల్ని టార్గెట్ చేసి జరుపుతోన్న దాడులకి అంటున్నాయి. మరికొన్ని పార్టీలు దళితుల్ని కూడా కాషాయ శక్తులు భయపెడుతున్నాయని అంటున్నాయి. ఇదంతా ఒక గందరగోళం అయితే మరో గందరగోళానరికి తెర తీసే ప్రయత్నంలో వున్నారు ఇంకో బీజేపి నేత! ఆయన గోమాంసం నిషేధం కాక మరో తినుభండారం బ్యాన్ చేయాలంటున్నారు! అదే మోమో!   మోమో అంటే ఏంటి అంటారా? ఉత్తర భారతదేశంలో దొరికే ఒక రకమైన స్ట్రీట్ ఫుడ్! మరీ ముఖ్యంగా జమ్ములో వీధి వీధినా మోమోలు అమ్ముతుంటారు. మన దగ్గర వేడి వేడి మిర్చీలు నూనెలో గోలించి అమ్మినట్టే అక్కడ మోమోలు అమ్ముతుంటారు.అయితే మోమోలు నాన్ వెజ్ తో కూడా తయారు చేస్తారు. పిండిలో రకరకాల మసాలాలు పెట్టి నూనేలో వేపుతారు! వీట్ని లొట్టలేసుకుంటూ తింటారు లక్షలాది మంది ఉత్తర భారతీయులు. జమ్ములో ఈ మోమో అభిమానులు ఇంకా ఎక్కువ!   ఎంతో మంది ఇష్టపడి తినే మోమోలపై జమ్ములోని ఒక బీజేపి ఎమ్మెల్సీ ఎందుకు కక్షగట్టారు? ఆయన చెబుతోన్న రీజన్స్ కాస్త సీరియస్ గానే వున్నాయి. మోమోల్లో మంచి రుచి రావటం కోసం అజినమోటో అనే పదార్థం కలుపుతారట. ఒక విధమైన విషం లాంటి దీని వల్ల అనేక ఆనారోగ్యాలతో పాటూ క్యాన్సర్ కూడా వస్తుందంటున్నారు రమేష్ అరోరా. బీజేపి ఎమ్మెల్సీ అయిన ఆయన చాలా రోజులుగా మోమోలపై యుద్ధం చేస్తున్నారు. తాజాగా వంద మందిని వెంట పెట్టుకుని జమ్మూలో ర్యాలీ కూడా చేశారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు మోమోల్ని నిషేధించే దాకా ఆయన ఊరుకోనని శపథం చేశారు! దిల్లీలో, శ్రీనగర్ లో రెండు చోట్లా రమేష్ అరోరా ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీనే అధికారంలో వుంది కాబట్టి బ్యాన్ చేస్తారో లేదో చూడాలి! కాకపోతే, జనం ఎంతో ఇష్టంగా తినే మోమోలను దొరక్కుండా చేస్తే రియాక్షన్ తీవ్రంగానే వుండే ఛాన్స్ వుంది! ఎందుకంటే, ఇప్పటి వరకూ మోమోల్లో విషతుల్యమైన పదార్థాలు కలుస్తున్నట్టు ఎక్కడా నిరూపితం కాలేదు. మరి అలాంటప్పుడు ఆల్రెడీ గో మాంసం నిషేధంతో గొడవలు ఎదుర్కొంటోన్న కమలదళం కొత్తగా మోమోల వేడిని కూడా కోరి నెత్తిన పెట్టుకుంటుందా? చూడాలి మరి…

చైనా వర్సెస్ ఇండియా… వయా భూటాన్

ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ఏదైనా దేశం గూండాగిరి చేస్తోందంటే అది చైనా ఒక్కటే! చాలా దేశాలకు తమ పక్క దేశాలతో సరిహద్దు సమస్యలుంటాయి. కాని, ఏకపక్షంగా ప్రకటనలు చేయటం, బెదిరించటం మాత్రం చైనానే చేస్తుంటుంది. ఒకవైపు ఇండియాతో కయ్యం పెట్టుకునే డ్రాగన్ మరో వైపు టిబెట్ ను ఎప్పుట్నుంచో అక్రమంగా ఆక్రమించుకుని కూర్చుంది. టిబెటన్ల మత గురువు, పరిపాలకుడు అయిన దలైలామాకు ఇండియా ఆశ్రయం ఇవ్వటం కూడా చైనాకు అనుక్షణం కోపం తెప్పిస్తూ వుంటుంది. ఇక చైనా తైవాన్ తో, వియత్నాంతో , జపాన్ తో పెట్టుకునే పంచాయితీలు కూడా అన్నీ ఇన్నీ కావు. ఇవే కాక… ఈ మధ్య వేగంగా అభివృద్ది చెందుతూ వుండటంతో అగ్ర రాజ్యం అమెరికాతో కూడా కుస్తీకి రెడీ అయిపోతోంది!   చైనా శత్రువులుగా భావించే అతి కీలక దేశాల్లో భారత్ కూడా ఒకటి. మనతో ఓ సారి 1962లో యుద్ధం చేసి తీవ్ర నష్టం కూడా కలిగించింది. కొంత భూభాగం ఆక్రమించుకుంది. ఇప్పటికీ తిరిగి ఇవ్వలేదు. కాని, 1962నాటి నెహ్రు ఇండియాకి, ఇప్పటి మోదీ ఇండియాకి చాలా తేడా వుంది. ఈ సత్యం బీజింగ్ కు బోధపడటం లేదు. కాదంటే కావాలనే కవ్విస్తోందో!   సిక్కింలో ప్రస్తుతం భారత్, చైనా దళాలు ముఖాముఖి నిలబడి వున్నాయి. అందుక్కారణం చైనా దురాక్రమణ సిద్ధాంతమే. చాలా చిన్న దేశమైన భూటాన్ ను ఈసారి బెదిరించే పనిలో పడింది మైటీ డ్రాగన్. ఆ దేశంతో చైనాకు వున్న సరిహద్దు ప్రాంతంలోని వివాదాస్పద స్థలంలో రోడ్డు వేయటానికి ప్రయత్నించింది! డోక్లామ్ గా పిలవబడే ఆ చోట చైనాగానీ, భూటాన్ గాని ఎలాంటి కట్టడాలు, నిర్మాణాలు చేయకూడదని అగ్రిమెంట్ వుంది. అయినా దాన్ని పట్టించుకోకుండా రోడ్డు వేయటానికి సిద్ధమైంది. అలా చేస్తే చైనా, భూటాన్, టిబెట్, బంగ్లాదేశ్ లను కలిపే రోడ్ వే ప్రాజెక్ట్ చైనాకు తేలికవుతుంది. ఈ ఉద్దేశ్యంతో బలవంతంగా భూటాన్ భూ భాగంలోకి చొరబడి పనులు మొదలు పెట్టింది.   భూటాన్ పై బలప్రయోగానికి దిగిన చైనాకు ఇండియన్ ఆర్మీ అడ్డుగా నిలిచింది. భూటాన్ కు సైనిక సహాయం అందించటం ఆ దేశంతో మనకున్న అగ్రిమెంట్లలో ఒకటి. అందుకే, భూటాన్ కు అండగా ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. ఇప్పుడు ఇదే చైనాకు మంట పుట్టిస్తోంది. 1962నాటి రోజులు భారత్ గుర్తుంచుకోవాలని  చైనా కమ్యూనిస్టు పాలకులు హెచ్చరిస్తున్నారు. కాని, అప్పటికి ఇప్పటికీ ఎంతో ఎదిగిన ఇండియా చైనా ఊహించినంత ఈజీగా బెదిరిపోదు. ఆ విషయం బీజింగ్ కి కూడా తెలుసు. అయినా , రోజు రోజుకు ఆమెరికాకు దగ్గరవుతోన్న ఇండియా ఆసియాలో చైనాకు తాళలేని పోటీ ఇస్తోంది. ఆ ఒత్తిడి తట్టుకోలేకే ఇలా పదే పదే కయ్యానికి కాలుదువ్వుతుంటుంది!   పైకి బుద్ది చెబుతాం అన్నట్టు భీకరంగా మాట్లాడుతున్నా చైనాకు ఇప్పటికిప్పుడు భారత్ తో యుద్ధం చేసే ఉద్దేశం లేదు. అందుకు తగ్గ పరిస్థితులు కూడా లేవు. ఇండియాలోని మార్కెట్ చైనాకు చాలా అవసరం. అది పోతే యుద్ధం వల్లే నష్టం కన్నా ఎక్కువ నష్టం తప్పదు. కాబట్టి డ్రాగన్ సిక్కింలో,అరుణాచల్ ప్రదేశ్ లో, అక్కడా, ఇక్కడా చేసేవన్నీ ఉత్తుత్తి హంగామాలే అని భావించాల్సి వుంటుంది. అయినప్పటికీ పాక్ లాంటి బలహీన దేశం కాదు కాబట్టి ఇండియన్ అర్మీ అలెర్ట్ గా వుండటం ఎంతో అవసరం…

ఖాళీ టైం విపరీతంగా వున్న ఇద్దరు ‘మేధావులు’ రాష్ట్రపతి అవుదామనుకున్నారు!

  చాలా మందికి ఎంతో అవసరమైన పనులు చేసుకుందామంటేనే ఓపిక, సమయం వుండవు! కాని, కొందరికీ ఏ ఉపయోగం లేని పనులు, వినటానికే విచిత్రంగా వుండే పనులు చేయటానికి ఎక్కడలేని టైం దొరుకుతుంది! అందుకు మంచి ఉదాహరణ ఈ మధ్య దాఖలైన రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్లు చూస్తే దొరుకుతంది!   ప్రణబ్ తరువాత ఎవరు ప్రెసిడెంట్ అనేది తేల్చటానికి ప్రస్తుతం ఎన్నికలు జరగబోతుండటం తెలిసిందేగా! అయితే, మిగతా అన్ని ఎన్నికల్లాగే రాష్ట్రపతి ఎన్నికలకు కూడా అర్హత వున్న ఎవరైనా నామినేషన్ వేయవచ్చు. కాని, వారికి కనీసం 50మంది ఎంపీల మద్దుతుండాలి! ఇలాంటి రూల్ వున్నా ఎక్కడ్నుంచి వచ్చారో తెలియదుగాని … మొత్తం 90కి పైగా నామినేషన్లు వేశారట ప్రెసిడెంట్ అవుతామంటూ! చివరకు, అధికార ఎన్డీఏ కూటమి నిలిపిన రామ్ నాథ్ కోవింద్, కాంగ్రెస్ పోటీలో వుంచి మీరా కుమార్ మాత్రమే ఎన్నికలకు మిగిలారు. మిగతా అందరి నామినేషన్లు తిరస్కరించబడ్డాయి.   నామినేషన్ల తిరస్కరణ ఎప్పుడూ జరిగేదే. కాని, ఈసారి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి దిగిన ఒకాయన ఏకంగా తాను దేవుడ్నని హెచ్చరించి మరీ నామినేషన్ వేశాడు. అంతే కాదు, తనకు అద్బుత శక్తులున్నాయన్నాడు పానిపట్ ప్రాంతానికి చెందిన సదరు దేవీదయాళ్ అగర్వాల్! తనని ఎన్నుకోకుంటే దిల్లీలో భూకంపం వస్తుందని కూడా చెప్పాడట! మరో మేధావి తాను రాష్ట్రపతిని అయ్యేందుకు ఎవరెవరి మద్దతు తీసుకొచ్చాడో తెలుసా? భగత్ సింగ్ , వివేకానంద, అబ్రహాం లింకన్, ఐన్ స్టీన్… అబ్బో ఇలా చాలా మంది లెజెండ్స్ నే పట్టుకొచ్చాడు! ఆ మహానుభావులంతా హర్యానాకు చెందిన వినోద్ కుమార్ అనే ఓ ఔత్సాహిక రాష్ట్రపతికి తమ మద్దతు తెలిపారట! ఈ విషయం తన పేరుకు తగట్టుగా నామినేషన్ లో చెప్పాడు వినోద్ కుమార్!   ఇంతకీ నేను దేవుడ్ని అన్న పెద్దాయన నామినేషన్, నాకు భగత్ సింగ్ మద్దతుందన్న మేధావి నామినేషన్ ఏమయ్యాయనుకున్నారు? సింపుల్ గా రిజెక్ట్ అయ్యాయి! వీళ్ల ఈ వింత నామినేషన్ల గురించి వింటే ఏమనిపిస్తోంది? దేశంలో ఖాళీ టైం విపరీతంగా వున్న పాప్ కార్న్ బ్యాచ్ చాలా మంది వున్నారనిపిస్తోంది కదూ!

జీఎస్టీ వచ్చాక… మస్తీ అండ్ మజా… కాస్ట్లీనా.. చీపా

మనిషన్నాక కళపోషణ వుండాలి. అది వున్నా లేకున్నా … ఏదో ఒక విధమైన ఎంజాయ్ మెంటు, ఎంటర్టైన్మెంటు మాత్రం వుండి తీరాలి. లేకుంటే రొటీన్ లైఫ్ తో బోర్ కొట్టేస్తుంది! మరి జీఎస్టీ వచ్చేస్తే జనాల ఎంజాయ్ మెంట్, ఎంటర్టైన్మెంట్ సంగతేంటి? అలా సరదాగా సినిమాకో, హోటల్ కో వెళితే జేబుకి చిల్లా? లేక ముందుకన్నా లాభమా? రండి చూసేద్దాం…   మీరు వారానికి ఒకసారో, నెలకి ఒకసారో హోటల్ కి వెళ్లి లాగించే టైపు అయితే జీఎస్టీ వచ్చాక పెద్ద హోటల్ కే వెళ్లండీ! ఫైవ్ స్టార్ హోటల్స్, ఏసీ వుండే హోటళ్లు అయితే గతంలో 28శాతం ట్యాక్స్ వుండేది. జీఎస్టీ వచ్చాక 18శాతం మాత్రమే వేస్తారు. కాని, ఏసీ లేని మామూలు రెస్ట్రాంట్ లైతే గతంలో కన్నా ఎక్కువ బిల్లు పడుతుంది!   సినిమా చూద్దామని థియేటర్ కి వెళ్లాలనుకుంటే మాత్రం మల్టీప్లెక్సులకి నాలుగు నోట్లు ఎక్కువే పెట్టుకుని వెళ్లండీ! ఇప్పుడు 18 శాతం వున్న ట్యాక్స్ జీఎస్టీ వచ్చాక 28శాతం అవుతుంది! కానీ, వంద రూపాయల కంటే తక్కువ ధర టికెట్లు వుండే చిన్న సినిమా హాళ్లలో మాత్రం 18 శాతమే ట్యాక్స్ వుంటుంది. సో… చిన్న సినిమా థియేటర్లను ఆదరించటం మనకు, థియేటర్ వాళ్లకి ఇద్దరికీ బెటర్ అన్నమాట!   సరదా అంటే ఎప్పుడూ సినిమా, హోటల్ మాత్రమేనా అంటారా? అయితే, ఎక్కడికైనా విహారానికి వెళితే ఎంత ఖరీదైన హోటల్ ఎంచుకుంటారో అంత వాయింపు వుండబోతోంది. రూం రెంట్ వెయ్యి కంటే తక్కువ వుండే హోటళ్లకు జీఎస్టీ వర్తించదు. వెయ్యి నుంచీ 2500 వరకూ ధర పలికే హోటల్స్ అయితే 19శాతం ట్యాక్స్. 2500 నుంచీ 7500 రేంజ్ హోటళ్లకు 18శాతం ట్యాక్స్. అంతకంటే ఖరీదైన హోటల్స్ అయితే 28శాతం ట్యాక్స్ కట్టాల్సి వుంటుంది!   జీఎస్టీ వచ్చాక తినటం కాస్త ఖరీదైనా తిరగటం చీప్ అవుతుంది! ఓలా, ఉబర్ లాంటి క్యాబ్స్ ఇప్పుడు 6శాతం ట్యాక్స్ కట్టాల్సి వస్తోంది. జీఎస్టీలో 5శాతం మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. కాబట్టి క్యాబ్ లో షీకార్లు వేయటం ముందు ముందు కొంత చీప్ అవుతుంది అన్నమాట!

జీఎస్టీ తేనె తుట్టె కదిలిస్తే… గతంలో వివిధ దేశాల్లో ఏం జరిగింది

వస్తువులు, సేవల పన్ను… ఠక్కున అర్థమయ్యేలా చెప్పాలంటే… జీఎస్టీ! మరి కొన్ని గంటల్లో భారత్ జీఎస్టీ శకంలోకి ప్రవేశించబోతోంది! ఇంతకాలం వున్న సేల్స్ ట్యాక్సుల్లాంటి అనేక పరోక్ష పన్నులు ఇక మీద వుండవు! ఒక దేశం, ఒక ట్యాక్స్ నినాదం నిజం కాబోతోంది! ఇది మామూలుగా ఏం జరగలేదు. గత ఇరవై ఏళ్లుగా వివిధ చోట్ల గుసగుసగా , బిగ్గరగా వినిపిస్తూనే వుంది. ఎట్టకేలకు ఇప్పుడు జీఎస్టీ అమలుకు అవకాశం లభించింది. కాని, జీఎస్టీ అమలు తరువాత ఆర్దిక కుదుపు ఎలా వుండబోతోంది? ఇది తెలియాలంటే, గతంలో జీఎస్టీ లాంటి విధానాన్ని తమ దేశాల్లో అమలు చేసిన వ్యవస్థల్ని ఒకసారి పరిశీలించాల్సిందే!   ప్రపంచంలోనే అత్యంత సుసంపన్న ఆర్దిక వ్యవస్థ అయిన అమెరికాలో జీఎస్టీ లాంటి విధానమే లేదు! అక్కడ రాష్ట్రాలకు ట్యాక్స్ వేసుకునే విషయంలో చాలా వెసులుబాటు వుంటుంది! ఇక ప్రపంచంలో మొట్ట మొదటి జీఎస్టీ అమలు చేసిన దేశం ఫ్రాన్స్! 1954లొ ఆ దేశం వన్ నేషన్ వన్ ట్యాక్స్ అన్నాక దాదాపు 160దేశాలు అదే పద్ధతి ఫాలో అయ్యాయి. చాలా యూరోపియన్ దేశాలు ఫ్రాన్స్ బాటలో పయనించి 1970లు, 80లలో జీఎస్టీ విధానం ప్రవేశపెట్టాయి.   చైనా దశల వారీగా జీఎస్టీకి బదులు వ్యాట్ అమలు చేస్తూ వచ్చింది. 2016లో వ్యాట్ సంస్కరణలు పూర్తిగా ముగించింది. బిజినెస్ ట్యాక్స్, ఇతర ట్యాక్సులు అన్నీ రద్దు చేసేసింది. ఒకే ఒక్క వ్యాట్ వుండటం వల్ల చైనాలో ఏర్పడ్డ రియల్ ఎస్టేట్ నీటి బూడగా అమాంతం పేలిపోయింది. భూములు ధరలు సామాన్య స్థితికి చేరుకన్నాయి.   జపాన్ లో జీఎస్టీని కన్జంప్షన్ ట్యాక్స్ అంటారు. 1989లో దీన్ని ప్రవేశపెట్టారు. అప్పట్లో 3శాతం వున్నం కన్జంప్షన్ ట్యాక్స్ ఇప్పుడు పది శాతానికి చేరుకుంది.   మలేషియా ప్రభుత్వం 2015లో జీఎస్టీని ప్రవేశపెట్టింది. 26ఏళ్ల చర్చలు, అనుమానాల తరువాత నిర్ణయం తీసుకున్నప్పటికీ గొడవలు, నిరసనలు తప్పలేదు. ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరిగిపోయింది. అయినా మెల్లమెల్లగా పరిస్థితులు సద్దుమణిగాయి. ఇప్పుడు మలేషియా జనం దాదాపు 70శాతం మంది కొత్త పన్ను విధానం బావుందంటున్నారు!   2000వ సంవత్సరంలో జీఎస్టీ తీసుకొచ్చిన ఆస్ట్రేలియా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. పది శాతం వున్న ప్రస్తుత ట్యాక్స్ త్వరలో పదిహేను శాతానికి పెరగనుంది. ఆస్ట్రేలియా పక్కనే వుండే న్యూజిలాండ్ మాత్రం ఎంతో ముందుగా , 1986లోనే జీఎస్టీ అమల్లోకి తెచ్చింది. పది శాతం పన్నుతో మొదలైన జీఎస్టీ ఇప్పుడు పదిహను శాతంగా వుంది.   ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన అతి చిన్న దేశం సింగపూర్. 1994లో జీఎస్టీ సాహసం చేసిన ఆ దేశం… మొదట్లో ఎన్జీవోలు, సోషల్ యాక్టివిస్టుల నుంచి ప్రతిఘటన ఎదుర్కొంది. ద్రవ్యోల్బణం కూడా అదుపు తప్పింది. కాని, ఇప్పుడు అంతా సద్దుకుంది. జీఎస్టీ సింగపూర్ ఆదాయంలో రెండో అతి పెద్ద వనరు! కార్పోరేట్ ఇన్ కమ్ ట్యాక్స్ తరువాతి స్థానం దానిదే!   ఇప్పుడు మన దేశంలో ప్రవేశపెడుతోన్న జీఎస్టీ విధానానికి చాలా దగ్గరగా వుంటుంది కెనడా జీఎస్టీ. సెంట్రెల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీ వేరు , వేరుగా వుంటాయి. అయితే, 1991లో కెనడా సెంట్రల్ గవర్నమెంట్ చేసిన జీఎస్టీ ప్రయోగాన్ని మూడు ప్రావిన్షియల్ ప్రభుత్వాలు తీవ్రంగా ప్రతిఘటించాయి. కోర్టు వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టాయి. అయినా జీఎస్టీ ఆగలేదు…   జీఎస్టీ ప్రవేశపెట్టి తిరిగి మళ్లీ పాత పద్దతిలోకి వెళ్లిపోయిన ఏకైక దేశం కొలంబియా! అక్కడ ప్రస్తుతం జీఎస్టీ ఎత్తేశారు. పాత పద్ధతిలోనే వివిధ రకాల ట్యాక్స్ లు అమల్లో వున్నాయి!

జూలై ఒకటి… ఆధార్ ఒట్టి కార్డ్ కాదు... జీవనాధారం!

మనిషి బతకాలంటే ఏంటి ఆధారం? భూమి, గాలి, నీరు, ఆహారం… ఇవే కదా ఆధారం! కానీ, జూలై ఫస్ట్ నుంచీ మరో కొత్త జీవనాధరం అవసరం అవబోతోంది భారతీయులకి! గాలి, నీరు, ఆహారంలాగే ఆధార్ కూడా ఇక పై తప్పనిసరి! అంతలా రూల్స్ మారిపోనున్నాయి!   జూలై ఒకటవ తేదీ నుంచీ జీఎస్టీ వస్తోంది. కాబట్టి రేట్లు తగ్గుతాయి, పెరుగుతాయి అంటూ అంతా చర్చల్లో మునిగిపోయారు. కానీ, ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేస్తోంది ఆధార్ విషయంలో! జూలై ఒకటి తరువాత అనేక విషయాల్లో ఆధారే కీలక ఆధారమై కూర్చోనుంది. కాబట్టి ఆధార్ లేకుంటే సగటు భారతీయుడి పరిస్థితి నిరాధారమే అనాలి!   ఐటీ రిటర్న్స్ వేయాలంటే ఇక మీదట ఆధార్ తప్పనిసరి అంటోంది ప్రభుత్వం. ఆధార్ నెంబర్ లేకుంటే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయటం కుదరదన్నమాట! ప్యాన్ కార్డు పరిస్థితి కూడా అంతే! మీకు ఆల్రెడీ ప్యాన్ కార్డ్ వుంటే వెంటనే ఆధార్ ను ప్యాన్ తో లింక్ చేయించుకోవాలి. కొత్తది తీసుకునే ఆలోచనలో వుంటే ఆధార్ లేకుండా ప్యాన్ కార్డ్ ఇక మీదట ఇవ్వరు! దీని వల్ల ఆధార్ నెంబర్ సాయంతో ఏ ఒక్కరూ ఒకటికి మించి ప్యాన్ కార్డ్ లు సంపాదించకుండా చెక్ పెట్టవచ్చు!   పాస్ పోర్ట్ తీసుకుని విదేశాలకు ఎగిరిపోవాలనుకున్నా ఆధారే ఆధారం! జూలై ఒకటి తరువాత ఆధార్ లేకుండా పాస్ పోర్ట్ ఇష్యూ చేయరు! అదే బాటలో నడుస్తోంది పీఎఫ్ సంస్థ. ఇక మీద ఉద్యోగులు అందరూ ఆధార్ నెంబర్ ఇవ్వాల్సిందే. దీని వల్ల ఎవరైనా తమ ఈపీఎఫ్ డ్రా చేయదలుచుకుంటే చాలా తక్కువ రోజుల్లో వ్యవహారం పూర్తవుతుంది. కేవలం పది రోజుల్లో ఆధార్ నెంబర్ సాయంతో పీఎఫ్ డబ్బులు బ్యాంక్లో క్రెడిట్ అయిపోతాయి!   రై్ల్వే టికెట్ల బుకింగ్ లో లభించే రాయితీలు కూడా ఆధార్ వుంటేనే అంటోంది రైల్వే శాఖ! విద్యార్థులకి స్కాలర్ షిప్ లు కావాలన్నా ఆధార్ చూపాల్సిందేనని తేల్చేసింది కేంద్ర మానవ వనరుల శాఖ! రేషన్ కార్డ్ తో ఆధార్ లింక్ చేయకుంటే సబ్సిడీ మీద ఇచ్చే బియ్యం, పంచదార వంటి వాటి మీద కూడా ఆశ వదులుకోవాల్సిందే!   అన్నీటికీ ఆధార్ అంటే ఇప్పటికిప్పుడు సామాన్య జనానికి కొంత వరకూ ఇబ్బందే. చిరాకు కూడా. కానీ, ఆధార్ లింక్ చేయటం వల్ల నిజమైన లబ్ధిదారులు మాత్రమే మేలు పొందుతారు. అలాగే, ఇంటి దొంగల్ని పట్టుకోవటమే కాదు… బంగ్లాదేశ్ నుంచి ఇక్కడకు వచ్చేసి తిష్ఠవేసిన విదేశీ దొంగల్ని కూడా ఆధార్ తో ఆటకట్టించవచ్చు!

ప్రెసిడెంట్ ని ఎన్నుకునే ఫస్ట్ ఎంపీ, లాస్ట్ ఎమ్మెల్యే ఎవరో తెలుసా? మనవాళ్లే!

2014లో పార్లమెంట్ కు ఎన్నికలు జరిగాయి. మోదీ ఘనవిజయం సాధించి పీఎం అయ్యారు. అప్పట్నుంచీ ఇప్పటి వరకూ ప్రతీ సంవత్సరం ఏదో ఒక అత్యంత కీలక ఎన్నిక జరుగుతూనే వుంది. ఓ సారి బీహార్ అయితే, మరోసారి యూపీ, ఇంకో సారి అస్సొమ్, మరోసారి కాశ్మీర్… ఇలా ఎక్కడో ఒక చోట నగారా మోగుతూనే వుంది. కాని, 2017 మరింత స్పెషల్! ఈ సంవత్సరం మన ఫస్ట్ సిటీజన్ మారబోతున్నాడు. కొత్త రాష్ట్రపతి కోసం దేశ వ్యాప్తంగా ఎన్నిక జరగబోతోంది! జనంతో సంబంధం లేని పరోక్ష ఎన్నిక ఇది. మనం ఎన్నుకున్న వారు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు!   ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రమే ఓటు వేస్తారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు… ఎక్కడ్నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులైనా… రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేయాల్సిందే! అయితే, ఈ సారి బీజేపి నిలిపిన రామ్ నాథ్ కోవింద్ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కాంగ్రెస్ మాజీ పార్లమెంట్ స్పీకర్ మీరా కుమార్ ను రంగంలోకి దింపింది. అయితే, అటు రామ్ నాథ్ కోవింద్ కి, ఇటు మీరా కుమార్ కు ఎంతో కీలకమైన ఎంపీల ఓట్ల విషయంలో ఇద్దరు తెలుగు వారు స్పెషల్ గా నిలిచారు! అందులో ఒకరైతే అన్నయ్య చిరు!   ఇంతకీ… విషయం ఏంటంటే… ప్రెసిడెంట్ ఎలక్షన్ లో  ఓటు వేసే ఎంపీల జాబితా తయారు చేసినప్పుడు తొలి పేరుగా రాజ్యసభ సభ్యుడైన చిరంజీవి పేరు వచ్చింది! అలాగే, అదే లిస్టులో చివరి పేరుగా… యానాం నుంచి ఎమ్మెల్యేగా వున్న మల్లాడి కృష్ణారావు పేరు వచ్చింది! వీరిద్దరూ తెలుగు వారే! కానీ, ఇలా జరగటానికి కారణం… సదరు లిస్టుని ఈసీ వారు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల స్పెల్లింగ్ లోని మొదటి ఆల్ఫబిట్ ఆధారంగా తయారు చేశారు! అందుకే, ఏ అక్షరంతో స్టార్ట్ అయ్యే ఏపీ… మొదటి నెంబర్ లో నిలబడింది. ఏపీ నుంచి రాజ్యసభలో వున్న చిరంజీవి పేరు మొట్ట మొదట వచ్చింది. ఇక అందరికంటే లాస్ట్ వున్న మల్లాడి కృష్ణారావు యానాం నుంచి ఎన్నికయ్యారు కాబట్టి వై అక్షరం కారణంగా లిస్టులో చిట్ట చివరి స్థితికి చేరుకున్నారు!