ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి ఈ 5 అంశాలు మీకు తెలిసి వుండకపోవచ్చు!
posted on Jun 29, 2017 @ 10:51AM
రాష్ట్రపతి దేశానికి ప్రథమ పౌరుడు. కాని, ఆ ప్రథమ పౌరుడ్ని ఎన్నుకునే హక్కు, బాధ్యతా రెండూ దేశ పౌరులకి వుండవు. మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే మన తరుఫున రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. అయితే, అనేక ఆసక్తికర అంశాల రాష్ట్రపతి ఎన్నికలో కీలకమైన అయిదు ప్రధాన అంశాల్ని ఇప్పుడు తెలుసుకుందాం…
1. దేశంలోని దాదాపు అన్ని ఎలక్షన్స్ ఇప్పుడు ఈవీఎంల ద్వారా జరుగుతున్నాయి. కాని, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు పేపర్ బ్యాలెట్ ద్వారానే ఓటు వేయాల్సి వుంటుంది. ఎంపీలకు ఆకుపచ్చ రంగు స్లిప్ ఇస్తారు. ఎమ్మెల్యేలకు పింక్ స్లిప్ ఇస్తారు. అయితే, ప్రజా ప్రతినిధులు బాలెట్ లో తప్పకుండా స్పష్టంగా పేర్కొనాల్సింది… తమ తొలి ప్రాధాన్యత ఎవరికి అని! ఫస్ట్ ప్రిఫరెన్స్ చెప్పని , తప్పుగా చెప్పిన బాలెట్లని తిరస్కరించటం జరుగుతుంది…
2. రాష్ట్రపతిగా పోటీ చేయటానికి ఎవరైనా అర్హులే. అయితే, తప్పనిసరిగా వార్ని 50మంది ప్రజాప్రతినిధులు సపోర్ట్ చేయాలి. ఆ 50మంది తప్పనిసరిగా రాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కు కలిగిన వారై కూడా వుండాలి. ఇలా జరగని పక్షంలో ఆ నామినేషన్ తిరస్కరించటం జరుగుతుంది. 1977లో 7వ రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా మొత్తం 36నామినేషన్లు తిరస్కరించారు. మిగిలిన ఒకే ఒక్క స్వీకరింపబడ్డ నామినేషన్ వేసిన నీలం సంజీవ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు…
3. ఇతర ఏ ఎన్నికలో అయినా ఓటర్ తనకు కేటాయించిన బూత్ కి మాత్రేమే వెళ్లి ఓటు వేయాలి. కాని, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొనే రాష్ట్రపతి ఎన్నిక కోసం వారు అడిగిన బూత్ కేటాయిస్తారు. సాధారణంగా దిల్లీలోని పార్లమెంట్ హౌజ్ లో ఎంపీలకు బూత్ వుంటుంది. ఎమ్మెల్యేల కోసం వారి వారి రాష్ట్రల రాజధానుల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య పట్టణాల్లో బూత్ లు వుంటాయి. వాటిల్లో కాకుండా వేరే చోట ఎవరైనా ఎంపీ, ఎమ్మెల్యే ఓటు వేయాలనుకుంటే ఈసీకి పది రోజుల ముందు సమాచారం ఇవ్వాలి…
4. రాష్ట్రపతి పదవికి పోటీ పడుతోన్న అభ్యర్థులు ప్రస్తుతం కడుతోన్న డిపాజిట్ అమౌంట్ 15వేలు. 1997కి ముందు ఇది 2500 వుండేది. 97లో పెంచారు. అయితే, తన 15వేల డిపాజిట్ ఒక అభ్యర్థి తిరిగి రాబట్టుకోవాలంటే… రాష్ట్రపతిగా గెలిచేందుకు అవసరమయ్యే ఓట్ల సంఖ్యలో అరవ వంతు ఓట్లు అతడికి పోలవ్వాలి. అంతకంటే తక్కువగా ఓట్లు వచ్చిన వారికి డిపాజిట్ దక్కదు!
5. రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కేవలం దిల్లీలోని పార్లమెంట్ హౌజ్ లోనే జరుగుతుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలైన ఓట్లని కూడా ప్రత్యేక సీల్డ్ కవర్లలో దిల్లీకి తరలిస్తారు. ఓట్లని బాలెట్ బాక్సుల్లోంచి కవర్లలోకి మార్చేది ప్రత్యేక అధికారులు. వీళ్లు రాష్ట్రపతి పదవికి పోటీపడుతోన్న అభ్యర్థుల ప్రతినిధుల సమక్షంలో ఓట్లను కవర్లలో భద్రపరుస్తారు.