సెక్యులర్ ఎండకి మైనార్టీ గొడుగు! హిందూత్వ ఎండకి యజ్ఞాల గొడుగు!

  భారతదేశంలో మోదీ శకం మొదలయ్యాక చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అందులో ప్రధానమైంది సెక్యులర్ నినాదాల వైఫల్యం! నిన్న మొన్నటి వరకూ దేశంలోని అన్ని పార్టీలు సెక్యులరిజమ్ కి ఎక్కడలేని ప్రాముఖ్యతని ఇచ్చేవి. అలా చేయకూడదని కాదు. కాని, ఎన్నికల్లో గెలవటానికి, పొత్తులు పెట్టుకోటానికి, విడిపోటానికి, సీఎం కూర్చీలు లాక్కోటానికి ఇలా అన్నిటికి సెక్యులర్ పదం అడ్డుపెట్టుకునే వారు. అలాగే మైనార్టీ జపం చేస్తూ పబ్బం గడిపేసేవారు. కాని, రాను రాను ఇటు హిందువుల్లోనూ, అటు మైనార్టీల్లోనూ సెక్యులర్ మాయాజాలంపై స్పష్టత వస్తోంది. ఊరికే సెక్యులరిజం అంటూ మైనార్టీ సంక్షేమం అంటూ నినాదాలు, ఉపన్యాసాలు చేస్తే జనం నమ్మటం లేదు. ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో బాగా గ్రహించిన నేత జగన్ అనే చెప్పుకోవాలి!   పోయిన ఎన్నికల్లో జగన్ ప్రతిపక్షానికే పరిమితం కావటానికి చాలా కారణాలున్నాయి. వాటిల్లో ఒకానొకటి మత కోణం. పైకి పెద్దగా చర్చ జరగకపోయినా వైఎస్ హయాంలో క్రిస్టియన్ ముద్ర బాగా పడిపోయింది. తరువాత వైఎస్ సతీమణి, జగన్ తల్లి విజయమ్మ కూడా బైబిల్ చేతిలో పట్టుకుని ప్రచారం చేయటం మరింత దృష్టిని ఆకర్షించింది. ఇలాంటి పరిణామాల కొంతమేర నష్టం తప్పలేదు వైసీపికి. హిందూత్వ భావజాలం వున్నవారు జగన్ని ఎంత మాత్రం నమ్మే పరిస్థితి లేకపోయింది. ఆ లోపాన్ని ఇప్పుడు యువనేత సరి చేసుకునే పనిలో పడ్డట్టు కనిపిస్తోంది!   జగన్ ముఖ్యమంత్రి అయ్యేదాకా సహస్ర చండీయాగం నిర్విఘ్నంగా జరుగుతుందని ఓ న్యూస్ వచ్చింది. భూమన కరుణాకర్ రెడ్డి దీన్ని నిర్వహిస్తారని కూడా తెలుస్తోంది. హైద్రాబాద్ లో జరిగే ఈ చండీ యాగం జగన్ ఎన్నికల్లో గెలిచాక పూర్ణాహుతితో ముగుస్తుందట! ఇలా యాగాలు, యజ్ఞాలు చేస్తే అధికారం దక్కుతుందా? ఇది మరో చర్చ! కాకపోతే, ఇందులోని రాజకీయ కోణం మాత్రం హిందూ వ్యతిరేక ముద్ర పోగొట్టుకోవటం. త్వరలో తిరుమలకి కాలినడకన కూడా జగన్ వెళ్లనున్నారట. అంతే కాదు, సోషల్ మీడియాలో ప్రస్తుతం హిందూ స్వామీజీ ఒకాయనకి జగన్ పాదాభివందనం చేస్తోన్న ఫోటో హల్ చల్ చేస్తోంది!   ఇలాంటి ఒత్తిడి కేవలం జగన్ మీదే కాదు. మొత్తం దేశంలో చాలా మంది రాజకీయ నేతల మీద వుంది. మోదీ సారథ్యంలోని బీజేపి ప్రతీ చోటా హిందూత్వ ఎజెండాను సైలెంట్ గా అమలు చేస్తోంది. గోవుల చుట్టు జరుగుతోన్న రాజకీయం మనకు తెలిసిందే. వీటన్నిటితో రాను రాను రాజకీయ నేతలకి ఇఫ్తార్ విందులకి హాజరైనట్టు హిందూత్వ ప్రదర్శన కూడా అనివార్యం అవుతోంది. జగన్ యజ్ఞాలు, యాగాలు, పుష్కర స్నాన, పిండ ప్రదానాలు, తిరుమల కాలినడక స్ట్రాటజీలు వర్కవుట్ అయితే… ముందు ముందు మరింత మంది నేతలు తమ కాషాయ కోణం బయటపెట్టే అవకాశం వుంది! ఆఫ్ట్రాల్… రాజకీయం అంటే ఏ ఎండకి ఆ గోడుగు పట్టడమే కదా!

నవాజ్ షరీఫ్ వికెట్ పడింది! పాక్ లో మ్యాచింకా మిగిలే వుంది!

  పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పదవి ఊడిపోయింది. అక్కడి సుప్రీమ్ కోర్ట్ అతడ్ని అవినీతి కేసులో దోషిగా గుర్తించింది. అయితే, చాలా మంది భావిస్తున్నట్టు పీఎం పదవి పోవటం అతడు పనామా పేపర్స్ వ్యవహారంలో చేసిన అవినీతికి శిక్షగా కాదు! పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం ప్రధాని పదవిలో వున్న వారు నిజాయితీగా వుండాలి. ఇది ఓ అస్పష్టమైన రూల్! దాని ఆధారంగా సుప్రీమ్ జడ్జీలు అతడ్ని పదవి నుంచి తొలగించారు! ముందు ముందు పనామా పేపర్స్ లో బయటపడ్డ విధంగా నవాజ్ షరీఫ్ అవినీతికి పాల్పడ్డారని కోర్టు పూర్తిగా నిర్ణయిస్తే… అప్పుడు శిక్షేంటో తెలుస్తుంది!   పాక్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ తప్పుకోవటం ఆ దేశ అంతర్గత వ్యవహారం. దాని వల్ల మనకేంటి నష్టం? లేదా లాభం? నిజానికి లాభ, నష్టాలు రెండూ వుండవని అంటున్నారు నిపుణులు! పాకిస్తాన్ లో నవాజ్ షరీఫ్ పీఎం పదవి నుంచి తప్పుకుంటే ఇప్పటికిప్పుడు వచ్చే అనూహ్య పరిణామాలు ఏమీ లేవట. కారణం… ప్రధానిగా లేకున్నా నవాజ్ షరీఫే ముందు ముందు కూడా చక్రం తిప్పుతాడు. అతడి పార్టీ అయిన పాకిస్తాన్ ముస్లిమ్ లీగ్ పూర్తి మెజార్టీతో వుంది. కాబట్టి తన స్థానంలో మరో నాయకుడ్ని పీఎంని చేస్తాడు. అతడి చేత తాను కోరుకున్న విధంగా పాలన చేయించుకుంటాడు.   ఇండియాలోనో, బ్రిటన్ లోనో ప్రైమినిస్టర్ కి వున్నంత సీన్ … ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రధానికి పాక్ లో వుండదని కూడా మనం గుర్తించాలి. అక్కడ ఇప్పటికీ ఆర్మీ అధికారులదే అసలు అధికారం.ఐఎస్ఐదే అసలు వ్యూహం. రాజకీయ నేతలు దాదాపు డమ్మీలే. అందుకే, షరీఫ్ కాక రేపు మరెవరైనా పీఎం అయినా ఇండియా పట్ల వైఖరేం మారేది వుండదంటున్నారు విశ్లేషకులు. అలా కాక ముషర్రఫ్ లాగా ఆర్మీ జనరల్సే అధికారం చేజిక్కించుకుంటే పాక్ లో మరింత అరాచకం చెలరేగవచ్చు. ప్రజాస్వామ్య బద్ధమైన ప్రధాని లేక ఇండియాతో యుద్ధానికి మరింత తేలిగ్గా తెగబడవచ్చు. అయితే, పాక్ మిలటరీ పాలకుల చేతుల్లో లేకున్నా ఇండియాతో యుద్ధం అంటే ఎల్లప్పుడూ ఆసక్తిగానే వుంటుంది. కారణం… పాకిస్తాన్ ప్రజలు అసలు సమస్యల మీద దృష్టి పెట్టకుండా వుంచగలిగేది భారత్ బూచి ఒక్కటి మాత్రమే!   కోర్టు కారణంగా నవాజ్ షరీఫ్ పదవి కోల్పోయినా… వచ్చే సంవత్సరం రానున్న జాతీయ ఎన్నికల్లో కూడా అతడి పార్టీకి ఢోకా లేదంటున్నారు కొందరు ఎక్స్ పర్ట్స్! ఇదే ఇప్పుడు అసలు విషాదం. నవాజ్ షరీఫ్ అవినీతిపరుడని కోర్టుకీడ్చిన మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ చాలా సంతోషంగా వున్నాడు. అవినీతిపై విజయం తనదేనని చెప్పుకుంటున్నాడు. కాని, అతడి పార్టీ అయిన తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పాక్ మొత్తంలో సీట్లు గెలుచుకునే సీన్ అస్సలు లేదట. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా పాక్ జనం గత్యంతరం లేక నవాజ్ పార్టీ అయిన పీఎంఎల్ కే ఓటు వేస్తారని విళ్లేషకులు లెక్కలు కడుతున్నారు! మొత్తం మీద… చాలా మంది అభిప్రాయం కారణం నవాజ్ షరీఫ్ విషయంలో పాక్ సుప్రీమ్ కోర్టు తీర్పు… టీ కప్పులో తుఫానే!

మోదీ, అమిత్ షాలది దూకుడా? దుర్మార్గమా?

  బీజేపి ఇప్పుడు దావానలంలా మారిపోయింది! ముప్పై ఏళ్ల కింద ఒకట్రెండు ఎంపీ సీట్లతో మొదలైన ఒక చిన్న నిప్పు రవ్వ ఇవాళ్ల దేశంలో ప్రతిపక్షాలన్నిటికీ సెగ చూపుతోంది! కాంగ్రెస్ మొదలు తృణమూల్ కాంగ్రెస్ వరకూ అన్ని పైపైకి ఒప్పుకోకున్నా గడగడ వణకుతున్నాయి కాషాయ కార్చిచ్చును చూసి! ఒకవైపు యూపీ లాంటి అతి పెద్ద రాష్ట్రంలో స్వంతంగా అధికారంలో వచ్చారు కమలనాథులు. మరో వైపు మణిపూర్, గోవా లాంటి రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు రాకున్నా పంతం నెగ్గించుకుని పెత్తనం దక్కించుకున్నారు. ఇక తాజాగా బీహార్లో నితీష్ చేత రాజీనామా చేయించి లాలూని, రాహుల్ గాంధీని క్లీన్ బౌల్డ్ చేశారు! ఆ షాక్ నుంచి రాజకీయ నేతలు కాదు… మీడియూ కూడా తేరుకునేలోపే గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీల్ని టార్గెట్ చేశారు! లాలూ, అతడి కొడుకు అవినీతిని చూపించి బీహార్ మహాఘట్భందన్ ముక్కలు చేయించిన మోదీ, అమిత్ షా పెద్ద చర్చకు తెర తీశారు. ఇలా అప్రజాస్వామికంగా , ప్రజల తీర్పుకి వ్యతిరేకంగా రాష్ట్రాల్ని కైవసం చేసుకోటం సబబేనా అన్నది ఆ డిస్కషన్ సారాంశం! అరుణాచల్ ప్రదేశ్ మొదలు తమిళనాడు దాకా ఏ రాష్ట్రాన్ని, ఏ జాతీయ, ప్రాంతీయ పార్టీని బీజేపి వదలటం లేదు. అందర్నీ, అంతటా టార్గెట్ చేసి అధికారం చేజిక్కించుకుంటోంది. ఇది బీజేపి అభిమానులకి, కరుడుగట్టిన హిందూత్వవాదులకి సంతోషం ఇస్తుందేమో కాని ప్రజాస్వామ్య విలువలు ఆశించే వార్ని కృంగదీస్తుంది! బీజేపి కూడా ఇతర ఫక్తు పొలిటికల్ పార్టీల మాదిరిగానే ప్రవర్తిస్తోందని అనిపిస్తుంది…   బీహార్ తరువాత తన సహజమైన అధికార కేంద్రమైన గుజరాత్ మీద దృష్టి పెట్టింది కాషాయ పార్టీ! మోదీ, అమిత్ షా ఇద్దరూ ఆ రాష్ట్రం వారే! వచ్చే కొన్ని నెలల్లోనే అక్కడ ఎన్నికలున్నాయి. అయితే, కాంగ్రెస్ గత రెండు దశాబ్దాలుగా అక్కడ గెలిచింది లేదు. రాబోయే ఎన్నికల్లోనూ గెలచి సూచనలు లేవు. అయినా, మోదీ, షా హస్తాన్ని పూర్తిగా విరిచి పారేయాలని నిర్ణయించారు. సోనియాకు అత్యంత ఆప్తుడైన అహ్మద్ పటేల్ ను రాజ్యసభకు కూడా రానీయకుండా ఎమ్మెల్యేల్ని దారిలోకి తెచ్చుకుంటున్నారు. మొదట శంకర్ సింగ్ వాఘేలాను కాంగ్రెస్ నుంచి బయటకు తెచ్చిన మోదీ, షా అతడి వెంటే అనేక మంది కాంగ్రెస్ ఎమ్మేల్యేని లాక్కొచ్చారు. వారి చేత ఏకంగా రాజీనామాలే చేయించారు. ఊపిరాడని కాంగ్రెస్ బెంగుళూరులో తమ మిగిలిన ఎమ్మెల్యేల్ని దాచి పెట్టుకోవాల్సి వచ్చింది! అయినా కూడా ఆగస్ట్ 8న జరిగే రాజ్యసభ ఎన్నికల్లో అహ్మద్ పటేల్ గెలిచే సంకేతాలేం కనిపించటం లేదు. సోనియాకి అత్యంత ఆప్తుడు, గుజరాత్ లో అందరికంటే సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన అహ్మద్ ఓడిపోతే … రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు!   గుజరాత్ లో కాంగ్రెస్ పరిస్థితే యూపీలో ఎస్పీకి కూడా పట్టింది. అచ్చు కాంగ్రెస్ లాగే ఒకే కుటుంబం ఆధిపత్యం చెలాయించే సమాజ్ వాదిలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వుంది! అమిత్ షా లక్నోకి రావటానికి సరిగ్గా రెండు గంటల ముందు ఇద్దరు ఎస్పీ ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. అందులో ఒకరు షియా మైనార్టీ వర్గానికి చెందిన వారు! ఇద్దరూ యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ పై , మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. దాదాపుగా తాము బీజేపీలో చేరబోతున్నట్టు చెప్పకనే చెప్పారు!   లూలూ పార్టీలో అవినీతి, కాంగ్రెస్ లో గాంధీల పాలన, సమాజ్ వాదిలో యాదవ్ ల కల్లోలం… ఇలాంటివి బీజేపికి కలిసి వచ్చిన అంశాలు. అందుకే, వాట్ని వాడుకుని ఆయా పార్టీలతో ఓ ఆటాడుకుంటోంది కమలం! కాని, గతంలో కాంగ్రెస్ కూడా ఇలానే అరాచక వ్యూహాలు పన్నిందని , ఇతర పార్టీల్ని వేటాడి ఆనందం పొందిందని అంటున్నారు విశ్లేషకులు. బీజేపి కూడా ప్రస్తుతం వున్న బలాన్ని చూసి గర్వించకుండా వుండాలని సూచిస్తున్నారు. నిజంగా కూడా… అప్రజాస్వామిక ఎత్తులకు, పైఎత్తులకి పోకపోవటమే దీర్ఘ కాలంలో మంచిది. కాషాయ పెద్దలు ఈ సత్యం గుర్తిస్తే ఎందుకైనా మంచిది!

కారుకి, కాషాయానికి మధ్య వార్ స్టార్టైనట్టేనా?

  కేసీఆర్ ఈ మధ్య దిల్లీ వెళ్లి వచ్చారు. ప్రధానమైన అసెంబ్లీ సీట్ల పెంపుపై ఓ క్లియర్ ఐడియా వచ్చేసింది. ఎమ్మెల్యేల సంఖ్య పెరిగే అవకాశం ఇప్పుడప్పుడే లేదని తేలిపోయింది. కాని, ఈ పరిణామంపై మోదీతో భేటీ తరువాత కేసీఆర్ పెద్దగా అసంతృప్తి ఏం ప్రకటించలేదు. సాదాసీదాగా హైద్రాబాద్ వచ్చేశారు. కాని, తరువాతే రెండు గుర్తించదగ్గవి జరిగాయి! ఒకటి… పాతబస్తీ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన రాజా సింగ్ మీద చర్యలకి రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పేసింది! ఆయనెప్పుడో 2013లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనీ… వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సర్కార్ పోలీస్ లకు పర్మిషన్ ఇచ్చింది! ఇక రెండోది… ఓవైసీ ఓ కామెంట్ చేశారు! కేసీఆర్ వున్నంత వరకూ బీజేపి తెలంగాణలో అధికారం చేపట్టలేదని అర్థం వచ్చేలా మాట్లాడారు!   బీజేపి ఎమ్మెల్యే రాజా సింగ్ మీద చర్యలు, ఓవైసీ కేసీఆర్ మీద విశ్వాసం ప్రకటించటం… ఒక దానితో ఒకటి లింక్ వున్నవి కాకపోవచ్చు! కాని, మొత్తం మీద ఒకటి మాత్రం అర్తం చేసుకోవచ్చు. ఇంత కాలం కేసీఆర్ కమలదళాన్ని టార్గెట్ చేయలేదనే చెప్పాలి. అప్పుడో ఇప్పుడో కామెంట్లు చేసినా టీఆర్ఎస్, బీజేపీల మధ్య పచ్చ గడ్డి భగ్గుమనే పరిస్థితులు రాలేదు. కాని, 2019ఎన్నికలు దగ్గరపడే కొద్దీ వారంతా టీఆర్ఎస్, బీజేపిల నడుమ సాగుతుందా అనే అనుమానం ఇప్పుడు కలుగుతోంది. ఎందుకంటే, కేసీఆర్ సర్కార్ రాజాసింగ్ పైన చర్యలు తీసుకుంటే అది దుమారం రేపే అవకాశాలే వున్నాయి. రాజా సింగ్ కు హిందూ ఫైర్ బ్రాండ్ గా, ఓవైసీలతో పోరాడే హిందూత్వ నాయకుడిగా ఓ మోస్తరు గుర్తింపు వుంది. అది రేపో మాపో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేస్తే మరింత పెద్దదవుతుంది. బీజేపికి కూడా ఇప్పుడు ఇలాంటి అంశమే కావాలి!   అసదుద్దీన్ ఓవైసీ బీజేపిని తాను ఎదుర్కొంటానని అనకుండా… కేసీఆర్ వున్నంత వరకూ అంటూ భరోసా ప్రకటించటం… ముందు ముందు వారి కో ఆపరేషన్ని చెప్పకనే చెబుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికారికంగా ఎంఐఎం కార్ తో పొత్తు పెట్టుకుంటే బీజేపి వారికి అంతకంటే కావాల్సింది ఇంకేం వుండదు. ఆ కలయికనే బూచిగా చూపి ప్రచారం హోరెత్తిస్తారు.   టీఆర్ఎస్, బీజేపి ఎదురెదురు తలపడితే ముందుగా అలెర్ట్ కావాల్సింది తెలంగాణ కాంగ్రెస్! ఎందుకంటే, చాలా మంది రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం టీఆర్ఎస్, కేసీఆర్ లకు జనంలో ఇంకా గట్టి ఫాలోయింగే వుంది. ఎటోచ్చి… చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నట్టు తెలంగాణలో కూడా… బీజేపి వేడి కాంగ్రెస్ కు తగలచ్చు. ఎన్నికల ముందు ఇప్పుడు గుజరాత్ లో జరుగుతోన్నట్టు ఊహించని వలసలు ఇక్కడ కూడా వుంటే  అది హస్తానికి పెద్ద ప్రమాదం. బీజేపి వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టకపోయినా… ప్రధాన ప్రతిపక్షం అయినా బోలెడు లాభం పొందినట్టే!

ఆ మూడ్‌ నుంచి బయటికి రాలేకపోతున్న కిషన్‌రెడ్డి..!

  కిషన్‌రెడ్డి... ప్రస్తుత హోదా బీజేఎల్పీ నేత... అయితే ఏడాది క్రితం వరకూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన ఈయన...  ఇంకా ఆ మూడ్‌లో నుంచి బయటికి రావడం లేదంట... కొత్త అధ్యక్షుడు వచ్చి ఏడాది దాటిపోతున్నా... ఇంకా పార్టీలో అన్నీ తానే... అంతా తానే అనే ఫీలింగ్ లో ఉంటున్నారట. సుదీర్ఘకాలం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి పనిచేసి ఉండటంతో... ఆ మూడ్‌ నుంచి బయటికి రాలేకపోతున్నారట. అందుకే కొత్త అధ్యక్షుడి కింద పనిచేయలేక పార్టీ సమావేశాలను సైతం కూడా లైట్ తీసుకుంటున్నారట. అంతేకాదు.. ఆయన మీటింగ్ పెట్టిన రోజు... మరెవరూ మీటింగ్‌లు పెట్టకూడదంటూ అనధికారికంగా ఆర్డర్స్‌ జారీ చేస్తున్నాడట. దాంతో కిషన్‌రెడ్డి వ్యవహారశైలి పార్టీ నేతలకు, శ్రేణులకు తలనొప్పిగా మారిందంటున్నారు. అంతేకాదు చింత చచ్చినా... పులుపు చావలేదంటే ఇదేనేమో అంటూ గుసగుసలాడుకుంటున్నారు. తెలంగాణ బీజేపీకి ఇప్పటికీ తానే అధ్యక్షుడిననే ఫీలింగ్ లో కంటిన్యూ అవుతూ... నేను చెప్పిందే శాసనం... నేను పెట్టిందే మీటింగ్ అంటున్నారని... అంతేకాదు చిన్న చిన్న విషయాలకీ అలగడం కిషన్‌రెడ్డికి అలవాటైపోయిందంటున్నారు.   అధ్యక్ష పదవిలో ఉన్నన్నాళ్లూ హల్‌చల్‌ చేసిన కిషన్‌రెడ్డి... పదవీకాలం ముగియగానే పార్టీ కార్యక్రమాలకు హాజరవడం తగ్గించేశారని... చివరికి ఇటీవల జరిగిన అమిత్‌షా టూర్‌‌లో అంటీముట్టనట్టు వ్యవహరించారని అంటున్నారు. కిషన్‌రెడ్డి వ్యవహారశైలిపై పలువురు అమిత్‌షాకి కంప్లైంట్‌ చేయడంతో... కిషన్‌కి క్లాస్‌ కూడా పీకారట. అయినా కిషన్‌రెడ్డిలో మార్పు రాలేదని, ఇప్పటిలాగానే పార్టీ కార్యక్రమాలకు డుమ్మా కొడుతున్నారని చెప్పుకుంటున్నారు. మొన్నటిమొన్న తెలంగాణ అంతటా నిర్వహించిన బీజేపీ విస్తారక్‌ కార్యక్రమానికి కూడా కిషన్‌రెడ్డి దూరంగా ఉన్నారని, అమిత్‌ షా ఆదేశించిన ప్రోగ్రామ్‌ను కూడా పట్టించుకోలేదంటే... అసలు అంత ధైర్యం కిషన్‌రెడ్డికి ఎలా వచ్చిందంటూ చర్చించుకుంటున్నారు.   ఇక పార్టీ రివ్యూ మీటింగ్స్‌కి కూడా కిషన్‌రెడ్డి హాజరుకావడం లేదట. అంతేకాదు జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు హాజరైన సమావేశాలకు కూడా డుమ్మా కొడుతున్నారట. మరోవైపు మీడియాకి ముందుగా సమాచారమిచ్చిన ప్రెస్‌మీట్‌‌లను కూడా రద్దు చేసుకుంటున్నారు. ఇలా రద్దు చేసుకోవడానికి... మరొకరు అదేరోజు మీడియా సమావేశం పెట్టడమే కారణమంటున్నారు. కిషన్‌రెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టిన రోజే... బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు కూడా మీడియా సమావేశం పెట్టడంతో... ఎందుకు పెట్టారంటూ కిషన్‌ రుసరుసలాడారంట. ఒకేరోజు రెండు ప్రెస్‌మీట్‌లు పెడితే పార్టీ ఇమేజ్‌ ఏం కావాలంటూ రఘునందన్‌పై కిషన్‌‌రెడ్డి ఫైరయ్యారట. దాంతో కిషన్‌రెడ్డి వ్యవహార శైలిపై పలువురు నేతలు మండిపడుతున్నారు. పార్టీలో ఏం జరిగినా తనకు చెప్పే జరగాలన్నట్లుగా కిషన్‌రెడ్డి వ్యవరిస్తున్నారని, ఇప్పటికీ తానే అధ్యక్షుడినన్నట్లుగా దర్పం ప్రదర్శిస్తున్నారని, ఇకనైనా తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు.

కిరణ్‌రెడ్డి చెప్పిన పెళ్లికూతురు తెలిసినట్లేనా? లేక ఉత్తుత్తి ప్రచారమేనా?

  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మూడున్నరేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా... గత ఎన్నికల్లో కనీసం తన సొంత నియోజకవర్గంలోనూ పట్టు నిలుపుకోలేకపోయిన మాజీ సీఎం కిరణ్‌‌కుమార్‌‌రెడ్డి....మరోసారి వార్తల్లోకి వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత కొత్త పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లినా ఘోర పరాజయాన్ని చవిచూడటంతో అసలు ప్రజల్లోకి రావడమే మానేసిన ఈ మాజీ ముఖ్యమంత్రి..... ఈ రెండున్నరేళ్లలో రెండుమూడుసార్లు మాత్రమే మీడియాకి కనిపించారు. సొంత నియోజకవర్గంలో డిపాజిట్లు సైతం కోల్పోవడంతో.... పొలిటికల్‌ లోప్రొఫైల్‌ పాటిస్తోన్న కిరణ్‌రెడ్డి‌.... రాజకీయంగా మళ్లీ యాక్టివ్‌ అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి.   బీజేపీలో చేరుతున్నారని ఒకసారి.... కాదుకాదు టీడీపీలోకి వెళ్తారంటూ మరోసారి... లేదులేదు మళ్లీ పాత గూటికే చేరతారంటూ వార్తలు వచ్చినా అవేమీ కార్యరూపం దాల్చలేదు. ఇవేమీ కాదు యువ నాయకత్వంలో కీ రోల్‌ పోషించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. గతంలో తాను తీవ్ర విమర్శలు చేసిన పార్టీల్లోకి వెళ్లడం కంటే... కొత్త పార్టీ జనసేన వైపు వెళ్లడం మంచిదనే అభిప్రాయానికి వచ్చారన్న మాటలు వినిపించాయి. అయితే ఇప్పుడు మరోసారి అలాంటి వదంతులే హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆమధ్య సొంత జిల్లా చిత్తూరులో ఓ పెళ్లికి హాజరైన కిరణ్‌‌రెడ్డి... ఇప్పటికైతే పెళ్లి కుదిరింది.... తాళిబొట్టు కట్టే తేదీ ఖరారైతే మీకందరికీ చెబుతానంటూ.... కొత్త రోల్‌పై అనుచరులకు క్లారిటీ ఇచ్చారు. దాంతో కిరణ్‌ ఏ పార్టీలో చేరతారోనంటూ కొద్దిరోజులు చర్చ నడిచింది.   పెళ్లి కుదిరింది.... పెళ్లికూతురు మాత్రం గోప్యమంటూ.... తాను చేరబోయే పార్టీ ఫిక్సైందన్న సంకేతాలిచ్చిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి.... సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ, టీడీపీ, జనసేన అంటూ వార్తలు వచ్చినా... కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం మళ్లీ పాత గూటినే ఎంచుకున్నట్లు చెబుతున్నారు. తనను ముఖ్యమంత్రిని చేసి... అందలమెక్కించిన కాంగ్రెస్‌‌లోనే తిరిగి చేరాలని డిసైడ్‌ అయ్యారట. అంతేకాదు కిరణ్‌కు ఏఐసీసీ స్థాయి పదవి కట్టబెడతారనే ప్రచారం కూడా జరిగిపోయింది. మరి ఇదైనా నిజమవుతుందో... లేక కేవలం ప్రచారంగానే మిగిలిపోతుందో చూడాలి.

తెలంగాణ కాంగ్రెస్‌లో కులాల కుంపటి... ఓసీ వర్సెస్‌ బీసీ...

  తెలంగాణ కాంగ్రెస్‌లో కుల రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. గెలిస్తే ఓసీ నాయకుల ప్రతిభ.. ఓడితే BC నేతల బాధ్యతా... అంటూ టీ-కాంగ్రెస్ బీసీ ఫోరం మండిపడుతోంది. పార్టీలో కేవలం ఒక వర్గం వారే పెత్తనం చెలాయిస్తూ ఒంటెత్తు పోకడలు పోతున్నారని బీసీ నేతలు ఫైరవుతున్నారు. 2014 ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడిగా బీసీ ఉన్నందువల్లే పార్టీ ఓడిపోయిందని దుష్ర్పచారం చేస్తున్నార‌ని, ఇలాంటి ప్రచారం వ‌ల్ల బీసీలు పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉంద‌ని హెచ్చరిస్తున్నారు. కొందరు ఓసీ నేతలు.... బ‌ల‌హీన వ‌ర్గాల ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తున్నారని, వాళ్లు తమ వైఖరి మార్చుకోకపోతే... హైకమాండ్ కి ఫిర్యాదు‌ చేస్తామని టీ-కాంగ్రెస్ బీసీ ఫోరం అల్టిమేటం ఇచ్చింది.   కాంగ్రెస్‌ పార్టీకి మొదట్నుంచీ వెన్నుదన్నుగా నిలిచిన వర్గాలను గుర్తించి జనాభా దామాషా ప్రకారం బీసీలకు 50 శాతం సీట్లివ్వడమే కాకుండా... వారి గెలుపు కోసం పార్టీ కృషి చేయాలని అంటున్నారు. రాష్ట్ర జనాభాలో 50 శాతమున్న బీసీలకు పార్టీలో తగిన ప్రాతినిధ్యం ఇస్తేనే ప్రజ‌ల్లో న‌మ్మకం పెరుగుతుంద‌ని టీ-కాంగ్రెస్ బీసీ ఫోరం అంటోంది. బీసీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందనే భరోసా కల్పిస్తేనే... 2019లో అధికారంలోకి వస్తామని, ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకుకెళ్లాలని టీ-కాంగ్రెస్ బీసీ ఫోరం ఉత్తమ్‌కు సూచించింది.   టీపీసీసీతోపాటు ఏఐసీసీ పదవులు కూడా బీసీలకు వచ్చేవిధంగా చూడాలని టీ-కాంగ్రెస్ బీసీ ఫోరం డిమాండ్ చేస్తోంది. ఓవరాల్‌గా పార్టీలో బీసీలకు ప్రాధాన్యత పెంచాలని... అదే సమయంలో బలహీనవర్గాలకు పార్టీ అండగా ఉంటుందనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలని కోరుతున్నారు. లేదంటే వచ్చే ఎన్నికల్లోనూ పార్టీకి ఎదురుదెబ్బ తప్పదని హెచ్చరిస్తున్నారు. మరి బీసీ నేతల డిమాండ్లపై హైకమాండ్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.

తెలంగాణలో మారుతోన్న రాజకీయ ముఖచిత్రం...

  తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పు జరగబోతోందని అంటున్నారు. మొన్నటివరకూ ఢీ అంటే ఢీ అన్న పార్టీలు దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. శత్రువు శత్రువుకు మిత్రుడన్నట్లుగా... ప్రస్తుతం టీఆర్‌ఎస్‌, బీజేపీలు ఇదే థియరీ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. నిన్నమొన్నటివరకూ రాజకీయ ప్రత్యర్ధులుగా ఉన్న ఈ రెండు పార్టీలూ... ఇప్పుడు ఉమ్మడి శత్రువును టార్గెట్ చేయాలని డిసైడైనట్లు తెలుస్తోంది. అమిత్‌షా తెలంగాణ పర్యటన తర్వాత టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య కొద్దిరోజులు మాటల యుద్ధం నడిచినా... రాష్ట్రపతి ఎన్నిక వీరిద్దరినీ దగ్గర చేసిందని చెబుతున్నారు. అంశాల వారీగా కలిసి పనిచేయడం ద్వారా ఉమ్మడి శత్రువు కాంగ్రెస్‌‌ను బలహీనపర్చాలన్నదే వ్యూహంగా కనిపిస్తోంది.   ప్రధాని మోడీతో సత్సంబంధాలు కొనసాగిస్తోన్న కేసీఆర్‌... తరచూ ఫోన్లో మాట్లాడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మోడీతో ఉన్న చనువుతోనే ముస్లిం రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్‌ ధీమాగా ఉన్నారని గులాబీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. మత రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమైనా... తెలంగాణలో తీసుకొచ్చిన 12శాతం బీసీ-ఈ రిజర్వేషన్లకు కేంద్రం అనుమతిస్తుందన్న నమ్మకంతో కేసీఆర్‌ ఉన్నారంటున్నారు. అంతేకాదు ఈ విషయంలో కేసీఆర్‌కి మోడీ హామీ కూడా ఇచ్చారని టీఆర్‌ఎస్‌ వర్గాలు అంటున్నాయి. మోడీ ఇచ్చిన భరోసాతోనే ముస్లిం రిజర్వేషన్లపై కేసీఆర్‌ ధీమా ఉన్నారని అంటున్నారు.   రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్ధులను బీజేపీ ప్రకటించిన వెంటనే అందరి కంటే ముందుగా కేసీఆర్‌ మద్దతు ప్రకటించడం, ప్రెసిడెంట్‌ కోవింద్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవడం, ఢిల్లీ పర్యటనలో మోడీతోపాటు కేంద్ర మంత్రులను కలవడం, వెంకయ్యకు ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేయడం, ఇవన్నీ టీఆర్‌ఎస్‌-బీజేపీ నయా దోస్తీకి రుజువు అంటున్నారు. కేసీఆర్‌ రియాక్షన్‌, గులాబీ నేతల సైలెన్స్‌ చూస్తుంటే... రెండు పార్టీలూ కలిసి ట్రావెల్‌ చేయడం ఖాయమంటున్నారు. అంతేకాదు ఎన్నికల వరకూ కలిసి పనిచేస్తూ... అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి... ప్రీ పోల్‌ అలయన్స్‌... లేదా పోస్ట్‌ పోల్‌ అలయన్స్‌ పెట్టుకోవచ్చనే టాక్ వినిపిస్తోంది. అయితే టీఆర్‌ఎస్‌తో దోస్తీని తెలంగాణ బీజేపీ వ్యతిరేకిస్తున్నా... భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా మౌనం దాల్చుతోంది.

రాజుగారి కోటలో గంటా దూకుడు... ఆధిపత్య పోరులో అశోక్‌ సతమతం !

  శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదని ఎలా అంటామో విజయనగరం జిల్లా టీడీపీలో అశోక్ ఆజ్ఞ లేనిదే కనీసం కార్పొరేటర్ కూడా కాలేరంటారు. అందుకే రాజుగారి దృష్టిలో పడేందుకు పడరాని పాట్లు పడతారు. ఆయన చెప్పినదే వేదవాక్కు అంటూ చేతులు కట్టుకుని మరీ వినయంగా వింటారు. అటు జిల్లాలో తెలుగుదేశం పార్టీ తరపున ఒక పదవి రావాలన్నా... నామినేటెడ్ పదవులు దక్కాలన్నా.... చివరికి ఎమ్మెల్యే సీటు దక్కాలన్నా అశోక్ సంప్రదింపులు లేకుండా అధిష్టానం సైతం ఎంపిక చేయదనే పేరుంది. అందుకే విజయనగరం జిల్లా టీడీపీ నాయకులకు అశోక్ గజపతిరాజు అంటే అంత హడల్. అందుకే అశోక్ ప్రసన్నం కోసం ఆయన బంగ్లా చుట్టూ చక్కెర్లు కొడతారు. రాజుగారి చూపు తనపై ఎప్పుడు పడుతుందా అంటూ వేచి చూస్తారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా అశోక్‌ మాటకు అధిక విలువ ఇస్తారంటారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. శాసించడం... ఆదేశించడం తప్ప... తన మాటకు ఎదురేలేని కేంద్ర మంత్రి అశోక్ కోటలో ఆధిపత్య పోరు మెుదలైంది. తెలుగుదేశం పార్టీకే పెద్దదిక్కుగా ఉంటూ ఉత్తరాంధ్రలో చక్రం తిప్పే ఆయన స్పీడ్‌కు బ్రేకులు పడుతున్నాయి. విజయనగరంలో రాజుగారి సైకిల్‌ స్పీడ్‌కు ఇన్‌ఛార్జ్‌ మంత్రి బ్రేకులు వేస్తున్నారు. అదే సమయంలో అధిష్టానం దగ్గర రాజుగారి పరపతి తగ్గిందనే ప్రచారం జరుగుతోంది.  టీడీపీలో అశోక్‌కు ప్రత్యేక స్థానమున్నా... పార్టీ అవసరాల దృష్ట్యా రాజుగారి మాటను పక్కనబెడుతున్నారనే టాక్‌ వినిపిస్తోంది. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావును టీడీపీలోకి తీసుకోవడమే కాకుండా, మంత్రి పదవి కట్టబెట్టడంలోనూ అశోక్‌ అభ్యంతరాలను చంద్రబాబు పట్టించుకోలేదు. అంతేకాదు టీడీపీ పార్లమెంటరీ భేటీల్లోనూ అశోక్‌ గజపతిరాజుకి గతంలో దక్కిన గౌరవం... ఇప్పుడు దక్కడం లేదనే మాట వినిపిస్తోంది.   అయితే విజయనగరం జిల్లాలో పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న అశోక్ సూచనలను పరిగణనలోకి తీసుకోకుండా కొత్త విధానాలు అనుసరిస్తూ ఆయన ప్రాధాన్యతను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని రాజుగారి అనుచరులు మండిపడుతున్నారు. ముఖ‌్యంగా జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి గంటా చేష్టలు అశోక్‌ గజపతిరాజుకి విసుగుపుట్టిస్తున్నాయని అంటున్నారు. ఇటీవల గంటాకి చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇవ్వడం, మరోవైపు సుజయ్‌కృష్ణ, శత్రుచర్ల విషయంలో తన అభ్యంతరాలను అధిష్టానం పట్టించుకోకపోవడంతో... కంగుతిన్న అశోక్‌ గజపతిరాజు... చేసేది లేక కిమ్మనకుండా ఉంటున్నారని, కానీ ఇది విజయనగరం జిల్లాలో పార్టీకి చేటు చేస్తుందని రాజుగారి అభిమానులు అంటున్నారు.

జగన్ జాతకం చెప్పిన కేసీఆర్..

  ఏపీ రాజకీయ పరిస్థితులపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి జగన్‌ వైపు కొంచెం మొగ్గుచూపించే కేసీఆర్‌... మరోసారి వైసీపీకి అనుకూలమైన వ్యాఖ్యలు చేశారు. 2014 సాధారణ ఎన్నికల ఫలితాలకు ముందు కూడా ఏపీలో వైసీపీనే అధికారంలోకి వస్తుందంటూ... జగన్‌‌పై తనకున్న మక్కువను చాటుకున్న కేసీఆర్‌... ఈసారి కూడా అలాంటి కామెంట్సే చేశారు. ఏపీలో ప్రస్తుతం వైఎస్సార్‌సీపీకి కొంచె ఎడ్జ్‌ ఉందని చెప్పుకొచ్చారు. ఓ సర్వే మిత్రుడు చెప్పిన వివరాల మేరకు వైసీపీకి 45శాతం ఓట్లు వస్తాయని తెలిసిందన్నారు. అధికార టీడీపీకి 43శాతం, అలాగే బీజేపీకి 2.6శాతం ఓట్లు వస్తాయని ఆ సర్వేలో తేలిందన్నారు.   ఇక వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్న పవన్‌ కల్యాణ్‌కి అంత సీన్‌ లేదని, జనసేన ప్రభావం ఏపీలో ఉండబోదని కేసీఆర్‌ తేల్చిచెప్పేశారు. జనసేనకు ఒకటి... ఒకటిన్నర శాతం కంటే ఎక్కువ ఓట్లు రావన్నారు. పవన్‌ చేతులూపితే ఓట్లు రాలవన్న కేసీఆర్‌... చిరంజీవి ప్రజారాజ్యం విషమంలో ఏం జరిగిందో... అలాగే జనసేన పరిస్థితి కూడా ఉంటుందంటున్నారు. ఏ పార్టీకైనా బేస్‌ ఉండాలన్న కేసీఆర్‌... ఆ పరిస్థితి జనసేనకు లేదన్నారు. ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉన్నచిరంజీవి లాంటి వ్యక్తే పార్టీని నడపలేక... కట్టెలమోపులాగా బరువు దించుకున్నారని... ఓ లక్ష్యం లేకపోతే ఎవరికైనా ఇలాగే జరుగుతుందన్నారు. తాను ఓ లక్ష్యంతో పద్నాలుగేళ్లు పార్టీని నడుపుతూ... ఉద్యమం చేయబట్టే నిలబడగలిగానని కేసీఆర్‌ చెప్పుకొచ్చారు.   ఇక ఏపీలో కుల రాజకీయాలపైనా కేసీఆర్‌ కీలక వ్యా‌ఖ్యలు చేశారు. తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో కుల రాజకీయాలే ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. తెలంగాణలో కుల రాజకీయాలు లేవన్న కేసీఆర్‌.... ప్రజా సమస్యలు, అంశాలవారీగానే ఎన్నికలు జరుగుతాయన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఢోకా లేదన్నారు.

చంద్రులకు చుక్కలు చూపించిన మోడీ..!

  తెలుగు రాష్ట్రాలకు కేంద్రం షాకిచ్చింది. చంద్రబాబు, కేసీఆర్‌ ఆశలపై మోడీ నీళ్లు చల్లేశారు. అసెంబ్లీ సీట్ల పెంపుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇరువురికి పొలిటికల్‌గా దిమ్మదిరిగే మాట చెప్పింది. 2019 ఎన్నికలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఉండబోదని ఆఫ్‌ ద రికార్డ్‌ తేల్చిచెప్పేసింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీనే దీనిపై క్లారిటీ ఇచ్చేశారు.   ఢిల్లీ టూర్లో మోడీని కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌... అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు అంశాన్ని ప్రస్తావించారు. అయితే 2026లో ఎలాగూ పెరుగుతాయి కదా అని మోడీ అన్నారని కేసీఆర్‌ వెల్లడించారు. పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంచాలని మోడీని కోరానని, అయితే ఇప్పుడు ప్రక్రియ ప్రారంభించినా ఎలాగూ ఐదేళ్లు పడుతుందని ప్రధాని చెప్పారని, దాంతో ఇప్పట్లో నియోజకవర్గాల పెంపు లేనట్లేనని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. అయితే నియోజకవర్గాల పెంపుపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసినా ప్రక్రియ పూర్తవడానికి ఐదేళ్లు పడుతుందని మోడీ చెప్పారని, కానీ మూడు నాలుగు నెలల్లోనే మొత్తం ప్రక్రియను పూర్తి చేయవచ్చని, అయితే కేంద్రం ఎందుకు సీరియస్‌గా దృష్టిపెట్టడం లేదో అర్ధం కావడం లేదని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. పైగా తెలుగు రాష్ట్రాలు రెండూ కూడా సీట్లు పెంచాలని కోరుతున్నా... కేంద్రం పట్టించుకోవడం లేదన్న కేసీఆర్‌.... తెలంగాణ తరపున ప్రయత్నం చేస్తూనే ఉంటామన్నారు. అయితే తెలుగు రాష్ట్రాల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే... వెంకయ్యనాయుడు... ఉపరాష్ట్రపతిగా వెళ్లడం కొంత నష్టమేనని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.   2019లోపు అసెంబ్లీ సీట్ల పెంపు‌నకు కేంద్రం విముఖత చూపడానికి రాజకీయ వ్యూహమే కారణమంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎదగాలనుకుంటోన్న బీజేపీకి.... అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుతో ఒరిగేదేమీ లేదని తేలడంతోనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల డిమాండ్‌ను పట్టించుకోవడం లేదని అంటున్నారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు ఇచ్చిన రిపోర్ట్‌తోనే అసెంబ్లీ సీట్ల పెంపునకు కేంద్రం నో చెప్పిందనే టాక్ వినిపిస్తోంది.

రాజ్యసభలో… ఇక మీద వెంకయ్య మంత్రం, అమిత్ షా తంత్రం!

  వాళ్లిద్దర్నీ చాణక్య, చంద్రగుప్తులు అనాలో, శ్రీకృష్ణార్జునులు అనాలో, శ్రీరామ, హనుమంతులనాలో… మన ఇష్టం! కానీ, మోదీ, అమిత్ షా మాత్రం ప్రస్తుతం దేశాన్ని నడుపుతోన్న బ్రెయిన్ అండ్ హార్ట్! నిజానికి షా కేంద్ర ప్రభుత్వంలో భాగం కాకపోయినా మోదీ తరువాత అంత పవర్ ఫుల్ అని అందరి ఫీలింగ్. ఆయన బీజేపి పార్టీ జాతీయ అధ్యక్షుడుగానే వున్నప్పటికీ అనేక పరిణామాల్ని రిమోట్ క్రంటోల్ చేస్తున్నారు. కాని, తాజాగా కమలం పార్టీ పార్లమెంటరీ బోర్డ్ తీసుకున్న నిర్ణయం అమిత్ షాను నేరుగా పార్లమెంట్ ఆవరణలోకి తీసుకురానుంది! ఇక మీదట ప్రత్యక్ష యుద్ధమంటూ సంబరిపడిపోతున్నారు మోదీ భక్తులు!   అమిత్ షా గుజరాత్ తరుఫున రాజ్యసభ ఎంపీగా నామినేషన్ వేస్తారని స్పష్టమైపోయింది. బీజేపి కంచుకోటా, మోదీ స్వంత రాష్ట్రమైన గుజరాత్ నుంచి పోటీ అంటే.. షాకు గెలుపు నల్లేరు మీద నడకే! అయితే, పార్టీ చీఫ్ గా దూసుకుపోతున్న అమిత్ భాయ్ ని నరేంద్ర భాయ్ పెద్దల సభకి ఎందుకు తెస్తున్నారు? రీజన్ అందరికీ తెలిసిందే! 2014 నుంచీ ఇప్పటి వరకూ అనేక విజయాలతో లోక్ సభలో తిరుగులేకుండా చేసుకున్నారు నమో. కాని, సమస్యంతా రాజ్యసభలో వస్తోంది. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు కమ్యూనిస్టులు, ఇంకో వైపు తృణమూల్ నిరంతరం మోకాలు అడ్డువేస్తున్నాయి ప్రధానికి. అలాగే, శివసేన లాంటి ఎన్డీఏ పక్షాలు కూడా రాజ్యసభ మద్దతు విషయం వచ్చే సరికి బేరసారాలు, బెదిరింపులకి దిగుతున్నాయి! వీటన్నిటికి చెక్ పెట్టడానికే మోదీ తన మంత్రి లాంటి అమిత్ షాని రాజ్యసభకి తీసుకురాబోతున్నారు!   అమిత్ షానే కాదు.. రాజ్యసభ పట్టులోకి తెచ్చుకోటానికి వెంకయ్యని కూడా ప్రయోగించారు ప్రధాని. కేంద్ర మంత్రిగా యాక్టివ్ గా వున్న ఆయన్ని ఉప రాష్ట్రపతి అంటూ గౌరవించేశారు! దీంతో మోదీకి కేబినేట్లో ఒక సీనియర్ తగ్గటమే కాక రాజ్యసభకు చైర్మన్ గా వెంకయ్య లాంటి సమర్థులు దొరుకుతారు. ఇటు వెంకయ్య, అటు అమిత్ షా ఇద్దర్నీ పెద్దల సభలో మోహరించటం ద్వారా మోదీ అక్కడ వ్యవహారాలన్ని వారి భుజాల మీద పెట్టేయవచ్చు. అప్పుడు ఆయన రానున్న 2019ఎన్నికలతో సహా చైనా, పాకిస్తాన్ లాంటి తలనొప్పులు కూడా పరిష్కరించుకునే ప్రయత్నం చేయవచ్చు. అయితే, కొందరు ఊహాగానాలు చేస్తున్నట్టు అమిత్ షాని కేంద్ర కేబినేట్లోకి కూడా మోదీ తీసుకుంటే బీజేపి అధ్యక్ష బాధ్యతలు మరెవరికైనా ఇవ్వాల్సి వుంటుంది. అత్యంత తాజాగా బీహార్ ని బుట్టలో వేసుకున్న అమిత్ షా రేంజ్లో… వేరే వారు పార్టీని నడుపుతారా? ఇది పెద్ద ప్రశ్నే! తగిన జవాబు మోదీ వద్ద వుందా? కొన్నాళ్లు ఆగితే తెలిసిపోతుంది!

కేసీఆర్ ని కూడా మరిచి టీ కాంగ్ కేటీఆర్ తో యుద్ధం చేస్తోందా?

ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్షం ప్రధానంగా ఎవర్ని టార్గెట్ చేస్తుంది? ఉదాహరణకి ఏపీనే తీసుకుంటే… అక్కడ వైసీపీ నేతలంతా చంద్రబాబుని టార్గెట్ చేస్తారు. ఎందుకంటే, ఆయన సీఎం కాబట్టి. సీఎంని విమర్శించటం ద్వారా మొత్తం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టొచ్చు. దోషిగా చూపొచ్చు. అలాగే, దిల్లీలో అయితే ప్రతిపక్షాలు ప్రధానిని నిలదీస్తాయి. అలా చేయటం ద్వారా గవర్నమెంట్ మొత్తాన్ని జనం ముందు కార్నర్ చేయోచ్చు. కాని, తెలంగాణ కాంగ్రెస్ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది! దాంట్లోని మర్మమేంటో టీ కాంగ్ కే తెలియాలి!   తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన నోరు తెరిచి తిట్టారంటే ప్రతిపక్షాలకు అది పరమ భయంకరమే! ఊరికే రాజకీయ విమర్శలు చేయటం కాకుండా కేసీఆర్ సెటైర్లతో, ఘాటు పదాలతో గడగడలాడిస్తారు. పాపం ఈ విషయం తెలంగాణ కాంగ్రెస్ కంటే మరెవరికీ బాగా తెలియదు! ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఆంధ్రా నాయకుల్ని ఏ రేంజ్లో ఏకిపారేసేవారో అలాగే ఇప్పుడు టీ కాంగ్ నేతల్ని చెడుగుడు ఆడుతుంటారు కేసీఆర్. అయితే, రోజూ కేసీఆర్ కాంగ్రెస్ ని టార్గెట్ చేయటం లేదు. అవసరం వచ్చినప్పుడు, ఇక తప్పదనుకున్నప్పుడు దుమ్ము దులుపుతున్నారు. కాని, ఆయన్ని అదే రేంజ్లో కాంగ్రెస్ నేతలు విమర్శించిన దాఖలాలు ఇంత వరకూ లేవు. ఇక ఘాటైన పదాలతో కేసీఆర్ ను తిట్టగలగటం కలలో మాటే!   కేసీఆర్ ను తగిన రీతిలో ఎదుర్కోని తెలంగాణ కాంగ్రెస్ కేటీఆర్ ని మాత్రం చెడామడా మాటలు అనేస్తోంది. అదే రేంజ్లో కల్వకుంట్ల తారక రాముడు కూడా తన వాక్కు బాణాలు ఎక్కుపెడుతున్నాడు. తండ్రి లాగే సిగ్గు, శరం వుండాలి లాంటి మాటలు… ఉత్తమ్ కుమార్ని ఉత్తర కుమారుడనటమూ… ఇవన్నీ చేస్తూనే వున్నాడు. అయితే, రాను రాను కేటీఆర్, కాంగ్రెస్ నేతల మధ్య పర్సనల్ వార్ మరీ ఎక్కువైపోతున్నట్టు కనిపిస్తోంది. కేటీఆర్ కాంగ్రెస్ వార్ని పేరు పేరున వ్యక్తిగతంగా తిట్టిపోస్తుంటే అదే భాషలో జవాబిస్తున్నారు టీ కాంగ్ వాళ్లు! తాజాగా కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ అని వెధవ అనే దాకా వెళ్లిపోయారు! ఈ వ్యక్తిగత దూషణల పర్వంలో ఇద్దరిదీ సమాన బాధ్యతనే చెప్పాలి!   కేటీఆర్ తో సంబంధాలున్న వారికి డ్రగ్ కేసుతో లింక్ వుందన్న దిగ్విజయ్ కు కూడా స్ట్రాంగ్ రిప్లై తప్పలేదు. కేటీఆర్ ఆయన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఘాటు సమాధానం ఇచ్చాడు. దీంతో తమ పార్టీలోని చిన్నా, పెద్దా నాయకులందర్నీ టార్గెట్ చేస్తున్న టీఆర్ఎస్ యువరాజును ఆయన లాంగ్వేజ్ లోనే ఎదుర్కొంటున్నారు కాంగ్రెస్ వారు. కాని, ఇక్కడ విచిత్రం ఏంటంటే… ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా హరీష్ రావు, కవిత, ఆఖరుకు కేసీఆర్ కూడా కనిపించటం, వినిపించటం లేదు. కాంగ్రెస్ వర్సెస్ కేటీఆర్ అన్నట్లే యుద్దం నడుస్తోంది! సీఎం కుర్చీలో వున్న కేసీఆర్ ని వదిలేసి ఆయన కుమారుడ్ని టార్గెట్ చేయటం వల్ల తెలంగాణ కాంగ్రెస్ ఎలాంటి లాభం పొందుతుందో.. ఎన్నికలు వస్తేగాని తెలియదు!

ఇదో అమెరికన్ డ్రగ్ బానిసల స్టోరీ!

  ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా డ్రగ్స్ చర్చలే! అందులోనూ సినిమా వాళ్లు మత్తులో జోగుతున్నారని బయటకి పొక్కటంతో అందరిలోనూ ఎక్కడలేని ఆసక్తి బయలుదేరింది. కానీ, డ్రగ్స్ కేవలం వెనుకబడ్డ ఆఫ్రికా దేశాలు, లేదంటే ఇండియా లాంటి ఎదుగుతున్న దేశాలు… వీటిలో మాత్రమే వుంటాయనుకుంటే పొరబాటే! అమెరికా లాంటి అగ్ర దేశంలో మనకన్నా ఎక్కువ డ్రగ్స్ దందా సాగుతుంది! అక్కడ ఇక్కడి కంటే ఎక్కువ మంది డ్రగ్ ఎడిక్ట్స్ వుంటారు. ఆటగాళ్లు, పాటగాళ్లు, సినిమా వాళ్లు … ఇలా ఎవరు పడితే వారు డ్రగ్స్ బాధితులే! కానీ మన దగ్గర మరీ స్కూలు పిల్లలు కూడా మత్తు పదార్థాలకి బానిసలు కావటం అందర్నీ షాక్ కి గురి చేసింది. కాని, అమెరికాలోని ఉటా నగరంలో అప్పుడే పుట్టిన పాపకే డ్రగ్స్ అలవాటున్నట్టు తెలిసి పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది అంతా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంకైపోయారు!   ఇంతకీ ఏం జరిగిందంటే… అమెరికాలోని ఓ జంట… కాల్ వైల్డ్, క్రిస్టిన్సన్. ఈ భార్య, భర్తలకి ఇద్దరు బాబులు. అయితే, గత ఏప్రెల్ లో క్రిస్టిన్సన్ మరో కూతురికి జన్మనిచ్చింది. కాని, అప్పటికే డ్రగ్ ఎడిక్ట్ అయిన ఆమె గర్భంతో వుండగానే మస్తుగా మత్తు మందు పుచ్చుకుంది. భర్తతో కలిసి ఆమె చేసిన ఈ దారుణానికి పుట్టిన బిడ్డ తల్లి కడుపులోంచే డ్రగ్ ఎడిక్ట్ గా ఊపిరి పోసుకుంది. అది హాస్పిటల్ సిబ్బందికి తెలిస్తే పోలీసులకి పట్టిస్తారని భయపడ్డ క్రిస్టిన్సన్, కాల్ వైల్డ్ డ్రగ్ ఎడిక్షన్ తెలియకుండా చేసే మరో మందు తీసి పుట్టిన బిడ్డ చిగుళ్లకి పూసేశారు! కాని, ఇదంతా ఆసుపత్రి వారికి ఎలాగో తెలియనే తెలిసింది. వాళ్లిచ్చిన కంప్లైంట్ తో పోలీసులు డ్రగ్ కపుల్ ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు!   పుట్టీ పుట్టగానే బిడ్డ ప్రాణాలతో చెలగాటాలు ఆడుతూ ప్రమాదకార మందు పట్టించిన అమెరికన్ కపుల్ గతంలోనూ అనేక కేసుల్లో ఇరుక్కున్నారట. వాల్ మార్ట్ లో దొంగతనం చేస్తూ పట్టుబడటంతో పోలీసులు లోతుగా విచారణ జరిపారు. మళ్లీ తరువాత ఏప్రెల్ లో అప్పుడే బిడ్డకు మందు పట్టించి అరెస్ట్ కావటంతో సదరు మమ్మీ , డాడీల ఇళ్లంతా సోదా చేశారు! వాళ్లకు దొరికిన డ్రగ్స్ చూసి అమెరికన్ పోలీసులే అవాక్కయ్యారు! హెరాయిన్ తో సహా మరో రెండు , మూడు రకాల ప్రాణాంతక మాదక ద్రవ్యాలు లభించాయి! అంతే కాదు, క్రిస్టిన్సన్ కు పుట్టిన కూతురు కంటే ముందు సంతానమైన ఇద్దరు అబ్బాయిలు కూడా డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ గా నిలిచారట! మొత్తానికి ముగ్గురు చిన్నారుల జీవితాలతో ఆటలాడిన ఆ వైఫ్ అండ్ హజ్బెండ్ ని ఇప్పుడు కటకటాల్లో వుంచి కోర్టులో హాజరుపరుస్తున్నారు. అమెరికన్ చట్టాల ప్రకారం వారు మళ్లీ బయటకి చాలా ఏళ్లే పట్టొచ్చు! అప్పటిలోగా ప్రస్తుతం క్రిస్టిన్సన్ మొదటి భర్త వద్ద పెరుగుతోన్న ఆమె నలుగురు సంతానం పెరిగి పెద్దవారు కూడా అయిపోతారు! ఇదీ ది గ్రేట్ అమెరికన్ లైఫ్ స్టైల్…

చైనాకి వెళుతోన్న ఇండియన్ జేమ్స్ బాండ్!

  నేషనల్ సెక్యురిటీ అడ్వైజర్… ఇలాంటి పదవి ఒకటి వుంటుందని కూడా చాలా మందికి తెలియదు నిన్న మొన్నటి వరకూ! కాని, మోదీ గవర్నమెంట్ వచ్చాక అనూహ్యంగా అజిత్ ధోవల్ తెర మీదకు వచ్చారు. ఆయన జాతీయ భద్రతా సలహాదారుగా చక్రం తిప్పుతున్నారని మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. అది నిజం కూడా! మరీ ముఖ్యంగా, పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్స్ సక్సెస్ ధోవల్ దే! ఆయన వ్యూహ రచనతోనే మన ఆర్మీ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి ప్రవేశించి శత్రు నాశనం చేసి విజయవంతంగా తిరిగి వచ్చింది!   పాకిస్తాన్ విషయంలో తెర వెనుక హీరో అయిన ధోవల్ ఇప్పుడు చైనా విషయంలోనూ కీలకం అవుతున్నారు. మన దేశంలో ఆయన ఇమేజ్ సంగతి ఎలా వున్నా చైనాలో మాత్రం అజిత్ ధోవల్ ఎవరో క్లియర్ గా తెలిసిపోయింది! అక్కడి మీడియా ఈ ఇండియన్ అధికారిని టార్గెట్ చేస్తూ కథనాలు రాస్తోందంటే ధోవల్ సత్తా ఏంటో అర్తం చేసుకోవచ్చు! చైనా లాంటి అతి పెద్ద దేశం భారత్ ప్రధాని గురించి మాట్లాడితే సహజం! అలా కాక రక్షణ మంత్రి, విదేశాంగ శాఖా మంత్రి గురించి మాట్లాడినా అర్తం చేసుకోవచ్చు. కాని, చైనీస్ మీడియా ధోవల్ పై దృష్టి పెట్టిందంటే ఈ సైలెంట్ కిల్లర్ ఎంత మొనగాడో గ్రహించవచ్చు!   చైనా వాళ్లు దోవల్ పై దృష్టి సారించటానికి మరో కారణం… ఆయన రేపట్నుంచీ రెండు రోజులు బీజింగ్ సందర్శించటమే! బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు చైనా రాజధానిలో సమావేశం అవుతున్నారు. అందులో పాల్గొనటానికి , బ్రెజిల్, రష్యా, సౌత్ ఆఫ్రికా దేశాల అధికారులు వస్తున్నారు. ఈ సందర్భంగా చైనా, భారత్ ఎన్ఎస్ఏల మధ్య డోక్లామ్ సమస్య గురించి చర్చ జరగవచ్చని మీడియా భావిస్తోంది.   నిజంగా అజిత్ ధోవల్ చైనా పర్యటనతో డోక్లామ్ సంక్షోభం ఎంత వరకూ తగ్గు ముఖం పడుతుందో చెప్పలేం కాని… ఈ రాటుదేలిన మాజీ రా ఏజెంట్ అంటే డ్రాగన్ కూడా అలెర్ట్ గానే వుంటోంది. ఆయనతో డిస్కషన్ అంటే మోదీతో ఇండైరెక్ట్ గా మాట్లాడటమేనని భావిస్తోంది. చూడాలి మరి… అభిమానులు ఇండియన్ జేమ్స్ బాండ్ అని గర్వంగా పిలుచుకునే ధోవల్ చైనాలో ఏం చేస్తారో!

ఛార్మీ దెబ్బకి ముద్రగడ ఔట్...

  హీరోయిన్ ఛార్మి దెబ్బకి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఔటయ్యాడు. ఛార్మికి, ముద్రగడకి సంబంధం ఏంటబ్బా అనుకుంటున్నారా...? అసలు సంగతేంటంటే.. ముద్రగడ పద్మనాభం ఈరోజు చలో అమరావతి పాదయాత్రను ప్రారంభించాలని తలపెట్టిన సంగతి తెలిసిందే. అయితే పాదయాత్రకు పోలీసుల అనుమతి ఇవ్వలేదు. అయినా కానీ ముద్రగడ పాదయాత్ర చేపట్టాలని అనుకున్నారు.. కానీ పోలీసులు మాత్రం ఆయన్ని ఇంటి గేటు వద్దే అడ్డుకొని 24 గంటల పాటు హౌస్ అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాలను కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఈరోజు చార్మీ సిట్ విచారణలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇంకేముంది మీడియా ఫోకస్ మొత్తం చార్మీ పైనే పడింది. ఉదయం ఛార్మీ సిట్ విచారణకు వచ్చింది మొదలు.. ఛార్మీ పై సిట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేస్తారు.. ఏ ప్రశ్నలు అడిగారు అంటూ ఇలా ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ.. అన్ని ఛానల్స్ చార్మీపైనే ఫోకస్ పెట్టి వార్తలు అందించాయి. దీంతో ముద్రగడ తాను అనుకున్నది.. జరిగింది ఒకటైంది. గతంలో ఆయన ఉద్యమం అంటే మీడియా కనీసం కొంత సేపైనా కవరేజ్ ఇచ్చేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఎదో ఒక విధంగా షో చేసి మీడియా ఫోకస్ ని తన మీదకు తిప్పుకోని రాష్ట్ర ప్రజల ముందు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకున్న ముద్రగడ ప్లాన్ బెడిసికొట్టింది. చార్మీ హడావుడిలో మీడియా ముద్రగడను పట్టించుకోలేదు. మొత్తానికి పాదయాత్ర నేపథ్యంలో మీడియాను తనవైపు తిప్పుకోవాలన్న ప్లాన్ ను ఛార్మీ వల్ల తుస్సుమంది.

రామ్ నాథ్ కోవింద్… తొలి ప్రసంగం… మొదటి కలకలం!

  భారత పద్నాలుగవ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విజయవంతంగా వివాదాల్లోకి ఎక్కారు! ప్రమాణ స్వీకారం చేసి 24గంటలు గడవక ముందే ఆయన మీద కాంగ్రెస్ నాయకులు చిర్రుబుర్రులాడుతున్నారు! అంతా భావించినట్టుగా రామ్ నాత్ భారతదేశ రెండో దళిత రాష్ట్రపతి మాత్రమే కాదు… మొట్ట మొదటి ఆరెస్సెస్ నేపథ్యం వున్న ప్రెసిడెంట్ కూడా! ఈ కారణంతోనే కాంగ్రెస్ వారికి రామ్ నాథ్ పై కాస్త ఎక్కువే అనుమానాలు వున్నట్టున్నాయి…   2014 మే నెల నుంచి భారత రాజకీయాలు సమూలంగా మారిపోయాయి. ఇది ఎవరు ఒప్పుకోకున్నా నిజం! ఆరెస్సెస్ స్వయం సేవక్ గా ఊరారా తిరిగిన మోదీ దేశ ప్రధాని అయ్యారు! ఈ విషయం కాంగ్రెస్ తో సహా చాలా మంది సెక్యులర్ నేతలు, మేధావులు, కవులు, రచయితలు అంగీకరించలేకపోయారు! ఇప్పటికీ అంగీకరించలేకపోతున్నారు. అందుకే, పార్లమెంట్లో ప్రతిపక్షాలు గొడవ చేస్తే మేధావులు అవార్డ్ వాప్సీ అంటూ కలకలం రేపుతుంటారు. ఈ తంతు ఇప్పుడు రాష్ట్రపతి విషయంలో కూడా కొనసాగేలా కనిపిస్తోంది…   రామ్ నాథ్ కూడా హిందూత్వ భావజాలం వున్న బీజేపి నేత. అందుకే, ఆయన దళితుడు అయినప్పటికీ లెప్టు పార్టీల వారు, మాయావతి మీరా కుమార్ కే మద్దతు తెలిపారు. ఇక ఇప్పుడు అనివార్యంగా రామ్ నాథ్ రాష్ట్రపతి అయిపోవటంతో కాంగ్రెస్, ఇతర పక్షాలు ఆయన మీద అనుక్షణం అనుమానపు దృష్టితోనే ముందుకు సాగేలా పరిస్థితి కనిపిస్తోంది! ఈ కార్యక్రమం రామ్ నాథ్ తొలి ప్రసంగం నుంచే ప్రారంభమైపోయింది! పార్లమెంట్ ను ఉద్దేశించి రాష్ట్రపతి ఇచ్చిన స్పీచ్ లో నెహ్రు పేరు ఎక్కడా రాలేదని కాంగ్రెస్ వారు సభలో గందరగోళం చేశారు! ఇందిర పేరు కూడా రామ్ నాథ్ స్మరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు! ఏ సంబంధమూ లేని దీన్ దయాల్ ఉపాధ్యాయ్ లాంటి వారి పేర్లను రామ్ నాథ్ తన ప్రసంగంలో చేర్చారని కాంగ్రెస్ నాయకులు గోలగోల చేశారు!   నెహ్రు తొలి ప్రధానిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా జాతికి చేసిన సేవ చాలా గొప్పది. అందులో సందేహం లేదు. కాని, ఆయన పేరు తన స్పీచ్ లో వుండాలా వద్దా అన్న నిర్ణయం రామ్ నాథ్ కోవిందే గాని ఇతరులు ఒత్తిడి చేయటానికి వీలులేదు. ఈ విషయం కాంగ్రెస్ వారు గ్రహించటం లేదు. పైగా కేవలం ఒక విమర్శో, కామెంటో చేసి ఊరుకోవాల్సిన అంశంపై సభను స్థభింపజేశారు. విలువైన పార్లమెంట్ సమాయాన్ని తమ పార్టీ గత ప్రధానుల కీర్తి కోసం వృథా చేశారు! ఇది పూర్తిగా కాంగ్రెస్ నేతల స్వామి భక్తే తప్ప మరొకటి కాదు. అసలు కోవింద్ ప్రసంగంపై అభిప్రాయాలు చెప్పటం గౌరవం అనిపించుకోదు. పోనీ చెప్పినా గంభీరంగా మాట్లాడటం కాకుండా అదొక వివాదాస్పద అంశంగా మార్చటం కాంగ్రెస్ కు ఏ మాత్రం శోభనివ్వదు. ఒక రాష్ట్రపతి ఎలా మాట్లాడాలో శాసించటం అంటే అది ఆ స్థాయిని అవమానించటమే అవుతుంది!   ఇప్పటికే మోదీ, రామ్ నాథ్ కీలకమైన పదవుల్ని చేపట్టగా మరో కాషాయ నేత మన వెంకయ్య నాయుడు త్వరలో ఉప రాష్ట్రపతి కానున్నారు! అంటే… రాజ్యసభ వారి చేతుల్లో వుంటుందన్నమాట! కాంగ్రెస్ , ఇతర లౌకిక పార్టీలు అప్పుడు ఎన్ని రకాల వివాదాలు లేవనెత్తుతాయో మనం ఊహించవచ్చు! కాని, రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో, ప్రధాని వంటి కీలక పదవుల్లో వున్న వార్ని కేవలం వారి నేపథ్యం చూసి విమర్శించటం కాకుండా… సహేతుకంగా తప్పు పడితే ప్రతిపక్షాలకి కూడా జనంలో మైలేజ్ వస్తుంది. అలా కాకుండా ప్రసంగంలో నెహ్రు పేరు ప్రస్తావించలేదని ఆగ్రహానికి లోనైపోతే … దాన్ని సామాన్య జనం హర్షించరు. మరీ ముఖ్యంగా, అత్యున్నత పదవుల్ని వివాదాస్పదం చేస్తూ, విలువైన సభా సమయం వృథా చేస్తే ఎవ్వరూ అంగీకరించరు…

డ్రగ్స్ కేస్ పై రోజా కామెంట్స్ సబబేనా?

  ఒకే సినిమా ఇండస్ట్రీ. రెండు రకాల అభిప్రాయాలు! ఇదీ ఇప్పుడు డ్రగ్స్ కేసు విచారణపై టాలీవుడ్లో పరిస్థితి. పూరీ, రవి, ఛార్మి లాంటి పాప్యులర్ సినిమా సెలబ్స్ ఈ కేసులో ఇరుక్కోవటంతో ఎక్కడలేని ఆసక్తి వచ్చి పడింది. అందుకు తగ్గట్టే మీడియా కూడా కాస్తంత మసాలా యాడ్ చేస్తూ కవరేజ్ చేస్తోంది. కాని, సినిమా వాళ్ల విషయంలో అది మామూలే. వారి గురించి ఎప్పుడు ఏం చెప్పినా జనం చూస్తారు కాబట్టి టీఆర్పీల కోసం మీడియా ఒకింత హడావిడి ఎక్కువే చేస్తుంది. కాని, తమ సినిమాలకి ఫ్రీ పబ్లిసిటీ బోలెడంత ఇచ్చినప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేసిన టాలీవుడ్ వాళ్లు ఇప్పుడు అదే మీడియా నెగటివ్ గా కవరేజ్ ఇస్తుండటంతో చిటపటలాడుతున్నారు. అయితే, అటు సిట్ కాని, ఇటు మీడియా కాని తప్పేం చేయటం లేదని అంటున్న వారు కూడా ఇండస్ట్రీలోనే వున్నారు!   ఎక్సైజ్ శాక తీరుని తప్పుబట్టిన తాజా టాలీవుడ్ సెలబ్రిటీ ఎమ్మెల్యే రోజా. ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇప్పుడు ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న ఆమె తనకు అలవాటున్న తీరులోనే స్పందించారు. సినిమా వాళ్ల పరువుని పోలీసు అధికారులు మంటగలుపుతున్నారని మండిపడ్డారు. రేపు డ్రగ్స్ కేసులో పూరీ, ఛార్మి లాంటి వారి తప్పు లేదని తేలితే ఆ నష్టం సిట్ పూడుస్తుందా అంటూ ప్రశ్నించారు! ఇంచుమించూ ఇలాగే వర్మ కూడా సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపించటం మనకు తెలిసిందే!   రోజా, వర్మా లాంటి వారు విచారణ జరుగుతున్న తీరు తప్పుబడితే పోసాని రివర్స్ గేర్ లో వచ్చారు. ముప్పై వేల మంది వున్న ఇండస్ట్రీలో పన్నెండు మందికి నోటీసులిస్తే అందులో తప్పుపట్టడానికి ఏముందని ఆయన అడిగారు! పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నప్పుడు, ఆరోపణలు ఎదుర్కొన్న వారు కొంత ఇబ్బంది పడాల్సి వస్తుందని… కాని, అది తప్పదని ఆయన అన్నారు. పోసాని పూర్తిగా సిట్ ను సమర్థిస్తూ అకున్ సబర్వాల్ టీమ్ సినిమా వాళ్లకు గౌరవ, మర్యాదాలు బాగానే ఇస్తోందని చెప్పారు!   పోసాని , రోజా మాటల్లో ఎవరివి కరెక్ట్? వర్మ లాజిక్ సబబేనా? సినిమా వాళ్లు కాబట్టే సిట్ హడావిడి ఎక్కువ చేస్తోందా? మీడియా కోలాహలం అవసరానికి మించి జరుగుతోందా? ఇలాంటి బోలెడు ప్రశ్నలు! కాని, సమాధానం మాత్రం ఒక్కటే! సినిమా సెలబ్రిటీలు అయినంత మాత్రాన చట్టం తన పని తాను చేసుకుపోకుండా… రూల్స్ , రెగ్యులేషన్స్ పెట్టడం ఎవరి తరమూ కాదు! అందరి లాగే గ్లామర్ లోకంలోని వార్ని కూడా విచారిస్తారు. అయితే, జనం, మీడియా కొంచెం ఎక్కువ దృష్టి పెడితే ఎవ్వరూ చేయగలిగింది ఏం లేదు. గతంలో సంజయ్ దత్, సల్మాన్ లాంటి వారు కేసుల్ని ఎదుర్కొన్నప్పుడు కూడా ఇలాగే గందరగోళం చెలరేగింది. కాని, పోలీసులు, కోర్టులు సినిమా కన్సెషన్స్ ఏమీ ఇవ్వలేదు. చట్టం అందరికీ ఒకేలా పని చేస్తుందని తేల్చేశాయి. డ్రగ్స్ కేసు విషయంలో కూడా అంతే! రోజా లాంటి వారు ఎమ్మెల్యే పదవిలో వుంటూ మరింత బాధ్యతగా మాట్లాడితే బావుంటుంది! ఎందుకంటే, ఆమె వర్మ లాగా ఇష్టానుసారం మాట్లాడి తప్పించుకునే స్థితిలో లేదు కాబట్టి. ఆమె మాట వల్ల వైఎస్ఆర్సీపీ పై ప్రభావం పడుతుంది…

మోదీ వేట… నితీష్ వేటు… లాలూ టేన్షన్ గా వెయిటింగ్!

  లాల్ ప్రసాద్ యాదవ్ టైం బ్యాడ్ గా నడుస్తోంది. ఇందులో ఎవరికీ సందేహం లేదు. కాని, టైం ఎంత బ్యాడ్ అయినా తనదైన రీతిలో సంక్షోభం నుంచీ బయటపడే మార్గాలు కూడా ఆయన బాగానే అన్వేషిస్తుంటారు. అవసరమైతే తనకు బద్ధ శ్రతువులైన వార్ని కూడా ఆలింగనం చేసుకుని గండం నుంచి గట్టెక్కుతారు. ఒకప్పుడు అలాగే కాంగ్రెస్ ను తిట్టిపోశాడు. మళ్లీ ఆ పార్టీతో కలిశాడు. తరువాత ఉప్పు నిప్పులా వున్న నితీష్ కుమార్ తోనూ లాలూ హ్యాపీగా కలిసిపోయారు. బీజేపిని అధికారానికి దూరం చేసి బీహీర్ ని స్వంతం చేసుకున్నాడు. కాని, ఇప్పుడు మరోసారి లాలూకి అగ్నీ పరీక్ష ఎదురవుతోంది…   లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం మీద ఏక కాలంలో అనేక దాడులు జరుగుతున్నాయి. ఒకవైపు ఆయన కూతురు అక్రమ ఆస్తుల మీద దాడులు జరుగుతుండగానే మరోవైపు కొడుకుని కూడా టార్గెట్ చేశాయి కేంద్ర దర్యాప్తు సంస్థలు. ఇలా ఉక్కిరిబిక్కరి అవుతోన్న లాలూ ఒత్తిడిలోనూ మాస్టర్ ప్లాన్ మాత్రం వేయటం మానలేదు. తనని ఎలాగైనా వదిలించుకుని వెళ్లాలని చూస్తోన్న నితీష్ కుమార్ కి గుణపాఠం చె్ప్పేలా మరో కూటమికి తెర తీస్తున్నాడు! అందుకోసం దళిత నాయకురాలు మాయవతి, గిరిజన నాయకుడు మాన్జీలని ముగ్గులోకి దింపుతున్నాడు. పనిలో పనిగా గడ్డు కాలం ఎదుర్కొంటోన్న సమాజ్ వాదిని పార్టీని కూడా ఆయన వాడుకోవాలని ట్రై చేస్తున్నాడు!   జేడీయూ నాయకుడు నితీష్… లాలూ కుటుంబంపై వస్తోన్న అవినీతి ఆరోపణల్ని చూపి ఆర్జేడీని .ప్రభుత్వం నుంచి తొలగిస్తే… బీజేపీ మద్దతుతో మళ్లీ అధికారంలో వుండొచ్చని భావిస్తున్నాడు. కాని, ఒక్కోసారి అంచనాలు తలక్రిందులై ప్రభుత్వం కూలిపోతే మధ్యంతర ఎన్నికలొస్తాయి! అప్పుడు తన ఆర్జేడీకి మద్దతుగా మాయావతి బీఎస్పీని, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితిన్ సింగ్ మాన్జీ హిందూస్థాన్ అవామ్ మోర్చా ( హెచ్ఏఎం ) ను సిద్దం చేసుకోవాలని లాలూ వ్యూహం పన్నుతున్నాడు. అందుకే, మాయావతి రాజ్యసభ నుంచి రాజీనామా చేయగానే తమ పార్టీ తరుఫున ఆమెను పెద్దల సభకి పంపుతామని ప్రకటించాడు లాలూ. అంతే కాదు, ఉత్తర్ ప్రదేశ్ లో కూడా పుల్ పుర్ నియోజక వర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో మాయావతిని పోటి చేయించి గెలిపించుకుందామని సమాజ్ వాదికి చెబుతున్నాడు. అటు గిరిజన నేత అయిన మాన్జీని కూడా తమతో కలుపుకుని నెక్స్ట్ ఎలక్షన్స్ కి వెళ్లాలని లాలూ ప్లాన్. అలా అయితే, ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లన్నీ నితీష్ కు వెళ్లకుండా చూడొచ్చని ఆయన ఆలోచన!   ఎస్సీని, బీఎస్పీని, మాన్జీ పార్టీని, చివరకు కాంగ్రెస్ ను కలుపుకుంటూ పోవాలని లాలూ చేస్తోన్న యోచన అద్బుతమైందే! కాని, అలాంటిది సాధ్యపడటం చివరిదాకా కష్టమే! ఏ పార్టీ హ్యాండిచ్చినా లాలూ చేయాలనుకున్న ఆలూ ఫ్రై మాడిపోయే అవకాశముంది! మరో వైపు జనంలో మంచి పేరున్న నితీష్, ఫుల్ ఊపు మీదున్న మోదీ… ఇద్దరూ లేకుండా మాయావతి, ములాయం, రాహుల్ గాంధీ.. వీళ్లతో కలిసి లాలూ సంచలనాలు సృష్టిస్తాడా? డౌటే!