మన బద్ధకపు ఖర్చు- నాలుగు లక్షల కోట్లు!
వినడానికి కాస్తా ఆశ్చర్యంగానే ఉండవచ్చు. కానీ ఇది ఏదో ఆషామాషీగా తేల్చిన ఖర్చు కాదు. The lancet అనే పత్రిక గత నాలుగేళ్లుగా చేస్తున్న పరిశోధనలో బయటపడిన అంశం ఇది. ఇంతకీ బద్ధకానికీ ఖర్చుకీ సంబంధం ఏమిటీ! ఇంకా మాట్లాడితే బద్ధకానికీ ఆయుష్షుకీ సంబంధం ఏమిటి? అన్న ప్రశ్నలు తలెత్తితే వాటికి The lancet స్థిరమైన జవాబులను అందిస్తోంది...
‘ప్రజల్లో వ్యాయమాం చేసే అలవాట్లు, వాటి వల్ల వారి ఆరోగ్యంలో మార్పులు’ అనే అంశం మీద లాన్సెట్ పత్రిక గత ఒలంపిక్స్ (2012) నుంచి ఒక పరిశోధనను చేపట్టింది. ఇందులో భాగంగా నాలుగు నివేదికలను వెల్లడించింది. ఈ పత్రిక వెలువరించిన మొదటి నివేదిక ప్రకారం-
- శారీరికంగా ఎలాంటి కదలికలూ లేకుండా, వ్యాయామం చేసే అలవాటు లేకుండా ఉన్నవారిలో... గుండెజబ్బులు, పక్షవాతం, చక్కెర వ్యాధి, కొన్ని రకాల కేన్సర్లు ప్రమాదకరమైన స్థాయిలో బయటపడుతున్నాయి.
- ఇలా శారీరిక వ్యాయామం లేకపోవడం వల్ల నానారకాల జబ్బుల పాలిట పడి చనిపోతున్నవారి సంఖ్య, ఏటా 50 లక్షల వరకూ ఉంది.
- ఎలాంటి కదలికలూ లేకుండా రోజుకు కనీసం ఎనిమిది గంటల పాటు సీట్లకు అతుక్కునిపోయేవారు, రోజుకి కనీసం ఒక గంట సేపైనా వ్యాయామం చేస్తే కనుక వారిలోనో అనారోగ్య సమస్యలు దూరమవుతున్నట్లు తేలింది.
- శారీరిక వ్యాయామం లేనివారులో 28-59 శాతం మంది త్వరగా చావుని చేరుకుంటున్నారట!
- మరీ చురుకైన జీవనశైలి ఉన్నవారు తప్ప, మిగతావారిలో రోజుకి 3 గంటలకు మించి టీవీని చూసేవారు కూడా త్వరగా మృత్యు ఒడిని చేరుకుంటున్నట్లు వెల్లడైంది.
- ఈ గణాంకాలన్నింటినీ సేకరించడం కోసం లాన్స్‌ట్ వంద కాదు, వేయి కాదు... పదిలక్షల మంది జీవన విధానాన్ని నిశితంగా పరిశీలించింది.
ఇక లాన్సెట్ తన రెండో పరిశోధనలో, వ్యాయామం చేయకపోవడం వల్ల తలెత్తే అనారోగ్యాలకి సంబంధించిన ఖర్చుని వెల్లడించింది. ఇలా మన జీవనశైలిని వైద్య ఖర్చులకు ముడిపెడుతూ సాగిన తొలి పరిశోధన ఇదే! ఈ అంచనా ప్రకారం 67.5 బిలియన్ డాలర్లు, అంటే సుమారు నాలుగు లక్షల కోట్లు, వ్యాయామం లేకపోవడం వల్ల కోరి తెచ్చుకున్న జబ్బులకు అవుతున్న ఖర్చు! ఇది కేవలం వ్యక్తిగతంగానే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకూ, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకూ శరాఘాతంగా పరిణమిస్తోంది.
లాన్సెట్ ప్రచురించిన మూడో నివేదికలో, గత నాలుగు సంవత్సరాలుగా మనుషుల తీరులో ఎలాంటి మార్పూ రాలేదన్న నిరాశ వెల్లడైంది. ఎన్ని ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నా, ఎంతమంది వైద్యులు ముందుకు తోస్తున్నా... తరచూ వ్యాయామం చేయాలన్న తపన ప్రజల్లో పెద్దగా పెరగలేదని వెల్లడైంది. కదలికలు లేని జీవనశైలి వల్ల అనారోగ్యం పాలవుతామని స్పష్టంగా సంకేతాలు తెలుస్తున్నా... నాలుగు అడుగులు వేయడానికి మనుషులు ఇంకా బద్ధకిస్తున్నారని తేలింది.
చివరగా లాన్సెట్ ప్రచురించిన నాలుగో నివేదికలో ప్రభుత్వమూ, పాఠశాలలూ, పర్యావరణ సంస్థలూ... ఇలా అన్ని రంగాలలోని యాజమాన్యం వ్యాయామానికి తగిన గుర్తింపునీ, ప్రోత్సాహాన్నీ ఇవ్వాలని పేర్కొంది. ఆరోగ్యం అనేది వ్యక్తిగతమైన విషయంగా చూడటం ఆపమని సూచించింది. అంటే జనం ఎలాగూ తమంతట తాముగా మారడం లేదు కాబట్టి... ప్రభుత్వం, విద్యాసంస్థలు, ఆఫీసుల ద్వారా అయినా వారిలో కొంత చురుకుని పుట్టించాలనుకుంటోందన్నమాట! మంచిదే!
- నిర్జర.