కూల్డ్రింకుతో డయాబెటిస్ ఉచితం
ఇంతవరకూ మీకు చక్కెర వ్యాధి రాలేదని సంతోషంగా ఉన్నారా! రోజుకి ఒక కూల్డ్రింక్ మించి తాగడం లేదని మురిసిపోతున్నారా! అయితే తాజా పరిశోధనలతో మీ అలవాట్లను సరిదిద్దుకోక తప్పదు. తాగేది డైట్ కూల్‌డ్రింకే అయినా మరింత జాగ్రత్త వహించకా తప్పదు...
వేలమందిని పరిశీలించి
స్వీడన్‌లోని కరోలిన్స్కా పరిశోధనాశాలకి శాస్త్రరంగంలో గొప్ప పేరుంది. గత ఏడాది ఆ సంస్థ 2,874 మంది అభ్యర్థులను వారివారి ఆహారానికి సంబంధించిన అలవాట్లను నమోదు చేయమని అడిగింది. ఏడాదిపాటు అలా నమోదు చేసిన సమాచారం ఆధారంగా వారి ఆహారపు అలవాట్లకీ, డయాబెటిస్‌కి మధ్య ఉన్న సంబంధం ఉందేమో అన్న విషయాన్ని పరిశోధించింది.
ఎంత తాగితే అంత అవకాశం
రోజుకి 400 ఎం.ఎల్ తాగిన వ్యక్తులకి డయాబెటిస్ వచ్చే అవకాశం రెట్టింపుగా ఉన్నట్లు ఈ గణాంకాలు స్పష్టం చేశాయి (సాధారణంగా ఒక బాటిల్ కూల్‌డ్రింకులో 300 ఎం.ఎల్‌కు పైగా పానీయం ఉంటుంది). ఇక ఏకంగా రోజుకి లీటరేసి తాగే వ్యక్తులకయితే డయాబెటిస్ ప్రమాదం దాదాపు ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీంతో ఇప్పటికే ఊబకాయం, సంతానం కలుగలేకపోవడం వంటి సమస్యలకు కూల్డ్రింక్ కారణం అంటూ వినిపిస్తున్న ఆరోపణలకి మరో అపవాదు తోడయినట్లయ్యింది.
కారణాలు స్పష్టమే!
- కూల్‌డ్రింకులలో ఉండే తీపి పదార్థాలు మన శరీరంలో కొవ్వు పేరుకుపోయేందుకు తోడ్పడతాయి. ఈ కొవ్వు ఊబకాయానికీ, ఊబకాయం చక్కెరవ్యాధికీ దారితీస్తుంది.
- శీతల పానీయాల్లో ఉండే కృత్రిమ తీపి పదార్థాలు మన జీర్ణాశయంలో ఉన్న మంచి బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. ఇలా జీర్ణవ్యవస్థ దెబ్బతినడంతో డయాబెటీస్ ఏర్పడే వాతావరణం సానుకూలం అవుతుంది.
- కూల్‌డ్రింక్‌లలో ఉండే అధిక చక్కెర వలన మన శరీరంలోని జీవక్రియ (మెటాబాలిజం) దెబ్బతింటుంది. దీని వలన శరీరం ఇన్సులిన్‌ను గ్రహించే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఫలితంగా టైప్-2 డయాబెటిస్ మన మీద దాడి చేస్తుంది.
డైట్ కూల్డ్రింకులతోనూ నష్టమే
చాలామంది సాధారణ కూల్‌డ్రింకులతో నష్టం కదా అన్న భయంతో డైట్ కూల్డ్రింకులని సేవిస్తూ ఉంటారు. అయితే డైట్ కూల్డ్రింకులు కూడా డయాబెటిస్‌కు కారణం అవుతున్నాయని పైన పేర్కొన్న పరిశోధనలో తేలిపోయింది. ఎలాంటి కేలొరీలు లేని డైట్ కూల్డ్రింకులు తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుందనీ, ఏవన్నా తీపి పదార్థాలు తీసుకోవాలని మనసు లాగుతూ ఉంటుందనీ... ఫలితంగా వారు కూడా ఊబకాయులు కాక తప్పదనీ తేల్చి చెబుతున్నారు.
- నిర్జర.