పొగ తాగేవారికి శుభవార్త!

  పొగ త్రాగడం వల్ల క్యాన్సర్ వస్తుందని అందరికి తెలిసిందే. తెలిసిన కూడా అందరూ పొగ త్రాగడం మానివేయడం లేదు. దీనివలన భవిష్యత్తులో క్యాన్సర్ వస్తుందని మర్చిపోతున్నారు. కానీ క్యాన్సర్ ముప్పు నుండి తప్పించుకోవాలనుకుంటే పండ్లను తినడం మంచిది.  పొగ త్రాగేవాళ్ళు ప్రతిరోజూ పండ్లను తినడం ఆరోగ్యానికి మంచిదని, దీనివల్ల క్యాన్సర్ ముప్పు నుండి కొంతవరకైనా తప్పించుకోవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు.  కానీ పొగ త్రాగుతూ.. పండ్లను తింటే క్యాన్సర్ రాదనుకుంటే పొరపాటే. ఇది కేవలం కొంతకాలం వరకు మాత్రమే క్యాన్సర్ భారిన పడకుండా కాపాడుతుంది. అసలు క్యాన్సర్ రావొద్దని అనుకుంటే... పొగ త్రాగడం కొద్ది కొద్దిగా మానేయడం మంచిది.

ఆరోగ్యానికి ఆ నాలుగూ...

  డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. అందులోనూ జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష, వాల్‌నట్స్ ఈ నాలుగూ అందరూ తప్పక తినితీరాలి అంటూ పోషకాహార నిపుణులు పదేపదే చెబుతున్నా మనం పెద్దగా పట్టించుకోం. వీలయినప్పుడు తింటాం. లేదంటే లేదు. అవునా! కానీ గుండె ఆరోగ్యంగా వుండాలంటే జీడిపప్పులు రోజూ ఓ నాలుగు అయినా తినాలిట. వీటిలో వుండే ఒలోయిక్ ఆమ్లం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాదు శరీరానికి అవసరమై. రాగి, మెగ్నీషియమ్, జింక్, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు ఈ జీడిపప్పుల నుంచి లభిస్తాయిట. కాబట్టి ఏ పనిలో వున్నా ఓ నాలుగు జీడిపప్పులను టక్కున నోట్లో వేసుకోవడం మరచిపోవద్దు.   ఇక బాదం ఎందుకు తినాలో తెలుసా? శరీరంలోని హానికర కొవ్వు నిల్వలని తగ్గిస్తుంది కాబట్టి. వీటిలోని మెగ్నీషియం, పొటాషియం, మాంగనీసు, కాల్షియం, రాగి లాంటి ఖనిజ లవణాలు, ఇ విటమిన్ గుండె ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయిట. గర్భవతులు రోజూ ఓ రెండు బాదం పప్పులు తింటే వీటిలోని ఫోలెట్, బి విటమిన్లు బొజ్జలోని పాపాయికి బర్త్ డిఫెక్ట్ లేకుండా చూసుకుంటాయి. కీళ్ళ నొప్పులతో బాధపడేవారు, మెనోపాజ్ దశలో వున్నవారు ఎండుద్రాక్షని రోజూ తప్పనిసరిగా తినాలిట. ఎందుకంటే, ఎముకల ఆరోగ్యాన్ని పరిరక్షించే బోరెన్ అనే ఖనిజ లవణం ఎండుద్రాక్షలో పుష్కలంగా దొరుకుతుంది. అలాగే వీటిలో కూడా యాంటి ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా వుంటాయి కాబట్టి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇక వాల్ నట్స్ తింటే రోగ నిరోధక శక్తి పెరగటమే కాదు. క్యాన్సర్ల వంటివీ దరిచేరవు. అలాగే ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గుతాయి. అధిక రక్తపోటు, హానికారక కొలెస్ట్రాల్ స్థాయులు నియంత్రణలో వుంటాయి. గుండె ఆరోగ్యంగా వుంటుంది. వీటన్నిటికీ కారణం వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్‌లు అధికంగా వుండటమే. -రమ  

స్టెప్పులేయడమే మంచి మందు..

  సంగీతమంటే ఇష్టం లేంది ఎవరికి..? మంచి పాటేదైనా అలా గాలివాటంగా వినిపిస్తుంటే.. చెవులు రిక్కించని వాళ్లు ఎవరైనా ఉంటారా.. ? మంచి రాగం చెవినపడితే వీలైతే కాళ్లూ చేతులూ లేకపోతే కనీసం వేళ్లైనా ఊపకుండా ఉండగలిగేవాళ్లు ఈ భూమ్మీద ఉన్నారంటారా.. ? లేరని గట్టిగా చెప్పొచ్చు. ముమ్మాటికీ ఆలాంటివాళ్లు ఈ పుడమిమీద దొరకరుగాక దొరకరని ఢంకా బజాయించి మరీ చెప్పొచ్చు.  ఆ అలవాటే ఇప్పుడు కొన్ని జబ్బులకు మందుగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పార్కిన్ సన్స్ డిసీజ్ కి నచ్చినపాటకి నచ్చినట్టుగా స్టెప్పులేస్తే చాలా ఉపశమనం కలుగుతుందని వైద్య శాస్త్రవేత్తలు అంటున్నారు. తాజా పరిశోధనల్లో తెలిసిన ఈ విషయాన్ని వెంటనే అందరికీ చెప్పేయాలన్న ఉబలాటంతో శాస్త్రవేత్తలు టమకేసి మరీ చెబుతున్నారు.  అంతే కాదు.. ఇలా ఇష్టమైన పాటలకి స్టెప్పులేయడంవల్ల ఒక్క పార్కిన్ సన్స్ డిసీజ్ కి మాత్రమే కాదు, బీపీ, షుగర్ లాంటి మొండి జబ్బులకుకూడా చాలా ఉపశమనం కలుగుతుందంటున్నారు. సో.. మీ కిష్టమైన మంచి పాటకి స్టెప్పులేయడంవల్ల ఇన్ని మంచి లాభాలున్నాయని తెలిసినప్పుడు మరింకెందుకు ఆలస్యం.. లెట్స్ డూ ఇట్ ఫాస్ట్..

సూర్యుణ్ణి కౌగిలించుకోం‘డి’

  సూర్యకాంతిలో వుండే బి-బ్యాండ్ అతినీలలోహిత కిరణాలు మన ఆరోగ్యానికి అత్యంత కీలకమైనవి. ఆ కిరణాలే మన శరీరంలో ఎముకల పుష్టికి మూలమైన ‘విటమిన్-డి’ తయారీని ప్రేరేపిస్తాయట. ఆ కిరణాలు సూర్యకాంతి మన చర్మం మీద ఏటవాలుగా పడే ఉదయం, సాయంత్రం సమయాల్లో ఎక్కువగా వుంటాయి. కాబట్టి వీటికోసం మనం ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు ఆరుబయట గడపటం తప్పనిసరి. ఈ కిరణాలు మన చర్మం మీద పడుతూనే మన శరీరం ‘విటమిన్-డి ’ని తయారుచేసుకోవడం ప్రారంభిస్తుంది. మనం తిన్న ఆహారంలోని కాల్షియం ఎముకల్లో చేరడానికి డి విటమిన్ చాలా అవసరంట. ‘విటమిన్-డి ’ కోసం మందులు వాడచ్చు కదా అంటారు కొందరు. కానీ, మనం వాడే మందుల్లో ‘విటమిన్-డి ’ సుమారు 100 యూనిట్ల లోపే వుంటుంది. నిజానికి ఒక్కరోజుకి పిల్లలకి 200 యూనిట్లు, పెద్దలకు 400 యూనిట్ల ‘విటమిన్-డి ’ అవసరం. ఆ లెక్కన ఎన్ని మందులు వాడాలి చెప్పండి. చక్కగా ఉదయం, సాయంత్రం లేలేత కిరణాలు తాకేలా నిలుచుంటేచాలు.  రోజూ ఒంటికి సూర్యరశ్మి తగలని వారికి రొమ్ము, ప్రొస్టేట్, గర్భాశయం వంటి అవయవాలకు కేన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువగా వుంటుందని పరిశోధకులు గుర్తించారు. పైగా ఈ మధ్యాకాలంలో చాలమందిలో ‘విటమిన్-డి ’ లోపం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు కూడా. పిల్లలు ఆరోగ్యంగా ఎదగడానికి ఈ ‘విటమిన్-డి ’ ఎంతో అవసరం. అయితే ఉదయం స్కూలుకి వెళ్ళే హడావిడి, సాయంత్రం ఎప్పుడో పొద్దుపోయాక ఇళ్ళకి చేరడం వల్ల తగినంత సూర్యరశ్మి పిల్లలకి చేరడం లేదని చెబుతున్నారు పరిశోధకులు. దీనివల్ల పిల్లలు భవిష్యత్తులో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం కూడా వుందట. సూర్యరశ్మి తగలగానే మన ఒంట్లో ‘మెలటోనిన్’ అనే హార్మోను తగ్గిపోతుందట. ఈ హార్మోన్ స్థాయి ఎక్కువగా వుంటే మనలో డిప్రెషన్ సమస్య ఎక్కువగా ఉంటుందిట. మానసికంగా నిస్తేజంగా ఉన్నా, డిప్రెషన్ చుట్టుముట్టినా లేలేత సూర్యకిరణాలలో సేదతీరడం మొదలుపెడితే చాలట. లేలేత సూర్యకిరణాలలో కొద్దిసేపు ఉంటే డిప్రెషన్‌కి కారణమైన ‘మెలటోనిన్’ హార్మోను స్థాయి తగ్గిపోతుంది. మానసికంగా ఉత్తేజం లభిస్తుంది.  అంతేకాదు.. రోజు క్రమం తప్పకుండా వాకింగ్, జాగింగ్ వంటి వ్యాయామాలని సూర్య కిరణాలు తాకేలా చేసేవారు ఒత్తిడి బారిన పడే అవకాశాలు చాలా తక్కువట. వాకింగ్, జాగింగ్ వంటి వ్యాయామాల వల్ల మాత్రమే కాదు.. ఆ సూర్యరశ్మి తాలూకు ప్రభావం వల్ల రోజంతా ఉత్సాహంగా, ఉత్తేజంతో ఉండచ్చని గట్టిగా చెబుతున్నారు. పసిపిల్లలు రాత్రంతా నిద్రపోకుండా అదేపనిగా ఏడుస్తుంటే రోజూ కొద్దిసేపు పగటి వెలుగులో ఉంచితే వారి నిద్ర అలవాట్లు తప్పకుండా మారతాయిట.  అంతేకాక వారు ఉత్తేజంగా కూడా ఉంటారని అధ్యయనాల్లో తేలింది. అటు ఆధునిక వైద్యులు, ఇటు సంప్రదాయ వైద్యులు ముక్తకంఠంతో చెబుతున్న మాట ఒక్కటే. మన మెదడుపై సూర్యరశ్మి అమోఘమైన ప్రభావాన్ని చూపిస్తుందిట. ఇది నిద్రతోపాటు రకరకాల హార్మోన్లను కూడా ప్రభావితం చేస్తుందిట. కాబట్టి మన శరీరంలోని అంతర్గత గడియారం సజావుగా నడుస్తూండాలంటే రోజూ కొంత సమయం సూర్యరశ్మి తగిలేలా చూసుకోవడం అవసరం.  సూర్యకిరణాలు సైతం మనల్ని తాకే అవకాశం లేని కాంక్రీట్ జంగిల్‌లో నివసిస్తున్నాం. ఆరుబయట ఉచితంగా, అనంతంగా దొరికే ఆరోగ్య ప్రదాయినిని నిర్లక్ష్యం చేస్తున్నాం. అనారోగ్యాన్ని కోరి తెచ్చుకుంటున్నాం అంటూ నిపుణులు చేస్తున్న హెచ్చరికలపై ఇకనైనా కాస్త శ్రద్ధ పెట్టాలి. సూర్యకిరణాల స్పర్శతో ఆరోగ్యాన్ని సొంతం చేసుకునే విషయమై ఆలోచించాలి.                                                                          -రమ ఇరగవరపు

వెల్లులితో వైరస్ లకు చెక్

  ''ఆరోగ్యంగా వుండాలంటే రోజుకో పచ్చి వెల్లులిని తినండి'' అంటున్నారు నిపుణులు. వంటల్లో వెల్లులిని వాడినా వండినప్పుడు 'అల్లిసిన్' ఇతర శక్తివంతమైన కాంపౌండ్లుగా మారటం తగ్గిపోతుందట. కాబట్టి తాజా వెల్లులిని తినటం వల్ల మాత్రమే ఉపయోగం వుంటుందని అంటున్నారు నిపుణులు. అయితే కొన్ని రసాయనాలు వండినప్పుడు కూడా దెబ్బతినకుండా వుంటాయి. కాబట్టి వంటల్లో విరివిగా వెల్లులిని వాడచ్చు అని కూడా చెబుతున్నారు. పచ్చి వెల్లుల్లి రేకులని రోజుకు ఓ మూడు నోట్లో వేసుకుంటే చెడు కొలెస్ట్రాల్ (LDL) ను 10 శాతం వరకు తగ్గించుకోవచ్చు. దాంతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇక అధిక రక్తపోటుకి వెల్లుల్లి మంచి ఔషదం. ఇది మాత్రలతో సమాన ప్రభావం కలిగి వుండటం గుర్తించారు పరిశోధకులు. ఇక వైరస్ లకు వెల్లుల్లి చెక్ చెబుతుందనటంలో అనుమానమే లేదు. వెల్లుల్లి నమిలి తిన్నప్పుడు అందులోని 'అల్లిన్' అనే రసాయనం 'అల్లిసిన్' గా మారుతుంది. ఆ తర్వాత అది వెంటనే అజోన్ వంటి ఇతర రసాయన కాంపౌండ్ల రూపంలోకి మారుతుంది, వాటి వల్లే మనకు ఆరోగ్యకర ప్రయోజనాలు దక్కుతాయి.                                                                                                                                 ---రమ

వడదెబ్బ తగిలిన వెంటనే...

గ్లోబల్ వార్మింగో మరొకటో.... కారణం ఏదైతేనేం! ఒకో ఏడాది గడిచేకొద్దీ ఎండల తీవ్రత పెరిగిపోతూనే వస్తోంది. ఆ ఎండల బారిన పడి వడదెబ్బతో విలవిల్లాడిపోయేవారి సంఖ్యా పెరిగిపోతోంది. కానీ కాస్తంత అవగాహన ఉంటే వడదెబ్బని తప్పించుకోవడం ఏమంత కష్టం కాదంటున్నారు.   వడదబ్బ కలిగే పరిస్థితిని Hyperthermia అంటారు. మన శరీరం నుంచి వెళ్లిపోయే వేడికన్నా, శరీరం లోపల ఉన్న వేడి ఎక్కువైనప్పుడు ఈ పరిస్థితి ఏర్పుడుతుంది. దాంతో శరీరంలో వేడిని నియంత్రించే thermo regulation అనే వ్యవస్థ దెబ్బతినిపోయి వడదెబ్బకి దారితీస్తుంది. సాధారణంగా 40.6 డిగ్రీలని మించి ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ వడదెబ్బ కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.   విపరీతమైన ఉష్ణోగ్రతలకి తోడు మరికొన్ని పరిస్థితులు కూడా వడదెబ్బకి కారణం కావచ్చు. మందపాటి దుస్తులు వేసుకోవడం, ఎండలో విపరీతంగా శ్రమించడం, నేరుగా ఎండ తీక్షణత ఒంటికి తగిలేలా తిరగడం వంటి చర్యలతో ఏరికోరి వడదెబ్బని తెచ్చుకున్నట్లవుతుంది. ఇక మద్యపానం, కాఫీటీలు తాగడం వల్ల కూడా వాటిలోని రసాయనాలకి ఒంట్లో డీహైడ్రేషన్ ఏర్పడి వడదెబ్బకి దారితీయవచ్చు.   ముందు జాగ్రత్త   వడదెబ్బ వచ్చాక బాధపడేకంటే రాకుండా చూసుకోవడం తేలిక. అందుకోసం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. - ఎండాకాలం వదులుగా, లేత రంగుల్లో ఉండే దుస్తులు వేసుకోవాలి. - బయటకి వెళ్లాల్సి వస్తే వెడల్పాటి అంచులు ఉన్న టోపీ పెట్టుకోవడం చాలా ఉపయోగం. - మూసి ఉన్న కారులో ఉష్ణోగ్రతలు చాలా త్వరగా పెరిగిపోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల్ని కారులో వదిలి వెళ్లకూడదు. ఎండలో ఉంచిన కారులో వేడి కాస్త తగ్గేదాకా తలుపులు తీసి ఉంచాలి. - పిల్లలు, వృద్ధులలో వేడిని నియంత్రించే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. వీరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. - కుక్కలు, పిల్లులకి చెమటే పట్టదు. ఇవి త్వరగా వడదెబ్బకి గురవుతాయి. కాబట్టి వీటిని వదలి బయటకు వెళ్లేటప్పుడు, వాటికి అందుబాటులో తగినంత మంచినీరు ఉందో లేదో గమనించుకోవాలి. - మంచినీళ్లు తాగుతూ ఉండాలి. మూత్రం పచ్చగా ఉంటే మనం తగినంత నీరు తాగడం లేదని గ్రహించాలి.   వడదెబ్బ తగిలితే! కళ్లు తిరగడం, అయోమయంగా ప్రవర్తించడం, నిస్సత్తువగా మారిపోవడం, తలనొప్పి, చెమట పట్టకపోవడం, వాంతులు, గుండెదడ... లాంటి లక్షణాలన్నీ వడదెబ్బ సమయంలో చూడవచ్చు. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఫిట్స్ రావడం, మూర్ఛపోవడం వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. ఇవి మరణానికే దారితీయవచ్చు. అందుకని వడదెబ్బ తగిలిందన్న అనుమానం రాగానే ఈ చర్యలు తీసుకుంటే రోగి కోలుకునే అవకాశం ఉంటుంది.   - రోగి ఒంటి మీద ఉన్న దుస్తులు వదులుచేసి బాగా గాలి తగిలే ప్రదేశంలో ఉంచాలి. - మెడ, గజ్జలు, తల దగ్గర నీటిలో తడిపిన గుడ్డలని ఉంచాలి. దాంతో ఉష్ణోగ్రతలు వెంటనే అదుపులోకి వస్తాయి. - చల్లటి నీరు నింపిన టబ్బులో రోగిని ముంచితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. - ఎలక్ట్రాల్ పౌడర్ కలిపిన నీటిని ఒక్కసారిగా కాకుండా నిదానంగా తాగించాలి.   ఒక పక్క ప్రాథమిక చికిత్స చేస్తూనే దగ్గరలో ఉన్న వైద్యుడిని సంప్రదించే ప్రయత్నం చేయాలి. అక్కడ అవసరాన్ని బట్టి రోగికి ఇంట్రావీనస్ ద్వారా శరీరంలో కోల్పోయిన లవణాలను వెంటనే అందించే ప్రయత్నం చేస్తారు. - నిర్జర.      

ఉగాది పచ్చడిలో అశోక మొక్క చిగుళ్లు!

కొన్ని ఆచారాలను చెక్కుచెదరకుండా శతాబ్దాల తరబడి పాటిస్తూ ఉంటాము. మరికొన్ని ఆచారాలు మాత్రం కాలానుగుణంగా మరుగున పడిపోతుంటాయి. అశోక వృక్షపు ప్రాధాన్యత తగ్గిపోవడం వాటిలో ఒకటి. ఒకప్పుడు వసంత రుతువు వచ్చిందంటే చాలు... హోళీ పండుగ సందర్భంగా, ఉగాది సమయంలోనూ అశోక వృక్షం లేనిదే పనిజరిగేది కాదు. మన్మధుని అయిదు బాణాలలో అశోక పూలు కూడా ఒకటని చెబుతారు. అలాగే ఉగాది పచ్చడిలో అశోక వృక్షపు చిగుళ్లు కూడా వేసుకోవాలని శాస్త్రంలో కనిపిస్తుంది.   అశోక వృక్షం భారత ఉపఖండంలోనే అవిర్భవించిందన్నది శాస్త్రవేత్తల మాట. అందుకే దీనిని Saraca Indica అనే శాస్త్రీయ నామంతో పిల్చుకుంటారు. భారతదేశానికి చెందిన SARACA జాతి వృక్షమని దీని అర్థం. ఇందుకు అనుగుణంగానే మన దేశ చరిత్రలో, పురాణాలలో అశోక వృక్షం పెనవేసుకుపోయి కనిపిస్తుంది. బుద్ధుడు జన్మించినది, హనుమంతుడు సీతమ్మ జాడ కనుగొన్నదీ అశోక వృక్షం దిగువునే అని చెబుతారు.     అశోక వృక్షం ఏడాది పొడవునా పచ్చగా ఉంటుంది. ఎన్నో ఆరోగ్య సమస్యలను ఔషధంగా పనిచేస్తుంది. అందుకనే దానికి అశోకము అన్న పేరు వచ్చి ఉండవచ్చు. గత ఏడాది బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కు చెందిన పరిశోధకులు అశోక వృక్షంలో క్యాన్సర్ను నివారించే రసాయనాలు ఉన్నాయని కనుగొన్నారు. కానీ ఇలాంటి ఆధునిక పరిశోధనలు జరగక పూర్వమే... మన పెద్దలు అశోక వృక్షంలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని తెలుసుకొన్నారు. వాటిలో కొన్ని... *  అశోక వృక్షం స్త్రీలకు గొప్ప వరం. స్త్రీలలో రుతుక్రమం, గర్భధారణకి సంబంధించి అనేక సమస్యలకి అశోక బెరడు, పువ్వులతో చేసిన మందులని సూచిస్తుంటారు. అధిక రక్తస్రావం, సంతానం కలగకపోవడం, రుతుస్రావం సమయంలో కడుపులో నొప్పి, రుతుస్రావం తరువాత కండరాల నొప్పులు... వంటి అనేక సమస్యలకు అశోక వృక్షం అధిక ఫలితాన్నిస్తుందట. గర్భవతులు ఈ మందుల జోలికి పోతే మాత్రం గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది.. * అశోకపూలని కాస్త నీటితో కలిపి రుబ్బి.... ఓ పావు గ్లాసుని తీసుకుంటే విరేచనాలు తగ్గుముఖం పడుతాయని ప్రాచీన వైద్యం చెబుతోంది.   * అశోక వృక్షం నుంచి తయారుచేసిన లేపనాలతో చర్మరోగాలు తగ్గిపోతాయనీ, చర్మం మృదువుగా మారుతుందనీ అంటారు. అశోక వృక్షపు బెరడుతో చేసిన కషాయంతో రక్తం శుద్ధి అవుతుంది కాబట్టి... ఎలాంటి మొటిమలూ, మచ్చలూ లేకుండా చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. * అశోకవృక్షపు గింజలని పొడి చేసుకుని తింటే.. కిడ్నీ, మూత్రాశయంలో ఉన్న రాళ్లు త్వరగా బయటకి వచ్చేస్తాయనీ... అవి మూత్రం ద్వారా వచ్చే సమయంలో నొప్పి కూడా తెలియదనీ చెబుతారు. * పైల్స్ నుంచి ఉపశమన్నా కలిగించే మందులు చాలా అరుదు. కానీ అశోక వృక్షపు పూలు, బెరడు నుంచి తీసిన కషాయంతో పైల్స్ నుంచి రక్తం స్రవించడం, నొప్పి తగ్గుతాయట. అంతర్గతంగా ఉండి బాధపెడుతున్న పైల్స్ కూడా అశోకంతో అదుపులోకి వస్తాయన్నది అనుభవజ్ఞుల నమ్మకం. * మధుమేహంతో బాధపడేవారు అశోక వృక్షపు పూలని ఎండపెట్టి పొడిచేసుకుని తింటే మంచిదని సూచిస్తున్నారు. * అశోక వృక్షపు బెరడుకి యాంటీఫంగల్, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకని బెరడుతో చేసిన చూర్ణం లేదా కషాయం- క్షయ, కడుపులో నులిపురుగులు, మూత్రకోశ వ్యాధులు వంటి అనేక సమస్యలకి ఔషధంగా పనిచేస్తుంది. ఇన్ని ఔషధ గుణాలున్న అశోక చిగుళ్లని ఉగాది పచ్చడిలో వాడటంలో ఆశ్చర్యం లేదు కదా! అయితే రానురానూ ఈ పద్ధతిని మానుకోవడానికి ఒక కారణం కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో అశోక వృక్షం పేరుతో మనం చూస్తున్న చాలా చెట్లు నిజానికి అశోక చెట్లు కావు. వీటిని FALSE ASHOKA అని పిలుస్తారు. ఇవి అశోక వృక్షంలాగానే ఉంటాయి. కానీ సన్నగా, పొడుగ్గా, దట్టమైన ఆకులతో ఎదుగుతాయి. నిజమైన అశోకవృక్షం కాస్త విశాలంగా ఎర్రటిపూలతో కనిపిస్తే... FALSE ASHOKA ఆకుపచ్చని పూలతో ఉంటుంది. FALSE ASHOKA ఆకులు, పూలు విషప్రాయం కావచ్చు. వృక్షాల గురించి అంత అవగాహన లేని వ్యక్తులకు, అందునా... ఇప్పటి తరం వారికి ఏది నిజమైన అశోక చెట్టు, ఏది FALSE ASHOKA అని గుర్తించడం కష్టం కావచ్చు. ఇలాంటి సమస్యను నివారించేందుకే పెద్దలు క్రమేపీ ఉగాది పచ్చడి నుంచి అశోక చిగుళ్లని తొలగించి ఉంటారు. - నిర్జర.