వేసవిలో ఈ ఆహారంతో జాగ్రత్త

  వేసవి భగభగలకి ఒళ్లంతా పొగలు కక్కడం ఖాయం. కానీ ఆహారం విషయంలో తగినంత జాగ్రత్త తీసుకోకపోతే లేనిపోని ఆరోగ్య సమస్యలు కూడా పలకరించేందుకు సిద్ధంగా ఉంటాయంటున్నారు నిపుణులు. మరి ఏ ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటే...   మితంగా ప్రొటీన్లు: ఒంట్లో వేడి చేసిందని చెబితే చాలామంది వైద్యులు ఒప్పుకోరు. కానీ కొన్ని పదార్థాలలో ఉండే అధిక ప్రొటీన్ల వల్ల... ఒంట్లోని జీవక్రియ (మెటబాలిజం) వేగం పెరుగుతుందనీ, దాంతో వేడి చేసిన అనుభూతి కలుగుతుందనీ పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇలా అధిక ప్రొటీన్లు ఉండే కోడిగుడ్డు, బాదంపప్పు, ఓట్స్, మెంతులు, చేపలు వంటి ఆహారాన్ని ఒకేసారి కాకుండా కొంచెంకొంచెంగా తీసుకోమని సూచిస్తున్నారు.   నూనెపదార్థాలు: నూనె ఎక్కువగా ఉండే వేపుళ్లు, చిరుతిళ్ల వంటి పదార్థాలకు వేసవిలో దూరంగా ఉండటమే మంచిదట. నూనె పదార్థాలు త్వరగా జీర్ణం కావు. పైగా నూనె పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల చర్మం కూడా జిడ్డోడుతుందని తేలింది. అలా నూనెపదార్థాలు ఒంటి లోపలా బయటా కూడా చిరాకు కలిగిస్తాయన్నమాట.   మద్యపానం: వేసవి వచ్చిందంటే చాలు... ఆ పేరు చెప్పి పీపాలకు పీపాలు బీరు తాగేస్తుంటారు. ఒకవేళ బీరు దొరక్కపోతే ఎలాంటి మద్యానికైనా సిద్ధంగా ఉంటారు. బీరుతో సహా ఎలాంటి మద్యానికైనా dehydration కలిగించే లక్షణం ఉంది. అందుకనే మద్యం సేవించేటప్పుడు ఒళ్లంతా చెమటలు కక్కడం, మాటిమాటికీ మూత్రానికీ వెళ్లాల్సి రావడం జరుగుతుంది.   మామిడిపళ్లు: వేసవికాలంలో మామిడిపళ్లే గుర్తుకువస్తాయి. ఈ కాలంలో మాత్రమే దొరుకుతాయి కదా! అని ఆబగా లాగించేస్తుంటాం. కానీ మామిడిపళ్లు మోతాదుని మించితే.... విరేచనాలు తప్పవు. పైగా వీటికి వేడి చేసే గుణం కూడా ఉంది. అందుకనే నిరంతరం మామిడిపళ్లు తింటే పెదాలు పగలడం, సెగ్గడ్డలు రావడం జరుగుతుంది.   పాలు: పాల నుంచి వచ్చే పెరుగు, మజ్జిగలు వేసవిలో దాహాన్ని తీరుస్తాయి. జీర్ణవ్యవస్థని మెరుగుపరుస్తాయి. కానీ నేరుగా చల్లటి పాలు తాగితే మాత్రం చిక్కులు తప్పవు. చాలామందికి పాలని జీర్ణం చేసుకునే సామర్థ్యం ఉండదు. పైగా చల్లటి పాలని తాగడం వల్ల, వాటిని తిరిగి శరీర ఉష్ణోగ్రతకి అనుగుణంగా మార్చేందుకు మరింత వేడిని ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. ఇక టీ, కాఫీలలో ఉండే కెఫిన్కి కూడా డీహైడ్రేషన్ కలిగించే లక్షణం ఉంది. ఇవే కాదు మాంసాహారం, మసాలా పదార్థాలు, చపాతీలు... ఇవన్నీ కూడా వేసవి తాపాన్ని మరింతగా పెంచే ప్రమాదం ఉందంటున్నారు. - నిర్జర.  

మీ పిల్లలు బాగా ఆడాలంటే ఈ ఫుడ్ పెట్టండి

    పిల్లలు ఆరోగ్యంగా ఉండటమంటే కేవలం శారీరక ఆరోగ్యమే కాదు.. మానసికంగా కూడా వాళ్లు ఎదగాలి.. ఇది కావాలంటే వారికి చదువుతో పాటు ఆటలు నేర్పించాలి.. అలా అని ప్రతీ ఒక్కరూ సచిన్, సానియా, సైనా నెహ్వాల్ అవ్వాలని కాదు.. ఎదిగే పిల్లలకు శారీరక వ్యాయామం తప్పనిసరి. వైద్యుల సలహాలో.. లేక మారుతున్న కాలమో కానీ దీని ప్రాధాన్యత గుర్తించిన ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లలను స్పోర్ట్స్ స్కూల్స్‌లో జాయిన్ చేస్తున్నారు. అయితే వాళ్లు ఆటలు ఆడటానికి తగినంత శక్తి కూడా ఎంతో అవసరం.. లేదంటే పిల్లలు నీరసించిపోతారు.. వారిలో ఎనర్జీ లెవల్స్ బాగా పెరగడానికి కొన్ని రకాల పోషకాహారాలను సూచిస్తున్నారు నిపుణులు.. వాటి గురించి తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి...   https://www.youtube.com/watch?v=HLTHriVZaTc  

కడుపులో బిడ్డని బట్టి తల్లి ఆరోగ్యం

  పుట్టబోయే బిడ్డ ఆడపిల్లా, మగపిల్లవాడా అని చెప్పడానికి మన పెద్దలు రకరకాల లక్షణాలు చెబుతూ ఉంటారు. పొట్ట ఎత్తుగా ఉందా, ఆయాసం వస్తోందా, ఒళ్లు చేశారా... ఇలా భిన్నమైన లక్షణాల ఆధారంగా కడుపులో ఉన్న బిడ్డ ఆడా, మగా అని అంచనా వేస్తుంటారు. వినడానికి ఇవన్నీ సరదాగానో, కించిత్తు ఛాదస్తంగానో కనిపిస్తాయి. కానీ ఈ మధ్యే జరిగిన ఓ పరిశోధనని కనుక గమనిస్తే... మన పెద్దల మాటలని మరీ అంత కొట్టి పారేయడానికి వీల్లేదని అనిపిస్తుంది.   ఓహియో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు... తల్లి గర్భంలో ఉన్న శిశువు లైంగికతకీ, ఆమె రోగనిరోధక శక్తికీ మధ్య సంబంధం ఏమన్నా ఉందేమో అని గమనించే ప్రయత్నం చేశారు. ఇందుకోసం వారు మన ఒంట్లో రోగనిరోధక శక్తిని ప్రతిబింబించే సైటోకైన్స్ (cytokines) అనే కణాల తీరుని గమనించారు. కడుపులో ఆడపిల్ల ఉన్నా, మగపిల్లవాడు ఉన్నా ఈ సైటోకైన్స్ సంఖ్యలో పెద్దగా మార్పు రాలేదు. కానీ ఆడపిల్ల కడుపులో ఉన్నప్పుడు ఏర్పడే సైటోకైన్స్ తీరు కాస్త విభిన్నంగా కనిపించింది.   గర్భంలో ఉన్న శిశువు ఆడపిల్ల అయితే కనుక inflammation అనే చర్యకు అనుకూలమైన సైటోకైన్స్ కనిపించాయట. మన శరీరంలోకి హానికారక సూక్ష్మక్రిములు కానీ రోగకారకాలు కానీ ప్రవేశించినప్పుడు... వాటిని ఎదుర్కొనేందుకు జరిగే పోరాటమే inflammation. ఈ సందర్భంగా శరీరాన్ని పోరాటానికి సన్నద్ధంగా ఉంచేందుకు తెల్లరక్తకణాల వంటి కణాల సంఖ్య ఇతోధికంగా పెరిగిపోతుంది. గాయం చుట్టూ మనకి కనిపించే వాపు ఇలా ఏర్పడేదే! అయితే ఈ inflammation ఒకోసారి మన రోగనిరోధక శక్తికి సాయపడితే, మరికొన్ని సందర్భాలలో లేనిపోని ఇబ్బందులను కూడా తెచ్చిపెడుతుంది. అనవసరంగా శ్వాసనాళాలు వాయడం వల్ల ఆస్తమా, కీళ్ల దగ్గర వాపు ఏర్పడటం వల్ల ఆర్థ్రయిటిస్ వంటి సమస్యలు ఏర్పడతాయి.   ఆడపిల్ల కనుక గర్భంలో ఉంటే ఇలా inflammationకు సంబంధించిన లక్షణాలు అధికంగా కనిపిస్తాయన్నమాట. దీని వలన మేలు, కీడు రెండూ అధికంగానే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి గర్భీణీ స్త్రీలకు చికిత్స చేసేటప్పుడు వారి కడుపులో ఉన్న శిశువు ఆడా, మగా అన్న విషయం మీద స్పష్టత ఉంటే... దానికి అనుగుణంగా వారికి చికిత్స చేయవచ్చని సూచిస్తున్నారు పరిశోధకులు. గర్భిణీ స్త్రీలలో ఆస్తమా వంటి సమస్యలు ఏర్పడినప్పుడు, వారి కడుపులో ఉన్న శిశువు లైంగికతను కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అన్నింటికీ మించి... తగిన వ్యాయామం, ఆకుకూరల వంటి పోషకాహారం తినడం, ధ్యానం వంటి పద్ధతుల ద్వారా మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటే ఎలాంటి అవాంతారాలూ లేకుండా పండంటి బిడ్డను కనవచ్చని సూచిస్తున్నారు. - నిర్జర.  

టీ తాగే ముందు మంచినీళ్లు తాగాల్సిందే.. ఎందుకంటే...

  చాలామందికి టీ, కాఫీలు తాగేముందు మంచినీళ్లు తాగడం అలవాటు. ఒకవేళ ఇంటికి వచ్చినవాళ్లకి టీ, కాఫీలు ఇస్తే, వాళ్లు అడిగి మరీ మంచినీళ్లు తీసుకుంటూ ఉంటారు. కానీ ఇలా తాగడం మంచిది కాదన్నది కొంతమంది నమ్మకం. నీళ్లు తాగిన వెంటనే వేడి వేడి టీ తాగడం వల్ల... నాలుక, పళ్లు పాడైపోతాయని వాదన. ఈ మాటలో నిజం ఎంత! - టీ, కాఫీలలో ఎసిడిటీ ఎక్కువగానే ఉంటుంది. ఎసిడిటీని pH valueతో కొలుస్తారు. అందులో టీ, కాఫీ, పాలు అన్నీ pH 5 నుంచి 7 పాయింట్ల మధ్య స్కోర్‌ చేస్తాయి. ఇంత ఎసిడిసీ ఉన్న టీ, కాఫీలను తాగడం వల్ల పళ్లు పాడయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు! ఈ ఎసిడిటీ గొంతు, కడుపులో కూడా లేనిపోని సమస్యలని సృష్టిస్తుంది. అది గ్యాస్, అల్సర్స్‌లాంటి సమస్యలకి దారి తీయవచ్చు. నీళ్లు తాగాక టీ తాగడం వల్ల ఈ ఎసిడిటీ dilute అయిపోయి ఎలాంటి side effects ఉండవు. - మన నోటి దగ్గర నుంచి కడుపు దాకా ఉన్న భాగాలని Aero Digestive System అని పిలుస్తారు. వేడి వేడి టీ ఈ Aero Digestive System లోంచి వెళ్లేటప్పుడు, వీటి మీద ఉన్న సున్నితమైన పొర దెబ్బతినే ప్రమాదం ఉంది. టీకి ముందు మంచినీరు తాగితే ఈ ప్రమాదం ఉండదట. కేవలం టీ అనే కాదు ఏ పదార్థం తీసుకునే ముందైనా గొంతు కాస్త తడుపుకుంటే అది Aero Digestive Systemకి lubrication లాగా పనిచేస్తుంది. - వేడి వేడి టీ ఒకేసారి నాలుక మీద పడటం వల్ల, నాలుక మీద ఉండే సున్నితమైన taste buds దెబ్బతింటాయి. టీ ముందు నీళ్లు తాగడం వల్ల, నాలుకకి అంత వేడి అనిపించదు. - టీ డికాషన్‌ ఒక natural colour లాగా పనిచేస్తుంది. అందుకే కొన్ని hair dyes లో టీ పొడిని కూడా ఉపయోగిస్తారు. అలాంటి టీ నేరుగా పళ్లకి తగలడం వల్ల, క్రమంగా పళ్లు పసుపురంగులోకి మారిపోతాయి. టీ ముందు నీళ్లు తాగడం వల్ల పళ్ల మీద ఒక protective layer ఏర్పడి, అవి రంగు మారకుండా చేస్తాయి. - టీలో కెఫిన్‌, ధియామిన్‌ లాంటి కెమికల్స్ ఉంటాయి. ఇవి లిమిట్‌ దాటితే శరీరానికి నష్టం తప్పదు. టీ తాగేముందు ప్రతిసారీ మంచినీళ్లు తాగడం వల్ల... ఒంట్లోకి చేరిన కెమికల్స్‌ని ఎప్పటికప్పుడు బయటకి పంపే అవకాశం ఉంటుంది. ఇక నోరు dryగా ఉన్నప్పుడు టీ తాగేకంటే, ఓ గుక్కుడు మంచినీళ్లు తాగిన తర్వాత టీ తాగితే... దాని రుచిని పూర్తిగా ఆస్వాదించవచ్చని అంటారు. మనలో చాలామంది టీ అలవాటుని మార్చుకోలేం. కానీ దానికి మరో చిన్న అలవాటుని జోడించడం వల్ల ఎంత ఉపయోగమో చూశారు కదా! - Nirjara  

ఆయిల్ పుల్లింగ్ పనిచేస్తుందా!

  ఇప్పటి తరానికి ఆయిల్ పుల్లింగ్ అంటే తెలుసో లేదో కానీ, ఓ ఇరవైఏళ్ల క్రితం ఇది ఇంటింటిమాటగా ఉండేది. అప్పట్లో ఆయిల్ పుల్లింగ్ ప్రయత్నించని వారు అరుదుగా కనిపించేవారు. ప్రతి ఇంట్లోనూ ఆయిల్ పుల్లింగ్కి సంబంధించిన చిన్నా చితకా పుస్తకాలు కనిపించేవి. ఇంతకీ ఆయిల్ పుల్లింగ్ పనిచేస్తుందా?   మనదే! మనదే! అయిల్ పుల్లింగ్ అనే ప్రక్రియ మూలాలు ఆయుర్వేదంలో కనిపిస్తాయి. నోటిపూత, నోరు పొడిబారిపోవడం వంటి సమస్యలకు నువ్వులనూనెను కొద్ది నిమిషాల పాటు పట్టి ఉంచడమో, పుక్కిలించడమో చేయమని సూచించేవారు. ఆయుర్వేదంలో ఒక తరహా చికిత్సకు మాత్రమే పరిమితమైన ఈ ప్రక్రియను పూర్తిస్థాయి వైద్యంగా తిరిగి 1990వ దశకంలో వెలికితెచ్చారు కొందరు ఔత్సాహికులు.   సర్వరోగనివారిణి? ఆయుర్వేదంలో ఆయిల్ పుల్లింగ్ ప్రక్రియను నువ్వులనూనెతో, అది కూడా కొన్ని సందర్భాలలో మాత్రమే ఉట్టంకించారు. కానీ రక్తపోటు మొదలుకొని కేన్సర్ వరకూ ఎలాంటి రోగమైనా ఆయిల్ పుల్లింగ్తో నయం అయిపోతుందన్న ప్రచారం మొదలైంది. రోజూ ఓ ఇరవైనిమిషాలసేపు ఆయిల్ పుల్లింగ్ చేస్తే మొదటి రోజు ఈ ఫలితం వస్తుంది, రెండో రోజు ఆ ఫలితం వస్తుంది అంటూ గణాంకాలు చెలరేగిపోయాయి. దాదాపు 30 రకాల రోగాలను ఆయిల్ పుల్లింగ్తో చటుక్కున నయం చేయవచ్చన్న మాటలు వినిపించసాగాయి. ఇదే సమయంలో ఇళ్లలో రిఫైన్డ్ ఆయిల్స్ వాడకం ఎక్కువ కావడంతో ఇంటింటా ఆయిల్ పుల్లింగ్ కనిపించేది.   పనిచేస్తుందా!   ఆయిల్ పుల్లింగ్ ప్రచారకుల వాదన ప్రకారం మన నోట్లో నానారకాల బ్యాక్టీరియా నివసిస్తూ ఉంటుంది. ఆయిల్ పుల్లింగ్తో ఈ హానికారక క్రిములు నశించిపోతాయి. అంతేకాదు, కాసేపు అలా పుక్కిలిస్తూ ఉండటంవల్ల శరీరంలోని విషరసాయనాలన్నీ (టాక్సిన్స్) నూనెలోకి వచ్చి చేరతాయి. తద్వారా శరీరంలోని రోగాలన్నీ నిదానంగా తగ్గిపోతాయి.   వాస్తవం ఏమిటి!   మిగతా వైద్య విధానాలతో పోల్చుకుంటే ఆయిల్ పుల్లింగ్ మీద జరిగిన పరిశోధనలు తక్కువ. ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల నోటి ఆరోగ్యం (ఓరల్ హైజీన్) కాస్తో కూస్తో మెరుగుపడుతుందని ఈ పరిశోధనల్లో తేలింది. కొబ్బరినూనె, నువ్వులనూనెలతో పుల్లింగ్ చేసినప్పుడు నోటి దుర్వాసన, పంటి గార, చిగుళ్ల నుంచి రక్తం వంటి సమస్యలు తగ్గినట్లు వెల్లడైంది. అంతేకానీ శరీరంలోని ఇతరత్రా సమస్యల మీద ఇది పెద్దగా ప్రభావం చూపలేదని పరిశోధకులు పెదవి విరిచారు. పైగా ఆయిల్ పుల్లింగ్తో పోలిస్తే మౌత్వాష్తో పుక్కిలించడం, రోజుకి రెండుసార్లు బ్రష్ చేసుకోవడం వంటి చర్యలు మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయని తేల్చారు.   మరేం చేయడం!   శాస్త్రీయంగా ఆయిల్ పుల్లింగ్ ప్రభావానికి సంబంధించి అంతగా ఫలితాలు వెల్లడవనప్పటికీ, ఈ ప్రక్రియ పనిచేస్తుందని నమ్మేవారి సంఖ్య తక్కువేమీ కాదు. ఆయిల్ పుల్లింగ్తో కనీసం నోరన్నా శుభ్రపడుతుంది కాబట్టి ఇది హానికరం అని చెప్పలేం. అలాగని అద్భుతాలు సాధిస్తుందని గుడ్డిగా నమ్మడానికీ లేదు. తీవ్రమైన వ్యాధులు ఉన్నవారు తమ సమస్యలు ఆయిల్ పుల్లింగ్తో తీరిపోతాయనుకుంటే కష్టమే! పైగా ఆయిల్పుల్లింగ్ చేస్తూ ప్రమాదవశాత్తూ దానిని మింగేస్తే వాంతులు, విరేచనాలతో పాటుగా ఊపిరితిత్తుల సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. - నిర్జర.

సిట్రస్ పండ్లతో గుండె జబ్బులకు చెక్

  సిట్రస్ పండ్లను మహిళలు తీసుకోవడం ద్వారా గుండెపోటును దూరం చేసుకోవచ్చునని తాజా అధ్యయనంలో తేలింది. మహిళలు ఆరెంజ్, నిమ్మ వంటి పండ్లను జ్యూస్ రూపంలోనూ లేదా అలాగే తీసుకోవడం ద్వారా గుండెపోటును నివారించవచ్చును. నిమ్మ, ఆరెంజ్, ఉసిరి లాంటి సిట్రస్ పండ్లతో పాటు ఆపిల్, దాక్ష, దానిమ్మ వంటి వాటిని తీసుకోవడం కూడా మహిళల ఆరోగ్యానికి చాలా మంచిది. తాజా కూరగాయలు, డార్క్ చాక్లెట్, రెడ్ వైన్‌లలో ఫ్లావోనోయిడ్స్ ఉండటం ద్వారా హృద్రోగ సమస్యలకు చెక్ పెట్టవచ్చునని తాజా అధ్యయనం ద్వారా వెల్లడైంది.   మహిళలు ముఖ్యంగా విటమిన్ "సి"గల పండ్లు, కూరగాయలను అధికంగా తీసుకోవాలని, దీనివలన సిట్రస్ పండ్లలోని ఫ్లావోనోయిడ్స్ గుండెకు సంబంధించిన రక్తపు నాళాల పనితీరును మెరుగుపరుస్తాయని, తద్వారా గుండెపోటు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చునని అధ్యయనం ద్వారా వెల్లడైంది.  

అలా చేస్తే పిల్లల్లో ఆస్తమా రాదట

ఆస్తమా గురించి ఎంత చెప్పుకుంటే అంత భయం కలగక మానదు. వినడానికి చాలా చిన్న జబ్బులాగానే తోచినా, దీనిని అనుభవించేవారికి తెలుస్తుంది, అదెంత నరకమో! ఒకప్పుడంటే ఏదో జన్యవుల కారణంలో నూటికో కోటికో ఈ జబ్బు కనిపించేది. కానీ పెరిగిపోతున్న కాలుష్యం పుణ్యమా అని ఇప్పుడు లక్షలాది మంది ఉబ్బసం బారిన పడుతున్నారు.   నరకం - ప్రాణాంతకం శ్వాసనాళాలు ఒక్కసారిగా కుంచించుకుపోయి ఊపిరి తీసుకోవడమే కష్టమయ్యే ఈ ఉబ్బసాన్ని తట్టుకోవడం పెద్దలకే సాధ్యం కాదు. అలాంటిది ఐదేళ్లలోపు పిల్లలకి కనుక ఈ వ్యాధి సోకితే ఇక చెప్పేదేముంది! పిల్లల్లో ఏర్పడే ఈ ఉబ్బసం ఒకోసారి వారి ప్రాణాలను కూడా హరించి వేస్తుంటుంది. కానీ ఓ జాగ్రత్తను కనుక తీసుకుంటే కనుక, పుట్టబోయే పిల్లలలో ఆస్తమా వచ్చే అవకాశాలు చాలావరకు తగ్గిపోతాయని తేలింది.   ఒమేగా 3 ఆస్తమాకీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌కీ మధ్య ఏదో సంబంధం ఉందన్న అనుమానం ఈనాటిది కాదు. ఈ విషయాన్ని తేల్చుకునేందుకు కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు ఓ ప్రయోగాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా డెన్మార్కుకి చెందిన 695 మంది గర్భవతులను గమనించారు. వీరు గర్భం దాల్చిన ఆరో నెల నుంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌లోని EPA, DHA అనే ముఖ్య రసాయనాలను అందించారు. శరీరంలోని రోగనిరోధకశక్తిని అభివృద్ధి చేయడంలో ఈ రెండు రసాయనాలూ అద్భుతంగా పనిచేస్తాయని అంటారు. సాధారణంగా ఈ పోషకాలు చేపలలో ఎక్కువగా కనిపిస్తాయి.   సగానికి సగం గర్భవతులుగా ఉన్నప్పుడు ఇలా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ను తీసుకున్నవారి పిల్లలను ఐదేళ్లు వచ్చేవరకూ కూడా నిశితంగా పరిశీలించారు. ఆశ్చర్యంగా ఈ పిల్లల్లో ఆస్తమా ప్రబలే ఆవకాశాలు దాదాపుగా యాభైశాతం తగ్గిపోయినట్లు తేలింది. దీంతో గర్భవతులుగా ఉన్నప్పుడు శరీరంలో EPA,DHAల స్థాయిని గమనించుకుని... తదనుగుణంగా అవసరమైన సప్లిమెంట్స్‌ని తీసుకుంటే కనుక ఆస్తమా లేని ఆరోగ్యవంతులైన పిల్లలు పుడతారని ఆశిస్తున్నారు. ఈ సాంకేతికత మనవరకూ రావడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి అంతవరకూ EPA, DHAలను అందించే చేపలని కానీ అవసె గింజలని కానీ తీసుకుంటే తప్పకుండా మేలు జరుగుతుంది.     - నిర్జర.

Sunscreen a Boon or Bane?

Firstly how well do we know our sunscreen? Well sunscreen is a lotion or gel that protects us from the harmful ultraviolet radiation, i.e., UVA and UVB rays. It is advisable to apply sunscreen at least 30minutes before exposing our skin to harsh sun radiation. And a reapplication is needed once we sweat out or after we wash or come in contact with water. Sunscreens are graded by SPF - Sun Protection Factor, so if your sunscreen reads SPF 20, then 1/20 of the solar radiation reaches our skin.   Pros of Sunscreen: The obvious benefits are protection from sunburns and sun sensitivity in fair skinned individuals. Recent researches have validated it use in delaying premature ageing such as, wrinkles and sagging of skin. Also reduces the risk of acquiring skin cancers like melanoma and squamous cell carcinoma   Cons of Sunscreen: The ingredients of sunscreen may trigger some kind of allergic reaction in some people. It may worsen acne and may also present are pus follicles as sun-block tend to block the skin pores. May also predispose us to breast cancers. Minimal degrees of Vitamin Deficiency had been reported. Lately, there has been lot of fuss over the use of high SPF sunblock. It is wise to use sunscreens suitable to the skin type, and SPF of 30 - 40 is the best range, because none of the sunscreens can provide 100% protection from the solar radiation, so it is best to re-apply often than use of high SPF. Take Care!! Stay uncovers or under sunscreen!!  - Koya Satyasri

నడుంనొప్పితో డిప్రెషన్ తప్పదా!

  నడుంనొప్పి- పిలవని అతిథిలాగా పలకరించే సమస్య! ఎందుక వచ్చిందో తెలుసుకునేలోపే నిలబడనీయనంత బాధని మిగులుస్తుంది. ఇక వచ్చిన తరువాత ఎలా వదిలించుకోవాలో తెలియక తలలు బాదుకోవాల్సి వస్తుంది. శరీరంలో ఏదో ఒక బాధ ఉన్నప్పుడు మనసు కూడా చికాకుగా ఉండటం సహజమే! కానీ డిప్రెషన్, చిత్తభ్రాంతిలాంటి తీవ్రమైన మానసిక సమస్యలకీ శారీరిక సమస్యలకీ మధ్య సంబంధాన్ని ఊహించడం కష్టం. నడుము నొప్పి ఉన్నవారిలో ఇలాంటి అదనపు సమస్యలు కూడా ఏర్పడతాయని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.   పేదదేశాలలోనే ఎక్కువ: ఒక దేశం ధనిక దేశమా, పేద దేశమా అన్న అంశం మీద అక్కడి ప్రజలలో నడుము నొప్పి ఆధారపడి ఉంటుందంటే ఆశ్చర్యం కలుగక మానదు. కానీ ఇది నిజం! దనిక దేశాలతో పోల్చుకుంటే పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలలో నడుం నొప్పితో బాధపడేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉన్న విషయాన్ని ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ ఏనాదో ధృవీకరించింది. వెనుకబడిన దేశాలలో సగటున మూడోవంతు మంది జనం నడుము నొప్పితో బాధపడుతున్నట్లు తేల్చింది. వ్యవసాయం, భవన నిర్మాణం వంటి పనులలో పాల్గొనేవారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఇందుకు ముఖ్య కారణం అయితే... నడుము నొప్పి వచ్చినా కూడా దానికి చికిత్స తీసుకునే ఆర్థిక స్తోమత లేక, బతుకుబండిని భారంగా లాగడం మరో కారణం. అందుకే బంగ్లాదేశ్, బ్రెజిల్ వంటి పేద దేశాలలో 50 శాతానికి పైగా జనం నడుము నొప్పితో బాధపడుతున్నట్లు సదరు గణాంకాలతో వెల్లడయ్యింది.   మానసిక సమస్యలు అదనం: ఇవే గణాంకాలను ఆధారం చేసుకుని లండన్కు చెందిన కొందరు పరిశోధకులు మరో విషయాన్ని కనుగొనే ప్రయత్నం చేశారు. ఇతరులతో పోలిస్తే నడుము నొప్పి ఉన్నవారిలో ఏవన్నా మానసిక సమస్యలు కూడా ఉన్నాయేమో అని పరిశీలించారు. నిజంగానే వారిలో ఉద్వేగం (anxiety), క్రుంగుబాటు (depression), భ్రాంతి (psychosis), ఒత్తిడి (stress), నిద్రలేమి (sleep deprivation) అనే అయిదు రకాల మానసిక సమస్యలలో ఏదో ఒకటి ఉన్నట్లు తేల్చారు. ఇతరులతో పోలిస్తే నడుము నొప్పి ఉన్నవారిలో ఈ లక్షణాలు రెండు రెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. వీరిలో డిప్రెషన్ ఏర్పడే ప్రమాదం అయితే ఏకంగా మూడు రెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది.   కారణం తేలలేదు కానీ... నడుము నొప్పికీ మానసిక సమస్యలకీ మధ్య కార్యకారణ సంబంధం ఏమిటో పరిశోధకులు చెప్పలేకపోతున్నారు. అయితే ఈ గణాంకాలన్నీ కూడా పేద, అభివృద్ధి చెందుతున్న దేశప్రజలకు సంబంధించినవి కాబట్టి... వారి అర్థిక స్థితి కారణంగానే అటు నడుము నొప్పీ, ఇటు మానసిక సమస్యలు కూడా జంటగా కనిపిస్తున్నాయని కొందరి విశ్లేషణ. అందుకే నడుము నొప్పి రాగానే అదేదో సాధారణమైన సమస్యగా భావించి అశ్రద్ధ చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని హెచ్చరిస్తున్నారు. తగినంత నిద్ర, అవసరమైనంత వ్యాయామం, వ్యసనాలకు దూరంగా ఉండటం, శరీర భంగిమను మార్చుకోవడం, వైద్యులని సంప్రదించడం... వంటి చిన్నపాటి చర్యలతో నడుమునొప్పిని అదుపులో ఉంచుకోవచ్చునని సూచిస్తున్నారు.  -నిర్జర.

అవసరం లేకపోయినా ICU

  ఒకప్పుడు ICU అన్న పేరు పెద్దగా వినిపించేది కాదు. కానీ ఆసుపత్రులు పెరిగిపోవడం, వైద్యం పట్ల ప్రజల్లో అవగాహన ఒక స్థాయిని దాటిపోవడంతో... ఇప్పుడు ప్రతివారూ ICU గురించే మాట్లాడుతున్నారు. రోగి పరిస్థితి కాస్తంత విషమంగా కనిపించగానే ICUనే శరణ్యం అనుకుంటున్నారు. కానీ ఇదేమంత మంచి పద్ధతి కాదని సూచిస్తున్నారు కొందరు పరిశోధకులు.   ఒక రోగి పరిస్థితి చేయి దాటిపోతుంది అనుకున్నప్పుడు అతనికి కృత్రిమ శ్వాసని అందించే వెంటిలేటర్లు, రక్తపోటుని పరీక్షించే మానిటర్లు, గుండె ఆగిపోకుండా చూసే ఎక్స్‌టర్నల్ పేస్‌మేకర్ల వంటి పరికరాలన్నీ అందుబాటులో ఉండే ICUలో అతడిని ఉంచుతారు. ఇన్ని అధునాతన పరికరాలకు తోడుగా నిరంతరం వైద్యుల పర్యవేక్షణ కూడా ఉండాలి కాబట్టి ICU ఖర్చులు భారీగానే ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి, ఆసుపత్రిని బట్టి ఐదువేల రూపాయల నుంచి 50 వేల రూపాయల వరకూ ఈ ఖర్చులుంటాయి.   అయితే నిజంగా ICUలో చేరేవారందరినీ, అవసరం మేరకే అందులో చేరుస్తున్నారా అనే ఆలోచన వచ్చింది అమెరికాకు చెందిన కొందరు పరిశోధకులకు. దాంతో వారు 2015-16 సంవత్సరాల మధ్య ICUలో చేరిన 808 మంది రోగుల రికార్డులను పరిశీలించారు. ఈ పరిశీలన తరువాత తేలిన అంశాలు ఏమిటంటే...   - వీరిలో 23.4 శాతం రోగులని నిరంతరం పరిశీలించే అవసరం ఉంది కానీ, మరీ ICUలో ఉంచి గమనించుకోవాల్సినంత తీవ్రత లేదు.   - 20.9 శాతం మంది మొండి రోగాలతో బాధపడుతూ ఉండటం వల్ల, వారిని ఎంతకాలం ICUలో ఉంచినా కూడా ఉపయోగం లేదు. వారిని ICUలో ఉంచినా, విడిగా ఉంచినా ఒకటే!   - 8 శాతం మంది రోగులు తమ జీవితపు ఆఖరి క్షణాలలో ఉన్నారని తేలింది. వీరిని కూడా ICUలో ఉంచడం వల్ల ఎలాంటి అదనపు ప్రయోజనమూ లేదు.   మొత్తం మీద ఇలా దాదాపు 50 శాతం మందిని అవసరం లేకపోయినా కూడా ICUలలో ఉంచుతున్నారని తేల్చారు పరిశోధకులు. దీని వలన రోగుల తాలూకు విలువైన డబ్బులు వృధా అవుతున్నాయనీ, ఆసుపత్రి తాలూకు విలువైన పరికరాలనీ అవసరం లేని చోట వినియోగించాల్సి వస్తోందనీ వాపోయారు. ఒకవేళ రోగులను ICUలలో ఉంచాల్సి వచ్చినా కూడా 65 శాతం రోజులు అదనంగా ఉంటున్నారని లెక్కకట్టారు.   ఇంతకీ పరిశోధకులు తేల్చిందేమిటంటే... ICU (ఇంటెన్సివ్‌ కేర్‌) అనే స్థితి రోగికి ఉపయోగమా లేదా అన్నది వైద్యులు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ICU వెలుపలే చిన్నాచితకా మానిటరింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకుని రోగిని గమనించుకునే సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లోనే రోగిని ICUలో ఉంచాలి. లేకపోతే అటు రోగికీ ఇటు ఆసుపత్రికీ కూడా ICUలు భారంగా మారిపోయే ప్రమాదం ఉంది. మరి వాణిజ్య విలువల ఆధారంగా నడుస్తున్న కొన్ని ఆసుపత్రులు ఈ జాగ్రత్తను ఎంతమేరకు పాటిస్తాయి అంటే జవాబు చెప్పడం కష్టమే!                                          - నిర్జర.

తెలుగువారి దివ్యౌషధం నేలవేము..

సారాసారము లెఱుగని బేరజులకు బుద్ధిజెప్పబెద్దలవశమా? నీరెంత పోసి పెంచినగూరగునా నేలవేము?గువ్వలచెన్నా! అని గువ్వలచెన్న శతకంలో ఓ పద్యం ఉంది. ఎంత నీరు పోసినా పెంచినా కూడా నేలవేములో చేదు తగ్గడం ఎలా అసాధ్యమో.... మంచీచెడూ విచక్షణ ఎరుగని ధూర్తులకు బుద్ధి చెప్పాలనుకోవడం అంతే నిరుపయోగం అని ఈ పద్యంలోని అర్థం. దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితం రాసిన ఈ పద్యంలో నేలవేము అనే మొక్క గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. ఇంతకీ ఏమిటా నేలవేము అని తరచిచూస్తే కళ్లు చెదిరే వాస్తవాలు ఎన్నో వినిపిస్తాయి.   కటిక నేల మీదైనా : నేలవేము ఆసియాకే ప్రత్యేకమైన ఓ చిన్న మొక్క. మొదట్లో ఇది దక్షిణభారతంలోనే కనిపించేదట. దీని ఔషధగుణాలు తెలిసిన తరువాత ప్రపంచమంతటా దీనిని పెంచడం మొదలుపెట్టారు. ఎలాంటి నేలలో అయినా, ఎలాంటి కాలంలో అయినా పెరిగే సత్తా ఉండటంతో దీని పెంచేందుకు ఏమంత శ్రద్ధ వహించాల్సిన పనిలేదు. పైగా వేయి అడుగుల ఎత్తైన పర్వతాల మీద కూడా నేలవేము సులభంగా ఎదిగేస్తుందని తేలింది.     కటిక చేదు వేము అంటే వేప. నేల మీద పెరిగే చిన్నపాటి మొక్కలలో వేపతో సమానమైన చేదు కలిగి ఉంటుంది కాబట్టి, ఈ మొక్కకి నేలవేము అన్న పేరు వచ్చింది. దీనికి ఉన్న విపరీతమైన చేదుగుణం వల్ల సంస్కృతంలో దీనిని మహాతిక్త అని కూడా పిలుస్తారు. ఆయుర్వేదంలో కాల్మేఘ్ పేరుతో దీనిని విస్తృతంగా వాడతారు. తిక్తక కషాయం, తిక్తఘృతం వంటి మందులెన్నింటినో నేలవేముతో తయారుచేస్తారు.   దేశాన్నే కాపాడిందా! నేలవేములో ఉండే కటిక చేదే మన ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తుందంటారు వైద్యులు. ఈ విషయాన్ని ఎరిగినవారు కనుకే భారతీయులు వందల ఏళ్లుగా దీనిని గృహవైద్యంలో భాగంగా వాడుతూ వచ్చారు. దీని ఆకులు, వేళ్లని ఎండబెట్టుకుని చూర్ణం చేసుకుని ప్రతి ఇంట్లోనూ ఉంచుకునేవారు. జలుబు చేసినా, జ్వరం వచ్చినా కూడా దీనినే వాడేవారు. అంతదాకా ఎందుకు! 1918 ప్రాంతంలో వచ్చిన ఫ్లూ జ్వరాలు ప్రపంచాన్నంతా చుట్టుముట్టాయి. మన దేశంలో కూడా కోటిమందికి పైగా ఈ జ్వరం బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కానీ ఆ సమయంలో గ్రామగ్రామానా కాల్మేఘ్ ఔషధాన్ని వాడటం వల్ల ఫ్లూ ఉపద్రవం ఉపశమించిందంటారు.     సర్వవ్యాధినివారిణి : - నేలవేము యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేయడం వల్ల క్షయ, నిమోనియా వంటి వ్యాధులలో ఉపశమనాన్నిస్తుంది. - ఇందులోని యాంటీ ఫంగల్ గుణాల వల్ల చర్వవ్యాధులలో అద్భుతంగా పనిచేస్తుంది. - యాంటీ వైరల్ లక్షణాల కారణంగా హెర్పిస్ అనే మొండి సుఖవ్యాధి మీద సైతం ప్రభావాన్ని చూపుతుంది. - జలుబు వంటి కఫ సంబంధ వ్యాధులలో నేలవేము అద్భుతంగా పనిచేస్తుందని పరిశోధనలలో కూడా రుజువైంది. - నేలవేము చూర్ణం, కాలేయం పనితీరుని మెరుగుపరిచి కామెర్లని అదుపులో ఉంచుతుందట. - మలేరియా, చికెన్గున్యా వంటి మొండి జ్వరాలలో సైతం నేలవేము ప్రభావం చూపుతుందని సంప్రదాయ వైద్యులు చెబుతున్నారు. - గుండె ధమనులు గట్టిపడిపోయే atherosclerosis అనే స్థితిలో నేలవేముని వాడితే ఫలితం దక్కవచ్చు. - జీర్ణ సంబంధమైన చాలా వ్యాధులలో నేలవేము అద్భుతాలు చేస్తుందన్నది వైద్యుల మాట. - నేలవేము పెరిగే చోట పాములు, దోమల వంటి విషజీవులు దరిచేరవని అంటారు.   ఇవీ నేలవేముకి సంబంధించిన కొన్ని ఉపయోగాలు. ఇక నేలవేములో ఉండే విపరీతమైన చేదు వల్ల మధుమేహంలో ఇది దివ్యౌషధంగా పనిచేస్తుందనడంలో ఎవరికీ ఎలాంటి సందేహమూ లేదు. అయితే గర్భిణీ స్త్రీలు నేలవేముని వాడటం వల్ల శిశువుకి ప్రమాదం జరిగే అవకాశం ఉందా లేదా అన్న విషయమై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. నేలవేముని వాడటం వల్ల ఎయిడ్స్, క్యాన్సర్ వంటి రోగాలు సైతం అదుపులో ఉంటాయని చెబుతున్నారు కానీ... ఈ నమ్మకంలోని నిజానిజాలు ఇంకా రుజువు కాలేదు.     ఇదీ నేలవేముని గురించి ఓ స్థూల పరిచయం. నేలవేముని వాడటం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారిపోతారని కాదు. కానీ ఇలాంటి ఔషధి ఒకటి ఉండేదని తెలుసుకోవడం వల్ల మన సంప్రదాయ వైద్య విజ్ఞానం మరీ తీసిపారేసేదేమీ కాదని తేలుతుంది. ఆసక్తి ఉంటే మనం కూడా వాటిలో కొన్ని ఆచరణాత్మక పద్ధతులను పాటించే అవకాశం ఉంది. అలా సులువుగా, సమర్ధవంతంగా వాడుకోగల ఔషధులలో నేలవేము ఒకటి. - నిర్జర.

ఆరోగ్యానికి రేడు నేరేడు

                ఆయుర్వేదం ప్రకారం మన ఆహారమే గొప్ప ఔషధం. ఆ ఆహారంలోనే మన శరీరానికి అవసరమైన పదార్థాలను చేర్చుకోవడం ఆరోగ్యకరమైన జీవనానికి మార్గం. అందుకే ఏ కాలంలో దొరికే పండ్లనైనా విస్మరించకుండా తినమని సూచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకో రుతువులో దొరికే పండుకీ ఒకో ప్రాధాన్యత ఉంటుంది. రుతువు మారితే ఆ పండు చేజారిపోవచ్చు. అలా వర్షరుతువులో ధారాళంగా లభించే ఫలం నేరేడు.   - నేరేడుకి రకరకాల పేర్లే ఉన్నాయి. అసలు ఆ పేర్లలో ఒకటైన ‘జంబూ’ అన్నదాని మీదుగానే మన ప్రాంతానికి ‘జంబూద్వీపం’ అన్న పేరు వచ్చిందంటారు. ఎందుకంటే ఒకప్పుడు నేరేడు కేవలం దక్షిణాసియాకు మాత్రమే పరిమితమైన వృక్షం. ఆ తరువాత కాలంలో మన దేశం నుంచి నేరేడు విత్తనాలను ఐరోపాలకు తీసుకువెళ్లారు. ఇక అమెరికావాసులకైతే 19వ శతాబ్దం వరకూ ఈ చెట్టు పరిచయమే లేదు.   - నేరేడు ఫలాలను, దళాలను పూజలో వాడటం తెలిసిందే! అయితే ఔషధరీత్యా కూడా నేరేడు ప్రాశస్త్యం నానాటికీ పెరిగిపోతోంది. ఈపాటికే నేరేడుని హోమియోపతి, ఆయుర్వేదంలో విస్తృతంగా వాడుతూ వస్తున్నారు. కానీ ఇప్పుడు నేరేడు డయాబెటీస్‌, రక్తపోటు వంటి సమస్యలలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని తెలియడంతో సాధారణ ప్రజలు కూడా వీటిని ఇష్టపడుతున్నారు.   - చాలామంది కేవలం నేరేడు పండ్లు తింటే మధుమేహం తగ్గిపోతుందని భావిస్తారు. నేరేడు పండుకంటే కూడా అందులోని గింజలను ఎండపెట్టుకుని చేసుకునే పొడితో, మధుమేహం నుంచి మరింత ఉపశమనం లభిస్తుంది. శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచి, చక్కెర నిల్వలని అదుపు చేసే సామర్థ్యం ఈ నేరేడు గింజలకు ఉందని సంప్రదాయ వైద్యుల నమ్మకం. ‘సైజీజియం’ అనే శాస్త్రీయ నామంతో కూడిన నేరేడు మందును హోమియోపతిలో మధుమేహాన్ని నివారించేందుకు తప్పక వాడతారు. ఈ మందుని తరచూ తీసుకుంటే చక్కెర నిల్వలు అదుపులోకి రావడమే కాకుండా, మూత్రంలో సైతం చక్కెర కనిపించకుండా పోతుందని భావిస్తారు.   - మిగతా పండ్లలోకంటే నేరేడులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయంటున్నారు శాస్త్రవేత్తలు. Delphinidin, cyanidin, malvidin... వంటి బోలెడు యాంటీఆక్సిడెంట్లు నేరేడులో ఉన్నాయని చెబుతున్నారు. దీనివల్ల గుండె ఆరోగ్యం, మెదడు పనితీరు మెరుగుపడతాయట. పైగా క్యాన్సర్ వంటి జటిలమైన అనారోగ్యాలను సైతం ఎదుర్కొనే సత్తా ఈ యాంటీ ఆక్సిడెంట్లకు ఉందని పరిశోధనలు రుజువుచేస్తున్నాయి.   - నేరేడులో ఉండే పోషకాలు అసాధారణం! ముఖ్యంగా విటమిన్‌ సి, ఐరన్‌లు ఈ పండులో పుష్కలంగా లభిస్తాయి. మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకూ ఈ రెండూ కూడా దోహదపడతాయి. మరీ ముఖ్యంగా వర్షరుతువుతో పాటుగా వచ్చే దగ్గు, జలుబు, జ్వరాల బారిన పడకుండా కాచుకుంటాయి.   - జీర్ణవ్యవస్థను సరిదిద్దేందుకు నేరేడు అమోఘంగా పనిచేస్తుందంటారు పెద్దలు. విరేచనాలతో బాధపడేవారికీ, కాలేయం పనితీరుని మెరుగుపరచడానికీ నేరేడు దోహదపడుతుంది.   చెప్పుకొంటూ పోతే నేరేడు సుగుణాలకి లెక్కే లేదు. అందుకేనేమో శ్రీరాముడు సైతం, వనవాసంలో ఉన్నప్పుడు ఈ నేరేడు పండ్లను సేవించాడని ఇతిహాసాలు పేర్కొంటున్నాయి. మరి మనమో!   - నిర్జర.

సరైన పాదరక్షలు లేకపోతే... జీవితం అంతే!

  మనం బట్టల ఎన్నుకోవడంలో చూపే శ్రద్ధ పాదరక్షల మీద ఉంచము. ఒకవేళ చెప్పులో, షూలో కొనుక్కోవడానికి వెళ్లినా... అవి చూడటానికి బాగున్నాయా, ఎక్కువకాలం మన్నుతాయా, తక్కువ ధరకి వస్తున్నాయా అని ఆలోచిస్తామే కానీ నడవడానికి సౌకర్యంగా ఉన్నాయా లేదా అని పట్టించుకోం. ఇలాంటి అశ్రద్ధే మన కొంప ముంచుతుందని చెబుతున్నారు నిపుణులు...   వయసు పెరిగేకొద్దీ జాగ్రత్త! కుర్రతనంలో ఎలాంటి చెప్పులు ధరించినా చెల్లిపోతుంది. కానీ వయసు మళ్లేకొద్దీ అలా కాదు! పాదం ఆకృతి మారిపోతుంది. వాటి ఒడ్డూపొడవులో మార్పులు వస్తాయి. నొప్పిని తట్టుకునే శక్తిలో తేడా ఏర్పడుతుంది. పాదం అడుగుభాగంలో ఉండే కొవ్వు, కండరాలలో కూడా పరివర్తన ఉంటుంది. కొన్ని సందర్భాలలో అయితే రెండు పాదాలకీ వేర్వేరు సైజ్ ఉన్న చెప్పులు ధరించాల్సినంతగా మార్పులు జరుగుతాయి. వీటికి తోడు ఊబకాయం, డయాబెటిస్, కీళ్లనొప్పులు వంటి సమస్యలు కూడా మనం నడిచే తీరు మీదా, పాదాల ఆరోగ్యం మీదా ప్రభావం చూపుతాయి.   ఇంత జరుగుతున్నా... పాదరక్షల గురించి మరింత శ్రద్ధ వహించాల్సిన వయసులో కూడా మనం చాలా అశ్రద్ధగా వ్యవహరిస్తాం అంటున్నారు నిపుణులు. దీనికోసం లోపెజ్  (Lopez) అనే పరిశోధకుడు ఓ రెండు సర్వేలను నిర్వహించాడు. మొదటి సర్వేలో 80 ఏళ్లు పైబడినవారు పాదరక్షల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో గమనించారు. దాదాపు 83 శాతం మంది, తమ పాదాలకంటే పెద్దవో చిన్నవో (different size) పాదరక్షలు ధరిస్తున్నట్లు తేలింది.   లోపెజ్ నిర్వహించిన రెండో సర్వేలోనూ దారుణమైన వాస్తవాలే వెలుగుచూశాయి. తగిన పాదరక్షలు ధరించనివారు తమకి తెలియకుండా చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తేలింది. పాదాలలో విపరీతమైన నొప్పి, ఇన్ఫెక్షన్లు, ఎక్కువ దూరం నడవలేకపోవడం, నడిచేటప్పుడు ఆయాసం వంటి సమస్యల దగ్గర నుంచి అదుపుతప్పి పడిపోవడం వరకూ... జీవితాన్ని తలకిందులు చేసే ఎన్నో సమస్యలు అపసవ్యమైన పాదరక్షలతో ముడిపడి ఉన్నాయని గ్రహించారు. దీని వల్ల ఏకంగా వారి జీవితమే ప్రభావితం అవుతోందని తేల్చారు.   జాగ్రత్తపడాల్సిందే! సరైన పాదరక్షలు ధరించకపోవడం వల్ల ఇన్నేసి అనర్థాలు ఉన్నాయని తెలిశాక ఇక జాగ్రత్తపడకపోతే ఎలా! అందుకనే ఏవన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, పాదరక్షల గురించి ఓసారి తమ వైద్యునితో మాట్లాడితీరాలి. పాదానికి మెత్తగా ఉండేలా, నడిచేటప్పుడు పట్టుని ఇచ్చేలా, కీళ్ల మీద ఒత్తిడిని కలిగించకుండా ఉండే పాదరక్షలను ఎన్నుకోమని చెబుతున్నారు. అలాగే పాదం ఆకారానికి తగినట్లుగా సర్దుబాటు చేసుకునే స్ట్రాప్స్ ఉండే పాదరక్షలని ధరించమని సూచిస్తున్నారు. - నిర్జర.  

వెన్నునొప్పికి మాత్రలు పనిచేయవు!

  నొప్పి లేకుండా బతుకు బండి ముందుకు నడవదు. ఆ నొప్పిని పంటిబిగువున భరిస్తూ ఏదో ఒక మాత్ర వేసుకుంటూ ముందుకు సాగాల్సిందే. కానీ అన్నివేళలలా నొప్పి మాత్రలు పనిచేయవు సరికదా... వాటి వల్ల లేనిపోని సమస్యలు కూడా తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. అందుకు వెన్నునొప్పిని మినహాయింపుగా చూపిస్తున్నారు. వెన్నెలో ఉండే డిస్క్ అరిగిపోవడం దగ్గర నుంచీ కండరం వాపు వరకు వెన్నునొప్పికి కారణం ఏదైనా కావచ్చు. ఇలా నొప్పి చేసినప్పుడు ఆస్పిరిన్‌, బ్రూఫిన్ వంటి నొప్పి మందులు వాడుతూ ఉంటాము. ఈ తరహా మందులను Nonsteroidal anti-inflammatory drugs (NSAID) అంటారు. ఇవి వాపుతో పాటుగా నొప్పిని కూడా తగ్గిస్తాయన్నమాట. ఆస్ట్రేలియాకు చెందిన కొందరు పరిశోధకులు వెన్నునొప్పిలో NSAID ఫలితం ఏమేరకు ఉంటుందో గమనించే ప్రయత్నం చేశారు. ఇందుకోసం వాళ్లు 6000 మంది రోగులని పరిశీలించారు. ప్రతి ఆరుగురు రోగులలో ఒక్కరికి మాత్రమే నొప్పి మాత్రలు పనిచేస్తున్నట్లు తేలింది. మిగతావారిలో ఈ మాత్రలు ప్రభావం చూపకపోగా జీర్ణసంబంధమైన సమస్యలు మొదలవడాన్ని గమనించారు. అల్సర్లు ఏర్పడటం, పేగులలో రక్తస్రావం జరగడం లాంటి తీవ్రమైన ఇబ్బందులు తలెత్తాయట. ఇక నొప్పి మాత్రలతో లివర్, కిడ్నీ వంటి అవయవాలు దెబ్బతినే అవకాశం ఎలాగూ ఉంది. ఇకమీదట వెన్నునొప్పి వచ్చినప్పుడు నొప్పి మాత్రల మీద ఆశలు పెట్టుకోవద్దని సూచిస్తున్నారు. దీనికి బదులుగా కాపడం పెట్టుకోవడం, విశ్రాంతి తీసుకోవడం, చిన్నపాటి వ్యాయామాలు చేయడం, ఫిజియోథెరపీ చేయించుకోవడం వంటి చికిత్సలను అనుసరించి చూడమంటున్నారు.   - నిర్జర.

కొవ్వు కరగడానికి చిన్న చిట్కా

ఒళ్లు తగ్గాలనీ, ఒంట్లోని కొవ్వు కరగాలని ఎవరికి మాత్రం ఆశగా ఉండదు. చేసే పనికంటే తీసుకునే ఆహారం ఎక్కువగా ఉన్న ఈ రోజులలో ఊబకాయం మన జోలికి రాకూడదని ఎవరికి మాత్రం తోచదు. ఓ పరిశోధనా ఫలితాలు అలాంటివారికి శుభవార్తలా తోచడం ఖాయం.   ఆహారమే ధ్యాస సాధారణంగా మనం ఆహారం తీసుకునే సమయం ఉదయం లేచిన దగ్గర్నుంచీ రాత్రి పడుకునేలోపు ఎప్పుడైనా ఉండవచ్చు. అంటే సుమారుగా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ఎప్పుడైనా ఆహారం తీసుకుంటూ ఉంటాం. దీనికి విరుద్ధంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటలలోపు ఆహారం తీసుకుంటే ఏమన్నా ఉపయోగం ఉందా లేదా అన్న విషయాన్ని పరిశీలించే ప్రయత్నం చేశారు అలబామా యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు. ఇలా ఆహారాన్ని కాస్త ముందుగానే తీసుకునే విధానాన్ని early time-restricted feeding (eTRF) అంటారు.   అన్నీ సర్దుకున్నాయి eTRF వల్ల ఉపయోగం ఉందో లేదో తెలుసుకునేందుకు పరిశోధకులు, ఊబకాయంతో బాధపడుతున్న ఓ 11 మందిని ఎన్నుకున్నారు. వీరికి ఓ నాలుగు రోజులపాటు ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది లోపు ఆహారాన్ని అందించారు. మరో నాలుగురోజులు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండుగంటల లోపే ఆహారాన్ని తీసుకునేట్లు నిర్దేశించారు. ఈ రెండు సందర్భాలలోనూ ఒకే మోతాదు ఆహారాన్ని తీసుకున్నా కూడా, అది వారి శరీరం మీద చూపే ప్రభావంలో స్పష్టమైన మార్పులు ఉన్నట్లు గమనించారు. మధ్యాహ్నం రెండింటి లోపే ఆహారాన్ని తీసుకున్నవారిలో జీవక్రియలు చాలా చురుగ్గా ఉండటాన్ని గమనించారు. వీరిలో కొవ్వు కూడా చాలా వేగంగా కరుగుతున్నాయని తేలింది.   ఇదీ కారణం ప్రతి మనషిలోనూ ఒక జీవగడియారం పనిచేస్తుందనీ, అది ప్రకృతికి అనుగుణంగా నడుస్తుందనీ తెలిసిన విషయమే! ఈ జీవగడియారం ప్రకారం ఉదయం వేళల్లో మనలో అనేక జీవక్రియలు (metabolism) జరుగుతుంటాయి. అదే సమయంలో మన శరీరానికి ఆహారం అందటం వల్ల దానిని వీలైనంత సమర్థంగా జీర్ణం చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఎలుకల మీద ఇది వరకే చేసిన ప్రయోగాలలో కూడా eTRf వల్ల వాటిలో కొవ్వు వేగంగా కరగడమే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా దరిచేరలేదని వెల్లడయ్యింది.   eTRF తరహా ఆహార పద్ధతికి సంబంధించి ఇవి ప్రాథమిక పరిశోధనలు మాత్రమే. ఎలాంటివారు ఎంతకాలం ఈ పద్ధతిని ఆచరించవచ్చు అన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు. కాకపోతే భారతీయ వైద్య విధానంలో మాత్రం ఈ తరహా ప్రయోగాలు కొత్తేమీ కాదు. ఎందుకంటే ప్రకృతి వైద్యచికిత్స ప్రకారం ఉపవాసం మొదలుపెట్టిన రోజు నుంచి మర్నాడు ఉదయం వరకు కూడా ఏమీ తీసుకోకపోవడమే సత్ఫలితాన్నిచ్చే ఉపవాసం. ఇలాంటి ఉపవాసాల వల్ల ఎంత ప్రయోజనం ఏర్పడుతుందో eTRF పరిశోధనతో మరోసారి రుజువైపోయింది.             - నిర్జర.